మనసుకు తోడై
- Malla Karunya Kumar

- 5 hours ago
- 6 min read
బువ్వమ్మ, తెలుగు కథ, భావోద్వేగ కథ, మానవత్వం, కృతజ్ఞత, కుటుంబ విలువలు, అనుబంధం, జీవన విలువలు, గ్రామీణ జీవితం, డబ్బు, తెలుగు సాహిత్యం, Emotional Story, Village Story, Inspirational Story, Telugu Literature, Mana Telugu Kathalu

Manasuku Thodai - Telugu Emotional Family Story | Malla Karunya Kumar
మనసుకు తోడై - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In? manatelugukathalu.com On 04/07/2026
పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి తల్లిదండ్రికీ ఆందోళన ఉంటుంది. మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి జీవితం కావాలని కోరుకోవడం సహజమే. అయితే, ఆ ప్రయాణంలో వారి సహజ ప్రతిభ, సృజనాత్మకత, అభిరుచులను నిర్లక్ష్యం చేస్తే వారు తమ అసలైన సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
"మనసుకు తోడై" కథలో, కొడుకు కథలు రాయడాన్ని చదువుకు ఆటంకంగా భావించిన ఒక తండ్రి, జీవితంలో ఎదురైన అనుభవం ద్వారా తన దృక్పథాన్ని మార్చుకుంటాడు. చదువు మరియు అభిరుచులు పరస్పర విరుద్ధాలు కావని, రెండూ సమతుల్యంగా సాగితేనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని ఈ కథ హృదయానికి హత్తుకునేలా తెలియజేస్తుంది.
ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, విద్యార్థి తప్పక చదవాల్సిన ఆలోచింపజేసే కుటుంబ కథ ఇది.
"ఏమాటకామాటే. మీ అబ్బాయి బాగా కథలు రాస్తాడు భాస్కర్, మొన్న పేపర్లో అచ్చైన కథ బ్రహ్మాండంగా ఉంది!". భాస్కర్తో పాటు నడుస్తూ అన్నాడు తిరుపతిరావు.
ఏ హావభావాలు లేకుండా నిస్తేజంగా తిరుపతి వైపు చూశాడు భాస్కర్.
"ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు భాస్కర్, ఇలాంటి వాటిపైకి మనస్సు వెళ్ళిందంటే చదువులో వెనుకబడతాడు. మొన్న క్వార్టర్లీలో మీ వాడికి పెర్ఫార్మెన్స్ తగ్గి సెకండ్ ప్లేస్ రావడానికి ఇదే కారణమేమో? మా అబ్బాయి చదువు మీద శ్రద్ధ పెట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. కిందటి తరగతుల్లో మీ అబ్బాయే మొదట ఉండేవాడు, కాస్త చూసుకో అసలే పదవ తరగతి," అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు తిరుపతి.
తిరుపతి మాటలు భాస్కర్లో భయాన్ని కలుగజేశాయి, "చక్కగా చదువుకోమంటే, ఇలా కథలు, కవితలని సమయం వృధా చేస్తున్నాడు. ఈసారి గట్టిగా హెచ్చరిస్తే కానీ దారిలోకి రాడు," అని గట్టి నిర్ణయం తీసుకొని ఆవేశంతో ఇంటికి చేరుకున్నాడు.
దసరా సెలవులు కావడంతో తన అభిరుచికి సమయం కేటాయిస్తూ కథలు రాస్తూ కనిపించాడు కౌశిక్.
"రేయ్ మొన్న పరీక్షల్లో నీ ర్యాంక్ ఎంతరా?" ఉరుముతూ కొడుకు వైపు చూస్తూ అన్నాడు.
కథ రాయడంలో నిమగ్నమై ఉన్న కౌశిక్ తండ్రి వైపు చూసి, "సెకండ్ క్లాస్ నాన్న!" అని ధీమాగా సమాధానమిచ్చాడు.
"ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదురా!" ఆవేశంతో కొడుకు వీపుపై బాదుతూ, కథల పుస్తకాన్ని చించేసి, "ఇంకోసారి కథ, కవిత అని సమయం వృధా చేస్తే తోలు తీస్తాను, ముందు పాఠశాల పుస్తకాలు తీసి చదవడం మొదలుపెట్టు," అని గద్దించాడు.
"కథలు, కవితలు రాయడం నా హాబీ కదా నాన్న! మీకు తెలుసు కదా?" దీనంగా ముఖం పెడుతూ, చిరిగి చెల్లాచెదురైన తన కథల పుస్తకం వైపు చూస్తూ బాధపడుతూ అన్నాడు.
భర్త అరుపులకు వంట గది నుండి అక్కడికి చేరుకుంది భార్య ఉష. "ఏవండీ! ఏమిటా ఆవేశం, అసలేం జరిగింది?" అని అడిగింది ఉష.
తిరుపతిరావుతో జరిగిన సంభాషణ వివరిస్తూ, కొడుకు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్యతో వివరంగా చెప్పాడు.
"ఈ మాత్రం దానికే వాడిపై చేయి చేసుకున్నారా? ఇంతకు ముందు వీడే కదా ఫస్ట్ వచ్చేవాడు. ఈ ఒక్కసారికి ఆ తిరుపతి కొడుకు ఫస్ట్ వచ్చాడు. ఐనా వాడు చదువు పూర్తి చేసుకున్న తర్వాతనే ఇలా తన అభిరుచులకు సమయం కేటాయిస్తున్నాడు. లోపలున్న టాలెంట్ బయటకు వస్తే కదా పిల్లలు ఇంకా బాగా రాణిస్తారు" అని కొడుకును వెనకేసుకొచ్చింది.
"ఓహో! ఇప్పుడు అర్థమైంది. ఇదంతా నీ ప్రోత్సాహమేనన్నమాట. చూడు ఉష, వాడు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఇలా ఎంకరేజ్ చేసి వాడిని చెడగొట్టకు. ఇక నుండి వాడు చదువు మీద శ్రద్ధ పెట్టేలా చేసే బాధ్యత నీదే. నా బాధ అర్థం చేసుకో," అని కోపంతో అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు భాస్కర్.
"అమ్మ! నాన్న చూశావా నన్ను ఎలా కొట్టారో!" ఏడుస్తూ తల్లి దగ్గరకు చేరుకున్నాడు కౌశిక్.
"ఊరుకో నాన్న, మీ నాన్న ఏదో కోపంలో ఉండి ఇలా నీపై చేయి చేసుకున్నారు. ఈసారి మీ నాన్న ముందు ఇలా కథలు రాస్తూ కనిపించకు," అని సర్దిచెప్పి వంటగది వైపుకు వెళ్ళింది ఉష.
వ్యాపార పనుల్లో మునిగి ఎక్కువగా చిరాకు పడడం చూసి, ఎప్పుడైనా ఆటవిడుపుగా ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్ళి వస్తే ఆయనకు కాస్త ఉపశమనం దొరుకుతుందేమో అని అనుకుంది.
దసరా సెలవులు రావడంతో మరుసటి రోజు భర్త దగ్గరకు వెళ్ళి, "ఏవండీ, అంతకు ముందు ఒకసారి చెప్పాను కదా, ఈ దసరా సెలవుల్లో రెండు రోజులు పర్యాటక ప్రాంతానికి వెళ్దామని. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయలుదేరడమే ఆలస్యం," అంది ఉష.
తనకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా భార్య కోసం ఒప్పుకుంటూ, "అలాగే కానివ్వు. మరి సూపర్ మార్కెట్ సంగతి ఏమిటి?" సందిగ్ధపడుతూ అడిగాడు భాస్కర్.
"మార్కెట్ను రాముడికి అప్పగిద్దాం, నమ్మకమైన మనిషి కదా," అని సలహా ఇచ్చింది ఉష.
"సరే అలాగే కానివ్వు."
"అయితే, ఈ మాట కౌశిక్తో కూడా చెప్తాను. వాడు కూడా ఆనందంగా ఫీల్ అవుతాడు!"
"వాడు రావడం లేదు. వాడు ఇక్కడే ఉండి ఏ సబ్జెక్ట్స్లో వెనకబడి ఉన్నాడో అవి చదువుకుంటాడు."
"కానీ..." ఏదో చెప్పబోయింది ఉష.
"ఉష! ఇంకేమీ చెప్పొద్దు, మన ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి అంతే."
మరో మాట మాట్లాడకుండా సరే అంటూ తలూపింది ఉష. మరుసటి రోజు బయలుదేరుతూ, "కౌశిక్! నేను మళ్ళీ వచ్చేసరికి ప్రశ్నలు వేస్తాను. ఎంతవరకు చదివావో నాకు తెలుస్తుంది," అని కొడుక్కి జాగ్రత్తలు చెప్పి, అక్కడి నుండి బయలుదేరాడు భాస్కర్ భార్యతో.
వీళ్ళతో పాటు కొందరు స్నేహితులు కూడా బయలుదేరారు. అందరూ కలిసి ముందుగా బొర్రా గుహలకు చేరుకున్నారు. అక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్న గైడ్ వీళ్ళ దగ్గరకు చేరుకొని ఆ ప్రాంత విశేషాలు చెప్పడం మొదలుపెట్టాడు. అతని పక్కనే ఇంకో వ్యక్తి ఉండడంతో, అతని వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు భాస్కర్.
భాస్కర్ తనవైపే చూస్తున్నాడని గ్రహించి, "ఏంటి సార్, మీకేమీ అర్థం కావడం లేదా? పోనీ నన్ను చెప్పమంటారా?" అని అంటూ, లోపల గుహలవైపుకు నడుస్తూ, తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ను రాతి ఆకారాలపై వేస్తూ వాటి గురించి వివరించసాగాడు.
"అదుగో ఆ పైన చూడండి, నీటి చుక్కలు సున్నపు రాయితో కలిసి కిందకు జారుతూ గడ్డకట్టి ఈ ఆకారంలోకి మారాయి, వీటిని స్టాలక్టైట్స్ అంటారు. ఇవి ఏడాదికి మిల్లీమీటర్ కంటే తక్కువ పెరుగుతాయి. ఈ రాయి ఇంత పెద్దది అవ్వడానికి వేల ఏళ్ళు పట్టింది," అని బొర్రా గుహల విశేషాలు భాస్కర్తో చెప్తూ వచ్చాడు ఆ వ్యక్తి.
తర్వాత బయటకు వస్తూ గోస్తని వ్యూ పాయింట్ షెల్టర్ దగ్గర కూర్చుంటూ, ఎదురుగా ఉన్న అనంతగిరి కొండలు, రైల్వే టన్నెల్ గురించి చెప్పాడు ఆ వ్యక్తి.
కొంత సమయానికి ఆ వ్యక్తి ఎవరో భాస్కర్కు గుర్తుకు వచ్చింది. "సార్, మీరు వెంకటాచలం గారి అబ్బాయి విజయేంద్ర గారు కదా!" ఆశ్చర్యంతో అడిగాడు భాస్కర్.
"అవును!" అని ఆశ్చర్యంతో చూస్తూ అన్నాడు విజయేంద్ర.
"మీ నాన్నగారిని ఒకటి రెండు సార్లు కలిశాను, మిమ్మల్ని కూడా చూశాను. ఇక్కడ మీరు కనిపించిన దగ్గర నుండి మిమ్మల్ని ఎక్కడో చూశానన్న భావన కలిగింది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అయినా మీరు ఇలా?" ఆశ్చర్యంతో అడిగాడు భాస్కర్.
"వేరేగా అనుకోకండి, నాకు ఆర్కియాలజీ అన్నా, టూరిజం అన్నా చాలా ఇష్టం! చిన్నప్పుడు విచిత్రంగా ఉండే రాళ్ళు, పాత తరం కాయిన్స్ పోగుచేసేవాడిని. ఆర్కియాలజీ చదవాలని ఉండేది, కానీ మా నాన్నకి అది ఇష్టం ఉండేది కాదు. నన్ను తన బిజినెస్కు వారసుడిగా చూడాలన్నది మా నాన్న కోరిక, నాన్న చెప్పినట్టుగానే విని ఆ బిజినెస్ను టేకప్ చేశాను. తర్వాత నాకు ఇష్టమైన ఆర్కియాలజీ, టూరిజంలలో డిగ్రీ కూడా పొందాను. ఇప్పుడు అవి నాకు పనికివచ్చాయి," నవ్వుతూ అన్నాడు.
