మేఘ సందేశ్
'

Megha Sandesh - Telugu Love Story | M R V Sathyanarayana Murthy
మేఘ సందేశ్ - తెలుగు ప్రేమ కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com on 03/11/2026
మేఘ సందేశ్ ఎం.ఆర్.వి. సత్యనారాయణమూర్తి రచించిన హృద్యమైన తెలుగు ప్రేమకథ. సంగీతం, మానవత్వం, సేవాభావం, కుటుంబ విలువల నేపథ్యంలో మేఘన, తరుణ్ జీవితాల్లో చిగురించిన అనుబంధాన్ని ఈ కథ అందంగా ఆవిష్కరిస్తుంది.
“ఒరేయ్.. తొమ్మిదిన్నరకే టిఫిన్లు అయిపోయాయట.. భలే పెళ్లివారు” అన్నాడు సురేశ్ గట్టిగా నవ్వుతూ. అతని వెనుక పదిహేను మంది నిలబడి ఉన్నారు.
అందరూ చిరాగ్గా వెళ్లి కుర్చీలలో కూర్చున్నారు. హాలులో కొంతమంది టిఫిన్లు తింటున్నారు.
కొంతమంది పైన ఉన్న హాలులో నుండి క్రిందకి దిగి, టిఫిన్ల కోసం వచ్చారు. ‘పది నిమిషాలు ఆగండి సార్, రెడీ అవుతున్నాయి’ అని చెబుతున్నారు కేటరింగ్ కుర్రాళ్ళు. మేఘన గబగబా పక్కనే ఉన్న వంట షెడ్ దగ్గరకు వెళ్లి, వంటవాళ్ళని అడిగింది, “టిఫిన్ల పరిస్థితి ఏమిటి?” అని.
“మైసూరు బజ్జీ, టొమాటో బాత్ పది నిమిషాలలో అవుతాయి మేడం” అంది హెడ్ కుక్ చింతామణి.
మేఘన వెంటనే హాలులోకి వచ్చి నీరజని పిలిచి పైకి వెళ్లి మైకు తెమ్మని చెప్పింది. ఆమె వెంటనే పైన ఉన్న హాలులోకి వెళ్లి, కార్డ్‌లెస్ మైకు తెచ్చి మేఘనకి ఇచ్చింది.
పైన ఉన్న ఏ.సి. హాలులో పెళ్లి జరుగుతోంది. కింద ఉన్న హాలులో ఫలహారాలు, భోజనాలు ఏర్పాటు చేశారు ఆడపెళ్లివారు. అంచనాకి మించి జనం రావడం వలన టిఫిన్లు అయిపోయాయి.
డైనింగ్ హాలులో అందరూ అసహనంగా ఉన్నారు. మేఘన మైకు ఆన్ చేసి “అందరికీ నమస్కారం. నా పేరు మేఘన. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దయచేసి పెద్దలు వాటికి సమాధానాలు చెప్పమని వినయంగా కోరుతున్నాను” అంది.
“సరే అడుక్కో” అన్నాడు ఓ కుర్రాడు కొంటెగా.
“ధన్యవాదాలు, నాకు అనుమతి ఇచ్చినందుకు” అని అతనికేసి తిరిగి చెయ్యి ఊపింది మేఘన. అతను సైలెంట్ అయిపోయాడు. అప్పుడు అందరి దృష్టి మేఘన మీద పడింది.
ఆమె కట్టుకున్న నెమలి కంఠం రంగు పట్టుచీర, జాకెట్టు చేతులకి ఉన్న రెండు నెమలి బొమ్మలు లైటింగ్ వెలుగులలో తళతళా మెరుస్తున్నాయి.
మెడలో సన్నని బంగారు చైన్, చెవులకు బుట్టలు, చేతులకి బంగారు గాజులు ధరించింది. బంగారు రంగుతో పోటీ పడుతున్న ఆమె మేని రంగు చూసి, యువకులు కన్నార్పడం మానేశారు. కొంతమంది ఆడవారు అసూయపడ్డారు.
