top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన---ఎపిసోడ్ 12


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 12' New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 12' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



జరిగిన కథ:


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.

తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.


తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది. భర్తతో తాను రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చదవమంటుంది మంగళ.


పవన్ కేస్ టేకప్ చేయబోతున్నట్లు అందులో రాసి ఉంటుంది మంగళ. పవన్ అరెస్ట్ కి కారణమైన శ్రీనిత్యను కలుస్తుంది.


మంగళకు సహకరిస్తానని శ్రీనిత్య చెబుతుంది.


మంగళను కలవడానికి అశ్వథ్ వస్తున్నట్లు చెబుతుంది భారతమ్మ.

మంగళ ఇంటికి వచ్చిన అశ్వథ్ జరిగిన విషయం చెప్పమంటాడు.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన---12 చదవండి.


ఈసారామె దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చెప్పనారంభించింది--“ఒక రోజు కాలేజీలోని అన్ని బ్లాకుల వాళ్లమూ ఎక్స్ కర్షన్ కని నల్లమల అడవుల ప్రాంతం వేపు వెళ్ళాం. మా టీము లీడర్-- మా సీనియర్ లెక్చరర్ కలసి రూపొందించిన ప్రణాళిక ప్రకారం-- ఒక అడ్వంచర్ గా తీసుకుని--- కాళ్ళు సలుపెక్కేంత వరకూ చుట్టుప్రక్కలంతా తిరిగొచ్చాం.


కొండలెక్కాం-- గుట్టలెక్కాం. చిన్నచిన్న కొండవా గుల్లో అరకొరగా మునిగి తడిసాం కూడాను. అటుపిమ్మట కొందరు గిరిజన మహిళలతో ఫోటోలు కూడా దిగి గెస్ట్ హౌస్ చేరాం. అలవాటు లేని తిరుగుడేమో చచ్చేంత రీతిన అలసి పోయాను. కాలు కదపడం మాట అటుంచి నోట మాట కూడా పెగలడం కష్టమని పించింది.


ఇక దొరికింది కతికి వెంటనే గదుల్లోకి వెళ్ళి పోవాలన్న యావతో గెస్ట్ హౌస్ వెనుక ఉన్న చావడిలో కూర్చుని అందరమూ కలసి భోజనాలు చేయ నారంభించాం. అప్పుడు జరిగిందది. కొందరు దుర్మార్గులు ఎన్నాళ్ళనుండి పచ్చపాముల్లా పొంచి ఉన్నారో, ఎన్నాళ్ళుగా నన్ను ఫాలో చేస్తున్నారో తెలియదు; నేను చేతులు కడుక్కుని వచ్చేటప్పటికి నా కోసం పెట్టిన పండ్ల రసంలో మత్తుగొల్పేదేదో కలిపారు.


నేనేమి బ్రహ్మజ్ఞానం గల మునికన్యను కాను కదా! అది మత్తు మందు కలిపిన పానీయమని తెలియకుండా అంతా తాగేసి ఆ తరవాత దొరికింది కతికి వాళ్లతో బాటు చేరి కాసేపు జోకులు వేసుకుని లేచి కాంతి సరిగ్గా ఆనని నడవలోకి వచ్చేటప్పటికి ముఖం తిరగనారంభించింది.


చూపు మసక బారనారింభించింది. నా కోసం మాటు వేసిన మేల్ స్టూడంట్సు కొందరు నన్ను ఫాలో చేస్తున్నారన్నది నాకు తెలియనే లేదు.


నేను గాలిలో తేలుతూ నేలపైన పడటానికీ---వాళ్లు నన్ను ప్రక్కనున్న పొదల్లోకి యెత్తుకుపోవడానకీ అట్టేసేపు లేదు. గిర్రున తిరుగుతూన్న బుర్రను రెండు చేతులతోనూ పట్టుకుని కన్నూ మిన్నూ తెలియని పరిస్థితిలో ఒరిగి పోతున్నప్పుడు-- తన గదివేపు నడచి అటు వెళ్లిపోతూన్న పవన్ కు కుమార్ అక్కడికి చేరుకుని నన్ను పొదవి పట్టుకుని లేవనెత్తాడు. అటుతరవాత యేమయిందో నాకు కొంచెం కూడా గుర్తుకు రాలేదు. అయితే పవన్ కుమార్ రూపం మాత్రం కనురెప్పలమధ్య చిక్కుకుపోయింది.


తెల్లారి కళ్లు విప్పి చూస్తే మసక వెలుతురులో గది అంతా గిర్రున తిరుగుతున్న ట్లనిపించింది. తల భారం ఇంకా తగ్గనట్లే ఉంది. అంటే ఆ ధూర్తులు నా కన్నెతనాన్ని దోచుకోవడానికి నా పండ్ల రసంలో కలిపింది మామూలు లిక్కర్ చుక్కలు కాదన్నమాట! ఇంకేదో తీక్షణమైనదేదో కలిపుంటారు. ఆ వేకువ మసక కాంతిలో నాకు అప్పుడు గాని గ్రాహ్యం కాలేదు-- నేను మరొకరి గదిలో ఉన్నానని.


తుళ్లిపడి లేచి తలుపులు బిగించిన గదిలో చిక్కుకున్న పిల్లి కూనలా--“హెల్ప్ మీ !హెల్ప్ మీ !” అని గట్టిగా అరిచాను.


అప్పుడు బైటనుంచి తలుపు తెరుచుకుంటూ లోపలకు వచ్చాడు పవన్ కుమార్. అతణ్ణి చూసి మరింతగా బెంబేలు పడిపోయాను.


నన్ను నేను ఎగాదిగా పరీక్షించుకుంటూ అడిగాను-- “ఏమైంది? నన్నెందుకు ఇక్కడకు తీసుకొచ్చి మీ రూములో పడేసారు? నన్నేమి చేయాలని నీ ఉద్దేశ్యం?“ ఏడుపుని దిగమ్రింగుకుంటూ అడిగాను.


“మా ఇద్దరు చెల్లెళ్ళ పైన ఒట్టుపెట్టి చెప్తున్నాను. అంతా మీ మంచికే! అయినా అలవాటు లేని పనులు చేయకూడదు మంగళాదేవీ! ఇక చెప్పాలంటే మీరు ఇటువంటి పనులు చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ”


అంటే--అన్నట్టు సూటి గా చూసాను.


”ఈ కాలేజీలో కొద్ది మందంటే నాకు గౌరవ భావం. వాళ్లలో మీరొకరు. యూ డిస్సప్పాయింటెడ్ మీ మంగళా! నిన్న సంధ్యావేళ దాటింతర్వాత మీరు తప్పతాగి ఉన్నారు. నేను గాని అప్పుడక్కడికి రాకపోతే మీ గతేమి కానో దేవుడే చెప్పాలి. మీగురించి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్న ఆ రౌడీ స్టూడెంట్సు గుంపుని తరిమికొట్టి-- తరిమి కొట్టడమేమిటి--హోరాహోరీగా పోరాడాను.


మీ కోసం నా గదిని షేర్ చేసుకుంటూన్న మరొకతణ్ణి మరొక ఫ్రెండు గదికి పింపించేసాను. మీరిప్పుడు నా ముందు నిక్షేపంగా ఉన్నారంటే మీ తల్లి దండ్రులు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడింది”.


దు:ఖం ఆపుకోలేక ఒక్క పెట్టున యేడ్చేసాను--“అయ్యో రామ! నేను అటువంటి తాగుబోతు ఆడదానిని కానండి పవన్ కుమార్! అక్కడ నాతో కలసి భోంచేసిన వాళ్ళే-- ముఖ్యంగా నా క్లాస్ మేట్లు ఎవరో అలా నా పండ్ల రసలో మత్తు పదార్థం కలిపి ఉంటారు. మా కుటుంబం చాలా మర్యాద గల కుటుంబం. నేను అల్ట్రామోడర్న్ అమ్మాయిని కాను. విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ అమ్మాయినీ కాను. నన్ను నమ్మండి”.


