top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 11


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 11' New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 11' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


మూడు రోజులాగి మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తుంది మంగళ.

తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.

తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది. భర్తతో తాను రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చదవమంటుంది మంగళ.

పవన్ కేస్ టేకప్ చేయబోతున్నట్లు అందులో రాసి ఉంటుంది మంగళ. పవన్ అరెస్ట్ కి కారణమైన శ్రీనిత్యను కలుస్తుంది.

మంగళకు సహకరిస్తానని శ్రీనిత్య చెబుతుంది.

మంగళను కలవడానికి అశ్వథ్ వస్తున్నట్లు చెబుతుంది భారతమ్మ.ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 11 చదవండి.


ఆ రోజంతా మంగళ మనసు ఉత్సాహంతో ఉరకలెత్తింది. అణువణువునా ఆనందోల్లాసం తనువెల్లా ప్రవహించింది. తన సీనియర్ అప్పగించిన కోర్టు ఫైల్సు త్వరగా అప్ డేట్ చేసి మునుపు వివిధ కోర్టుల్లో వెలువడిన ప్రెసిడంట్ కేసుల్ని ట్యాగ్ లతో లింక్ చేసి పెందలకడే ఇల్లు చేరింది; కళ్ళనిండా వత్తులు పెట్టుకుని.


చాలా రోజుల తరవాత ఆమె తన ప్రాణ సఖుణ్ణి చూడ బోతుంది. కళ్ళల్లో కళ్లుపెట్టి కబుర్లాడబోతుంది.


ఇటాలియన్ వర్కుతో అల్లిన లేత పచ్చరంగు చీర కట్టుకుంది. ఎంబ్రాయిడరీ లేసుతో మెరిసే బ్లౌజ్ వేసుకుంది. నిలువు టద్దం ముందు నిల్చుని తనను తను మరోమారు చూసుకుంది. బ్రహ్మదేవుడు వరం ప్రసాదించినట్టు- తన మగాడి మతిని పోగొట్టే నిండు సొందర్యమే తనది! మరి ఈ నిండు రూపాన్ని అందిపుచ్చుకోగల నిండు మనసు గలవాడు, తన మనసెరిగిన వాడు- తనవాడు దరిచేరాలి కదా!


అప్పుడే కదా తన యవ్వనశోభ మందార మొగ్గలా విప్పారి వికసిస్తుంది. ఏదే యేమైతేనేం అశ్వథ్ ఎట్టకేలకు తనను చూడటానికి రాబోతున్నాడు. తన జీవన సహచరుణ్ణి చూసి ఎన్నాళ్ల యింది! మాఁవిడి కొమ్మల మాటున కొబ్బరి ఈనెల సందున ఎన్ని వెన్నెల రాత్రులు దోనె నుండి రాలిపడ్డ అమృతధారల్లా కరిగి కనుమరుగయాయో! సన్నగా నిట్టూర్చింది మంగళ.

ఏకాంతసేవలోని పద్యాన్ని మనసున తలపోసుకుంది- ‘ప్రముదిత ప్రాణ పవనాంకురముల తోడ- సలలితోదయ పవనముల్ సంక్రమించె- విభుని శ్రీపాదముల గొల్పు వేళయేమొ- రమణేకాంత సేవకు సమయమేమో”


కొద్ది సేపు తరవాత ఆమె యవ్వన మలయమారుత నిట్టూర్పులకు ఆపుదల వచ్చింది.

బయట డోర్ బెల్ మ్రోగింది. మంగళ చెంగున లేచి మరొక యోచనకు ఆస్కారం లేకుండా తలుపు బార్లా తీసింది. అక్కడే- తనొక మౌనరాగమై మూగగా చూస్తూ నిల్చుండి పోయింది.


