top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 17


'The Trap Episode 17' New Telugu Web Series

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

సితారను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతాడు రాము.

ఆమెకంటే కమలను చేసుకోవడమే బెటరని చెబుతాడు.

ఇక ది ట్రాప్. . 17 వ భాగం చదవండి…


ఆరోజు ప్రభావతి పుట్టిన రోజు. ఊరినుంచి వేదమూర్తి ప్రోద్బలంతో పరమేశ్వర్ కమలం బయల్దేరారు వదినెతో కలసి పుట్టిన రోజు గడపడానికి. తిరుగు ప్రయాణానికి సిధ్ధమవుతూన్న వినోదినిని కామాక్షి వేద మూర్తి యిద్దరూ ఆపారు; పనిలో పనిగా తమ పెద్ద కోడలు ప్రభావతితో పరిచయం పెంచుకునే అవకాశం యేర్పడుతుందని, అంచేత వాళ్ళతో కలసి వెళ్ళమని అడిగారు. వాళ్ల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్న వినోదిని తల్లికి ఫోనులో ఓమాట చెప్పి తను బయల్దేరి రావటానికి రెండు మూడు రోజుల పడ్తుందని తెలియచేసి అన్నా చెళ్ళెల్లతో బయలు దేరింది.


అప్పటికే వరూధిని మందాకినిల రాకతో సందడిగా తయారయిన ఇల్లు ఈ ముగ్గురు రాకతో ఒక్కసారిగా కళకళగా ఫెళ్ళుమంది. పచ్చటి పెళ్ళి పందిరిలా మారింది. ప్రభావతి మొదట వినోదినికి యెదురు వెళ్ళి కౌగలించుకుంది-“పరమేశ్వర్ నీ గురించి చెప్పిందగ్గర్నించి నిన్ను చూడటానికి రావాలని ప్రయత్నించా ను వినోదినీ--కాని వీలుపడలేదు. మొన్న మీ బావ భువనేశ్ రాముగారితో కలసి మా చిన మాఁవగారి వద్దకు బయల్దేరేటప్పుడు కూడా ఆయనతో చేరలేక పోయాను. మంచిదయింది, నువ్వే తిన్నగా వచ్చేసావు. మా చిన్న మరది పరమేశ్వర్ మొహ మాటస్థుడు. అమ్మాయిలకు కొంచెం తొలగి ఉంటాడు. అది సీరియస్ గా తీసుకోకు. మా వారి తమ్ముడని చెప్పడం లేదు. కుర్రాడు మంచోడు. సంస్కారవంతుడు. ఆ మాటకు వస్తే ఆయింట్లోవాళ్ళందరూ సంస్కారవంతులే—“


వినోదిని నవ్వుతూ తలూపి ప్రభావతి కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ ఆ విషయం తనకు తెలుసని చెప్తూ అడిగింది“పుట్టిన రోజు సంబరం యెప్పుడు ఆరంభమవుతుంది అక్కయ్యా! ”


“ ఇక్కడ మాత్రం కాదు. ఇక్కడ లైట్ గా మధ్యాహ్న భోజనాలతో సరి—మీ బావగారి మిత్రుడు రాము నా పుట్టినరోజు సంబరంతో బాటు ఈవెంట్ అంతా హోటెల్ స్ప్రింగ్ లో యేర్పాటు చేసినట్టున్నాడు. గ్రాండ్ గా ఉంటుందని మిత్రులిద్దరూ చెప్పారు. నువ్వూ కమలమూ పరమేశ్వరూ ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేయండి. మీ ఎంజాయ్మెంటుని చూస్తూ కూర్చుంటే నాకదే పెద్ద సంబరం” అంటూ పరమేశ్వర్ నీ వినోదినినీ చేతులు పట్టుకుని తీసుకు వెళ్ళి వరూధినికి పరిచయం చేసింది;ఆమె తనకు క్లోజ్ ఫ్రెండని సన్ షైన్ ఫార్మా కంపెనీ లో సీనియర్ పొజిషన్ లో ఉందని. అది వాళ్ళ మామగారి స్వంత వెంచర్ అని--వరూధిని స్నేహపూర్వకంగా భుజాలపైన చేతులు వేసి వినోదినితో చేతులు కలిపింది.


