top of page
Original.png

దీర్ఘాయుష్మాన్ భవ

Jul 24
4 min read

Updated: Aug 1

దీర్ఘాయుష్మాన్ భవ, హెచ్ఐవీ, ఎయిడ్స్, హెచ్ఐవీ అవగాహన, ఎయిడ్స్ అవగాహన, తెలుగు కథ, సామాజిక కథ, ప్రేరణాత్మక కథ, మహిళా జీవితం, ఆరోగ్య అవగాహన, గర్భిణి, ఆశ స్వచ్ఛంద సంస్థ, ఏఆర్టీ సెంటర్, HIV Awareness, AIDS Awareness

హెచ్ఐవీపై అవగాహనతో కొత్త ఆశను పొందిన గర్భిణి యువతి, ఆమెకు ధైర్యం చెప్పిన మహిళ మరియు ఆరోగ్యంగా జన్మించిన శిశువును చూపించే భావోద్వేగ దృశ్యం.

Deerghayushman Bhava - Telugu Emotional Social Story | Venku Sanatani

దీర్ఘాయుష్మాన్ భవ - తెలుగు భావోద్వేగ సామాజిక కథ | వెంకు సనాతని

Published In manatelugukathalu.com on 24/07/2026


"దీర్ఘాయుష్మాన్ భవ" ఒక భావోద్వేగభరితమైన సామాజిక కథ. ప్రేమలో మోసపోయి, హెచ్ఐవీ సోకిందని తెలుసుకుని జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్న యువతికి, అదే వ్యాధితో పోరాడి నిలబడిన మరో మహిళ కొత్త ఆశను చూపుతుంది. హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగిస్తూ, సరైన చికిత్సతో ఆరోగ్యంగా జీవించవచ్చనే సందేశాన్ని హృదయానికి హత్తుకునేలా అందించే ఈ కథ ప్రతి ఒక్కరూ చదవాల్సిందే.


ఎండ తీవ్రతకు తాళలేక నడకదారిలో పక్కనే పార్కు కనపడేసరికి, లోపలికి వెళ్ళి చెట్టు నీడనున్న బెంచీ మీద కూర్చుంది శారద. “ఏం ఎండల్రా బాబు!” అని అనుకుంటూ, ముఖానికి పట్టిన చెమటను చీర కొంగుతో తుడుచుకుని, ఆ కొంగుతోనే విసనకర్రలా విసురుకోసాగింది. 


పార్కులో ఎవరూ లేరు; సాయంత్రమైతే కానీ పిల్లల్తో, పెద్దల్తో నిండుగా కనిపించదు అనుకుంది మనసులో.


ఇంతలో ఒక గర్భిణీ యువతి పార్కు లోపలికి వచ్చి, అక్కడే ఓ చెట్టు క్రింద పచ్చిక మీద కూర్చుని, కాళ్ళు ముందుకు చాపుకుని, తల భాగం చెట్టుకు ఆనేట్టుగా వెనక్కి వాలి, చేతితో కడుపును నిమురుతూ శూన్యంలోకి చూడసాగింది. చుట్టుపక్కలు పట్టనంత పరధ్యానంలో ఉంది. ఏదో బాధ తాలూకు దిగులు ముఖంలో స్పష్టంగా కనపడుతుంది. కళ్ళ నిండుగా కన్నీళ్ళు, ధారగా చెంపను తడుముతున్నాయి.


ఆ యువతి వద్దకు వెళ్ళి సాంత్వన చేకూర్చాలనుకుంది శారద. ఇంతలో జరిగిన హఠాత్పరిణామానికి అదిరిపడింది. రెప్పపాటులో యువతిని చేరి, ఆమె తాగబోతున్న పురుగుల మందు డబ్బాను గట్టిగా పట్టుకుని తాగకుండా ఆపింది. కొద్దిసేపు ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. 


శారద బలవంతంగా ఆ యువతి చేతిని విదిలించి, పురుగుల మందు డబ్బాను లాక్కొని, దూరంగా ఉన్న చెత్తకుండీలో పారవేసింది.


“ఎవరు మీరు? నన్నెందుకు ఆపుతున్నారు? నన్ను చావనివ్వండి! నన్ను చావనివ్వండి!!” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందా యువతి. 


“ఎవరమ్మా నువ్వు? ఏమిటీ అఘాయిత్యం? చూస్తే ఒట్టి మనిషివి కూడా కాదు, ఎందుకింత కఠిన నిర్ణయం తీసుకున్నావు?” ఊరడింపుగా మాట్లాడింది శారద. 


“అసలు మీరెవరు? నా చావు నన్ను చావనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డారు?” ఏడుస్తూనే అంది యువతి.


“నా పేరు శారద. ఒక స్వచ్ఛంద సంస్థ తరపున వాలంటీరుగా చేస్తున్నాను. నిండా పాతికేళ్ళు కూడా లేని నువ్వు చావు దాకా వెళ్ళావంటేనే అర్థమవుతుంది నీ సమస్య చాలా పెద్దదని. 


సమస్య ఎంత పెద్దదైనా కావొచ్చు కానీ దానికి చావు మాత్రం సమాధానం కాదు, కాకూడదు. నీ తల్లి వయసున్న దాన్ని అడుగుతున్నాను. చెప్పమ్మా... ఏం జరిగింది?” అనునయంగా అంది శారద. 

ఆ మాటలకు శారద ఒడిలో తలవాల్చి బోరున విలపించిందా యువతి. శారద యువతిని ఓదార్చింది. 

యువతి కాస్త కుదుటపడి,

“నా పేరు మాధురి. ప్రేమ పేరుతో మోసపోయిన జాబితాలో నేనూ ఒకదాన్ని. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను కాదని, భూటకపు మాటలకు లోబడి మేక వన్నె పులి వంటి నీచుని వెంట నడిచి వచ్చిన అభాగ్యురాలిని. పెద్దల మాటను పెడచెవిన పెట్టి తెలిసి చేసిన తప్పుకు తగిన శాస్తే జరిగింది. ఇది నాకు జరగాల్సిందే! 


మోజు తీర్చుకుని మొహం చాటేసిన ప్రబుద్ధుడిని ఎక్కడని వెదకాలి? కడుపులో నలుసుకు నడకలొచ్చి, ఆపై మాటలు నేర్చి, “అమ్మా...! నాన్నెక్కడా...?” అని అడిగితే ఏమని చెప్పాలి?” ఇంకా ఏదో చెప్పబోతూ ఆగి తల దించుకుంది మాధురి. 


కళ్ళు సజలాలయ్యాయి.

“గర్భిణీ స్త్రీకి అన్ని పరీక్షలతో పాటుగా హెచ్ఐవీ పరీక్ష కూడా తప్పనిసరి అన్నారు. నాకు అలాంటి వ్యాధి లేదని వాదించాను. వ్యాధి ఉన్నా లేకున్నా చేయించాలన్నారు. తప్పక చేయించాను. పాజిటివ్ వచ్చింది! భయంకరమైన రోగం ఒంట్లో ఉందని తెలిసి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. అన్ని విధాలుగా దగా పడిన నాకు చావు తప్ప మార్గం కనిపించలేదు.” కన్నీటి పర్యంతం అయ్యింది మాధురి.


“ఓసి పిచ్చితల్లీ! తల్లిదండ్రుల ప్రేమను కాదని ఎవడో అనామకుడు చెప్పిన మాటలు విని గడప దాటి బయటకొచ్చావా..! చూశావా ఏమైందో..!! తల్లిదండ్రుల కన్నా మిన్నగా ప్రేమిస్తున్నానని ఎవరైనా అంటే అది ఒక పచ్చి అబద్దమని మీలాంటి వాళ్ళు ఇంకెప్పుడు తెలుసుకుంటారు?” మాధురి వైపు చూసింది శారద. 


మౌనంగా తలదించుకుంది మాధురి.


“సమస్యలన్నింటికీ చావే పరిష్కారం అనుకుంటే భూమ్మీద బ్రతుకనేదే ఉండదు. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. మనం సమస్యను భూతద్దంలో పెట్టి చూసే కొద్దీ సమస్య పెద్దదిగా కనపడుతుంది. సమాధానం కనుమరుగవుతుంది.

“నేనూ హెచ్ఐవీ సోకిన స్త్రీనే!” అంది శారద. 


ఆశ్చర్యంగా చూసింది మాధురి. 


“హెచ్ఐవీ వచ్చిందని తెలుసుకున్న తొలుత, పుట్టి బుద్దెరిగి చిన్న మందు బిళ్ళ కూడా వేసుకోలేదు. అలాంటిది నాకేంటీ వ్యాధి అని మధనపడ్డాను. నా భర్త ద్వారానే సోకిందని తెలుసుకుని కుమిలిపోయాను, కృంగిపోయాను. 


సరిదిద్దుకోలేని తప్పయితే జరిగిపోయిందని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని వందల సార్లు మొత్తుకున్నా, మందులు మాత్రం వేసుకునేవాడు కాదు నా భర్త. బాగా అశ్రద్ధ చేశాడు, కొద్ది కాలానికే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ఊరి జనం నన్ను దూరంగా పెట్టారు, గేలి చేశారు, వేలెత్తి చూపారు. 


నన్ను ఈసడించుకున్నా, నా గురించి గుసగుసలాడుకున్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా నిలబడ్డాను. బ్రతకాలనుకున్నాను. నాలాంటి పదిమందినీ బ్రతికించాలని సంకల్పించుకున్నాను. ఆశ స్వచ్ఛంద సంస్థ చేయూతతో సంతృప్తిగా జీవిస్తున్నాను.


ఇప్పుడున్న చికిత్సా విధానం, సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన ఒకప్పుడు లేవు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిన “ట్రీట్ ఆల్” విధానంతో హెచ్ఐవీ సోకిన వారి పట్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది. అలాగే ప్రభుత్వ వైద్య కేంద్రాలు, టెస్టింగ్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ అనేకం అందుబాటులోకి వచ్చాయి. 


హెచ్ఐవీ ప్రాణాంతకమే కాదనను, క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడుతూ ప్రాణాల్ని నిలబెట్టుకోవచ్చు. అందరిలాగే ఆనందంగా జీవనాన్ని కొనసాగించవచ్చు. నిశ్చింతగా ఉండమని భరోసా ఇచ్చింది శారద.


శారద మాటలు మాధురి మనసులో ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాయి. మాధురికి బ్రతుకు మీద ఆశ చిగురించింది. పుట్టబోయే బిడ్డ విషయంలో జాగ్రత్తపడాలని నిర్ణయించుకుంది. 


ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ సహకారంతో హెచ్ఐవీ వైరస్, ఎయిడ్స్ వ్యాధి, వ్యాప్తి ఇలా ప్రతి విషయాన్ని వివరంగా అడిగి తెలుసుకుంది.

అరక్షిత లైంగిక సంపర్కం వలన, కలుషిత సూదులు, సిరంజీల వలన, పరీక్షించని రక్త మార్పిడి వలన ఈ వ్యాధి వస్తుందని గ్రహించింది. 


అలాగే హెచ్ఐవీ అంటువ్యాధి కాదని, గాలి ద్వారా కానీ నీరు ద్వారా కానీ రాదని, దోమలు మరియు ఇతర కీటకాల ద్వారా వచ్చే అవకాశం లేదని తెలుసుకుంది. 


మానవ శరీరం లోపలికి ప్రవేశించిన హెచ్ఐవీ వైరస్ వ్యాధి నిరోధక శక్తికి కారణమైన సిడి 4 కణాలను చంపుతుందని, తద్వారా దశల వారీగా వివిధ రోగాలతో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధిగా మారుతుందని నిపుణులు చెప్పే ప్రతి మాటనీ తలకెక్కించుకుంది. 


ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించలేము కానీ నివారించగలమని, వ్యాధి విషయం ఆదిలో తెలుసుకుని జాగ్రత్త పడితే ప్రాణానికేం ప్రమాదం లేదని తెలియజేశారు నిపుణులు.


మాధురికి, యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏ.ఆర్.టి) సెంటరులో తగిన వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు ఇచ్చి ఎలా వాడుకోవాలో వివరంగా చెప్పారు సిబ్బంది. 


నీ ద్వారా నీ బిడ్డకు వైరస్ సోకకుండా “నెవరపిన్” అనే ఔషదాన్ని ఇస్తామని, తద్వారా గర్భస్థ శిశువుకు ఏమీ కాదని, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు చికిత్స కొనసాగుతుందని, భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండమని చెప్పారు అక్కడి వైద్యులు.


శారద తోడ్పాటుతో స్వచ్ఛంద సంస్థ మాధురికి సాయం అందించడానికి ముందుకొచ్చింది. మాధురి జీవితానికి, జీవనానికి మార్గం చూపించింది. తనకు పుట్టబోయే బిడ్డ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ముందు తాను ఆరోగ్యంగా ఉండాలని, ఏ.ఆర్.టి కేంద్రం వారు ఇస్తున్న మందులను క్రమం తప్పకుండా వాడసాగింది.


మాధురికి నెలలు నిండాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ద్వారానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పునర్జీవులైన తల్లీబిడ్డల్ని చూసి శారద కళ్ళు ఆనందభాష్పాల్ని వర్షించాయి. 


మురిపెంగా మాధురి తల నిమిరి, పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకుని “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించింది.


-శుభం-


వెంకు సనాతని గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):







వెంకు సనాతని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


వెంకు సనాతని

రచయిత పరిచయం :

పేరు : వెంకు సనాతని

అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత

ఊరు : బాపట్ల

జిల్లా : గుంటూరు

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page