'Pragathi Premikulu episode 12' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు యస్. ఐ. వివేకానంద పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం పూర్తి చేసాడు అతడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవా లనుకుంటాడు.
వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు మేనమామ ఆదిశేషయ్య.
తన బర్త్ డే కి విజయ్ ని ఇన్వైట్ చేస్తుంది అమృత.
ధనుంజయరావు. కొడుకు ఉపేంద్రను హత్యానేరంపై అరెస్ట్ చేస్తాడు వివేకానంద.
ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షను విదిస్తుంది కోర్ట్.
హాస్పిటల్ కోసం కడుతున్న బిల్డింగ్ కూలిపోవడంతో 'ఏఈ' గా పనిచేస్తున్న తన తమ్ముడు విజయానందను, కాంట్రాక్టర్ ధర్మలింగాన్ని అరెస్ట్ చేస్తాడు వివేకానంద.
ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12 చదవండి.
జైలునుండి విడుదలైన విజయానంద, ధర్మలింగాలను అమృత, వివేకానందలు కలిసి, జోగయ్య బృందం వలన మీకు హాని కలుగకుండా ఉండేదానికి అరస్ట్ చేయవలసి వచ్చిందని, మీరు నిర్దోషులని అసలు నేరస్తులను, జోగయ్యను పట్టుకొన్నామని, వారిచేత నేరాన్ని ఒప్పించామని, వారికి శిక్ష తప్పదని వివరించారు.
ఆ నేరస్థులకు రొండు సంవత్సరాల కారాగార శిక్ష, తలా పాతికవేల జరిమానా జడ్జిమెంటులో వెల్లడయింది. ఆ రాత్రి వివేకానంద తమ్ముడు విజయానందను తన క్వార్టర్ కు రమ్మన్నాడు. విజయ్ వెళ్ళాడు. తమ్ముడిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు వివేకానంద.
“విజయ్..! నీకు నా మీద కోపంగా వుండా..!" అతని ముఖంలోకి దీనంగా చూస్తూ అడిగాడు వివేక్.
అన్నగారి కళ్ళల్లో చుట్టుకొంటున్న కన్నీటిని చూచాడు విజయ్. అతని హృదయంలో తన అన్నయ్య పట్ల ఉన్నది గౌరవం, అభిమానం, ప్రేమ. వివేక వాలకాన్ని చూచిన విజయ్ కళ్ళల్లో కన్నీరు…
"అన్నయ్యా..! నీవు నా అన్నయ్యవని చెప్పుకొనే దానికి నాకు గర్వంగా వుందన్నయ్యా..! నాకు నీ మీద కోపమా..! ఇప్పుడే కాదు అసలు ఎప్పటికీ రాదు. కారణం నీ వృత్తిని నీవు ఆరాధిస్తావు. కర్తవ్య నిర్వహణలో నీకు పక్షపాతం అన్నది లేదు. కొందరు ప్రజల్లో ఉన్న స్వార్ధం, ధ్వేషం, మోసం, అవినీతి, అహంకారం, నశించాలంటే నీలాంటి పోలీస్ ఆఫీసర్ ఈ రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో అవసరం. అప్పుడే గుండాలు, రౌడీలు అణగిపోతారు. వారి మనస్తత్వాల్లో సాటి వారికి పడ్డ శిక్ష సింహాస్వప్నం అవుతుంది. ఈ సిద్ధాంతాలు నమ్మి, ఆచరచించే నీవు నాకు అన్నవైనందుకు నాకు గర్వం, ఎంతో సంతోషం అన్నయ్య. ఏ నేరము చేయని నేను, నీవు నన్ను అరెస్ట్ చేసినప్పుడు భయపడలేదు. నిన్ను తలచుకొని ఎంతగానో ఆనందించాను." ఎంతో ఆవేశంతో చెప్పాడు విజయ్.
తమ్మునికి తన పట్ల వున్న నమ్మకానికి, గౌరవానికి వివేకానంద సంతోషించి విజయ్ ను తన హృదయానికి హత్తుకొన్నాడు.
"ఎందరో మహనీయుల బలిదానంతో, నిస్వార్థ దేశభక్తితో, ఎందరో ఎన్నోవిధాల కష్టనష్టాలను అనుభవించి, మన దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారు. వారి కలలు నిజాలు కాక ముందేవారు వెళ్ళిపోయారు. ఆ అమరజీవుల కలలను సాఫల్యం చేయడం మన దేశపు భావిభారత పౌరులందరి కర్తవ్యం. పాలనా వ్యవస్థ ఈ డెమోక్రటిక్ దేశంలో ఏ ఒక వ్యక్తికి, ఒక వర్గానికి, ఒక మతానికి, కులానికి సంబంధించినదికాదు, యావత్ భారత ప్రజల అభ్యున్నతికి, ఆనందానికీ, ప్రగతికీ సంబంధించి ఉండాలి. అందుకు ప్రతి ఉద్యోగి తన ధర్మాన్ని పక్షపాతరహితంగా నిస్వార్థంగా నెరవేర్చాలి. మన ప్రవర్తనను చూచి వ్యతిరేక భావాలున్న సాటివారు మారాలి. మనమందరం భారతమాత సంతతిగా
భావించాలి. ప్రేమా, సౌభ్రాతృత్వాలను ఎదుటివారికి పంచాలి, పెంచాలి. నా ఉద్యోగ ధర్మంలో నేను వీటిని నమ్మి ఆచరిస్తున్నాను. అంతే ఇందులో అతిశయోక్తి లేదు తమ్ముడూ..! అతిశయోక్తిలేదు…!” తన మనోభావాలను తెలియజేశాడు వివేకానంద.
జోగయ్య కేసు విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చిన అమృత వరండాలోనే ఆగిపోయి అన్నదమ్ముల సంభాషణను పూర్తిగా విన్నది. వారిరువురూ అన్నతమ్ములన్న విషయాన్ని గ్రహించి, ఆనందంగా వెనక్కు వెళ్ళిపోయింది.
'వీరిరువురి తల్లి దండ్రులు ఎంతో గొప్ప సంస్కారం వున్నవారు. తన తల్లి, తండ్రి తనను పెంచినట్లే, వీరికీ వారి అమ్మానాన్నలు మన హైందవ ధర్మాలను, శ్రీ స్వామీజీ వివేకానంద పాశ్యాత్య దేశాల్లో ఘోషించినట్లు, మన జాతి తత్వాలను బాగా నేర్పారు. అందుకే వారిరువురూ అంతటి నిజాయితీ పరులుగా తయారయ్యారు. విజయ్ ను అడిగి వీరి తల్లిదండ్రులను గురించి తెలుసుకోవాలి. వీలైతేవారిని ఒకసారి కలసి అభినందించాలి.' అనుకొంది అమృత.
మరుదినం సైట్ లో విజయానందను అతని తల్లిదండ్రులను గురించి అడిగింది. తండ్రిపేరు పురుషోత్తమరావు, తల్లిపేరు భువనేశ్వరి తను తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తండ్రిగారు గతించినట్లు చెప్పాడు విజయ్.
ఆ రాత్రి భోజనాల సమయంలో విజయ్, వివేకానందుల ప్రస్తావన వచ్చింది. వారిరువురూ అన్నతమ్ములని వారి తల్లి దండ్రుల పేర్లను చెప్పింది అమృత. పురుషోత్తమరావుగారి పేరు వినగానే వెంకటేశ్వర్లు ఆశ్చర్యపోయాడు. "వారు మా పెద్దబావగారు అమృత..! ధనుంజయరావుగారి అన్నగారు.” తనకు తెలిసిన విషయాన్ని యధాలాపంగా చెప్పాడు వెంకటేశ్వర్లు.
తనకు, వారిరువురికీ మధ్నవున్న బంధుత్వం, వరస తెలిసాయి అమృతకు. మనస్సులో విజయ్ పట్ల మధురభావన. భోజనం ముగించి తనగదికి వెళ్ళిపోయింది.
***
“చలమయ్య ఈరోజు జైలునుండి విడుదలయ్యాడు సార్.. వివేకానందతో చెప్పాడు హెడ్ కానిస్టేబుల్ కోటయ్య.
“చలమయ్య అంటే ఎవరు కోటయ్యగారూ..!”
“కాలేజీ యువకుడు బాలసుబ్రమణ్యం కేసులోని ఒక ముద్దాయి.. అతని మేనమామ సార్..”
“ఓహో అలాగా..! అతని వ్యక్తిత్వం ఎలాంటిది..?”
"మంచివాడనే విన్నాను సార్.. ధనుంజయగారు సృష్టించిన సాక్ష్యాల మూలంగా, నిరపరాధి అయిన అతనికి శిక్ష పడిందని విన్నాను.”
వివేకానంద సాలోచనగా మౌనంగా తల ఆడించాడు.
"అతన్ని ఒకసారి స్టేషన్ కు తీసుకొని రండి. మాట్లాడుదాం.” అన్నాడు వివేకానంద.
“అలాగే సార్..!”
అమృత వేగంగా వచ్చి, వివేకానంద రూమ్ ముందు నవ్వుతూ నిలబడింది. ఆమె చేతిలో స్వీట్స్ పాకెట్ వుంది.
అమృతను చూచిన కోటయ్య... "సార్..!" అమృతమ్మ గారు వచ్చారు.”
వివేకానంద తలఎత్తి చూచాడు. ఎదురుగా నవ్వుతూ అమృత నిలబడి వుంది.
“సార్ గుడ్మార్నింగ్. మే ఐ కమిన్..?"
“ప్లీజ్ కమ్...”
అమృత గదిలోనికి వచ్చింది. కుర్చీని చూపించి కూర్చోమని చెప్పాడు వివేక. అమృత కుర్చీలో కూర్చుంది. స్వీట్ పాకెట్ ను వివేక ముందు ఉంచింది.
“సార్.. నేను ఐ.ఏ.యస్ ఫైనల్ టెస్టులో సెలక్ట్ అయ్యాను.” ఆనందంగా చెప్పింది అమృత.
“కంగ్రాచ్యులేషన్స్...” ఆనందంగా కరచాలనం చేశాడు వివేకానంద.
“స్వీట్ తీసుకోండి.”
“ముందు మీకు నేను స్వీట్ తినిపించాలి.” స్వీట్ ను చేతికి తీసుకొని వివేక్ ఆమె ప్రక్కకు వచ్చి స్వీట్ ను అమృత నోటికి అందించాడు. కొరికి స్వీట్ ను తన చేతిలోనికి తీసుకొంది అమృత.
పాకెట్ లోని ఒక స్వీట్ ను తను తీసికొని పాకెట్ ను కోటయ్యకు అందించి…
“అందరికీ చెప్పండి కోటయ్య గారూ..! మన అమృత ఐ.ఏ.యస్ సెలక్ట్ అయినదని.” నవ్వుతూ చెప్పి కుర్చీలో కూర్చొని తన చేతిలోని స్వీటు నోట్లో వేసుకొన్నాడు వివేకానంద.
"అమృతా..! రేపు నీవు నా ఇంటికి డిన్నర్ కు రావాలి.”
“అలాగే...”
“సార్ ఇక నే బయలుదేరుతాను. మీ తమ్ముడు విజయను కలసి వారికి స్వీట్ ఇచ్చి ఈ వార్తను చెప్పాలి.” ఆనందావేశాలతో అంది అమృత.
ఆమె మాటలకు వివేక ఆశ్చర్యపోయాడు.
"ఆశ్చర్యపోకండి సార్. నాకు అంతా తెలుసు." నవ్వుతూ అంది అమృత. కూర్చీ నుంచి లేచి…
"నేనుగా ఎవరితోనూ చెప్పును, భయపడకండి. వెళ్లొస్తాను." నవ్వుతూ వేగంగా వెళ్ళిపోయింది అమృత.
"ఘటికేశ్వర వివేకానంద.. యస్.ఐ గారు వున్నారా..?" స్టేషన్లో ప్రవేశించిన ఆ యువతి అడిగింది.
ఆమె మాటల్లోని సౌమ్యతను, ముఖంలో వుండే కళాకాంతులను చూచి.. 'ఈమె అయ్యగారి ముఖ్యమైన వ్యక్తి అయ్యి వుండవచ్చు' అనుకొని.. “ఉన్నారమ్మా..!" వినయంగా చెప్పాడు కోటయ్య.
"ఇన్స్పెక్టర్ ఝాన్సీరాణి వచ్చిందని చెప్పండి.”
లోనికి వెళ్ళి వివేకానందకు విషయాన్ని చెప్పాడు కోటయ్య. వివేక్ వేగంగా బయటికి వచ్చాడు. ఝాన్సీని చూచి ఆశ్చర్యపోయాడు.
“గుడ్ మార్నింగ్ సార్..!" చిలిపిగా నవ్వుతూ అంది ఝాన్సీ.
వివేక్ తొట్రుపాటుతో... "గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్." తన గదిలోనికి నడిచాడు.
ఝాన్సీ అతని వెనకాలే ఆ గదిలోనికి వెళ్ళింది. కొద్దిక్షణాలు వివేక్ ఝాన్సీని పరీక్షగా చూచాడు.
“కూర్చోమని చెప్పరా..!" నవ్వుతూ అంది ఝాన్సీ.,
“ఆ కూర్చో..!" తొట్రుపాటుతో అన్నాడు వివేకానంద.
ఝాన్సీ కుర్చీలో కూర్చుంది. వివేక తన స్థానంలో కూర్చున్నాడు. నాలుగేళ్ళ క్రిందట తనకు ఝాన్సీ విజయవాడలో తను ఇన్స్పెక్టర్ గా పనిచేసే రోజుల్లో
పరిచయం. ఈ రోజు ఇక్కడ ఆమెను చూస్తానని వివేక ఎన్నడూ ఊహించలేదు.
“జ్ఞాపకం వున్నానా..!” కళ్ళు ఎగరేస్తూ అడిగింది ఝాన్సీ.
వివేక వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ఝాన్సీని గురించిన ఆలోచన.. కళ్ళు మూసుకున్నాడు.
"నేను మిమ్మల్ని మరువలేదు. అదే ఝాన్సీ..! అదే మనస్సు..! మీకు తగిన దాన్నిగా, సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఊరికి వచ్చాను.” వివేక్ ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పింది ఝాన్సీ.
“ఝాన్సీ.. నీవు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యావా..!”
"అదేగా మీ కోరిక అయ్యాను.”
వివేక వదనంలో మందహాసం... ఆమె ముఖంలోకి చూచాడు.
“ఇప్పుడు నన్ను వివాహం చేసుకొనే దానికి మీకు అభ్యంతరం లేదుగా..!” నిశితంగా వివేకానంద ముఖంలోకి చూస్తూ అడిగింది ఝాన్సీ.
“ఎప్పుడు వచ్చావు..?”
“రాత్రి.”
“తోడు ఎవరు వచ్చారు..?”
“అమ్మ..!”
"అమ్మా నాన్నా బాగున్నారా..!”
“మీ దయవల్ల బాగానే ఉన్నారు. మీ టైంను నేను వేస్టు చేయదలచుకోలేదు. రేపు సాయంత్రం మా యింటికి భోజనానికి రండి. అమ్మ చెప్పమంది. ఇదిగో అడ్రస్” హ్యాండ్ బ్యాగ్ లో నుంచి చిన్న పేపర్ ముక్కను తీసి వివేక్ కి అందించింది. లేచి నిలబడింది.
“తప్పకుండా రావాలి. ఎదురు చూస్తూ వుంటాను. గుర్తు పట్టినందుకు థ్యాంక్యూ..!" వేగంగా గది నుండి వెళ్ళిపోయింది ఝాన్సీ.
వివేకానందకు తను చూచింది కల నిజమా..! సందేహం. గిల్లుకొన్నాడు, నవ్వుకొన్నాడు.
ఆ రోజుల్లో తను విజయవాడలో ఝాన్సీ వారి ఇంట్లో ఒక పోర్షన్లో ఉండేవాడు. ఝాన్సీ యం.ఏ ఫైనల్ యర్ చదువుతుండేది. వారి ఇంట్లో ఉన్న కారణంగా ఇరువురికీ పరిచయం కలిగింది. అనేక పర్యాయాలు తను ఝాన్సీ తల్లిదండ్రుల ఆహ్వానంతో వారి ఇంట్లో టిఫిన్, భోజనం చేశాడు. ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడైనాడు. ఝాన్సీ అతన్ని ఎంతగానో అభిమానించింది. అందం, చదువు, సంస్కారం ఉన్న ఝాన్సీ అంటే తనకూ ఎంతో ఇష్టం ఏర్పడింది. తన నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసి ఆమెను పెండ్లి చేసికోవాలని నిర్ణయించుకొన్నాడు.
ఝాన్సీ యం.ఎ. ఫైనల్ ఇయర్ పరీక్షలు బాగా వ్రాసింది. తనకు వివేకానంద అంటే ఇష్టమని, అతనితో మాట్లాడి తన వివాహాన్ని జరపవలసిందిగా తల్లిని కోరింది.
ఆ తల్లి తన కూతురు ఉద్దేశాన్ని భర్తతో చెప్పింది. ఆమె భర్త పోలీసుకు తన కూతురును ఇవ్వనన్నాడు. ఆ దంపతులతో కలసి మాట్లాడాలని వెళ్ళిన వివేకానంద వారి సంభాషణను విన్నాడు. వారిని కలవకుండానే వెనక్కు తిరిగి వచ్చాడు నిరాశతో..
వివాహం అంటే కేవలం ఒక యువతి ఒక యువకుడికి సంబంధించినది కాదని, అలా ఆవేశంతో జరిగే వివాహం, తల్లిదండ్రులకు ఇష్టం లేని కారణంగా కొంతకాలం తర్వాత, ఆ ఇరువురికి మధ్యన భేదాభిప్రాయాలు కలిగి, విడాకులకు దారితీసిన కొందరి వైవాహిక జీవితాలను గురించి విని, చూచిన కారణంగా, తన వలన ఝాన్సీ జీవితం కష్టాలపాలు కాకూడదని తన నిర్ణయాన్ని వివేక్ మార్చుకొన్నాడు.
ఝాన్సీతో తనకు ప్రస్తుతంలో వివాహం చేసికొనే ఉద్దేశ్యం లేదని, ఏనాటికైనా చేసుకొంటే పోలీస్(ఆడ)నే చేసికొంటానని ఝాన్సీకి చెప్పాడు. వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన కారణంగా వెళ్ళిపోయాడు.
ఝాన్సీ అతని పట్ల వున్న తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. పట్టుదలతో చదివి ఐ.పి.యస్ పాసయింది. పోస్టింగ్ మీద ఆ ఊరికి వచ్చింది. వివేకానందను కలసి తన మారని అభిప్రాయాన్ని అతనికి తెలియజేసింది.
సంకల్పం, ప్రయత్నం, కృషి ప్రతిఒక్కరినీ లక్ష్యాన్ని చేర్చగలవు. అదే జరిగింది ఝాన్సీ విషయంలో.. వివేకానంద ఝాన్సీని గురించి ఆలోచిస్తున్నాడు.
'మొండిఘటం ఇన్స్పెక్టర్ అయ్యి పోలీస్ గా వచ్చి తన ముందు నిలచింది.' నవ్వుకొన్నాడు వివేకానంద.
మరుదినం కలెక్టర్ ఆఫీసు మీటింగుకు వెళ్ళి ఐదు గంటలకు ఆఫీసుకు వచ్చాడు. సెల్ మ్రోగింది చూచాడు. తల్లి భువనేశ్వరి కాల్....
"అమ్మా..! ఎలా వున్నావమ్మా..? మామయ్య, అత్తయ్య అందరూ బాగున్నారా..?” అడిగాడు వివేకానంద.
"మేమంతా బాగున్నాము. నీవు తమ్ముడు ఎలా ఉన్నారు..?”
“బాగున్నామమ్మా..!”
"ఝాన్సీ ఇంటికి వచ్చింది. తను నిన్ను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. వాళ్ళు మనకు దూరపు బంధువులు. నిన్ను కలిసికొనేదానికి వెళుతున్నానని చెప్పింది. తను నీవు కోరినట్లుగానే పోలీస్ అయిందట. ఆ పిల్ల వచ్చి నిన్ను కలిసిందా..?”
“ఆ... కలిసిందమ్మా..! తోట్రుపాటుతో చెప్పాడు వివేక్.
“ఏం చెప్పింది..?" నవ్వింది భువనేశ్వరి.
తల్లి ఈ ప్రశ్నకు వెంటనే ఏం చెప్పాలో వివేకకు తోచలేదు. ఆలోచనలో పడ్డాడు.
“మాకు అందరికీ ఆ పిల్ల బాగా నచ్చింది నాన్నా..! నీవు సరే అంటే ముహూర్తాలు పెట్టిస్తాము.”
“అమ్మా..! కొంచెం ఆగమ్మా..! నన్ను ఆలోచించుకోనియ్.”
ప్రాధేయపూర్వకంగా చెప్పాడు వివేకానంద.
"ఏ విషయాన్ని గురించి..?”
“అదే అమ్మా..! నీవు అన్న విషయాన్ని గురించి..”
“నీకు ఇరవై నాలుగు గంటల వ్యవధిని ఇస్తున్నాను. ఆలోచించి వివాహానికి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావో చెప్పు. సరేనా..!"
తల్లి భువనేశ్వరి నిర్ణయం వివేకానందకు తెలిసిపోయింది. ఇక తను ఒప్పుకోక తప్పదు అనుకొన్నాడు.
"అలాగే అమ్మా..!”
టేబుల్ మీద ఉన్న ఫోన్ మ్రోగింది.
"అమ్మా..! ల్యాండ్ లైన్లో కాల్ వచ్చింది. నేను నీతో తర్వాత మాట్లాడుతాను."
కాల్ కట్ చేసి రిసీవర్ ను చేతికి తీసుకొన్నాడు. “హలో..! ఎవరూ..?”
“గొంతును మరిచిపోయారా..! ఝాన్సీ..!"
"ఓహో..! ఏమిటి విషయం..?”
“టైము ఆరున్నర... ఏడుంకాలు కల్లా మా ఇంట్లో ఉండాలి. జ్ఞాపకం వుందా లేదా..!" నవ్వింది ఝాన్సీ.
“ఉంది ఝాన్సీ..!" అనునయంగా చెప్పాడు వివేక్.
“ఎదురుచూస్తూ వున్నాను.”
"వస్తాను. బయలుదేరాలిగా..! ఫోన్ పెట్టేస్తున్నాను." ఫోన్ రిసీవర్ పై వుంచి కుర్చీ నుండి లేచాడు వివేక ఎంతో ఆనందంగా.
వివేకానంద జీప్ ఝాన్సీ ఇంటి ముందు ఆగింది. వాకిట్లోనే నిలబడి ఉన్న ఝాన్సీ, జీప్ దగ్గరకు పరుగెత్తి...
“స్వాగతం... సుస్వాగతం... మహాశయా..!" నాటకీయంగా చేతులను నవ్వుతూ ఊపింది ఝాన్సీ.
ఇరువురూ ఆనందంగా ఇంట్లో ప్రవేశించారు. ఝాన్సీ తల్లి అలివేలు ఆప్యాయంగా వివేకానందను పలకరించింది. చేతులు జోడించి వివేకానంద వినయంగా ఆ పెద్దావిడకు నమస్కరించాడు.
“కూర్చొండి.” అంది ఝాన్సీ.
నిలబడే ఉన్న అలివేలును చూచి... "మీరూ కూర్చోండమ్మా..!”
“అమ్మ కాదు.. అత్తయ్య...” ఖచ్చితంగా చెప్పింది ఝాన్సీ నవ్వుతూ.
“నాయనా..! భోజనాలకు ఏర్పాటు చేస్తాను. మీరిరువురూ రండి.” అని చెప్పి ఆమె వంటింటి వైపుకు వెళ్ళిపోయింది. తన కూతురి సామర్ధ్యానికి ఆనందిస్తూ..
“నీవు మా అమ్మను కలిశావా..!"
“కాదు... మా అత్తయ్య గారిని, చిన్నాన్నగారిని, పిన్నిగారిని కలిశాను. ఏం తప్పా..?” ఎదురు ప్రశ్న వేశింది ఝాన్సీ.
వివేకానంద ఝాన్సీ తెగువకు, నిర్భయానికి, ఆశ్చర్యపోయాడు.
“ఎందుకు సార్ అంత ఆశ్చర్యం..?” ఓరకంట చిలిపిగా చూస్తూ అంది ఝాన్సీ.
భోజనానికి రావలసిందిగా అలివేలు ఝాన్సీని పిలిచింది.
“పదండి. అమ్మ భోజనానికి పిలుస్తుంది.”
వివేక్ నవ్వుతూ ఝాన్సీని అనుసరించాడు. ఇరువురూ డైనింగ్ రూమ్ వైపు వెళ్ళారు.
***
బాస్ స్వీట్ తీసుకొండి.” నవ్వుతూ విజయ్ కు స్వీట్ అందించింది అమృత.
"ఏమిటో విశేషం..!"
“నా ఫైనల్ ఐ.ఎ.యస్ టెస్టులో సెలక్ట్ అయ్యాను.”
ఆనందంగా పలికింది అమృత.
ఈ మధ్య కాలంలో అమృత విజయల మధ్య సన్నిహితం పెరిగింది. తన జీప్ లో విజయ్ ను అనేకసార్లు డ్రాప్ చేసింది. ఆమె ధోరణిని, తన పట్ల చూపే అభిమానం, ఆమె తనతో చేసే చతుర సంభాషణ కారణంగా, తన పట్ల ఆమెకు ఉన్న అభిప్రాయాన్ని విజయ్ గ్రహించాడు. మేడమ్ అని చెప్పడం మాని.. 'అమృతా..!' అని పిలవడం ప్రారంభించాడు. ఈ పిల్ల నన్ను ప్రేమిస్తూ ఉందనే నిర్ణయానికి వచ్చాడు.
"కంగ్రాచ్యులేషన్స్ అమృతా..!" చేతిని ముందుకు చాచాడు.
అమృత చేతిని అతని చేతితో కలిపింది.
“మరి నాకు ట్రీట్ ఎప్పుడిస్తారు..?"
విజయ్ సెల్ మ్రోగింది. నెంబర్ చూచి...
“చెప్పన్నయ్యా..!"
“అలాగా!...”
…. …. ….
“తప్పకుండా రావాలా..!”
…. ….. ….
“పిలుచుకు రావాలా..!”
…. …. ….
"ఓహో..!"
…. …. ….
“అలాగా..!”
“సరే అన్నయ్యా..! బై బై..." విజయ్ వదనంలో ఎంతో ఆనందం.
“ఎవరు..?” అడిగింది అమృత.
“మా అన్నయ్య..!” యధాలాపంగా అన్నాడు విజయ్.
“నీవు నీకో అన్నయ్య ఉన్నట్లు నాతో ఇంతవరకూ చెప్పలేదు..!" సందేహంగా విజయ్ ముఖంలోకి చూచింది అమృత.
"మన మధ్యన ఆ ప్రసక్తి రాలేదుగా..!"
“ఇప్పుడు వచ్చిందిగా చెప్పు. పేరేమిటి..? ఎక్కడ ఉన్నాడు..? విజయ్ కళ్ళల్లోకి నిశితంగా చూచింది అమృత.
విజయ్ సందిగ్ధంలో పడిపోయాడు. 'నిజం చెప్పాలా..! అబద్ధం చెప్పాలా..! అబద్ధం చెబితే నిజం తెలిసిననాడు తన పరిస్థితి ఏమిటి..? తనకు అబద్దం చెప్పవలసిన అవసరం ఏమిటి..?' నిజాన్నే చెప్పాలని నిర్ణయించుకొన్నాడు.
"ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు..?" నవ్వింది అమృత.
"వివేకానంద మా అన్నయ్య. ”
“నాకు ఎప్పుడో తెలుసు.” తల ఆడిస్తూ నవ్వింది అమృత.
విజయ్ ఆశ్చర్యపోయాడు. “నీకెలా తెలుసు..?”
“నాకు మూడో కన్ను వుంది. దానివల్ల తెలిసింది.”
“నన్ను టెన్షన్ పెట్టకు అమృతా ప్లీజ్...”
తను వారిరువురి సంభాషణను విన్న సంగతిని అమృత విజయానందకు చెప్పింది.
“నన్ను పెండ్లి చేసికొంటావా..? ఐ లవ్ యు." అంది అమృత.
"ఏమిటిది..? ఇంతగా తెగించి అడుగుతున్నావ్..?"
ఆశ్చర్యంతో అన్నాడు విజయ్.
"మిస్టర్... తెగింపు లేనిదే విజయం సిద్ధించదు. మనం ఒక నిర్ణయానికి వచ్చామంటే, దేనికి భయపడం. నిర్భయంగా చెబుతాం. క్రియాచరణా చేస్తాము. నా జవాబు చెప్పు..!”
గద్దించినట్లు అడిగింది అమృత.
“నాకు కొంచెం అవకాశం ఇవ్వు..? "
“దేనికి..!”
“అదే నీకు జవాబు చెప్పేదానికి..!"
"నేనంటే నీకు ఇష్టంలేదా..!”
“ఉంది కానీ...” ఆగిపోయాడు విజయ్.
వయ్యారంగా సత్యభామలా నిలబడి ఓరకంట చూస్తూ...
“కానీ... అదేమిటో చెప్పు...” బుంగమూతి పెట్టి అంది అమృత.
"అన్నయ్య, అమ్మతో మాట్లాడాలి.”
"నేను మాట్లాడనా..!" కొంటెగా నవ్వింది అమృత.
“అమృతా..! అంత పనిచేయకు. ఒక విషయాన్ని ఆలోచించు. అన్నయ్యకు పెళ్ళి కాకుండా నేను ఎలా చేసికోగలను..?” అనునయంగా చెప్పాడు విజయ్.
“ఓ... అదీ పాయింటే నీకో విషయం తెలుసా..? ఈ వూరికి క్రొత్తగా ఒక లేడీ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఆమె పేరు ఝాన్సీ.”
“ఆమెకు మనకు ఏమిటి సంబంధం..?" ఆశ్చర్యంతో అడిగాడు విజయ్.
"ఆమె నాకు అక్కయ్య వరస అవుతుంది చిలిపిగా నవ్వింది అమృత.
“అంటే... ఆమె మీకు బంధువా..?”
“నాకే కాదు నీకూను...”
“నాకూ బంధువా..?” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు విజయ్.
“ఆమె వరుసకు వదినగారవుతుంది నీకు.” నవ్వింది అమృత.
“అమృతా..!... ఏమిటి నీవన్నది..?” దీనంగా అడిగాడు విజయ్.
“ఝాన్సీగారు మీ అన్నయ్యగారి లవర్. మా వీధిలోనే చేరింది. మనిషి నాలాగే మంచి అందగత్తె. నిన్న రాత్రి మా బావగారు, అక్కగారి ఇంటికి డిన్నర్ కు వచ్చారు.
“అమృతా..! నీవు చెప్పింది నిజమేనా..!"
"మై డియర్ వుడ్ బీ..! నీకు సందేహంగా ఉంటే మీ అన్నయ్యగారినే అడుగు.
“తప్పు...”
“ఏది?...”
"అలా అడగడం...”
“అలాగా..! సరే, పద మనమిద్దరం కలిసి వెళదాం. నీముందు, నీకు బదులుగా నేనే మా బావగారిని అడుగుతాను.”
“నోనో అమృతా..! అలా చేయకు. అది వారి స్వవిషయం. వారికై వారే మనకు ఒకరోజు చెబుతారు.” సాయంకాలం మనం ఒకచోటికి డిన్నర్ కు వెళ్లాలి, నీవూ నాతో రావాలి.”
“ఎక్కడ..?”
“సస్పెన్స్, యీవినింగ్ చెబుతాను.” నవ్వుతూ చెప్పాడు విజయ్.
“ఓకే. ఇక నే వెళుతున్నాను. వర్క్ మీద పూర్తి ధ్యాసను ఉంచండి.”
నవ్వుతూ అమృత జీప్ లో కూర్చుంది. ఈశ్వర్ బండిని స్టార్ట్ చేశాడు.
=================================================================================
ఇంకా ఉంది..
=================================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments