top of page
Original.png

కవి సమ్మేళనము


కవి సమ్మేళనంలో కొత్త పట్టుచీర ధరించి సన్మానం అందుకుంటున్న రాణి, ఆమెను ప్రేమగా చూస్తున్న భర్త మూర్తి, రంగురంగుల చీరల్లో సాహిత్య మిత్రులతో సందడిగా సాగుతున్న తెలుగు కవి సమ్మేళనం.

Kavi Sammelanamu - Telugu Family Comedy StoryAddanki Lakshmi

కవి సమ్మేళనము - తెలుగు కుటుంబ హాస్య కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 02/08/2026

 

కవిత్వం అంటే భావాలా... లేక ఫ్యాషనా? కవి సమ్మేళనం అంటే సాహిత్య వేదికా... లేక స్నేహితుల సందడా? ఈ ప్రశ్నలకు నవ్వులు పూయించే సమాధానం చెప్పే హాస్యభరిత వ్యంగ్య కథే "కవి సమ్మేళనము". కొత్తగా కవితలు రాయడం మొదలుపెట్టిన రాణి, ఆమె అమాయకత్వం, భర్త మూర్తి చమత్కారాలు, కవి సమ్మేళనంలో జరిగిన సరదా సంఘటనలు పాఠకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఒక ఆలోచనను కూడా మిగులుస్తాయి. హాస్యం, కుటుంబ అనుబంధాలు, సాహిత్యంపై వ్యంగ్యం కలిసిన ఈ కథ తప్పకుండా మీకు నచ్చుతుంది.


"ఏవండీ! ఇదిగో కాఫీ," అంటూ ముచ్చటగా తెచ్చింది రాణి.


"అక్కడ పెట్టి వెళ్ళు" అన్నాడు మూర్తి కంప్యూటర్ లో పని చేసుకుంటూ.


"అది కాదండి!" అంటూ నసిగింది.


"ఏమిటో చెప్పు!" అన్నాడు విసుగ్గా.


"మీరు ఎప్పుడూ ఆ కంప్యూటర్లో, ఏదో ఒకటి రాస్తూ కూర్చుంటారు, చేటభారతంలా ఆ కథలు, నవలలు," అంటూ విసుక్కుంది రాణి.


"ఆ సరేలే, చెప్పు వింటాను" అన్నాడు నవ్వుతూ.


"ఏం లేదండి, నేను ఒక పట్టు చీర కొనుక్కోవాలి," అంటూ నసిగింది.


"అదేమిటి? మొన్ననే కదా పండక్కి 5000 పెట్టి పట్టుచీర కొనుక్కున్నావు, ఏమైంది?"


"అది కాదండి! మా కవితా సమ్మేళనం మీటింగు ఉంది, అందుగురించి."


"ఏమిటి? నువ్వు కవితలు రాస్తున్నావా? ఇది ఎప్పటినుంచి?" ఆశ్చర్యపోయాడు మూర్తి.


"అవునండి, ఈమధ్య మొదలు పెట్టాను."


"ఏమిటి? నీకు తెలుగు అక్షరాలు కూడా పూర్తిగా రావు, టెన్త్ క్లాస్ నాలుగు సార్లు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఏం రాయగలవే?"


"అలాగే మీరు వేళాకోళం చేస్తారు. అందరూ చెబుతున్నారు. కవితలు రాయడానికి చదువు సంధ్యలు అక్కర్లేదు, మనసు లోపల చక్కటి భావాలు ఉండాలి అని."


"అట్లాగా! అమ్మో! నీకు చక్కటి భావాలు కూడా ఉన్నాయా!" అంటూ నవ్వాడు మూర్తి.


"ఈ మధ్యనే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారండి ఎట్లా రాయాలో. నాకు మొన్న రాసిన కవితలో ప్రథమ బహుమతి దొరికింది తెలుసా! కవి సమ్మేళనంలో మేమంతా కవితలు చదువుతాము, అందుకే పట్టు చీర కొనుక్కోవాలి."


"పట్టుచీరకి, కవి సమ్మేళనానికి సంబంధం ఏమిటి? నీ దగ్గర బీరువానిండా 50 చీరలు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి కట్టుకో."


"అలా కాదండి, ఆ చీరలన్నీ పాతవి, అందరూ చూసేశారు, అప్పుడప్పుడు కట్టుకున్నవి. ఇప్పుడు దీని గురించి స్పెషల్ గా కొత్తగా కొనుక్కోవాలి. లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ 'మొన్ననే కట్టుకున్నావు కదా ఈ చీర' అని వేళాకోళం చేస్తారు."


"సరే ఎంత ఉంటుందేమిటి?"

 

"ఎంతో లేదండి 10,000."


"అయ్యో రామ, ఎందుకొచ్చిందే నీకు కవితల పిచ్చి! నీ పిచ్చి మూలంగా నా డబ్బు వేస్ట్ అవుతుంది," ఏసుకున్నాడు మూర్తి.


"ఈ ఒక్కసారికే లెండి, మళ్లీ అడగను," అంటూ బ్రతిమాలింది రాణి.


"సరే, ఏం రాసావూ కవిత? ఒకసారి చదువు వింటాను."


రాణికి సంతోషం అయిపోయింది, వెళ్లి నోటు పుస్తకం తీసుకొచ్చింది, కవితను చదవడం మొదలు పెట్టింది.


అంశం: వెన్నెలమ్మ

రచన: శ్రీమతి రాణి


కారు చీకటిలో కదలి వెళుతున్నాను,

కాళ్ళకి చెప్పులు లేవు, పెద్ద అడవి,

 ముళ్ళు గుచ్చుకుంటున్నాయి,

నేను వెళ్లే ప్రాంతం ఎంతో దూరం. మధ్య మధ్యలో

బాధతో అయ్యో అంటూ కాలి ముళ్ళు తీసుకున్నాను, 

రెండు అడుగులు వేస్తే పెద్ద బండరాయి, మీద పడ్డాను.


గాఢాంధకారం.

కాలు నొప్పి,

గాయము తగిలింది, రక్తం వచ్చినా కనిపించదు చిమ్మ చీకటి,

మనసంతా చీకటి అలుముకుంది,

చీకటి అంటే నాకు ఎంతో భయం.

రాణి కవితను చదువుకుంటూ పోతుంది.


"చాలు చాలు నీ కవిత్వం. నీ అంశము వెన్నెలమ్మ గురించి కదా! ఇలా గాఢాంధకారం అంటూ మొదలు పెట్టావ్ ఏంటి?" మూర్తి కుతూహలంగా అడిగాడు.


"అంతేనండి! మీకు ఏం తెలుసు అసలు కవిత్వం గురించి? ఆ పిచ్చిపిచ్చి నవలలు, కథలు రాసుకుంటూ కూర్చుంటారు."


"కానీ నువ్వు చిమ్మ చీకటి గురించి రాస్తున్నావే, వెన్నెల గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు కదా," మూర్తికి డౌటు వచ్చింది.


"అలాగే ఉంటుంది. కవిత్వం అంటే ఏమిటి అనుకున్నారు? ఆ లోపల భావాలను మనం అర్థం చేసుకోవాలి. చీకటి గురించి రాశాను అనుకోండి, చీకటి తర్వాత మనకేం వస్తుంది? వెలుతురు వస్తుంది కదా, అది అసలు పాయింట్! అలా దాని లోపల ఉండే భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది కవిత్వం అంటే," అంటూ రాణి సంబరపడిపోతుంది.


"చాలా బావుందే నీ కవిత, అయితే దీనికేనా నీకు ప్రథమ బహుమతి దొరికింది?"


"అవునండి! నాకే దొరికింది, వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నారు," సంతోష పడిపోతోంది రాణి.


"నా కర్మ కాలిందే, నా పరువు అంతా తీస్తున్నావు కదటే నీ కవితల మూలంగా," మూర్తి మొత్తుకున్నాడు.


"చూశారా! మీరు ఎంత కుళ్ళు పడుతున్నారో? ఆడవాళ్ళు వంట పనులు చేసుకుంటూ కూర్చోవాలి, వాళ్ళు కవిత్వాలు అవి రాయకూడదు, అన్నీ మా మగవాళ్ళు మేమే గొప్ప అని!" అంటూ సాగదీసింది రాణి.


"అయినా మీ కథలు చేట భారతంలాగా! అదిగో ఆ పెద్ద గేటు, ఆ గేటుకి ఎర్ర రంగు వేశారు, ఆ గేటుకు పెద్ద గడియ ఉంది, ఆ గేటు పక్కనే చిన్న గేటు కూడా పెట్టారు. పెద్ద గేటు నుంచి కారులు వెళతాయి, చిన్న గేటు లోంచి మనుషులు వెళతారు. 


చిన్న గేటు రంగు వేరు, పచ్చ రంగు వేశారు, ఆ వీధిలో రెండు రంగులు గేటుకి వేసిన ఇల్లు ఇది ఒక్కటే. ఇలా మొదలెడతారు, ఒక గేటు వర్ణిస్తారు 4 పేజీలు! 


లోపల పెద్ద భవనం ఉంటుంది, దాని గురించి 50 పేజీలు వర్ణన. అందుకనే మీ కథలకి, సీరియల్ కి ఇప్పుడు వేల్యూ పోయింది, ఈ పిచ్చి పిచ్చి రాతలు వల్ల. 


ఇప్పుడు మా కవిత్వానికి చూడండి, ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఎంతోమంది కొత్త కవులు, రచయితలు చక్కటి కవిత్వం రాస్తున్నారు. ఇంతకీ నాకు 10,000 ఇస్తారా లేదా?" రాణి ఆత్రుతగా అడిగింది.


"సరేలే! నీతో నాకు వాదన లెందుకు? ఇదిగో తీసుకో పదివేలు," అంటూ చెక్కు రాసిచ్చాడు మూర్తి.


"ఎంత మంచి వారండి మీరు! థాంక్యూ!" అంటూ సంబరంగా వెళ్లిపోయింది రాణి.


ఆదివారం నాడు కవి సమ్మేళనం జరిగింది, ఆ రోజంతా హడావిడే. చీర బాగుందా అంటూ పది సార్లు అడిగింది, భర్తని, కొడుకు సుధాకర్ ని. "చాలా బాగుంది వెళ్లి రా" అని చెప్పారు.


ఉదయం 10 గంటలకు వెళ్ళింది, సాయంత్రం మెల్లిగా నాలుగు గంటలకు వచ్చింది.


"ఎలా జరిగింది మేడమ్ గారు మీ సన్మానం?" అని మూర్తి అడిగాడు రాణిని రాగానే.


"చాలా బాగా జరిగిందండి. రాధిక కట్టుకొచ్చింది ఆ చీర ఎంత బాగుందని? పింక్ కలరు దానికి గ్రీన్ బార్డర్ వేశారు, 20,000 పెట్టి కలకత్తా నుంచి తెప్పించింది. రేఖ కట్టుకొచ్చింది ఎంత మంచి చీరండి, చాలా బాగుంది డబల్ కలర్, కొత్త వెరైటీగా, 15,000 అయింది, ఆన్లైన్లో తెప్పించుకున్నాను అని చెప్పింది అండి. 


నా చీర ఎవరికీ నచ్చలేదు, నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, 'ఎప్పుడూ ఆ పోచంపల్లి కడతావేంటి, కొత్త రకాలు ఎన్ని వచ్చాయో' అని వేళాకోళం చేశారండి," రాణి గడగడా మాట్లాడుతోంది.


"అవును! కవిసమ్మేళనం ఎలా జరిగింది?" మూర్తి కుతూహలంగా అడిగాడు.


"అది బాగానే జరిగింది లెండి. గౌరమ్మ గారని, సీనియర్ రచయిత్రి అట, ఆవిడ పక్కన కూర్చున్నాను. ఆవిడ చెప్తున్నారు. ఈమధ్య వాళ్ళ కొడుకు కోడలు అమెరికా నుంచి వచ్చారట, ఇద్దరు మనవలు. వాళ్ల ఫోటోలన్నీ చూపించారు, ఎంత బాగున్నారో, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతారు, అవన్నీ చూపించారావిడ సెల్ ఫోనులో. 


అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ పద్మావతి గారి కూతురు కడుపుతో ఉంది, తొమ్మిదో నెల వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది, ఆఫీస్ వాళ్ళు మూడు నెలలు సెలవిచ్చారట. 


సూడిదలు ఏడో నెలలో చేద్దామంటే కుదరలేదు, ఇప్పుడు వచ్చేవారం పెట్టుకుంటాము, మీరందరూ తప్పకుండా రండి అని మమ్మల్ని పిలుస్తున్నారు, 'అయ్యో తప్పకుండా వస్తామండి పిన్ని గారు' అని చెప్పాను."


"అవును రాణీ! నీ కవిత చదివావా లేదా?"


"ఆ చదివానండి, అందరూ ఎంతో బాగా తప్పట్లు కొట్టారు. మధ్య మధ్యలో నిర్వాహకులు అంటున్నారు, 'మాట్లాడ వద్దు, సైలెన్స్ సైలెన్స్' అని. ఎంతసేపని కూర్చుంటాం మాట్లాడకుండా! ఎవరికి వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఎప్పుడో ఒకసారి కలుస్తాము, మాట్లాడొద్దు అంటే ఎలా? 


సంగీత గారి అమ్మాయికి పెళ్లి కుదిరింది అండి, అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆవిడ చూపించింది వాళ్ల పెళ్లికి పిల్లాడికి పెట్టే బట్టలు, ఆ అమ్మాయికి పెట్టే నగలు, అవన్నీ. ఎంత బాగా పెడుతున్నారండి ఆడపిల్లకి! హాల్ బుక్ చేశారట, ఆ హాలు చూపించింది, ఎంత బాగుందో! 


చాలా సందడిగా గడిచిందనుకోండి కవి సమ్మేళనం, అందరూ ముచ్చటగా మాట్లాడుకున్నాము. ఇదిగో! ఈ శాలువా, ఈ మొమెంటో ఇచ్చారు," సభలో విషయాలన్నీ సంతోషంగా చెబుతోంది రాణి.


"చాలా బాగుంది రాణి, నీ ఫోటో కూడా వేశారు మెమొంటో మీద, శాలువా కూడా బాగుంది."


"సరేలెండి, దీనికి వెయ్యి రూపాయలు తీసుకున్నారు, ఊరికే ఇచ్చారు అనుకుంటున్నారేంటి? ఈ రెండు కలిపి 500 ఉండవు, ఇంకో 500 వాళ్లకి లాభమే."


"అలా అనకు రాణి! ఈ సమ్మేళనాలు చేస్తే వాళ్ళకి ఏమీ లాభం? పైగా టెన్షన్ కూడా, ఆ హాలుకే వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అందరూ అలాగే అనుకుంటారు వాళ్ళు ఏదో నిర్వాహకులు తినేస్తున్నారని, నిజానికి పాపం ఈ కవి సమ్మేళనాలను పెట్టి వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, సమయానికి ఫండ్స్ రాక," మూర్తికి ఈ సమ్మేళనాల గురించి బాగా తెలుసు, నిర్వాహకులకు ఎంత కష్టమో.


"అమ్మా! ఫోటోలు తీయించుకున్నావా?" అక్కడే కూర్చుని చదువుకుంటున్న సుధాకర్ అడుగుతున్నాడు,


"అవున్రా, ఫ్రెండ్స్ నా ఫోటోలు చాలా తీశారు, పంపిస్తానని అన్నారు, రేపు పేపర్ వాడు కూడా మా ఫోటోలు వేస్తాడు పేపర్లో," అంటూ ఆనంద పడిపోయింది రాణి.


"అమ్మా! నీకు కవిత్వం ఏమొస్తుంది? గాఢాంధకారము అనే పదంలో వత్తులు సరిగ్గా ఇవ్వవు. కారము అంటే కరము అని రాస్తావు. దీర్ఘాలు రావు, ఒత్తులు రావు, నా పేరు సుధాకర్, అది కూడా సరిగ్గా రాయలేవు, నీకు కవిత్వం ఏమిటమ్మా? తెలుగు భాషను ఖూనీ చేస్తావు."


"నీకేం వస్తుందిరా తెలుగు? రెండు తెలుగు ముక్కలు మాట్లాడలేవు ఆ ఇంగ్లీషులో తప్ప," అంటూ రాణి లోపలికి వెళ్ళింది మండిపడుతూ.


"ఏమిటి డాడీ! నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తావు అమ్మని, అమ్మకి తెలుగు సరిగా రాదు అని తెలుసు కదా."


"పోనీ లేరా! పాపం! దాని సంతోషం దానిది. పాపం ఆ నిర్వాహకులు అందరూ ఇలాంటి వాళ్ళని ఎలా భరిస్తున్నారో చూసావా? ఇంతటి సంతోషం మనం ఇవ్వగలమా? అమ్మ మొహం చూడు, కాకరపువ్వొత్తిలా వెలిగిపోతోంది. 


నేను పది వేలు ఇచ్చాను ఆ పట్టు చీర కు, ఆమెకు సంతోషం కలగలేదు. సభ కెళ్ళి ఒక్క కవితా వినలేదు, తన ఫ్రెండ్స్ అందరి విషయాలు విని అక్కడ కాలక్షేపం చేసి ఆనంద పడిపోతోంది. 


వీళ్ళకి కవితలు ముఖ్యం కాదు, స్నేహితులు అందరినీ కలుసుకోవడం ముఖ్యం. మీ అమ్మకి ఇంత ఆనందాన్ని నువ్వు ఇవ్వగలవా? ఆ నిర్వహకులకు నేనే ఫోన్ చేసి చెప్తాను, అప్పుడప్పుడు ఇలాంటి సమ్మేళనాలు పెట్టండి మా ఆవిడ చాలా ఆనంద పడుతోంది అని."


"డాడీ, ఆ పని మాత్రం చేయకు, ఆ సమ్మేళనానికి వెళ్లి వచ్చి ఆ చీరలు, ఆ నగలు, ఆ సంభాషణ నేను భరించలేను," అన్నాడు సుధాకర్.


రాణి బెడ్ రూమ్ కి వెళ్లి డ్రస్సు మార్చుకొని వచ్చింది.


"ఒరేయ్ సుధా! అక్కడ పెట్టారురా మంచిభోజనము.. ఏ హోటల్ నుంచి తెప్పించారో గాని చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని ఐటెంలు. ఐస్ క్రీములు, రెండు రకాల స్వీట్లు, పలావు, మరి దమ్మాలు చేశారండి, ఎంత టేస్టీగా ఉందో," అంటూ మళ్ళీ మొదలు పెట్టింది రాణి సోఫాలో కూర్చుంటూ.


"అమ్మా! నేను చదువుకోవాలి, రేపు నాకు ఎగ్జామ్ ఉంది," అంటూ అక్కడి నుంచి సుధాకర్ బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు.


 "రాణీ! నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, మళ్ళీ సభ పెట్టించమంటావా? వాళ్లు నాకు తెలుసు. నేను డొనేషన్ ఇస్తాను, మళ్లీ పెడతారు, కానీ పట్టుచీర మటుకు అడక్కు," అంటూ నవ్వాడు మూర్తి.


"ఏం అక్కర్లేదు! నేను ఇంక ఇలాంటి సభలకే వెళ్ళను," అంది కోపంగా రాణి.


"అవునండి, ఒక ఆవిడ అంటుంది 'ఇదేం కవిత ఇది, కవితేనా! నా మొహం లాగా ఉంది' అంది. 


‘కవిత్వం రాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, ఇలాంటి అడ్డమైన చెత్త రాయకూడదు’ అంటోంది ఇంకొక ఆవిడ. 


'నీలాంటి వాళ్ల మూలంగా కవిత్వానికి ఉండే విలువ అంతా పోతోంది' అంటుందండి ఇంకొక ఆవిడ. 


‘కవిత్వము అంత సులభంగా వచ్చేది కాదు, పేరు ప్రఖ్యాతిగాంచిన కవులు రాసిన కవితలన్నీ బాగా చదువుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, బాగా కృషి చేయాలి, అప్పుడే కవిత రాయడం మొదలు పెట్టాలి’


 ఇంకొక ఆవిడ బోడి సలహాలు చెప్తుంది నాకు. 


నా ఫ్రెండ్ సుజాత ‘నువ్వు కూడా కవిత రాయవే’ అని నన్ను ప్రోత్సహించింది. వచ్చిన వాళ్ళందరికీ శాలువాలు కప్పేరు. నాకు ఇంక ఆ సభలు వద్దు, కవితలు వద్దు! హాయిగా మధ్యాహ్నం ఇంట్లో కూర్చుని టీవీలో ఆ సీరియల్ చూసుకుంటాను. మీరేమీ నా గురించి సభలు పెట్టించక్కర్లేదు," అంటూ మండిపడింది రాణి.


"రాణి నా ముద్దుల గుమ్మా! ఇదే నేను చెప్తే వింటావా! హాయిగా టీవీ సీరియల్స్ చూసుకో, కవిత్వం వద్దు, కాకరకాయలు వద్దు. ఇంక కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో, చాలా కష్టపడి పోయావు," అన్నాడు మూర్తి.


రాణి అలసి పోయిందేమో, వెంటనే సోఫాలో అలాగే పడుకుని నిద్రపోయింది.


మాయా మర్మం తెలియని, అమాయకంగా ఉన్న తన భార్య రాణి మొహం చూస్తూ మూర్తి ఎంతో జాలిపడ్డాడు.


మంచిగా చెబితే వినరు, ఎవరికైనా అనుభవంతోనే పాఠాలు నేర్చుకుంటారు అనుకున్నాడు మూర్తి.


***


అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


అద్దంకి లక్ష్మి

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page