అర్థం కానట్టుగా చూస్తూ, "అవి మీకు ఏ విధంగా పనికివచ్చాయి సార్?" అడిగాడు భాస్కర్.
"ఇప్పుడు టూరిజం రంగంలో కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఈ రంగంలో పెట్టుబడి పెట్టి కొన్ని ప్రదేశాలు అభివృద్ధి చేసి వాటిని పర్యాటక ప్రాంతాలుగా మారుస్తాను. అప్పుడు నేను అనుకున్నట్టుగా నలుగురికీ ఉపాధి కలుగుతుంది. మన సంస్కృతి గురించి కూడా నలుగురికీ తెలుస్తుంది," అని అన్నాడు విజయేంద్ర.
ఆశ్చర్యపోతూ, "మీ ఐడియా బాగుంది సార్. పైగా మీరు ఇందాక నాకు ఈ ప్రాంతం గురించి వివరించిన తీరు అమోఘం" అని అన్నాడు భాస్కర్.
"నాలాంటి అభిరుచి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించి ఈ రంగంలో నిలదొక్కుకునేలా చేయాలన్నదే నా ఆశయం. ఇలాంటి కొత్త ఐడియాలు చేస్తే కదా నాలుగు రంగాలు అభివృద్ధి చెంది, నలుగురికి ఉపాధి దొరుకుతుంది?
అదుగో ఇందాక నాతో పాటు ఉన్నాడు కదా ఆ వ్యక్తి, అతని పేరు శేఖర్, సామాజిక మాధ్యమాల్లో తాను సేకరించిన కాయిన్స్, మిగతా వాటి గురించి పెట్టేవాడు. అనుకోకుండా ఒకరోజు నా కంట పడింది, అతని గురించి తెలుసుకున్నాను. డిగ్రీ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసింది. అతని అభిరుచికి తగ్గట్టుగా టూరిజం లో డిగ్రీ చేయించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకునేలా సహాయం చేశాను. ఇక్కడ గైడ్గా సెలెక్ట్ అయ్యాడు.
నేను అనుకున్న ప్రాజెక్టు పూర్తయితే అతను నాతోనే ఉంటాడు. ఇలా కొంతమందిని నాతో పాటు చేర్చుకోవడానికి సిద్ధమయ్యాను. దానిలో భాగంగా నేను కూడా కొన్నిసార్లు అతనితో పాటు తిరుగుతూ ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి ఈ ప్రదేశాల గురించి వివరిస్తూ ఉంటాను," తన ప్లాన్ మొత్తం చెప్పాడు విజయేంద్ర.
విజయేంద్ర చెప్పిన మాటలు విని భాస్కర్లో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతోంది. తన ఇష్టాలను అనుసరించి వెళ్తే మనిషి ఏదైనా సాధించగలడని విజయేంద్రను చూసిన తర్వాత తనకు అర్థమైంది.
విజయేంద్ర అభిరుచిని అతని తండ్రి ప్రోత్సహించేవారు కాదని విజయేంద్ర మాటల్లో తెలుసుకున్న భాస్కర్కు ఆ మాటే గుర్తుకు వస్తుంది. కొడుకు పట్ల తాను వ్యవహరించిన తీరు గుర్తుకువచ్చి, 'ఐనా ఉష చెప్పినట్టుగా కౌశిక్ చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. కొంత సమయం తన అభిరుచులకు కేటాయిస్తున్నాడు. ఇందులో తప్పేమీ లేదు కదా. మరి నేను ఎందుకు వాడిని అర్థం చేసుకోలేకపోయాను?' అని ఆలోచనలో పడ్డాడు భాస్కర్.
భాస్కర్ వైపు చూస్తూ, "ఇంతకీ మీరేం చేస్తుంటారు?" అడిగాడు విజయేంద్ర.