భువనేశ్ మాత్రం వాళ్ళను అక్కడే విడిచి కమలాన్ని తీసుకెళ్ళి రాముకి పరిచయం చేయబోయాడు-అప్పుడామె అడ్డువస్తూ అంది-“ఈయన నీతో కలసి మొన్న మనింటికి వచ్చి వెళ్ళారు కదరా అన్నయ్యా! అమెరికాలో స్థిరపడ్డ సీనియర్ బిజినెస్ ఎక్సగ్యూటివని కూడా చెప్పావు కదా—బాగా గుర్తుంది. ఆ తరవాత తానుగా వచ్చి అమ్మకూ బామ్మకూ తాతయ్యకూ చిన్నపాటి గిఫ్టులు కూడా ఇచ్చి వెళ్ళారు. ఏమీ పుచ్చుకోకుండా ఆదరాబాదరాగా క్యాబ్ వేపు వెళ్లిపోతుంటే నేనే ఆపి తాగడానికి మంచి నీళ్ళిచ్చాను. ”


అని విషయాన్ని మననం చేస్తూ రాము వేపు తిరిగి మన్ననతో అడిగింది-“ఔను కదు సార్! ”అని—రాము రెండు చేతులూ క్రాస్ గా కట్టుకుని తలూపి మిగతాది పూర్తి చేసాడు “మీరు నాకు దారిలో ఒలిచి తినడానికి ఒక కమలా ఫలం కూడా యిచ్చి వెళ్ళారు. థేంక్స్. అప్పుడు చెప్పలేక పోయాను”


ఆ మాటకు కమలం నవ్వేసింది. “నేను చిన్న దానిని సార్! మీరంతటి భవ్యంగా నాతో మూవ్ చేయనవసరం లేదు. ఇంకా యింట్లోవాళ్ళు నన్వు బుజ్జీ అనే పిలుస్తారు. తెలుసా?”


“మీ అన్నయ్య అలా పిలిస్తే పలుస్తాడు గాని—నేను మాత్రం అలా ససేమిరా పిలవను లెండి-ఐ ప్రామిస్! ”

కమలం నోరార నవ్వుతూనే అంది-“బయటి వారు అలాగ్గాని పిలిస్తే నేనూరుకోను కదా సార్! ”


“షుయర్! మరి మనం అలా కాసేపు ఆరుబయట నిల్చుని వద్దామా మేడమ్—ఎందుకంటే నేను కొద్దిరోజుల్లో పల యు ఎస్ తిరిగి వెళ్ళిపోవచ్చు--ప్లీజ్—ఇఫ్ యు డాంట్ మైండ్—“


కమలానికి యేమనాలో తెలియక భువనేశ్ వేపు చూసింది-“ఇటీజే ఓకే! నీతో కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాడు. మళ్లీ యిటువేపు యెప్పుడొస్తాడో యేమో! వెళ్ళిరా—ఏమీ కాదు. ” అని భువ నేశ్ అక్కణ్ణించి కదలి వెళ్ళిపోయాడు.


వాళ్ళలా బాల్కనీ వేపు వెళ్ళిపోయిన తరవాత ప్రభావతి అటువంటిదే మరొకటి చేసింది. పరమేశ్వర్ వద్దకు వెళ్లి “ఏంవోయ్ చిన్న మరదీ! ఎంతసేపిలా మందాకినితో గేమ్సు ఆ డుతూఉంటావు?వినోదిని మనూరికి మనింటికీ కొత్తే కదా! అలా వెళ్ళి మాంచాలమ్మ వారి రథం చూపించి రాకూడదూ! అసలు బర్తడే పార్టీ సాయంత్రం తరవాతనే కదా--“


అతడూ నవ్వుతూ దగ్గరకు వచ్చి అన్నాడు-“హ్యాపీ రిటార్న్స్ ఆఫ్ ది డే వదినమ్మా! ”

“మళ్ళీ యెందుకోయ్?వచ్చీ రావడంతో చెప్పావు కదా! ”

“ఐనా మరొకసారి చెప్పాలనిపించింది వదినా! ఇక్కడ నాకు బాగానే ఉంది. క్వయిట్ కంఫర్టబుల్—“


“నువ్వు కంఫర్టబుల్లే--కాని—అలా వినోదినికి కూడా తోచవద్దూ! చదువుకుంటే చాలదోయ్. రసన కూడా పెంచుకోవాలి-వెళ్ళు వెళ్లు-“ అని వినోదిని వేపు చేతులు చూపి సైగ చేసింది. ఆమె దగ్గరకు వచ్చింతర్వాత గట్టిగా అంది-“ నువ్వు పరమేశ్వర్ తో అలా వీధులు తిరిగొస్తావు. మరొక గంట వరకూ మీరిద్దరూ ఈ దరిదాపున కనిపంచకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ”


వదిన ఆ మాటల్ని పైకి జాయ్ ఫుల్ గా అన్నాలోలోన సీరియస్ గానే అందని గ్రహించిన పరమేశ్వర్ వినోదిని కళ్ళలోకి చూసి బయటకు కదిలాడు. అప్పుడు మందాకిని చెంగున అక్కడకు దూసుకు వచ్చింది- “అంకుల్ అంకుల్! నేనూ వస్తాను మీతో—ఇక్కడ ఒంటరిగా బోర్ కొడ్తుంది”


ప్రభావతి ఆ పిల్లనాపింది. “నీకు బోర్ కొట్టకుండా నేనుంటాను. ముబైల్ గేమ్స్ అంటే నాకూ యిష్టమే—రా—మనం ఆడుకుందాం. ”


ఆ మాటతో మందాకిని వెనుతిరిగింది. మరి కాసేపటికి నవ్వుతూ యిద్దరూ మెట్లు దిగి రోడ్డుపైకి వచ్చారు. పరమేశ్వర్ తలెత్తి చూసి అన్నాడు-“అదిగో! అక్కడ ఆటో రిక్షా నిల్చున్నట్లుంది. రండి వెళదాం—“

వినోదిని పక్కున నవ్వుతూ ఆపింది-“ఎందుకిప్పుడు ఆటోరిక్షా! ”

“నిన్ను అమ్మవారి గుడి రథం చూపించి రమ్మందిగా వదినమ్మ—“


“ఔను, దర్శించి రమ్మంది అక్కయ్య. అక్కడకు నడిచే వెళ్ళవచ్చుగా! ఆటోరిక్షా లోపల కూర్చుని వెళితే వీధులేమిటి చూస్తాం--“


అతడు తలూపుతూ ముందుకు సాగాడు, కాసేపు ఆమెతో కలసి నడుస్తూ వెళ్లి చట్టున ఆగి అడిగాడు. “ఒకటడుగుతాను, సీదా సాదాగా చెప్తావా వినోదినీ! ”


వైనాట్-అంటూ ఆమె తల విదిలించి కళ్ళతో నవ్వుతూ అంది; అటు కుడిచేతిని చూపిస్తూ--పరమేశ్వర్ నడవడం ఆపి అటు తల తిప్పి చూసాడు. ఒకావిడ జొన్న పొత్తుల్ని కాల్చుతూంది-


“నీకిష్టమా! ” అని అడిగాడు. తలూపిందామె. కాల్చిన జొన్నపొత్తు నుండి వాసన ఘుమఘుమ లాడుతూంది. అతడు వెళ్ళి గంపపైన ఉంచిన జొన్నపొత్తొకటి తీసి వినోదినికి అందించాడు. ఆమె దానిని అందుకుంటూ-“మరి మీకు?”అని అడిగింది.


“ఇట్స్ ఓకే—అంత లైకింగ్ లేదు. నువ్వు తిను” అని చిల్లర డబ్బులిచ్చి ముందుకు కదిలాడు. ఆమె జొన్న పొత్తును వెంటనే ఒలచుకుని తినలేదు దానిని రెండు భాగాలుగా చేసి ఒకటి నోట కరిచింది. మరొకటి అందించింది. అతను థేంక్స్ అంటూ దానిని అందుకుని నోట కరచి ముందుకు సాగుతూ దారిన వెళుతూన్న ఒకతణ్ణి అడిగాడు మాంచాలమ్మ వారి గుడి ఇంకెంత దూరమని. అటు యిటూ చూడకుండా తిన్నగా వెళ్ళిపొమ్మని సైగతో చెప్పి సాగిపోయాడు. “ఇదెక్కడి వంకర టింకర సైగల భాషో—“ అనుకుంటూ నడిచాడు పరమేశ్వర్.


అప్పడు వినోదిని అతణ్ణి అందుకుంటూ గుర్తు చేసింది అతనేదో అడుగుతానన్నాడని. అతడు వెంటనే తలూపి స్పందించాడు- “ఔను. అడుగుతాను- నిజం మాత్రమే చెప్పాలి. ”

“అబ్బ! ఇదెక్కడి ఘోషండీ బాబూ! అదే విషయాన్ని అన్ని సార్లు పునశ్చరణ చేస్తారా?ఇటువంటి పోకడ బిజినెస్ నార్ముకి వ్యతిరేకం తెలుసా! ఇటువంటి పోకడను బిజినెస్ అడ్మిన్ ట్రైనింగులో సీరియస్ గా తీసుకుంటారు తెలుసా! ఉఁ ఇప్పుడు విషయానికి రండి మహాశయా-- “


అతడొకసారి ఆమె ముఖంలోకి సూటిగా చూసి నడుస్తూనే అడిగాడు-“అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగు సంగతి గురించి తరవాత మాట్లాడుకుందాం గాని—ఇప్పుడు నాకెదురైన సైకలాజికల్ పాయింట్ గురించి మాట్లాడుతాను. నువ్వున్న పాటున అంత పెద్ద పెట్టున నవ్వావంటే ఏదో కారణం ఉంటుంది. ఔనా—“

ఆమె తలూపుతూనే ఔనంది.

“ఔనన్నావు. విషయం యేమిటని మళ్ళీ అడగాలా ! ”


ఆమె మృదువుగా నవ్వుతూనే అంది-“చెప్తాను మహోశయా—చెప్తాను. నన్ను మీరే కాదు—మీ యింట్లో వాళ్ళందరూ నన్నొక అసూర్యంపశ్యలాగే చూస్తున్నారు. నేను కాస్తంత యెరుపే కావచ్చు. అలాగని చిన్పపాటి యెండ తగిలితే కణకణ కందిపోతానని అనుకోకూడదు. ఇంట్లో చిన్నపాటి పని చేస్తే చేతులు కరుకుగా మోటుగా మారుతాయని అనుకుంటున్నారు. అది సరికాదు. ఇప్పుడు కాకపోయినా — రేపైనా మరునాడైనా నేను ఇద్దరు ముగ్గురు బిడ్డలకు తల్లి కావలసిన దానినేగా! ఇది లోక విదితమేగా! అప్పుడేమి చేస్తాను. బిడ్డల ఆలనాపాలనా అంతా పనిగతెత్తలకో పురుడు నర్సమ్మలకో అప్పగించి ఓ మూల గోళ్ళు గిల్లు కుంటూ కూర్చోలేను కదా--ఇంటి యిల్లాలుగా కాకపో యినా స్త్రీగానైనా నాకు నేనుగా చేసుకోవలసిన కొన్ని బాధ్యతలుంటాయి కదా-- వాటిలో కొన్ని మోటు పనులు కూడా ఉండవచ్చు కదా-- అలాంటప్పుడు కలవారి కుటుంబం నుంచి వచ్చిన దానినయినా కాలమంతా నాకు నేను అసూర్యంపశ్యలా మిగిలిపోలేను కదా—“


అతడు ఆశ్చర్యంగా ఆమె వేపు చూడసాగాడు. . “ఇప్పటికిప్పుడే అంతలావు ఆశ్చర్య పోకండి. గుడి రథం చూసి దానిపైన పూలు కురిపించి దైవదర్శనం పూర్తి చేసుకున్న తరవాత మిగతాది మీకు చెప్పవలసింది చాలానే ఉంది. ఈరోజు నాకోసం కొంచెం ఓపిక పట్టండి. ”అతడు బదులివ్వలేదు. ఆమె పూలమ్మి వద్ద పూలు కొని తిరిగి చూసింది. అతడు డబ్బులు చెల్లించి ఆమెను చూస్తూనే నడవ సాగాడు. “అదేమిటి అంత సేపట్నించి అంత సూటిగా చూస్తున్నారు, ’అంతగా నను చూడకు గురి చూడకు’ అన్న పాటను గుర్తుకి తెచ్చేలా--నామాటలకు కోపం కలగలేదు కదా?“ లేదన్నట్టు తల అడ్డంగా ఆడిస్తూ గుడి మెట్లు యెక్కుతున్నప్పుడు అతడామెకు అసంకల్పితంగా చేయి అందించాడు.


