top of page
Original.png

తిరిగి వచ్చిన వసంతం


కోటప్పకొండ తిరునాళ్లలో పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చిన కొడుకును తల్లి తులసమ్మ ఆలింగనం చేసుకున్న దృశ్యం

Thirigi Vachhina Vasantham - Telugu Emotional Family Story | Penumaka Vasantha

తిరిగి వచ్చిన వసంతం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 14/08/2026


‘తిరిగి వచ్చిన వసంతం’ ఒక తల్లి మాతృహృదయం, పదిహేనేళ్ల నిరీక్షణ, కోటప్పకొండ తిరునాళ్ల జ్ఞాపకాలు, అనుకోని పునర్మిళనాన్ని ఆవిష్కరించే హృదయస్పర్శి తెలుగు కథ. చిన్నతనంలో కోటప్పకొండ జాతరలో తప్పిపోయిన వసంతరావు, సంవత్సరాల తర్వాత అదే తిరునాళ్లను చూసి తన తల్లిదండ్రుల కోసం తిరిగి రావడంతో తులసమ్మ కుటుంబంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది.


"అమ్మా కొండకు పోదాం రా అమ్మా!"


"రాలేను మీరు పోండి. నాకు ఆడికి వస్తే మీ తమ్ముడు సంతు గుర్తుకు వస్తాడు. మీరు వెళ్ళి రండి!" అంటూ రాకుండా తులసమ్మ మంచం మీద కూచుంది.


"ఆమె రాదు గాని మీరు పదండి.. ఇప్పటికే లేట్ అయింది" కూతురు, అల్లుడితో అన్నాడు శివయ్య.


కూతురు ఇంటి ముందున్న ప్రభను చూసి, "అమ్మా ప్రభ ముందుకు పోతుంది. ఒకసారి వచ్చి దణ్ణం పెట్టుకో!" అని కేకేస్తే..

తులసమ్మ బయటికి వచ్చి దణ్ణం పెట్టుకుని, ఇంటిలోకి నడిచి బయట వసారాలో ఉన్న మంచంపై వాలింది.


పదిహేనేళ్ల జ్ఞాపకాల్లోకి వెళ్ళింది తులసమ్మ.


భర్త శివయ్య ఇంటి అనవాయితీ ప్రకారం, ప్రతి ఏడు ప్రభ కట్టి పక్కనున్న కోటప్పకొండకు తీసుకెళ్ళి, అక్కడ శివయ్యకు చూపించి మొక్కులు చెల్లించుకుని రావటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం.


పదిహేనేళ్ల క్రితం కొడుకు వసంతరావు, కూతురు రామలక్ష్మిని తీసుకుని భర్తతో పాటు ప్రభ వెనుక కొండకు వెళ్ళింది. ఆ ఏడు బాగా జనాలు వచ్చారు కొండకు.


పిల్లల్ని తీసుకుని అక్కడ జాతరలో బొమ్మలు కొనిపెట్టడానికి వెళ్ళింది తులసమ్మ. రామలక్ష్మి అమ్మ పక్కనే ఉంది. ఐదేళ్ల వసంతరావు ఏదో బొమ్మల దుకాణం దగ్గరికి వెళ్ళాడు.


రామలక్ష్మి బాగా తెలివితేటలతో ఉండేది. వసంతరావుకి ఇంకా సరిగా మాటలు రాలేదు. తులసమ్మ ఈ వసంతరావు గురించి దిగులు పడేది. భర్త శివయ్య, "మన కోటప్పకొండ శివయ్య మన అబ్బాయికి మాటలు రప్పిస్తాడు. నువ్వేమి దిగులు పడకు. నేను చిన్నప్పుడు ఆలస్యంగా మాట్లాడేవాడ్ని" అంటే, 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకునేది తులసమ్మ.


తులసమ్మ కూతురుకు గాజులు కొని కొడుకు కోసం చూస్తే కనపడలేదు. చుట్టుపక్కల వెతికింది. ప్రభ హడావుడిలో ఉన్నాడు శివయ్య.


సాయంత్రం సందడి తగ్గి అందరూ ఊళ్లకు వెళుతున్నారు. వసంతరావు జాడ లేదు.


శివయ్య గుడి మెట్ల దగ్గర దిగాలుగా ఉన్న భార్యను చూసి, "ఏంది దిగులుగా ఉన్నావు?" అని అడిగితే.. సంగతి చెప్పింది. గుడి మైకులో చెప్పించాడు. ఎక్కడా కనపడలేదు వసంతరావు.


అన్ని ఆటబొమ్మలు అమ్మే అంగళ్ల దగ్గర వెతికారు. ఎక్కడా కనపడలేదు. అప్పటినుండి కొండకు వెళ్ళటం మానేసింది తులసమ్మ. కొండకు వెళితే ఎక్కడ వసంతరావు గుర్తుకు వస్తాడని, శివయ్య బతిమాలినా వెళ్ళేది కాదు.

***


తెల్లవారుజామునే లేచి ఉండ్రాళ్ళు, పాయసం చేసి ఉండటం వల్ల అలిసిపోయి నిద్ర ముంచుకొచ్చింది తులసమ్మకు.


"అమ్మా!" అన్న పిలుపు వినబడటంతో ఉలిక్కి పడి లేచింది. ఎదురుగా ఇరవై ఏళ్ళ యువకుడు చిరునవ్వుతో నించుని ఉన్నాడు.


కొడుకు వసంతరావు లాగా పోలికలు కనిపించటంతో, "సంతు!" అంటూ దగ్గరకు తీసుకుంది. "బాబు నువ్వేనా! నా సంతువి!" అంటూ వసంతరావును ముద్దాడింది.


"హా... మా! నేనే... వచ్చానమ్మా!" హిందీ యాసలో మాట్లాడుతూ అమ్మ పక్కన కూచున్నాడు.


"పాపా దీది ఏరి?"


"ఇవాళ శివరాత్రి జాతర కొండకి పోయారు నాన్నా!" ఇంకా నమ్మకం కలగక కొడుకును తదేకంగా చూస్తూ అంది.


"మా మనం పోదాం పదా!"


"వద్దు నువ్వు మళ్ళీ తప్పి పోతావు. పదా! ముందు అన్నం తిందువు గాని!" అంటూ అన్నం వడ్డించి పెట్టింది తులసమ్మ.


ఇద్దరూ కొండకు వెళ్ళారు. అక్కడున్న జనాల్లో వాళ్ళ ప్రభను కనుక్కోవటం కష్టమయినా కనుక్కున్నారు. శివయ్య ప్రభ దగ్గరికి వెళ్ళి "పాపా!" అన్నాడు వసంతరావు.


శివయ్య వసంతరావును చూసి "సంతు!" అన్నాడు ఆశ్చర్యపోతూ.


"ఏమయ్య! ఇదుగో మన అబ్బాయి వచ్చాడు" అంటూ ఆనందపడుతూ చెప్పింది తులసమ్మ.


అక్కడ వున్న రామలక్ష్మి "తమ్ముడు!" అంటూ వసంతరావును హత్తుకుంది. "ఇక్కడే తప్పిపోయావు. మళ్ళీ ఇక్కడే కలిసాం" అంటూ తమ్ముడిని చూస్తూ అంది.


"అవును దీది! ఆరోజు ఈ అంగడి దగ్గర బొమ్మలు చూస్తూ ఉంటే... ఇక్కడ పెద్ద గొడవ జరిగింది. పోలీసులు వచ్చారు. వాళ్ళను చూసి భయపడి ఆ అంగడి లోపలికి వెళ్ళి దాక్కున్నాను. నిద్రొచ్చి అక్కడే పడుకున్నా. అంగడి వాళ్ళు నన్ను చూడకుండా అంగడికి తాళం వేసి ఇంకోచోటుకు వెళ్లారు.


మరుసటి రోజు వచ్చి నన్ను చూసి ఏ ఊరు అంటే... నాకు సరిగా మాటలు రాకపోవటం వల్ల చెప్పలేకపోయాను.


వాళ్ళు ఇక్కడ బొమ్మలు అమ్మటానికి వచ్చి, మళ్ళీ వాళ్ళ రాష్ట్రం వెళ్తారు. ఇక చేసేది లేక నన్ను తీసుకుని వెళ్ళారు వాళ్ళ వెంట వాళ్ళ రాష్ట్రం.


వాళ్ళకు పిల్లలు లేకపోవటం వల్ల నన్ను పెంచుకున్నారు. అప్పుడప్పుడు మీరు గుర్తుకు వచ్చేవారు. కానీ ఈ ఊరు ఎక్కడ ఉందో వాళ్ళకు అప్పుడు చెప్పలేకపోయాను. వాళ్ళు మళ్ళీ ఇటు వైపు రాలేదు. నన్ను చదివించారు. ఇపుడు ఇంజనీరింగ్ చదువుతున్నా.


టీవీలో కోటప్పకొండలో తిరునాళ్ళ అన్నది చూపిస్తూ, ఇక్కడ అంతా చూపించారు. అది చూసి ఇక్కడ నా ఊరు అని డిసైడ్ అయ్యాను. నన్ను పెంచిన వాళ్ళతో అక్కడికి వెళ్ళి వస్తానన్నాను. వాళ్ళు "నువ్వు అక్కడే మాకు దొరికావు!" అన్నారు. "మా అమ్మా నాన్నను చూసి వస్తాను" అని బయలుదేరి వచ్చాను." తెలుగు కూడా సరిగా మాట్లాడలేక పోతున్నాడు. హిందీలోనే కొద్దికొద్దిగా అర్థమయ్యేట్లు చెప్తున్నాడు.


"నా తండ్రే! నువ్వు తిరిగి వచ్చావు అంతే! చాలు. ఆ శివయ్య నా కొడుకును మళ్ళీ నాకు తెచ్చి ఇచ్చాడు" అంటూ సంతును హత్తుకున్నాడు శివయ్య. కొడుకు తప్పిపోయినప్పుడు వచ్చిన తులసమ్మ, మళ్ళీ ఇవాళా వచ్చింది ఆ తిరునాళ్లకు.


గుడిలో శివయ్య దగ్గరికి వెళ్ళి "ఇక ప్రతి ఏడు జరిగే జాతరకు ప్రభ కట్టుకుని వస్తాను" అని కళ్ళు మూసుకుని మొక్కుకుంది తులసమ్మ.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page