“త్యాగరాజు గారి అన్నగారు, రాముడి విగ్రహాలను ఏ నదిలో పడేసారు? నాకు గుర్తుకు రావడం లేదు” అంది అమాయకంగా మేఘన.
“బాదంపప్పులు బాగా తినండి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది” అన్నాడు ఇందాక జోకు వేసిన కుర్రాడు.
“ధన్యవాదాలు. మీకు తెలిస్తే చెప్పండి” అని మైకు తీసుకుని అతని దగ్గరకు వెళ్ళింది మేఘన. అతను ఆశ్చర్యపోయాడు, ఈ అమ్మాయి తనని ఇలా ఇరికించిందేమిటి అని.
తల అడ్డంగా ఊపి, చిన్న నవ్వు నవ్వాడు. కుర్చీలో కూర్చున్న పెద్దాయన “కావేరి నదిలో అమ్మా” అన్నాడు మేఘనకేసి తిరిగి.
“చాలా ధన్యవాదాలు తాతగారూ! పంచరత్న కీర్తనలలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ ఎందుకంత ఖ్యాతి పొందింది?” వినయంగా అడిగింది మేఘన, మైకు ఆయన ముఖం దగ్గర పెట్టి.
ఆయన ఒకసారి కళ్ళు మూసుకుని వెంటనే తెరిచారు. “త్యాగరాజు గొప్ప సంగీత విద్వాంసుడే కాదు, మహా రామభక్తుడు. కాసులకాశపడని ఆదర్శమూర్తి. ఆయన కీర్తనలు అన్నీ గొప్పవే. ఏమీ తక్కువ కాదు” అన్నారు ఆయన.
“నగుమోము కనలేని నా జాలి తెలిసి, నను బ్రోవగ రాద, శ్రీ రఘువర నీ...” అంటూ పాడి, “తాతగారూ! ఇది ఆభేరి రాగంలో స్వరపరిచినదే కదా?” అని అడిగింది మేఘన. ఆ గాత్ర మాధుర్యానికి తాతగారితో సహా అందరూ ‘ఫిదా’ అయిపోయి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తాతగారు ‘అవును’ అన్నట్టు తలూపారు.
అంతలో “సార్.. టిఫిన్లు వచ్చాయి రండి” అని కేటరింగ్ కుర్రాళ్ళు కేకేశారు. కొంతమంది అటుకేసి వెళ్ళారు. కుర్రకారు ఒక్కరు కూడా కదలకుండా మేఘన దగ్గరే ఉండిపోయారు.
ఇందాకా మేఘన గురించి జోకు వేసిన కుర్రాడు ఆమె దగ్గరకు వచ్చాడు. “సారీ మేడం, ఇందాకా ఏదో మాట్లాడాను” అన్నాడు క్షమాపణగా. “ఫరవాలేదు” అన్నట్టు చిన్నగా నవ్వింది. పదిమంది ఆడపిల్లలు వచ్చి మేఘన చుట్టూ మూగారు.
“అంత్యాక్షరి ఆడదామా?” అడిగింది నవ్వుతూ మేఘన.
అందరూ ‘అలాగే’ అన్నారు. ఒకరి తర్వాత ఒకరిచేత పాటలు పాడించింది మేఘన. తర్వాత హాలులో ఉన్న అందరి దగ్గరకు వెళ్లి, “టిఫిన్లు చేశారా?” అని అడిగింది. రాజరావు, రమణి “నువ్వు ఏమి చదువుకున్నావు అమ్మా?” అని అడిగారు.
“ఒక చదువు అయ్యింది. ఇంకోటి చదువుతున్నాను” అని ముందుకు వెళ్ళింది మేఘన.
“ఈ అమ్మాయి చాలా తెలివైనది. టిఫిన్లు లేవని అల్లరి చేయాలనుకున్న వారిని మెస్మరైజ్ చేసి తన వైపు తిప్పుకుంది” అన్నాడు రాజారావు.
నీరజ అలా వెళ్తుంటే, రమణి ఆమెని పిలిచి “మేఘన ఏమి చదువుకుంది?” అని అడిగింది.
