కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Amma Manassu' New Telugu Story Written By Neeraja Hari Prabhala
రచన….నీరజ హరి ప్రభల
అమ్మ ప్రేమకు అంతు లేదు.పిల్లల కోసం సర్వస్వాన్నీ ధార పోయడానికి వెనుకాడదు తల్లి.
అమ్మ మనస్సు ఔన్నత్యాన్ని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
బయటికి వెళ్ళి పనులు పూర్తి చేసుకుని, అప్పుడే ఇంటికి వచ్చి, చాలా అలసటగా ఉండటంతో కాసేపు కూర్చుంది సరళ.
" అమ్మా ! ఇదిగో కాఫీ !" అంటూ వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది చిన్నారి దీప. అది అందుకుని త్రాగుతూ గతంలోకి తొంగి చూసింది సరళ మనసు.
సరళ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, సహోద్యోగి రమణను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వాళ్ళ పెళ్ళి ఇరువైపుల పెద్దలకు ఇష్టం లేదు కనుక ధైర్యంగా ఇద్దరూ ముందుకడుగువేసి వేరుకాపురం పెట్టి క్రొత్త జీవితం మొదలు పెట్టారు. హాయిగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఒక బాబుకు తల్లి అయింది సరళ. వాడికి 'విజయ్' అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇద్దరూ బ్యాంకు లోన్లు తీసుకుని మంచి ఇల్లు కొనుక్కున్నారు.
పెద్దల పంతాలు, పట్టింపులు ఎక్కువకాలం ఉండవు కదా! విజయ్ పుట్టినాక ఇరుకుటుంబాలతో సన్నిహిత సంబంధాలు, రాకపోకలు కొనసాగాయి . రమణ, సరళలు ఇద్దరూ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం. పల్లెలో ఉంటున్న రమణ తల్లి తండ్రులు తమ ఊరు విడిచి వచ్చి కొడుకు, కోడలు వద్ద సంతోషంగా ఉంటున్నారు. విజయ్ ఆటపాటలు, ముద్దుముచ్చట్లతో రోజులు సాఫీగా గడుస్తున్నాయి. అప్పుడప్పుడు సరళ తల్లితండ్రులు వచ్చి వీళ్ళతో కాసేపు గడపడం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం పరిపాటి.
ఒక రోజున సరళ తండ్రి విశ్వేశ్వరయ్యకు గుండె జబ్బు వచ్చింది. విషయం తెలిసి ఆఘమేఘాలమీద సరళ, రమణ వెళ్ళి ఆయన్ని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ యధావిధిగా పూర్తిచేశాడు రమణ. తల్లి పద్మావతమ్మను ఒంటరిగా ఉండవద్దని ఆవిడను ఒప్పించి తమ వద్దకు తెచ్చుకుంది సరళ. వీళ్ల ఆదరణలో ఆవిడ తన బాధను కాస్త మరిచిపోయి నెమ్మదిగా కోలుకుంటోంది. విజయ్ అల్లరి, ఆటపాటలే అందుకు కారణం. విజయ్ స్కూలులో చేరి చక్కగా చదువుకుంటున్నాడు. వాడిని పెద్ద చదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలనే ఆశయంతో జాగ్రత్తగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు సరళా వాళ్ళు.
విజయ్ స్కూలు చదువు పూర్తి చేసుకుని కాలేజీలో చేరాడు. కాలక్రమంలో వృద్ధాప్యం కారణంగా ఒకళ్ల తర్వాత మరొకరు అన్నట్లుగా రెండేళ్ల వ్యవథిలో రమణ తల్లి తండ్రులు కాలంచేశారు. తదనంతర క్రియలను యధావిధిగా పూర్తి చేశాడు రమణ. రోజులు గడుస్తున్నాయి. విజయ్ ఇంజనీరింగ్ లో చేరాడు. అది పూర్తయ్యాక విదేశంలో ఎమ్మెస్ చేయాలన్న తన కోరిక దిశగా అడుగులు వేస్తూ చక్కగా చదువుకుంటున్నాడు. అతనిని చూసి సంతోషిస్తున్నారు రమణ దంపతులు.
ఒకరోజున బ్యాంకునుంచి ఇంటికి వస్తున్న రమణ స్కూటరును ఎదురుగా వస్తున్న కారు ఢికొనగా ఎవరో చూసి 108 యాంబులెన్సుకు, పోలీసులకు ఫోన్ చేసి చెప్పి రమణను హాస్పిటల్ లో చేర్చారు. పోలీసులు రమణ ఫోన్లో నెంబరు ఆధారంగా సరళకు ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ వివరాలు ఇచ్చారు. విషయం తెలిసి సరళా వాళ్ళు పరుగు పరుగున హాస్పిటల్ కు వచ్చి ఐసీయూలో ఉన్న రమణను చూసి చాలా బాధపడ్డారు. "వైద్యానికి ఎంత ఖర్చయినా పర్లేదు. దయచేసి నా భర్తను బ్రతికించండి " అని డాక్టర్లను వేడుకుంది సరళ. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. తలకు బాగా దెబ్బలు తగలడంతో వారంరోజులు మృత్యువుతో తీవ్రంగా పోరాడి రమణ ఈలోకాన్ని విడిచి వెళ్ళాడు.
జరిగిన దారుణానికి సరళ, విజయ్ లు విలవిలలాడారు. సరళకు ఒక్కసారిగా తన కాళ్ళ క్రింద భూమి కదిలిపోయినట్లైంది . నెమ్మదిగా తనకు తానే థైర్యాన్ని కూడదీసుకుని విజయ్ చేత మిగతా కార్యక్రమాలను పూర్తి చేయించింది . భర్త తాలూకు బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులను విజయ్ పై చదువులకోసం దాచింది. నెమ్మదిగా సరళ యధావిధిగా తన ఉద్యోగ విధి నిర్వహణలో పడింది. మరో రెండేళ్ల తర్వాత విజయ్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
విజయ్ భవిష్యత్తుకు ఏ ఆటంకాలు కలగకూడదని అతని కోరిక ప్రకారం అమెరికాలో ఎమ్మెస్ చదవటానికి ఒప్పుకుంది సరళ. విజయ్ దానికి తగిన పరీక్షలు వ్రాసి అక్కడ యూనివర్సిటీలో సీటు సంపాదించడం, వీసా, పాస్పోర్ట్ లు ఏర్పాట్లు చేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఆ రోజు విజయ్ అమెరికా ప్రయాణం. వాడికి కావలసినవన్నీ దగ్గరుండి సర్దిందే గానీ మనసు మనసులో లేదు సరళకు. వాడు పుట్టినాక ఇప్పటివరకూ ఏనాడూ ఒక్కరోజు కూడా తను వాడిని వదిలి ఉండలేదు. మరీ భర్త పోయినాక తన ప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకుంటూ బ్రతుకుతోంది. ఇప్పుడు వాడు దూరమవుతున్నాడని మనసులో బాధగా ఉన్నా పైకి గంభీరంగా ఉంది. విజయ్ ది కూడా ఆదే పరిస్థితి. కానీ విదేశాల్లో చదువు అనే కోరిక అతనికి సంతోషాన్నిస్తోంది. తగు జాగ్రత్తలు చెప్పి భారమైన హృదయంతో అతన్ని అమెరికాకు పంపింది సరళ. విజయ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. వీలు కుదిరినప్పుడల్లా తన చదువు, అక్కడి విశేషాలు చెబుతూ కబుర్లు...
కొన్ని నెలలకు వార్థక్యం కారణంగా సరళ తల్లి కన్నుమూసింది. ఇన్నాళ్లూ తనకు పెద్దదిక్కుగా ఉన్న తల్లి ఇప్పుడు తనను వీడి వెళ్ళిందనే బాధ సరళను కుంగదీసి, తను ఒంటరినయ్యాననే దిగులు ఎక్కువయ్యింది. బాంకులోని సహ ఉద్యోగస్తులు , విజయ్ ల ఓదార్పుతో కొన్నాళ్ళకు మామూలు మనిషయ్యింది. చూస్తూండగానే రెండేళ్ళు గడిచాయి. విజయ్ చదువు పూర్తయి కాన్వకేషను ఫంక్షన్ కు తల్లిని రమ్మని కోరడం, కొడుకుని చూడాలన్న ఆరాటం కలిగి అమెరికా వెళ్ళేందుకు వీసా ,పాస్పోర్ట్ ఏర్పాట్లు చేసుకుంది .రెండు నెలలు బాంకుకు శలవు పెట్టి అమెరికా వెళ్ళింది. ఎయిర్ పోర్టుకు విజయ్ వచ్చి తల్లిని తీసుకెళ్ళాడు. కొడుకుని చూసిన ఆనందం చెప్పనలవికాలేదు సరళకు. విజయ్ కాన్వకేషను ఫంక్షన్ బాగా జరిగింది. విజయ్ ఉద్యోగప్రయత్నాలు ఫలించి త్వరలోనే మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో సరళ మనసు ఉప్పొంగి పోయి మనసులోనే ఆ భగవంతుడికి క్రృతజ్ణతలను తెలుపుకుంది.
ఇంక 'విజయ్ కు మంచి పిల్లను చూసి పెళ్ళి చేస్తే తన బాధ్యత తీరుతుంది, తను నిశ్చింతగా ఉండవచ్చు ' అనుకుని అదే విషయమై అతని అభిప్రాయాన్ని తెలుసుకుందామని విజయ్ తో పెళ్ళి ప్రస్తావనను తెచ్చింది. అమెరికాలో తనతో పాటు ఎమ్మెస్ చేసిన రమ్య , తనూ ప్రేమించుకుంటున్నామనీ , నీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని నెమ్మదిగా తన మనసులోని మాట బయటపెట్టాడు విజయ్.
కొడుకు ఇష్ట ప్రకారమే చేయాలనుకుని రమ్య వివరాలను అడిగితే " అమ్మా! రమ్య చాలా మంచిపిల్ల. తనకు తల్లి చిన్నప్పుడే పోయింది, తండ్రే తనను కష్టపడి చదివించి అమెరికాకు పంపాడు. ఇటీవలే ఆయన కూడా చనిపోయాడు. ఇంక తనకు అన్నీ మనమే. మనము బాగా చూసుకోవాలి." అన్నాడు విజయ్. రమ్యను ఇంటికి తీసుకురమ్మని చెప్పగా విజయ్ ఆమెను తీసుకువచ్చి తల్లికి పరిచయం చేశాడు.
తొలి పరిచయంతోనే రమ్య మాటతీరు, కలుపుగోలుతనం సరళకు నచ్చింది. ఒక శుభముహూర్తాన వాళ్ళిద్దరికీ అక్కడే ఒక ఫంక్షన్ హాలులో వివాహం జరిపించి మనస్ఫూర్తిగా ఆ జంటను ఆశీర్వదించింది. వాళ్ల అన్యోన్యతను చూసి సంతోషిస్తూ రమ్యను కోడలిగా కాక కూతురిలా చూసుకుంది . సరళ ఇండియాకు తిరిగి వచ్చేరోజున వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి తన ఇంటికి తిరిగివచ్చి ఉద్యోగ బాధ్యతలలో నిమగ్నమైంది. తరచూ దేవాలయాలను, అనాధాశ్రమాలను సందర్శిస్తూ తనకు చేతనైనంత సాయమందిస్తోంది . ఆ పిల్లలను చూస్తూ వాళ్లతో గడుపుతూ ఆనందాన్ని పొందుతోంది.
ఎప్పటిలానే ఒక రోజున అనాధాశ్రమంలో 'దీప' అనే పిల్లను చూడగానే ఆ పిల్లను దత్తత తీసుకోవాలనిపించి ఆశ్రమ యజమానులను అడిగింది. వాళ్లు వాళ్ల రూల్స్ , ఫార్మాలిటీస్ అన్నీ చెప్పి ఏదైనా ఆస్తి దీప పేరున పెట్టి రిజిస్టర్ చేస్తేనే తనను దత్తతకు ఇస్తామన్నారు. ఆ సాయంత్రం సరళ విజయ్, రమ్యలకు ఫోన్ చేసి తన నిర్ణయాన్ని చెప్పింది. ' మన ఇంటిని దీప పేరున వ్రాస్తాను. అందుకు మీ ఇద్దరి అంగీకారం కావాలి ' అని కోరింది.
సరళ చేయబోయే మంచి పనికి విజయ్ , రమ్యలు సంతోషించారు. వాళ్లు మనస్ఫూర్తిగా తమ అంగీకారపత్రాన్ని వ్రాసి పంపారు. లాయర్ సలహాతో తన తదనంతరము ఇల్లు దీప పేరున దస్తావేజులను మార్చి విజయ్ వాళ్ళకు పంపి వాళ్ళిద్దరి సంతకాలను తీసుకుని రిజిస్టర్ చేయించి ఆశ్రమం వాళ్ళకు చూపించి చట్టరీత్యా దీపను దత్తతకు తీసుకుని ఇంటికి తెచ్చుకుంది. తన చేత 'అమ్మా' ఆని పిలిపించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమగా పెంచుకుంటోంది. దీపను స్కూలులో చేర్చింది. స్వతహాగా దీప మంచిపిల్ల. తెలివిగలదీ, చురుకైనదీ కనుక చక్కగా చదువుకుంటూ సరళకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఇప్పుడు దీపకు సరళే ప్రపంచం. విజయ్ ను, రమ్యను అన్నా, వదినలుగా పిలుస్తూ వాళ్ళిద్దరి ప్రేమానురాగాలను పొందుతోంది.
"అమ్మా! " అన్న పిలుపుతో త్రృళ్ళిపడింది సరళ. ఎదురుగా నవ్వుతూ దీప. "అమ్మా! కప్పు ఇటివ్వు. బాగా అలసటగా ఉన్నావు. నీవు గదిలోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా! " అంటూ ప్రేమగా చేయి అందించింది దీప. ఆ చేతిని అందుకుని లేచి ఆప్యాయంగా దీపను దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంది సరళ.
కాసేపాగాక తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ దీపను బాగా చదివించి తనకు ఉజ్వల భవిష్యత్తును, అందమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ తన కోరిక తీరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధించింది సరళ.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనసులోని మాట
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments