ఐదొందల నోటు
- Malla Karunya Kumar

- May 29
- 3 min read

Aidondala Notu- Telugu Emotional Story | Malla Karunya Kumar
ఐదొందల నోటు - తెలుగు భావోద్వేగ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In manatelugukathalu.com On 29/05/2026
అమెరికాలో పెరిగిన పిల్లలతో స్వగ్రామానికి వచ్చిన రామచంద్రకు ఒక అనుకోని అనుభవం ఎదురవుతుంది.
చిన్ననాటి అనుబంధమైన లక్ష్మవ్వ మాటలు అతని ఆలోచనలను మార్చేస్తాయి.
తరాలకు అందించాల్సిన నిజమైన సంపద ఏమిటో ఈ కథ మనసును కదిలిస్తుంది.
ఆప్యాయతలు, మాతృభాష, కుటుంబ విలువల గొప్పతనాన్ని చెప్పే భావోద్వేగ గాథ.
ఎప్పుడు కనిపించినా కలిసినా చాలా ఆనందిస్తూ నేను ఇచ్చిన డబ్బుల్ని ఆనందంగా స్వీకరించే లక్ష్మవ్వ ఈరోజు వెర్రిచూపులు చూస్తుంది!
"అవ్వా! ఏమైంది? నన్ను గుర్తు పట్టావు కదా, గోవిందం గారి అబ్బాయిని, రామచంద్రను." నా గురించి గుర్తు చేశాను.
"రామచంద్రా! గుర్తు పట్టాను. వీళ్ళు?" పక్కనే ఉన్న నా పిల్లల్ని చూస్తూ అడిగింది.
"నా పిల్లలే, కొడుకు కూతురు. అమెరికాలో చదువులు." నవ్వుతూ చెప్పాను.
"అవునా! మంచిది." అని అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్లను దగ్గరకు తీసుకోబోయింది, ఆమె ఆహార్యాన్ని చూసి కాస్త అసహనపడుతూ వెనక్కి జరిగారు.
మనసు చిన్నది చేసుకొని నా వైపు చూసింది లక్ష్మవ్వ. నేనే కల్పించుకొని, "లక్ష్మవ్వ! వాళ్ళకు తెలుగు సరిగ్గా రాదు, అక్కడే పుట్టి పెరిగారు కదా, అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు. కొంచెం కొంచెం అర్థం అవుతుంది." అని నచ్చచెప్పాను.
కాసేపు మౌనం దాల్చి నా వైపు చూసి, పిల్లల వైపు చూసి. “రామ! మీ నాన్నగారు ఈ ఊరికి పెద్ద దిక్కు, అలాగే శ్రీమంతులు, కానీ ఎప్పుడూ స్థాయిలు చూసేవాళ్ళు కాదు, మనిషిని మనిషిలా చూసేవారు. అంతెందుకు, నువ్వు చిన్నప్పుడు నా చుట్టూ తిరుగుతూ నన్ను కథలు చెప్పమని అల్లరి చేసేవాడివి కదా. ఎన్నో విషయాలు అడిగి తెలుసుకునేవాడివి కదా, ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసి చాలా ఆనందించాను. నీ పిల్లల్ని చూసి చాలా మురిసిపోయాను.
చిన్నప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినట్టుగా వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు అనుకున్నాను. నువ్వు నా గురించి వాళ్లకు చెప్పుంటావు అనుకున్నాను. సర్లే, అవన్నీ కాదు. ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడుదాం అన్నా వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు? కనీసం మీ తల్లిదండ్రులు గురించి, మీ పూర్వీకులు గురించి, మన ఊరి గురించి అయినా వీళ్లకు చెప్పావా?" లక్ష్మవ్వ కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా వస్తున్నాయి.
ఒక్కసారిగా లక్ష్మవ్వ మాటలు నన్ను ప్రశ్నల సుడిగుండంలో నెట్టేశాయి. ఆమె మాటలు నన్ను సతమతం చేస్తున్నాయి. చిన్నప్పుడు నాన్న, తాతయ్య మిగిలిన కుటుంబ సభ్యులు నన్ను వెంట తిప్పుకొని ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు, నలుగురు స్నేహితుల దగ్గరకు తీసుకువెళ్లి నా గురించి చెప్పేవాళ్ళు.
ఆలయం తీసుకువెళ్లి ఈ ఆలయం చరిత్ర ఇది అని, ఇక్కడ కొలను రాజుల కాలం నాటిది అని, ఇలా ప్రతి విషయం గురించి చెప్పేవాళ్ళు. ఉత్సవాలు జరిగిన రోజుల్లో నన్ను భుజాలపై ఎక్కించుకొని వాటిని చూపిస్తూ తిరిగేవాళ్ళు. ఇవన్నీ నాకు గుర్తుకొచ్చి నేను పిల్లలకు పంచాల్సింది ఏమిటో మరిచిపోయాను అని తెలిసింది.
నా పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ మన అస్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలి కదా? అమ్మ భాష, కమ్మని భాష మాధుర్యాన్ని కూడా పంచాలి కదా అన్న మాట మరిచిపోయాను. ఇక్కడ వారసత్వ సంపద గురించి వివరంగా చెప్పడం మరిచిపోయాను.
ఎప్పుడూ నాన్న చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి, "నిన్ను ప్రేమించే మనసులు దగ్గరకు వెళ్ళు. నువ్వు వెళ్తున్న దారి, వెళ్ళాల్సిన దారి ఇంకా స్పష్టం అవుతుంది." అన్న మాట. ఈరోజు ఎంతగానో ప్రేమించే లక్ష్మవ్వను కలువగానే నేను ప్రయాణించాల్సిన మార్గం ఏమిటో స్పష్టమైంది.
ఇంతలోనే లక్ష్మవ్వ నా దగ్గరకు వచ్చి నా చేతిలో ఉన్న ఐదొందల నోటు తీసుకొని, "రామ! నీకు ఇచ్చేంత స్తోమత నాది కాదు. ఈ నోటు నీదే. మళ్లీ నీ పిల్లలకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నోటు వాళ్ళు చూసిన ప్రతిసారి నేను గుర్తుకు రావాలి, నేను చెప్పిన మాట గుర్తుకురావాలి, మనుషులు, ఆప్యాయతలు ముఖ్యం అన్న మాట గుర్తుకు రావాలి." అని అంటూ పిల్లల దగ్గరకు చేరుకొని వాళ్ల చేత ఆ నోటు పెట్టింది లక్ష్మవ్వ.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.












Comments