మత్తు వదలరా!
- Penumaka Vasantha

- 2 days ago
- 6 min read
డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్, యువత, పేరెంటింగ్, కుటుంబం, తల్లి ప్రేమ, ఇంజనీరింగ్ విద్యార్థి, వ్యసనాలు, సామాజిక స్పృహ, తెలుగు కథ, మత్తు, అవగాహన, మనతెలుగుకథలు

Matthu Vadalara - Telugu Inspirational Family Story | Penumaka Vasantha
మత్తు వదలరా! - తెలుగు ప్రేరణాత్మక కుటుంబ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 20/07/2026
పిల్లలకు ప్రేమతో పాటు పర్యవేక్షణ కూడా అవసరమే అని గుర్తుచేసే హృద్యమైన తెలుగు సామాజిక కథ "మత్తు వదలరా!". డ్రగ్స్, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యసనాల బారిన పడిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి జీవితం ఎలా మలుపు తిరిగిందో, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ విలువలు, మార్పు సాధ్యమే అనే ఆశావహ సందేశంతో ఈ కథ ప్రతి కుటుంబం తప్పక చదవాల్సిన కథగా నిలుస్తుంది.
అపార్ట్మెంట్ వాచ్మెన్ ప్రసాదు "ఇస్త్రీ బట్టలు ఉండాయా? అమ్మగారు!"అని సబితను అడిగాడు.
"ఆ ఉన్నాయి ఇస్తాను వుండు!" అంటూ లోపలికి వెళ్ళి బట్టలు తెచ్చి ఇచ్చింది.
"అమ్మగారు! ఒక నాల్గు రోజులు మేము బెంగుళూరు వెళ్తున్నాం. మా బావమరిది వచ్చి వుంటాడు. ఈ వారం మెట్లు వూడవటం, మోటార్ వేయటం అన్ని వాడేచూత్తాడు. ఏమన్నా కావాలన్నా? అడగండి చేసి పెడతాడు. "
"సరేలే కానీ, ఎందుకు బెంగళూరు వెళ్తున్నావు ప్రసాదు?"
"అదేనమ్మా. ! మా అబ్బాయికి ఆడ ఉద్యోగంవచ్చింది. నెలకు లచ్చ రూపాయలు జీతం. సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాడు. ఒకసారి వచ్చి ఇల్లు చూసి పాలు పొంగించి పొమ్మన్నాడు. అందుకే.. మా ఆవిడ, నేను మా అమ్మాయి వెళ్తున్నాం." అంటూ వెళ్ళాడు.
సోఫాలో ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న కొడుకు సుశాంత్ ను చూసి "విన్నావా? ప్రసాదు ఏమి మాట్లాడాడో? నీ బట్టలు ఇస్తే వేసుకుని, కింద ఆ చిన్న ఇంటిలో చదువుకుని, ఖాళీ టైంలో వాళ్ళ నాన్నకు బట్టలు ఇస్త్రీ చేసి పెట్టీ ఇంజనీరింగ్ పాస్ అయ్యా.. " అనేలోపు.. "ఎపుడు ఏదో ఒకసోది చెప్తావు! ప్రశాంతంగా కూచోనీయవు!" తల్లిని కోపంగా చూస్తూ ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళాడు సుశాంత్.
'వీడికి కోపం లేకుండా శాంతంగా ఉండాలని సుశాంత్ అని పెడితే ఆపోజిట్ గా తయారయ్యాడు. ప్రసాదు వాళ్ళు అసలు చదువుకోమని చెప్పరు పిల్లలకు. వాళ్ళు అలా చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.
మా పిల్లలకు అన్ని అమర్చి డొనేషన్లు కట్టి మంచి కాలేజీలో ఇంజనీరింగుచేర్పించినా ఇంకా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. చదవరా అంటే.. కోపం. ఫెయిలయ్యాడని డిప్రెషన్.. స్ట్రెస్ అంటూ రూంలో నుండి బయటకు రాకుండా కూచోటం.
ఎక్కడ లోపం? పెంపకములోనా లేకా ఇప్పటి జనరేషన్ తీరా? పిల్లలు కాదు తల్లితండ్రులు డిప్రెషన్ కు లోనవుతున్నారు. ఎలా? చెపితే పిల్లలు వింటారో అర్థంకానిపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు పేరెంట్స్’ అనుకుంటూ సబిత పనిలో పడింది.
