top of page
Original.png

హరిత నారి

21 hours ago
4 min read

తులసమ్మ చెట్టుకు నీళ్లు పోస్తుండగా తల్లి గొప్పతనాన్ని గర్వంగా చూస్తున్న అమెరికా నుంచి వచ్చిన కొడుకు హరీష్.

Haritha Naari - Telugu Social Story | Penumaka Vasantha

హరిత నారి - తెలుగు సామాజిక కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 15/09/2026


‘హరిత నారి’ ఒక స్ఫూర్తిదాయకమైన తెలుగు సామాజిక కథ. తులసమ్మ తన గ్రామాన్ని పచ్చదనంతో నింపుతూ పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలుస్తుంది. పదేళ్ల తర్వాత ఊరికి వచ్చిన కొడుకు హరీష్, తల్లి సేవాభావాన్ని చూసి ఆమె గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. తల్లిదండ్రుల విలువ, చెట్ల పెంపకం, మానవ సంబంధాల గొప్పతనాన్ని తెలియజేసే ఈ కథను చదవండి.


పదేళ్ళు అయింది ఇండియా వచ్చి. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు ఒకసారి రమ్మని అమ్మ ఫోన్ చేస్తే వస్తున్నాను. కారు మాట్లాడుకుని మా ఊరి వైపు ప్రయాణం అయ్యాను.

రోడ్డు ఇరువైపులా చెట్లు పెద్దవై ఎంతో అందంగా కనిపించాయి. నేను వెళ్ళేప్పుడు చిన్న వేప చెట్లు ఉండేవి. ఇపుడు అవి పెద్దవై ఎంతో బాగున్నాయి. ఆ చెట్లలో అమ్మ కనిపించింది. ఇవన్నీ అమ్మ నాటినవే.


ఊరిలోకి వెళ్తుంటే... వచ్చే చెరువు చుట్టూతా కూడా చెట్లు పెద్దవయి చాలా బాగుంది చూడటానికి. ప్రతి ఇంటి ముందు కూడా ఒక చెట్టు పెద్దవై వుండటం ఆనందంగా ఉంది. మా ఇంటి ముందు చెట్టు కింద అరుగుపై నాన్నా కూచుని వున్నాడు.

నన్ను చూసి "ఏమేవు మీ అబ్బాయి వచ్చాడు" అని కేక వేసాడు. "హరీష్ వచ్చాడా?" అంటూ అమ్మ లోపలి నుండి వచ్చింది. అమ్మ ఏం మారలేదు. నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇపుడు అంతే. కొంచెం జుట్టు తెల్లబడింది. "హరి నీళ్ళు తాగు!" అంటూ నీళ్ళు ఇచ్చింది.


"అమ్మా ఊరంతా ఎంత మారిపోయింది! పచ్చని చెట్లు ఎక్కడ చూసినా చాలా బాగుంది." "తర్వాత మాట్లాడుదువు గానీ రారా ఇంట్లోకి. ముందు స్నానం చేసి రా అన్నం వడ్డిస్తాను" ఇంట్లోకి తీసుకెళ్ళింది హరీష్‌ను తులసమ్మ.


పెరడులో ఎన్నో మొక్కలు పెంచింది అమ్మ. స్నానం చేసి వచ్చేసరికి దొడ్లో మామిడి చెట్టు అరుగుపై అరిటాకులో అన్నం వడ్డించింది. "ఏరా ఎలా ఉన్నావు?" అమ్మ కళ్ళలో ప్రేమ పొంగి పొరలుతుంటే అడిగింది. "బావున్నా అమ్మా..! ఇలా ఎలా పెంచావు చెట్లను అమ్మా!" ఆశ్చర్య పోతూ అడిగాడు హరీష్.


"ఇదివరకు భుక్తి కోసం పెంచాను. ఇపుడు అది అలవాటుగా మారి నా ఆత్మ బంధువులు అయ్యాయి" మామిడిచెట్టు పిందెను ఆనందంగా చూస్తూ అంది.


"అవునమ్మా నీ ఈ పోలిక నాకు వచ్చింది. అమెరికాలో నేను చెట్లు పెంచుతున్నా."


"అవునురా..! మొన్న ఫోన్లో చూపించావు కదా. వాటికి చెంబుడు నీళ్లు పోస్తే చాలు పులకరించి మనకు పువ్వులు, పండ్లు ఇస్తాయి. అదే మనుష్యులకు ఇస్తే... మన ఇంటి గడప దాటితే... మారుస్తారు."


"మీరు పెరిగి వృద్ధిలోకి వస్తే... ఎంత ఆనందంగా ఉంటుందో... చెట్లు కాయలు కాస్తే... అదే ఆనందం. ఈ చెట్ల పెంపకం ఇప్పటిదా? అది నాతో పాటు పెరుగుతూ వచ్చింది. మా నాన్నతో పాటు పొలం వెళ్ళి అక్కడ పండే పంటలను, కూరలను చూసి ఎదగటం ఆరంభించా. ఉద్యోగస్తుడు వద్దని మీ నాన్న రైతు అయినా చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టా. పొలంలో అన్ని పండించా."


"అవునమ్మా మాకు బాగా గుర్తు. అక్కా నేను నీతో ఆదివారాలు పొలం వచ్చి చూసే వాళ్ళం. పొలం చుట్టూతా తాటిచెట్లు ఉండేవి. నువ్వు వాటితో పాటు మామిడి చెట్లు నాటావు."


"అవునురా ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు ఉంటే... చాలు వంటకు ఉపయోగపడతాయి. హరీష్! మన ఊరి చుట్టూతా పదివేల మొక్కలు నాటాను. మన పక్కనున్న పట్నంలో నాకు సన్మానం చేస్తున్నారు. ఎటు నువ్వు ఉన్నావుగా. నన్ను పట్నం తీసుకెళ్ళు."


"అలాగే అమ్మా! నీకు అవార్డ్ వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది. నాన్నకు ఏంటి బాగాలేదు అన్నావు?"


"ఈ మధ్య ఆయనకు వంట్లో బాగోలేదురా. ఆయనకు టెస్టులు అవి చేయించాలి. ఆ హాస్పిటల్ లో మాట్లాడటం అవి నాకు రాదు. నువ్వే అవన్నీ చేయాలి. నిన్ను చూసి కూడా చాలా రోజులయింది. అందుకే రమ్మని చెప్పాను."


"నేనే వద్దనుకుంటున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేసావు" అంటూ అన్నం తిని చేతులు కడుగుకున్నా. కాసేపు నాన్నతో మాట్లాడి రెస్ట్ తీసుకున్నా.


మరుసటి రోజు ఊళ్లోకి వెళ్ళా. అందరూ అమ్మను మెచ్చుకుంటున్నారు. "మీ అమ్మను మెచ్చుకోవాలి. అసలు రెస్ట్ తీసుకోదు. తెల్లవారుఝామున లేచి ఊరు చుట్టూ తిరిగి చెట్లను చూస్తుంది. చేతిలో ఒక బిందె ఎపుడు వుంటుంది. ఎక్కడ చెట్టు ఎండినా తీసి ఇంకో చెట్టును, లేదా విత్తును నాటకుండా ఉండదు. ఈ ఊరు ఇట్లా పచ్చగా అయిందంటే... మీ అమ్మ చలవ.


మొన్న ముఖ్యమంత్రి ఊళ్ళోకి వచ్చి చెట్లను చూసి మెచ్చుకున్నాడు. అపుడు మీ అమ్మను పిలిచి సన్మానం చేసాడు. మా అందరికి మీ అమ్మను బాసుగా పెట్టాడు. ఇపుడు మీ అమ్మకు మేము సాయం చేస్తే... ఈ ఊరు ఇట్లా చెట్లతో నిండింది. నువ్వు, మీ అక్క పెళ్లిళ్లు అయి వెళ్ళినాకా ఇట్లా వూరంతా చెట్లతో నింపింది. మా ఆడవాళ్లలా టివి చూడదు. షాపింగ్లు చేయదు" అని అమ్మను మెచ్చుకున్నారు.


అమ్మ అందుకే అంత సన్నగా ఆరోగ్యంగా ఉందని మనసులో తృప్తిగా అనుకున్నాను.


మరసటి రోజు అమ్మను తీసుకుని పట్నం వెళ్ళాను. అక్కడ పెద్ద ఫంక్షన్ హాల్లో అమ్మను వ్యవసాయ శాఖ మంత్రి అవార్డు ఇచ్చి సత్కరించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ "నిజంగా తులసమ్మగారి లాంటి ఒక ఆడ మనిషి ఊరికి ఒకళ్ళు ఉంటే... చాలు ఆ ఊరు బాగుపడుతుంది. ఈవిడకు హరిత నారి అనే బిరుదు ఇస్తున్నాము. గత పదేళ్లుగా ఆవిడ చేసిన కృషికి వీళ్ల ఊరు రామాపురం ఇంత అభివృద్ధి చెందింది. ఈవిడను ఆదర్శంగా తీసుకుని మిగతా మహిళలు కూడా మీ ఊర్లో చెట్లు నాటాలని కోరుకుంటున్నాను."


తులసమ్మ మాట్లాడుతూ "నాకు ఈ అవార్డ్ ఇచ్చి ఇంకా బాధ్యతను పెంచారు. మా చుట్టూ వున్న పది ఊళ్ళలో చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాను. నాకు బీపీ షుగర్ రాలేదంటే... కేవలం ఈ మొక్కల వల్లే. పోయిన సారి నాకు ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి చెట్లను నాటి వాటిని రెట్టింపు చేసాను. నా పిల్లలు ఎలాగో నాకు చెట్లు, మొక్కలు అంతే. నేను పోయేలోగా లక్ష చెట్లు నాటాలని సంకల్పము చేస్తున్నాను. మీ అందరి సహకారం ఉంటే... నేను నా కోరికను నెరవేర్చుకుంటాను" అంటూ కూచుంది.


చివరగా నేను మాట్లాడుతూ "మా అమ్మ మీద ఇపుడు నాకు గౌరవం పెరిగింది. అమెరికాలో నేను ఎవరో తెలియకుండా ఉండేకన్నా తులసమ్మగారి అబ్బాయి అనిపించుకోవటంలో తృప్తి ఉందని నేను వచ్చిన నాల్గురోజుల్లో గ్రహించాను. మా అమ్మను చూసాకా డబ్బు కన్నా మన వెనుక కొంతమంది మనుష్యులు వుండటం బెస్ట్ అనిపించింది. ఇంకో నాలుగేళ్లలో ఇండియాకు పూర్తిగా వచ్చి మా అమ్మ లక్ష మొక్కల కార్యక్రమానికి సాయం చేస్తానని" ప్రకటిస్తూ అమ్మ వైపు చూసాను.


అమ్మ కళ్ళలో ఆనందంతో కంట నీరు రావటం గమనించాను.


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page