top of page

నర్తనశాల - పార్ట్ 8

Updated: Jul 21

#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

ree

Narthanasala - Part 8 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 16/07/2025

నర్తనశాల - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. నర్తన శాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు, భీముని చేతిలో హతమవుతాడు. 


గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు. గాండీవం ధరించి యుద్దానికి బయలుదేరుతాడు అర్జునుడు. యుద్ధంలో కౌరవులను ఓడిస్తాడు. 


చివరకు అర్జునుడు రథమును భీష్ముని వైపునకు మలపవలసిందిగా ఉత్తరుని ఆజ్ఞాపించెను. కానీ విరాటపుత్రుడు ఇప్పటివరకూ జరిగిన ఘోరయుద్ధము చేత గాయాలతో ఎంతగానో బాధపడసాగెను. దానితో ఇలా ప్రార్థించెను. 


“ఓ వీరాధివీరా, అర్జునా: నేను ఇక రథమును తోలలేను. దివ్యాస్రాల కాంతిమెరుపులతో నా కళ్ళు, శరీరము నా వశము తప్పుచున్నవి. కొవ్వు, రక్తము, మరియు మాంస ఖండముల చేత వచ్చిన భయంకరమైన, దుర్గందమను అగుట చేత నేను నియంత్రణ కోలుపోవుచుంటిని. యుద్దభూమిలోని తీవ్ర ధ్వనులచేత నా చెవుల వినికిడి శక్తి మందగించెను. నీ నిరంతర శరవృష్టితో నా కళ్ళు భయభ్రాంతికి గురవుతుండెను.  నాతల విపరీతముగా తిరుగుచుండెను. నేను ఇక పగ్గాలను పట్టలేను. పట్టుకొనలేను”. 


అర్జునుడు ఉత్తరుని శాంతింపజేయుటకు ప్రయనిస్తూ ఇటుల అనెను. “ఓఉత్తరకుమారా; ఈ భయానక యుద్దములో నీవు నా రథమును తోలుటలో అధ్భుత నైపుణ్యమును ప్రదర్శించితివి. కౌరవులందరిని జయించగల శక్తి నాకు కలదని విశ్వసింపుము. నిరుత్సాహ చెందరాదు. నీవు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రథమును భీష్ముని వైపునకు తోలుము. ”


అర్జునుని దయార్ధ్రపలుకులతో కొంత స్వాంతన పొంది ‌ఉత్తర రాకుమారులు తిరిగి పగ్గాలను అందుకొన్నాడు. అతడు కౌరవ సైనికులను దాటి రథమును ముందుకు పోనిస్తూ కొనసాగెను. భీష్ముని ఎదిరించుటకు రాగానే అర్జునుడు భీష్ముని ధ్వజాన్ని విరిచి క్రింద పడునట్లుగా చేసేను. 


కౌరవులు నలుగురు-దుశ్శాసన, వికర్ణ దుస్సహ, మరియు దుర్జయులు అర్జునుని చుట్టుముట్టిరి. కానీ, కొద్ది క్షణాల్లోనే అర్జునుడు దుశ్శాసనుని విల్లు విరిచి యెదలో ఐదు బాణాలు దిగబడునట్లు చేసి అతనిని బాధించి అతడు వెనుదిరుగునట్లు చేసెను. 


వికర్ణుడు దాడి చేయగా అర్జునుడు అతని నుదుటిపై బాణముతో బాధించినంతనే అతడు. స్పృహ తప్పి రథములో పడిపోయెను. దుస్సాహుడు మరియు దుర్జయుడు తన వైపుకు శీఘ్రగతిని వచ్చుచుండగా అర్జునుడు వారిపై బాణాలు ప్రయోగించి వారి గుర్రాలను వధించెను. దానితో ఇతర రథాలపై వారిని యుద్దభూమి నుండి దూరముగా తీసుకు వెళ్ళిరి. 


ఆ తరువాత కౌరవరథిక యోధులందరూ ఒక్కసారిగా అర్జునుని పై దాడి చేసిరి. నిజమునకు కౌరవులు సంధిగ్ధావస్థలో ఉండగా, అర్జునుడు వారి నడుమ శివతాండ

వము చేస్తున్నట్లు అగుపించెను. అర్జునుడు రక్త‌పు టేరులు పారించెను. అనేకమంది కౌరవవీరులు అచేతనులైరి. వారు దుర్యోనుని సమక్షములోనే యుద్దరంగమును వీడిపోయిరి. రక్తపు ప్రవాహములో చచ్చిపడిన యోధులందరి జుట్టు కొట్టుకువస్తున్నట్టి గడ్డి వలె కనిపించెను. తేలివస్తున్నట్టి బాణాలు చిన్న చిన్న నావలవలె ఉండెను. మాంసము మరియి కొవ్వు బురద వలె ఉండెను. 


విరిగిన రథాలు, చచ్చిన ఏనుగుల కళేబరాలు ధ్వీపాలుగ ఉండెను మాంసము మరియు రక్తపు వాసనకు ఆక్షర్షింపబడిన భయంకర రాక్షసులు యుద్దరంగ భూమిలో ఒక మూల నుండి మరొక మూలకు శవాలను చూస్తూ నలుదిక్కుల తిరగసాగిరి. 


భీష్ముడు శంఖమును పూరించి సింహగర్జన చేసెను. అటుల కౌరవ సేనను ఉత్సాహపరచి సమరమునకు మరల సంసిద్దులను చేయ ప్రయత్నించెను. అతడు అర్జునుని కపిధ్వజముపై ధారుణ బాణాలు నాటెను. అర్జునుడు తాత భీష్మునితో తలపడే అవకాశం లభించినందులు సంతసించుచు, భీష్ములవారి శ్వేతఛత్రమును నేలకొరిగేలా చేసెను. 


అప్పుడు వారిరువురి నడుమ పోరు తీవ్రముగా జరిగెను. మిగిలిన జోదులందరూ ప్రేక్షకపాత్ర వహించారు. అర్జునుని శరపరంపరను విజయవంతంగా ఎదురురొంటున్న భీష్ముని చూచి కౌరవ వీరులందరనూ ఆనంద చకితులైరి. భీష్మ ద్రోణులు తప్ప అన్యులెవ్వరునూ అర్జునుని ప్రతిఘటించ లేకపోయిరి అని ప్రశంసించుచుండిరి. 


అర్జునుడు భీష్ముని విల్లు విరిచెను. మరో విల్లందుకుని అర్జునునిపై శరపరంపర కొనసాగించెను. అతిరథుల మధ్య పోరువలె కొనసాగినది. చూచువారలకు ఏమాత్రం హెచ్చుతగ్గులు గుర్తింపలేకపోయిరి. ఏమైనను భీష్ముని రక్షణ కొరకు గల సైనికులు అనేకులు యమపురికి పయనమైరి. 


ఆకాశములో గంధర్వరాజు చిత్రసేనుడు ఇంద్రుడితో భీష్మార్జునుల సంకుల సమరమును విఫులముగా చెప్పగా, ఇంద్రుడు వారిపై పుష్పవృష్టి కురిపించెను. ఆ తరువాత భీష్ముడు ఎడమవైపు నుండి వచ్చుట చూచిన అర్జునుడు మరల భీష్ముని విల్లును విరిచి అతని యెదపై పది తీక్షణమైన బాణాలను నాటెను. 


భీష్ముడు నొప్పిని భరించలేక రథము స్తంభాన్ని పట్టుకుని నిశ్చేష్టుడై కూర్చుండిపోయెను. భీష్ముడు స్పృహ తప్పుట చూచిన రథసారథి రథమును సురక్షితంగా వేరొక ప్రాంతమునకు తరలించెను. తరువాత దుర్యోధనుడు అర్జునుని ఎదురించుటకు వచ్చెను. బిగ్గరగా గర్జిస్తూ అతడు అర్జునుని పై బాణప్రయోగము చేసెను. ఆ బాణములు అర్జునుని నుదుటిపై నాటుకొన్నవి. 


 ఆ గాయముతో అర్జునునకు రక్తము కారసాగెను. అర్జునుడు మరింత ప్రతీకారం ఆగ్రహంతో అతివేగముగా శరవృష్టిని కురిపించెను. వికర్ణుడు అకస్మాత్తుగా మదగజముతో అర్జునుని తో తలపడెను. అంత అర్జునుడు దాని ముఖముపై తీవ్రమైన బాణములు నాటగా ఆ బాణముల బాధకు తీవ్రముగా కంపించుచు అది క్రిందపడి మరణించెను. 


భయపడిన వికర్ణుడు దుర్జయుని రథము వద్దకు పరుగెత్తగా, అర్జునుడు దుర్యోధనుని యెదలో బాణములు నాటెను. ఆకారణముగా దుర్యోధనుడు రక్తము కక్కుకొనెను. అది చూచి కౌరవసోదరులు పిక్కబలము చూపిరి. రక్షణలో లేని దుర్యోధనుడు భయపడెను. దీనితో అతను కూడా రథము వెనుకకు త్రిప్పి పలాయనము చిత్తగించెను. 


అర్జునుడు ఈ అవకాశమును వినియోగించుకుని దృతరాష్ట్రుని దుష్టపుత్రుని మందలిస్తూ “ఓ, దుర్యోధనా; యుద్దభూమి నుండి పారిపోయి, క్షత్రియునిగా నీవు నీ గౌరవాన్ని ఎలా విడువగలవు. నాతో వచ్చి యుద్దము చేయుము. లేనిచో నిన్ను పిరికివాడి క్రింద జమకడుతురు.”


పరషవాక్కుల చేత దుర్యోధనుడు మరోసారి వెనుకకు తిరిగి యుద్దమునకు సిద్దపడి నిలుచుండెను. మరల భీష్మ, ద్రోణ, కర్ణుడు, అశ్వత్థామ తదితర రథికులంతా దుర్యోధనునకు బాసటగా వచ్చి రక్షణ కవచము గా నిలిచిరి. అన్ని దిక్కుల నుండి శరపరంపర ఒక సునామీ వలె అర్జునుని చుట్టుముట్టినవి. 


ముందు అర్జునుడు శరవృష్టిని చీల్చి, ఆ తరువాత ఇంద్రుని నుండి పొందిన సమ్మోహనాస్రం ప్రయోగించెను. ఈ అద్భుతమైన అస్త్రప్రభావము యుద్దభూమి అంతటా వ్యాపించి తన శంఖమును గట్టిగా పూరించెను. కౌరవ యోధులందరినీ అచేతనులుగా మార్చి విగ్రహాలకు వలె అగుపడ సాగిరి. 


కౌరవయోధులందరూ పృహతప్పి వారి చేతుల నుండి విల్లులు జారుట గమనించిన అర్జునుడు తన శిష్యురాలు ఉత్తర పలుకులు గుర్తుకు వచ్చెను. 


అతడు ఉత్తరకుమారుని ఆజ్ఞాపించెను. “వెంటనే కౌరవుల వద్దకు రథమును త్రోలి ద్రోణుడు మరియు కృపుని మెరుగైన వస్త్రములు, కర్ణుని పీతాంబరములు, అశ్వత్థామ, దుర్యోధనుల నీలి వస్త్రములు కలిగిన పట్టు కుచ్చులు తీసుకు రమ్ము. భీష్ముని వద్దకు మాత్రము వెళ్ళకుము. అతడు ఈ అస్త్రమునకు నివారణ ఎరుగును. అందుచేత అతడు సమ్మోహపడడని నా ఉద్దేశ్యం. 


అంతలో దుర్యోధనుడు స్పృహలోకి వచ్చి, భీష్మునిపై న చిర్రుబుర్రులాడుతూ ఇట్లనెను. 

“పితామహుడు.. అర్జునుడు తప్పించుకొంటుండగా మీరెందుకు అడ్డుకోలేదు. ? ఏదో విధంగా మీరు అతడిని నిలువరించవలసినది”


భీష్ముడు ఇటుల బదులిచ్చెను. ” సుయోధనా; అర్జునుడు తన ధర్మగుణముల కారణమన స్పృహ తప్పిన మనలను అతడు సంహరించ లేదు. అతని ఈ ఔదార్యతకు బదులుగా ఇంతటితో యుద్ధం విరమించుట మంచిదని నా సలహా. కనుక ఏ ఆటంకములు లేకుండా అర్జునుడిని గోవులతో తిరిగి వెళ్ళ ‌నిచ్చుటయే ఉత్తమము. ”


దుర్యోధనుడు కూడా యుద్ధమును కొనసాగించుటకు ఉత్సాహంగా లేడు. భీష్ముని పలుకులను విని ధీర్ఘ నిట్టూర్పు తో మౌనము వహించెను. కౌరవులు తిరిగి హస్తినకు బయలుదేరిరి. అది చూచిన అర్జునుడు, పెద్దల గౌరవార్థం వారితో కొంత దూరము అనుసరించెను. భీష్మునికి, ద్రోణునికి, కృపునికి మరియు అశ్వత్థామ కు ప్రణామములు అర్పించెను. అర్జునుడు చివరగా తన దేవదత్త శంఖమును పూరించి, ధనుష్టంకారముతో యుద్ధము ముగిసినట్లు సందేశమిచ్చెను. 


తదుపరి, అర్జునుడు తన రథమును మత్స్యరాజధాని వైపునకు మరలించుమని ఉత్తరుని ఆజ్ఞాపించెను. ఆకాశములోని దేవతలందరూ అర్జునుని పరాక్రమమును ప్రశంసిస్తూ. తమ తమ నెలవులకు తిరిగి మరలిపోయిరి. 


అర్జునుడు వెంటనే గోవులతో వాటిని సురక్షితంగా తిరిగి నగరమునకు తీసుకు వెళ్ళసాగెను. యుద్దభూమి నుండి పారిపోయిన కొంతమంది కౌరవసైనికులు స్వచ్ఛందంగా లొంగిపోయిరి. అర్జునుడు వారి రక్షణకు హామీనిస్తూ వారిని హస్తినకు వెళ్ళుటకు అనుమతించెను.

 

అర్జునుడు ఉత్తరుని వైపు తిరిగి ఇట్లనెను. “నన్ను గూర్చిన వాస్తవమును నీవు ఒక్కడివే ఎరుగుదువు. మనము రాజ్యసభకు తిరిగి వెళ్ళునప్పుడు నీవే స్వయముగా ఈ విజయమును సాధించినట్లుగా ప్రకటించుము. లేనిచో, ఇన్ని రోజులు పాండవులు తన వద్ద సేవకులుగా ఉండిరని ఎరిగిన విరాటుడు భయపడును. ”


అర్జునుడు తిరిగి శమీవృక్షము దగ్గరకు వెళ్ళెను. ధ్వజము పై గల హనుమంతుడు మరియు ఇతర చిహ్నములన్నీ అంతర్థానమైపోగా యధాప్రకారము బృహన్నల, ఉత్తర రాకుమారులు రథముపై తమతమ స్థానములలో కూర్చుండిరి. దానితో ఉత్తరుడు సింహము చిహ్నముతో గల తన ధ్వజమును నిలిపెను. అర్జునుడు తన ఆయుధములను తిరిగి శమీవృక్షముపై నుంచెను. అర్జునుడు తిరిగి తన బృహన్నల వేషముతో జుట్టును ముడిచి, గాజులు వేసుకొనెను. 


బృహన్నల పగ్గాలను అందుకొని ఇట్లు అనెను. ”ఉత్తరకుమారా; ముందు గోపాలకులతో, నీ విజయవార్తను ప్రకటించ”మని తెలిపెను. “కొంత విశ్రాంతి తీసుకుని ఆ తరువాత మనము నగర ప్రవేశము చేసెదము. ”


========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree




Comments


bottom of page