'Aswamedham - Episode - 9' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy
'అశ్వ మేధం - ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.
సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.
చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది సౌదామిని. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది. విహరితో తన పరిచయం గురించి సౌదామినికి వివరిస్తాడు చరణ్.
సౌదామినిని తాను పనిచేసే కంపెనీ లో చేరమంటాడు చరణ్. అలాగే చేరుతుంది సౌదామిని.
జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ ని ఎవరో హత్య చేస్తారు. ఆ సంఘటనను చూసిన దీప ను కూడా చంపాలని ప్రయత్నిస్తారు. రాఘవన్ హంతకుల చిత్రాలు గీస్తుంది దీప. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫోటోలను గుర్తు పడుతుంది. రాఘవన్ హత్యకేసు విచారణలో చరణ్ బాగా వాదిస్తాడు.
ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 9 చదవండి..
దీపని హాస్టల్ దగ్గర దించుతూ "శ్రీహర్ష నెంబరు ఇస్తే అతనితో మాట్లాడుతాను" అని చరణ్ అనగానే ఆమె ఆనెంబర్ అతనికి ఇచ్చింది.
ఆమర్నాడు చరణ్ తన పల్లెకు వెళ్ళిపోయాడు. మరోరెండు రోజుల తరువాత విహారి ఫోన్ చేసి ఊళ్ళో అల్లర్లు మొదలయ్యాయని చెప్పడంతో జీపులో కృష్ణాపురం బయలుదేరాడు.
విహారి అతనికి దార్లోనో కలిస్తే "ఏం జరిగింది”? అని అడిగాడు.
"మైనింగ్ ని పూర్తిగా ఆపివేయాలని గ్రామస్తులు మొన్న కంపెనీ దగ్గరకి వెళ్ళి మేనేజర్ తో చెబితే ప్రభుత్వం నుంచి మాకు ఆపమనీ ఆర్డర్స్ ఏవీ రాలేదనీ కాబట్టి ఆపే ప్రసక్తిలేదు అని చెప్పడంతో మా వాళ్ళు అక్కడ ధర్నా మొదలు పెట్టారు. చుట్టుప్రక్కల ఊళ్లోనుంచి ఒక్క పనివాడు కూడా అక్కడికి వెళ్ళి పనిచెయ్యకూడదని మా జాయింట్ ఏక్షన్ కమిటీ తీర్మానించడంతో వాళ్ళు కేంప్ లేబర్ని తెచ్చిపనులు చెయ్యడంతో గొడవలు మొదలుయ్యాయి.
రెండురోజుల క్రితం మాఊరి దళితవాడ లోని అమ్మాయిని వాళ్ళు అల్లరిచెయ్యడంతో మావాళ్ళు ఆకంపెనీ వాళ్ళను కొట్టి ఒక టిప్పర్ని కాల్చివేయడం తో గొడవలు ముదిరి పోలీసుస్టేషన్ దాకా వెళ్ళింది. ఒకళ్ల మీద ఒకళ్లు కేసులు పెట్టుకున్నారు.
ఎమ్యేల్యే వస్తే అతన్ని అడ్డగించి పనులు ఆపించాలని గొడవచేసారు. అందుకే నిన్న రెండువందల మంది పోలీసులు వచ్చి ఇక్కడ కేంప్ చేశారు. కాబట్టి మనం మైనింగ్ కేసులో మరో సారి పిటీషన్ వేసి స్టే అడిగితే మంచిది. లేకపోతే గొడవలు పెద్దవవచ్చు" అన్నాడు విహారి.
"తప్పకుండా! మళ్ళీవారం ఈకేసు విచారణ కి వస్తుంది. అపుడు మనం స్టే అడుగుదాం. ఈలోగా ప్రభుత్వం ద్వారా ఆ పనులు ఆపితే దుమ్ము, ధూళి తగ్గి కాలుష్యం తగ్గుతుంది. ఎమ్యెల్యే చెబితే కానీ ఆ పనులు ఆగవు. జాతీయ హరిత ట్రిబ్యునల్ వాళ్ళు ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి నష్టమా కాదా అన్న రిపోర్ట్ ని కోర్టులో దాఖలు చెయ్యాలి. అది తయారుచేసే రాఘవన్ గారు హత్యకు గురయ్యారు కాబట్టి ఆలస్యం అవుతుందనుకున్నాను.
కానీ నిన్న ఢిల్లీలో సౌదామిని వాళ్ళ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే రాఘవన్ గారు హత్యకు గురైన రోజే ఆ రిపోర్టుని మెయిల్ ద్వారా పంపారనీ, కాబట్టి మళ్లీ వారం కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారుట. ఆ రిపోర్ట్ కాపీని కూడా సౌదామిని చదివిందట.. అది ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉందనీ చెప్పింది. కాబట్టి మైనింగ్ విషయంలో మనకి అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకుంటున్నాను. ” అన్నాడు చరణ్.
వారంరోజులు తరువాత సౌదామిని తో కలిసి దీపా వాళ్ళ ఊరు సీతారాంపురం బయలుదేరి వెళ్ళాడు చరణ్.
సౌదామిని కి పల్లెలంటే ఇష్టం.. చిన్నప్పుడు వాటిని చూడటం కుదరలేదు. చరణ్ తో పరిచయం తరువాతే చాలా ఊళ్ళు చూసింది. కొన్ని పల్లెలు ఏటి పక్కన ఉంటే, మరికొన్ని కొండల పక్కన.. అందంగా విసిరేసినట్లు.. ప్రశాంతమైన వాతావరణం.. రానురాను నగర వాతావరణం అంటే ఆమెకు విముఖత కలగసాగింది.
వాళ్ళు వెళ్ళేసరికి దీప నాన్నగారు పరమేశ్వరం ఇంట్లో లేడు.. వాళ్ళమ్మగారు సీతమ్మ వాళ్లకి కాఫీలిచ్చింది. కొంచెం సేపటి తరువాత చరణ్, సౌదామిని బయటకెళ్లి ఊరంతా తిరిగి వచ్చారు.
“ శ్రీహర్ష ఇంటర్ నుంచి తెలుసు. నా రూమ్ మీట్ కూడా. ఎన్నోసార్లు ఈ ఊరు రమ్మన్నాడు. కానీ అప్పట్లో కుదరలేదు. ఇపుడు వాడులేకపోయినా దీపకోసం రావలసివచ్చింది. కాలేజీలో శ్రీహర్ష నామీద బాగా ప్రభావం చూపాడు. అతను కమ్యూనిస్టు వాది. ఎపుడు శ్రీశ్రీని చదివేవాడు. సమసమాజం అంటూ వాపోయేవాడు. మహా ప్రస్థాన్నాన్ని వదిలేవాడు కాదు. ఆపుస్తకాన్ని చదవమనీ అందరికీ చెప్పెవాడు.
"సిందూరం రక్త చందనం
బంధూకం సంధ్యారాగం
పులిచంపిన లేడి నెత్తురూ
ఎగరేసిన ఎర్రని జెండా
రుద్రాలిక నయన జ్వాలిక
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి"
అంటూ గళమెత్తేవాడు.
అలాంటివాడు ఆమెరికా వెళ్ళడం, అక్కడ వ్యాపారం, పెళ్ళి.. ఇవన్నీ చూస్తుంటే జీవితంలో ఏదీ మన చేతుల్లో లేదనిపిస్తోంది. సర్లేండి.. ఇవన్నీ చెబితే గంటలు సరిపోవు.. పదండి.. ఇంటికి వెళ్ళాం.. ఆయన వచ్చి ఉంటారు" అన్నాడు చరణ్.
వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పరమేశ్వరం ఇంటి దగ్గర ఉన్నారు.
చరణ్ ఆయనకు నమస్కారం పెడుతూ "నాపేరు చరణ్. మాది పక్కనే ఉన్న వశిష్టపురం. శ్రీహర్ష, నేను కలిసి చదువుకున్నాం. ఈమె సౌదామిని. నా స్నేహితురాలు " అని పరిచయం చేసుకున్నాడు. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత పరమేశ్వరం గారు” శ్రీ హర్ష గురించి ఏమైనా తెలిసిందా?" అని అడిగాడు.
ఆ మధ్య నేను శ్రీహర్షతో మాట్లాడాను. వాడు ఏదో కేసులో ఇరుక్కున్నాననీ చెప్పడంతో అక్కడ నాకు తెలిసిన స్నేహితులతో చెప్పి కోర్టులో కేసు వేయించాను. మొన్ననే అతనికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఆకంపెనీ మళ్ళీ అతని చేతుల్లోకి వచ్చింది.. మరికొన్ని రోజుల్లో అన్ని సమస్యలు తీరిపోతాయి. భార్యతో విడాకులు కూడా మంజూరయ్యాయి. ఆమెని అరెస్ట్ కూడా చేసారు. ఇవి మీకు చెబుదామనే వచ్చాను” అని చెప్పాడు చరణ్.
ఆ మాటలు విన్న పరమేశ్వరం ఒక్కసారిగా అనందంతో ఉబ్బితబ్బయ్యాడు.
