'Avamanam Arulakshala Vaddanam' Written By Neeraja Hari Prabhala
రచన….నీరజ హరి ప్రభల.
మరక మంచిదే... అనే యాడ్ చూసే ఉంటారు.
కాలం కలిసొస్తే అవమానం కూడా మంచిదే అనిపిస్తుంది ఈ కథ చదివితే.
ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు ఈ కథను రచించారు.
"ఏమండీ! ఎల్లుండే అక్షయత్రృతీయ . గుర్తుందా?" అంది దీప భర్త రవితో.
"గుర్తు లేకేం ? ప్రతిసం.. మీ ఆడవాళ్ళంతా ' ఆరోజు ఎప్పుడొస్తుందా? ' అని ఆశగా ఎదురు చూస్తారు. కనీసం ఏదో ఒక బంగారం నగకు టెండరు పెడతారు కదా. ఆ షాపులవాళ్ళు కూడా మీ లాంటి వాళ్ళను చూసే గ్రాముకు డిస్కౌంట్ ఆఫర్స్ , రిటర్న్ గిఫ్టుల ఎర వేస్తారు. ఆ గాలంలో మాలాంటి భర్తలు ఇరుక్కుంటారు " అన్నాడు వ్యంగ్యంగా.
"అంత వ్యంగం ఎందుకు ? ఏం మాకు ఆ ఒక్క రోజేకా నోరు తెరిచి అడిగే అవకాశం . మిగతా ఏ వేడుకలకు అడిగినా ఏదో వంకతో తప్పించుకోవటం మీకు అలవాటే గా." అంది దీప దెప్పిపొడుపుగా. "అయినా మేం మాకోసం అడుగుతున్నామా ? చెప్పండి. ఈరోజున ఎంత బంగారం, వెండి కొంటే మరుసటి సం..కి అంత రెట్టింపు అవుతుందనే. మనింట్లో లక్ష్మీ దేవి ఉండాలని .అంతే " అంది తెలివిగా దీప.
"నీవే నా గ్రృహ లక్ష్మివి. నీవుండగా వేరే ఎవరెందుకు చెప్పు" అన్నాడు ప్రేమగా దీపను దగ్గరకు తీసుకుని రవి.ఈ తెలివి తేటలకేం తక్కువ లేదు. మాటలతో మమ్మల్ని మైమరిపించటం మీభర్తలకు వెన్నతో పెట్టిన విద్యేగా. అయినా ఈసారి మీరు కొనాల్సిందే" అంది అతని కౌగిలిలో ప్రేమగా ఒదిగిపోతూ.
" సరేలేవోవోయ్ ! నీ మాట ఎప్పుడు కాదన్నాను? . తియ్యని ఈ మధుర క్షణాలను ఆస్వాదించనీ ' అన్నాడు మరింతగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ. అతని బిగి కౌగిలిలో పరవశంతో గువ్వలా ఒదిగిపోయింది దీప.
మరుసటి రోజున రవి ఆఫీసుకు వెళ్ళగానే పనిముగించుకుని సోఫాలో కూర్చుని టివి ఆన్ చేసింది దీప. చందన, ఖజానా, మలబార్ మొ..షాపులన్నీ నగలను చూపిస్తూ ఆఫర్లు, తరుగులు చెప్తూ " ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. లక్ష్మీ దేవిని మీ ఇంట స్వాగతించండి. రిటర్న్ గిఫ్టులు ఇస్తాం."అని గొంతు చించుకుంటూ అరుస్తున్నారు ఎనౌన్సర్లు. ఇంచుమించు అన్ని ఛానెల్స్ లలో అవే ప్రకటనలు.
రాత్రి భర్త ఇచ్చిన వరం గుర్తొచ్చింది దీపకు. 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి ' అన్న సామెత గుర్తొచ్చి పెద్ద వస్తువుకే టెండరు పెడదాము అని తనకు లాకర్ లో ఉన్న నగలను గుర్తుచేసుకుంది. అన్నీ ఉన్నాయి కానీ ప్రక్కింటి వనజకు ఉన్న వడ్డాణం లేదు. ఆ మోడల్ చాలా బాగుంది. అది కొనుక్కుంటే సరి. తనకు ముచ్చటా తీరుతుంది. అనుకుని వనజ వడ్డాణం పెట్టుకుని కులుక్కుంటూ వచ్చి తనకు చూపించిన రోజును గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్ళింది దీప.
కాలింగ్ బెల్ మ్రోగితే 'ఎవరూ?' అంటూ తలుపు తీసింది తను. ఎదురుగా పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకొని అందంగా సింగారించుకుని వచ్చిన వనజ. ఆవిడను లోపలికి రమ్మంటం కూడా మర్చిపోయి అలా నిశ్చేష్టురాలై నిలబడి చూస్తోంది తను. "ఏయ్ దీపా ! లోపలికి రమ్మనవా !" అని చనువుగా లోపలికి వచ్చింది వనజ. తెప్పరిల్లి "దా కూర్చో " అంటూ సోఫా చూపించి "ఏంటీ విశేషం? ఇవాళ నీ పుట్టినరోజా? అంది తను.
" పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు పెట్టుకోవాలంటే విశేషమే అక్కర్లేదు. కూసింత సంతోషము, కాసింత ముచ్చట ఉంటే చాలోయ్. అయ్యో! నా మతిమండా! మాటల్లో పడి మర్చిపోతాను. ఈ వడ్డాణం చూడు. ఎలా ఉందో చెప్పు? బాంకులో లోను తీసుకుని నిన్న మావారుకొన్నారు " అంది ఫాషన్ షొలో మోడల్స్ కాట్ వాక్ చేస్తున్నట్టు వయ్యారంగా నడుస్తూ హొయలొలకబోస్తూ వనజ.
తను ఒక్కసారి పైనుంచి క్రిందకు ఎగాదిగా చూసింది వనజను. 70 mm లాగా ఉండి పైనుంచి క్రిందకు పీపా లాగా ఉన్న ఆకారం. టేపుల కొలతలకు మించిన నడుము. ఆ వడ్రాణానికి పాపం ఆ భర్త గారు ఎంత మొత్తం చెల్లించాల్సొచ్చిందో ? ప్రైవేటు ఉద్యొగస్తుడైన ఆయన ఎన్ని సం.. పస్తులు ఉండి ఆ అప్పు తీర్చాలో? అని మనసులో అనుకుని "బాగుంది వనజా ! ఎంతయ్యిందేమిటి? అన్న తన ప్రశ్శకు "చాలా అయ్యిందిలే ! అయినా నువ్వు కొంటావా? పెడతావా? నీవల్లకాదులే ! నీకు చూపించి పోదామని వచ్చాను. వస్తా !" వ్యంగంగా అని తిప్పుకుంటూ పొగరుగా వెళ్ళింది వనజ.
జరిగిన అవమానానికి చెంప ఛెళ్ళున కొట్టాలన్నంత కోపం వచ్చి తమాయించుకుని దీని పొగరుకు, గర్వానికి బుధ్ధి చెప్పాలని అనుకుంది.ఆ సమయం కోసమే ఎదురు చూస్తోంది తను.
" ఏయ్ దీపా ! దీపా!" అని తట్టి లేపుతున్న రవి పిలుపుకి త్రృళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది దీప.
"ఏంటోయ్! రాణీ గారు ఆలోచనలలో పడి నా రాకనే మర్చిపోయారు .కొంపదీసి మీరెవ్వరు? అని అడగద్దు" అన్నాడు బుగ్గ మీద చిటికె వేసి కొంటెగా.
"అప్పుడే వచ్చేశారా! కాఫీ తెస్తాను ఉండండి " అని కిచెన్ లోకి వెళ్ళి వేడి వేడి గా కాఫీ చేసి తీసుకొచ్చి కప్పు అతనికి అందించి సరసన కూర్చుంది. సరదాగా కాసేపు ముద్దు ముచ్చట్లయ్యాక నెమ్మదిగా అసలు విషయం బయటపెట్టింది.
" ఏమండీ ! రేపే అక్షయ తృతీయ. బంగారం కొనిపెట్టరూ" అంది దీప.
"ఏంకావాలోయ్? ఈసారి దేనికి టెండరు ?" అడిగాడు రవి.
"ఏంలేదండీ ! ఒక్క వడ్డాణం కావాలి. అంతే" అంది దీప గోముగా.
చటుక్కున కౌగిలి వీడి "ఒక్క వడ్డాణం అని అదేదో వెయ్యి రూ.. పట్టుచీరలాగా చెప్పావు. ఇప్పటికిప్పుడు వడ్డాణం అంటే మాటలా? పెరిగిన రేట్లకు ఇప్పుడు అది లక్షల్లో ఉంటుందోయ్" అన్నాడు రవి.
"నాకు తెలీదు. మీరు కొంటానని రాత్రి మాటిచ్చారు. మాట తప్పడం మీ వంశంలోనే లేదని ఎప్పుడూ అంటూ ఉంటారు కదా." అంది తెలివిగా దీప.
"మనం ఇప్పటిదాకా దాచుకున్న డబ్బులు ఉన్నాయి కదా. వాటితో కొందాము. చాలకపోతే ఇన్ స్టాల్ మెంట్ గా కొన్ని నెలలు మీ జీతంలోంచి కట్టుకుందాం" అన్న దీప మాటలకు ఇహ తప్పేట్టులేదని " పద ! బయలుదేరు." అన్నాడు రవి
.
"ఇదిగో చిటికెలో వచ్చేస్తా !" అని ఎప్పుడూ గంటల తరబడి మేకప్ చేసుకుని కానీ బయటకు రాని దీప పది నిమిషాలలో ఫ్రెష్ అయి వచ్చింది.
" లేడికి లేచిందే పరుగు" అంటే ఇదే అనుకుని దీపని తీసుకుని నాలుగైదు బంగారం షాపులకు తిరిగాడు.
దీప అన్నిచోట్లా చూసి వనజ వడ్డాణం కన్నా మిన్నగా, అందంగా ఉన్న దాన్ని కొన్నది.
'హమ్మయ్య! బ్రతికాను దేవుడా ! అని నిట్టూర్పాడు రవి. తమ వద్ద ఉన్న డబ్బులు సరిపోక ఇన్ స్టాల్ మెంట్సు లో నెల నెలా కొంత మొత్తం చెల్లించేట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.ఆ బంగారానికి తగ్గట్టు ఉచితంగా వచ్చిన వెండి వస్తువులు, రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వడ్డాణంతో ఇంటికి వచ్చారు దీప,రవి లు.
ఆరాత్రి దీపకు కంటిమీద కునుకు లేదు."ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు వనజను పిలిచి తన వడ్రాణాన్ని చూపిస్తానా?" అని ఆ వడ్రాణాన్ని మురిపెంగా చూసుకుంటూ గడిపింది. ఇదేమీ తెలీని రవి గురకలు పెట్టి నిద్రపోయాడు.
భళ్ళున తెల్లారింది. రోజువారీ పనులు చేసి రవికి బ్రేక్ ఫాస్ట్ పెడుతూ ' ఇప్పుడే వస్తానుండండి 'అని వనజ ఇంటి తలుపు తట్టి తనని రమ్మని పిలిచింది దీప. విషయం ఏంటో తెలీక వనజ వెంటనే వచ్చింది .
దీప తను కొన్న వడ్డాణాన్ని చూపిస్తూ " ఇదిగో వనజా! మా ఆయన కొన్న వడ్డాణం .నీ దాని కంటే చాలా వెడల్పు. లేటెస్ట్ మోడల్ కూడాను. పైగా కెంపులు, పచ్చలు కూడా పొదిగి ఉన్నాయి. నీది సాదాదే తెలుసా " అంది.
వనజ ముఖం క్షణంలో రంగులు మారి నెత్తురు చుక్క లేదు. మాడిన వంకాయ లాగా నల్లగా మారిన వనజ ముఖము- అందులోని భావాలను గమనించి మనసులో త్రృప్తిగా నవ్వుకుంది దీప.
"ఇదిగో చూడు వనజా! వడ్డాణం ఖరీదెంత? అని మాట వరసకు అడిగితే " నీవు కొంటావా? పెడతావా? నీవల్లకాదులే " ఆని ఈసడింపుగా అని అవమానించావు. అప్పుడే నీకు తగిన బుధ్ధి చెప్పేదాన్ని. కానీ నీకు ప్రాక్టికల్ గా చెబుదామని ఆగాను. అవమానించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికైనా మనుషులను గౌరవించడం నేర్చుకో. నీ అవమానం వలన నాకు వడ్డాణం అమిరింది. అలా అని ఏదో మేలు చేశానని అనుకోవద్దు. ఇక నుంచి అయినా నీ పద్దతి మార్చుకో .ఎవరినీ బాధ పెట్టద్దు.ఇరుగుపొరుగు అందరితో సామరస్యంగా ఉండాలి. ఇది చెపుదామనే నేను నిన్ను పిలిచాను. అంతేగానీ నిన్ను అవమానిద్దామని కాదు." అన్న దీప మాటలకు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లగా " సారీ దీపా !" అంది వనజ.
వనజ కన్నీటిని తన పైట కొంగుతో తుడిచి దగ్గరకు తీసుకుని " ఇంక నుంచీ మనిద్దరం స్నేహితులం. జరిగింది ఏదీ మనసులో పెట్టుకోవద్దు .సరేనా!" అన్న దీప మాటలకు సంతోషంగా ఇంటికి వెళ్ళింది వనజ.
జరిగిన భాగోతం అర్థమయ్యి ' మీ అవమానాల ఖరీదు వలన నీకు 6 లక్షల వడ్డాణం. నాకు 2 లక్లల అప్పు మిగిలింది. అమ్మో! మీ ఆడవాళ్లు సామాన్యులు కారు కదా! ' అని మనసులో అనుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాడు రవి.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనసులోని మాట
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comentários