వేషం మారింది..!
- Sathyanarayana Murthy M R V

- Mar 30
- 5 min read

Vesham marindi - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy Published In manatelugukathalu.com on 30/03/2026
వేషం మారింది..! - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“మనసులో కలిగిన అనుమానం… నిజాన్ని తెలుసుకున్నాక అనురాగంగా మారితే?” ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారి 'వేషం మారింది..!' కథలో అనురాగం, అనుమానాల మేళవింపును అనుభూతి పొందండి. |
“వసూ, నేను బయటకు వెళ్తున్నాను. ఆలస్యం అయితే నువ్వు భోజనం చేసేయి. నా కోసం చూడకు” అని బూట్లు టకటకలాడిస్తూ కారెక్కి వెళ్లిపోయాడు గోపాలరావు. భర్త వెళ్ళిన వైపే చూస్తూ నిట్టూర్చింది వసుంధర. ఈ మధ్య భర్త ప్రవర్తన ఆమెను అయోమయంలో పడేస్తోంది.
రిటైర్ అయ్యి పది సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడూ లేజీగా ఉండే భర్త గత ఆరు నెలల నుండి చాలా చురుగ్గా ఉంటూ, బయటకు వెళ్ళాలంటే ట్రిమ్‌గా తయారై వెళ్తున్నాడు. జుట్టుకు రంగు వేసుకుంటూ పొట్టి క్రాఫ్‌తో ఉంటున్నాడు. కుర్రాడిలా కనపడాలని చాలా తాపత్రయపడుతున్నాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఏనాడు జుట్టుకు రంగు వేసుకోలేదు. ‘ఇలా తెల్లజుట్టుతో ఉంటే గౌరవంగా, హుందాగా ఉంటుంది చూసేవారికి’ అని తరచూ అనేవాడు. ఆదివారం పొద్దున్నే బయటకు వెళ్లి, సాయంత్రం ఇంటికి వస్తున్నాడు.
“ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే, ‘పాత స్నేహితుల్ని కలిసి వస్తున్నాను, రిలాక్స్‌గా ఉంటుందని’ అని జవాబు చెబుతున్నాడు. అక్కడికీ ఉండబట్టలేక తమ్ముడితో అంది, ‘మీ బావ ప్రవర్తన మారిపోయింది. నాతో ఏ విషయం సరిగా చెప్పడం లేదు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఒకవేళ ‘చిన్న ఇల్లు’ ఏమైనా పెట్టారేమో అని అనుమానంగా ఉంది’ అని.
దానికి వాడు ఖయ్యుమని లేచాడు. ‘బావను అనుకుంటే కళ్ళు పోతాయి’ అని అన్నాడు.
‘అనవసర అనుమానాలతో అనారోగ్యం తెచ్చుకోకు. డెబ్భై ఏళ్ళ వయసులో కొంతమందికి అలా కుర్రవాళ్ళలా కనిపించాలని ఉబలాటం ఉంటుంది’ అని చెప్పాడు. వాడికి ఆయనంటే ఎనలేని గురి, భక్తి.
ఉహూ... ఇలా కాదనుకుని, చెల్లెలు రాగిణికి చెప్పింది తన అనుమానం.
‘బావ యాక్టివ్‌గా ఉన్నాడంటే సంతోషించు అక్కా. మా ఆయన, రిటైర్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ఒక పిచ్చి లుంగీ కట్టుకుని ఉంటారు. టీవీ, ఫోన్ తప్ప వేరే లోకం ఉండదు. ఇంటికి ఎవరు వచ్చినా, అలా జిడ్డు మొహంతోనే ఉంటారు. కొంచెం ఫ్రెష్‌గా ఉందామనే ధ్యాసే ఉండదు. ‘ఇప్పుడు నేను పెళ్ళికొడుకులా తయారవ్వాలా ఏమిటి?’ అని చిరాకు పడతారు. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు’ అని సలహా ఇచ్చింది. పైగా ‘బావ లేటెస్ట్ గెటప్ ఫోటో పంపు’ అని కూడా అంది.
తన సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందా అని చాలా మథనపడింది వసుంధర. ఒకరోజు పనిమనిషి రంగమ్మ అడిగిన ప్రశ్నకు ఖంగుతింది.
“అమ్మగారూ, మొన్న అయ్యగారు కొన్న కొత్త చీర ఎప్పుడు కట్టుకుంటారు?” టీ తాగుతూ అడిగింది రంగమ్మ.