అప్పుడతడు కాసేపాగాడు. ఆలోచనలో మునిగిపోయి తేరుకుంటూ అన్నాడు--“ఇంకా నయం-- మీ తల్లి దండ్రులు చేసిన పుణ్య ఫలం-- మీరు సరాసరి నా గది దగ్గరగా వచ్చి నేల వాలారు. మరెక్కడైనా పడిఉంటే— ఏమయి ఉండేదో! ఎనీహౌ-- మీకేమీ జరగలేదు. జరగనివ్వలేదు. ”


కాని నేనింగా షాక్ నుండి పూర్తిగా తేరుకో లేకుండా బిర్రబిగిసి ఉండటం గమనించి నా దగ్గరకు వచ్చి అనునయంగా అన్నాడు-- “ఐ వన్స్ ఎగైన్ ప్రామిస్-- యూవార్ పెర్ ఫెక్ట్!”


అతడి మాటల్లోని సూటిదనం కళ్ళలో కనిపించిన నిజాయితీ నాకు ఊరటనిచ్చాయి. భరోసా ఇచ్చాయి. ఉన్నపాటున ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. కన్నీరు కారుస్తూనే అతణ్ణి సమీపించి అతడి చెంపల్ని నిమురుతూ నుదుట ముద్దుపెట్టుకోవడానికి ముంగాళ్ళపై నిల్చున్నాను.


అప్పుడతడు ఎదురు చూడనివిధంగా నన్ను దూరంగా నెట్టాడు--నెట్తూ అన్నాడు-- “వివుడ్ బి ఫ్రెండ్సు--- జస్ట్ గుడ్ ఫ్రెండ్సు. ఓ కే! దయచేసి మరీ ఎమోషనల్ అయిపోయి ఆలోచనల్ని చెదరగొట్టుకోకండి. అదే సమయంలో మరీ అప్ సెట్ అయిపోకండి. తెలిసో తెలియకో ఒక గుటక మ్రింగి ఉంటారు. అదే తలచుకుని రాత్రింబవళ్లు నిద్ర కోల్పోకండి.


మిమ్మల్ని మీరు హింసించుకోకండి. మీకు బైట ప్రపంచం గురించి అంతగా తెలియదు గాని-- మీరు ఓపారి దీపాలు పెట్టే వేళ దాటింతర్వతా అలా బేగం పేటి జంక్షన్ వద్దకో-- షాపర్సు స్టాప్ వద్దకో వెళ్ళి చూడండి-- ఎంతమంది అమ్మాయిలు-- మోడ్రన్ హౌస్ వైవ్స్ తో సహా రాత్రిపూట అదే సోమపానాన్ని పబ్బుల్లో క్లబ్బుల్లో పెగ్గు పెగ్గులు ఎలా తాగొస్తారో----- బ్రీత్ అనలైజర్లతో మొన్నపట్టుబడ్డ పదిమందిలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురు అమ్మాయిలు పట్టుపడ్డారు.


చెప్పడానికి నోరు రావడం లేదు గాని, వాళ్ళలో కొందరు నీలి హంగులతో విర్రవీగుతూ దర్శనమిస్తారు. అమ్మాయిలు కాబట్టి పెళ్ళికాని వయసు కాబట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేసారు. పోలీసులకు కూడా హృదయం ఉంటుందని నిరూపించుకున్నారు. అది వేరే విషయం. అందుకని అలవాటు లేని--”


అప్పుడు పవన్ కుమార్ ని ఆపుచేసాను--- చేతులు పట్టుకుని మొరపెట్టుకున్నాను--“ అయ్యోరామ! ప్లీజ్ ట్రై టు అండర్ స్టాండ్ పవన్. నేను తాగలేదు. అటువంటి అలవాటు మా యింటా వంటా లేదు. మా నాన్న నగరంలో పేరున్న లాయర్. మీ వంటి హృదయమున్న మనిషినే నమ్మించ లేకపోతే నా గతేమికాను చెప్పండి?”


“ఓకే! ఓకే! మీరు తాగలేదు. మీచేత తాగిపించారు. కాని నేను చెప్పొచ్చేదేమంటే మీ జాగ్రత్తలో మీరు యెప్పుడూ ఉండాలని. దీనిని ఒక గుణపాఠంగా తీసుకొమ్మని. మీరు-- అంటే మనం వెళ్ళే చోటల్లా సాధువులూ సత్పురుషులూ తారసపడరు. మనకు యెదురయేవన్నీ ఋషి పుంగవులుండే పర్ణశాలలు కావని----- పైకి కోరలు కనిపించని నరరూప రాక్షసులు కూడా ఉంటారనేది మనం గుర్తుంచుకోవాలి.

ఇక విషయానికి వద్దాం. మత్తుకొల్పోవన్నీ లిక్కర్ కానవసరం లేదు. లేడీస్ డ్రింక్స్ అనబడే జిన్నో బీరో కానవసరం లేదు. రంగూ రుచీ వాసనా లేని రోహిప్ నాల్, కేటామైన్ వంటి మత్తు పదార్థాలున్నాయి. వీటినీ యెక్కువగా అమాయక అమ్మాయిలపైన ప్రయోగిస్తారు. వీటిని తిన్న అమ్మాయిలు వెన్వెంటనే మత్తులో పడి మూర్ఛపోరు. కొద్ది సేపు ఓ విధమైన మైల్డ్ మత్తులో ఉంటారు. కాని— వాళ్ళకు వాళ్ళ మనసుపైన శరీరం పైనా అదుపు ఉండదు. ఈ పరిస్థితిలోనే విమన్ ట్రాఫికర్స్ అమ్మాయిల్ని వశపర్చు కుంటారు. రెడ్ లైట్ వాళ్ళకు అమ్మచూపుతారు. ఫ్లెష్ ట్రేడ్ లో దింపుతారు.


ఇక ఆఖరి విషయానికి వస్తున్నాను. మరీ ఆరబెడ్తే విషయం కనుమరుగయిపోతుందని నేను నా లెవల్ లో ఆరా తీసాను. మిమ్మల్ని ఆ సైన్స్ సెక్షన్ రోమియోలు రస్పూటిన్ లు ముగ్గురు ఫాలో చేసుంటారని తోస్తుంది. ఆ చిరు చీకట్లో దెబ్బలాడి పెనుగులాడాను గాని-- సరిగ్గా పోల్చుకోలేక పోయాను. మీపైన చాలా రోజులుగా కన్నేసి ఉంటారు. వాళ్లు చేసిన అడ్వాన్సుల్ని మీరు ఖాతరు చేసుండరు. ముగ్గురూ మోతుబరి కుటుంబాలకు చెందినవారే. వాళ్ల పేర్లు కూడా కనుక్కున్నాను-- విశ్వాస్-- కైలాస్- -కమల్→”


అప్పుడు మళ్ళీ అతణ్ణి ఆపాను--“అయ్యో రామ! వాళ్ళు అక్కడ మాతో లేనిదే! వాళ్ళు ఎప్పుడూ నాకు ఎదురెదురుగా వస్తుంటారని నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నిస్తుంటారని నాకు తెలుసు. కాని అక్కడ లేని వాళ్లపైన అపనిందలు వేయడం ఎందుకూ?”


“దీనినే తెలియని తనమంటారు. కనుమరుగున ఎక్కడో కూర్చుని మన మధ్య రిమూట్ కంట్రోలర్ తో బాంబులు పేల్చడం లేదూ! అటువంటి విష వలయమే ఇది కూడాను. ధన మదాంధులు. ఆడదాని సుఖం కోసం దేనికైనా తెగిస్తారు. బాధ్యతలు లేని సుఖాలు మరీ పసందుగా ఉంటాయిగా మరి.


ఇప్పుడు మీ విషయానికి వస్తున్నాను. మనం మరి కొద్ది గంటల్లోపల నల్లమల గెస్టు హౌసుని ఖాలీ చేయబోతున్నాం. మీరేమి చేస్తారంటే-- తిన్నగా మీ రూముకి వెళ్లి సేదతీర్చుకోండి. మీ స్నేహితురాండ్రు ఎవరైనా అడిగితే ఇంకెవరి గది లోనో బాతాఖానీ కొడ్తూ గడిపానని సబాళించుకోండి. నేను మాత్రం వాళ్ళను విడిచి పెట్టేది లేదు. ఈ రోజు మిమ్మల్ని-- రేపు మరొక అమ్మాయకురాలు-- అంతేకదూ! టెంపో తగ్గనివ్వకుండా నేను చెప్పినట్టు చేయండి” కసిగా పిడికిళ్ళు బిగించి ఊగిపోతూ అన్నాడు పవన్ కుమార్.


అన్నమాటను పవన్ నిలబెట్టుకున్నాడు.