తప్పు చెపితే కోపం. చెప్పకుండా ఉందామంటే.. ఎక్కడ? చెడిపోతారేమోననే భయం. ఏం చేయాలో అర్ధం కాక సబితకు పిచ్చెక్కుతుంది. పోనీ భర్తకు చెప్పి భయం పెట్టిద్దామా అంటే.. ఆయన వీడంటనే.. మండిపడతాడు.
నువ్వు వాడిని ముద్దు చేసి ఈ తీరుకుతెచ్చావు. నువ్వే వాడిని దారిలో పెట్టు. నాకు చెప్పకు వాడి విషయం" అంటాడు.
ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. దాన్ని చూసుకుని గర్వం తప్పా ఇంకా ఏమి మంచి క్వాలిటీస్ లేవు ఆయనలో. ఆయనకు ఉన్న ఇగో వల్ల ఇంటా బయట తగాదాలు తప్పితే.. ఆయనిక పిల్లాడిని ఏమి బాగుచేస్తాడు? తెలివితేటలున్నా లోకజ్ఞానం, కలుపుగోలుతనం లేకపోతే... ఈ సమాజంలో నెగ్గటం కష్టమని సబితా అర్థం చేసుకుంది.
ఈ విషయాలుఎన్నిసార్లు భర్తకు, కొడుకుకు చెప్పినా వినటం లేదు. చిన్నపుడు బాగానే ఉండేవాడు. ఇంజనీరింగు మూడేళ్ళు పాసయ్యాడు. నాల్గో ఏడులో సరిగా చదవక కొన్ని సబ్జెక్టులు మిగిలాయి. సబ్జెక్టులు అన్ని పాసు అయితేనే.. ఉద్యోగాలకు దిక్కులేదు. సబ్జెక్టులు మిగిలితే.. ఇంకేమీ ఉద్యోగాలు వస్తాయి.
పెళ్లైన చాలా ఏళ్ల వరకు పిల్లలు లేరు. తర్వాత పుట్టిన అబ్బాయని గారాబంచేయటం వల్ల ఇలా అయినాడా? అనే దిగులుతో సబిత కృశించి పోతుంది.
ప్రసాదు వూరి నుండి వచ్చి మళ్ళీ "ఇస్త్రీ బట్టలు ఉండాయా?" అంటూ వచ్చాడు.
"ఆ ఉన్నాయి ప్రసాదు. బెంగుళూరులో మీ అబ్బాయి ఇల్లు ఎలా వుంది?"
"బాగుందమ్మగారు!"
“నువ్వేమో మా అపార్ట్మెంట్ లో వాచ్మెను. మీ కొడుకు అపార్ట్మెంట్ లో అద్దెకు వుంటున్నాడు. ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు అక్కడనే వుండకా. ?"
"ఎన్నో ఏళ్ళనుండి ఈ అపార్ట్మెంట్లో వుంటన్నా. దీన్ని వదిలి యాడికి పోను అమ్మగారు.. ! మా ఆవిడా, నా కూతురు ఆడనే ఉండారు. మా ఆవిడ వచ్చే వరకు ఆవిడ పని చేత్తాను.” దొడ్లోకి వెళ్ళి అంట్లు తోమి బట్టలు తీసుకుని వెళ్ళాడు.
'పిల్లల్ని ఇద్దరూ కలిసికట్టుగా పెంచారు. పిల్ల మెడిసిన్ చదువుతుంది. వాళ్లమ్మకు ఒంట్లో బాగలేకపోతే.. వీళ్ల అమ్మాయి పనికి వస్తుంది. అసలు వాళ్ళ తల్లితండ్రులు చేసే పనికి వాళ్ళు ఎపుడు సిగ్గుపడరు.
'పిల్లలకు అపార్ట్మెంట్, ఇంకా ప్లాట్స్, కారు కొనిచ్చి చివరి దశలో మమ్మల్ని చూడండి అన్నట్లుగా తల్లితండ్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవిచ్చినా చూస్తారనే.. గ్యారంటీ లేదు.
ఎందుకంటే... వాళ్ళ విసుగు, తల్లితండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం చూస్తే.. మరి ప్రసాదు వాళ్ళు బెటరా, మేము బెటరా?