తను ఎప్పుడు కొత్త చీర కట్టుకున్నా, రంగమ్మను అడుగుతుంది ‘చీర ఎలా ఉందని?’. రంగమ్మ మెచ్చుకుంటే, అదో తృప్తి వసుంధరకు.
“ఈ మధ్య అయ్యగారు కొత్త చీర ఏమీ కొనలేదు, రంగమ్మా” అంది వసుంధర.
“అదేమిటి? నాలుగు రోజుల క్రితం నవకళ బట్టల కొట్టులో అయ్యగారు నాలుగు వేలు పెట్టి చీర కొన్నారని మా తమ్ముడు చెప్పాడు. వాడూ వాళ్ళ అబ్బాయికి బట్టలు కొనడానికి వెళ్ళాడు, అదే కొట్టుకి. వాడు చెప్పాడు నాకు ఈ సంగతి” టీ తాగి, గ్లాసు కుళాయి దగ్గర కడిగి, గట్టు మీద పెట్టి అంది రంగమ్మ.
వసుంధర ఏమీ మాట్లాడకపోవడంతో, నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రంగమ్మ. వసుంధర మనసు పలు విధాలుగా పోయింది. అయినా నిజం తెలుసుకోవాలని బెడ్ రూమ్‌లోని బీరువా అంతా వెతికింది, కొత్త చీర కోసం. ఒకవేళ తనకు చెప్పడం మరిచిపోయి బీరువాలో పెట్టాడేమోనని.
ఎక్కడా కనిపించలేదు కొత్త చీర. హాలులోకి వచ్చి, దిగాలుగా సోఫాలో కూలబడింది. యాదృచ్ఛికంగా టీవీకేసి చూసింది. సీరియల్‌లో ఒక భర్త, భార్యను కారులో వాళ్ళ ఆఫీస్ దగ్గర విడిచి, పక్క వీధిలోని తన ఆఫీస్‌లో పనిచేసే ఆమెను కారులో ఎక్కించుకుని, జాలీగా టూర్‌కు వెళ్తూ ఉంటాడు. వాళ్ళ కిసుకిసులు, నవ్వులు చూడలేక టీవీ కట్టేసింది వసుంధర.
తన అనుమానమే నిజమైంది. భర్త మరో ఆడదానితో సంబంధం పెట్టుకున్నాడని వాపోయింది. తన వాళ్ళు ఎవరూ నమ్మడం లేదు. తనే ఏదోవిధంగా ఈ రహస్యాన్ని ఛేదించాలని గట్టిగా నిర్ణయించుకుంది.
*****
మరుసటి ఆదివారం తొమ్మిది గంటలకు భర్త కారు వేసుకుని బయటకు వెళ్ళగానే, వీధి మలుపులోనే ఉండమన్న టాక్సీని రమ్మని ఫోన్ చేసింది. ఇంటికి తాళం వేసి బయటకు వచ్చి, టాక్సీ ఎక్కి ముందు వెళ్తున్న కారును ఫాలో అవమని చెప్పింది. దారిలో స్వగృహ ఫుడ్స్ దగ్గర కారు ఆపి, భర్త స్వీట్లు కొనడం చూసింది. తర్వాత ఒక అరగంటకు భర్త కారు ఆగిన చోటు చూసి ఆశ్చర్యపోయింది వసుంధర. గోపాలరావు స్వీట్ల పాకెట్లను తీసుకుని ఆ భవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి, వసుంధర కూడా ఆ భవనంలోకి వెళ్ళింది.
అది ఒక వృద్ధుల ఆశ్రమం. మేనేజర్ దగ్గరకు వెళ్లి, తనకు తెలిసిన వారిని ఇక్కడ జాయిన్ చేయాలని, వాళ్ళ రూల్స్ ఏమిటని అడిగింది. అతను చెబుతున్నాడు. ఆమె ‘ఊ’ కొడుతూ, “ఇప్పుడు లోపలకి ఒకాయన వెళ్లారు కదా, ఆయన బంధువులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?” అని అడిగింది వసుంధర.
“ఓ... డిప్యూటీ తహసిల్దార్ రావుగారా? ఆయన తాలూకు ఎవరూ లేరండి. ఇక్కడ ఉన్నవారితో కాలక్షేపం చేయడానికి వస్తారు. ఈ మధ్యనే మా ఆశ్రమానికి రెండు లక్షల విరాళం కూడా ఇచ్చారు. చాలా మంచి మనిషి” అన్నాడు మేనేజర్.