"నాకు సూపర్ మార్కెట్ ఉంది సార్, కానీ ఇప్పుడు అంత లాభాల్లో నడవడం లేదు," నిట్టూర్చాడు భాస్కర్.
"అవునా?" అని అంటూ కాసేపు ఆలోచనలో పడి, "మీకు సమ్మతమైతే నా దగ్గర ఒక ఆఫర్ ఉంది. కొత్తగా ఒక ప్రొడక్ట్ ప్రారంభిస్తున్నాము, దాన్ని ముందుగా డెమో ఇవ్వాలనుకుంటున్నాం. మీకు కొంత స్టాక్ ఇస్తాం, దాన్ని అమ్మి దాని పట్ల కస్టమర్స్ రెస్పాన్స్ ఏమిటో తెలుసుకోవాలి. ఇందులో మీ పనితనం చూసి ఒకవేళ సంతృప్తి కలిగితే ఆ ప్రొడక్ట్ డిస్కౌంట్ మీద మీకు ఇస్తాం," అని అన్నాడు విజయేంద్ర.
సంతోషిస్తూ, "తప్పకుండా సార్, మీరు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాను," అని అన్నాడు భాస్కర్.
"మీలాంటి యాక్టివ్ వ్యక్తి మాకు చాలా అవసరం. ఇది నా విజిటింగ్ కార్డ్, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయండి. మిగతా విషయాలు మాట్లాడుదాం," అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడ నుండి ముందుకు కదిలాడు విజయేంద్ర.
ఆ క్షణం నుండి భాస్కర్లో కొత్త ఉత్సాహం కలిగింది. ఆనందంగా ఆ ప్రాంతం మొత్తం తిరుగుతూ రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. నాలుగు రోజుల తర్వాత విహారం ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు.
"బొర్రా గుహలకు వెళ్ళి వచ్చిన దగ్గర నుండి మీరు చాలా సంతోషంగా ఉన్నారు!" ఆశ్చర్యంతో అడిగింది ఉష.
"ఒక వ్యక్తి కలిశారు ఉష, అతనితో మాట్లాడిన తర్వాత నా సమస్యలకు మార్గం దొరికింది," అని మొత్తం వివరంగా చెప్తూ, కొడుకు పట్ల తాను ప్రవర్తించిన తీరుకి బాధపడ్డాడు.
"మీ ఆలోచన నాకు అర్థమైంది అండి. పిల్లాడి భవిష్యత్తు గురించి మీరు భయపడ్డారు. పోనీలేండి ఇప్పటికైనా పిల్లాడి మనస్సు అర్థం చేసుకున్నారు. అంతకంటే ఏం కావాలి?" అని అంటూ తాను అనుకున్న పథకం విజయం సాధించినందుకు చాలా సంతోషించింది ఉష.
భార్యతో మాట్లాడిన తర్వాత కొడుకు దగ్గరకు చేరుకొని, "కౌశిక్! ఇలా రా," అని అంటూ తనతో తీసుకువచ్చిన కొన్ని కథల పుస్తకాలు అందించాడు.
తండ్రి కథల పుస్తకాలు తీసుకువచ్చి ఇవ్వడంతో కౌశిక్ ఆశ్చర్యపోయాడు. ఆనందంతో తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు. నవ్వుతూ, "నీ అభిరుచికి నేను ఎప్పుడూ అడ్డుపడను. అయితే చదువు పట్ల నిర్లక్ష్యం చేయకు," కొడుకు తల నిమురుతూ, కొడుకు మనస్సు తెలుసుకొని అన్నాడు భాస్కర్.
***సమాప్తం****
"మనసుకు తోడై" కథ మీకు నచ్చితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్నేహితులతో పంచుకోండి.
పిల్లల కలలను అర్థం చేసుకుని, వారి ప్రతిభకు తోడుగా నిలిచే సమాజాన్ని కలిసి నిర్మిద్దాం.
ఇలాంటి మరెన్నో విలువైన తెలుగు కథల కోసం manatelugukathalu.com ను నిరంతరం సందర్శించండి.
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.












Comments