top of page
Original.png

దేవుడి ఉనికిపై సందేహాలు


ఆకాశంలోకి చూస్తూ దేవుడి ఉనికిపై ఆలోచిస్తున్న వ్యక్తి
ఆకాశంలోకి చూస్తూ దేవుడి ఉనికిపై ఆలోచిస్తున్న వ్యక్తి

 

Devudi Unikipai Sandehalu - Telugu Article | R C Kumar

దేవుడి ఉనికిపై సందేహాలు - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 08/05/2026


దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం మనిషికి చాలా సహజంగా కలిగే ప్రశ్న. దీనికి తార్కికంగా మరియు ఆధ్యాత్మికంగా జవాబులు వెతుక్కోవాలి. తార్కికంగా చూసుకుంటే సమస్త విశ్వం యొక్క రూపకల్పన, సృష్టి నియమాలలో భాగంగా జరుగుతున్న సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలు, ప్రకృతిలోని క్రమశిక్షణను తరచి చూస్తే, దీని వెనుక ఎవరో ఒక తెలివైన సృష్టికర్త, చిత్రకారుడు ఉన్నాడని అనిపించక మానదు.


ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తే, కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత మరియు శంకర భగవత్పాదులు బోధించిన అద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుడు అంతరాత్మలో ఉంటాడని, నిరంతర సాధన ద్వారా అంతర్ముఖంగా పయనించి ఆయనను దర్శించవచ్చునని బోధపడుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. భగవంతునితో అనుబంధం కేవలం అనన్య భక్తి, నిస్వార్థ ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందే కానీ సందేహాలతో, ప్రశ్నలతో కాదు.


ఒక దుర్మార్గుడికి శిక్ష పడినప్పుడు అతని పాపం ఇప్పుడు పండిందని, ఒక మంచి జరిగినప్పుడు అతను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అదృష్టం కలిగిందని అనుకుంటూ ఉంటాము. భగవంతుడు కష్టాలను కలిగించేది పగబట్టి చేసే పని కాదు. అది పరీక్షా సమయం. మంచి వాడికి కష్టం వస్తే అది అతనిలో ఆత్మవిశ్వాసాన్ని, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచడానికి అని తెలుసుకోవాలి. బంగారాన్ని నిప్పులో వేస్తే మలినం తొలగిపోయి పరిశుద్ధమై మెరుస్తుంది.


అదేవిధంగా కష్టనష్టాలు మనిషిలోని అహంకారాన్ని, మోహాన్ని తొలగిస్తాయి. దేవతల నుండి, సామాన్యుల వరకు మరియు మహామహులు అయిన హరిశ్చంద్రుడు, పాండవులు, ప్రహ్లాదుడితో సహా అందరూ కష్టాలను అనుభవించినా చివరికి కీర్తిని, మోక్షాన్ని పొందగలిగారు.


దేవుడి ఉనికినే ప్రశ్నించే సందర్భాలు కొందరు సగటు మానవులకు కలుగుతాయి. గజేంద్ర మోక్షంలో 'కలడు, కలండనెడివాడు కలడో, లేడో' అని పోతన గారే సందేహాన్ని వెలిబుచ్చారు. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే కష్టాలు లేదా ఆపదలు వచ్చినప్పుడు, నమ్మినవారు మోసం చేసినప్పుడు, భక్తితో దేవుణ్ణి వేడుకొని మొక్కులు తీర్చుకున్నా కూడా కోరికలు నెరవేరనప్పుడు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనిపిస్తుంది.


దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అనే సందేహం కలుగుతుంది. కంటికి కనిపించే, చేతికి అందే నిరూపణలు భగవంతుని విషయంలో లేకపోవడం వల్ల ఇటువంటి సందేహాలు కలుగుతాయి. భగవంతుడు ఒక వస్తువు లేక మనిషి కాదు; అది ఒక అనుభూతి. దీన్ని తర్కంతో కాకుండా హృదయంతో అర్థం చేసుకోవాలి.


మంచి వాళ్లకే కష్టాలు, చెడ్డవాళ్లకు సుఖం కలుగుతుంది అనుకుంటారు కొందరు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే పనులకు ఫలితం వెంటనే రాదు. ఒక దుర్మార్గుడు సుఖాలను అనుభవిస్తున్నాడు అంటే అతడు గత జన్మల్లో చేసిన పుణ్యం ఇప్పుడు పక్వానికి వచ్చి ఫలితాన్ని ఇస్తున్నదన్నమాట. ఈ జన్మలో అతను చేస్తున్న దుర్మార్గపు పనులు, పాపాలకు ఫలితం తర్వాత వస్తుంది. కొన్నింటికి వెంటనే ఫలితం కనబడుతుంది; కొన్ని కొంతకాలం తర్వాత, మరికొన్ని రాబోయే జన్మలలో ఫలితాలనిస్తాయి.


ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ అగామికర్మలే. పోయిన జన్మలో మంచివో, చెడువో కర్మలు చేసి, వాటి ఫలితాన్ని పొందకుండా పోగై ఉన్న కర్మలన్నీ సంచిత కర్మలు అవుతాయి. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు, అవి వాటికి తగ్గ ఫలితాలను ఇస్తాయి. అలాంటి ఫలితాలను అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. అటువంటి ఫలితాలే కష్ట సుఖాలు, జయపజయాల వంటి ద్వంద్వాలు.


సనాతన ధర్మం ప్రకారం దేవుడు సర్వవ్యాపకుడుగా, సర్వాంతర్యామిగా ఉన్నాడని నమ్ముతాం. మరి కంటికి కనబడక పోవడానికి కారణం త్రిగుణాత్మకమైన యోగమాయ (అజ్ఞానం) మనల్ని ఆవరించడమే. అజ్ఞానాన్ని తొలగించుకొని హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకునే ప్రయత్నం చేస్తే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.


భగవద్గీతలోని విశ్వరూప దర్శన యోగంలో అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శన భాగ్యం భౌతిక నేత్రాలతో కలగలేదు. భగవంతుడు ప్రసాదించిన దివ్య నేత్రాల ద్వారానే చూడగలిగాడు. వీచే గాలి కంటికి కనిపించదు, కానీ అనుభవానికి వస్తుంది; అదేవిధంగా దేవుడు కూడా అంతటా ఉంటాడు, కానీ నిశ్చలమైన భక్తితోనే అనుభవంలోకి వస్తాడని గ్రహించాలి.


నిజానికి, దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం కలగడంలో తప్పులేదు. అది ఒక అన్వేషణ. లోతైన సత్యం వైపు నడిపించే జ్ఞాన మార్గంలో అది మొదటి మెట్టు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. మనం దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ విశ్వసించడం లేదు. విశ్వసించాలంటే సమర్పణ భావం ఉండాలి. భగవతారాధనతో విహిత కర్మలు చేసుకుంటూ ధర్మాచరణ పాటించడమే మనం చేయవలసిన పని. ప్రతిఫలం ఆయన చూసుకుంటాడు.


కృష్ణార్పణం  


ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page