మొదట ఇద్దరూ రథం వద్దకు వెళ్ళి భక్తితో విడిపూలను దానిపైన కురిపించి ఆ తరవాత పూలనూ తులసి దళాలతోకలిపి కట్టిన మాలను అందుకుని ముందుకు నడిచారు. వారిద్దరూ అలా నడుస్తూ గర్భ గుడి వద్దకు చేరేటప్పటికి మనసునా తలపునా అంతరంగ వాతావరణం మారిపోయింది. ఆహ్లాదకరమైన తేలికతనం చోటు చేసుకుంది. భక్త జనం వరసలో చేతులు జోడించి నిల్చున్న వినోదిని భక్తి భావ స్రవంతిలోకి తెప్పలా తేలుతూ వెళ్ళిపోయింది. చదివిన విషయాలను, తండ్రికి పెద్దత్తయ్య శారద ఆంటీ చెప్పిన మరి కొన్ని అంశాలను ఆమె అప్రయత్నంగా మననం చేసుకోసాగింది.


ప్రాచీన కాలం నుండి దైవ భీతి గల మానవుడు పుణ్య క్షేత్రాల కట్టడాలను దైవ చింతనకు ప్రతీకగా మలచుకుంటున్నాడు. దేవాలయాలు పైకి కనుసొంపుగా కళాత్మకమైనవిగా గోచరిస్తాయి గాని, అవి వాస్తవానికి వేద విజ్ఞాన కేంద్రాలు. నిటారుగా ఆశీర్వదిస్తున్నట్టు ధ్వజస్తంభం-అభావంగా నిల్చుని చూస్తున్నట్టు కనిపిస్తూన్న దేవ మూర్తులలో కానవచ్చే పవిత్రత-నిలువె త్తు రాజగోపురంలోని గాంభీర్యత-అయస్కాంత తరంగాలు నలువైపులా వ్యాపించేలా ఆలయ నిర్మాణాలకు తదనుగుణంగా ఉండేలా ఆగమ శాస్త్ర విధి విధానాలను అదిలో దైభ్యుడు అనే మహర్షి నిర్దేశించాడని చెప్పింది హెడ్ మిస్ట్రస్ గా ఉద్యోగ విరమణ చేసిన శారద ఆంటీ---వినోదిని భక్త జనం ముందుకు కదలడం గమనించి చట్టున ఆలోచనల నుండి తేరుకుంది. అర్చకుల మంగళకర మంత్రోఛ్ఛరణలు గుడి గంటలు కలగ లసి ఫెళ్ళున వినిపించసాగాయి.


వినోదినికి పారవశ్యం కలిగింది. తగరం, సీసం, రాగి తుత్తునాగం కంచు లోహాల కలయికతో రూపొందించ బడ్డ గుడిగంటల ధ్వని వల్ల శరీరం లోని అనాహత చక్రం చైతన్నవంతమై మనిషిని ఉత్తేజితుణ్ణి చేస్తుంది. వాస్తవానికి వినోదిని కొన్నాళ్ళు విదేశాలలో చదివొచ్చినా, విదేశీ జీవన వాతావరణం కొంత అలవడినా ఆమెకు గుడి వాతావరణమంటే మిక్కిలి యిష్టం. దైవ దర్శనం వల్ల విస్తరించే ఆత్మాను భూతి అంటే మరింత యిష్టం. ఆమె అలా తన్మయత్వంతో ఆలోచించుకుంటూ ఉన్నపళాన మగ భక్తుల వరసలో నిల్చున్న పరమేశ్వర్ వేపు చూసింది.


అతడు ఆశ్చర్యంతో కను రెప్పలల్లార్చుతూ ఆమె వేపు ఒరిగి అడిగాడు-“ఏమైంది వినోదినీ! ఏదో మూడో లోకంలో ఉన్నట్టు అలా మైమరచి పోయి మాటా పలుకూ లేకుండా నిల్చుండిపోయావు—నీలో అంతటి దైవ భక్తి ఉందని నాకు తెలియనే తెలియదు సుమా!"


ఆమె కూడా అదే రీతిన అతడి వేపు ఒరిగి మెల్లగా బదులిచ్చింది-“నాగురంచి ఇదే కాదు. చాలా విషయాలు మీకు తెలియదు, నేను కలవారి కుటుంబానికి చెందిన అమ్మాయినన్న వైనం తప్ప—“

అతడు తలూపుతూ యధాస్థానానికి జరిగాడు.


------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.







31 views0 comments
bottom of page