మలి వయస్సులో మరో జీవితం - పార్ట్ 2
- Yasoda Pulugurtha

- 16 hours ago
- 5 min read
#YasodaPulugurtha, #MaliVayassuloMaroJeevitham, #మలివయస్సులోమరోజీవితం, #యశోదపులుగుర్త, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Mali Vayassulo Maro Jeevitham - Part 2/2 - New Telugu Story Written By Yasoda Pulugurtha Published in manatelugukathalu.com on 20/02/2026
మలి వయస్సులో మరో జీవితం - పార్ట్ 2/2 - తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
జరిగిన కథ:
52 ఏళ్ల వయసులో గర్భవతి అవుతుంది కామేశ్వరి. కొడుకు, కూతురు, బంధువులు వ్యతిరేకించినా 'వేద' అనే ఆడపిల్లకు జన్మనిస్తుంది.
ఇక మలి వయస్సులో మరో జీవితం పార్ట్ 2 చదవండి.
“ఛ! నేను రానంటే బలవంతంగా బాగుండదంటూ లాక్కొచ్చావు. మీ అమ్మగారు ఈ వయస్సులో పిల్లను కనడం అసహ్యంగా అనిపించడం లేదా నీకు? ఇప్పుడు ఈ వయస్సులో పెంచుదామనే? ఏ అనాథాశ్రమంలోనో ఇచ్చేయవచ్చు కదా? ఇప్పుడా పిల్ల నాకు మరదలా? రేపు బావా బావా నన్ను ఎత్తుకోవూ అంటూ వెంటపడితే ఎత్తుకుని మోయాలా?” అంటూ ఫక్కున నవ్వాడు.
“మీరేమో ఆ పసిముండకి బావ, నేను అక్కని. మన పిల్లలకు పిన్నమ్మ, మా అన్న పిల్లలకు అత్తమ్మ” అంటూ తను కూడా భర్తతో పాటూ అనడం, వ్యంగ్యంగా నవ్వడం తన చెవులకు సోకాయి. భారంగా నిట్టూర్చి అక్కడనుండి వెళ్లిపోయింది. కోడలు కూడా ఒకరోజు వైష్ణవితో, “రాత్రి మా చిన్నాడపడుచుగారు ఎందుకో గుక్కపెట్టి ఏడ్చారు పాపం. అత్తగారు చాలా సేపు సముదాయించవలసి వచ్చింది. ఆ పిల్లకి మాటలు వచ్చాక నన్ను ‘వదినా,’ అంటూ అందరి ముందు పిలుస్తుంటుంటే ఏదోలా అనిపిస్తుంది కదూ వైష్ణవీ?” అనడం తనకు వినిపించింది.
కాల గర్భంలో మరో అయిదు సంవత్సరాలు దాటిపోయాయి.
వేదను స్కూల్లో వేశారు. చురుగ్గా, తెలివిగా ఉండే వేద అంటే స్కూల్ టీచర్లందరికీ ముద్దే.
దాశరథి గారు రిటైర్ అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఆయన షష్టిపూర్తి ఉత్సవాన్ని చేయ సంకల్పించారు కుటుంబ సభ్యులు. ముహూర్తం పెట్టగానే బిలబిల్లాడుతూ వచ్చేసారందరూ.
ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. వేద పుట్టిన తరువాత వాళ్లు రెండు మూడు సార్లు వచ్చి వెళ్లినా, వేదను దగ్గరకు తీసుకోలేదు. వేద కూడా వాళ్లను చూడగానే ముడుచుకుపోవడం కామేశ్వరి గ్రహించింది.
కొడుకూ, కూతురు షాపింగ్ చేసి ఇంట్లో వాళ్లందరికీ కొత్త బట్టలు తెచ్చారు. వైష్ణవి, ఆదిత్య పిల్లలు ఆ బట్టలను చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ‘నాది బాగుందంటే నాది’ అంటూ ఒకటే గోలగోల, అరుపులతో ఇల్లు దద్దరిల్లిపోతోంది. “పిన్నమ్మా, నీకు బట్టలు తేలేదా?” అని వైష్ణవి పిల్లలు, “ఏయ్ అత్తమ్మా, నీకు కొత్త బట్టలు లేవా?” అంటూ అక్కడే ఉన్న వేదను గేలిచేస్తుంటే, ఏమీ అర్థంకాని ఆ పసిపిల్ల కంగారు పడిపోయి తల్లి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. వాళ్ల మాటలన్నీ వంటగదిలోకి వినిపిస్తూనే ఉన్నాయి. కామేశ్వరికి రోషం ఉవ్వెత్తున లేచింది. విసురుగా హాల్ లోకి వస్తూ, “వైష్ణవీ!” అంటూ ఒక్క అరుపు అరిచింది. వైష్ణవి హడావిడిగా వస్తూనే, “ఎందుకలా గావుకేక పెడతావమ్మా? మెల్లిగా పిలవవచ్చు కదా? అయినా ఏం కొంపలు మునిగాయని అంతలా అరిచావు?”
“అవునే వైషూ, నావి అరుపులే మరి. మీరు చేస్తున్న పనులకు నాలో సహనం పోతోందే. పిల్లలందరికీ బట్టలు తెచ్చావు. మరి మీ చెల్లెలికి తెచ్చావా?”
“చెల్లెలా!?”
“ఏం ‘వేద’ నీ చెల్లెలు కాదా?”
“అమ్మా, నా కూతురు హాసిని బట్టలు కొన్ని వాడేసినవి, కొన్ని వాడనివి బీరువాలో పడి ఉంటే తీసుకొచ్చాను. అయిదేళ్ల క్రితం కొన్నవే అయినా ఇంకా కొత్తగానే ఉన్నాయి. అది సరిగా వేసుకోకుండానే పొట్టి అయిపోయాయి. చాలా ఖరీదైనవి. వేదకి వేయచ్చు. మళ్లీ కొత్త బట్టలు అనవసరం అనుకున్నాను. ఎదిగే పిల్ల కదా.
“హాసిని బట్టలు వేదకు తప్పకుండా వేస్తానే వైషూ. కానీ మీ నాన్న షష్టిపూర్తికి అందరికీ కొత్త బట్టలు కొని దానికి తేకపోవడం ఏమిటి? “అమ్మా, నాకు అక్క కొత్త డ్రెస్ కొనలేదని నా దగ్గరకు వచ్చి బిక్కమొగం వేసింది. అందరితో బాటూ దానికి కూడా తేవాలన్న జ్ఞానం లేదా నీకు?”
“అబ్బో మహారాణి మరి. అవునౌను తేవాలి. తప్పైపోయింది తల్లీ,” అంటూ రెండు చెంపలూ వాయించుకుంటూ విసవిసా లోపలికి వెళ్లిపోయింది.
కూతురితో మాటలు అనవసరం అనుకుంటూ ఆవిడ కూడా లోపలకు వెళ్లిపోయింది.
షష్టిపూర్తి ఉత్సవంలో కామేశ్వరి కుట్టించిన పట్టు లంగా, జాకెట్టు, చెవులకు చిన్న చిన్న బంగారు జుంకీలు, మెడలో బంగారపు గొలుసు వేసుకుని బుట్టబొమ్మలా తిరుగుతున్న వేదనే చూస్తున్నారందరూ. పాపను పిలిచి మరీ బుగ్గలను ముద్దాడుతున్నారు. నాన్న ఒడిలో కూర్చుని ఏవో మాటలు చెపుతూ గారాలు పోస్తోంది.
ఎవరు ఎలా అనుకుంటున్నా షష్ఠిపూర్తి కార్యక్రమం మటుకు చాలా కనులవిందుగా పూర్తయింది.
ఇంక అందరూ మరునాడు బయలుదేరే హడావిడిలో ఉన్నారు. “బాబోయ్, బోల్డంత వర్క్ పెండింగ్ ఉండిపోయిందనుకుంటూ” కంగారు పడుతున్నారు.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక అందరూ హాల్ లో సోఫాలో కూర్చుని టి.వి చూస్తున్నారు.
ఇంతలో కామేశ్వరి అక్కడికి ప్రవేశిస్తూనే టి.వి. ఆఫ్ చేసింది.
ఉన్నట్టుండి అందరూ ఆవిడవైపు ప్రశ్నార్థకంగా చూసారు.
“మీ అందరితో మాట్లాడాలని ఆఫ్ చేశాను. సారీ!”
“వేద మీ కంటికి ఎలా కనిపిస్తోంది?” అక్కడ కూర్చున్న అందరివైపు కలయచూస్తూ అడిగింది. ఎవరూ మాట్లాడకపోయేసరికి, “అది దారిని పోయే ఏ దానయ్యకో పుట్టిన బిడ్డకాదు. మీలాగనే మా రక్తాన్ని పంచుకున్న బిడ్డరా అది. సొంత చెల్లెలన్న అభిమానం కూడా లేని మీరు మనుషులేనా? చెప్పండి ఆదిత్యా, వైష్ణవీ. మీరే దాన్ని చెల్లెలిగా అభిమానించనప్పుడు మీ ఆయనకి, నీ భార్యకి ఇంకా లోకువ అయిపోయింది కదరా ఆ పసిది. మేము చేసిన తప్పుకి అది శిక్ష అనుభవిస్తోందిరా.”
“ఏమే వైష్ణవీ, వేదను పిన్ని అని, అత్త అని పిలవమని మీ పిల్లలకు, ఆదిత్య పిల్లలకు చెప్పావా?”
“మీ పిల్లలు, ఆదిత్య పిల్లలు కలిసి కావాలని మరీ వేదను ‘ఒసే పిన్నమ్మా, అత్తమ్మా’ అంటూ గేలిచేయడం నేను విన్నానే. అది ముఖం చిన్నబుచ్చుకుని, “నా పేరు ‘వేద’ కదా అమ్మా, వేరేగా పిలుస్తున్నారెందుకంటూ” అడిగేసరికి నాకు నోట మాట రాలేదు.”
“ఏం! అది మా పిల్లలకు పిన్ని, అన్నయ్య పిల్లలకు అత్తే అవుతుంది కదా. సాంప్రదాయ పద్ధతిలో చక్కగా పిలవమని చెప్పడం తప్పా?”
“అది అయిదేళ్లు పసిదే. వాళ్లందరికంటే చిన్నది. వావి వరసలతో కాకుండా ‘వేదా’ అని పిలవమను. అయినా సాంప్రదాయం అంటున్నావు, అన్నయ్యను వదినను పేరు పెట్టి పిలుస్తావు. నీ భర్తను పేరు పెట్టి ఏకవచనంతో పిలుస్తావు. మీ పిల్లలూ, ఆదిత్య పిల్లలూ పేర్లతోనే పిలుచుకుంటారు. మరి వరసలు, సాంప్రదాయ పిలుపులు ఒక్క వేద దగ్గరేనా? ఏనాడూ దాన్ని చేరదీయలేదు. ఒక్క చాక్లెట్ అయినా దాని చేతిలో పెట్టారా? వేదను మీ చెల్లెలిగా భావించనప్పుడు మీరీ ఇంటి గడపను తొక్కనవసరం లేదు. దానిపట్ల మీ ప్రవర్తనకు నా మనసెంతో క్షోభ పడుతోందో మీకర్థం కాదు. మీరు వచ్చి ఆ పసిదాన్ని చిన్నబుచ్చడమే కాదు, మానసికంగా నన్ను బాధపెడుతున్నారు.”
“ఈ వయస్సులో వేదను పెంచి పెద్దచేసి ప్రయోజకురాలిని చేయడానికి మాకు మానసికమైన శక్తి, ఆరోగ్యం ఉండాలి. కానీ మీరొచ్చిన ప్రతీసారీ దాన్ని ఏవో మాటలంటూ ఉంటారు. ఇప్పుడు దానికి అర్థం కాకపోయినా, ఊహ వచ్చాక దాని మనస్సు ఎంత బాధ పడుతుందో గ్రహించేరా? మీ మాటలకూ, చేష్టలకూ నాలో ఉన్న శక్తి అంతా ఆవిరి అయిపోతోంది. ఒంట్లో ఒకరకమైన నిస్సత్తువ ఆవహిస్తోంది. మీ అందరి మాటలు నా మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అది అనాథ అయిపోతుందేమోనన్న భయానికి గురవుతున్నాను. ఇకపై వేదను చిన్న మాట అన్నా సహించేది లేదు. నా మాటలు అర్థం చేసుకుంటేనే ఈ గడప తొక్కండి. లేకపోతే ఇంక రానవసరం లేదు. ఎవరి బ్రతుకులు వాళ్లు బ్రతుకుదాం.”
కామేశ్వరి మాట్లాడటం పూర్తయింది. అరవయ్యేళ్ళ ఆమె స్వరంలో తడబాటు లేదు. అందరి వైపూ గంభీరంగా చూసి, తను చెప్పాల్సిందింకేం లేనట్లు అక్కడ నుండీ అవతలకు కదిలిందామె.
ఆమె మాటలు వింటున్న అందరికీ దిమ్మతిరిగిపోయింది.
కామేశ్వరి కూతురూ, కొడుకు అవాక్కై నోళ్లు తెరుచుకుని ఉండిపోయారు.
అల్లుడు, కోడలు అయోమయంగా చూసారు.
సోఫాలలోనే స్థాణువులై కూర్చున్న వాళ్లందరినీ ఓసారి పరిశీలనగా చూసి, చిన్నగా నిట్టూర్చాడు దాశరథి, కామేశ్వరి భర్త.
కొన్ని కథలింతే. అంతమౌతాయనుకునేంతలోనే ఆరంభమవుతూ ఉంటాయి.
అంతం కాదిది ఆరంభం
===============================================
సమాప్తం
===============================================
యశోద పులుగుర్త గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






Comments