వాళ్ళే బెటర్! ఎందుకంటే.. ? చిన్నప్పటి నుండి మనకి ఆస్తులు లేవు. కష్టపడాలి అని చెప్పటం వల్ల ఆ పిల్లలు చదివి పైకి వస్తారు. ‘మేము గర్వంగా మేము పిల్లలకు అపార్ట్మెంట్ కారు, ఇంకా ఏవో మా పిల్లాడికి ఇస్తామనే ఆలోచనల వల్ల పిల్లలో లేజినెస్ వస్తుందా?’ అన్న ఆలోచనలు సబిత మైండ్ లో గిర్రున తిరుగుతున్నాయి.
బయట బాల్కనీలో కూచుని కిందకు చూస్తుంటే.. పాత ప్లాస్టిక్ సామానమ్మే అమ్మాయి బండి మీద తన ఇద్దరు పిల్లలని ఎక్కించుకుని తొక్కటం రోజు చూస్తుంది. ఇవాళా కూడా ఆ అమ్మాయిని చూసింది. ఆ పిల్లలు బండి మీద నుండి దిగి అపార్టుమెంటులో వాళ్ళు ఇచ్చే సామాను తెచ్చి బండి మీద వేస్తున్నారు.
ఆ పిల్లల్ని చూసి, ‘ఇప్పటి ప్రేమ మీరు పెద్దయినా చూపిస్తే.. ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏముంటుంది?' అనుకుంది. మా పిల్లలకు అసలు అమ్మానాన్నా అంటే.. అమ్మ వండి పెట్టేదిగా నాన్న తెచ్చి పెట్టేవాడుగా చూస్తున్నారు తప్పా మేము తిన్నామా? లేదా అనేది పట్టటం లేదు.
పిల్లలకు స్వతహాగా జన్మనిచ్చిన తల్లితండ్రుల మీద ఉండాలి కానీ మమ్మల్ని ప్రేమించండని ఎలా అడిగి ప్రేమా.. గౌరవాన్ని తీసుకుంటాం' అన్న ఆలోచన్లో వున్న సబిత ఇద్దరు పోలీసులు అపార్ట్మెంట్లోకి రావటం చూసింది.
ఎందుకు వచ్చారు వీళ్లు అనుకునే లోపు వీళ్ల అపార్ట్మెంట్ కాలింగ్ బెల్ మోగింది. ఎవరు? అంటూ వెళ్ళి తలుపుతీస్తే.. ఎదురుగా పోలీసులు.
"ఏంటి అన్నట్లు వాళ్ళ వైపు చూసింది. ఆ మొహంలో కంగారు కనపడింది పోలీసులకు.
"సుశాంతు మీ అబ్బాయే కదా?"
"అవును ఎందుకు?"
"ఇంట్లో వున్నాడా?"
“ఆ.. వున్నాడు” వంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అంది.
"ముందు పిలవండి ఎందుకో చెప్తాం."
అప్పటికే ఎదురు ఫ్లాట్ వాళ్ళు వీళ్ల ఇంటి వైపు చూస్తూ వుండటంతో "లోపలికి రండి పిలుస్తాను" అని సోఫా చూపించి లోపలికి వెళ్ళింది.
సుశాంత్ డోర్ గడియ పెట్టుకుని పడుకున్నాడు. నాల్గుసార్లు కొట్టిన తర్వాత తలుపు తీసాడు. "అరేయ్ పోలీసులు వచ్చి నిన్ను పిలుస్తున్నారు. రా బయటికి!"
"పోలీసులా ఎందుకు?"అంటూ వచ్చాడు సుశాంత్.
వెంటనే వాళ్ళ ఆయన నరసింహారావుకు ఫోన్ చేసింది.
"నాకు ఆఫీసులో పనుంది. వాళ్ళకు ఫోన్ ఇవ్వు" అన్నాడు.
వాళ్ళు ఫోన్ తీసుకుని "నమస్తే సార్.. !" అని, అక్కడికి వచ్చిన సుశాంత్ ను చూసి "ఎందుకా? మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్ గ్రూపులో వున్నాడు. మీ అబ్బాయి ఇంకో నలుగురు మీ వాడి ఫ్రెండ్స్ ఈ బెట్టింగులు చేస్తున్నారు."
"మా అబ్బాయి ఇంటి నుండి ఎక్కడకు బయటకు వెళ్ళడు సార్! మీరు పొరపాటు పడ్డారు. "
"ఈ నంబర్ మీ అబ్బాయిదేనా?" అని ఒక నంబర్ ఫోన్లో చదివి వినిపించారు.
"మా అబ్బాయిదే ఆ నెంబర్. "
"అయితే మేము పొరపాటు పడలేదు. పోలీసు స్టేషన్కు తీసుకెళ్తున్నాము మీ అబ్బాయిని. పిల్లలు ఏం చేస్తున్నారో కాస్తా చూస్తూ ఉండాలి సార్.. !" అంటూ సుశాంత్ ను లాక్కుని వెళ్లారు పోలీసులు.
"ప్లీజు.. మా అబ్బాయిని వదలండి. వాడు అలాంటి వాడు కా”దని సబిత ప్రాధేయపడినా పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు.
బ్రేకింగ్ న్యూస్ అని టివిలో బెట్టింగ్ ముఠాను చూపిస్తున్నారు. కాకపోతే.. వాళ్ల మొహాలకు ముసుగులువేసి చూపిస్తున్నారు.
‘నగరంలో ఒక ముఠా క్రికెట్ బెట్టింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీళ్ళందరూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు’ అని టివిలోచూపిస్తుంటే... చూడలేక టీవీ కట్టేసింది సబిత.
నరసింహరావు లాయర్ ను వెంట పెట్టుకుని వెళ్ళి బెయిలుకు దాఖలు చేయించాడు. అయినా ఏవో కోర్టు సెలవులు ఉండటం వల్ల నాలుగురోజులు జైలులో సుశాంతు వుండాల్సి వస్తుందన్నాడు లాయర్.
ఇంటికి వచ్చి "ఇంట్లో పిల్లాడు ఏమి చేస్తున్నాడో పట్టించుకొని పెళ్ళాం నాకు దండగ. నువ్వ వెళ్ళి ఆ జైల్లో కూచో పో !"అంటూ సబితతో తగాదాకు దిగాడు నరసింహారావు.
"మీకు తండ్రిగా బాధ్యత ఉంది. కన్నాను.. వాడికి కావాల్సినవి ఇస్తున్నాను అనుకున్నారే.. కానీ ఒక్కనాడన్నా వాడు ఏం చేస్తుంది పట్టించుకున్నారా?
తండ్రి భయం ఉంటే.. వాడిలా అవ్వడు. వాడి ముందే నన్ను తిట్టటం వల్లవాడికి నా మీద గౌరవం లేదు. ఇపుడు ఇద్దరం కొట్టుకుంటే.... వాడు ఇంకా నాశనం అవుతాడు. జరిగిందేదో జరిగింది. వాడిని ముందు బెయిల్ మీద తీసుకొస్తే.. అపుడు ఏం చేయాలో ఆలోచిద్దాం" అంది సబిత కోపంగా.
అపార్ట్మెంట్ లో అందరూ "అయ్యకు ఎంత పొగరు.. అదే వచ్చింది కొడుకుకు. అరె అపార్టుమెంటులో ఒక్కళ్ళతో సరిగా వుండడు. నా కారు పార్కింగ్ లో మీరు కారు పెట్టారంటూ అందరితో గొడవలకు దిగుతాడు. నరసింహారావుకు శాస్తి బాగా జరిగిందిలే.. , !" అని గుసగుసలు.
నాల్గు రోజుల తర్వాత సుశాంతును తేవటానికి స్టేషన్కు లాయర్తో కలిసి వెళ్ళాడు నరసింహారావు. ఎస్ఐ నరసింహారావుకు క్లాస్ పీకాడు.
"పిల్లల్ని కనటంతో సరిపోదు. వాళ్ళను బాధ్యతగా పెంచాలి. నీ పిల్లాడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. అది తెలుసా?"
"లేదు మా అబ్బాయి ఎక్కడికి బయటకు వెళ్ళడు. వాడికి ఎవరిస్తారు? ఇవి" అన్నాడు నరసింహరావు తలదించుకుని నుంచున్న సుశాంతును చూస్తూ.
"అసలు బయటికి వెళ్ళక్కర్లా? మీ వీధి చివర ఉన్న కిళ్ళీ కొట్లో ఇస్తారు. అతన్ని అరెస్ట్ చేస్తే చెప్పాడు. ప్రతి బజార్లో ఒక షాపులో ఈ డ్రగ్స్ పాకెట్స్ అమ్ముతున్నారు. ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డ పిల్లలకు ఇవి వేసుకోకపోతే.. నిద్ర పట్టదు. పిచ్చెక్కినట్టు వుంటుంది.