ఈలోగా ఆయనకు ఫోన్ వచ్చింది. “ఆ, వస్తున్నా” అని, “మేడమ్, మీరు పేపర్ చూస్తూ ఉండండి. నేను ఒకసారి కిచెన్‌లోకి వెళ్లి వస్తాను” అని వసుంధరకి చెప్పి లోపలకి వెళ్ళాడు.
వసుంధర సీసీ ఫుటేజ్ చూస్తోంది. గోపాలరావు హాలులో వృద్ధులతో మాట్లాడుతున్నాడు. నెమ్మదిగా లేచి హాలు కిటికీలోంచి చూడసాగింది.
ఒక పెద్దావిడ గోపాలరావుతో, “ఏరా అబ్బిగా, మీ బాస్ ఏమంటున్నాడు? నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నాడా?” అని అడిగింది.
ఆవిడ పక్కనే కూర్చున్న గోపాలరావు, “పెద్దమ్మా, ఎంత పనిచేసినా, ఇంకా చేయాలంటాడు. రాత్రి ఎనిమిది అవుతోంది ఇంటికి వెళ్ళేసరికి. రెండు రోజులు సెలవు అడిగితే, ఒక రోజు ఇస్తానంటాడు. ఏమి మనిషో?” దిగులుగా అన్నాడు గోపాలరావు.
ఆవిడ గోపాలరావు తల నిమురుతూ, “బాధపడకు నాన్నా, అన్నీ అవే సద్దుకుంటాయి. మీ ఆవిడను జాగ్రత్తగా చూసుకో. నువ్వు వచ్చేవరకూ కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తూ ఉంటుంది. ఆఫీస్‌లో కోపం పిల్లల మీద చూపించకు” అంది ప్రేమగా.
‘అలాగే’ అన్నట్టు తలూపాడు గోపాలరావు.
ఈలోగా ఒకావిడ లోపల నుండి వచ్చి, గోపాలరావు రెండో పక్క కూర్చుంది.
“ఎలా ఉన్నావు, పిన్నీ?” అని పలకరించాడు గోపాలరావు.
“దేవుడిచ్చిన నీలాంటి కొడుకు ఉండగా నాకు లోటేమిటి? నిన్న నా పుట్టినరోజు ఇక్కడ ఘనంగా చేశావు. నువ్వు ఇచ్చిన కొత్త చీర కట్టుకుని, నేనూ రుక్మిణి అక్కా గుడికి వెళ్ళాము. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకులు ఇద్దరూ నన్ను మరిచిపోయినా, నువ్వు గుర్తు పెట్టుకుని నా పుట్టినరోజు బాగా చేశావు. కడుపున పుట్టినవాడే కొడుకు కాదు, ఆప్యాయత చూపించినవాడు, మమతలు పంచినవాడూ కొడుకే” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా, ఆప్యాయంగా గోపాలరావు గెడ్డం పట్టుకుని అంది ఆవిడ.
గోపాలరావు తను తెచ్చిన అరిసెలు, మినప సున్నుండలు, మైసూరుపాకులు అందరికీ ఇచ్చాడు. అందరూ నవ్వుతూ, ఆనందంగా తింటూ కబుర్లు చెప్పుకున్నారు.
ఈలోగా మేనేజర్ గదిలోకి రావడంతో, కిటికీ దగ్గర నుండి వచ్చి కుర్చీలో కూర్చుంది వసుంధర. కొద్దిసేపు మాట్లాడి, బయటకు వచ్చి టాక్సీ ఎక్కి ఇంటికి తిరిగి వచ్చింది.
సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చిన గోపాలరావుతో, “కాఫీ తాగుతారా?” అని అడిగింది వసుంధర. ఒకసారి భార్యకేసి ఆశ్చర్యంగా చూసి ‘అలాగే’ అన్నాడు. అతను బట్టలు మార్చుకుని హాలులోకి వచ్చేసరికి, కాఫీ ఇచ్చింది వసుంధర. ఇద్దరూ కాఫీ తాగడం పూర్తయ్యింది.
“ఇన్నాళ్ళూ ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు?” సౌమ్యంగా అడిగింది వసుంధర.
“ఏ విషయం?” అన్నాడు గోపాలరావు.
