అమ్మ మంచం

Amma Mancham - Telugu Emotional Family Story | Penumaka Vasantha
అమ్మ మంచం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 15/10/2026
అమ్మ మంచం – హృదయాన్ని కదిలించే తెలుగు కుటుంబ కథ
అమ్మ ప్రేమకు మరణం కూడా ముగింపు కాదని గుర్తుచేసే హృద్యమైన కథ ‘అమ్మ మంచం’. తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయాన్ని ఈ కథ తాకుతుంది.
వదిన కాల్ చేసింది... "మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. మీ అమ్మ జ్ఞాపకాలను మరువలేకపోతున్నాం ఆ ఇంట్లో ఉంటే. అందుకని వేరే ఇంటికి వెళ్తున్నాం.
నీకు మీ అమ్మ మంచం కావాలా?"
"ఆ! నాకు ఎంతో ఇష్టం ఆ మంచం."
పుట్టింటికి వెళ్లగానే ఆ మంచంపై అమ్మ దగ్గర పడుకుని కబుర్లు చెప్పుకోవటం గుర్తొచ్చి ఒక్క నిమిషం కళ్లు చెమ్మగిల్లాయి.
అలాంటిది అమ్మ ఎక్కువ శాతం పడుకున్న ఆ మంచం ఇస్తానంటే... జ్ఞానపీఠ అవార్డ్ వచ్చినట్లుగా అనిపించి, "ఆ, పంపించు వదినా!" అన్నాను ఎంతో సంతోషంగా.
అప్పుడే అమ్మ పోయి నాలుగు మాసాలు అవుతుంది. అందరికీ కలలోకి వస్తోంది. మా అన్నయ్యగారి అబ్బాయికి కల్లోకి వచ్చింది.
"ఏంటిరా? నాకు ఈ పిచ్చి చీర కట్టారు! ఇంకా ఈ తాళ్లతో బంధించారు, ఊపిరి ఆడటం లేదు. నువ్వు మీ అత్తలను చూసుకో జాగ్రత్త!" అని చెప్పిందిట.
నాకు మాత్రం కల్లోకి రావటం లేదు.
ఇంట్లో వంటమనిషి లక్ష్మికి కూడా కలలోకి వచ్చి, "లక్ష్మీ! పుదీనా పచ్చడి చేయి," అంటే... పుదీనా కొనుక్కుని వచ్చి పచ్చడి చేసింది లక్ష్మి.
తనకు సాయంగా ఉన్న ఆయాలకు కూడా కలలోకి వచ్చింది. "మీ అమ్మాయి టెన్త్ పాస్ అయిందా?" ఇలాంటి ప్రశ్నలు వేసిందిట.
రోజూ అమ్మ మంచం మీద పడుకుని... "అమ్మా, నిన్ను నేను సరిగా చూసుకోలేదని నా మీద నీకు కోపంగా ఉంది కదూ! ప్లీజ్ అమ్మా! ఒక్కసారి నా కల్లోకి రా అమ్మా...!" అని ప్రతిరోజూ వేడుకుంటున్నా ఇంకా ఎందుకు నువ్వు కల్లోకి రావటం లేదు?
తెల్లవారుజామున లేచి వాష్‌రూమ్‌కి వెళ్లాను. వచ్చి పడుకున్నానో లేదో... "వసంతా...!" అన్నట్లుగా వినిపించింది. అది అమ్మ గొంతే!
"అమ్మా...! ఎక్కడున్నావు నువ్వు?" పెద్దగా అరిచాను.
"అబ్బా! అరవకే... చెవులు పోతున్నాయి. ఇదిగో నీ ముందు ఉన్నాను. కానీ నువ్వు వెళ్లి మన ఊరి వాళ్లందరినీ పిలువు."
"అలాగే అమ్మా!" అని అందరికీ ఫోన్ చేశాను... "మా అమ్మ వచ్చింది, అందరూ రండి!"
