top of page
Original.png

తీరం చేరిన అల

14 hours ago
11 min read

తండ్రి రమేష్‌తో తిరిగి కలిసిన కుమారుడు కౌశిక్, పక్కన మానవత్వంతో వారిని కలిపిన బసవ

Teeram Cherina Ala - Telugu Emotional Family Story | Malla Karunya Kumar

తీరం చేరిన అల - తెలుగు కుటుంబ భావోద్వేగ కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 17/11/2026


తండ్రి–కొడుకు మధ్య పెరిగిన అపార్థాలు, ఆస్తి కోసం దెబ్బతిన్న కుటుంబ బంధాలు, క్షమించలేని బాధల మధ్య మానవత్వం చూపించిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రేమ, క్షమ, కుటుంబ విలువల ప్రాధాన్యతను గుర్తుచేసే హృదయస్పర్శి కథ “తీరం చేరిన అల”.


అఘమేఘాలపై రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు బసవ. ఆయాసంతో కాస్త నిలబడి, దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ టికెట్ కౌంటర్ వైపుకు సాగబోయాడు.


తాను ఎక్కాల్సిన రైలు ఒక గంటన్నర ఆలస్యంగా వస్తుందని అప్పుడే ప్రకటించిన అనౌన్స్‌మెంట్ ద్వారా తెలిసింది. 


ఒక నిట్టూర్పు తీసి, టికెట్ తీసుకొని, రెండవ నెంబర్ ప్లాట్‌ఫాం పైకి చేరుకొని అక్కడ ఉన్న సిమెంట్ బల్లపై కూర్చున్నాడు. ఇంతలో తన ఫోన్ మ్రోగడం మొదలైంది. 


తీసి చూసే సరికి తన కూతురు శర్వాణి నుండి కాల్ వస్తోంది. కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. "నాన్నా! వస్తున్నారు కదా? ఎగ్జామ్ ఫీజ్ కట్టడానికి రేపే చివరి డేట్. 


హాస్టల్ ఫీజ్ కట్టనిదే ఎగ్జామ్ ఫీజ్ కట్టనివ్వరు. నా ఫ్రెండ్స్ అందరూ కట్టేశారు" ఆందోళనతో పలికింది శర్వాణి. "కంగారు పడకు తల్లీ! నేను వస్తున్నాను కదా" అని భరోసాగా మాట్లాడి, ఫోన్ పెట్టేశాడు.


'శర్వాణికి నచ్చజెప్పాను కానీ, అనుకున్న సొమ్ముకి ఇంకా నలభై వేలు తక్కువగా ఉన్నాయి. 


అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? ఆ క్రాంతి ఈరోజు డబ్బులు సర్దుతానని చెప్పి చేతులెత్తేశాడు. 


బావమరిదని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఎక్కువ మొత్తంలో చేతిలో పెట్టాను. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. 


సొంతవాడని ఏమీ అనలేని పరిస్థితి' అని చింతిస్తూ ఉన్నాడు. ఏదో అలికిడి అవ్వడంతో అప్రయత్నంగా తన చూపు పక్కకి తిరిగింది. 


కొంత దూరంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పరిశీలనగా చూడటం మొదలు పెట్టాడు బసవ. మాసిన బట్టలు, చిందరవందరగా ఉన్న జుట్టు, నీరసంగా మారిన ముఖం. 


ఇతని నిజ రూపం ఇది కాదనిపిస్తోంది. ఇతను ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు. 


ఒక్కసారిగా ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా అనిపించి మళ్ళీ ఆ యువకుడి వైపు చూశాడు. కొంత సమయం తర్వాత గాబరా పడుతూ తన మొబైల్ తీసి ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసి చూశాడు. 


తప్పిపోయాడని గ్రూపులో పెట్టిన యువకుడి ఫోటో చూశాడు. తన ఎదురుగా ఉన్న యువకుడు, ఫోటోలో ఉన్న యువకుడు ఒకడే అని నిర్ధారణకు వచ్చి, 'ఇతను కౌశిక్ కదా! ఇతని తండ్రి నాకు ఒకప్పుడు స్నేహితుడు. 


అతనికి ఉన్న అహంకార ధోరణి, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడే అలవాటు కారణంగా మా ఇద్దరి మధ్యన గొడవలు వచ్చి దూరంగా ఉన్నాను. 


కానీ ఇప్పుడు పాత గొడవలు పట్టించుకునే సమయం కాదనిపిస్తోంది. ఒకవేళ సమాచారం ఇస్తే, ఇక్కడకు రమేష్ వచ్చేసరికి కౌశిక్ ఇక్కడ నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది' అని తనలో అనుకుంటూ, కొంత సమయం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి, 'నేను వెళ్తున్న గమ్యానికి ఒక గంట జోడిస్తే రమేష్ ఉన్న స్థలానికి చేరుకోవచ్చు. 


ఎలాగైనా కౌశిక్‌ను వాళ్ల ఇంటికి చేర్చాలి' అని తనలో అనుకుంటూ మెల్లగా కౌశిక్ దగ్గరకు చేరుకున్నాడు బసవ. బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నాడు కౌశిక్.


"ఏ బాబూ! ఎవరు నువ్వు? వెళ్తున్న ప్రతీ ఒక్కరి వైపు పిచ్చి చూపులు చూస్తున్నావు?" ఏమీ తెలియనట్టు అడిగాడు.


సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు కౌశిక్.


"ఆగు! అడుగుతుంటే వెళ్ళిపోతున్నావు ఏమిటి? నిన్ను చూస్తుంటే అనుమానం కలుగుతోంది" అని బసవ మరో మాట మాట్లాడుతున్నంత లోపే, "సర్, నాకు ఆకలిగా ఉంది. ఎవరిని అడగాలో తెలియడం లేదు. 


అందుకే అలా చూస్తున్నాను!" భయంతోనే నీరసంగా బదులిచ్చాడు కౌశిక్. మౌనంగా ఉండిపోయాడు బసవ. కొంత సమయం తర్వాత, "సరే అయితే నాతో పాటు రా" అని అంటూ స్టేషన్ బయటకు తీసుకువచ్చి టిఫిన్ ఇప్పించాడు. 


ఆకలి మీద ఉన్న కౌశిక్ ఆవురావురుమంటూ తిన్నాడు. తినడం పూర్తి అయిన తర్వాత, "చాలా థాంక్స్ సర్!" అని అక్కడ నుండి వెళ్లబోయాడు.


"ఆగు! నీ పరిస్థితి ఇలా మారడానికి కారణం ఏమిటి?" అడిగాడు బసవ. సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు.


"చూడు బాబూ! ఈ ప్రపంచమేమిటో నీకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. నువ్వు ఎవరో చెప్పు, నీ సమస్య ఏమిటో చెప్పు! నేను చేయగలిగిన సహాయం చేస్తాను" అని భరోసాగా అన్నాడు బసవ. మౌనమే సమాధానంగా నిలబడి ఉన్నాడు కౌశిక్.


ఇక లాభం లేదనుకొని నిజం మాట్లాడడానికి సిద్ధమయ్యి, "నువ్వు ఎవరో నాకు తెలుసు! మీ నాన్న రమేష్ నాకు స్నేహితుడు. 


నువ్వు తప్పిపోయావని ఇప్పటికే మీ నాన్న ప్రకటన ఇచ్చాడు. నా నుండి తప్పించుకున్నా వేరే ఎవరికైనా నువ్వు దొరికే అవకాశం ఉంది" అని అన్నాడు బసవ.


బసవ మాటలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కౌశిక్. "నిజంగా మా నాన్న నా గురించి ఇంతలా తపన పడుతున్నారా?" పొడిబారిన గొంతుతో అడిగాడు.


"అవును! కావాలంటే మీ నాన్న గ్రూప్‌లో పెట్టిన ఈ వాయిస్ మెసేజ్ విను" అని ఆడియో వినిపించాడు.


తండ్రి మాటలు విని కొంత సమయం అచేతనంగా ఉండిపోయాడు. కొంత సమయానికి తేరుకొని, "నాకు నమ్మకం కలగడం లేదు. 


ఎప్పుడూ అరిచి, నన్ను తిట్టే నాన్నకి ఇంత ప్రేమ ఉందా? లేదు... లేదు... నేను ఇంటికి వెళ్ళకూడదు. వెళితే నాన్న మళ్ళీ తిడతాడు, కొడతాడు, ఏమైనా చేస్తాడు. 


పైగా నేను మా నాన్నని గాయపరిచాను" తడబడుతూ చెప్పాడు. ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు బసవ. 


"ఏమిటి, మీ నాన్నను గాయపరిచావా?" అడిగాడు. తడబడుతూ, "కావాలని కాదు, తాగిన మత్తులో అలా జరిగిపోయింది. తర్వాతే నేను ఇంటి నుండి రావడం జరిగింది" చెప్పాడు కౌశిక్.


'ఇంత చిన్న వయస్సులో తాగుడు అలవాటా?' కాసేపు ఆలోచనలో పడి, 'ఈ అబ్బాయిని ఇలా వదిలి వేయకూడదు. ఇతన్ని ఇంటికి చేర్చాలి' అని తనలో అనుకొని, "కౌశిక్! జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడం మంచిది. 


పదా మీ ఇంటికి వెళ్దాం" అని అన్నాడు బసవ. ఇంతలో బసవ ఫోన్ మ్రోగింది. శర్వాణి నుండి కాల్ వస్తోంది. 


లిఫ్ట్ చేశాడు బసవ. "తల్లీ! నేను సమయానికి వచ్చి ఫీజు కడతాను. నువ్వేమీ కంగారు పడకు" అని సర్దిచెప్పి కాల్ కట్ చేశాడు. 


తర్వాత చూసే సరికి తన పక్కన ఉండాల్సిన కౌశిక్ కనిపించడం లేదు. కంగారు పడుతూ, "ఏమైపోయాడు?" అని వెతకడం ప్రారంభించాడు. 


నాలుగు అడుగుల దూరంలో ముందుకు వెళ్తూ కనిపించాడు కౌశిక్. పరుగులాంటి నడకతో కౌశిక్ దగ్గరకు చేరుకున్నాడు బసవ. 


"కౌశిక్! నా మాట విను... నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం" అని అన్నాడు బసవ.


బసవ మాటలకు ఆగుతూ బసవ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కౌశిక్. పక్కనే ఉన్న బస్టాండ్ లోపలికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఇనుప బల్లపై కూర్చొని, కౌశిక్‌ను పక్కనే కూర్చోబెట్టి, "నేను ఇప్పటికీ నా మనస్సులో అనుభవిస్తున్న బాధ నీతో పంచుకుంటాను. 


అది నీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను" అని కౌశిక్‌తో తన గతం చెప్పడం ప్రారంభించాడు.


'ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వ్యక్తి కళ్ళలో ఈ కంగారు ఏమిటి? ఏం జరిగి ఉంటుంది?' అని కంగారు పడుతూ, "ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు ఈశ్వరయ్య?" అని అడిగాను.


"మీ అన్నయ్య... అమ్మోరు గుడి దగ్గర పడివున్నాడు బాబూ."


ఒక్కసారిగా విద్యుత్ ఘాతం తగిలినట్లుగా ఈ లోకం మరిచిపోయాను. అన్నయ్య ఎలా ఉన్నాడన్న ఆలోచన తప్పించి నాకు ఏదీ గుర్తుకు రావడం లేదు. 


కంగారులో వేగంగా అన్నయ్య పడి ఉన్న చోటుకి చేరుకున్నాను. అమ్మవారి దేవాలయానికి పది అడుగుల దూరంలో రక్తపు మడుగులో పడివున్నాడు అన్నయ్య వామనరావు. 


అప్పటికే చుట్టూ జనాలు గుమిగూడి, సపర్యలు చేస్తూ ఉన్నారు. పదునైన కత్తి గాట్లకి తట్టుకోలేక ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు. 


రక్తపు మడుగులో అన్నని చూసి నా హృదయం తల్లడిల్లిపోయింది. “అన్నయ్యా... నీకు ఈ గతి కలిగించింది ఎవరు? చెప్పు అన్నయ్యా!" సమాధానంగా కళ్ళలో కన్నీటి తడి తప్పించి సమాధానం లేదు.


"ప్రేగు బంధమే నరాలు తెగ నరికితే, ఆ బాధ ఎలా బయట పెట్టగలడు బాబూ!" గద్గద స్వరంతో అన్నాడు పక్కనే ఉన్న శంకరయ్య.


శంకరయ్య వైపు చూస్తూ, "శంకరన్నా! నువ్వు చెప్తున్నది...?" నా మాట పెగలడం లేదు. "వాడి పేరు ఎత్తాలంటే అసహ్యంగా ఉంది బాబూ. 


ఈ మహానుభావుడి కడుపున పుట్టిన ఆ నరాంతకుడు జితేంద్ర ఇలా చేశాడు బాబూ" ఎట్టకేలకు చెప్పాడు శంకరయ్య.


"నా అన్నకి ఈ గతి పట్టిస్తాడా? ఈరోజు వాడిని వదిలేది లేదు. ఎక్కడున్నాడు వాడు?" కట్టలు తెంచుకున్న ఆవేశంతో పిడికిలి బిగించాను.


నా భుజాన చేయి వేసి, "బాబూ! ఆలస్యం చేస్తే ప్రాణానికి ప్రమాదంలా ఉంది. ఇప్పటికే చాలా రక్తం పోయింది, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి బాబూ" చెప్పాడు ఈశ్వరయ్య.


ఈశ్వరయ్య మాటలకు నా ఆవేశాన్ని అదుపు చేసుకొని, "ఈశ్వరయ్యా! సూరికి కబురు పెట్టు. 


వెంటనే ట్రాక్టర్ సిద్ధం చేయమని చెప్పు" చెప్పాను. "సూరి మూడు రోజుల నుండి ఊళ్ళో లేడు బాబూ. దుక్కి పనులు ఉండడంతో వేరే ఊరు వెళ్ళాడు."


"అయ్యో! ఇప్పుడు ఎలా?" అని కంగారు పడుతూ, "వేగంగా మన ఎడ్ల బండి సిద్ధం చేయండి, త్వరగా" ఈశ్వరయ్యతో చెప్పాను.


ఉన్న చోటు నుండి శరవేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి, ఎడ్ల బండిని సిద్ధం చేసి, ఆ చోటుకి తీసుకువచ్చాడు ఈశ్వరయ్య.


రక్తంతో తడిసిన అన్నయ్య వామనరావును ఎడ్ల బండిపై ఎక్కించుకొని స్థానిక పట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాను.


ఆసుపత్రిలో డాక్టర్ పరిచయస్తుడైన కారణంగా పూర్వాపరాలు లేవనెత్తకుండా వైద్యం చేయడానికి సిద్ధమయ్యాడు. 


కొంత సమయం తర్వాత నా దగ్గరకు వచ్చి, "బసవ గారూ! వెంటనే మీ అన్నయ్య గారికి బ్లడ్ ఎక్కించాలి. ఇక్కడ నిల్వలు కూడా లేవు. 


తెప్పించాలన్నా చాలా సమయం పడుతుంది" పరిస్థితి వివరించారు డాక్టర్. కంగారు పడుతూ, "డాక్టర్, నా రక్తం మ్యాచ్ అవ్వొచ్చేమో, కాస్త చెక్ చేయండి" ఆశతో అన్నాను.


"అలాగే" అంటూ వెంటనే చెక్ చేయించాడు. మ్యాచ్ అవ్వడంతో వెంటనే రక్తం సేకరించి వైద్యం మొదలు పెట్టారు డాక్టర్. నా మిత్రుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుసూదన్ రావుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. 


కంగారుగా కొంత సమయానికి ఆసుపత్రికి వచ్చి, "నమ్మలేకపోతున్నాను! విలువలకు విలువిచ్చే మీ కుటుంబంలో మీ అన్నయ్య వారసుడు ఇలా అనైతిక దాడి చేస్తాడా? వదిలి పెట్టకూడదు" ఆవేశంతో అన్నాడు మధుసూదన్ రావు.


"సమయానికి మీరు అందుబాటులో ఉన్నారు. ఇలాంటి సంఘటన ఎదురవుతుందని నేను ఊహించలేదు. మీరు అన్నట్టుగానే ఆ రాస్కెల్ చేసిన తప్పుకి శిక్ష పడాలి" బాధాతప్తమైన నా కళ్ళను తుడుచుకుంటూ అన్నాను.


కొంత సమయం తర్వాత డాక్టర్ నా దగ్గరకు వచ్చి, "బసవ గారూ! సమయానికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం కలిసి వచ్చింది. 


లేకుంటే పరిస్థితి వేరేగా మారేది. కానీ, కొన్ని భాగాల్లో మేజర్ దెబ్బలు తగిలాయి. కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాలి. 


ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు" అని నాతో చెప్పారు. "మీ మేలు మరిచిపోనిది. మా అన్నయ్య తిరిగి మాకు దక్కేలా చేశారు. 


ఇప్పుడు నేను అన్నయ్యతో మాట్లాడవచ్చా?" అడిగాను. "తప్పకుండా" అని సమాధానం ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు.


వేగంగా అన్నయ్య దగ్గరకు పరుగుతీశాను, నన్ను అనుసరించారు మధుసూదన్ రావు. "అన్నయ్యా!" పిలుపుతో నా వైపుకు చూశాడు. 


మెల్లగా గొంతును సవరించుకుంటూ, "ఎందుకు ఇంకా నేను బ్రతికే ఉన్నాను? కొడుకు చేతిలో కత్తి దెబ్బలు తిన్న తండ్రిగా నలుగురి నోట్లో నానడానికా!" అన్న మాటలు విని నా గుండెలు తరుక్కుపోయాయి.


"తప్పు చేసింది వాడు, నువ్వు ఎందుకు చావాలి? దైవం లాంటి తండ్రి మీదకు కత్తి దూసి, తండ్రి రక్తం కళ్ళ చూసిన ఆ నరాంతకుడు సిగ్గు పడాలి. నువ్వు ఒక్క మాట 'ఊ' అను, వాడికి ఏ గతి పడుతుందో నువ్వు చూస్తావు కదా" రగిలిపోతూ అన్నాను.


క్షణం ఆగుతూ, "గుండెల మీద పెట్టి పెంచుకున్నాను రా, వాడి మీద ఈగ వాలినా చూడలేకపోయే వాడిని." అన్నయ్య మాటలు విని మౌనంగా ఉండిపోయాను. మధుసూదన్ రావు అసహనంతో గది నుండి బయటకు వెళ్ళిపోయారు. 


ఇక ఆ విషయం అన్నయ్య దగ్గర ప్రస్తావించడానికి సరైన సమయం కాదని నేను మధుసూదన్ రావు గారి వెంట నడిచాను. "మీ అన్నగారి నుండి ఈ మాటలు నేను ఊహించలేదు బసవ గారూ. 


అలాంటి కొడుకుపై ఇంకా ఎందుకు ఈ అనురాగం?" "మీ అసహనాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, మీకు తెలియంది కాదు కదా, ఓ తండ్రి మనస్సు. ఏదిఏమైనా సరే వాడిని విడిచి పెట్టే ప్రసక్తే లేదు, వాడికి శిక్ష పడాలి."


"మీరు సమ్మతి తెలిపితే ఏం చేయాలో నేను చూసుకుంటాను." "అలాగే మధుసూదన్ గారూ, వాడికి శిక్ష పడేలా చేయండి" అని చెప్పాను.


మధుసూదన్ తన పలుకుబడితో నేరం చేసి దాక్కున్న జితేంద్రను పోలీసుల సహాయంతో పట్టుకొని చెరసాలలో పెట్టించాడు.


ఇరవై రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అన్నయ్యను కలవడానికి వచ్చారు జితేంద్ర తల్లి తరఫు వాళ్ళు. తనని పలకరించడానికి వచ్చారనుకున్నాడు అన్నయ్య. 


కానీ వాళ్ళ రాకకు వేరే కారణం ఉంది అని తర్వాత తేటతల్లమైంది. "మీ మీద వాడు దాడి చేయడానికి కారణం మీరే కదా! వాడు అడిగిన ఆస్తి అప్పుడే ఇచ్చేసి ఉంటే మీకు ఈ బాధ ఉండేది కాదు కదా. 


చిలికి చిలికి గాలివానలా రోజూ ఆస్తి గురించి అడిగి అడిగి విసిగిపోయి కోపంతో మీ మీద దాడి చేశాడు. ఇందులో మీ తప్పు కూడా ఉంది. 


పైగా ఇప్పుడు వాడి మీద కేసు కూడా పెట్టారు. అయినా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో? మీ మొండి పట్టు కారణంగా మీ భార్య, కొడుకు మీతో వేగలేకపోతున్నారు" సూటిపోటి మాటలతో అన్నయ్య మనస్సును గాయపరిచారు.


"బసవా!" అన్న అరుపుతో అన్నయ్య ముందు వాలిపోయాను. "ముందు ఆ కేసు వెనక్కి తీసుకో" నా వైపు చూస్తూ చెప్పాడు. "అన్నయ్యా, అది..." నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశాను.


"బసవా, నా మాట విను. నేను చెప్పింది చేయి" తన నిర్ణయం చెప్పాడు. సరే అని తలాడించాను.


అన్నయ్య నాతో కేసు వెనక్కి తీసుకోమని చెప్పడంతో వాళ్ళు ఆనందించి, "మంచిది! ఆ ఆస్తి గురించి కూడా ఒక మాట అనేస్తే, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు" ఎప్పటి నుండో వాళ్ళు ప్రస్తావించాలనుకున్న మాటను ప్రస్తావించారు.


చిన్న నిట్టూర్పు తీసి, "మీరే ఏదో ఒకటి నిర్ణయించి ఉంటారు కదా. చెప్పండి అదేమిటో?" అని అన్నాడు. "ఈ ఇల్లు, ఇక ముప్పావు వంతు భూమి మీ కొడుక్కి... ఎందుకంటే మీ భార్య కూడా మీ అబ్బాయితో పాటే ఉంటాను అంటోంది. ఇక పావు ఆస్తి మీది."


"ఇలా అయితే మీకు సంతోషమే కదా, అలాగే కానివ్వండి. మరి నా సంగతి ఏమిటి?" అని ప్రశ్నించాడు అన్నయ్య.


కాసేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, "మీరు కూడా వాళ్లతో పాటు ఉండవచ్చు. ఎలాగూ ఆస్తి గొడవ కొలిక్కి వచ్చింది కాబట్టి సమస్య లేదు. 


కూడుకి, బట్టకి మీకు ఇబ్బంది కలుగకుండా మేము చూసుకుంటాం." వాళ్ల మాటలకు నిస్తేజంగా నవ్వుతూ, "అవసరం లేదు, ఆ ఇంటిని వాళ్ళనే ఏలుకోమని చెప్పండి. 


నాదేముంది ఎక్కడో ఒక దగ్గర గడిపేస్తాను లే. అయినా ఇన్నాళ్లు సఖ్యంగా ఉండని వాళ్ళు ఇప్పుడు ఆప్యాయంగా ఉంటారు అంటే ఎలా నమ్మగలను?" ప్రాపంచిక విషయాల మీద విరక్తి కలిగినట్టుగా మాట్లాడి అక్కడ నుండి వెళ్లిపోయాడు అన్నయ్య.


మరుసటి రోజు నా ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని వున్నాడు. అన్నయ్య దగ్గరకు చేరుకొని, "నీ పద్ధతి నాకు నచ్చడం లేదు అన్నయ్యా. 


వాళ్ల మాటలకు ఎందుకు ఒప్పుకున్నావు? అయినా ఆస్తి వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? పైగా తల దాచుకోవడానికి ఉన్న ఒక్కగానొక్క ఇల్లు వాళ్ళకి ధారాదత్తం చేస్తే నీ పరిస్థితి ఏమిటి?" "నిజమే, ఆస్తి వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 


ఆస్తి వాడి పేరున రాసేస్తే ఎక్కడ తగలెట్టి వీధిన పడతాడో అని జాగ్రత్త పడ్డాను. వాడు మంచి మార్గంలో నడవాలని ఆశ పడ్డాను, నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను. 


కానీ, ఆ జాగ్రత్త నా ప్రాణానికే ప్రమాదం తెచ్చింది." ఒక్కసారిగా గొంతు పూడుకుపోయింది. 


కాసేపు మౌనం దాల్చాడు, మళ్ళీ తేరుకొని, "ఇంకా గొడవ పడే ఓపిక నాకు లేదు రా. ఇక నా మాట అంటావా, నాకు దిక్కుగా నువ్వు ఉన్నావని నమ్మకం. 


ఈ అన్నకు కాస్త గూడు, కూడు పెట్టకపోవా?" చెమర్చిన కళ్లతో, ఆర్తితో నా వైపు చూశాడు. "నా ఇల్లు నీ ఇల్లు వేరు కాదు కదా అన్నయ్యా. 


ఈ మాట నువ్వు ఇంతలా అడగాలా?" చేయి పట్టుకొని అన్నని ఇంటికి తీసుకువెళ్ళాను. 


రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనందంగా ఉండే అన్నయ్య చాలా రోజుల నుండి ముభావంగా ఉండడంతో, "అన్నయ్యా! ఏ విషయం గురించో చాలా బాధపడుతున్నట్టు ఉన్నావు. 


నిన్ను కలవరపెట్టే ఆ సమస్య ఏమిటి?" అని అడిగాను. ఇంతలోనే అన్నయ్య నుదుట వున్న గాయం చూసి, "అయ్యో, నీ నుదుట ఈ గాయం ఏమిటి?" అడిగాను.


ఒక్కసారిగా ఏడ్చేస్తూ, "మనవడని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోబోతే, నన్ను దూరంగా నెట్టి, 'నువ్వో దొంగవి' అని తిడుతూ, రాయితో ఇలా కొట్టాడు రా" గుండెలు బాదుకుంటూ విలపించాడు అన్నయ్య.


"అన్నయ్యా, ఇరవై ఏళ్ల నాటి సంఘటన మర్చిపోయావా? నీకు మనవడు అయినా, పెంపకం వాడిది కదా. 


మరి కొడుక్కి ఏమని చెప్తాడు? ఇలానే చెప్తాడు. నిజం చెపితే సొంత కొడుకు వాడిని అసహ్యించుకుంటాడు కదా! ఇంకెప్పుడూ వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్ల చేత మాటలు పడవద్దు" లోలోపల కోపాన్ని అణుచుకొని సుతిమెత్తగా చెప్పాను.


మరుసటి రోజు నుండి అన్నయ్యను గమనిస్తూనే ఉన్నాను. కానీ, అన్నయ్య ఎప్పుడూ దిగులుతోనే కనిపించేవాడు. చాలా సార్లు అన్నయ్యకి నచ్చజెప్పి అతన్ని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేశాను. 


కానీ తన అంతరంగంలో తిష్ట వేసిన బాధని జయించలేకపోయాడు అన్నయ్య. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నయ్య ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. 


ఇంటి పట్టున సరిగ్గా ఉండక, వేళకు సరిగ్గా తినక ఆరోగ్యం ఇంకా క్షీణించింది. ఒకరోజు అన్నయ్య దగ్గరకు చేరుకొని, "అన్నయ్యా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అంతలా ఎందుకు దిగులు పడుతున్నావు? సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. 


నీ ఆరోగ్యం ఏమైందో చూడు. అసలు దీనంతటికీ కారణం ఏమిటి?" నిలదీస్తూ అడిగాను. "దీనంతటికీ నువ్వే కారణం, నీ పంచన నేను చేరకుండా ఉండాల్సింది. 


అప్పుడైనా నా మనవడితో తాత అని నోరారా పిలిపించుకునే వాడిని, నా కుటుంబంతో నేను ఉండే వాడిని. ఆరోజు నువ్వు పెట్టిన కేసు కారణంగానే నా గతి ఇలా అయ్యింది. 


నీ కుటుంబంతో నువ్వు హాయిగా ఉన్నావు. నేనే నా కుటుంబానికి దూరమైపోయాను." అన్నయ్య మాటలు శూలాల్లా మెల్లగా నా గుండెల్లోకి దిగుతున్నాయి. తెలియకుండానే నా కళ్ళు కన్నీటిని ఉధృతంగా కురిపిస్తున్నాయి. 


నా కళ్ళను ఒత్తుకుంటూ, "అన్నయ్యా, నువ్వేనా ఈ మాట అంటున్నది? నేనా జరిగిన దారుణాలకు కారణం?" "నువ్వే నా ఆస్తికి ఆశపడి, నన్ను ఇలా మార్చావు." సమ్మెటతో గుండెను మోదినట్టుగా అనిపించింది. 


భారమైన హృదయంతో కృంగిపోతూ, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. దుఃఖంతో మరో మాట మాట్లాడకుండా ఇంటి లోపలికి భారంగా అడుగులు వేస్తూ వెళ్లి, నా గదిలో బెడ్‌పై కూర్చుంటూ బాధపడుతున్నాను. 


మొత్తం జరిగింది ప్రత్యక్షంగా చూసిన నా భార్య హైమావతి వచ్చి ఓదార్చుతూ, "బావ గారికి ఎందుకో మనస్సు స్థిమితంగా లేదనిపిస్తోంది. 


మీరు ఆ మాటలు పట్టించుకొని బాధపడకండి. మొన్న పక్క వీధిలో ఉన్న రత్నమాల మనింటికి వచ్చింది. బావ గారితో మంచిగా మాట్లాడుతూ కొందరు లేనిపోనివి నూరి పోస్తున్నారని చెప్పింది. 


ఇదంతా ఆ ప్రభావమే. చుట్టూ ప్రపంచం చూసి తనకు కూడా తన కుటుంబం తోడు ఉండుంటే బాగుండేదని ఆలోచిస్తూ ఇలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు" అని సర్ది చెప్పింది. 


నా భార్య మాటలకు కాస్త ఉపశమనంగా అనిపించాయి. నేను అన్నయ్య అన్న మాటలను మరచిపోవాలని ప్రయత్నం చేస్తున్నాను. రోజులు గడుస్తున్నాయి కానీ అన్నయ్యలో మార్పు రావడం లేదు. 


రెండు నెలలు గడిచిన తర్వాత పూర్తిగా తిరగలేని పరిస్థితికి చేరుకున్నాడు. అన్నయ్య మీద ప్రేమతో సపర్యలు చేస్తూ వచ్చాను. కానీ నాతో మాట్లాడడానికి కూడా సుముఖత చూపలేదు అన్నయ్య. 


పక్కనే ఉంటూ కబుర్లు చెప్తూ అన్నయ్యను మాట్లాడించాలని, అన్నయ్యతో మాట్లాడాలని తెగ ఆరాటపడ్డాను. కానీ లోలోపల అయినవాళ్ల బంధం తీపి మనస్సుని మాయ చేస్తోంది. 


తెలియని వాళ్ల మాటల ప్రభావం వశీకరణంలా ఫలించి నాపై పీకల వరకు పగను నింపాయి. 


క్షణక్షణానికి ఈ ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ అన్నయ్యను హీన దశకి చేర్చాయి. పూర్తిగా అన్నపానీయాలు మానేశాడు. అక్కడకు కొన్ని రోజుల తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.


అన్నయ్య నిష్క్రమణ నా మనస్సును దుఃఖ సాగరంలోకి నెట్టేసింది. చివరి దశలో అన్నయ్య దృష్టిలో దోషిగా మిగిలిన ఆ క్షణం మాయని గాయంగా మారి గుండెల్లో నాటుకుపోయింది. 


అన్నయ్య మరణ వార్త విని అందరూ నా ఇంటికి చేరుకున్నారు. కొడుకు జితేంద్ర, భార్య కూడా అద్దె కన్నీళ్లను అరువు తెచ్చుకుంటూ అక్కడ చేరుకున్నారు. జితేంద్ర వైపు చూసి, "ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయనుకుంటాను. 


అయినా ఎందుకు ఇక్కడకు వచ్చావు? నీ దృష్టిలో ఈ రోజు ఎప్పుడో జరిగిపోయింది కదా. నీ పాపాలు ఎక్కడ బయట పడతాయని భయపడుతూ నీ తండ్రి గురించి నీ కొడుక్కి తప్పుగా చెప్పి, వాడి మనసులో కూడా నీ తండ్రి పట్ల ద్వేషాన్ని నింపావు. 


అంటే నీ కొడుకు నిన్ను అసహ్యించుకుంటాడని, నీ కొడుకు నీకు దూరం అయితే నీ గుండె తట్టుకోలేదని ఇలా చేశావు. 


మరి ఇలాంటి ప్రేమనే కదరా నీ తండ్రి నీ నుండి కోరుకున్నాడు. చివరికి నా అన్న దృష్టిలో నన్ను కూడా దోషిగా నిలబెట్టావు కదరా! సిగ్గు లేదురా... ఒక మనిషిని ఇలా క్షోభకు గురి చేయడానికి. 


నీ కొడుకు ముందు ఇంకా మాట్లాడితే బాగుండదు. దయచేసి ఇక్కడ నుండి వెళ్లిపోండి, వెళ్లిపోండి." ఎర్రబడిన నా కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. 


నియంత్రించుకోలేని కోపంతో వాళ్ళను అక్కడ నుండి వెళ్లగొట్టాను. చేయాల్సిన పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాను.


ఈ బాధ నన్ను నా గదికే పరిమితం చేసింది. కుమిలిపోతూ ఉండేవాడిని. మళ్ళీ నా భార్య నన్ను ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చేసింది..." అని కౌశిక్‌తో తన గతాన్ని చెప్పాడు బసవ.


చెమర్చిన కళ్ళను తుడుచుకొని, "చూడు కౌశిక్! నువ్వు మీ నాన్నని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావో, మీ నాన్న నిన్ను అర్థం చేసుకోలేకపోయాడో తెలియదు కానీ నువ్వు ఈ విధంగా ఇంటి నుండి వచ్చేయడం మంచిది కాదు. 


నువ్వు ఆ జితేంద్రలా మారకూడదని, తండ్రికి శత్రువులా మారి సమాజంలో చెడ్డ కొడుకుగా పేరు తెచ్చుకోకూడదని నా తాపత్రయం" అన్నివిధాలుగా కౌశిక్‌ను ఒప్పించి అతని ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యాడు.


కొన్ని గంటల ప్రయాణం తర్వాత రమేష్ ఇంటికి చేరుకున్నాడు. కౌశిక్ బసవతో కలిసి రావడం చూసి ఆశ్చర్యపోయాడు రమేష్. 


ఎగసిపడుతున్న అల తీరం చేరి నెమ్మదించినట్టుగా అప్పటి వరకు దుఃఖంతో నిండిన రమేష్ హృదయం కొడుకుని చూడగానే తేలికపడింది. 


తర్వాత విషయం తెలుసుకొని బసవకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. అంతకు ముందు ఉన్న గొడవలు మరచి బసవను హత్తుకొని, "నీ మనస్సును గుర్తించలేకపోయాను. 


అంతస్తులు చూసి అహంకారంతో నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించు" అని క్షమాపణలు కోరాడు రమేష్. "సరే రమేష్! నేను వెళ్ళాలి... మా అమ్మాయి నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది" అని అక్కడ నుండి బయలుదేరబోయాడు బసవ.


విషయాలు అడిగి తెలుసుకున్న తర్వాత, "ఆ కాలేజీ డైరెక్టర్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. నేను ఫోన్ చేసి నీ గురించి చెప్తాను. నువ్వు వెళ్ళి మాట్లాడు" నవ్వుతూ అన్నాడు రమేష్.


రమేష్ మాటతో బసవ మనసు తేలికపడింది. ఫీజు విషయంలో తనని ఇబ్బందికి గురిచేస్తున్న సమస్య ఒక కొలిక్కి వచ్చిందని ఆనందంతో అక్కడ నుండి ముందుకు సాగబోయి, ఒక్కసారిగా ఆగుతూ, "రమేష్! తండ్రి కొడుకుల బంధం స్నేహపూర్వకంగా ఉండాలి... కౌశిక్‌తో ఒకసారి మనసు విప్పి మాట్లాడు. మీ మధ్యన ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయి" అని చెప్పి అక్కడ నుండి నిష్క్రమించాడు.


 ***సమాప్తం****



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Malla Karunya Kumar

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీ ఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page