top of page
Original.png

యంత్రాయ నమః

19 hours ago
5 min read

వీరభద్రం తన కుటుంబంతో కలిసి AI మరమనిషి యంత్రుడిని చూసి ఆనందిస్తున్న దృశ్యం

Yanthraya Namaha: - Telugu Comedy Story | Malla Karunya Kumar

యంత్రాయ నమః - తెలుగు హాస్య కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 08/09/2026


“యంత్రాయ నమః” ఒక చక్కని తెలుగు కుటుంబ హాస్య కథ. సాంకేతికతను ఎప్పుడూ విమర్శించే వీరభద్రం జీవితంలోకి ఒక AI మరమనిషి వస్తుంది. మొదట దానిని పరీక్షించాలనే పట్టుదలతో వ్యవహరించిన అతడు, క్రమంగా తనలోని మొండితనం, అహంకారం, ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే మనస్తత్వాన్ని గుర్తిస్తాడు. భార్య సీతారత్నం, కొడుకు చేతన్, యంత్రుడు చుట్టూ జరిగే సరదా సంఘటనలతో కథ ముందుకు సాగుతుంది. చివరికి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనిషిలో ఎలాంటి సానుకూల మార్పు రావచ్చో ఈ కథ హాస్యంతో చెబుతుంది.


“టీ లో పంచదార తక్కువైంది!” ఒక్కసారిగా అరిచాడు వీరభద్రం.


"అయ్యో, పొరపాటు జరిగిపోయింది. ఉండండి, కాస్త పంచదార వేస్తాను," పంచదార డబ్బాతో వాణికి పోతూ వీరభద్రం దగ్గరకు వచ్చింది సీతారత్నం.


"ఏమిటి వేసేది! పంచదార చచ్చింది... వేడి కూడా చచ్చింది," ఉరుముతూ చూశాడు వీరభద్రం.


"అయ్యో! మరొకటి తీసుకురానా?" ప్రశ్నార్థకంగా భర్త వైపు చూస్తూ అడిగింది.


“అంత సమయం వరకు శిలలా వేచి చూడాలా? ఈ బోడి టీ మరెక్కడా దొరకదా?” టీ కప్పు సీతారత్నం చేతిలో విసురుగా పెట్టి, రుసరుసలాడుతూ అక్కడి నుండి లంఘించాడు.


"అయ్యో రాత, నా రాతే బాగుండి ఉంటే టీ పెట్టి నాకు ఇచ్చే మొగుడు వచ్చేవాడు. ఇలా తిట్టేవాడు వచ్చి ఉండేవాడు కాదు. ఎలా వేగాలో అర్థం కావడం లేదు ఈ తింగరి సన్నాసితో," తల బాదుకుంటూ వంటగది వైపునకు నడిచింది.


ఒక్క లంఘింపుతో ఎదురుగా ఉన్న టీ కొట్టు ముందు వాలిపోతూ, “ఒక స్పెషల్ టీ,” అని అరిచి, పక్కనే ఉన్న బెంచి మీద కూర్చున్నాడు.


ఉలిక్కిపడి రెప్పపాటులో టీ గ్లాసుతో వీరభద్రం ముందు ప్రత్యక్షమయ్యాడు తాతారావు.

టీ తీసుకొని తాగడం మొదలుపెట్టాడు వీరభద్రం. ఇంతలో పక్కనే గోల చేస్తున్న తన తోటి అపార్ట్‌మెంట్ వాసుల వైపునకు చూశాడు.


మరమనిషితో ఉదయాన్నే ఎప్పటిలానే బయలుదేరాడు యువ సాఫ్ట్‌వేర్ మోక్షజ్ఞ... అందరూ ఆ మరమనిషి చుట్టూ చేరి దానితో ముచ్చట్లు పెడుతున్నారు.

అది ఒక కృత్రిమ మేధ కలిగిన మరమనిషి... ముద్దుగా దాన్ని అందరూ “యంత్రుడు” అని పిలుస్తుంటారు.


మొబైల్ ఫోన్లలో తలదూర్చి బయట ప్రపంచాన్నే మరిచిపోయే చిన్న, పెద్ద ఎవరైనా తనకి తారసపడితే ఆ రోజు వాళ్ళకి ప్రత్యేకమైన క్లాస్ ఇచ్చేవాడు వీరభద్రం. యంత్రాలన్నా, సాంకేతికతన్నా అసహనానికి గురయ్యేవాడు వీరభద్రం. కానీ, యంత్రుడిని చూసినప్పుడు వీరభద్రానికి ఆశ్చర్యం కలుగుతుంది. దానితో ముచ్చటించాలని జిజ్ఞాస కలుగుతుంది.


రెండు గుటకల్లో టీ తాగడం పూర్తి చేసి, రెండు అడుగుల్లో యంత్రుడు ముందు ప్రత్యక్షమయ్యాడు వీరభద్రం.


“నమస్కారం గురువర్య! శుభోదయం,” చేతులు జోడించాడు యంత్రుడు.


యంత్రుడికి వీరభద్రం సుపరిచితమే... వీరభద్రం అంతకుముందు తీసుకున్న క్లాస్ ప్రభావంతో ఎప్పుడు వీరభద్రం కనిపించినా పలకరిస్తాడు యంత్రుడు.


ఉప్పొంగిపోయి, “నమస్కారం! ఏది, నిన్న చెప్పిన పద్యాలు కాకుండా వేరేవి చెప్పు?” అని అడిగాడు.


టకటకా చెప్పాడు యంత్రుడు. ఏ ప్రశ్న సంధించినా సమాధానం చెప్పేసే యంత్రుడిని చూసి ముఖం చిన్నది చేసుకొని, ‘ఏమడిగినా చెప్పేస్తున్నాడు, వీడిని ఓడించేది ఎలా?’ అని మధనపడుతూ తాను కూడా యంత్రుడితో పాటు నడిచాడు.


మోక్షజ్ఞ వీరభద్రం వైపు చూస్తూ, “అంకుల్! ఈ యంత్రుడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. మీతో పరిచయం దగ్గర నుండి మీకు తెలుగు భాష మీద మంచి పట్టు ఉందని నాకు అర్థమైంది. వీడికి ఇంకా కొత్త విషయాలు నేర్పించవచ్చు కదా.”


“ఏమయ్యా ఇంజనీరు! వీడికి ఇప్పటికే చాలా జ్ఞానం ఉంది. వీడికి నేను నేర్పించేది ఏమిటి?”


“అదికాదు అంకుల్... అసలు విషయం ఏమిటంటే, నేను వారం రోజులు పనిమీద వేరే రాష్ట్రం వెళ్ళాలి. దీన్ని తీసుకోలేను కదా. మీరు దీన్ని చూసుకుంటారని అడిగా.”


“దీన్నా!... ఇది తిరగబడితే... తిక్కతిక్కగా ప్రవర్తిస్తే,” లోపల దాన్ని ఉంచాలని ఉత్సుకత ఉన్నా చెలరేగిన భయంతో ప్రశ్నలు కురిపించాడు.


“భయం అవసరం లేదు అంకుల్... దీనికి సహనం ఎక్కువ, కోపం రాకుండా డిజైన్ చేశాం. ఒకవేళ తిరగబడిందే అనుకోండి, ఇదుగో రిమోట్, దీంతో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. లేకపోతే ఇదుగో చూశారా, దీని వెనుక భాగంలో పవర్ బటన్ ఉంది, ఆపేయవచ్చు. మీరు ఊ అనండి, నేను చూసుకుంటాను కదా.”


కొంత సమయం ఆలోచనలో పడి “సరే” అన్నాడు.


ఆ మరుసటి రోజు యంత్రుడిని వీరభద్రంకి ఇచ్చి అన్నీ వివరంగా చెప్పి వెళ్ళిపోయాడు మోక్షజ్ఞ.


అప్పటి నుండి దానితో కుస్తీ పట్టడం మొదలుపెట్టాడు వీరభద్రం. భార్య సీతారత్నం వింతగా చూస్తూ ఉంది.


భార్య చేసిన పనికి వంక పెడుతూ, వంటల్లో రుచులు వెతుకుతూ, నసపెట్టే వీరభద్రం ఇప్పుడు శాస్త్రవేత్తలా ఆ యంత్రుడితో ప్రయోగాలు చేస్తూ ప్రతి క్షణం దానికోసమే వెచ్చిస్తున్నాడు. టీ ఇచ్చినా దానిపై విమర్శలు లేవు, వడ్డించినా వేగంగా తినేసి మరో మాటలేకుండా వెళ్ళిపోయి యంత్రుడితో కాలక్షేపం వీరభద్రానికి పరిపాటి అయిపోయింది.


ఒకరోజు జిజ్ఞాసతో భర్త ఏం చేస్తున్నాడో చాటుగా ఉండి గమనించింది సీతారత్నం. మూలన పడి ఉన్న తెలుగు గ్రంథాలు ముందు వేసుకొని వాటికి పట్టిన బూజు దులుపుతూ, పేజీలు తిరగేస్తూ, యంత్రుడికి ప్రశ్నలు సంధించేవాడు.


యంత్రుడు సునాయాసంగా సమాధానాలు చెప్పేసేవాడు. కోపంతో మరిన్ని ప్రశ్నలు గుప్పించేవాడు. యంత్రుడు కొన్నిసార్లు సమాధానం ఇచ్చేవాడు కాదు.

సమాధానం ఇవ్వని తరుణంలో ఉప్పొంగిపోయేవాడు వీరభద్రం.


ఒకవేళ యంత్రుడు సమాధానం చెప్పేస్తే... ఒక యంత్రం నాపై గెలవడమా అని భరించలేని అహంకారంతో ఆ యంత్రుడిని ఆఫ్ చేసేవాడు. భర్త చర్యలు చాటుగా చూస్తున్న సీతారత్నం నవ్వుకునేది.


మళ్ళీ ఉత్సాహం కలిగినప్పుడు దాన్ని ఆన్ చేసి, తనకి కావాల్సిన విషయాలు అడిగి తెలుసుకునేవాడు. వార్తలు, పాటలు, శ్లోకాలు, సినిమాల మీద రివ్యూలు ఒక్కటేమిటి, బుర్రలో పుట్టిన ప్రతి ప్రశ్నను యంత్రుడు ముందు పెట్టి ఆడుకునేవాడు. ఒకరోజు “నా గురించి నీకు ఏమి తెలుసో చెప్పు?” అని అడిగాడు.


“అవతల వ్యక్తి మీకంటే ఎక్కువ ఉండకూడదన్న మనస్తత్వం మీది. మీ మాటే నెగ్గాలన్న మొండితనం మీది. ఒక మాటలో చెప్పాలంటే ఒకింత శాడిస్ట్ మీరు.”


ఉలిక్కిపడ్డాడు. అమాంతం కళ్ళు ఎర్రగా మారాయి, అహం అగ్నిపర్వతంలా చెలరేగింది. మళ్ళీ దాన్ని ఆఫ్ చేశాడు.


తర్వాత రోజు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాడు. కానీ ఈసారి వీరభద్రంలో ఒక ఆలోచన మొదలైంది. అది ఒక యంత్రం కదా... అబద్ధం చెప్పదు కదా... అది చెప్పింది నిజమే, ఇతరులు ఎక్కువగా ఉంటే నేను తట్టుకోలేను. అలాగే నా మాటే నెగ్గాలని చూస్తుంటాను అని తన మనస్తత్వం పట్ల తాను ఒక నిర్ణయానికి వచ్చి... తన అంతరంగానికి అనేక ప్రశ్నలు వేసిన తర్వాత, తన భార్య దగ్గరకు చేరుకున్నాడు.


"సీతా, సీతా!" అని అంటూ అరిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది సీతారత్నం.


"ఏమిటా కేకలు?"


"ఏమీ లేదు, ఇలా కూర్చో," అంటూ సోఫాలో కూర్చుంటూ, పక్కనే ఆమెను కూర్చోబెట్టుకొని... "ఇన్నాళ్ళు నాతో కాపురం చేశావు కదా, నాలో నచ్చిన విషయం ఏమిటి?" ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు.


ఒక్కసారిగా భర్త వైపు చూసి మౌనం వహించింది సీతారత్నం.

"నాలో నచ్చిన విషయం ఏమీ లేదా?" ప్రశ్నార్థకంగా అడిగాడు.


తుళ్ళిపడి, "మనిషి మంచివారే, కానీ మీలో చాదస్తం ఎక్కువ... ఆ విషయం మీ స్నేహితులు కూడా మీ ముందే చాలాసార్లు చెప్పారు కదా," తడబడుతూ తన మనసులో మాట చెప్పేసింది సీతారత్నం. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


"అయ్యో! ఉండబట్టలేక నిజం చెప్పేశాను. ఇప్పుడు ఏ పొగ పెడతారో," గుండెలు పైచేయి వేసుకొని నీళ్లు నమిలింది సీతారత్నం.


వేగంగా వెళ్ళి గంటల క్రితం ఆఫ్ చేసిన యంత్రుడిని ఆన్ చేసి, తనని తాను ఎలా మార్చుకోవాలో దాన్ని అడిగాడు. దానికి తెలిసిన విషయాలు అది చెప్పింది. ఆమోదయోగ్యమైన వాటిని పాటించడం మొదలుపెట్టాడు. వారం రోజులు పూర్తి అయ్యాయి. మోక్షజ్ఞ వచ్చి యంత్రుడిని తీసుకువెళ్ళిపోయాడు.


మరమనిషి వెళ్ళిపోవడంతో వీరభద్రానికి ఏదో కోల్పోయినట్లు అనిపించింది. బాగా ఆలోచించాడు... "ఈ రోజుల్లో అందరూ తపత్రూగా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి ఎందుకు ఉంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. సాంకేతికతకు ఆకర్షించే గుణం ఉంటుంది కదా, స్వయానా నేను కూడా ఆ బాధితుడిని అయ్యాను కాబట్టి దాని గురించి ఒక అవగాహన వచ్చింది. దాని నుండి బయటపడటం అంత తేలిక కాదు... నేను అప్పుడు అందరిపై అరిచేవాడిని... ప్రత్యేకంగా క్లాస్ కూడా తీసుకునేవాడిని” అని తనలో అనుకున్నాడు.


ఎన్నడూ లేని విధంగా భర్త ఆప్యాయంగా మాట్లాడడంతో మురిసిపోయింది సీతారత్నం.

"హమ్మయ్య! మనిషిలో ఏదో కాస్త మార్పు వచ్చింది," అని ఊపిరి పీల్చుకుంది సీతారత్నం.


అక్కడికి రెండు రోజుల తర్వాత ఇతర రాష్ట్రంలో ఉన్న కొడుకు చేతన్ ఇంటికి వచ్చాడు.


తల్లిదండ్రులు మురిసిపోయారు... తండ్రి మునుపటిలా కాకుండా ఆప్యాయంగా మాట్లాడడంతో, తండ్రిని చూసి, “ఏంటి నాన్న, ఇప్పుడు మీరు చాలా మారిపోయారు” అని అడిగాడు చేతన్.


“ఈ రోజులతో పాటు అప్డేట్ కావాలని అర్థమైందిరా.”


“మీ మార్పుకు కారణం ఆ యంత్రుడు కదా?.”


“అవును! దాని సంగతి నీకు ఎలా తెలుసు?”


“అది నేను తయారు చేసిన మరమనిషి నాన్న! మోక్షజ్ఞ నా స్నేహితుడు. అతడి ద్వారా యంత్రుడిని మీ దగ్గరకు చేరేలా చేశాను. మీరు చేసిన ప్రతీ చర్య ఆ మరమనిషి ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి చాలా నవ్వుకున్నాను. చివరికి నేను అనుకున్నట్టుగా మీలో మార్పుకి ఆ యంత్రుడు ద్వారా శ్రీకారం చుట్టాను. ఇలా నా ఆవిష్కరణ ఉపయోగపడింది” అని నవ్వుతూ చెప్పాడు చేతన్. క్షణం స్తబ్దుగా ఉండిపోయాడు వీరభద్రం. ఇంతలో చేతన్ వెనుక నుండి ముందు వచ్చాడు యంత్రుడు.


యంత్రుడిని చూసి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ, “సాంకేతికతను సరైన మార్గంలో ఉపయోగిస్తే ఎలాంటి మార్పులు వస్తాయో నీ ఆవిష్కరణ ద్వారా, నా అనుభవం ద్వారా నిరూపితమైంది. ఇన్నాళ్ళు నా మొండితనంతో మిమ్మల్ని దూరం పెట్టాను. నా మాటే నెగ్గాలని మొండిపట్టు పట్టాను. ఇకమీదట అలా జరగనివ్వను. కుటుంబం విలువ ఏమిటో అర్థమయింది. ఇదంతా ఈ యంత్రం కారణంగా జరిగింది కాబట్టి ‘యంత్రాయ నమః’ అనక తప్పదు” అని అన్నాడు వీరభద్రం.


కుటుంబం అంతా ఒక్కదగ్గరకు చేరుకొని భళ్ళున నవ్వారు.



 ***సమాప్తం****


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Malla Karunya Kumar

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page