ఇప్పుడు అమ్మ వైపు చూశాను. అమ్మ పెద్ద జరీ చీరలో, మెడలో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంది.
"అమ్మా! ఎలా ఉన్నావు?" నాలుగు నెలల తర్వాత అమ్మను చూసి ఆత్రుతగా అమ్మ పక్క కుర్చీలో కూర్చుంటూ అడిగాను.
"బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు?" నా చీర వైపు చూస్తూ... "ఇది తప్ప నీకు ఇంకోటి దొరకలేదా? ఇక్కడ పడేసి వెళ్లు, కొత్త చీర కొన్నాను తీసుకెళ్లు," అంది అమ్మ.
నాకు అమ్మ హృదయం తెలుసు కాబట్టి నవ్వి, "బాగున్నాను. అదేంటి, ఒక్క మాట చెప్పకుండా అలా వెళ్ళిపోయావు?" అంటూ కోపంగా చూస్తూ అడిగాను.
"ఎలా పోయాను? 'ఆ పైకి పోతున్నా' అని చెప్పి పోతారా? అదేమైనా ఊరా చెప్పి పోవటానికి? వాన రాకడ, ప్రాణం పోకడ తెలుస్తుందా? ఇంకా నీకు ఈ పిచ్చి వాగుడు తగ్గలేదే! నేను బతికుండగా తెలివి రాదు దీనికి అనుకునేదాన్ని, నేను చచ్చాక కూడా ఇంకా నీకు తెలివి రాలేదు. పిల్లలందరూ ఫోన్లు చేస్తున్నారా?"
"ఆ... చేస్తున్నారు. అమ్మా, తెలివి లేనిదాన్ని కదా... ఎలా వెళ్లావు అమ్మా నన్ను వదిలేసి?"
"బాగుందమ్మా! ఇక్కడే శిల వేసుకుని ఉంటానా ఏంటి? పుట్టినాక ఏదో ఒకరోజు పోక తప్పదు. ఇంకా కొన్నాళ్లు ఉండి అందరికీ నేనంటే రోత పుట్టేదాకా ఉండకూడదు. భూమి మీదకు వచ్చాను, బాధ్యతలు తీరాయి, పోయాను."
"కాదమ్మా! ఇంకొన్నాళ్లు ఉండాల్సింది. మా అబ్బాయి, అన్నయ్యగారి అబ్బాయి పెళ్లి అయ్యేదాకా ఉండాల్సింది," అంటూ అమ్మ చెయ్యి నొక్కుతూ అన్నాను.
"నువ్వు చెప్పేది భలే బాగుందే! పుట్టిననాడే రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతను మార్చి నేను ఇక్కడే ఉంటానా? కాస్త బుర్ర వాడు! నా మునిమనవళ్ల, మనవరాళ్ల పెళ్లిళ్లు, ఇంకా వాళ్ల వాళ్ల పిల్లల పెళ్లిళ్లు అయ్యేదాకా ఉంటానంటే యముడు ఊరుకుంటాడా? ఇన్ని కబుర్లు చెప్పే నన్ను జనాలు 'అబ్బా పోవమ్మా' అనిపించుకోకుండా డిగ్నిఫైడ్‌గా వెళ్లాలి.
ఈ సోది ఆపి అసలు మేటర్లోకి రా! మన వాళ్లు ఎక్కడదాకా వచ్చారో కనుక్కో. పోయేప్పుడు అందరికీ చెప్పి వెళ్లడం అలవాటు. ఆరోజు చెప్పకుండా వెళ్లాను... 'ఈమె అందరికీ చెప్తుంది, నీతులు ఆమె పాటించదు' అని మనూరి వాళ్లు ఏమనుకుంటున్నారో?" అంది అమ్మ బాధగా.
ఈలోపు "తులసమ్మ వచ్చింది" అంటూ అందరూ వచ్చి కూర్చున్నారు. అందరితో ఎంతో కలుపుగోలుగా అన్ని విషయాలు మాట్లాడింది. నాకు, అక్కకు, చెల్లికి అమ్మతో మాట్లాడదామంటే కుదరటం లేదు.