“అదే. వృద్ధాశ్రమానికి మీరు వెళ్ళడం. నాకు చెబితే, నేనూ కూడా వచ్చేదానిగా” బుంగమూతి పెడుతూ అంది వసుంధర.
అది చూసి పెద్దగా నవ్వాడు గోపాలరావు. ‘అయితే, ఈరోజు నా వెనకే వచ్చావన్న మాట” అని నవ్వాడు. ఆమె కూడా నవ్వింది.
“అవును. మీరు ఇంకా సర్వీస్‌లో ఉన్నట్టు ఎందుకు అబద్ధం చెబుతున్నారు?” ఆసక్తిగా అడిగింది వసుంధర.
ఆమె మాటకి దీర్ఘంగా నిట్టూర్చాడు గోపాలరావు. భార్య కేసి చూశాడు.
“వాళ్ళందరూ ఇంచుమించు నా వయసువారే. వారి కష్టసుఖాలు నాతో చెప్పుకోవాలంటే, మొహమాటపడవచ్చు. అందుకే సీనియర్ సిటిజెన్ నుండి నడివయసు గెటప్‌లోకి మారాను. వేషం మార్చాను. దీని వలన రెండు లాభాలు కలిగాయి. వారికి ‘పుత్రప్రేమ’ దొరికింది. నాకు మాతృప్రేమ దక్కింది” అన్నాడు గోపాలరావు.
అకస్మాత్తుగా అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. వసుంధర చీర కొంగుతో అతని కళ్ళు తుడిచింది.
“నిజం వసూ. నేను హైస్కూల్ చదువులో ఉండగా మా అమ్మ చనిపోయింది. మా నాన్నే ఆ లోటు లేకుండా నన్ను పెంచారు. కానీ మాటలకందని ఒక తల్లి చేతి స్పర్శ, అమృతతుల్యమైన ఆమె చల్లని చూపుల ఆనందం, అనుభూతి నాకు అక్కడ లభించాయి. అందుకోసం నేను రెండు, మూడు అబద్ధాలు చెప్పాను. కానీ అవి ఎవరికీ హాని చేయనివి. నష్టం కలిగించనివి.
రుక్మిణి గారికి ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉంటాడు. రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఇండియాకి. నెలకొకసారి ఫోన్ చేస్తాడు ‘అమ్మా, బాగున్నావా?’ అని. ఎంత డబ్బు కావాలన్నా పంపుతాడు, కొడుకుగా బాధ్యత మాత్రం వహించడు, ప్రేమ పంచడు.
వర్ధనమ్మ గారికి ఇద్దరు కొడుకులు. ఒకరు ఢిల్లీ. ఇంకొకరు చెన్నైలో ఉంటారు. పాపం, తల్లి బాధ్యత సమానంగా పంచుకున్నారు. ఆరు నెలలు ఒకరు, మిగతా ఆరు నెలలు ఇంకొకరు ఆశ్రమానికి ఖచ్చితంగా డబ్బు పంపుతారు. ఫోన్ పలకరింతలకే పరిమితం. వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్లరు. నువ్వు ఇక్కడ ‘ఇమడలేవు’ అని చెబుతారు. ఆవిడ పుట్టినరోజుకు నేను ఒక చీర కొంటే, ఆవిడ ఎంతో సంబరపడిపోయారు.
ఆశ్రమంలో అందరికీ చెప్పారు ‘నా కొడుకు గోపాలం కొన్నాడని’. అది చూసి నేను కదిలిపోయాను. నేను ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మాత్రం అంతటి ఆనందం పొందగలను. ఈ ఆనందం, అనురాగాల కోసం నేను వేషం మార్చవలసి వచ్చింది. నా ప్రవర్తన వలన నిన్ను ఇబ్బంది పెడితే, నన్ను మన్నించు” భార్య చేతులు పట్టుకుని అన్నాడు గోపాలరావు.
“అదేం లేదు. నేనే మిమ్మల్ని కొద్దిగా అపార్థం చేసుకున్నాను. నా అనుమానం మబ్బులు విడిపోయాయి ఈ రోజుతో” మనస్ఫూర్తిగా అంది వసుంధర.
సమాప్తం.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


telugu emotional story, wife husband story telugu, old age home story |




@umadevi8931
•11 hours ago
కథ ముగింపు బావుంది
@kappagantulasubbarao3915
•10 hours ago
కధ బాగుంది
@mrvsmurthy311
•1 hour ago
నా కథ చక్కగా చదివారు.. ధన్యవాదాలు