“మేఘన మైసూరు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది” అని చెప్పి వెళ్ళిపోయింది. అది విని భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు.
పెళ్లికూతురు నందిని, మేఘన ఫ్రెండ్స్. అందుకే ఏర్పాట్లలో లోటు జరగకుండా చూస్తోంది. నందిని పెళ్లిలో, మేఘన ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా నిలిచిపోయింది.
మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తరుణ్ అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక యువతి పిల్లలకు బెలూన్లు ఇచ్చి వారు ఎగరేస్తూ ఉంటే, చప్పట్లు కొడుతూ ఆనందిస్తోంది. వాళ్ళు ముష్టివాళ్ళ పిల్లలు.
ఇంతలో ఒక షాపులోంచి నలుగురు యువతులు ఆమె దగ్గరకు వచ్చి “వెళ్దామా మేడం?” అని అడిగారు. వారి మాటలు విని వాళ్ళు తెలుగువారు అని భావించాడు. ఈ మేడంని ఎక్కడో చూసినట్టు అనిపించింది తరుణ్‌కి. వెంటనే లైట్ వెలిగింది.
తల్లి, కొవ్వూరు పెళ్లికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఫోటో తీసి తనకి పంపించింది. పేరు మేఘన అని, మైసూరు యూనివర్సిటీలో పనిచేస్తోందని, చాలా తెలివైన అమ్మాయి అని చెప్పింది.
తరుణ్ గబగబా రెండడుగులు వేసి మేఘన దగ్గరకు వెళ్లి “నమస్తే మేడం. నా పేరు తరుణ్. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. మీ హెల్పింగ్ నేచర్ బాగా నచ్చింది” అని అన్నాడు.
“అది సరే, మీ వివరాలు నాకు ఎందుకు చెబుతున్నారు?” అడిగింది మేఘన. ఆమె మాటలకు ఖంగుతిన్నాడు తరుణ్. ఇంతలో తరుణ్ ఫ్రెండ్ ప్రవీణ్ వచ్చి, “తరుణ్, నా షాపింగ్ అయిపోయింది. బయల్దేరదామా?” అన్నాడు.
“అలాగే” అని, మేఘనతో “వస్తానండి” అని చెప్పి, ప్రవీణ్‌తో వెళ్ళిపోయాడు తరుణ్. మేఘన నవ్వుకుని, తన స్టూడెంట్స్‌తో కలిసి టాక్సీ ఎక్కి వెళ్ళిపోయింది.
నెల రోజుల తర్వాత, వాతావరణ కాలుష్య నివారణ చర్యల గురించి మైసూరు యూనివర్సిటీలో జరుగుతున్న సెమినార్‌కి పేపర్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాడు తరుణ్.
అప్పుడు ఆడియన్స్ లో మేఘనని చూశాడు. కొద్దిసేపటికి తనని పిలవగానే వేదిక మీదకు వెళ్లి మాట్లాడాడు తరుణ్. చాలామంది చప్పట్లు కొట్టి అభినందించారు, అందులో మేఘన కూడా ఉండడం గమనించాడు.
తర్వాత మేఘన మైకులో మాట్లాడుతుంటే అందరూ చాలా ఆసక్తిగా విన్నారు. ఆమె చెప్పే ప్రతి సూచనకి హాలులో చప్పట్లు మారుమోగాయి. ఆమె ప్రసంగం పూర్తి కాగానే ఒక నిమిషం సేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు ఆడియన్స్.
ఆమె మాటల్లో సమ్మోహన శక్తి ఉందని భావించాడు తరుణ్. సెమినార్ అయ్యాక మేఘనని కలిసి, “మీరు చాలా గ్రేట్ మేడం, చాలా చక్కని ప్రసంగం చేశారు” అని అభినందించాడు.
“థాంక్స్” అని తన కొలీగ్స్‌తో కలిసి వెళ్ళిపోయింది మేఘన.
తర్వాత రెండు నెలలకి బెంగళూరు యూనివర్సిటీలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాశాలల యువజనోత్సవాలకు, మైసూరు యూనివర్సిటీ నుండి పిల్లల్ని తీసుకుని మేఘన వచ్చింది. ఈ ఉత్సవానికి తరుణ్ కంపెనీ ఐదు లక్షలు స్పాన్సర్ చేసింది. తరుణ్ కూడా హాజరయ్యాడు వాళ్ళ బాస్‌తో కలసి.
మొదటిరోజు జరిగిన నృత్య పోటీలలో, మేఘన స్టూడెంట్స్ ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము’ అన్నమాచార్య కీర్తనకి నృత్యం చేయగా, మేఘన కీర్తన పాడింది. వారి నృత్యానికి మంచి స్పందన వచ్చింది.
పిల్లలతో కలిసి స్టేజి దిగుతున్న మేఘన కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెని అభినందించాలని వచ్చిన తరుణ్ అది చూసి, పిల్లల సాయంతో ఆమెని గ్రీన్ రూమ్‌కి తీసుకువచ్చాడు. స్టేజి దగ్గర అందుబాటులో ఉంచిన డాక్టర్ వచ్చి ఆమెని చూశాడు. “ఎందుకైనా మంచిది, హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం” అన్నాడు.
వెంటనే ఆమెని భుజం మీద వేసుకుని, డాక్టర్‌ని ఇంకో అమ్మాయిని తోడు తీసుకుని క్యాంపస్‌లోని తన కారు దగ్గరకు తీసుకువచ్చాడు తరుణ్. కారులో ఆమెని ఎక్కించి డాక్టర్ చెప్పిన హాస్పిటల్‌కి వచ్చారు. డాక్టర్ ముందే చెప్పడం వలన సిబ్బంది స్ట్రెచర్‌తో సిద్ధంగా ఉన్నారు హాస్పిటల్ దగ్గర.
మేఘనని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకువెళ్ళారు. తరుణ్, మేఘన స్టూడెంట్ స్వాతి ఇద్దరూ వరండాలో కూర్చుని ఉన్నారు. ఒక అరగంట గడిచాక డాక్టర్ బయటకు వచ్చి, “కంగారు లేదు. బీపీ, హార్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. సెలైన్ ఇస్తున్నారు. మిగతా రిపోర్ట్స్ రేపు వస్తాయి. మీరు వెళ్లి చూడవచ్చు” అని చెప్పారు.
తరుణ్, స్వాతి రూమ్‌లోకి వెళ్ళారు. మేఘన కళ్ళు మూసుకుని పడుకుని ఉంది బెడ్ మీద. అలసిపోయిన రాజకుమారి విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపించింది తరుణ్‌కి. రెండు నిమిషాలు ఉండి బయటకు వచ్చారు ఇద్దరూ. “మీ ఫ్రెండ్స్‌కి చెప్పు, మీ మేడంకి బాగానే ఉందని” అన్నాడు తరుణ్.
స్వాతి ఇంకా డాన్స్ కాస్ట్యూమ్‌లోనే ఉంది. తరుణ్ దగ్గర ఫోన్ తీసుకుని, చాముండికి చెప్పింది మేడం బాగానే ఉన్నారని. “నిన్ను యూనివర్సిటీ దగ్గర దింపుతాను పద. ఈ డ్రెస్‌తో నీకు ఇబ్బంది. హాస్పిటల్‌లో నేను ఉంటాను. రేపు ఉదయం వద్దువుగాని” అని అన్నాడు తరుణ్.
“థాంక్స్ సార్” అంది స్వాతి. ఆమెని యూనివర్సిటీ దగ్గర దింపి, దారిలో కాఫీ తాగి వచ్చాడు తరుణ్.
రాత్రంతా హాస్పిటల్ వరండాలోని కుర్చీలోనే కూర్చుని ఉన్నాడు తరుణ్.
ఉదయం మేఘన రూమ్‌కి వచ్చిన డాక్టర్, ఆమెని చూసి బయటకు వచ్చి తరుణ్‌ని పిలిచాడు.
“ఆమె మీకు ఏమవుతారు?”
“జస్ట్ ఫ్రెండ్, అంతే” అన్నాడు తరుణ్.
“ఆమెకి బ్రెయిన్‌కి వెళ్ళే రక్త ప్రసరణలో ఇబ్బంది వస్తోంది. చిన్న సర్జరీ చేయాలి. వాళ్ళ వాళ్లకు చెప్పండి” అని రౌండ్స్‌కి వెళ్ళిపోయారు డాక్టర్. తరుణ్ ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లోంచి ఫోన్ తీసి కాంటాక్ట్ నంబర్స్ చూశాడు. ఒకచోట ‘అమ్మ’ అని కనిపించింది. వెంటనే ఆమెకి ఫోన్ చేశాడు.
“ఆ మేఘా, ఎలా ఉన్నావు? బెంగళూరులో ఫంక్షన్ బాగా జరిగిందా?” అడిగింది రుక్మిణమ్మ.
“నమస్కారం అమ్మా. నా పేరు తరుణ్. మీ అమ్మాయి ఫ్రెండ్‌ని. మేఘనకి అనుకోకుండా జ్వరం వచ్చింది, హాస్పిటల్‌లో ఉంది. మీరు ఎక్కడ ఉంటారు?” అడిగాడు తరుణ్.
“నేను రాజమండ్రిలో ఉంటాను బాబూ. మేఘనకి ఎలా ఉంది?” కంగారుగా అడిగింది రుక్మిణమ్మ.
“మీరు కంగారు పడకండి, మేఘన బాగానే ఉంది. కొంచెం నీరసంగా ఉంది. మీ ఆధార్ కార్డు ఫోన్లో పంపండి, మీకు బెంగళూరు టికెట్ బుక్ చేస్తాను” అని ఫోన్ పెట్టేశాడు. రుక్మిణమ్మ ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపగానే ఆమెకి ఏ.సి. బస్సులో టికెట్ బుక్ చేసి, కాపీ ఆమెకి వాట్సాప్‌లో పంపాడు తరుణ్.
పది గంటలకు స్వాతి, ఇంకో అమ్మాయి వచ్చారు హాస్పిటల్‌కి. ఒక గంట కూర్చుని వెళ్ళిపోయారు. ఆరోజు సాయంత్రమే బహుమతి ప్రదానం.
తరుణ్ వాళ్ళ బాస్‌కి ఫోన్ చేసి చెప్పాడు - ‘మైసూరు నుండి వచ్చిన ఒక మేడం సడన్ సిక్ అయితే హాస్పిటల్లో చేర్చానని, ఈరోజు అక్కడికి రాలేనని’ చెప్పాడు. “ఓకే. ఆమెని జాగ్రత్తగా చూడు. అవసరమైతే నాకు ఫోన్ చేయి” అని చెప్పాడు బాస్.
పదకొండు గంటలకు మేఘన రూమ్‌కి వెళ్ళాడు తరుణ్. చిన్నగా నవ్వింది మేఘన. నీరసం ఇంకా తగ్గలేదు. “నర్సు చెప్పింది, మీరే నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారని, తెల్లవార్లూ వరండాలోనే ఉన్నారని. థాంక్స్” అంది మేఘన.
“నేను ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి వస్తాను. వీళ్ళు కాసేపున్నాక ఫుడ్ ఇస్తారు, తీసుకోండి” అని చెప్పి బయటకి వచ్చాడు తరుణ్. రాత్రి తల్లికి మేఘన విషయం చెప్పగానే, చాలా బాధపడింది. ఆమెని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, కొన్ని విషయాలు చెప్పింది. అవి విని ఆశ్చర్యపోయాడు తరుణ్.
మరునాడు ఉదయమే ఇందిరానగర్ వెళ్లి, రుక్మిణమ్మని తన కారులో హాస్పిటల్‌కి తీసుకువచ్చాడు తరుణ్. ఆవిడ వచ్చిన గంటకే రాజారావు, రమణి కూడా బెంగళూరు వచ్చి, తిన్నగా హాస్పిటల్‌కి వచ్చారు.
తల్లిని చూసి ఆశ్చర్యపోయింది మేఘన. తరుణ్ కేసి చూడగా అతను చిన్నగా నవ్వి తలూపాడు. పది నిమిషాలు గడిచాక రుక్మిణమ్మని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు తరుణ్.
డాక్టర్ ఆమెని ఒప్పించి, సంతకం తీసుకుని సాయంత్రం ఆపరేషన్ చేశారు.
తర్వాత మేఘనని ఐ.సి.యు.కి తరలించాక, అందరినీ తన విల్లాకి తీసుకువెళ్ళాడు తరుణ్.
“మీరు చాలా మంచివారు. కొద్దిపాటి పరిచయానికే మా అమ్మాయికి చాలా సహాయం చేశారు” అంది రుక్మిణమ్మ. చిన్నగా నవ్వాడు తరుణ్. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంది మేఘన. తర్వాత తరుణ్ విల్లాకి వచ్చారు అందరూ.
“మీరు హాస్పిటల్‌కి కట్టిన బిల్ చెప్పండి, నేను ఇస్తాను” అంది మేఘన. “అలాగే, ముందు మీరు రెస్ట్ తీసుకోండి” అన్నాడు తరుణ్. సాయంత్రం భోజనాలు అయ్యాక అందరూ హాలులో కూర్చున్నారు.
రమణి, రుక్మిణమ్మతో “మీరు నాకో వరం ఇవ్వాలి” అంది. ఆమె ఆశ్చర్యంగా రమణికేసి చూసింది.
“కొవ్వూరు పెళ్లిలో నేను మేఘనని చూశాక, మా బంధువుల ద్వారా వాకబు చేస్తే గానకళానిధి పరమేశ్వర శాస్త్రి గారి మనవరాలు అని తెలిసింది.
రాజమండ్రిలో తన ఇంటిలో సంగీత పాఠశాల ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి, సంగీతభిక్ష పెట్టిన మహనీయులు ఆయన. ఈ గానసరస్వతిని మా ఇంటి కోడలుగా పంపమని మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు ఒక్కడే కొడుకు తరుణ్ సందేశ్. ఎం.టెక్. చదివి, ఇక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎనభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మేఘనని ఇష్టపడుతున్నాడు” అంది రమణి చేతులు జోడించి.
తమ గురించి అన్ని వివరాలు చెప్పిన ఆమెకేసి చూసి దీర్ఘంగా నిట్టూర్చింది రుక్మిణమ్మ.
“మా మేఘన హిస్టరీ ఎం.ఏ. చేసి, తర్వాత పిహెచ్.డి. కూడా చేసింది. మ్యూజిక్‌లో ఎం.ఏ. చేసి ఇప్పుడు మరో పిహెచ్.డి. చేస్తోంది. మావారు లెక్చరర్‌గా పనిచేసి రెండేళ్ళ క్రితం చనిపోయారు. మీ మంచితనం చూశాను. మేఘన ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు” అని మేఘనకేసి చూసింది రుక్మిణమ్మ.
కొద్దిపాటి పరిచయం ఉన్న తనని ఆపదలో కాపాడి, అహర్నిశలూ కనిపెట్టుకుని, తల్లిని ఇక్కడికి రప్పించి ఎంతో ఆదరంగా చూసిన తరుణ్ సందేశ్, మేఘనకి బాగా నచ్చాడు. తరుణ్ వైపు చూసింది. గంభీరంగా తనకేసే చూస్తున్నాడు. చిన్నగా నవ్వింది మేఘన. అతనూ శృతి కలిపాడు.
అది చూసిన రాజారావు, రమణి, రుక్మిణమ్మల హృదయాలలో ఆనంద వీణలు మధురంగా మోగాయి.
*******
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


telugu emotional story, wife husband story telugu, old age home story |













Comments