మీ అబ్బాయిచదివిన కాలేజీలో డ్రగ్స్ తీసుకునే ఎంతో మంది పిల్లలు పట్టుబడ్డారు. వీళ్లకు డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులుకావాలి. ఇంట్లో తల్లితండ్రులు అంత డబ్బులివ్వరు? అందుకని ఇదిగో ఇపుడు ఐపీల్ సీజన్ స్టార్ట్ అయింది కదా? అందరూ బెట్టింగ్ మొదలు పెట్టారు.
మీరు మీ పిల్లలుఫోన్లో వీడియో గేమ్ ఆడుతున్నారు లే.. అనుకుంటారు. కానీ వీళ్లు బెట్టింగులు ఆడుతున్నారు. ఒకవేళ డబ్బులు వస్తె.. వాటితో జల్సా చేయొచ్చని.. మొదలు పెడతారు. "
"మేము డబ్బులివ్వం కదా?ఎక్కడినుండి వస్తాయి? వీళ్ళకి డబ్బులు" అన్న నరసింహారావుతో "ఇంటికి వెళ్ళి తీరికగా మీ అబ్బాయిని అడగండి. బాబు, ఇటు రా.. ! మీ తల్లితండ్రులు మిమల్ని కష్టపడి చదివిస్తుంటే.. వాళ్ళకు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ, మీ కాళ్ళ మీద నిలబడండి.
ముందు నువ్వు నీ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించు. తల్లి తండ్రి తిట్టారని సూసైడ్లు చేసుకోకండి. చావు పరిష్కారం అనుకుంటే.. అసలు ఈ ప్రపంచం వుండదు. దేవుడు మనకిచ్చిన ఈ మానవ జన్మని చివరివరకు హాయిగా ఎంజాయ్ చేస్తూ! గడపండి.
నరసింహారావుగారూ! మీరు ఆఫీస్ ముఖ్యం అనుకోకుండా పిల్లాడు ఏమి చేస్తున్నాడో కాస్త చూస్తూ వుండండి. ఇంటికి వెళ్ళగానే తిట్టటం చేయకండి. మొన్నీ మధ్య తండ్రి తిట్టాడని ఇంజనీరింగు పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇంకో పిల్లాడు కారు కొనివ్వలేదని సూసైడ్ .ఇట్లా ఎంతోమంది పిల్లలు. ముందు మాకు ఈ కేసులు ఎక్కువయ్యాయి”.
ఇంటికి వచ్చిన తర్వాత సుశాంతును పట్టుకుని ఏడ్చింది సబిత. "ఎందుకురా ఇట్లా చేసావు. అందరి ముందు మా పరువు తీసావు. !"
"వాడిని కాదు తిట్టాల్సింది, నిన్నుతిట్టాలి. వాడికి ఒక్క పైసా ఇవ్వకు. వాడు ఇలా కావటానికి కారణం నువ్వే! మీ ఇద్దరి వల్ల ఇవాళ ఆ ఎస్సై ముందు నా పరువు పోయింది. చీ ఎదవ బతుకు" నరసింహారావు కోపంగా అన్నాడు.
ఇవన్నీ విని మంచి నీళ్ళు తాగి కామ్ గా తన రూంలోకివెళ్ళి తలుపేసుకున్నాడు. అమ్మో ఏవన్నాచేసుకుంటాడని సందులోకి వెళ్ళి కిటికిలోనుండి చూసింది సబితా. టేబుల్ ముందు కూచుని చదువుకుంటున్న కొడుకును చూసి ఆనంద పడింది.
జైల్లో ఉన్న ఆ నాల్గు రోజుల్లోనే సుశాంతుకు జీవితం అంటే ఏమిటో అర్థమయింది. మోటివేషనల్ క్లాసులో చేరి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. ముందు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాడు.
ఇంటికి దగ్గరలో ఉన్నగుడిలో యోగా సెంటర్ లో జాయిన్ చేయించింది సబిత. చిన్నపుడు నేర్చుకున్న కీబోర్డు ప్లే చేస్తున్నాడు. సబితా వాళ్ళ అన్నయ్య తనకు తెలిసిన వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలో చేర్పించాడు.
ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడు. మొదటి నెల జీతంతో అమ్మానాన్నలను షాపింగుకు తీసుకెళ్లి, బట్టలు కొన్నాడు. ఇపుడు సబిత, సుశాంతును చూసి గొప్పగా ఫీలవుతోంది.
సమాప్తం
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.











Comments