" చరణ్ ! వాడివల్ల నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆర్ధికంగా చితికిపోయాను. అయినా వాడి జీవితం గాడిలో పడలేదు అనే బాధ నన్ను మానసికంగా కుంగదీసింది. ఇన్నాళ్లకు నీ ద్వారా మంచి మాట విన్నాను. ఇంక వాణ్ని ఆ అమెరికాలో ఉండొద్దనీ చెప్పి వాణ్ణి ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యి. ఆ అమెరికాయే వాడి జీవితాన్ని నరకం లోకి నెట్టింది. ” అన్నాడు పరమేశ్వరం.
"తప్పకుండా! ఆకంపెనీ ని ఇంకొకరికి అమ్మేసి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరేమి గాబరా పడకండి. వాడు ఒకనెలలో ఇక్కడికి వచ్చేస్తాడు. " అనడంతో ఆయన స్తిమిత పడ్డాడు.
ఆతరువాత పరమేశ్వరం గారు సౌదామిని తో మాట్లాడారు. సౌదామిని తన వివరాలన్నీ ఆయనతో చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురికి భోజనం వడ్డించింది సీతమ్మ గారు.
భోజనాలపుడు చరణ్ దీప పెళ్లి గురించి అతనితో ప్రస్తావించాలనీ ఆలోచిస్తున్నాడు. కానీ ఎలాగ మొదలు పెట్టాలో తెలియటంలేదు.
" సార్! సౌదామిని, దీప ఇద్దరూ స్నేహితురాళ్ళు. ఇంటర్ కలిసే చదివారు. అలాగే దీప క్లాస్మేట్ విహారి నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి చదువుకున్నాము. ” అని చెప్పటం మొదలు పెట్టాడు.
విహారి పేరు వినగానే పరమేశ్వరంగారి భృకుటి ముడివడడాన్ని గమనించాడు చరణ్.. పరమేశ్వరం మౌనంగా భోజనం చెయ్యటం గమనించాడు..
“ నేను దీపా, విహారిల వివాహం గురించి మాట్లాడటానికి వచ్చాను. నిజానికి మీవంటి అన్నీ తెలిసిన పెద్దలతో ఇటువంటి వివాహ విషయం మాట్లాడటం సరి కాదనీ నాకు తెలుసు. అయినా ప్రస్తుతం పరిస్థితుల్లో తప్పక రావలసి వచ్చింది. అందుకు క్షంతవ్వుణ్ణి" అన్నాడు.
అయినా పరమేశ్వరం మౌనం వీడలేదు.
"నేను సంవత్సరం నుంచి వాళ్ళని గమనిస్తున్నాను. వాళ్ళు మానసికంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే మీకు యిష్టం లేని పెళ్ళి చేసుకోకూడదని దీప కోరిక. అందుకే వాళ్ళు వివాహ విషయంలో తొందర పడటం లేదు. ఇవన్నీ మీకు తెలిసినవే.. కాబట్టి మీరు పెద్ద మనసుతో అలోచించి వాళ్ళ వివాహానికి అంగీకరిస్తే ఓ సమస్య తీరుతుంది. కొద్దిగా ఆలోచించండి" అన్నాడు చరణ్.
కొంచెం సేపటికి పరమేశ్వరం మౌనం వీడేడు.
“నీకు దీప, విహారి కొన్ని విషయాలే చెప్పి, అసలు విషయాలు దాచినట్లు తెలుస్తోంది. దీపని చిన్నప్పట్నుంచి మా మేనల్లుడు రవికిచ్చి పెళ్లి చెయ్యాలనీ మా కుటుంబాలు అనుకున్నాయి. అదీ కాక విహారి మా కులం వాడు కాదు. అది నాకూ ఇష్టం లేదు. మా కుటుంబాల్లో ఇటువంటివి ఒప్పుకోరు. దీనివల్ల అనేక సమస్యలు మా కుటుంబం ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవన్నీ మీకు అర్ధం కావు..
ఇప్పటికే నాకొడుకు చేసిన పనికి నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు దీప కూడా అలా చేస్తునాది అంటే నా పెంపకంలోనే ఏదో లోపం జరిగినట్లుంది. లేకపోతే ఇద్దరూ నా అభీష్టానికి విరుద్ధంగా ఎందుకు చేస్తారు?" అన్నాడు.
అప్పటికే అతను భోజనం ముగించాడు.
“సార్! ఒక విషయం చెప్పమంటారా? పది, పదిహేనేళ్ళ నుంచి సమాజంలో మార్పు వచ్చింది. 1990 తరువాత గ్లోబలైజేషన్ వల్ల విదేశీ వలసలు పెరిగాయి. ఆచార వ్యవహారాల్లో చాలా మార్పులు చూసింది మన సమాజం. కంప్యూటర్లు, మొబైల్స్, సాఫ్ట్ వేర్ మానవసంబంధాల్లో చాలా మార్పులు తెచ్చాయి. నాకు తెలిసి వందలమంది శోత్రీయులు అమెరికా వెళ్లి అక్కడి వారిని వివాహం చేసుకుంటున్నారు.
ఒకపుడు మాంసాహారం తినడం తప్పు.. మధ్యపానం నిషేధం. స్త్రీ, పురుషుల మధ్య ఒక విభజన రేఖ ఉండేది.. సమానత్వం ఉండాలనీ స్త్రీలు అనుకున్నా ఒప్పుకోని సమాజం. కానీ ఇప్పటి తరం వాటిని వ్యతిరేకిస్తోంది. వీరి ఆలోచనా సరళి వేరుగా ఉంది. మీరేమో వేయి పడగలు లాంటి పుస్తకాలు చదివి పెరిగారు. కానీ ఇప్పటి స్త్రీలు తమకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ తరంలోని మీలాంటి పెద్దలు మారితే చాలా సమస్యలు తీరతాయి.
ఒకవేళ దీప వివాహాన్ని మీరు కాదన్నా ఆమె మీమాట వినకపోవచ్చు. ఒక వేళ మీమాట వింటే ఆమె జీవితం సాఫీగా సాగకపోవచ్చు. కాబట్టి వివాహాల విషయంలో పిల్లలకు స్వేచ్ఛ ఇస్తేనే మంచిదనీ నా అభిప్రాయం. మీరనుకున్నట్లు వాళ్లిద్దరూ ఏ విధమైన హద్దులు దాటలేదు.. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకుందామనీ అనుకుంటున్నారు. అందుకే నేను రావలసివచ్చింది. లేదంటే అందరికీ సమస్యలే.. ఆలోచించండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ” అన్నాడు భోజనం దగ్గర్నుంచి లేస్తూ..
“స్త్రీలకు స్వేచ్ఛ కావాలంటారు. వాళ్లు చదవు కోవాలంటారు. కానీ పెద్దలమాట, తల్లి తండ్రులమాట వినక్కర్లేదు. 20 సంవత్సరాలపాటు పెంచిన తల్లిదండ్రుల మనోవ్యధ గురించి వాళ్ళు ఆలోచించక్కర్లేదా ? తల్లితండ్రుల అభీష్టం ప్రకారం నడుచుకుంటే తప్పేమిటి? ఒకవేళ మీరు చెప్పినట్లు నేను ఒప్పుకున్నా మానసికంగా మాత్రం ఆ దూరం తగ్గదు. అది మంచిదంటారా? నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు.
మళ్ళీ మాకిష్టం అయితేనే చేసుకుంటామని ఎందుకంటున్నారు? ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కాదా చెప్పండి? ఎప్పుడు రెండు జరగవు. మమ్మల్ని బలవంతంగా ఒప్పించడం దేనికి? వాళ్ళకు ఏదిష్టం అయితే అలాగే చేసుకోమనండి.. మా బాధలు, కోరికలు ఎవ్వరికి కావాలి చెప్పండి.. మీరన్నట్లు మాతరం తల్లితండ్రులు యుగసంధిలో ఉన్నాము. ఈ వాస్తవం నాకుతెలుసు.
ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో కూడా నాకు తెలుసు. నేను కూడా అష్టదశ పురాణాలు చదివిన వాణ్ణి. కార్యసాధకుడు కష్టమని చేతులు కట్టుకొని కూర్చోడు.. సుఖమని పొంగిపోడు”..
ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. నువ్వు మంచి వ్యక్తి లాగా కనిపిస్తున్నావు. ఎలా మంచిదనిపిస్తే అదే చెయ్యి. ఇంక మా అనుమతంటావా ? మేము జీవిత సంధ్యలో ఉన్నాం.. అస్తమించే సమయం. మా అనుమతి వాళ్ల కెందుకు? మీరే చెప్పారు ఈ తరానికి మా తరానికి చాలా అంతరం ఉందనీ.. " అన్నాడాయన..
చరణ్ ఆ సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాడు. కానీ అక్కడ ఏం జరిగిందో విహారికిగాని, దీపకుగానీ చెప్పలేదు. దానివల్ల ఉపయోగం ఉండదనీ అతని నమ్మకం.
వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు మళ్లీ మొదలైంది.
=================================================================================
ఇంకా వుంది...
=================================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments