top of page

ప్రగతి ప్రేమికులు 10


'Pragathi Premikulu episode 10' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.

స్వామిజీ కథను చదవడం పూర్తి చేసాడు యస్. ఐ. వివేకానంద. తమ్ముడు విజయానంద ని కలుస్తాడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవాలనుకుంటాడు. తాను ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం తల్లికి ఇష్టం లేదని గ్రహిస్తాడు వివేకానంద. తన మేనమామ ఆదిశేషయ్యను కారణాలు చెప్పమంటాడు.


వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు ఆదిశేషయ్య.


తన బర్త్ డే కి విజయ్ ని ఇన్వైట్ చేస్తుంది అమృత.


ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 10 చదవండి.


ఆ రాత్రి పదిన్నరన్న ప్రాంతంలో మఫ్టీలో వివేకానంద, ఏకాంబరం, ఎనిమిదిమంది పోలీసులు ఉపేంద్ర ఉన్న గెస్టు హౌసును చుట్టుముట్టారు. నలుగురు మిత్రులతో మందు త్రాగుతూ తన ప్రతాపాన్ని వారికి వినిపిస్తున్న ఉపేంద్రను, నలుగురినీ పట్టుకొన్నారు. బేడీలు వేసి, జీపులో త్రోసి, స్టేషన్ కు తీసుకొని వచ్చి, సెల్ లో త్రోశారు.


వాచ్మెన్ తిరిపాలు, సిటీకి పరుగెత్తి, విషయాన్ని ధనుంజయరావుకు తెలియజేశాడు. ధనుంజయ నిర్ఘాంతపోయాడు. అతనిలో ఆవేశం హద్దులు దాటింది. కోపం, బాధ, అవమానం అతన్ని రాక్షసుడిగా మార్చేశాయి. తన అడ్వకేట్ పీతాంబరంకు ఫోన్ చేసి, వెంటనే బెయిల్ మీద తన కొడుకు జైలు నుండి విడుదలయ్యేలా చేయమని ఆదేశించాడు.


"ఇది రాత్రి సమయం. ఈ రోజు శుక్రవారం. రేపు ఎల్లుండి శని, ఆదివారాలైనందున కోర్టుకు సెలవు. మీరు చెప్పింది నేను సోమవారమే చేయగలను సార్.. " వినయంగా తెలియజేశాడు లాయర్ పీతాంబరం.


విషయాన్ని విన్న రాజేశ్వరి బోరున ఏడుస్తూ.. . "నా మాటలను లెక్క చేయని దానికి ఫలితాన్ని చూచారా.. ! మీ ఇష్టానుసారంగా వాణ్ణి తప్పుడు దారిన నడిపించిన

దానికి ఫలితంగా వాడు జైలుపాలయ్యాడు. వాడు చిన్నవాడు. వాడికేం తెలుసు.. ?, అన్నీ తెలిసిన మీరు ఇలాంటి నీచమైన పనులు వాడి చేత చేయించి వాణ్ణి నాశనం చేశారు.


మీ ఈ పాపాలకు మీరూ ఒకనాడు శిక్ష అనుభవించవలసి వస్తుంది. చేసిన పాపం వూరికే పోదు. ఏదో రూపంలో మనల్ని చుట్టుకొని చంపేస్తుంది” భర్తపట్ల తనకు వున్న కోపం, కసిని, వెళ్ళగక్కి ఏడుస్తూ వెళ్ళిపోయింది రాజేశ్వరి.


అప్పుడే హాస్పటల్ నుండి వచ్చిన త్రివిక్రం, తల్లిని సమీపించి అనునయించాడు, ఓదార్చాడు. ధనుంజయరావు ఆవేదన, అవమానంతో తప్పతాగి పడకపై పడిపోయాడు.

తెల్లవారి ఏడు గంటలకు లేచాడు ధనుంజయరావు. కొడుకు జైలు పాలు అయిన కారణంగా అతని మస్కిష్కంలో క్రోధం, ఆవేదన, కసి నిండి వున్నాయి.


అడ్వకేట్ ను ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు. అప్రసన్న చిత్తంతో కాలకృత్యాలు తీర్చుకొని, తన భవంతి ప్రక్కనే వున్న తన కార్యాలయానికి వెళ్లాడు. పార్టీ హితులు పదిమంది వచ్చారు. జరిగిన దానికి, తమ సంతాపాన్ని తెలియజేశారు. వారి వారికి తోచిన రీతిలో ధనుంజయకు, తను మాజీ యం. ఎల్. ఎ అయినా, తమ సపోర్టు ఎప్పటికీ వుంటుందని వారు వివరించారు.


లాయర్ పీతాంబరం వచ్చాడు. నిన్న రాత్రి ఫోన్లో చెప్పిన విషయాన్నే మరోసారి సవినయంగా ధనుంజయరావుకు విన్నవించాడు. సోమవారంనాడు ఉపేంద్రను జైలునుంచి బయటికి తీసుకొని వస్తానని హామీ ఇచ్చాడు.


కొందరు పార్టీ కార్యకర్తలు ఆవేశంతో వివేకానంద ఇంటి మీదికి దాడి చేసి, అతన్ని కొట్టాలన్నారు. అలాంటి పని జరిగితే సమస్య గడ్డు సమస్య అవుతుందని, ఉపేంద్రకు బెయిల్ లభించకపోవచ్చని, వారిని వారించాడు లాయర్ పీతాంబరం.


ధనుంజయకు ముఖ్యుడైన ఇన్స్పెక్టర్ వారి కాల్ కు జవాబుగా, తనకు ట్రాన్స్పర్ అయిందని, తన నిస్సహాయ స్థితిని ధనుంజయ తెలియజేశాడు. అందరూ పీతాంబరం సలహాను పాటించి అన్నగారి దగ్గర శలవు తీసికొని వెళ్ళిపోయారు. పవర్ లేని ధనుంజయ వివేకానంద మీద పగ తీర్చుకొనే ఆలోచనలో మునిగిపోయాడు.


“అందరూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. ” చిరునగవును చిందిస్తూ చెప్పింది అమృత.

ఆ రోజు ఆదివారం. సమయం సాయంత్రం ఏడుగంటలు. అమృత పుట్టిన రోజు. ఆమె ఆఫీస్ లో పనిచేసేవారు పదిమంది, వివేకానంద, విజయ్ ఆమె పెద్ద తండ్రులు, స్నేహితులు పదిమందీ, వెంకటేశ్వర్లుగారి ఇంటి ముందున్న ఆవరణంలో సమావేశమైనారు.


తండ్రి తల్లి ఇరువైపులా వుండగా మధ్య అమృత నిలబడి వచ్చినవారందించిన కానుకలను అందుకొంది. పెద్దలు దీవించారు. సమవయస్కులు శుభాకాంక్షలను, మెనీ మెనీ హ్యాపీ రిటన్స్ ఆఫ్ డే' లను పలికారు.


చివరిగా వచ్చింది త్రివిక్రం, విజయ్, ఆ తరువాత వివేకానంద. అందరికి వివేకానందను పరిచయం చేసింది అమృత.


అమృత నిర్ణయాన్ని రాజేశ్వరి తనతో చెప్పినా ఆమె అంటే ఎంతో అభిమానం, గౌరవం వున్న త్రివిక్రం, ఆ పార్టీకి వచ్చాడు. అమృతకు విషెస్ చెప్పాడు. అమృతకు కృష్ణపరమాత్మ అంటే ఎంతో భక్తి. ఆ విషయం తెలిసిన త్రివిక్రం వెండి విగ్రహాన్ని బహూకరించాడు.


విజయ్ తనకు నచ్చిన రవివర్మ, మీరా చిత్రపటాన్ని, గోల్డు స్టాఫ్ వాచ్ ని వివేకానంద అమృతకు కానుకగా ఇచ్చారు. అన్నదమ్ముల ఇరువురి మధ్యన కళ్ళతో పలకరింపులు జరిపారు. బఫే డిన్నర్ ముగిసింది. అందరూ వెళ్లిపోయారు.


వివేకానంద వెంకటేశ్వర్లుగారిని సమీపించి.. .

“సార్.. .. మీతో నేను ఒక విషయాన్ని గురించి మాట్లాడాలి!.." మెల్లగా చెప్పాడు.


"అలాగే సార్.. .. ” ప్రక్కనే వున్న అమృత ముఖంలోకి చూచాడు. విషయం అర్ధమైన అమృత, వివేక్ వైపు చూస్తూ.. . "ఎంతో బిజీగా వుండే మీరు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నా ధన్యవాదాలు. " చేతులు జోడించి నవ్వుతూ చెప్పింది.


ఇట్స్ గ్రేట్ ప్లజర్. థ్యాంక్యూ.. అమృత. " చిరునవ్వుతో చెప్పాడు.


అమృత ఇంట్లోకి వెళ్లిపోయింది.

“కూర్చోండి సార్. ” చెప్పాడు వెంకటేశ్వర్లు.


“సార్ నాదో చిన్న మనవి. ”


“చెప్పండి సార్.. .. ”


“సార్.. . నేను మీకంటే చాలా చిన్నవాన్ని. మీరు నా తండ్రిలాంటివారు. నన్ను మీరు సార్ అని సంబోధించక వివేక్ అంటే నాకు చాలా సంతోషం సార్..” దరహాసవదనంతో మెల్లగా చెప్పాడు వివేక.


వెంకటేశ్వర్లుగారు నవ్వారు. “అలాగే, వివేకానంద. మీరు నన్ను అడగదలచిన విషయాన్ని అడగండి. నాకు తెలిసిన యధార్ధాన్ని తెలియజేస్తాను. ”


“ఆరు సంవత్సరాల క్రిందట మీ కాలేజ్ లో బి. ఏ ఫైనల్ యర్ లో బాలసుబ్రమణ్యం అనే స్టూడెంట్ వుండేవాడు కదా సార్. ” అడిగాడు వివేకానంద.


వెంకటేశ్వర్లు కొన్నిక్షణాలు ఆలోచించి.. .

“వుండేవాడు. ర్యాంక్ స్టూడెంట్. ఉత్తమ ఆశయాలు వుండిన యువకుడు. హి యీజ్ నో మోర్. ” విచారంగా చెప్పాడు వెంకటేశ్వర్లు.


“అతను ఎలా చనిపోయాడు సార్.. !”


రాజకీయ చదరంగంలో చిక్కుకొని హత్య చేయబడ్డాడు. అవునూ, అది ముగిసిపోయిన కథ. దాన్ని గురించి ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు.. ?"


"సార్.. ! మొన్న మా స్టేషన్ ముందుకు ఒక వ్యక్తి వచ్చాడు. ఇంతకు ముందు ఆరేళ్ళ క్రిందట ఉన్న యస్. ఐ పేరును చెప్పి.. 'రేయ్ నీవల్ల నా కొడుకు చచ్చిపోయాడు. నీచుడా.. నీవు నా కంట పడితే చంపి తీరుతాను. చంపి తీరుతాను.. ' బోరున ఏడ్చాడు. 'ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్, నిన్ను నేను పట్టుకుపోతాన్' వికటంగా నవ్వుతూ స్టేషన్ ముందు ఎగిరాడు, ఏడ్చాడు. అతను పిచ్చివాడని మా స్టేషన్ లోని వారు చెప్పారు. కొంతసేపు ఉండి ఏదేదో అరుస్తూ వెళ్ళిపోయాడు. విచారించగా.. మావాళ్ళు, చనిపోయిన ఆ యువకుడి పేరు బాలసుబ్రమణ్యం అని, ఆ వ్యక్తి అతని తండ్రిగారని చెప్పారు. ఆ కారణంగా మిమ్మల్ని వివరాలు అడిగాను. ”


“నాకు తెలిసిన వివరాలు నేను మీకు చెప్పాను. ”


“చివరి ప్రశ్న సార్.. !”


“అడగండి. ”


"మీ దృష్టిలో అతని మరణానికి కారకులు ఎవరు.. ?”


వెంకటేశ్వర్లు వివేకానంద ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. తర్వాత.. .

“ఇప్పుడు మీరు ఈ విషయాలను సేకరించి ఏంచేయగలరు?” మెల్లగా అడిగాడు వెంకటేశ్వర్లు.


“సార్.. ! మీకు తెలియంది అంటూ ఏమీలేదు. నా వుద్దేశ్యంలో నిరపరాధులు శిక్షను అనుభవించకూడదు. అసలైన నేరస్థులు శిక్షను అనుభవించి తీరాలి. ” ఎంతో సౌమ్యంగా చెప్పాడు వివేకానంద.


“అంటే మీరు యీ కేసును.. . ” వెంకటేశ్వర్లు పూర్తి చేయక మునుపే.. .


"పునః పరిశీలన చేయబోతున్నాను. మరి నా ప్రశ్నకు మీ సమాధానం సార్.. ? అడిగాడు వివేకానంద.


"మీరు సమర్ధులు మీ పరిశీలనలో నిజానిజాలు మీకు తప్పక తెలుస్తాయి. ఊహాగానంతో నేను ఏదీ ఇంతవరకూ చెప్పలేదు. ” నవ్వాడు వెంకటేశ్వర్లు.


'వీరి వయస్సుకు, అనుభవానికి, వృత్తిధర్మానికి శిలాక్షరాల్లాంటి యధార్ధాలను పలకడం అలవాటు. ఇకపై ప్రశ్నించి, వీరిని విసిగించడం తనకు ధర్మం కాదని' నిర్నయించుకొన్నాడు వివేకానంద.


"మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు నా ధన్యవాదాలు. మీకు శ్రమ కలిగించాను. సారీ సార్.. !"


"లేదు వివేకానంద. తెలిసిన నిజాన్ని తెలియజేయడం నా ధర్మం. అదే నేను చేశాను. ”


"థాంక్యూ సార్.. . ఇక నే వెళ్ళొస్తాను. " చేతులు జోడించాడు వివేకానంద.


“మంచిది. ” చెప్పి, వెంకటేశ్వర్లు ఇంటి ద్వారం వైపుకు, వివేక్ తన జీప్ వైపుకు నడిచారు.


వివేకానంద జీప్ ను నడుపుతున్నాడు. హెడ్ కానిస్టేబుల్ కోటయ్య ఎదురయ్యాడు. వివేకా జీప్ ఆపాడు. "విషయం ఏమిటి కోటయ్యగారూ.. !”


“సార్ ఆ సారాయి సాంబయ్య వుండే చోటు వివరాలు తెలిసాయి సార్. ఈ విషయం మీకు చెప్పాలని వస్తున్నాను. ”


"కోటయ్యగారు.. బండ్లో కూర్చోండి. ”


కోటయ్య జీప్ లో కూర్చున్నారు. ఆయన చెప్పిన మార్గాన వివేకానంద జీపు నడిపాడు. జీప్ బిచ్చగాళ్ళు వెంకటేసు, కోటిగాడు ఉండే వేపచెట్టు దగ్గర జీప్ ఆగింది.


రాత్రి భోజనం ముగించి మిగిలిన దాన్ని రెండు కుక్కలకు పెడుతున్నారు వారు. కుక్కలు జీపు చూచి అరిచాయి. కోటయ్య జీప్ దిగి “రేయ్.. ! ఆ కుక్కల్ని పట్టుకోండి. పెద్దయ్యగారు వచ్చాడు" అన్నాడు. వారు ఆ కుక్కలను పట్టుకొన్నారు. అరవవద్దని వాటికి చెప్పారు. కోటయ్య వారితో మాట్లాడి ఇద్దరినీ జీప్ ఎక్కించాడు. వివేక్ జీప్ ను స్టార్టు చేశాడు.


ఇరవై నిముషాల తర్వాత.. "కోటయ్యగారూ.. ! మనం ఆ ఇంటికి దూరంగా జీప్ ను ఆపాల్సి వుంటుంది” బండి నడుపుతూనే చెప్పాడు వివేకానంద.


వారిరువురినీ అడిగి తెలుసుకొని, ఆ ఇంటికి కాలు కిలోమీటర్ దూరంలో జీప్ ను ఆపి, ఆ ఇరువురూ నడిచి ఆ ఇంటిని సమీపించారు. బిచ్చగాళ్ళు ఇరువురూ వెనక్కు వెళ్ళిపోయారు.


"సార్.. ! అదే ఇల్లు. ” చూపించాడు కోటయ్య.


"సారాయి సాంబయ్యకి ఇద్దరు అతివలు, ఈ ఇల్లు రెండవ అమ్మది. లోన సాంబయ్య మందు కొడుతూ ప్రక్కన కూర్చొని ఉన్న చిన్నమ్మతో మంతనాలు ఆడుతూ పరమానందంగా వున్నాడు.

కోటయ్య మెల్లగా వెళ్ళి కిటికీ గుండాలోన జరుగుతున్న ఈ రాచక్రీడను దర్శించి వివేకను సమీపించి చెప్పాడు.


ఇరువురూ ద్వారాన్ని సమీపించారు. కొద్ది నిముషాలు ఆగి.. . మెల్లగా తలుపును నెట్టి చూచారు. గడియ బిగించి లేదు. వేగంగా వెళ్ళి మరోసారి కోటయ్య కిటికీ గుండా చూచాడు. సాంబయ్యకు నిషా పూర్తిగా ఎక్కింది.


మాటలు తడబడుతున్నాయి. వెళ్ళి విషయాన్ని వివేకానందకు చెప్పాడు. మెల్లగా తలుపు తెరిచి

ఇరువురూ లోన ప్రవేశించారు. వారిని చూచి ఆ చిత్రాంగి “అయ్యా.. ! పోలీసులు” అని అరిచింది.


కోటయ్య సాంబయ్యను పట్టుకొన్నాడు. దండెం పైనున్న తాడుతో వివేక్ అతని చేతులను వెనక్కు త్రిప్పి గట్టిగా కట్టేశాడు. సుందరాంగి అడ్డం వచ్చింది. ఆమెను ప్రక్కకు తోశాడు కోటయ్య. సాంబయ్యతో ఇరువురూ ఇంటి బయటికి వచ్చారు. వివేకానంద సాంబయ్యను గట్టిగా పట్టుకొన్నాడు. కోటయ్య పరుగెత్తి పదినిముషాల్లో జీప్ప్ లో తిరిగి వచ్చాడు.


తప్ప త్రాగి తూలుతున్న సాంబయ్యను జీప్ ఎక్కించారు. వివేక్ బండిని త్రిప్పి స్టేషన్ వైపుకు నడిపాడు. ఆ వయ్యారి భామ బోరున ఏడుస్తూ నేలకు ఒరిగింది.

***

కలవరమైన మనస్సుతో కొడుకు త్రివిక్రంతో మాట్లాడితే, మనస్సుకు శాంతి కలుగుతుందని రాజేశ్వరమ్మ భోజనానంతరం త్రివిక్రం గదిలోనికి వచ్చింది.


తల్లిని చూచిన త్రివిక్రం.. .

"ఏమ్మా.. !పడుకోలేదా.. !" అని అడిగాడు. టీవిని చూస్తున్న త్రివిక్రం దాన్ని ఆపేశాడు.


సోఫాలో అతని ప్రక్కన కూర్చుంది రాజేశ్వరి.

“నాయనా.. ! త్రివీ.. ! తమ్ముడికోసం నీవు ఏమీ చేయలేవా.. !” దీనంగా అడిగింది.


"నాన్నగారి మాటలను విని వాడు తప్పులు చేస్తున్నాడమ్మా.. ! అహంకారం మనిషిని అధోగతి పాలు చేస్తుందమ్మా.. ! వాడు ఏనాడైన నీ మాట నా మాటా విన్నాడ.. ? ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు వాడి విషయంలో అదే జరిగింది. " విచారంగా చెప్పాడు త్రివిక్రం.


“వాడు నిజంగా నేరస్థుడని నీవంటావా.. ?”


మౌనంగా ఉండిపోయాడు త్రివిక్రం. కొడుకు తత్వాన్ని ఎరిగిన రాజేశ్వరి అతని ముఖంలోకి చూస్తూ.. .

“నీవు ఒకసారి ఆ యస్. ఐ గారిని కలిసి మాట్లాడి చూస్తావా.. !” దీనంగా అడిగింది రాజేశ్వరి.


ఆమె హృదయ ఆవేదన, బాధ, త్రివిక్రంకు ఆమె కళ్ళల్లో గోచరించింది. తల్లికి ఊరట కలిగించడం తన ధర్మం. యస్. ఐ గారితో మాట్లాడాలని నిర్ణయించుకొన్నాడు. తల్లి కన్నీళ్ళను తన చేతితో తుడుస్తూ.. .

“అమ్మా.. ! నేను ఇప్పుడే వెళ్ళి వారితో మాట్లాడి వస్తాను. నీవు వెళ్ళి పడుకో. నా ప్రయత్నం నేను చేస్తాను. ” సోఫానుండి లేచాడు.


రాజేశ్వరి సోఫానుంచి లేచింది. ఇరువురూ గదినుంచి బయటికి వచ్చారు. “అమ్మా.. ! నేను వెళ్ళి వస్తాను. ”


“మంచి వార్తతో తిరిగిరా నాన్నా.. !"


తల పంకించి త్రివిక్రం ఇంట్లో నుంచి బయటికి నడిచాడు. రాజేశ్వరి తన గదికి వెళ్ళిపోయింది.


త్రివిక్రం కారు ఇరవై నిముషాల్లో వివేకానంద క్వార్టర్ ముందు ఆగింది. వరండాలో ప్రవేశించి కాలింగ్ బెల్ నొక్కాడు త్రివిక్రం. తలుపు తెరవబడింది. వివేకానంద త్రివిక్రంను చూచాడు. చేతి వాచీని చూచాడు సమయం పదకొండున్నర.


“ప్లీజ్ కమ్.. !"


త్రివిక్రం లోన ప్రవేశించాడు.

“కూర్చోండి. " చెప్పాడు వివేకానంద.


త్రివిక్రం ఎదుటి సోఫాలో కూర్చున్నాడు.

" ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు. కారణం.. ?” నిశితంగా త్రివిక్రం ముఖంలోకి చూస్తూ అడిగాడు వివేకానంద.


“సార్.. సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్. ”


“వచ్చేశారుగా లోనికి. విషయం ఏమిటో చెప్పండి.. ?”


“మా తమ్ముడు ఉపేంద్ర.. . ” త్రివిక్రం ముగించక ముందే వివేకానంద.. “ఈ కేసులో ఎనిమిది మంది ఇన్వాల్వుమెంటు ఉంది. ఆ ఎనిమిది మందినీ పట్టుకొన్నాము. అందులో మీ తమ్ముడుగారు ఒకరు. మిగతా ఏడుగురూ వారు చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. వారు ఆ నేరాన్ని మీ తమ్ముడుగారు చెప్పగా చేశామని వ్రాసి ఇచ్చారు. కాబట్టి మీ సోదరుడు శిక్షను అనుభవించవలసి వుంటుంది.

సార్.. ! తను బై ఎలక్షన్లో ఓడిపోయానని, దానికి ఆ చనిపోయిన నలుగురూ ముఖ్యకారకులని భావించి, వారిని మీ తమ్ముడు ఎండ్రిన్ కలిపిన సారాయిని బలవంతంగా త్రాగించి చంపించాడు. అతను నమ్మినవారు, మేము చెప్పిన మాటలకు భయపడి శిక్ష తగ్గేలా నిజాన్ని అంగీకరించారు. మీ తమ్ముడు కూడా నిజాన్ని ఒప్పుకుంటే శిక్షలో మార్పు వుండవచ్చు. పాపం.. మీ తల్లిగారు.. ! ఒక తల్లి తన బిడ్డ ఈ రీతిగా తయారైనందుకు ఎంతగా బాధపడుతుందో నాకు

తెలుసు. ఆమెకు నచ్చచెప్పి ఓదార్చటం మీ కర్తవ్యం.


మీరన్నా మీ తల్లిగారిని జాగ్రత్తగా చూచుకోండి. నేను మీరు చాలా గొప్ప వ్యక్తిత్వం గలవారని, తండ్రి సోదరుల

తత్వాలు గిట్టకనే స్టేట్స్ వెళ్ళి యం. యస్. చేసి తిరిగి వచ్చారని, మీ గురించి విన్నాను. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, గౌరవించి పాటించడం మనలాంటి వారి కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. మీరు నాతో ఏకీభవిస్తారని నా భావన. ఇక మీరు వెళ్ళవచ్చు. ప్లీజ్.. .. ” చేతిని ద్వారంవైపు చూపాడు. మంత్ర ముగ్ధుడిలా బయటికి నడిచాడు త్రివిక్రం. వివేక తలుపు బిగించి పడకపై వాలిపోయాడు.

=================================================================================

ఇంకా ఉంది..

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


31 views0 comments

Comments


bottom of page