top of page

ఆదర్శ బతుకమ్మ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Adarsa Bathukamma' New Telugu Story


Written By Dr. Kanupuru Srinivasulu Reddy


రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి


ఆదర్శ, సౌందర్యమూర్తి భార్యా భర్తలు.హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మంచి జీతం. కానీ సంసారమే..?


బస్సుదిగి నడుస్తున్న ఆదర్శకు ఇంటికి వస్తున్నాము అనే సంతోషం కలగలేదు. భర్త ఇంటికి ఎలా వస్తాడో తెలుసు. తాగుడు అతని ఫ్యాషన్ కాదు, వ్యసనం. తన అందం, ప్రేమానురాగాలు అలవాటును మాన్పించ లేకపోయాయి. అసంతృప్తితో ఈడ్చుకు రావాల్సిందే, తప్పదు.. అనుకుని గాఢ నిట్టూర్పు వదిలింది.


కోవిడ్ సమయంలో ఇద్దరూ ఇంటి దగ్గరనుంచే పని చేసేవారు. అప్పుడూ తాగుడు వదలలేదు. దొంగచాటుగా అమ్మే వాళ్ళ దగ్గరనో, ఆర్మీలో ఉండే తన స్నేహితుల దగ్గరనో తెచ్చుకుని మామూలు కంటే కాస్త తక్కువ తాగేవాడు.


జీడిపప్పు పప్పు, మిరపకాయ బజ్జీలు, పకోడీలు చేసి పెట్టలేక విసుక్కునేది. అధికారం చెలాయించే వాడు. ఇంట్లో ఉంటూ ఎడముఖం పెడ ముఖం ఎందుకని పడి ఉండేది. మరి తాగుతున్నాడని ఎవ్వరూ భర్తను వదిలేసినట్లు వినలేదు.


తాగుబోతు, తిరుగుబోతు భర్తలను నేటి స్త్రీలు ఆదర్శవంతంగా మన్నించేస్తున్నారు. తమ స్వాతంత్రానికి అడ్డనో నేటి పాతివ్రత్యానికి సరి అనో!!? ఆడదాని అభ్యతరం ఎప్పుడూ సంతలోనే ఉంటుంది.

ఇప్పుడు కోవిడ్ తగ్గింది. సౌందర్యమూర్తి ఆఫీసుకు వెళుతున్నాడు. ఆదర్శ ఇంకా ఇంటి నుంచే పని. వారానికి ఒకసారి వెళ్లి రిపోర్టు చెయ్యాలి.


ఇలాంటి మొగుడెందుకు అని చాలాసార్లు అనిపించినా, లోబడిపోయి, సర్ది చెప్పుకుని, ఇలాంటి జీవితాన్నే ప్రేమించాలి. లేకుంటే ఆతన్ని హత్య... ఛీ... తెంచి పారేసి...’


ఇక బాగవుతుందా తన జీవితం.. అనుకోగానే గుండెల్లో అధిమేసినట్లు అయి, తను దేవతగా పూజించే కాంపౌండులో ఉన్న జమ్మి చెట్టుకు కాపాడమని నమస్కరించి చెమర్చిన కళ్ళు తుడుచుకుంది ఆదర్శ.

జమ్మి చెట్టు తెలంగాణా వాసులకేకాదు. ఆ తల్లి గొప్పతనం తెలిస్తే అందరికీ దేవతా వృక్షమే! ఆరోగ్య ప్రదాయని, అద్భుత శక్తులు గలిగిన మహిమాన్విత ఆ తల్లి. ఆ వృక్షం మీద లక్ష్మి , సీత, శివయ్య.. కోరికలు తీర్చే దేవుళ్ళు ఎప్పుడూ కొలువై ఉంటారని విశ్వాసం. జమ్మి చెట్టును ఆదిపరాశక్తిగా, అపరాజితాదేవిగా భావిస్తారు. రాముడు, రావణ సంహారానికి వెళుతున్నప్పుడు పూజించి విజయ సాధించాడని దేవీ భాగవతంలో ఉంది.


పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలన్నీ దాచారని , విజయదశిమి రోజు తీసుకుని కురుక్షేత్ర యుద్ధం గెలిచారని పురాణం చెపుతుంది. ఆ తల్లి దోషాలను తొలిగించి మనశ్శాంతిని, అష్ట ఐశ్వర్యాలను ఇస్తుందని గట్టి నమ్మకం. పెండ్లిగాని యువతులు, మంచి భర్తను ప్రసాదించమని ప్రదక్షణాలు చేసి


‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.

శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''


అని స్మరించుకుంటూ జమ్మి చెట్టు కొమ్మలకు ఆ శ్లోకాన్ని కాగితంలో రాసి పసుపు గుడ్డలో చుట్టి కడతారు. వాళ్ళ కలలు కోరికలు తప్పక తీరుతాయట.

తాము ఉన్న వీధిలో ఒక వరస ఆదర్శలాంటి ఉద్యోగస్తుల మధ్యతరగతి భవనాలు కొన్ని, కాస్త దూరంలో ఇరవై అంతస్తులు అధునాతన భవంతులు కూడా ఉ న్నాయి. ఎదురుగా వీధికి ఆ వైపు ఆర్ధికంగా దిగువనున్న వాళ్ళ యిండ్లు ఉన్నాయి. అపూర్వ ,ఆరోగ్య ఇళ్ళు అక్కడే! వాళ్ళ అమ్మానాన్నలు తన ఇంటిలో పని చేస్తున్నారు.


తను ఆఫీసునుంచి బస్సులో దిగి నడిచి వచ్చేటప్పుడు అపూర్వ , ఆరోగ్యలు పరుగెత్తుకు ఇంటి వరకు వచ్చి, ఎన్నెన్నో అమాయకపు మాటలు , కధలు చెప్పి వెళ్లి పోయేవారు. వదల బుద్ది వేసేదికాదు . తన నిత్య జీవితంలో ఇమిడిపోయారు.వాళ్ళ తోడు ఎంతో ఉపసమనం కలిగేది.


అపూర్వ నిజంగా అపురూపంగా ఉంటుంది. అంత తెలివిగాను ఉంటుంది. పదకొండేళ్ళ పిల్ల పదనాలుగు సంవత్సరాలుగా కనిపిస్తుంది. ఎంతో చలాకీగా బతుకమ్మ పాటలు , మృదు మధురంగా, సమ్మోహన పరిచేటట్లు పాడుతుంది.


చిన్నాడు ఆరోగ్య చిందులు, దరువు వేసేవాడు. మనసు భర్త వలన చీకాకుగా ఉంటే వారిద్దరిని పిలిపించుకుని జమ్మి చెట్టు కింద కూర్చుని బతుకమ్మ పాటలు పాడించుకుని లోకాన్ని మరిచిపోయేది ఆదర్శ.


అనుకోకుండా అపూర్వ తల్లిదండ్రులు కొవిడ్తో చనిపోయారు. ఆదర్శకు పిచ్చిపట్టినట్లు అయిపోయింది. గుండెలు పగిలిపోయాయి. తన అమ్మా నాన్నలు చనిపోయినట్లు పుట్టెడు దిగులుతో కుంచించుకు పోయింది. దిక్కులేని పిల్లల్ని ఒక్కరూ పట్టించుకోలేదు. మరీ అంటరానివారుగా చూసారు.


తను తీసుకు వస్తానంటే భర్త ససేమిరా ఒప్పుకోలేదు. అదేవిటి బాగున్నప్పుడు వాళ్ళతో అన్నీ చేయించుకుని తిని ఇప్పుడేవిటి ఈ దారుణం. పిల్లల్ని ఇంట్లోనుంచి రెండు వారాలు రాకూడదని మిగిలినవాళ్ళు ఆంక్షలు పెట్టారు. మరి తిండి తిప్పలూ? ఒక్కరు కూడా పట్టించుకోలేదు.ఇంతటి దారుణమైన మనషులా అని క్రుంగిపోయింది. పాపం చిన్న పిల్లలు అని తపించి పోయింది.


ఆదర్శ అందరినీ ఎదిరించి మందులు, వంటసామాను ఒక పదిహేను రోజులకు కొనుక్కుపోయి ఇచ్చి చాలా సేపు ఉండి ధైర్యం చెప్పి ఓదార్చి వచ్చింది .


రాగానే “ఇంట్లో వేరే రూములో ఉండు, భోజనం నువ్వు చెయ్యొద్దు, బయటనుంచి తెప్పిస్తాను” అని చెప్పాడు భర్త.

ఇద్దరూ వాక్సీన్ వేసుకున్నారని అతనికి తెలుసు.

“అంటే నాకొచ్చి, నేను పోయినా పరవాలేదు, మీరు మాత్రం బ్రతకాలంటారు. మరి మీరు ఎక్కడెక్కడో తిరిగొస్తున్నారు, తాగుతున్నారు. జబ్బు తెస్తే మీరు తేవాలి. మిమ్మల్ని నేను వెలివేయలేదే. మీ ప్రక్కనే పడుకుంటున్నాను కదా!? ” అంది ఆదర్శ.


“అది కాదు. ఎవరికోసమో అంత,,,!!” నసుగుతూ ఆదర్శ నిప్పులుగక్కే చూపులు చూసి నిలిచిపోయాడు. ఎందుకు లెమ్మని సర్దుకుని, తనను బయటనుంచి తెచ్చుకోమని, తను చేసుకుని, అపూర్వ వాళ్ళకు తీసుకుపోయి ఇచ్చేది ఆదర్శ. దారిలో అందరూ ఆమెను అంటరానిదిగా చూస్తూ దూరంగా వెళ్ళే వాళ్ళు. విచిత్రం అందులో చాలా మంది కోవిడ్ వాక్సీన్ వేసుకోలేదు.


పద్నాలుగు రోజులు ఎలాగో గడిచి పోయాయి.

అపూర్వ, ఆరోగ్య ఉన్నది బాడుగ ఇళ్ళు. ఒకరోజు దిగులుగా ఉంటే.. అడిగితే, బాడుగ కట్టలేదు వెళ్ళిపొండి అని చెపుతున్నారని చెప్పలేక చెప్పారు. ఆదర్శలో అలజడి, ఆత్రుత మొదలయ్యింది. తల్లి తండ్రిని పోగొట్టుకుని దిక్కుతోచక అలమటిస్తున్న చిన్నపిల్లల మీద దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తారా అని నోటికొచ్చినట్లు తిట్టింది ఇంటి ఓనరును .


తనింటికి తీసుకు రావాలి. ఇప్పుడే వచ్చెయ్యమనాలి అని తపించిపోయింది . వస్తే మరి ఇతను వొప్పుకుంటాడా ?

భర్తతో చెప్పింది . ‘ఈ సమయంలో ఇంట్లోకి తీసుకు వస్తావా’ అని ఎగిరాడు.


అయితే “నేను క్వారెంటైన్లోనే కదా ఉన్నాను. వాళ్ళతోనే ఉంటాను.” అని మొండికేసింది.


చెప్పి చెప్పి అలిసి, మరో గ్లాసు మందు ఎక్కువతాగి, మౌనంగా ఉండి పోయాడు.


ఆదర్శకు తెలుసు వాళ్ళిద్దరూ అంటే అతనికీ ఇష్టమే, మరీ అపూర్వ అంటే ! ఎప్పుడూ దాని అందాన్ని, తెలివిని, చెలాకీతనాన్ని మెచ్చుకుంటూనే ఉంటాడు.


రెండు రోజుల్లో అన్నీ వదిలించి, ఇంటికి తీసుకు వచ్చేసింది . చాలా మొహమాటంగా భయం భయంగా ఉండటం చూసి, స్నానాలు చేయించి, ఇంట్లో పూర్తి స్వాతంత్రం ఇచ్చేసింది.


భర్త కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ భయం తీర్చేసాడు. అతని ప్రవర్తనకు తల వంచేసింది . ఆ రోజునుంచి ఆదర్శ ఇల్లు స్వర్గాధామమైపోయింది.


కానీ అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ముభావంగా ఉండే వాళ్ళను దగ్గరకు తీసుకుని, ఓదార్చి ధైర్యం చెప్పి, మామూలు మనుషులను చేసేది. ఇంకా సంతోషకరమైన విషయం.. భర్త సాయంకాలం త్వరగా వచ్చి, తక్కువ తాగి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం ఎంతో ఊరటను కలిగించింది. ‘ఇదీ తన జీవితం’ అని తృప్తిపడింది.

కాలం గడిచిపోతుంది. ప్రభుత్వం కోవిడ్లో చనిపోయిన వారి అనాధలకు, ఆర్ధికహాయం చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. నమోదు చేద్దామని మండల ఆఫీసుకు వెళితే, అసలు పేర్లు వాళ్ళ రికార్డులో లేవని ,చావు నమోదు కాలేదని, కనీసం వోటు హక్కు ,ఆధార్ కార్దు, రేషను కార్డు తీసుకు రండి అని.. లెక్కలేనట్లు మాట్లాడారు.


ఆదర్శ గట్టిగా మాట్లాడేసరికి, పంచాయితీ పెట్టి నిజం తెలుసుకుని ప్రయత్నిస్తాము అన్నారు. ఇంటికొచ్చి వాటిని అపూర్వనడిగితే తనకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని చెప్పింది.


నెల అయిపోయింది. రెండునెలలు దాటిపోయాయి. ఎవ్వరూ రాలేదు. చివరకు కలెక్టరు దగ్గరకు పదిసార్లు తిరిగితే సానుభూతితో అన్నీ విచారించి, వాళ్లకు ఎవ్వరూ లేరని తెలుసుకుని, తన అధికారంతో చెరి పదివేలు మొదటి వాయిదాగా బాంకులో ఖాతా తెరిపించి, ఆదర్సను ట్రస్టీగా పెట్టి, మిగిలింది త్వరలో ఇస్తామని చెప్పాడు.


స్కూలు ఫీజులు, గుడ్డలు, పుస్తకాలు ఉచితంగా వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఎంతో బరువు తగ్గిపోయినట్లు, వాళ్ళ జీవితాలలో మంచి రోజులు వచ్చినట్లు ఆనంద పడిపోయింది ఆదర్శ.


ప్రతి రోజు సాయంకాలం జమ్మి చెట్టుకింద దీపం బెట్టి, అపూర్వ చేత బతుకమ్మ కధలు వింటూ లోకాన్నే మరిచిపోయేది ఆదర్శ.


బతుకమ్మ పండుగలు మహాలయ అమావాస్య తో మొదలయ్యి ఆశ్వయుజ నవమి రోజు సద్దుల బతుకమ్మ… పెద్దబతుకమ్మగా దసరాకు రెండురోజులు ముందుగా ముగుస్తాయి. పదవరోజు జమ్మిచెట్టుకు పూజలుచేసి, పెద్దలకు జమ్మి కొమ్మలు ఇచ్చి, ఆశీర్వాదం తీసుకుంటారు.


విజయదశిమి రోజు తమ వస్తువులకు, వాహనాలకు జమ్మి చెట్టు దగ్గర పూజలు చేస్తారు. ఆ రోజు పాలపిట్టను చూస్తే అన్నీ శుభాలే జరుగుతాయని గట్టి నమ్మకం.


తొమ్మిది రూపాలలో అవతరించిన బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం సమర్పిస్తారంట. అందరూ ఆ రోజు మహిషాసురుడిని ఆదిపరాశక్తి చంపిందని ఘనంగా పూల ఉత్సవాలు చేస్తారంది అపూర్వ .


జమ్మి చెట్టులో మహాత్యాలేగాక ఎన్నో జబ్బులుకు పనికి వచ్చే ఔషధాలు ఉన్నాయట. వాళ్లకు జబ్బు చేస్తే ఆసుపత్రికి పోకుండా, ఆ తల్లి ఆకులు, బెరడుతో కషాయం చేసుకు తాగితే చిటికెలో మాయం అవుతాయట. అపూర్వ, ఆరోగ్య పోటీపడి చెబుతుంటే , విని యిన్ని తెలుసా వీళ్ళకు అని ఆశ్చర్యపోయింది ఆదర్శ.


బతుకమ్మ అంటే దిగివచ్చిన సజీవ దేవత, సాక్షాత్తు పార్వతీ దేవి!! సద్దుల బతుకమ్మగా /పెద్ద బతుకమ్మగా పూజిస్తారు.పెద్ద పళ్ళెంలో తంగేడి పూలు, గునగపూలు, బంతి, చామంతి , గుమ్మడి, వాము పూలతో పళ్ళెంలో అందంగా పేర్చి, పసుపుతో చేసిన దేవతారూపం శిఖరంలో ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. రక రకాల నృత్యాలు చేస్తారు.

చివరి రోజు పూజలు చేసి దగ్గరలో ఉన్న చెరువు, గుంట, నదిలో కలుపుతారు. ఆ పూలలోని ఔషదాలతో నీరు పరిశుద్ధమౌతుందని, పసుపు తీసి ముఖానికి రుద్దుకుంటే నిత్య సుమంగళిగా, ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.


బ్రతుకమ్మ తొమ్మిది పేర్లతో పూజలు అందుకుంటుంది. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానా బియ్యం , అట్ల బతుకమ్మలు, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ..


ఒక్కో రోజు ఒక్కో రకం నైవేద్యంతో ,పాటలతో పూజిస్తారు. ప్రతి రైతు - పంటలు బాగాపండాలని, మరు సంవత్సరం కూడా వర్షాన్నిదండిగా దయతలచమని , ఆరోగ్య ఐశ్వర్వాలు ఇమ్మని , వయసుకొచ్చిన పిల్లలు - కొత్త గుడ్డలు, నగలు వేసుకుని మంచి భర్తలు దొరకాలని , పూజింపతగిన అత్తా మామలు రావాలని , పెండ్లయిన వాళ్ళు - భర్తలు, పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా,సుభిక్షంగా ఉండాలని మొక్కుకుంటారు.


బతుకమ్మ పండుగ శరధృతువు, ఆకులురాలి పూలు పూసే కాలంలో మొదలవుతుంది. బతుకమ్మ బోడెమ్మ రుతువుల క్రమంలో జరిగే పండుగలు. వానాకాలం ముగిసిందని రుజువు”

అని మైమరచి చెపుతున్న అపూర్వ, ఆరోగ్యలను కౌగలించుకుని తనివి తీరా ముద్దులు పెట్టేసింది. ఆ దేవి ప్రతి రూపాలు వాళ్ళ కళ్ళల్లో మెరుస్తూ కనిపించాయి. ఏదో అద్భుత శక్తి తనలో కలిసిపోయినట్లు అనిపించి శరీరం గగుర్పొడిచింది.

సాగిపోతుంది వారి జీవితం పాల సముద్రంలో నావలా !! ఆరాట పడకుంటే జీవితం తను తాను సరి దిద్దు కుంటుంది కానీ ఓర్పు ఉండదు ఎవ్వరికీ. ఈ లోగా ఎంతో హైరానా పడిపోయి బ్రతుకుని దుఖమయం చేసుకుంటాము అని అనుకుంది ఆదర్శ. తనను ఆఫీసువారు వారానికి మూడురోజులు రమ్మని చెప్పారు.


ఆ పిల్లలకు తెలియని చారిత్రక విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాళుక్యులు వేములవాడ, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజరాజేశ్వరి దేవాలయం నిర్మించి, అత్యంత పెద్దదయిన శివలింగాన్ని ప్రతిష్టించారంట. చోళ రాజులు యుద్దంలో జయించి ఆ విగ్రహాన్ని అక్కడనుంచి తంజావూరుకు తెచ్చి బృహదీశ్వరాలయంగా అత్యంత రమణీయంగా పదమూదడుగుల ఎత్తు, అరవైఅడుగుల విస్తీర్ణంగల మహిమాన్వితమైన ఈశ్వరుని ప్రాణ ప్రతిష్ట చేసారు. చాలా మందికి తెలుసు ఇది తెలంగాణా శిల్పుల అపూర్వ సృష్టి అని.


దూరమైన మహేశ్వరుడు వేములవాడలోని పార్వతీ దేవి ఎడబాటును భరించలేక ‘బతుకమ్మగా ఈ విశ్వమంతా నిండి, నా తోడుగా చిరంజీవిగా ఉండు’ అని వరమిచ్చి కోరుకున్నాడట.


మరొక నమ్మకం.. గౌరీదేవి మహిషాసురుని చంపిన తరువాత అలసట తీర్చుకునేందుకు ఆశ్వయుజ పాడ్యమి రోజు నిదుర పోయిందట. భక్తులు ఆమెను లేపడానికి పూజలు సేవలు చేస్తే విజయ దశిమి రోజు లేచిందట .


మరో కధనం ప్రకారం, వేములవాడ చోళ మహారాజు ధర్మాంగద, సత్యవతి నూరుగురు కుమారులు యుద్ధంలో చనిపోతే, లక్ష్మీ దేవికి, యాగాలు, హోమాలు చేస్తే, ఆ రాజుకు లక్ష్మి దేవి ఆడపిల్లగా పుట్టిందట. ఆమె నూరేండ్ల సుఖమయ జీవితానికి ఋషులను వేద పండితులను పిలిచి ఘనంగా సత్కరిస్తే, వారు పాపను ‘బతుకమ్మ, బతుకమ్మ..’ అని ‘విశ్వం అంతం వరకు సజీవంగా ఉండు’ అని ఆశీర్వదించారట.


ఏది ఏమయినా బతుకమ్మ తెలంగాణా ప్రజల గుండెల్లో ఇష్టదేవతగా, మహిమాన్వితగా నిలిచి పోయింది..


కలెక్టర్ దగ్గరనుంచి డబ్బు వచ్చిన తరువాత భయం పోయి ధైర్యంగా , ఆత్మ విశ్వాసంతో ఉన్నట్లు అనిపించింది. ఇద్దరూ బాగా చదువుతున్నారు. ఇలాగే ఉంటే స్కాలర్షిప్ తెచ్చుకుని పెద్ద చదువులు తప్పక చదువుతారని గట్టి నమ్మకం కుదిరింది. భర్త తాగుడును మరిచిపోయింది ఆదర్శ. బతుకమ్మనే నమ్ముకుంది.


కొంతకాలం అయిన తరువాత అపూర్వ, ఆరోగ్యల ప్రవర్తనలో చాలా మార్పు కొట్టొచ్చినట్లు కనిపించాయి. అడిగితే ఏం లేదక్కా ఏంలేదు అని తప్పించుకు పోవడం తప్ప ఏవిటో చెప్పేవారుకాదు. బహుశా అమ్మానాన్నలు గుర్తుకొస్తున్నారేమోనని దగ్గరకు తీసుకుని ఎంతో ధైర్యం చెప్పి సముదాయించేది. అది అంతగా వాళ్ళమీద పని చేసినట్లు లేదు. తను భరించలేక పోయింది.


ఒక రోజు గట్టిగా నిలదీసి అడిగితే చివరకు, “ మేము వేరేగా ఎక్కడయినా ఉంటా మక్కా !” అన్నారు. కూలబడిపోయింది. ఇక్కడ ఉండటంకూడా ఇష్టం లేదా, తను వాళ్ళను సరిగా చూడటంలేదా అని పరితపించిపోయింది. ఇది డబ్బువలన వచ్చిన ఆలోచనా..?


చాలా సేపటికి ఎదురుగా ఉన్న వాళ్ళను చూసి, ‘సరే.. మీఇష్టం. అలాగే’ అని వెంటనే, “ హాస్టల్లో ఇద్దరూ ఒకే దగ్గర ఉండలేరు కదా! మరి బైట...?”అని అడిగింది.


దాంతో ఆరోగ్య,” నేను, అక్క ఒకే దగ్గర ఉండాలి” అని మొండికేసాడు. అపూర్వకు ఏం చెప్పాలో తెలియ లేదు. “అందరం ఇక్కడ ఉంటేనే అది వీలుపడుతుంది. ఆలోచించండి” అని చెప్పి లోపలికెళ్ళింది.


రోజూ తనదగ్గర పడుకునేవారు ఆ రోజు వేరే పడుకుంటానన్నారు. కాస్సేపు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడుకుంటారేమోనని సరేనంది.


మరుసటి రోజు రాత్రి డ్యూటీనుంచి వచ్చేసరికి పొద్దుపోయింది. ఇంట్లో లైట్లు వేసినట్లు లేదు. సహజంగా అన్నీ పనులు చేసేసి, లైట్లువేసి, గేటు దగ్గర నవ్వుతూ స్వాగతం చెప్పేవారు. వెళ్లి పోయారా? గుండెలు గతుక్కుమన్నాయి. పరుగు మీద వచ్చి పిలుస్తూ, లైటు వేసింది. అంతే హటాత్తుగా బోరున ఏడుస్తూ పిల్లలు ఆదర్శను చుట్టేశారు. ఎంత దూరం చేసినా వదలలేదు. ఎంత సేపు ,మామ..మామ అంటూ గుండెలు బాదుకోసాగారు. ఆదుర్దాగా వెళ్లి చూసింది తాగి పడిపోయాడేమోనని. ఎదురుగా నేలమీద రక్తపు మడుగులో అతను... కత్తి గొంతులో!!


పిచ్చి పట్టినట్లు అపూర్వ ,ఆరోగ్య వైపు చూసింది. బోరున ఏడుస్తూ వణికి పోతున్నారు. అపూర్వ వైపు పరిశీలించి చూసింది. గుడ్డలునలిగిపోయి, ఎదమీద గుడ్డ చినిగి పోయి, ముఖం ఎర్రగా కందిపోయి.. రక్తపుగాట్లు!!


అర్ధమైపోయింది . అలాగే కూలబడిపోయింది.


అపూర్వ, ఆరోగ్య వచ్చి కాళ్ళమీద పడిపోయారు.


అలాగే శూన్యంలోకి చూస్తుండి పోయింది. ఏం చెయ్యాలి..ఏం చెయ్యాలి తల తిరిగి పోతుంది. గుండె పగిలిపోయేటట్లు హోరెత్తిస్తున్నాయి. కాళ్ళూ చేతులు ఆడలేదు.


అపూర్వ ఏదో చెపుతుంది.. ‘మావ, మస్తు తాగొచిండ్రు ... తమ్మున్ని తాళ్ళతో కట్టేసిండ్రు ..నన్ను.. .లొల్లి ..లొల్లి ...పైన ...?’ మాటలు వినిపించలేదు.


కటిక చీకటి కమ్మేసింది.

“అక్కా! నీ కండ్లనుంచి నెత్తురు కారుతున్నాదే! పెయ్యంతా చెమట కారిపోతున్నాదే ! మొకానికి అంతా నెత్తురు. కాళికమ్మ..” అంటూ గావుకేక పెట్టింది అపూర్వ .


అప్పుడు ఈ లోకంలోకి వచ్చి గబగబా కత్తి అతని గొంతులోనుంచి లాగి, పదిసార్లు కడిగి దూరంగా విసిరేసింది. అది చేతికి తగిలి దూరంలో ఉన్న కిరోసిన్ సీసా కిందపడి ఇల్లంతా పారింది. నిలిచి రూం అంతా చూసింది. అన్నీ కిటికీలు వేసున్నాయి. బయట ఎలాంటి శబ్ధం లేదు. గ్యాసు పూర్తిగా తిప్పి నిలబడింది.

“రండి.. పోదాం” అంటూ వాళ్ళిద్దరినీ లాక్కుంటూ బయటకు వస్తూ అగ్గిపుల్లను వెలిగించి లోపలికి విసిరేసింది. కాసేపటికి మంటలు ఉవ్వెత్తున లేచాయి.

“నన్ను క్షమించు, వీళ్ళను కాపాడు” అంటూ బతుకమ్మను వేడుకుని నమస్కరిస్తూ పడిపోయింది ఆదర్శ.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి,

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


Comments


bottom of page