పెదవుల ఓరన చిరు నగవును దాచుకుంటూ అశ్వథ్ అన్నాడు- “నన్ను లోపలకు రానిస్తావా! లేక నేనే చొచ్చుకు రానా? ”


ఆమె యెట్టకేలకు తేరుకుని అంది- “ఈసారి కూడా రారేమోననుకున్నాను”


గడపదాటి లోపలకు వస్తూనే మళ్ళీ అన్నాడతను- “ఎందుకనుకున్నావు? ”


“మొన్న వస్తానని కబురందిచ్చి ఆఖరి క్షణాన ఆగమనాన్నిమంత్రి వర్యుల్లా రద్దు చేసుకోలేదూ! ”

“మొదట నీ ధోరణిలో చెప్తాను. నీకిష్టమైన రీతిలో చెప్తాను. ’రానని రాలేనని ఊరకే అంటాను. రావాలని లేనిదే ఎందుకు వస్తానూ! ’ ఇక మేటరాఫ్ ఇంపోర్టెన్సుకి వస్తాను. నిర్వహణ కార్యాలు. పెక్కు రాచరికాలు- అనివార్య కారణాలు. నాలుగు చేతులున్నట్టు పనిచేయాల్సి వచ్చింది. విజిలెన్సు ఇన్ స్పెక్షన్ రిపోర్టులు- సెంట్ర ల్ బ్యూరోల కోసం నివేదికలు తయారు చేయాల్సి వచ్చింది. మొత్తానికి కత్తి మీద సాము చేసానన్న మాట. అయినా నిరీక్షణలో మాధుర్యం ఉంటుందని నువ్వేగా అనేదానివి- పింగళి వారి సినిమా పాటను పాడి వినిపించి- ‘విరహం కూడా ఓ రకమైన సుఖమే కదా!’ అంటూ- ”


అంతలో హాలులో ఇద్దరి గొంతులూ వినిపించి- “వచ్చేసారా అల్లుడుగారూ!” అంటూ ఊర్మిళాదేవి పలకరించింది. అత్తగారి గొంతున ద్యోతకమవుతూన్న ఆప్యాయతను అతడు గుర్తించక పోలేదు. ఎందుకో ఎట్టెదుట తల్లిని చూస్తున్న అనుభూతి కలిగింది.


‘ఈ ప్రపంచంలో తనను ఆదరించి అక్కున చేర్చుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు!’ అన్న పూరింపుతో నిండిన మనసుతో వెళ్ళి అత్తగారికి నమస్కరించాడు అశ్వథ్. ఆ తరవాత తిన్నగా లోపలకు వెళ్లి మామగారికి మర్యాదలర్పించి కాసేపాయనతో కబుర్లాడి హాలులోకి వచ్చి చూసేసరికి అక్కడ మంగళ లేదు. అత్తయ్యేమో తన కోసం యేదో చేసి పట్రావడానికి వెళ్లినట్లుంది. వాళ్ళ పనావిడ జాడ కూడా ఎక్కడా కనిపించలేదు, చాలానాళ్ళకు కలుసుకుంటూన్నభార్యా భర్తల మధ్య పానకంలో పుడకలా తనెందుకు ఉండాలని నాజూకుగా తప్పుకుందేమో--


ఆడదానికి మరో పేరు అనుమానం కాదు; అసలైన పేరు అలుక. కరాఖండీగా చెప్పాలంటే అలుక తను వహించాలి, చెంతన సరైన సమయాన భార్య తోడుగా లేదన్న విరహ వేదనతో. మరి నేడేమో మంగళ అవన్నీ చూపిస్తూంది. అందాలున్న ఆడదానికి బెట్టెక్కువే! నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ మంగళ గదిలోకి వెళ్ళాడు. నిడుపాటి మల్లెచెండును కొప్పులోకి కుదురుగా తురుముకునేందుకు తంటాలు పడుతూంది. ”అది వసంత వేళ! ఇదేమో మల్లియల వేళ” అతడు నవ్వుకుంటూ వెళ్ళి మల్లె చెండుని మంగళ జుత్తులోకి తురుమి భార్య అందాన్ని కళ్లనిండా నింపుకుని అన్నాడతను- “అబ్బ! కళ్ళు మూసుకోవాలనిపించడం లేదు“


“ఎందుకో మరి! “అందామె భర్త మాటలోని మార్దవానికి లోలోన మురిసిపోతూ కరిగిపోతూ.


“ఎందుకో చెప్పేదా! ” అడిగాడతను. ఉఁ- అందామె.


అప్పుడతను ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు- ఆమె శరీరం నుండి తెరలు తెరలుగా విరజిమ్మే సుగంధ సౌరభాలను ఆస్వాదిస్తూ-- ఆమెను తాకకుండానే అన్నాడు- “ ఒక్క క్షణం గాని ఆదమరుపున కళ్లు మూసుకుంటే ఇంతటి అందమూ అర నిమిషంలో కనుమరుగయి పోతుందేమోనని! ”


“ఉఁ- అలాగే! స్వీకరిస్తాను తమ పరిమళభరితమైన పొగడ్తని. మరి అంతటి రసిక మహారాజులయితే కట్టుకున్న పెళ్ళాన్ని చూడడానికి ఇంతటి తాత్సారమా! ”


అశ్వథ్ బదులివ్వలేదు. జ్ఞాపకాల దొంతర్లను మోసుకుంటూ భార్యను చూస్తూ ఉండిపోయాడు. దీనిని మాటరాని మౌనమనాలో లేక మాటకారితనమనాలో-- కొద్ది సేపు తరవాత ఆలోచనా తరంగాల నుండి తేరుకుంటూ ముఖాన నవ్వు తెచ్చు కుంటూ అన్నాడు అశ్వథ్- “అలా బైటకెళ్లి వెళ్ళొద్దామా? ”


“నేనే అలా ఆరుబైటకి వెళ్ళొద్దామా- అని అడగాలనుకుంటున్నాను. మీరే చెప్పారు. ముందు స్నానం చేసి ఏదైనా కడుపులో వేసుకు ని ఆ తరవాత కదులుదాం. సరేనా! ”అంటూ చారడేసి కళ్ళకు కాటుక దిద్దుకుని మిగిలి పోయిన అలంకరణను పూర్తి చేయడంలో మునిగిపోయింది మంగళ.


ఆమెకు తెలుసు- ఎట్టి పరిస్థితిలోనూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఉద్విగ్నతకు లోను కానివ్వకుండా ముఖాన చిర్నవ్వు యేమాత్రమూ చెదరకుండా చూసుకోవాలని. దూరాన తన పని తను చేసుకుంటూనే ఓర చూపులతో వాళ్ళిద్దర్నీ ఊర్మిళాదేవి దూరం నుంచి గమనిస్తూనే ఉంది. అల్లుడూ కూతురు మధ్య నిజంగా యేమీ లేదు కదా! ఐనా ఆమె మనసు ఇంకా పీకుతూనే ఉంది.

అశ్వథ్ స్నానపానాదులు ముగించి తను అత్తగారింటికి చేరినట్టు తల్లికి ఫోను కాల్ ఇచ్చి చకచకా మెట్లు దిగి పోర్టికోలోకి వచ్చాడు. అప్పటికి గ్యారేజు నుండి కారు తీసుకు వచ్చి భర్త కోసం ఎదురు చూస్తూంది మంగళ. భర్త కోసం ఫ్రంట్ డోర్ తెరిచి ఆ తరవాత తను వెళ్ళి డ్రైవింగ్ సీటులో సర్దుకుని కూర్చుంది.


కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు గాని స్కూటర్ తోలుతున్నప్పుడు గాని మాట్లాడుతూ వెళ్ళడం అశ్వథ్ కి నచ్చదు. ట్రాఫిక్ రూల్సు ఉల్లంఘన మాట అటుంచి అదొక అనారోగ్యకరమైన అలక్ష్యమైన అలవాటంటాడు. అంచేత ఆ ఎడబాటు సమయంలో కారు డ్రైవ్ చేస్తూన్న మంగళకు విచిత్రమైన తలంపులు చుట్టుముట్టాయి. అదెప్పుడో తను విన్న రజనీష్ మాటలు మనసున మెదిలాయి- “తరచి చూస్తే అప్పుడప్పుడు మన జీవన ప్రయాణమే గమ్యం తెలియని ఒక కృత్రిమమైన ఉనికిలా అగుపిస్తుంటుంది. ఏదో ఒక రంగుతో మేలి ముసుగు వేసుకుంటాం. అది ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటాం. అంచేత పైకి కనిపించే ‘మనం’ వేరు. మనలో ఉన్న నిజమైన ‘మనం’ వేరు”


ఇది చాలా లోతైన జీవిత నిర్వచనం..


ఆమె ఊరి ఆవల ప్రవహిస్తూన్న నది ప్రక్కన కారాపింది. ఇద్దరూ దిగారు. అశ్వథ్ మంగళ చేతిని అందుకున్నాడు. అక్కణ్ణించి కదుల్తూనే అన్నాడు- “పైకి అదేమీ గమనించనట్టు అలక్ష్యంగా కనిపిస్తావు గాని- నీది అరుదైన బ్యూటీ! స్టన్నింగ్ బ్యూటీ మంగళా! మరొకటి కూడా చెప్పనా? ”


“ పెళ్ళాన్ని కదానని మరీ మురిసిపోయేటట్టు చేయకండి. చూసేవారు అబ్బురపడిపోయేరు! ”


“ కాదు. వాస్తవం చెప్పడానికి ఎప్పుడైతేనేమి- ఎక్కడైతేనేమి!?”


“అలాగే చెప్పండి ప్రాణనాథా! ”


“చాలా కొద్ది మందికి మాత్రమే ఉండే బ్యూటీ నీది- క్లాసికల్ బ్యూటీ! ” ఆమె యేమీ అనలేదు. కొన్ని క్షణాల వరకూ స్పందించకుండా అలాగే ఉండిపోయి- ఉన్నపాటున ప్రాణం వచ్చిన ప్రతిమలా కదలి భర్తను ఆపి చుట్టు ప్రక్కల ఓపారి కలయ చూచి ఉన్నపాటున గుండెలపైకి లాక్కుని ముద్దాడింది.


“ఉఁ! ఇక చెప్పండి. మనసుని తేలికపర్చుకుని చెప్పండి”


“ ఏం చెప్పమంటావు? ”


“నీటి అడుగున గుద్దులాట వద్దు నాప్రాణ సఖా! ”నవ్వడానికి ప్రయత్నిస్తూ, అదే సమయాన నిలదీసేలా చూస్తూ అంది మంగళ.


“భలే దానివే! ఇందులో నేనేమి చెప్పేది? నా వేపు చూపుడు వ్రేలు చూపించి నా భుజాల గుండా పైరింగ్ చేసి చెప్పా పెట్టకుండా వచ్చే సింది నువ్వే కదా! నీ జీవితాన్ని పంచుకునే వాడితో నీ జీవిత రహస్యాలను పంచుకోవాలా వద్దా అన్నది నువ్వే తేల్చుకోవాలి మంగళా! ”


ఆమె వెంటనే బదులివ్వలేదు. ఒకసారి లోతుగా ఊపిరి తీసుకుని ఆలోచనా అక్షరాలను కుదుట పర్చుకుంటూ అంది- “నన్ను ప్రేమించే నాభర్త ముఖ మండలం వెలవెలబాటుకి లోనుకాకూడదనే వచ్చేసాను. ఇంకా చెప్పాలంటే- తాత్కాలికంగా గ్రహాంతర చలనం చేసాను. మిషన్ విజయవంత మయేంత వరకూ మీకు అడ్డగోలుగా ఉండకూడదని- మీ మూడ్ తలక్రిందులు కాకూడదని-- “


ఆ మాటతో అతడిలో మునుపటి ఊపు తగ్గింది. అతడికి తెలుసు మంగళ లోతుగా ఆలోచించగల స్త్రీ అని.


“హుఁ! అలాగే! నీ వివరణ కూడా సమంజసంగానే ఉంది. గజిబిజి ఆలోచల్ని మెదడున దించుకుని జ్ఞాపకాల ఝంఝాటాన్ని గుండెల్లో అంతెత్తున ఉంచుకుని జీవన మాధుర్యాన్ని అంది పుచ్చుకోవడమన్నది అసాధ్యమేనేమో! నీ ఆలోచన ప్రకారమే కానిద్దాం- చెప్పు“


“నిజం చెప్పాలంటే నేను చెప్పడానికేముంది? మీరే అడగాలి. అడగాలా వద్దా అన్న సందిగ్ధావస్థకు తావివ్వకుండా అడిగి తెలుసుకుని అనుమానపు వీచికల్ని దూరం చేసుకోవాలి. మీది బాధ్యతాయుతమైన ఉద్యోగం. గుండూసుల్లాంటి ఆలోచనలకు చోటివ్పకూడదు. “


“ఓకే! ఓకే! ఏది అడిగినా నొచ్చుకోవుకదూ? నీ గతకాల ప్రైవేసీని ప్రశ్నిస్తున్నానని అనుకోవు కదా! ”


ఆమె తల అడ్డంగా తలూపింది- ఏమీ అనుకోనన్నట్టు--


”ఇప్పుడు సీరియస్ గానే అడుగుతు న్నాను. ఆఖైదీ నెంబర్- టూ జీరో త్రీ గురించి అంతగా ఆలోచించుకుంటూ మనసు పాడుచేసుకుంటున్నావే- వాజ్ హీ యువర్ ఎక్స్ లవర్? ”


“ఒకే పదంలో ఒకే ఒక భావంతో చెప్పలేనిది. దీనికి విషయ వివరణ ఇవ్వాలి. ఒకే కాలేజీలో చదువుకున్నామన్న మాటేగాని మా మధ్య పరిచయం అంతంత మాత్రమేననాలి. అతడి గుణ సంపద గురించి తెలుసు. అతడి వ్యక్తిత్వం గురించి తెలుసు. ” అని ఇంకేదో చెప్పబోయేంతలో అడతడామెను ఆపాడు-


“వెయిట్ వెయిట్! నువ్వేదేదో వాగుతూ నన్ను అయోమయంలో పడేస్తున్నట్టున్నావు మంగళా! మొదట ఇది చెప్పు. పవన్ కుమార్ మీ కాలేజీ మేట్. అవునా? ’తలూపిందామె. “నీ క్లాస్ మేట్ కూడాను. ఈజ్ ఇట్ నాట్? “


“కాదు” ఈసారి మంగళ తల అడ్డంగా ఆడిస్తూ బదులిచ్చింది.


ఆ బదులు విని అశ్వథ్ కాసేపాగాడు. ఆలోచనా ధారకు రవంత విరామం ఇచ్చాడు- తన గుండె కవాటాలను తెరిచాడు-


“బాగా విను మంగళా! నీ మనసు ఎటువంటిదో నాకు తెలుసు. నీ పర్సనల్ క్వాలి టీస్ ఎటువంటివో అంతకంటే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే మా అమ్మ తరవాత నేను అధికంగా అభిమానించే వ్యక్తివి నువ్వే. ఇది నీకు తెలుసా?”


తలూపిందామె.


“అయితే- నేనేదో వెలవెలబాటుకి లోనయిపోతానన్న ఫీలింగుకి చోటివ్వకుండా అవసరానికి మించిన మ్యా గ్నామిటీ చూపించకుండా జవాబియ్యి. పవన్ కుమార్ ని కాలేజీ రోజుల్లోగాని ఆ తరవాత గాని ప్రేమించావా! క్లోజ్ గామూవ్ చేసావా- ఐ మీన్ బోత్ వేస్- ‘గతం గత:’అన్నసూత్రాన్ని మనసున పెట్టుకునే ఇదడుగుతున్నాను. ఎందు కంటే గతమన్నిది నీకే కాదు. నాకూ ఉండవచ్చు కదా! వయసులో ఉన్నప్పుడు యిటువంటి వాటికి ఆకర్షితులవడం సహజ పరిణామమే కదా!”


“మీరు న్యాయంగానే అడుగుతున్నారు. థేంక్స్. కాని నేను బ్లాంక్ చెక్క్ చూపించినట్టు ఉన్నపాటున చెప్పలేను. అయితే అతడంతే నాకు అభిమానం- ఇష్టం. ఇక నెక్స్ట్ పాయింటుకి వస్తే- అసలు అతడియందు నాకు లైకింగ్ ఉందనేదే అతడు గ్రహించినట్టు లేదు”


“ఎగైన్ యు ఆర్ కన్ ఫ్యూజింగ్ మీ! నీవన్నీ గజిబిజి ఆలోచలూ- అస్తవ్యస్థ జవాబులూను. బాయ్ ఫ్రెండ్ కాదంటున్నావు. కలసి మెలసి తిరిగిన ప్రియుడూ కాదంటున్నావు. అంతేకాదు. అతడు నీ యందు అటువంటి స్పందనే చూపించలేదంటున్నావు. మరి అతడి గురించి, అందునా నాతో వివాహమయిన తరవాత, అంతటి అక్కర ఎందుకు చూపిస్తున్నావు? ”


“అక్కరా కాదు ఆరాటమూ కాదు- ఆరాధన! “ ఆ మాట అన్న వెంటనే ఆమె కళ్లనుండి కన్నీటి చుక్కలు బొటబొటా రాలిపడసాగా యి. అశ్వథ్ నిష్చేష్టుడయాడు. మంగళ కళ్ళనుండి కన్నీరు ఒలకడం అతెడెప్పుడూ చూడలేదు. అసలు స్త్రీలు కన్నీరు కార్చడం అత డు భరించలేడు కూడాను. వెంటనే తేరుకుంటూ అన్నాడు- “సారీ! హార్ష్ గా మాట్లాడినట్టున్నాను. జైలు వాతావరణానికి అలవాటు పడ్డ వాణ్ణి కదా- నా గొంతు కొంచెం కఠినంగా హస్కీగా వినిపించి ఉంటుంది. నౌ ప్లీజ్ ప్రొసీడ్“


కొన్ని క్షణాల నిశ్శబ్దం తరవాత ఆమె కను రెప్పల్ని తుడుచుకుని అడిగింది- “ఎంతటి ఆరాధనో తెలుసాండీ!”


అతడేమీ అనకుండా తదేకంగా చూడసాగాడు.


“శ్రీరాముడి పాద ధూళి తగిలిన వెంటనే రాయి రూపంలో ఉన్న అహల్యకు ప్రాణం వచ్చి మునుపటి రూపం సంతరించుకున్న తరవాత ఆమెకు ఆ పురుషోత్తముడి పట్ల ఎంతటి ఆరాధన కలిగి ఉంటుందో అంతటి ఆరాధన! నేను చెప్పబోయేది కామ్ గా వింటారా? ”


“నేను ముందే చెప్పాగా నేను ‘గతం గత:’అన్న సూత్రాన్నిపాటిస్తానని!"


“థేంక్స్. నేనొకసారి మైకంలో తుళ్ళుతూ పడిపోయాను” ఆ మాటకతడు నివ్వెర పోయినట్టు చూసాడు- ‘నువ్వు తాగేదానివా! ’ అన్నట్టు.


అప్పుడామె చిన్నటి నవ్వుని పెదవుల మీదకు తెచ్చుకుంటా అంది- “తాగి పడ్డానంటే నిజంగా నేనుగా తాగి పడలేదు. నేనంటే పడని వాళ్ళు. నాపట్ట అసూయ పెంచుకున్న వాళ్ళూ- నన్ను వాడుకోవాలన్న దుష్ట తలంపుతో ఉన్నవాళ్లూ కలసి చేసిన దౌష్ట్య చర్య. నేనీనాడు మీ ముందు బట్ట కట్టి సజీవంగా ముక్కలు చెక్కెలవకుండా నిల్చున్నానంటే అంతా పవన్ కుమార్ చూపించిన సౌజన్యం”


అతడిక మౌన దీక్షను పాటించలేక పోయాడు- “ఇంతకీ ఏం జరిగింది మంగళా? నేనాగ లేక పోతున్నాను. ప్లీజ్ కమ్ అవుట్!”

=======================================================================

ఇంకా వుంది...


అణువణువున జ్వలించిన ఓ హృదయాన ఎపిసోడ్ 12 త్వరలో..

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
27 views0 comments

Comments


bottom of page