top of page
Original.png

సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 1

తెలుగు సామాజిక కథ, సుధావిశ్వం కథలు, భావోద్వేగ తెలుగు కథ

పార్క్ బెంచిపై ఒంటరిగా కూర్చున్న వృద్ధుడిని ఇంటర్వ్యూ చేస్తున్న ఇద్దరు యువకులతో కూడిన “సెన్సేషనల్ న్యూస్ – కథ 1/3” తెలుగు సామాజిక కథ పోస్టర్
పార్క్ బెంచిపై ఒంటరిగా కూర్చున్న వృద్ధుడిని ఇంటర్వ్యూ చేస్తున్న ఇద్దరు యువకులతో కూడిన “సెన్సేషనల్ న్యూస్ – కథ 1/3” తెలుగు సామాజిక కథ పోస్టర్

Sensational News- Part 1/3 - Telugu Emotional Story | Sudhavishwam Akondi

సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 1/3 - తెలుగు భావోద్వేగ కథ | సుధావిశ్వం ఆకొండి

Published In manatelugukathalu.com On 24/05/2026


"ఇప్పుడు చెప్పు! ఏంట్రా అర్జెంట్‌గా రమ్మని పిలిచావు! సాయంత్రం ఎలాగో కలుస్తాం కదా!" అని అడిగాడు ధర్మవీర్, కాల్ చేసి అర్జెంట్‌గా రమ్మని పిలిచిన తన ప్రాణ స్నేహితుడు రఘువీర్‌ను.


"నీకు ఇష్టమైన హీరో సినిమాకి వెళదామని మొన్న అడిగావు కదా! ఈరోజు వెళదాం!" అని చెప్పాడు రఘువీర్.


"అప్పుడు అన్నిసార్లు అడిగినా కూడా ససేమిరా అన్నావు. ఇప్పుడు ఇలా నేను అడక్కుండానే పోదామంటున్నావు. ఏంటి సంగతి? అయినా ఈ విషయం చెప్పడానికి ఎందుకురా అర్జెంట్‌గా రమ్మన్నావు? ఫోన్లో చెబితే రెడీ అయి వచ్చేవాడిని. ఫస్ట్ షోకి వెళ్లేవాళ్ళం కదా!" అన్నాడు విసుగ్గా.


రఘువీర్, ధర్మవీర్ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే పుట్టినప్పటినుండీ ఫ్రెండ్స్. వీళ్లిద్దరి తండ్రులు ఒకేసారి ఊరినుంచి సిటీకి వచ్చి, వ్యాపారం మొదలుపెట్టారు. వాళ్ల కృషికి తగినట్లుగా బాగానే సంపాదించారు. పక్కపక్కనే ఇళ్లు కట్టుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇద్దరికీ ఒకేసారి ఒక నెల తేడాతో పిల్లలు పుట్టారు. అప్పటినుంచి పిల్లల మధ్య కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. వాళ్లు పెరిగేకొద్దీ వారి మధ్య స్నేహం కూడా పెరిగింది. ఇద్దరూ కలిసే సినిమాలకు కూడా వెళతారు. ధర్మవీర్‌కు కాస్త దూకుడు ఎక్కువ. అతన్ని రఘువీర్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. రఘువీర్ ఆలోచనాపరుడు. బాగా ఆలోచించి, ప్లాన్ చేస్తాడు ఏదైనా.


ఇద్దరూ ఈమధ్యే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు. ప్రొఫెషనల్ చదువులు ఇంట్రెస్ట్ లేదంటే వ్యాపారం చూసుకోమని పేరెంట్స్ చెబుతున్నా, ఆ మాటలు వినకుండా మాకు నచ్చింది చేస్తామని తిరుగుతున్నారు.


ఓసారి ఫ్రెండ్స్ ఇద్దరూ బజ్జీలు తింటూ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటూ ఉంటే, సామాజిక అంశాలు ప్రజల దృష్టికి తెచ్చేలా, ఒక మంచి యూట్యూబ్ ఛానెల్ తామే పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నారు. ఆ ఆలోచన ఇద్దరికీ నచ్చింది. వెంటనే అందుకు కావలసిన పనులు కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు.


ధర్మవీర్‌కు సినిమాలు చూడడం అంటే ఇష్టం. కానీ రఘువీర్ రానంటే రమ్మని బ్రతిమాలుకుని తీసుకుని వెళ్తాడు కానీ తను ఒక్కడూ వెళ్లడు. రఘువీర్‌కు ఇష్టమే కానీ ఆరోగ్యకరమైన సెలెక్టివ్ సినిమాలు చూడడానికే ఇష్టపడతాడు.


"మన ఛానెల్ రెడీ! ఇక మంచి అంశంతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడమే తరువాయి. అందుకే రమ్మని అన్నాను" అన్నాడు రఘువీర్.


"వావ్! అయితే ఒక హీరో ఇంటర్వ్యూతో మొదలెడదామా?"


"నో! సామాజిక అంశాలు అనుకున్నాం కాబట్టి అటువంటి న్యూస్ కోసం ట్రై చేద్దాం! సాయంత్రం కదా సినిమా. ఇప్పుడు అలా తిరిగొద్దాం!" అని తల్లికి చెప్పేసి ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై బయలుదేరాడు.


"మొన్న పార్కుల్లో అనాథలు అనే పేపర్ కటింగ్ చూశాం కదా! అటు పోదామా? అలాంటివారు కనిపిస్తే వారి స్టోరీ వేద్దాం! చాలామందికి ఈ న్యూస్ చేరితే, ప్రభుత్వం దృష్టికి వెళుతుంది. వాళ్ల కోసం ఏదైనా సాయం లభిస్తుంది. ఏమంటావ్?" అన్నాడు ధర్మవీర్.


"బాగుందిరా నీ ఐడియా!" అని తమకు దగ్గర్లో ఉన్న ఒక పెద్ద పార్కుకు బైక్ పోనిచ్చాడు రఘువీర్.


***

ఒక బెంచీపైన అరవై ఏళ్ల వృద్ధుడు పడుకుని ఉన్నాడు. మట్టికొట్టుకుపోయి మాసిన ప్యాంటు, షర్టుతో, గడ్డం పెరిగిపోయి దీనంగా ఉన్న అతని వద్దకు మిత్రులు ఇద్దరూ వెళ్లారు.


వీళ్లను చూసిన అతను దిగ్గున లేచి కూర్చున్నాడు.

"మీరు టీవీ వాళ్ళా? ఛానెల్ వాళ్ళా?" అని అడిగాడు వీళ్లను.


"యూట్యూబ్ ఛానెల్ నుంచి వచ్చాం! సాయంత్రం అయి ఉంటే వాకింగ్‌కి వచ్చి ఉంటారని అనుకోవచ్చు! కానీ ఇంత మధ్యాహ్నం టైంలో ఇలా ఇక్కడ ఒంటరిగా బెంచీపై పడుకున్నారేంటి? ఇంట్లో ఎవరూ లేరా?" అని అడిగాడు రఘువీర్.


"ముసలివాళ్లు అయ్యాక ఎవరు పట్టించుకుంటారు బాబూ? ఇలా ఎక్కడో ఒకచోట, తినీ తినక చావుకోసం ఎదురుచూస్తూ జీవితం వెళ్లదీయాల్సిందే!" అని అంటూ కళ్లలోని నీళ్లను తుడుచుకున్నాడు తన మెడలో ఉన్న టవల్‌తో.


 అతని మాటలు వింటే చాలా బాధ కలిగింది మిత్రులు ఇద్దరికీ.

"మీ భార్యాపిల్లలు ఎక్కడుంటారు?" అని ఆయన గురించి వివరాలు చెప్పమని అడిగారు.


ఆయన చెప్పడం మొదలుపెట్టాడు.


================================================================

ఇంకా వుంది..

సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 2/3 త్వరలో

================================================================

సుధావిశ్వం ఆకొండి  గారి కొన్ని ఇతర రచనలు:


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page