మువ్వ మొక్కు

Muvva Mokku - Telugu Family Story | Sritha
మువ్వ మొక్కు - తెలుగు కుటుంబ కథ | శ్రిత
Published in manatelugukathalu.com on 04/10/2026
ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఒక అదృష్టమైతే, మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకోవడం భక్తులకు మరింత ఆనందం. శ్రీ వెంకటేశ్వరస్వామిని తన అన్నయ్యగా భావించే మువ్వ, ఆయనతోనే సరదాగా వాదనకు దిగుతుంది. అలిపిరి మెట్లు ఎక్కినా దర్శనం దక్కని ఆమెకు ఎదురైన అనుభవాలు ఏమిటి? భక్తి, దైవ విశ్వాసం, భార్యాభర్తల మధ్య చిలిపి హాస్యం కలగలిసిన అందమైన కథ “మువ్వ మొక్కు”.
🙏🏻 1. మువ్వ మొక్కు
“ఏడుకొండలవారికి మనం మొక్కుకున్న మొక్కు తప్పకుండా తీర్చాలి” అని అందరూ అంటూ ఉంటారు.
అలాగే మువ్వ అనే అమ్మాయి ఏడుకొండలవారికి ఏమి మొక్కుకుంది? ఆ మొక్కు ఎలా తీర్చింది?
భక్తి మరియు దేవుడిపై విశ్వాసాన్ని పెంచేలా సాగే కథ.
మువ్వ, మురళి అన్యోన్యమైన దాంపత్యం.
ఒకసారి అనుకోకుండా ఇద్దరూ కుటుంబంతో కలిసి తిరుపతి, తిరుమలకు వెళ్లారు. తిరుమల దర్శనం చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామిని మనసారా చూసుకుని దండం పెట్టుకున్నారు. తమ కోరికలు తీర్చమని, తమను బాగా చూసుకోమని, ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని మొక్కుకున్నారు.
దర్శనం పూర్తయిన తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వెళ్లి ప్రసాదం తీసుకున్నారు. అనంతరం బయలుదేరడానికి వచ్చారు.
బయలుదేరేటప్పుడు, “సరే, చాలా బాగుంటుంది కదా” అని కారుకు బదులు జీపులో ప్రయాణం ప్రారంభించారు. మురళి, మువ్వ ఇద్దరూ కూర్చున్నారు. వాళ్లతో పాటు వేరే ప్రయాణికులు కూడా ఉన్నారు.
తిరుమల కొండ చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుమల ఏడుకొండలు ఎక్కేటప్పుడు కనిపించే ప్రకృతి సౌందర్యం మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, శాంతిని ఇస్తుంది. ప్రతి చోట ఏదో పరమానందం మనసుకు ఆహ్లాదాన్ని, శాంతిని ఇస్తుంటుంది.
అలా చూస్తూ దిగుతూ ఉన్నారు. కొండ దిగుతున్నప్పుడు ఆ నీళ్లు గానీ, ఆ పచ్చని చెట్లు గానీ, గోవింద నామాలు గానీ, దారిన నడిచే భక్తులను గానీ చూస్తుంటే మనసులో అనిర్వచనీయమైన ఆనందం కలుగుతూ ఉంటుంది.
అలా చూస్తున్న మువ్వ నోట్లోంచి ఒక మాట టక్కున జారింది.
“ఈ ఏడుకొండలు ఎక్కి ఏడుకొండలవాణిని దర్శిస్తే ఇంత ఆనందంగా ఉంటుంది కదా! ఆ ఆనందంలో దేవుడిని చూస్తే మరింత అందంగా పరవశించిపోతాం కదా!” అంది.
అక్కడే జీపులో ప్రయాణం చేస్తున్న ఒక వేద బ్రాహ్మణుడు, “అమ్మా మువ్వా, మొక్కితే మొక్కుకున్నావు, మొక్కు తీర్చకపోతే దేవుడు ఊరుకోడు. అసలు ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు” అన్నారు.
మువ్వ నవ్వుకుని ఊరుకుంది.
మువ్వ భర్తగారు కూడా, “మొక్కుకున్నావు, మొక్కుకున్నావు, నీ దేవుడికి, నీ మధ్య నన్నైతే లాగకు” అన్నాడు.
సరే అని చెప్పి వాళ్లు తిరుగు ప్రయాణమై హైదరాబాద్‌కు వచ్చేశారు.
హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకోకుండా వాళ్లకు మళ్లీ తిరుమల వెళ్లే అవకాశం వచ్చింది. ఈసారి మువ్వ ఎక్కాలనుకుంది కదా అని, ఇద్దరూ కలిసి చాలా నెమ్మదిగా కొండలు ఎక్కుతూ ఉన్నారు. అలిపిరి మెట్టు నుంచి మొదలెట్టారు. తెల్లవారుజామునే స్నానం చేసి, పాదరక్షలు లేకుండా, “గోవిందా… గోవిందా… గోవిందా…” నామస్మరణతో మొదలుపెట్టారు.
మొదటి కొన్ని మెట్లు ఎక్కగానే “మనం ఎక్కలేమా?” అన్నట్టుగా అనిపిస్తుంది అంటారు కదా! అప్పుడు “గోవిందా, ఇదే భారం” అని ముందుకు సాగితే దేవుడు మనల్ని నడిపిస్తారు అంటారు.
అలాగే ఒక చోట “ఇక మా వల్ల కాదు” అని కూర్చున్నారు. మళ్లీ ధైర్యం చేసుకున్నారు. పక్కన సాటి భక్తులు వెళ్తూ ఉంటే, “మనం ఎక్కలేమా? గోవిందుడు మనల్ని తీసుకెళ్లలేడా?” అని చెప్పుకుని, “బాలాజీ… గోవిందా… గోవిందా…” అంటూ ముందుకు సాగిపోయారు.
అలా మెట్లు ఎక్కుతూ, ప్రకృతిని చూస్తూ, గోవింద నామాలు స్మరిస్తూ, భక్తితో, ఆనందంతో ముందుకు సాగిపోయారు. వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే ఏడుకొండలను దాటి, చివరకు తిరుమల కొండకు చేరుకున్నారు మువ్వ, మురళి దంపతులు.
🙏🏻 2. మువ్వ మొక్కు — భాగం రెండు
మువ్వ, మురళి దంపతులు తిరుమల కొండకు చేరుకున్నారు. కానీ అక్కడ టోకెన్ ఎలా తీసుకోవాలో వారికి తెలియలేదు. టిక్కెట్లు కూడా లేవు. ఉచిత దర్శనానికి వెళ్లాలని చూసారు. కానీ అక్కడ క్యూలైన్ చాలా పెద్దగా ఉంది.
“ఈ క్యూలైన్ చాలా పెద్దగా ఉంది. ఈసారి కాకపోతే మరోసారైనా దర్శనం చేసుకుందాం” అనుకున్నారు.
అక్కడ వరాహ స్వామిని దర్శించుకున్నారు. విమాన వెంకటేశ్వరస్వామిని మాత్రం చూడలేకపోయారు. కొండ గోపురాన్ని చూసుకుని, “మళ్లీ వీలైతే వస్తాం” అనుకున్నారు.
అయినా మువ్వ మొక్కుకున్నది నడుచుకుని వస్తాననే కదా!
“వెంకటేశ్వరా… బాలాజీ! నేను మొక్కుకున్నది నడుచుకుని వస్తాననే కదా! మరి నా దర్శన భాగ్యం కల్పించడం కూడా నీ బాధ్యతే కదా!” అనుకుంది మువ్వ.
వెంకటేశ్వరస్వామి ఆ గడుసరి చెల్లెలితో తాను మాత్రం తలపడతాడా!
“సరే చెల్లెమ్మా… నువ్వు ఇలా అంటావా? ఇప్పుడు చూస్తాను. నీ మొక్కు ఎలా తీర్చుకుంటావో నేనూ చూస్తాను. నీకు దర్శన భాగ్యం కల్పించడం నా బాధ్యతే కదా!” అన్నట్టుగా స్వామివారికి, మువ్వకు మధ్య ఒక చిన్న పందెమే మొదలైంది.
ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. కొండలు దిగుతూ జీపులో వస్తున్నారు.
అప్పుడు మువ్వ మురళితో, “నాకెందుకో నా ముందు, నా వెనకాల వెంకటేశ్వరస్వామి ఉన్నట్టుగా అనిపిస్తోంది. నన్ను చూసి నవ్వుతూ, ‘నన్ను చూడకుండానే వెళ్లిపోతావా? నీ మొక్కు ఎలా తీరుస్తావు?’ అన్నట్టుగా ఉంది” అంది.
“అంతా నీ భ్రమే” అన్నాడు మురళి.
“భ్రమేనా? మరి నా పక్కనే కూర్చున్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది?” అంది మువ్వ.
తిరుగు ప్రయాణంలో జీప్ కిటికీలు తీసుకుని వస్తున్నారు. అప్పుడు జీప్‌ను నడిపిస్తున్న డ్రైవర్ కూడా మువ్వకు వెంకటేశ్వరస్వామిలా నవ్వుతూ, “మళ్లీ వస్తావుగా… దర్శనానికి మొక్కు తీర్చుకోకుండా ఎలా వెళ్తావు?” అన్నట్టుగా అనిపించింది.
మురళి నవ్వుతూ, “నీకు బాగా చాదస్తం ఎక్కువైంది. మొక్కుకున్నావు. ఆరోగ్యం బాగాలేకపోయినా నడుస్తానన్నావు, నడిచావు. దేవుడిని నమ్మి భక్తితో వచ్చావు. ఇప్పుడు మన దగ్గర టిక్కెట్లు లేవు. అంత పెద్ద క్యూలో మనం నిలబడలేం. మరి ఎలా దర్శనం చేసుకుంటాం?” అన్నాడు.
“మళ్లీ ఆ వెంకటేశ్వరస్వామే దర్శనం ఇస్తాడు. దర్శన భాగ్యం కల్పించడం కూడా ఆయనదే బాధ్యత” అంది మువ్వ.
“అవునమ్మా… అలా అన్నావు కదా! తప్పకుండా వెంకటేశ్వరస్వామి నీకు దర్శన భాగ్యం కల్పిస్తాడమ్మా” అన్నాడు డ్రైవర్.
కొండలు దిగుతూ వస్తుండగా కాఫీ కోసం ఒకచోట ఆగారు. కాఫీ తాగుతూ ఉండగా మువ్వ అటూ ఇటూ చూసింది.
“అదిగో… అక్కడ చెట్టుపైన కూడా వెంకటేశ్వరస్వామి నిలబడి, ‘మళ్లీ రాకపోతావా? మొక్కు తీర్చుకోకుండా ఎలా వెళ్తావు?’ అని నవ్వుతున్నట్టుగా ఉంది” అంది.
“అంతా నీ భ్రమే. నిన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లే వరకు ఈ భ్రమ నుంచి బయటపడవు” అన్నాడు మురళి.
“సరే” అని చెప్పింది మువ్వ.
అలా ఇద్దరూ హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు.
కానీ మువ్వ మొక్కు మాత్రం అక్కడితో ముగియలేదు.శ్రీవెంకటేశ్వర స్వామిని తన అన్నగా భావించిన ఆ గడసరి చెల్లెలు, “నేను కొండకు వచ్చాను… కానీ దర్శన భాగ్యం మాత్రం కల్పించవా అన్నా?” అంటూ స్వామినే నిలదీసింది.
స్వామి కూడా చెల్లెల్ని కాస్త ఆటపట్టించాలనుకున్నాడు.
అక్కడి నుంచే అసలైన ఆట మొదలైంది!
అసలు ఆట అప్పుడే మొదలైంది.
“🙏3. బాలాజీ! నేను మొక్కుకున్నది నడుచుకుని వస్తాననే కదా! మరి నీ దర్శనం నాకు దక్కేలా చేయాల్సిన బాధ్యత కూడా నీదే కదా!” అనుకుంది మువ్వ.
అసలే గడుసరి మువ్వ. మొక్కు తీర్చడానికి వచ్చి, దర్శనం దక్కలేదని చివరికి ఏకంగా వెంకటేశ్వరస్వామినే నిలదీసింది!
🙏🏻 4 🙏 హైదరాబాద్‌లో గుడులు పదిన్నర, పదకొండు, పదకొండున్నర, పన్నెండు గంటలకి మూసేస్తారు.
మువ్వ, మురళి దంపతులకు అప్పుడప్పుడు గుడికి వెళ్లడం చాలా బాగా అనిపించేది. ఇంటికి బంధువులు వచ్చినా కూడా వాళ్లని తీసుకొని వెళ్లేవారు.
ఒకరోజు శనివారం అలాగే కూకట్‌పల్లిలో పెద్దగా గుడి ఉంది అని చెప్పి ఆ గుడికి తీసుకొని వెళ్లారన్నమాట.
వీళ్లు వెళ్తూ ఉంటే మువ్వ, “కదా! నాకు ఇంకా లిఫ్ట్‌లో కూడా వెంకటేశ్వరస్వామి వచ్చి, ‘నా తిరుమల కొండకు వచ్చినా నన్నెప్పుడు దర్శిస్తావు?’ అన్నట్టుగా ఉంది” అని చెప్పింది.
“ఆ లిఫ్ట్‌లో కాదు, మన ఇంట్లో వెంకటేశ్వరస్వామి వస్తాడని అనుకుంటున్నావా? తిరుమల కొండ పైన వచ్చే భక్తజనానికి కోరికలు తీర్చే తీరికే ఆయనకు సరిగ్గా ఉండదు. ఆయన మీ అన్నగారే కదా! వెంకటేశ్వరస్వామి నిన్నెప్పుడూ కాపాడుతూ ఉంటాడులే” అని అన్నాడు.
తీరా వాళ్లు అక్కడ చూసేసరికి ఆశ్చర్యమేసింది. గుడి తలుపులు మూసివేసి ఉన్నాయి. మరమ్మతుల కారణంగా గుడి తలుపులు మూసేసి ఉన్నాయని చెప్పారు.
“అందుకే కదా వెంకటేశ్వరా! నీ దర్శన భాగ్యం కలిపించు అని చెప్పాను కదా!” అంది.
“అమ్మా చెల్లి, నా దర్శన భాగ్యం నాదే కానీ, అన్న దగ్గరకు నువ్వే రావాలి” అన్నట్టుగా అనిపించింది.
చుట్టూ చూసింది. ఎవరూ లేరు. కానీ ఆ మాటలు ఎక్కడ విన్నానబ్బా అని అనుకుంది. “మా అన్న వెంకటేశ్వరస్వామి నాతో ఉంటే నాకు ఇంకేం భయం?” అనుకుంది గాని, మొక్కు తీర్చుకోవాలి అనుకోలేదు.
మళ్లీ ఒక పది రోజుల తర్వాత, “ఇలా కాదు. శ్రీరామ టెంపుల్‌కి వెళ్దాము” అనుకున్నారు వాళ్లిద్దరూ. పరివార సమేతంగా అత్తగారిని, మామగారిని తీసుకొని బయల్దేరారు.
బయల్దేరడానికి తయారవుతూ ఉంటే, “అందుకదా! శ్రీ వెంకటేశ్వరస్వామి అన్నయ్య రాముడితో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది” అంది.
“కాన్ఫరెన్స్ పెట్టారేమోలే! నీకదన్నీ అలవాటే కదా! భ్రమం ఎక్కువైపోయింది. పదపదా” అన్నారు.
ఆలోపు వెళ్లేసరికి శ్రీరాముని దర్శన భాగ్యం కూడా కలగలేదు. గుడి తలుపులు మూసివేయబడ్డాయి.
“అడిగాను కదా! టెంపుల్ పన్నెండు గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈరోజు ఎందుకు మూసివేస్తున్నారు?” అన్నది.
అప్పుడు వాళ్లు, “మరమ్మతుల కారణంగా మూసివేయడం జరుగుతుందని రాశామండి. కావాలంటే బోర్డు చూసుకోండి” అన్నారు.
ఆమె అనుకుంది.
“ఇలా కాదు. ఈసారి కృష్ణుడి టెంపుల్‌కి వెళ్దాము” అనుకుంది.
కృష్ణుడి టెంపుల్‌కి వెళ్లాలి అని తయారవుతూ ఉన్నారు. రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. పొద్దున్నే, “అందుకదా! నాకు ముగ్గురు కలలోకి వచ్చారు. ముగ్గురూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకటే నవ్వుకుంటున్నారు, నన్ను చూసి” అంది.
అంటే, ఈమెకి చాదస్తం ఎక్కువైందని మనసులో అనుకొని, “సరే, బయల్దేరుదాం. ఈసారి పదకొండు, పదకొండున్నరకి కాదు, చాలా తెల్లవారుజామునే బయల్దేరతాం” అన్నారు.
తెల్లవారుజామునే బయల్దేరారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.
“అసలు అక్కడ ట్రాఫిక్ ఎప్పుడూ రాదు. అందుకదా! మన ముందున్న ఆ కారులో ముగ్గురు స్వాములు ఉన్నట్టుగా ఉంది. నన్ను చూసి ఒకటే నవ్వుతున్నారు. వాళ్ల కారేమో జూమ్ అని వెళ్లిపోతున్నట్టుగా ఉంది” అన్నది.
“నీకు అలాగే అనిపిస్తుంది” అన్నారు.
పైన చూస్తే, “అది తిరుపతికి వెళ్లే ప్లేన్‌లాగా ఉంది” అన్నది.
“ఆ ప్లేన్ పైన రాసింది కింద కూర్చున్నవాళ్లకి కనిపిస్తుందా?” అన్నాడు.
“లేదు. ప్లేన్‌లో ముగ్గురు దేవతలు ఉన్నట్టుగా ఉంది. నవ్వుతున్నారు, నన్ను చూసి” అంది.
మళ్లీ అనుకుంది కదా, “కొండ మీదున్న తిరుమల వెంకటేశ్వరా! దర్శన భాగ్యం నీదే అన్నాను. నన్నిలా ఏడ్పించడం నీకు భాగ్యం కాదు” అంది.
మళ్లీ అనుకుంది కదా, “అన్నా నాతోనే ఉన్నాడు. భయం ఎందుకు? వెంకటేశ్వరస్వామి అన్నయ్య అయితే ఇంకా చెల్లెలికి ఏమన్నా భయం?” అనుకుంది.
అసలే అన్నలు, తమ్ముళ్లు లేరు అనుకుంది.
తీరా శ్రీకృష్ణుడి టెంపుల్‌కి వెళ్లేసరికి అదే భావం. టెంపుల్ క్లోజ్ అయిపోయింది. వాళ్లు వెళ్తుండగానే వాళ్ల ముందే తలుపులు వేయబడ్డాయి.
అప్పుడు అనుకుంది కదా, “ఇదేదో యాదృచ్ఛికం కాదు. నా మొక్కు తీర్చుకోలేకుండా జరుగుతున్నట్టుంది.”
“ఈసారి అమ్మవారి టెంపుల్‌కి వెళ్దాము” అనుకుంది.
అప్పుడు కూడా, “అన్నా, నీదే బాధ్యత. నువ్వే దర్శన భాగ్యం కల్పించాలి” అనుకుంది.
“సరే, కొండకైతే రా. దర్శన భాగ్యం నేనే కల్పిస్తాను” అన్నట్టుగా అనిపించింది.
తర్వాత మళ్లీ ఒక వీకెండ్‌కి అమ్మవారి టెంపుల్‌కి వెళ్లారు.
ఆ రోజు కూడా హడావిడి. ఎంత తొందర చేసినా పదకొండున్నర అయిపోతుంది. టెంపుల్‌కి వెళ్లేసరికి ఒక్క నిమిషంలో టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు.
గబగబా వెళ్లి దర్శనం చేసుకుని, ప్రసాదం తీసుకొని బయట కూర్చున్నారు. తిరుపతి గురించి మాట్లాడుతున్నారు.
అప్పుడు మువ్వ, “అందికదా! నేనైతే తిరుపతికి వస్తాను. దర్శన భాగ్యం నీదే” అంది.
మరి అప్పుడు వెంకటేశ్వరస్వామి అన్నయ్య, “అది కదా! మొక్కు తీర్చు. మొక్కు మొక్కుకున్నాక తీర్చాలి. అది నీ బాధ్యత. దర్శన భాగ్యమే నా బాధ్యత” అన్నట్టుగా అనిపించింది.
ఇంటికి వచ్చాక ఆన్‌లైన్‌లో చెక్ చేశారు. టికెట్లు దొరికాయి.
మళ్లీ ఇద్దరూ తిరుమలకు మొక్కు తీర్చడానికి ప్రయాణమై, తిరుమలలో దర్శనానికి వెళ్లారు.
5. 🙏🏻 ఇద్దరూ తిరుమలకు చేరుకున్నారు. ఈసారి తిరుమలలో దర్శన భాగ్యాన్ని స్వామివారే తగిన సదుపాయాలతో కల్పించాడు. ఎంతో ప్రశాంతంగా, తనివితీరా వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని, దైవమూర్తిని చూసి ఇద్దరూ పరవశించిపోయారు.
బయట కూర్చొని ప్రసాదం తీసుకున్నారు. తిరుమల వీధుల్లో ఆనందంగా, భక్తితో చూస్తూ కిందికి బయల్దేరారు.
అలా వెళ్తున్నప్పుడు మువ్వ చుట్టూ చూస్తూ ఉండటం గమనించిన మురళి, “ఏమి చూస్తున్నావు?” అని అడిగాడు.
“ఈసారి వెంకటేశ్వరస్వామి నాకు కనిపించడం లేదు. నన్ను చూసి నవ్వడం లేదు. ఇక ఆటపట్టించడం లేదు” అంది మువ్వ.
“మన భక్తితో మొక్కు తీర్చాలని గుర్తు చేసినట్టుంది. మొక్కును తీర్చాం కదా! మన భక్తే మన శక్తి. మొక్కులో చాలా బలముంటుంది. ఇక నుంచి కూడా ఆ భక్తి అలాగే ఉండాలి” అన్నాడు.
సరే అని దిగుతూ ఉండగా మువ్వ మళ్లీ నోరు తెరిచింది.
🙏 7. మురళిగారు వెంటనే చేతులు జోడించి,
“ఆపద మొక్కులవాడా! ఏడుకొండలవాడా! వెంకటేశ్వరా! గోవిందా… గోవిందా!
ఈసారి ఎలాగో నీ దయవల్ల మొక్కు తీర్చగలిగాను గానీ, ప్రతిసారీ మొక్కులు తీర్చే శక్తి నాకివ్వయ్యా!” అని వేడుకున్నాడు.
“నువ్వూ, మీ వెంకటేశ్వర అన్నయ్యా! ఏం మొక్కుకుంటారు, ఏం చేస్తారు? మీ ఇద్దరి మధ్యలో నా శక్తికి పరీక్షగా ఉంది… నా భక్తికి పరీక్షగా ఉంది!
మొక్కు మొక్కుకునేటప్పుడు, దాన్ని తీర్చే శక్తి కూడా ఉందో లేదో చూసుకుని మొక్కు. జాగ్రత్త!” అన్నాడు.
మువ్వ మాత్రం నవ్వుతూ, “నా అన్నయ్య వెంకటేశ్వరస్వామి ఉన్నాడుగా!” అంది.
“అదే నా భయం! నీకు అన్నయ్య ఉన్నాడన్న ధైర్యం… నాకు మాత్రం నీ మొక్కుల భయం!” అన్నాడు మురళిగారు.
“వెంకటేశ్వరా! నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక నేను మధ్యలో రావడం లేదు. పదా పదా!” అంటూ మువ్వను తీసుకొని హైదరాబాద్‌కు బయల్దేరాడు.
మువ్వ మాత్రం వెనక్కి తిరిగి తిరుమల కొండ వైపు చూసి నవ్వుకుంది.
“అన్నయ్య ఉన్నాడుగా… మళ్లీ ఏమైనా మొక్కుకోవచ్చు!”
అది విన్న మురళిగారు ఒక్కసారిగా గుండెల మీద చెయ్యి వేసుకుని,
“అయ్యో గోవిందా... గోవిందా... గోవిందా...” అని కారు వేగం పెంచాడు.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
***
శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: శ్రిత
శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.
ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.








Govinda govinda🙏