top of page

ఎడారి ఓరన తడి





'Edari Orana Thadi' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

పైడిరాజు మంచి మనసున్న వ్యక్తి.

ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసే స్వభావం అతనిది. అనుకోకుండా అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం అతన్ని ఏ తీరానికి చేరుస్తుంది? ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.

తన ప్రాజెక్ట్ మేనేజరుతో ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి చర్చించి, యిచ్చిన సలహాలను దస్త్రంలో

నమోదు చేసుకుని ఆర్మీ బ్యారెక్క్ రోడ్డుమ్మట నడుస్తున్నాడు పైడిరాజు. మరికొంత ముందుకుసాగితే రైన్ బో క్యాంటీను వస్తుంది. అక్కడి వాళ్లిచ్చే టిఫిన్ రుచిలో తాజాతనం- ఆకలిని రెట్టింపు చేస్తుంది.

ఇప్పుడు గాని అక్కడ తిని ఒక కప్పు స్ట్రాంగ్ టీ- పుచ్చుకుంటే మళ్ళీ ఒంటి గంటన్నర వరకూ

ఆకలి తన దరిచేరదు. అలా నడుస్తున్నవాడల్లా బస్ స్టాపు వద్ద గుమికూడిన గుంపుని చూసి

ఆగాడు. ఏదో జరిగుంటుంది. ఎవడో తాగొచ్చి దేనినో ఢీ కొట్టి ఉంటాడు. అతడలా

ఆలోచించుకుంటూ ముందుకు కదిలే లోపల ఆ గుంపు నుండి ఒకమ్మాయి బెలూన్ లా బైటకు

రావడం చూసి విస్మయం చెందాడు. అమ్మాయేమో తెలుగింటి ఆడప డుచులా లేదు. ఏ ప్రాంతమో గాని ఉత్తరాది స్త్రీలా ఉంది. పొడవుగా నాజూకుగా ఉంది. మరి ఆ గుంపు మధ్య ఈవిడేమి చేస్తుంది?

ఆమె నడుస్తూ నడుస్తూ తననే సమీపించడం గమనించి అతడు జోరుగా ఆమెకు యెడంగాముందుకు సాగటానికి అడుగులు వేసాడు. కాని ఆమె అతణ్ణి అందుకుంది- “ఎక్స్యూజ్ మీ సార్!“ అంటూ-

అతడాగి అడిగాడు- “వాట్ కెనయ్ డూ ఫర్ యు మేడమ్! ” అతడెప్పుడూ అలాగే భవ్యంగా కమ్మగా మాట్లాడతాడు; ముఖ్యంగా స్త్రీలతో. ఊళ్ళో వాళ్ల పెద్దమ్మ చెప్పే సూక్తిని తు చ పాటిస్తాడు. మాటని బట్టే ఊరు ఉంటుందన్నది ఆమె ఉవాచ. దానితో బాటు బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రాములో కూడా దానినే పదే పదే చెప్పి నూరిపో సారు.

ఆమె వెంటనే స్పందించకుండా భుజానికి వ్రేలాడుతున్న సంచీ నుండి పొడవాటి ఫొటో తీసింది. అది ఒక చిన్నమ్మాయి ఛాయా చిత్రం. పుట్టుకతో మూగదయి ఉంటుంది. ఆ పిల్ల వైద్య చికిత్స కోసం ఈమె చందాలు సేకరిస్తుందేమో! కాని అతడి ఊహ తప్పయింది.

“నాపేరు పూ ర్ణిమాదేవి. ఇది నా చెల్లెలు. పేరు- నీలమ్ దేవి. మాది కొత్త ఢిల్లీ. నాలుగవ తరగతిలో చదువుకుంటున్నప్పుడు తప్పిపోయింది. ఈ పిల్లని మీరెక్కడైనా చూసారా! ప్లీజ్. బాగా గుర్తుకి తెచ్చుకుని చెప్పండి సార్”.

ఆ మాట విని అతడికి ఆశ్చర్యం కలిగింది. ఢిల్లీలో తప్పిపోయిన అమ్మాయి ఇక్కడెలా దొరుకుతుంది? అతడు శాంతంగా సాధ్యమైనంత నిదానంగా అడిగాడు. ”చూడు మేడమ్. మీరేమోకొత్త ఢిల్లీ అంటున్నారు. మీ హిందీ ఉచ్ఛరణ బట్టి మీరు పంజాబీలని తెలుస్తూంది. ఇక పాయింటుకి వస్తే, ఢిల్లీలో చదువుకుంటూ తప్పిపోయిన అమ్మాయి ఇక్క డెలా కనిపిస్తుంది? మీరు విరాళం కావాలంటే అదే మాట సీదాగా అడగండి”

“సారీ సార్! నేనేదో మూడ్ లో అవక తవకగా చెప్పానేమో! మా చెల్లి ఇక్కడే చదువుకుంది సార్. హైద్రాబాదు పొలిమేరనున్న నవనీతం ఫ్రీ చిల్డ్రన్ స్కూలులో చదువుకునేది. అంతకు ముందు భవానీదేవి ప్రీ చిల్డ్రన్ స్కూలులో చదువుకుంది. మరైతే అక్కడ యెనిమిదేళ్ల వరకే ఉండనిస్తామన్నారు. అంచేత నీలమ్ దేవిని నవనీతం చిల్డ్రన్ స్కూలులో చేర్పించాను. ఇక్కడికి వచ్చిన తరవాత అలా జరిగిపోయింది సార్. అడిగితేనేమో- ‘మీ చెల్లి చెప్పాచెయ్యకుండా హోమ్ విడిచి వెళ్లిపోయింది’ అంటున్నారు సార్. నేనిచ్చిన పోలీసు పిర్యాదు ప్రకారం, షి- టీమ్ పోలీసులు కూడా వెతుకుతున్నారు సార్. ఇంత వరకూ పోజిటివ్ రిజల్ట్ రాలేదు” అంటూ కంటనీరు నింపుకుంది పూర్ణిమాదేవి.