అక్క బయటికి వెళ్లి "అమ్మా, ఒకసారి లోపలికి రా!" అని పిలిచి అన్నం పెడితే... తిని, "రమా! గోంగూర పులుసు కూర బాగుంది. ఎంత అన్నం తిన్నానో! నీ ఆరోగ్యం జాగ్రత్త!" అని, "వసంతా! నువ్వు మళ్లీ ఆ ఫోన్ చూస్తున్నావా? ఎక్కువ చూడకు, గుడ్డిదానివి అవుతావు," అంది.
మా చెల్లిని చూసి... "ఈ బుజ్జి మళ్లీ ఆఫీసు పనిలో పడింది," అని విసుక్కుంది.
"అమ్మా! ల్యాప్‌టాప్ మూశాను, కూర్చోమ్మా...!" అంది బుజ్జి.
"ముందు నువ్వు తల గట్టిగా దువ్వుకో, చూడలేక చస్తున్నాను!"
'నాకేమీ అక్షింతలు లేవు' అని నేను అనేలోగా... "వసంతా! నైటీ మార్చుకో.
ఇప్పుడే చీర కొంగుతో వరండా తుడిచావు. మిగతా వాళ్లు ఎలా ఉంటారే? ఆ వరాలును చూడు, తల దువ్వుకుని చీర నలగకుండా ఎలా ఉంటుందో! నా కళ్లు పాపిష్టి కళ్లు, వైనం లేని పిల్లలు పుట్టారు," అంటూ మమ్మల్ని విసుక్కుని బయటకు పోయింది.
"అక్కా...! బుజ్జీ! అమ్మకు ఆరు వరకే టైమ్ ఇచ్చాడు యముడు. పదండి, అమ్మ దగ్గర కూర్చుందాం ఈ కాసేపైనా..." అంటూ వాళ్లని తీసుకుని బయట వరండాలోకి వెళ్లాను.
అందరితో గవ్వలాట, పేకాట ఆడింది. "అందరికీ సెలవు! ఇక నేను వస్తాను, మీకు ఎప్పటికీ కనపడను," అని ఎదురుగా ఉన్న గోడలోకి మాయమైపోయింది.
'అయ్యో! మనం మనసు విప్పి మాట్లాడుకోలేదే, వీళ్లందరూ అమ్మతో కబుర్లు చెప్పారు' అనుకుని బాధపడ్డాం ముగ్గురం సిస్టర్స్.
డాక్టర్ అన్నయ్య వచ్చాడు. "అమ్మ ఏది? వచ్చిందిట కదా! కేసులు చూసుకుని వచ్చేప్పటికి లేట్ అయింది. అయ్యో! నేను అమ్మను చూడలేదు," అని ఒకటే బాధపడ్డాడు.
"అబ్బాయీ...!" అన్న మాట పక్కనున్న గోడ నుండి వినబడింది.
"అమ్మా...!" అంటూ గోడ వైపు చూశాడు.
"అరె! నాకు టైమ్ అయింది, వెళ్లాను గానీ ఎలా ఉన్నావురా? వేళకు భోజనం చేస్తున్నావా?"
"అమ్మా! ఎందుకమ్మా నన్నొదిలి వెళ్లావు?" అని కళ్ల నీళ్లు తిరుగుతుంటే అడిగాడు.
"అరె! నాకు ఈ జన్మకు రుణం తీరిందిరా. ఇంకా ఎక్కడ ఉండేది చెప్పు? నువ్వు వేళకు అన్నం తినరా, అదే నాకు కావాల్సింది."
"అలాగే అమ్మా...! నువ్వు ఇంకొన్నాళ్లు ఉండాల్సింది," బాధగా అన్నాడు.
"ఇప్పటిదాకా అందరూ ఇదే వాగుడు వాగి చంపారు. ఏంటి? ఆల్రెడీ చచ్చానుగా నా బొంద!"
"పంచ్ డైలాగులు మాని సరిగా మాట్లాడు పంచమి మాతా!" అన్న నా డైలాగ్‌కి అందరూ నవ్వారు.
అన్నయ్య, "అమ్మా, నీకు అక్కడ ఎలా ఉంది?" అన్నాడు.
ఇక్కడైతే ఏమీ బాగోలేదురా!"
"అదేంటమ్మా? ఏమైంది? ఇక్కడకు రా అమ్మా! ఇంకా మంచి డాక్టర్లకు చూపిస్తాను."
"మొన్నమటుకు తక్కువ వైద్యం చేశారా నువ్వు, కోడలు? డబ్బులు బాగా ఖర్చు పెట్టావు. చూసుకో నాన్న! అయినా అబ్బాయీ... చచ్చినదానికి ఏమి వైద్యం చేయిస్తావు? కాస్త మాట్లాడేముందు చూసుకుని మాట్లాడటం నేర్చుకోండిరా! కోడలు ఏది? పిల్లలేరి?"
"ఇదుగోనండి! నేను ఇక్కడే ఉన్నాను. ఎలా ఉన్నారు?" అంది కోడలు.
"బాగున్నానే... అరె లస్సీ, అభీ... నాన్నలు జాగ్రత్తరా!"
ఇక గొంతు వినబడలేదు.
ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. అమ్మ లేదు... అమ్మ లేని మంచం నన్ను వెక్కిరించింది.
మళ్లీ మంచంపై పడుకుని... "అమ్మా... ఇంకా ఏదైనా మెసేజ్ ఇస్తావనుకున్నాను, ఏమీ ఇవ్వకుండా మాయమయ్యావు ఎందుకు?" అని అమ్మ మంచాన్ని ప్రశ్నించాను.
"నీకు ఎన్ని మెసేజులు ఇచ్చినా వింటావా? పెడతావా? నువ్వు ఏమి చేయాలనుకుంటావో అదే చేస్తావు. కాస్త ఎదుటివాళ్లు చెప్పింది ముందు లోపలికి దూర్చుకో.
'నాకు తెలుసులే' అన్నట్లు ఉండకు. ఏమోలే... బాగుండు. చచ్చి నిన్ను ఇంకా సాధించటం ఏంటి? జాగ్రత్త తల్లి! ఇక్కడ ఉన్నా నీ మీదే నా ధ్యాస అంతా!"... అమ్మ మంచం చెప్పినట్లుగా అనిపించింది.
'ఓకే అమ్మా, నువ్వు చెప్పింది పాటిస్తాను'.
అన్నట్లు ఇవాళ అమ్మ నెలమాసికం, నాకొచ్చిన ఈ కల గురించి అందరికీ చెప్పాలి' అనుకుంటూ మంచం దిగాను.
పరుపు తీసి ఎండ వేద్దామని పరుపు ఎత్తితే... పరుపు కింద ఉన్న సీక్రెట్ సొరుగు కనిపించింది. అంతా క్లీన్ చేద్దామని ఆ సొరుగు ఓపెన్ చేశాను.
దానిలో డబ్బు ఉంది! ఎంతని చూస్తే... ఒక లక్ష రూపాయల దాకా ఉన్నాయి. కింద చిన్న చీటీ ఉంది:
"నీకోసం దాచాను వసంతా ఇవి. నీకు దేనికైనా పనికివస్తాయని... నీ అక్క, చెల్లి, అన్న కంటే నీకే కాపురం సరిగా లేదు. నీకు అవసరమైనప్పుడు వాడుకో."
ఆ చీటీ చదవగానే... 'అమ్మ ఉన్నప్పుడు సరే, పోయాక కూడా నన్ను చూస్తున్నావా?' అని కళ్లల్లోంచి నీళ్లు కారాయి.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.












Comments