నన్ను ఇరకాటంలో పెట్టి ఆ దుష్ట వ్యవహారంలో ఇరికించింది ఆ ముగ్గురు రోడ్ డెవిల్సే. కాని వాళ్లు తిన్నగా సీనులోకి రాకుండా వాళ్లతో ఎప్పుడూ పూసుకు తిరిగే సొనాలీ అనే అమ్మాయిని మా మధ్యకు పంపించి తతంగం జరిపించారు. వ్యవహారాన్ని ఆమూలాగ్రంగా బైటకు తీయడమే కాదు. మా కాలేజీ కంపౌండు చివరన ఉన్న స్క్రాప్ గోడౌన్ వద్దకు పిలిపించి నా ముందే ముగ్గురినీ చితకబాదాడు.


కైలాస్ అనే వాడికి ఎడం చేయి విరిగింది. వేరే దారి లేక ముగ్గురూ మా ఇద్దరి కాళ్లపైన పడి క్షమాపణ కోరారు. పోలిసు కేసు పెట్టకండని వేడుకున్నారు. అంతటితో నేనూ ఊరుకోలేదు. నేను కూడా సొనాలీని మా కాలేజీ హ్యాంగవుట్ ప్లేస్ కి పిలిపించి చాచి లెంపకాయ కొట్టాను, ఎలా కొట్టానంటే రెండు ముందు పళ్లు ఊడిపోయుంటాయి. అలా వాయించాను.


ఆ నలుగురు ధూర్తుల వల్ల నా ఆత్మాభిమానకే కాదు-- నా జీవితానికే ఆపద వాటిల్లింది. వాళ్లు గాని నా కాళ్లపైన పడి క్షమాపణ గాని కోరి ఉండకపోతే నేను జీవితాంతమూ శీలహననానికి లోనయి ఆత్మన్యూనతతో క్రుంగి కృశించి పోయేదానిని. ఏమో చెప్పలేను గాని, మెంటర్ టార్చర్ కి లోనయి స్వీసైడ్ కూడా చేసుకుని ఉండేదానినేమో----


ఇప్పుడు మీరే చెప్పండి. అటువంటి మనిషిని నేనెలా మరవగలను. అలా మరచిపోతే నేను మనిషిని ఎలా అవుతాను?”


మంగళ చెప్పడం ముగించి; ఇక మిగిలినదంతా అతడి చేతిలోనే ఉందన్నట్టు బరువుగా నిట్టూర్చింది. అరమోడ్పు కళ్లతో చుక్కలతెర కప్పుకుంటూన్న ఆకాశం వేపు చూస్తూండి పోయింది. ఇప్పుడామ మనసు విశాలమైన ఆకాశంలా ఉంది. తేటగా ఉంది.

అప్పుడు అశ్వథ్ కదలిక వచ్చిన మేఘంలా మంగళ వేపు తిరిగాడు-- “నువ్వతణ్ణి మనస్పూర్తిగా ప్రేమించావు. అవునా?”


“ప్రేమించడమే కాదు. అతణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కూడాను. తరవాత తెలుసుకున్నాను. అతడు కాలేజీ ఉన్నపాటున మానేసాడని-- అయిపు లేకుండా పోయాడని----“


అతడిక యేమీ అనలేదు. మంగళకు చేయి అందించి కారు వేపు నడిపించాడు.

ఆరోజు రాత్రి భార్యా భర్తలిద్దరూ ఒకే గదిలో పడుకున్నారు. ఒకే మంచాన పడుకున్నారు. కాని కలసి పడుకోలేదు. విడి విడిగా పడుకోవడానికి ఒకే మంచం ఎందుకూ?


దాంపత్యమనే ధర్మసూత్రమెందుకూ? రాత్రంతా ఇద్దరూ కళవల పడుతూనే ఉన్నారు.

ఐతే మరునాడు అలుక పలుకుల్నిప్రక్కన పెట్టి పవన్ కుమార్ కేసు విషయంలో తను అన్నాళ్లూ చేసిన ప్రయత్నాలన్నిటినీ వివరించింది. సాధించిన అంశాలన్నిటినీ అశ్వథ్ ముందుంచింది.


=======================================================================

ఇంకా వుంది..


=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



63 views0 comments
bottom of page