పైడిరాజు వెంటనే స్పందించకుండా రవంత సేపు ఆగి అడిగాడు- “మీరు దు:ఖంలో ఉన్నా రు. కాని నేను అడగవలసిన పరిస్థితి. నేను వచ్చాను- నేను చేర్పించాను- నేను వెతుకుతున్నానంటున్నారే గాని- మీరు ఒక్కసారి కూడా మీ అమ్మగురించి గాని మీ నాన్నగురించి గాని ప్రస్తావించ లేదు. మే ఐ నో ది రీజన్! ”

పైడిరాజు అడిగిన ప్రశ్నకు ఆమె వెంటనే బదులివ్వ లేదు. అతడి ముఖంలోకి తేరిపార చూస్తూ అంది- “వాళ్లు బ్రతికుంటే నేనెందుకు సార్ ఇంత దూరం వచ్చి ఫ్రీ చిల్డ్రన్ స్కూలులో మా చెల్లిని చేర్పిస్తాను? రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. నన్ను మా అవ్వే పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆమె కూడా లేదు సార్”.

అతడిక యేమీ అనలేదు. పర్సుతీసి నూరు రూ పాయల నోటు తీసి అందించా డు. పూర్ణిమాదేవి దానిని అందుకోలేదు. “ప్లీజ సార్! నాకు డబ్బులొద్దు సార్. మా చెల్లిని- - ”

“మేడమ్ పూర్ణిమాదేవిగారూ! మీకు తిక్కగాని పట్టిందా? అంకిత భావంతో శ్రమించి పనిచేసే పోలీసుల వల్ల కానిది నేనొక్కణ్ణీ చేయగలనా! నా వద్ద మంది మార్బలమా ఉంది? అసలు నన్ను చూస్తే మీకలా యెందుకు అనిపించింది? ”

“ఎందుకో నాకే తెలియదు సార్. మా అమ్మపైన ఒట్టు పెట్టి చెప్తున్నాను సార్. మీ ముఖం చూస్తే మీరు కాదనకుండా చేస్తారని పించింది. లోపల అంతరాత్మ కొట్టుకుంది”.

అతడు మాట్లాడకుండా పర్సునుండి మరొక వందరూపాయల నోటు తీసి మొత్తం రెండు వందలు ఆమెకు అందించాడు. ఆమె తీసుకోలేదు.

“వద్దు సార్. ఊరు కాని ఊరుకి వచ్చి ఒంటరిగా కష్టపడుతున్నాను. మీ సహాయం ఉంటే బాగుంటుందని పిస్తూంది సార్”.

అప్పుడు నోట్లు పర్సులోపల పెట్టి పైడిరాజు అన్నాడు. “నేనూ అదే అనబోతు న్నాను. రోజులు అసలే బాగోలేవు. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఇలా నడిరోడ్లమ్మట తిరగ డం బాగుంటుందా! నర దోషం చెడ్డదంటారు- - అంచేత నేను చెప్పినట్టు చేయండి. నీలమ్ దేవికి యెనిమిదేళ్లు దాటాయి గనుక- యెవడో దుండగుడు కిడ్నాప్ చేసుంటాడు. ఎందుకంటే- ఆడపిల్లలు అంత ధైర్యంగా ఉన్న చోటు విడిచి బరితెగించి పారిపోరు. వాళ్ళకు ఆశ్రిత గుణం యెక్కువ. కావున తిన్నగా ఓసారి పోలీసు హెడ్ క్వార్టర్సుకి వెళ్లి వినతి పత్రాల నకలు చూపించి కేసు విషయమై రిమైండర్ ఇవ్వండి. ఆ తరవాత తిన్నగా ఇంటికి వెళ్లిపొండి. ఇదిగో నా విజిటింగ్ కార్డు. మీకెప్పుడైతే పని పూర్తియింద నిపిస్తే అప్పుడు ఫోను చేయండి”.

ఆమె వెంటనే బదులివ్వకుండా చెల్లి ఫోటోని సంచీలో వేసుకుంటూ అంది. “లేదు సార్! మా చెల్లి కనిపించేంత వరకూ నేనిక్కడే వెతుకుతూ ఉంటాను. ఏమో చెప్పలేనుగాని, ఇక్కడే ఇలా తిరుగుతూ ఇక్కడే ప్రాణాలు విడుస్తా నేమో! ఇంత సేపు నాకోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు మిక్కిలి ధన్యవాదాలు”అంటూ ముందుకు కదిలింది.

“ఒక్క నిమిషం ఆగండి! “అంటూ పూర్ణిమాదేవి వద్దకు చేరాడతను. ”నా ఉద్దేశ్యం మీకు సహాయం చేయకూడదని కాదు. ఈ ఊరి వాణ్ణి కాబట్టి వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. అందులో మీకు తెలుగు కూడా సరిగ్గా తెలియదు కదా! అందుకని—మీరిప్పు డేం చేస్తారంటే—మీ ఫోను నెంబర్ఇచ్చి తిన్నగా మీరుంటూన్న రూముకి వెళ్ళిపోండి. ఈ లోపల నాకు తెలిసిన ఒక కార్పొరేటర్, ఒక యెస్సయ్ ఉన్నారు. ఏ దారిన వెళ్లి కేసుని యెలా ఛేదించాలో కనుక్కుని చెప్తాను. నన్ను నమ్మాలి”

“మీకు చెప్పలేదేమో గాని మిమ్మల్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తుందని. ఇక నా విషయానికి వస్తే మీరనుకుంటున్నట్టు నాకు బొత్తిగా తెలుగు తెలియక కాదు. అర్థం చేసుకోగలను. ఇప్పుడు రూము చేరుకున్న వెంటనే నాకు కొత్త విధమైన ఇక్కట్లు యెదు రవుతాయి. తలచుకుంటేనే కంపరం కలుగుతుంది” అదేంవిటన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు పైడిరాజు.

“కావాలనే కొందరు ఆకతాయి గాళ్లు అమాయకంగా ముఖాలు పెట్టి తలుపు తడ్తుంటారు. తలుపుతట్టి నా వేపు యెగాదిగా చూస్తుంటారు. ఆడదానిగా పుట్టాను. నన్నేం చేయమంటారో చెప్పండి? మూగవేదనతో భరించాల్సిందే! ”

అతడు కాసేపు ఆలోచనలో పడిపోయి నిదానంగా చేయి చాచి అన్నాడు- “నౌ- వీ ఆర్ ఫ్రెండ్స్. మనమిప్పుడు తిన్నగా మీ లాడ్జికి వెళదాం. పెట్టే బేడా తీసుకుని మా ఇంటికి వెళదాం. నీళ్ల కోసం నా పోర్షన్ కి ఒకరిద్దరు గృహినులు వస్తుంటారు. వాళ్లనడిగి ఏదైనా రూము మీ కోసం యేర్పాటు చేద్దాం. ముందు చేయి కలపండి”.

ఆమె పేలవంగా నవ్వి చేయి కలుపుతూ అంది- “నేనొక మాట చెప్తాను. విసుక్కోకుండా వింటారా! ”

ఉఁ అన్నాడతను.

“నేనిక్కడ కొన్నాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేనంతటి అడ్వాన్సూ నెలసరి ఇంటి బాడుగా ఇవ్వలేను. మీకభ్యంతరం లేకపోతే మీ ఇంట్లోనే ఓ మూల ఒదిగి ఉంటానండి. ఐ ప్రామిస్! మా చెల్లి ఆచూకీ తెలిసిన వెంటనే ఖాలీ చేసేస్తాను”.

అది విని ఉలిక్కి పడ్డట్టయాడు పైడిరాజు. “భలేవారే! నేనిప్పుడుండేది ఒక్కణ్ణేనండీ! పెళ్లికాని వాడితో ఉంటే మీరు క్షేమంగా ఉండగలరండీ? అమ్మానాన్నా ఊళ్లో ఉన్నారు. ఎంత పిలిచినా రానంటున్నారు. వాళ్లకు పట్నపు పొడ కొంచెం కూడా గిట్టదు. వాళ్ళను హే టర్స్ ఆఫ్ సిటీస్ అని పేరుపెట్టి పిలవాలి. అందుచేత—“

ఆమె అడ్డు తగిలింది. “ప్లీజ్ సార్! నేను మీతోనే ఉంటానండి. మీ విష యంలో నాకేమీ భయం లేదండి”.

పైడిరాజు ఇక బదులివ్వలేదు. ఇప్పుడామె ముఖంలో తేటదనం పొడసూ పింది. సంచీలోనుండి మంచినీళ్ల బాటిల్ తీసి తాగింది. అతడికి కూడా అందిస్తూ అతడితో బాటు నడవసాగింది.

పైడిరాజు రెండు గుటకలు మ్రింగి- “మరేంలేదు మేడమ్. నేను ముందే చెప్పాగా మా వాళ్లకు పట్నం అంటే నమ్మకం లేదని. ముఖ్యంగా పట్నంలో పెరిగిన యువత అంటే మరీను. అంచేత నేను డబ్బు పంపడం గాని కొంచెం ఆలస్యమైతే నేను కూడా ఇక్కడి వాళ్లతో చేరిపోయా నని అపోహ పడిపోతారు. ఇక్కడుంటూన్న వాళ్ల గురించి చాలా డేమేజింగ్ గా ఆలోచిస్తారు. చాలా డేమేజింగ్ గా మాట్లాడేస్తుంటా రు. ఇక్కడ కూడా సభ్యతా సంస్కారాలున్నవారు ఉన్నారంటే ఒప్పుకోరు. వీళ్ళలో మా మేనమామ ఒకాయన ఉన్నారు. ఆయన సంగతి ఇక చెప్పనే అవసరం లేదు. వీళ్లందర్నీ ఓ మూలకూర్చోబెట్టి ఆమూలాగ్రంగా భగవద్గీత చదవమనాలి”.

“భగద్గీత చదవడం యెందుకూ” అని అడిగిందామె.

అప్పుడతను చిన్నగ నవ్వి అన్నా డు- “అతిగా అనుమానించడాన్ని ఒక లోప భూయిష్టమైన చర్యగా పేర్కొంటూ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి హెచ్చరించ లేదూ! ” అంటూ బ్యాంకు ప్రాంగణం లోకి నడిచాడు. అటు తరవాత సెల్లర్ కాంప్లెక్సులో ఉన్న క్యాటరింగ్ హౌస్ లోకి దారితీసాడతను.

కృష్ణానగరు దిగువ వీధిలో ఉన్న ఇంటి పోర్షన్ చేరుకుని తాళం తీసి పూర్ణిమాదేవి లాడ్జింగ్ రూమునుండి తెచ్చుకున్న సామానంతా లోపల పెట్డాడు పైడిరాజు. మొగసలకి ఆవల కాస్తంత దూరంగా ఆమెకు స్థలం కేటాయించి తిరిగి చూసేటప్పటికి చుట్టు ప్రక్కల వాళ్ళూ వస్తూ పోతున్నవాళ్లూ తననే చూడటం గమనించాడు. అప్పుడు తనే పనిగట్టుకుని అటు వెళ్తూన్న ఆటో రిక్షా ఆనందరావు భార్య ధనలక్ష్మిని పిలిచి అసలు సంగతి అందరికీ వినిపించేలా బైట పెట్టాడు. ఆమె ఓర్పుగా వింది. ఎందుకంటే నీటి యెద్దడి యెక్కువైనప్పుడు ఆమె పైడిరాజు పోర్షన్కి వచ్చి బిందెలనిండా నీళ్లు పట్టుకుపోతుంటుంది. అంచేత ఆ పరిచయాన్ని ఆమె నిలుపుకుంది. అంతేగాక, నిజంగానే అతడి గురించి అక్కడ చుట్టు ప్రక్కలున్న ఆడామగా జనానికి తెలుసు; అతడిది హుందాతనం గల వ్యక్తిత్వమని- -

పోయిన నెల జరిగిన ఉదంతం ఆమెకు ఇంకా బాగా జ్ఞాపకం. మెదక్ జిల్లానుండి జాతరకొచ్చిన ఇద్దరు వృధ్ధ దంపతులు జేబులు ఖాలీ చేసుకుని దారి తప్పిపోయి నెత్తిన చేతులు పట్టుకుని నడిరోడ్డున నల్లా ప్రక్కన కూ ర్చుంటే పైడిరాజు వాళ్ళ గోడు విచారించి- స్వంత బంధువుల్లా ఆలనా పాలనా చూసి బస్సు టిక్కెట్లిచ్చి పంపించాడు. . అంతా విన్నాక పూర్ణిమాదేవి చెల్లెలి ఫోటో తీసుకుని చుట్టుప్రక్కల తెలిసిన వారందరికీ చూపించి తీసుకు వస్తానని వెళ్లింది.

ఆ పూట మధ్యాహ్ననానికి పైడిరాజు రోడ్డు మలుపున ఉన్న ఫుడ్ పాయింటు నుండి భోజనం తెచ్చిచ్చి ఆఫీసుకి వెళ్లిపోయాడు. అతడలా వెళ్లిపోవడం పూర్ణిమాదేవికి తెరపి కలిగినట్లనిపించింది. వెంటనే తలపుకి గొండెం వేసి స్నానాల గది వేపు దారి తీసింది. తలంటు పోసుకుని దుర్గాదేవికి ప్రార్థన చేస్తే గాని ఆమెకు పూర్తి ఊరట కలగదు. సాయంత్రం యేడు గంటల ప్రాంతాన ఇల్లు చేరిన పైడిరాజు బ్రీఫ్ కేసుని మంచంపైన పడవేసి పాస్కు చేతులోకి తీసుకున్నాడు.

ఎందుకూ- అని అడిగింది పూర్ణిమ.

“రోజంతా నువ్వు టీ తీసుకోలేదు కదా! బంకునుండి తీసుకు వస్తాను. బాగుంటుంది”.

“అవసరం లేదు. నేను చేసి ఉంచాను. వేడిచేసి తెస్తాను. ఉండండి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది. వార్డ్ డ్రాబులో సామానంతా ఉంది. పాల సంచి మాత్రం తెచ్చుకున్నాను”అంటూ వేడి చేసి టీ కప్పు తెచ్చి ఇచ్చింది. ఢిల్లీ ఫ్లేవర్ గావాలి—బాగుందనిపించింది.

టీ- తాగుతూనే అడిగాడు- “ఒకటి చెప్తాను ఏమీ అనుకోవు కదా! “

చెప్పమందామె.

”దారిలో వస్తూ నాకు తెలిసిన ఒకావిడ- ధనల క్ష్మిగారిని చూసాను. నేనడక్కుండానే ఆమె తానుగా చెప్పింది, వాళ్లింటి డాబాపైన మంచి గది ఉందట. నీకు కావాలేమోనని అడగ మంది”.

ఆమె యేమీ అనలేదు. ఖాళీ కప్పుని అందుకుని లోపల పెట్టి వచ్చి అంది- “మీతో రెండు చెప్పాలి. ఆలోచించి బదులిస్తారా! ” .

తలూపాడతను.

“మీకు మీపైన నమ్మకం లేదా? ”

అతడికి యేమి చెప్పాలో తోచక గుడ్లు మిటకరించి చూడసాగాడు.

“రెండవది. ఆడదానిని. నాకు లేని భయం మీకెందుకు? ఎవరున్న చోట వాళ్లుంటే యెవరికీ యేమీ కాదు”.

అతడు దానికి కూడా బదులివ్వకుండా స్నానాల గదివేపు నడిచాడు. స్నానం ముగించి పూజా గదిలో దైవప్రార్థన చేసి హోలులోకి వచ్చిన తరవాత పూర్ణిమ యెదురు వచ్చి అంది- “రేపట్నించి వంట నేనే చేస్తాను. మాది పంజాబీ వంట. మీకు నచ్చకపోతే మీరు ఫుడ్ పాయింట్ నుండి మీ తెలుగు వాళ్ళ కూర విడిగా తెచ్చుకుని తినవచ్చు. ఈపూటకు మనం బైటకెల్దాం. నీలమ్ గురించి మీరు యెవరో కార్పొరేటర్ తోనూ యెస్సయ్ తోనూ చెప్తానన్నారు. ఎప్పుడు వీలుంటుందో చెప్తే- - ”

“మాట్లాడాను. ఫోటో కాపీ తదితర పత్రాలూ కావాలన్నారు. ఈలోపల నగరంలో పరిస్తితి అల్లకల్లోలంగా ఉంది. తెలుసా! ”.

తెలియద న్నట్టు తలఅడ్డంగా ఆడించింది పూర్ణిమ.

“నలుమూలలా కిడ్నాపింగ్ గ్యాంగులు బయలు దేరాయట. అవి ఉత్తరాదినుండి వచ్చినవేనట. వీధి వీధినా స్వరక్షణ బృందాలు యేర్పాటు చేసుకుంటున్నారట. అవి వదంతులు కూడా కావచ్చు. ఎందుకైనా మంచిది. కొన్నాళ్ల వరకూ నువ్వు మాత్రం చెల్లికోసమంటూ గడపదాటి ఒంటరిగా బయలు దేరకు”

దీపాలు పెట్టే వేళ కావస్తూంది. పూర్ణిమ పూజాగదిలో దేవతల చిత్రపటాల ముందు దీపం వెలిగించి పంజాబీల తీరున సుడిదార్ వేసుకుని హాలులోకి వచ్చింది. పైడిరాజు కూడా దైవపార్థన చేసి నుదుట విభూతి పూసుకుని సిధ్ధంగా ఉన్నాడు. పూ ర్ణిమాదేవిని చూసి సిధ్దమైనా అని అడిగి చకచకా బూట్సు వేసుకుని బైటకు నడిచాడు.

“ఏమండోయ్! మీ మట్టుకు మీరు వెళ్ళి పోతే యెలా? తలుపుకి తాళం వేసి నేను రావద్దూ! ” .

అతడు వెనక్కి తిరిగి చూసి నవ్వి అన్నాడు- “భలే దానివే! మా ఇంటికి ముఖ్య అథితివి నువ్వే కదా! నిన్ను విడిచి యెలా వెళ్తాను? ఆటోరిక్షా తీసుకురావడానికి“.

అతణ్ణాపుతా అందామె. “ఆగండి! మీ స్కూటరు కేమయింది? సర్వీసింగ్ కి ఇచ్చారా! ”

“అబ్బే! బాగానే ఉంది. నువ్వు యవ్వనవతివి కదా! నేనేమో అవివాహితుణ్ణాయె— మనం ఇరుకు ఇరుగ్గా కూర్చుని వెళ్తే గుడ్లప్ప గించి చూస్తారిక్కడ వాళ్లు. అందులో నీ మేని రంగు వేరు. ఆ చూపులకు ఇబ్బంది పడతావు” వస్తూన్న నవ్వుని ఆపుకుంటూ అందామె- “నాకేమీ ఇబ్బంది లేదు. మీరు ఇబ్బంది పడిపోతూ తొట్రుపడకుండా డ్రైవ్ చేస్తే చాలు. స్కూటర్ తీయండి”

ఇద్దరూ ముఘల్ కాశ్మీరీ ఫుడ్ పాయింటులో భోజనం ముగించి ఘుమ ఘుమలాడే కోల్ కత్తా తాంబులాలు వేసుకుని ట్యాంక్ బండ్ ఫుట్ పాత్ వేపు నడచుకుంటూ వచ్చారు. పిట్టగోడకు ఆనుకుని నిల్చున్నారు. కాసేపు చల్ల గాలి పీలుస్తూ ఉండిపో యి పూర్ణిమ అడిగింది- “మీకేమనిపిస్తుంది పైడిరాజూ? మా చెల్లి ఆచూ కీ తెలిసే అవకాశం ఉందంటారా! ”.

అతడు వెంటనే బదులి వ్వకుండా అలాగే నిల్చుండిపోయి నిదానంగా పూర్ణిమ ముఖంలోకి చూస్తూ అన్నాడు- “నీవు మీ చెల్లి పట్ల చూపిస్తూన్న ప్రేమకి మనసు పరవశం చెందుతూంది. ఎందుకంటే నాకు తోబుట్టువులు లేరు. తోబుట్టువుల ప్రేమకు నేను నోచుకోలేదు. ఇక పాయింటుకి వస్తే, నాకు అబధ్ధాలు చెప్పడం చేతకాదు. సూటిగా చెప్పడమే తెలుసు. నీలమ్ ఆడపిల్ల కాబట్టి ఈపాటికి దుండగులు అద్దరికి తీసుకు వెళ్లిపోయుంటారు. అలాగని ప్రయత్నం మానమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. భగవంతుడిపైన భారం మోపి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం. అప్పాయింట్మెంటు దొరికిన రెండు మూడు రోజుల్లో మనం పోలీసు హెడ్ క్వార్టర్సుకి వెళ్ళబోతున్నాంగా! నువ్వు యే పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసావో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని వాళ్లు పిలుస్తారు. సరేనా? ” చెప్పడం ఆపి కాసేపు మెరుస్తూన్న నీళ్లలోకి చూస్తూ ఉండిపోయిన పైడిరాజు పూర్ణిమ గొంతు వినిపించక పోయే సరికి చప్పున తల తిప్పి చూసాడు. ఉగ్గబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ దుపట్టా నోటికడ్డం పెట్టుకుని రోదిస్తూంది. అతడికేమి చెప్పాలో తెలియ లేదు. నిశ్శబ్దంగా జేబులోనుంచి రుమాలు తీసిచ్చాడు.

మరికాసేపు నీళ్లలోకి చూస్తూ నిల్చుని అడిగాడు- “ఇక బయల్దేరుదామా! ” ఆమె తలూపుతూ కదలింది.

అప్పుడు యెవరో- “అయ్యా! ఒక్కనిమిషం ఆగుతారా? ”అన్న గొంతు వినిపించి ఆగాడు పైడిరాజు. “మిమ్మల్ని చాలా సేపట్నించి చూస్తున్నాను సార్! మీకు అంతరాయం కలుగుతుందని తొలగి నిల్చున్నాను సార్”.

అతడు దీప స్తంభాల వెలుతురులో తేరి చూసాడు. అమ్మాయికి పదమూడు పద్నాలుగేళ్లకు మించి ఉండవు. “సరే- ఇంతకీ మేటర్ యేమి టి? ”

ఆమె దగ్గరకు వచ్చి అంది- “వీళ్ళిద్దరూ మాతాతా బామ్మలు సార్. తోపుడు బండిలో చెక్కలూ జంతికలూ ఉల్లి గారెలూ పె ట్టుకుని అమ్ముతుంటాం సార్. రోడ్డుపైన చాలా దూరం నడుస్తుంటాం సార్. అప్పుడు నా స్లిప్పర్ పూర్తిగా అరిగిపోయి తెగిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు చేతిలో డబ్బులున్నాయి సార్. కాని రేపు రేషన్ కొనుక్కోవాలి. అంచేత మీరు గాని డబ్బులిస్తే నేను దారిలో కొత్త చెప్పులు కొనుక్కుంటాను సార్. మా అమ్మానాన్నలు చిన్నప్పుడే పోయారు సార్”.

అతడు విప్పీ విప్పని రీతిన దరహాసం చేస్తూ ఒక వంద నోటూ మరొక యాబై రూపాయల నోటూ పర్సునుండి తీసి అన్నాడు- “నోడౌట్ నేనిస్తాను. కాని దీనికి ముందు జవాబియ్యి. ఇంత మంది ఉండగా, నేను మాత్రం నీకు చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులిస్తానని యెందుకు అని పించింది?”

దానికా అమ్మాయి తలవంచుకుని బదులిచ్చింది- “మీ ముఖం చూస్తుంటే మీరు కాదనరనిపించింది సార్! నాకెందు కో మా అన్నయ్యను చూస్తున్నట్లనపించింది” అతడిక మాట్లాడ కుండా రూపాయి నోట్లు అందించి ముందుకు కదిలాడు.

“సార్! నాపేరు శ్యామల. మా తాతా బామ్మా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు సార్” .

పైడిరాజు ఓపారి తిరిగి చూసి నమస్కరించాడు. అప్పుడు గమనించాడు; పూర్ణిమ దూరంగా తొలగి నడుస్తూనే చప్పుడికి తావులేకుండా నవ్వుతూందని- -

ఎట్టకేలకు అప్పాయింట్మెంటు దొరికిన తరవాత సీనియర్ పోలీసు ఆఫీసర్ ఇలా అన్నాడు- “మీ చెల్లి కిడ్నాపర్స్ ఇక్కడి వాళ్ళైతే ఏదోలా ప్రాత కేడీల ఆచూకీ ద్వారా వాళ్ళ పిలక పట్టుకోవచ్చు. కాని కిడ్నాపర్స్ అంతర్రాష్ట్ర ముఠావాళ్ళయితే సమయం పడుతుంది. మీరు మాత్రం ఓపిక పట్టాలి. మీకు తెలియదేమో గాని, ఇటువంటి కేసులు మా వద్ద చాలానే ఉన్నాయి. పోలీసు స్పెషల్ స్క్వేడ్ లను పొరుగు రాష్ట్రాలకు పంపి కొన్ని అసాధ్యమనుకున్న కేసుల్ని సుసాధ్యం చేసాం కూడా- - బయట మా పి. యే నుండి రిసీప్టు తీసుకోండి. లక్ అనుకోని విధంగా మనల్ని చూసి స్మైల్ చేస్తుందనేది మరచిపోకండి”.

ఇద్దరూ ధన్యవా దాలు చెప్పారు. మరునాడు విశాఖ పోర్టులో యేదో ప్రోజెక్టు వ్యవహారం చూసి రావాలని పైడిరాజు అర్జంట్ పని పైన వెళ్లిపోయా డు. వారం రోజులు అక్కడే ఉండిపోయాడు. ఆ వెసులుబాటుని సద్వినియోగం చేసుకోవాలని తీర్మానించుకున్న పూర్ణి మాదేవి ధనలక్ష్మిని వెంటబెట్టుకుని చెల్లి ఆచూకీ కోసం చుట్టు ప్రక్కల గాలించింది. అలా వీది వీధినా గాలిస్తున్నప్పుడు ధనలక్ష్మి పూర్ణిమ మనోవ్యధకు యెంతగా చలించిందంటే, అలా అమ్మాయిల్ని అమానుషంగా యెత్తుకు పోయే కిడ్నాపర్లను ముందస్తు వార్నింగ్ కూడా లేకుండా షూట్ చేస్తేనే బాగుంటుందనిపించింది. ఇటువంటి అంతులేని దుఃఖం శత్రువుకి కూడా కలగకూడదేమో!

వారం రోజుల పని ముగించుకుని పైడిరాజు భాగ్యనగరం చేరాడు. దూర ప్రయాణమేమో, మంచి ఆకలితో ఉన్నాడేమో చ న్నీటి స్నానం చేసి పూర్ణిమ పెట్టిన పరోటాలు కడుపునిండా తిని టీ వీ న్యూస్ చూడాలన్న ధ్యాస కూడా మరచి- “సారీ! రేపు మాట్లాడుకుందాం“ అంటూ నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు. అతడలా నిద్రపోతున్నప్పుడు యెవరో తనను తాకుతున్న అను భూతి కలిగి భళ్లున కళ్లు తెరిచాడు. పూర్ణిమాదేవి అతడి కాళ్లు ఒత్తుతూ కనిపించింది.

ఉలిక్కి పడుతూ లేచి- ”నీకెందుకీ పని పూర్ణిమా! నాకు నిజంగానే ఒళ్ళు నెప్పేడితే చెప్పనూ! క్రోసిన్ ఒకటి అడిగి తీసుకోనూ! “

ఆ మాటకామె కళ్లు తడిసాయి. అతడి రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుని, ”నా స్వంత వ్యవహారం కోసం మిమ్మల్ని కష్టపెడుతున్నాను. మీకీ చుట్టు ప్రక్కల మంచి పేరుంది. మీ పోర్షన్ లోకి నల్ల పిల్లిలా ప్రవేశించి మీ ఇమేజ్ ని ఛిన్నా భిన్నం చేస్తున్నాను”.

అతడు నవ్వుతూ చూసి ఆమె రెండు చేతుల్నీ మృదువుగా నిమిరి- “నేనలా యెప్పుడైనా అన్నానా! నీ వంటి ప్రేమమూర్తికి వత్తాసుగా నిలవడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా! దానికేం గాని రేపు ఉదయం త్వరగా లేచి సిధ్ధంగా ఉండు. రేపు ఆఫీసుకి వెళ్ళను. టాక్సీ వస్తుంది. మనం శంషాబాదు దాటి గుండ్ల గూడ దాటి వెళ్లాలి. ఓకే! ”.

నిదానంగా అందామె- “దూరప్రయాణమేమో! ఎందుకో అడగవచ్చా? ”

“ఎందుకడగకూడదు? చెప్తాను. నేనక్కడ మా సహోద్యోగులతో కలసి ఒక గ్రౌండు నేల కొన్నాను. బ్యాంకు లోనుతో సగం, మా ఆ ఫీసువాళ్ళిచ్చే మిగతా ఋణ సహాయంతో ఇల్లు కట్టాలని తీర్మానించాను. కాని మావాళ్ళకు సిటీలైప్ పైన యెంతటి అక్కసంటే —ఈ జన్మలో అక్కణ్ణించి కదలి ఇక్కడకు రారు. వాళ్ళు సిటీ లైఫ్ కి ప్రతికూలంగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఊసు ఇప్పుడెందుకు గాని—ఆ చుట్టు ప్రక్కల భూ భకాసురులు యెక్కువ. నేను కొన్న నేల తల్లి అక్కడే భద్రంగా ఉందా లేదా కబ్జా భకాసురుల పాలయిందేమోనని చూసి రావడానికి వెళ్తున్నాం. మావాళ్ళకి ఆఖరు వార్నింగ్ ఇచ్చి డిస్ పోజ్ చేయాలని తీర్మానించాను ”

“భూమినమ్మే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సాగమంటున్నాను”అంటూ తన పోర్షన్ వేపు వెళ్ళిపోయిందామె.

పనులన్నీ పూర్తి చేసుకుని చుట్టు ప్రక్కల ఉన్నవారిని కలుసుకుని అక్కడి నీళ్ళ రుచిని పూర్ణిమకు చూపించి, రిజస్ట్రా రు ఆఫీసులో టైటిల్ డీడ్సు ఓసారి సరిచూసుకుని టాక్సీ డ్రైవరుతో కలసి భోజనాలు చేసి అదేరోజు మధ్యాహ్నంకల్లా తిరుగు ప్ర యాణానికి సిధ్ధమయారు. అలా ప్రయాణిస్తూ పచ్చదనానికి ముగ్ధుడవుతూ వస్తున్నప్పుడు పైడిరాజు చటుక్కున బండినాపమని గట్టిగా అన్నాడు. డ్రైవర్ వెంటనే ఆపాడు.

అప్పుడు పూర్ణిమ నవ్వుతూ అడిగింది- “ఎందుకూ! చెట్టు క్రింద రాశులుగా పెట్టి అమ్ముతూన్న మావిడి పళ్లు కొనడానికా? ”.

అతడు తల అడ్డంగా ఆడించి నీలమ్ ఫోటోని బైటకు తీయమన్నాడు. ఆమె అలాగే సంచీనుండి బైటకు తీసి అందించింది. ఫోటోని పరీక్షగా చూస్తూ బండి నుండి దిగాడు పైడిరాజు.

అప్పుడు పూర్ణిమ కూడా దిగు తూ అంది- “ఎవరినో చూసి నీలమ్ అనుకునేరు! ” .

అతడు తలూపుతూ అన్నాడు- “ఔను. పొరపాటు పడే అవకాశం లేక పోలేదు. కాని నేనక్కడ చూసిన అమ్మాయిల్లో అందరూ తెలుగమ్మాయిల్లాగే ఉన్నారు ఒక్కతె తప్పమా తెలుగమ్మాయిలు ఎరుపుగా లేకపోలేదు. కాని ఒక అమ్మాయి మాత్రం అటువంటి యెరుపుతనంతో లేదు. నీలా గోధుమ రంగు ఛాయలో ఉన్నట్లుంది”

అంతా అనుకున్నట్టే అయింది. “అదిగో! ఆ పిల్ల మీ చెల్లిలా లేదూ! ”అని చెప్పి ముగించేలోపల పూర్ణిమ “నీలమ్! నీలమ్! ” అంటూ పరుగున వెళ్లి చెల్లిని అక్కున చేర్చుకుంది కన్నీరు

కారుస్తూ-

“దీదీ! దీదీ! ”అంటూ నీలమ్ కూడా యేడ్వనారంబించింది. కాసేపు ఒకరినొకరు కౌగలించుకుని యేడ్చిన తరవాత నీలమ్ ఆ పిల్లను సాకుతూన్న ఇంటివాళ్ళ వద్దకు తీసుకు వెళ్లింది. వాళ్ళ ద్వారా తెలిసిన వృత్తాంతం యేమంటే— రైలుబండి యెక్కి ఓ మూల కూర్చుని యేడుస్తూ కూర్చుందట నీలమ్. కాయగూరల మడి పండ్ల తోట చూసుకుంటూన్న భార్యాభర్తలిద్దరూ అదే రైలు బండిలో వెళ్తూ ఆపిల్లను చూసి చేరదీసి ఇంటి వి లాసం చెప్పమన్నారట. నీలమ్ చెప్పడానికి తిరస్కరించింది. రాత్రి పూట యెవడో బూచోడు వచ్చి పైన పడటానికి ప్రయత్నిస్తు న్నాడట. అందువల్ల చచ్చినా తిరిగి వెళ్ళనందట. అంతావిన్న తరవాత పూర్ణిమ రైతు దంపతులిద్దరికీ ధన్యవాదాలు చెప్పి నీలమ్ ని కారెక్కించింది. హోమ్ కి వ్రాతమూలంగా రిపోర్టిచ్చారు. పోలీసులకు కూడా తెలియచేసారు. .

మరునాడు రాత్రి పైడిరాజు కలలో కూడా ఊహించలేని దృశ్యం యెదురైంది. ఎవరో తలుపు తట్టడం విని తెరిచి చూస్తే అ మ్మానాన్నలూ అత్తా మామయ్యలూ యెదుట నిల్చున్నారు. అతడికి కొన్ని క్షణాల పాటు నోట మాట రాలేదు. ప్రక్కన పూర్ణిమ నిల్చోవడం చూసి తెల్లబోయారందరూ- పూర్ణిమ ఆ వచ్చిన వాళ్ళెవరో తెలుసుకుని అందరి కాళ్ళకూ నమస్కరించింది. వాళ్ళు తేరిపార చేస్తూ మాట పలుకూ లేకుండా లోపలకు వచ్చి కూర్చున్నారు. నలువైపులా నిశ్సబ్దం రాజ్యమేలుతూంది.

మొదట పాపిరాజే అడిగాడు కొడుకుని- “ఎన్ని రోజుల్నించి కలిసుంటున్నారు? ”నీళ్లు నములుతూ బదులిచ్చాడు పైడి రాజు- “కలిసుండటం అంటే నిజంగా కలిసుండటం కాదు నాన్నా! పూర్ణిమ కొన్ని పరిస్థితుల వల్ల నాతో ఉంటూంది. నెలరోజులుగా నాతోనే ఉంటూంది. ఎందుకంటే- - “అంటూ నీలమ్ వేపు చూపు సారించి వివరించబోయాడు.

“ఛత్! నోర్ముయ్ బడవా! నెలరోజులుగా కలిసుండి యేమీ లేదంటావా? మేం గ్రామస్తులమనుకుని మమ్మల్ని తిక్కరి డింగురలమనుకుంటున్నావా! మొత్తానికి పట్నపు వాసనల్ని బాగానే వంటబెట్టుంచుకున్నావన్నమాట. ఇప్పుడు మాకేం చెప్పబోతున్నావో అదీ తెలుసు- వట్టి గార్ల్ ఫ్రెండ్- రేపు తన దారిన అదే వెళ్లిపోతుందంటావు. అలాగంటూ మరొక అమ్మాయిని మరొక రోజు గార్ల్ ఫ్రెండంటూ పోర్షన్ కి తెచ్చుకుంటావు. అలా డ్రైవర్ లేని రైలుబండిలా దూసుకు పోతూనే ఉంటావు. చివరకు మా వంశాన్ని మంట గలుపుతావు. ఇటువంటిది మా యింటా వంటా లేదు. నీవు ఉత్తమ బాలుడివనుకుని నీ కోసం రెండు సంబంధాలు తెచ్చాం. ఇంకానయం నిన్ను నమ్మి తాంబూలాల తట్ట మార్చుకో లేదు. నువ్వుగాని ఇదే రోజున గుడిలో మా సమక్షాన ఈ పిల్లమెడలో తాళి కట్టలేదనుకో ఇక నీకూ మాకూ సంబంధం తీరిపోయినట్టే“ అంటూ భార్య వేపు బామ్మర్ది వేపూ ఓ చూపు చూసి, తెచ్చుకున్న పెట్టే బేడా అందుకోవ డానికి వెళ్ళాడు.

అప్పుడు వెంటనే పైడి రాజు పూర్ణిమా ఆయన కాళ్ళపైన పడ్డారు “మీరు చెప్పినట్టే చేస్తాం!”అంటూ.

తలచుకున్న కార్యాన్ని గాంధర్వులే యెదురొచ్చి నెరవేర్చడమంటే ఇదేగా మరి!

శుభం

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.



63 views0 comments
bottom of page