top of page

దైవ నిర్ణయం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి


Video link

'Daiva Nirnayam' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల


ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు ప్రభాకర్, యశోదలు.

ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు.

పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల విడిపోయారు.

చాలా ఏళ్లకు అనుకోకుండా కలిశారు.

ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.

ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు ఈ కథను రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.


యశోద గుడికి చేరుకుని ప్రశాంతంగా ఉన్న ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తి తో రెండు చేతులను జోడించి నమస్కరించి కాస్త ఇవతలకు వచ్చి మండపములో కూర్చుంది. మైకులో శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం శ్రావ్యంగా వినిపిస్తోంది. ఈ గుడికి రావటం ఆమెకు తరచూ అలవాటు. బాంకులో పనిచేసి రిటైరయినాక వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేసి వచ్చే పెన్షనుతో ఒంటరిగా ప్రశాంత జీవితాన్ని గడుపుతోంది యశోద.


ఇరుగు పొరుగు వారికి తనకు చేతనైనంత సాయంచేస్తూ అందరికీ తలలో నాల్కలా ఉండే ఆవిడంటే ఆ కాలనీవాసులకు గౌరవాభిమానములు ఎక్కువ. ఈ మధ్యన దగ్గరలో ఉన్న అనాధాశ్రమానికి తరచూ వెళ్లి అక్కడి పిల్లలతో గడుపుతూ వస్తోంది. వాళ్లతో గడుపుతున్నంత సేపూ తన ఒంటరిజీవితాన్ని మర్చిపోయి తనూ చిన్న పిల్లయిపోతుంది. కల్మషం లేని ఆ పసిపిల్లల నవ్వు తన మనసును ఆహ్లాదపరుస్తుంది. పిల్లలు దేవుడితో సమానం కదా! ఈ గుడి, ఇక్కడి పరిసరాలు తనను, తన మనసును కట్టి పడేస్తుంది. జనం రద్దీ క్రమేణా పెరుగుతోంది. నెమ్మదిగా లేచి గుడి మెట్లు దిగుతుండగా ఎదురుగా వస్తున్న ఒకాయన తనను పరీక్షగా చూస్తూ తనను సమీపించటంతో ఒకింత ఆగింది. " నీవు, సారీ, మీరు యశోద గారు కదూ " అన్న ఆయన మాటలకు "అవును" అని 'ఎవరా? అని మనసులో అనుకుంటూ ఆయన్ని పరికించి చూసింది. "గుర్తుపట్టలేదు కదూ! నేను ప్రభాకర్ ని. " నవ్వుతూ అన్న ఆయన మాటలకు సంభ్రమాశ్చరాలతో చూస్తూ " ప్రభూ!" అంటున్న యశోదను "దా! ఇక్కడ కాసేపు కూర్చుందాం " అని అక్కడే మెట్ల ప్రక్కకు దారితీశాడు. అతన్ని అనుసరించింది యశోద. ఇద్దరూ కూర్చున్నాక "నిన్ను గుర్తుపట్టలేదు ప్రభూ. ఎలా ఉన్నావు? మనం కలిసి ఎన్నేళ్లయిందో కదా!" అంది యశోద.


"అవును. రిటైర్ అయినాక ఈ ఊరిలోనే ఇల్లు కొనుక్కుని ఉంటున్నాను. నీవు వీలు చూసుకుని మా ఇంటికి రా!" అంటూ తన ఫోన్ నెంబర్, అడ్రసు వివరాలను ఇచ్చి " నీ వెలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు?" అని అడిగాడు ప్రభాకర్.


" బాగున్నాను " అని తన ఫోను నెంబర్ , ఇంటి అడ్రసు ఇచ్చి " వీలు చూసుకుని మా ఇంటికి రా" అంది యశోద. కాసేపు ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుని ఇద్దరూ ఎవరి ఇళ్లకు వాళ్లెళ్లారు.


ఇంటికి వెళ్లిన యశోద ఇంటి పనులను యాదాలాపంగా పూర్తిచేసిందే గానీ మనసంతా ప్రభాకర్ ని గురించిన ఆలోచనలతో చుట్టుముట్టి గతంలోకి వెళ్లింది. తను, ప్రభూ ఒకే బాంకులో కొలీగ్స్. కలిసి పనిచేస్తున్న తమ మధ్య పరిచయం క్రమేపీ ప్రేమగా మారి ఇద్దరి మనసులు కలిసి మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు.


యశోద తండ్రి రామయ్య ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య సుశీలను, కూతుర్లిద్దరినీ చదివించుకుంటూ ఉన్నంతలో ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. యశోద, రమ్య కూడా కష్టపడి చదువుతున్నారు. యశోద డిగ్రీ ఆఖరి సం..లో ఉండగా తండ్రి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. జరిగిన దారుణానికి బాధపడి యశోద గుండె దిట్ట వు చేసుకుని తన తల్లిని, చెల్లిని ఓదార్చి ధైర్యంగా తండ్రి కర్మకాండలను యధావిధిగా పూర్తి చేసింది. తండ్రి పనిచేసిన కంపెనీ తాలూకు వచ్చిన సొమ్ముతో ఒక చిన్న ఇల్లును కొన్నది యశోద.

తను ట్యూషన్లు చెపుతూ ఆ వచ్చిన సంపాదనతో ఇంటిని నడుపుతూ తన ఆఖరి సం.. డిగ్రీ చదువును కూడా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టింది. అద్రృష్టవశాత్తు తనకు బాంకులో ఉద్యోగం రావటం , అందులో తను చేరిపోవటం, అక్కడే తనకు ప్రభాకర్ పరిచయం, కాల క్రమేణా ఇరువురి మనసులు కలవటం జరిగాయి. రమ్యని కూడా డిగ్రీ చదివిస్తోంది యశోద. కాలం సాఫీగా గడిచిపోతోంది.


ప్రభాకర్ తల్లితండ్రులకు ఏకైక కొడుకు. తండ్రి విశ్వనాథం రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. తల్లి అనసూయ గృహిణి. వాళ్లు ప్రభాకర్ ను కంటికి రెప్పలా పెంచారు. ప్రభాకర్ కూడా కష్టపడి చదివి బాంకు ఉద్యోగాన్ని సంపాదించాడు. కొంతకాలానికి ప్రభాకర్ యశోదల ప్రేమ విషయం ఇరు పెద్దలకూ తెలిసింది. కూతురి ద్వారా ప్రభాకర్ వివరాలను తెలుసుకున్న సుశీల వాళ్ల పెళ్లికి తన అంగీకారాన్ని తెలిపింది. కొడుకు ప్రేమ పెళ్లికి ప్రభాకర్ తల్లి తండ్రులు అభ్యంతరం చెప్పారు. అనసూయ తన తమ్ముడి కూతురు విజయను కోడలిగా చేసుకోవాలని పట్టుబట్టింది. తండ్రి కూడా అదే అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రభాకర్ యశోదనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడం, దాని వలన పేరెంట్స్ తో గొడవలు జరిగాయి. యశోదను పరిచయం చేసి ఆమెను వాళ్లతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ వాళ్లు సుముఖత చూపలేదు. వాళ్లకి ఎంతగానో నచ్చచెప్ప ప్రయత్నించి విఫలుడయ్యాడు. తన మేనకోడలిని పెళ్లి చేసుకోకపోతే తను ఉరేసుకుంటానని తల్లి చెప్పటంతో ఇంట్లో జరిగినవన్నీ యశోదకు తెలియచేశాడు ప్రభాకర్.


"రిజిస్టర్ మేరేజ్ చేసుకుని మన ఇంటికి వెళదాం. వాళ్లే క్రమేపి సర్దుకుపోతారు." అన్న ప్రభాకర్ సూచనను యశోద వారించింది. "మనం ఆ పని చేస్తే మీ అమ్మ గారు తను అన్నంత పనీ చేస్తారు. ఆవిడను కోల్పోయి ఆతర్వాత జీవితాంతం మనం ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. నాన్నను కోల్పోయిన నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. అందుకని నా గురించి నీవు ఆలోచించవద్దు. మన ప్రేమ విషయం మర్చిపో. నిన్నందుకునే అద్రృష్టం నాకు లేదనుకుంటాను. నీవు మీ మామయ్య కూతురు విజయను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు" అని చెప్పి ఇంటికి వెళ్లిపోయింది యశోద.

బాధా తప్త హృదయంతో ఇంటికి చేరాడు ప్రభాకర్. ఆతర్వాత యశోద వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కు అప్లికేషను పెట్టుకోవటం, ఆ ఆర్డర్ ను అందుకొని అతిత్వరలోనే తన తల్లి, చెల్లితో ఆ ఊరు విడిచి వెళ్లిపోవటం జరిగాయి. ఇంక ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేదు.


ప్రభాకర్ కు విజయతో పెళ్లి జరిగింది. అయిష్టమైన పెళ్లి అయినా చేసుకున్నాక భార్యను బాధ పెట్టకూడదనుకుని ప్రభాకర్ భార్యను చక్కగా చూసుకుంటున్నాడు. సంసారం సాఫీగా గడుస్తోంది. కొడుకు ధీరజ్ పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వయోభారం వలన రెండు మూడేళ్ల వ్యవధిలో అనసూయ, విశ్వనాధం కాలం చేశారు. రోజులు గడుస్తున్నాయి.


యశోద ఇంటిని అమ్మి రమ్యకు మంచి సంబంధాన్ని చూసి సాఫ్టువేరు ఇంజనీర్ అయిన ప్రదీప్ తో వివాహం జరిపించింది. రమ్య ప్రదీప్ లు ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటున్నారు. కాలక్రమేణా వాళ్లకి ఇద్దరు పిల్లలు. వార్థక్య బాధలతో కొన్నేళ్లకు సుశీల కూడా కాలం చేసింది. జరిగిన దానికి బాధపడి జరగవలసిన తల్లి కార్యక్రమాలను యధావిధిగా పూర్తిచేసింది యశోద. రమ్య తమ వద్దకు వచ్చి ఉండమని ఎంతగానో నచ్చచెప్పినా యశోద అంగీకరించక సున్నితంగా తిరస్కరించింది. కాలక్రమేణా రోజులు గడుస్తున్నాయి. యశోద రిటైర్ అవ్వటం, ఈ ఊరిలో స్ధిరపడటం జరిగింది. ఇన్నేళ్లకు ఈరోజు ప్రభాకర్ ను చూశాను అనుకుంటూ ఏదో చప్పుడైతే గతం నుంచి ఇవతలకు వచ్చి వంటగది లోకి వెళ్లింది యశోద.


ఆ తర్వాత రెండు రోజులకు ప్రభాకర్ యశోద ఇంటికి వచ్చాడు. కాఫీ, ఫలహారాలయ్యాక యశోదను గురించి వివరాలను అడిగాడు. యశోద తన గురించి జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అంతా విన్న ప్రభాకర్ నిట్టూర్పు విడిచాడు. తన గురించి చెపుతూ రెండేళ్ల క్రితం తన భార్య విజయ కేన్సర్ తో మరణించిందనీ, ఏకైక కొడుకు ధీరజ్ తను ప్రేమించిన వర్షను పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు " అని చెప్పాడు .


"నా వలనే కదా నీవు జీవితమంతా ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నావు. ఆరోజు మనం పెళ్లి చేసుకుందామని ఎంతగా చెప్పినా నీవు వినలేదు. మా అమ్మ కోరిక ప్రకారం నడవమన్నావు. పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన నీవు ఇలా మోడులా ఎందుకున్నావు? నీవు వేరే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాల్సింది. నిన్ను చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. నిన్నిలా చూస్తాననుకోలేదు" అన్నాడు ప్రభాకర్ బాధాతప్త హ్రృదయంతో.


" చూడు ప్రభూ! నీ వలనే నా జీవితం ఇలా అయిందని అనుకోవడం పొరపాటు. "మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్". అని అన్నట్లు పెళ్ళిళ్లు స్వర్గం లో జరుగుతాయి. దైవ నిర్ణయం అది. అంతే. ఏదీ మన చేతుల్లో లేదు. ఉందనుకోవడం కేవలం మన భ్రమ. దైవ నిర్ణయం ప్రకారం మనం పుడతాము. అలాగే కలుస్తాము. అలాగే విడీపోతాము. విధాత మన నుదిటిన గీత వ్రాసి మనల్ని ఈ భూమి పైకి పంపుతాడు. దేవుడు మన నుదుటిన వ్రాసిన వ్రాత ప్రకారం మన జీవితాలు ఉంటాయి. జరిగిన దానికి బాధపడద్దు " అని చెప్పిన యశోదలోని ఔన్నత్యాన్ని మెచ్చుకొంటూ , అంతటి నిండైన గొప్ప మనసున్న స్త్రీ మూర్తికి మనసులోనే నమస్కరించాడు ప్రభాకర్. ఆతర్వాత ప్రభాకర్ తన ఇంటికి వెళ్లిపోయాడు.


ఒకే ఊరిలో ఉండటం , ఇద్దరి మధ్యన పవిత్రమైన ప్రేమ ఉండటం వలన తరచూ ఏ గుడికో, అనాధాశ్రమానికో కలిసి వెళుతున్నారు. వాళ్ల మధ్యన ఆధ్యాత్మిక విషయాలు, జీవితానుభవాలు, ఎన్నో వేదాంత సంబంధ చర్చలు జరుగుతాయి. ఇద్దరూ జీవితాన్ని , అందులోని కష్టనష్టాలను, ఒడిదుడుకులను తట్టుకొని వచ్చిన వారే కావటంతో కబుర్లతో వాళ్లిద్దరికీ ఎంతసేపైనా సమయం తెలీదు.


రోజులు గడుస్తున్నాయి. కానీ 'లోకులు కాకులు' కదా! వీళ్ల గురించి ఇరుగుపొరుగు తప్పుగా అనుకోవటం జరుగుతోంది. ఇది గమనించిన ప్రభాకర్ తనే చొరవ చేసుకుని " చూడు యశోదా! నేనొక విషయం చెప్పదలచుకున్నాను. లోకులు కాకులు. వాళ్లేదో మన గురించి చెడుగా అనుకుంటున్నారని నేనిది ఇప్పుడు చెప్పట్లేదు. మనం కామ వాంఛలతో వివాహం చేసుకోవట్లేదు. నా తుదిశ్వాస దాకా నా చేయి నీకు అందిస్తాను. నీ చేతిని వీడను. నీకు ఇష్టమైతే మనం వివాహం చేసుకుందాము . ఏమంటావు? ఆలోచించి చెప్పు. నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను యశోదా." అన్న ప్రభాకర్ మాటలకు అతని వ్యక్తిత్వాన్ని , మనసును ఎరిగినది కనుక సంతోషంగా తన అంగీకారాన్ని తెలిపింది యశోద. ఆప్యాయంగా యశోదను దగ్గరకు తీసుకున్నాడు ప్రభాకర్.


ఒక మంచిరోజున దేవుని గుడిలో పూల దండలు మార్చుకుని దంపతులయ్యారు. యశోదా ప్రభాకర్ లు. భర్త చేయందుకుని సంతోషంగా అతని ఇంటికి వెళ్లింది యశోద. ఇంతవరకూ తను ఉన్న ఇంటిని అనాధాశ్రమానికి వ్రాసి ఇచ్చింది యశోద. యశోదా ప్రభాకర్ ల ద్వారా వాళ్ల పెళ్లి విషయం తెలిసి రమ్య దంపతులు, ధీరజ్ దంపతులు చాలా సంతోషించారు.


ఆ భగవంతుని చల్లని దీవెనలతో యశోదా ప్రభాకర్ లు మలివయసులో సంతోషంగా జీవిస్తున్నారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాటరచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
95 views0 comments

Opmerkingen


bottom of page