జరీ చీర భాగోతం
Updated: Aug 1
జరీ చీర భాగోతం, సి రాజేశ్వరి, కుటుంబ కథ, అత్త కోడళ్ళ కథ, తెలుగు కథ, అనుబంధాలు, ప్రేమ, అపోహలు, జరీ చీర, మనతెలుగుకథలు

Jari Cheera Bhagotham - Telugu Family Story | Chilakamarri Rajeswari
జరీ చీర భాగోతం - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి రాజేశ్వరి
Published in manatelugukathalu.com on 31/07/2026
కొన్నిసార్లు వస్తువుల విలువ కంటే వాటి వెనుక దాగి ఉన్న ప్రేమ విలువ ఎంతో గొప్పది. ఒక చిన్న అపోహ ఎలా కుటుంబంలో అపార్థానికి దారి తీస్తుందో, అదే అపోహ ఎలా నిజం తెలుసుకున్న తర్వాత బంధాన్ని మరింత బలపరుస్తుందో హృద్యంగా చెప్పిన కథ "జరీ చీర భాగోతం". సి. రాజేశ్వరి రచించిన ఈ కథ అత్తా-కోడళ్ల అనుబంధం, నమ్మకం, ఆవేశం, అవగాహన వంటి విలువలను చక్కగా ప్రతిబింబిస్తుంది.
"ఏమండీ, ఇది విన్నారా" అంటూ హుషారుగా అడిగింది లత.
"శ్రీమతి గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, అంత ఆనందం కలిగించిన వార్త ఏమిటో?" అని అడిగాడు రాజు.
"పాత జరీచీరలు, కంచి, గద్వాల్, ఏదైనా, ఎలా ఉన్నా, చినిగిపోయినా, మిల్లు ధరలకు కొనడానికి, ఒక ఏజెన్సీ రేపు 9 గంటల కల్లా మన దగ్గరకే వచ్చేస్తున్నారట. ఇంతకన్నా మంచి వార్త ఏముంటుంది చెప్పండి? అదీ కాక, నా పెళ్లి పట్టుచీరలు అన్నీ కొంచెం చిరగడం మొదలైంది, కాబట్టి బయటకు కట్టుకోలేను, చినిగినవి ఎవరికీ ఇవ్వలేను.
అలా అని బయట పారేయలేను. ఏమి చేయాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నాను. అలాంటి సమయంలో మన దగ్గరకే వచ్చి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకుంటామని అంటే, అంతకన్నా మంచి వార్త ఉంటుందా, చెప్పండి" ఎంతో ఆనందంగా చెప్పింది లత.
"నేను కూడా ఆ సందేశాన్ని చూశాను, కానీ స్వచ్ఛమైన జరీ ఉన్న చీరలు అయితేనే తీసుకుంటారు అని పెట్టినట్టున్నారుగా" కొంచెం అనుమానంగా అన్నాడు రాజు.
"భలేవారే, పెళ్లికూతురుకి పెట్టవలసిన మూడు చీరలు, కంచి నుండి ప్రత్యేకంగా జరీ పెద్ద అంచువి తెప్పించాను, అని మీ అమ్మగారు, అంటే మా అత్తయ్యగారు మన పెళ్ళిలో మావాళ్లందరినీ పిలిచి మరీ చెప్పారు, నాకు బాగా గుర్తు ఉంది.
ఇదిగో, ఇప్పుడే చెపుతున్నా. ఆ మూడు చీరల మీద వచ్చిన డబ్బులతో నేను ఒక పెద్ద పట్టుచీర కొనుక్కొంటాను. మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను, అంతే" అంది లత.
"సరే, నీ మాట ఎప్పుడు కాదన్నాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, వాటి మీద వచ్చిన డబ్బులు అన్నీ నీకే, సంతోషమేనా" అని అన్నాడు రాజు.
ఆరోజు అంతా, తన చీరలకు వచ్చే డబ్బులు, వాటితో ఎలాంటి చీర కొనుక్కోవచ్చు అనే ఆలోచనలతోనే గడిపేసింది లత.
మరుసటిరోజు ఉదయం త్వరత్వరగా, వంటపని అంతా పూర్తి చేసుకొని, సమూహంలో ఆ ఏజెన్సీ వచ్చిన వార్త కోసం చరవాణి చేతిలోనే పట్టుకుని కూర్చుంది. ఆ సమయం రానే వచ్చింది.
"ఇదిగో, ఏమండీ, చీరలు తీసుకునే అతను వచ్చేసారుట. నేను కిందకు వెళుతున్నాను, మీరు కూడా వస్తారేమిటి?" అని చీరలు పెట్టిన సంచీ పట్టుకొని అడిగింది లత.
"నాకు ఏం తెలుసు చీరల గురించి. నువ్వు వెళ్లు " అన్నాడు రాజు.
"సర్లెండి, నేను వెళుతున్నా, తలుపు వేసుకోండి" అంటూ హడావుడి గా కిందకి దిగింది లత.
కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతుంటే, లత వెళ్లి పావుగంట కూడా అవలేదు. "అప్పుడే రాదు, ఇంక ఎవరు వస్తారు ఈ సమయంలో" అనుకుంటూ తలుపు తీశాడు రాజు.
"చాలా తొందరగా వచ్చేసావే, పని అయిందా? సంతోషమేనా" అని అడుగుతున్న రాజుని పట్టించుకోకుండా, లత ఆవేశంగా లోపలికి వచ్చి చేతిలో ఉన్న సంచీ మంచం మీదకు విసిరేసింది. "పచ్చి మోసం, దగా" అంటూ కుర్చీలో కూలబడింది.
"ఏమైంది? చీరలకి ఎంత ఇచ్చాడు? నువ్వు అనుకొన్నట్టుగా వచ్చిందా" అని నెమ్మదిగా అడిగాడు రాజు.
"ఆ, ఇచ్చాడు! మోయలేక వచ్చేసా. ఒక పెద్ద సంచీ పట్టుకెళ్లి తెచ్చుకోండి" అంది లత.
"వ్యంగ్యం ఆపి అసలు విషయం ఏమిటో చెప్పు" అన్నాడు అసహనంగా రాజు.
"నా పట్టుచీరలు చూసి, అందులో ఉన్న జరీకి ఇవ్వడానికి తగినంత ధనం లేదని, మన దగ్గరే ఉంచుకోమని తిరిగి నాకే ఇచ్చేశాడు" కోపంగా అంది లత.
"అవునా, అంత తక్కువ డబ్బులు తెచ్చాడా?" అన్నాడు రాజు.
"మీకు అలా అర్థమైందా? అవును లెండి, మన పెళ్లిలో అత్తగారు 'పెళ్లికూతురి చీరలు కంచి నుంచి పెద్ద జరీ అంచు చీరలు తెప్పించాను ప్రత్యేకంగా' అంటే మావాళ్లందరు తెగ ముచ్చటపడిపోయారు, 'మీ అత్తగారికి నీ మీద ఎంత ప్రేమో' అని.
నేను కూడా నాకు ఎంత మంచి అత్తగారు దొరికిందో అని మురిసిపోయాను, కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు" అంది ఇంకా కోపంగా లత.
"ఇంతకీ చీరలు కొనే అతను ఏమన్నాడో, ఇప్పటికైనా చెపుతావా?" అన్నాడు రాజు.
"ఏమంటాడు? మీరు పెట్టిన చీరలకి చిల్లి గవ్వ కూడా రాదు అని నిర్మొహమాటంగా చెప్పాడు. అందులో ఉన్నది అసలు స్వచ్ఛమైన జరీయే కాదంట" అంది ఇంకా కోపం తగ్గని లత.
"అదా సంగతి! మా అమ్మ ఏమన్నా నీకు ఇచ్చిన చీరలు స్వచ్ఛమైన జరీ అని చెప్పి ఇచ్చారా? కోడలు కోసం అని ముచ్చటపడి అభిమానంతో నీకు ఇష్టమైన రంగులు ఏవో కనుక్కొని మరీ కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించింది.
పెళ్లిలోనే కాదు, తరువాత ఎప్పుడు కట్టుకున్నా, ఎంత బాగున్నాయో, 'అత్తయ్యగారి ఎంపికకి తిరుగులేదు' అని ఎన్నిసార్లు తలచుకొని నా దగ్గర మురిసిపోయావో నాకైతే బాగా గుర్తుంది.
అదంతా మర్చిపోయి ఇప్పుడేమో 'అత్తయ్యగారు మోసం చేశారని' మూతి ముడుచుకున్నావు. ఇప్పుడేమైంది చెప్పు? నీకు కొన్న చీరలు జరీవి కాదు అనేటప్పటికి, ఇప్పటిదాకా అమ్మ మీద ఉన్న అభిమానం అంతా ఆవిడ మీద కోపంగా మారిందా?
అవి స్వచ్ఛమైన జరీ కాదని ఆవిడకు కూడా తెలియకపోవచ్చు. అమ్మిన వాడు జరీ చీరలు అని చెబితే నమ్మి కొని ఉండొచ్చు కదా, ఆలోచించు" అన్నాడు అనునయంగా రాజు.
"అవును నిజమే. నేను అంత లోతుగా ఆలోచించలేదు. నన్ను మన్నించండి.
అత్తయ్యగారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో నాకు మాత్రం తెలీదా? నేను ఏదో ఆవేశంలో అలా అన్నాను. ఇంతకీ నాకు కొన్న చీరలు స్వచ్ఛమైన జరీవి కావని తెలిస్తే, ఆవిడ చాలా బాధపడతారు. నేను చెప్పను, మీరు కూడా చెప్పద్దు" అంది లత.
"అలాగే, మనం ఇంక ఈ విషయం గురించి మర్చిపోయి సంతోషంగా ఉందాము, సరేనా. ఇంతటితో జరీచీర కథ సమాప్తం" అన్నాడు రాజు.
"అవును, కథ కంచికి, మనం సంతోషాల ఇంటికి" అంది లత.
***
చిలకమర్రి రాజేశ్వరి గారి కొన్ని ఇతర రచనలు:
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.










Comments