కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Bavi' New Telugu Story Written By Gorthi VaniSrinivas
రచన : గొర్తి వాణిశ్రీనివాస్
రెక్కలు వచ్చిన పక్షులు గూటిని అంటి పెట్టుకుని ఉండవు.
ఎగిరి వెళ్లిపోతాయి. తల్లి పక్షి కూడా కొన్ని రోజులకు వాటిని మరచిపోతుంది.
కానీ మనుషుల్లో అలా కాదు కదా.
పిల్లలు పెద్దవాళ్లయినా కన్నవాళ్లకు ఆ మమకారం తీరదు కదా...
ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ రచించిన ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
"నాన్నా! నాకు మళ్లీ మగపిల్లాడే పుట్టాడు" సంతోషంగా తండ్రితో చెప్పాడు రాఘవ.
'రెండో కాన్పులోనన్నా ఆడపిల్ల పుడితేబాగుండనుకున్నాను. ఏం చేస్తాం. అదృష్టంలేదు.. ...!" అన్నాడు సుధాకరం.
తండ్రి ధోరణే అంత అనుకుని అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు రాఘవ
ఇద్దరు మగపిల్లల్నీ అల్లారుముద్దుగా పెంచుతున్నాడు.
ఒకరోజు రాఘవ తండ్రి దగ్గరకు వచ్చాడు
"నాన్నా! నా కొడుకులు చదువుల్లో నాలా మొద్దులు కాదు.
చక్కగా చదువుకుంటున్నారు. అన్నీ ఫస్ట్ మార్కులే.
ఇక మన ఊళ్ళోచదువైపోయింది. సిటీకి పంపి హాస్టల్ లో పెట్టి చదివిస్తాను" అన్నాడు
"హాస్టల్ లో ఎందుకురా! ఇంటినుంచే పంపించక. ఆ పని చెయ్యకు నాన్నా. పిల్లల్ని
దూరంగా పెట్టకు. నువ్వుండలేవురా"అని కొడుక్కి హితబోధ చేసాడు సుధాకరం
"ఏం ఫర్వాలేదు నాన్నా.
పరాయిదేశం వెళ్లి పెద్ద చదువులు చదవాల్సినవాళ్ళు.వాళ్ళకి ఇప్పటినుంచే అలవాటు చెయ్యాలి. పక్షుల్ని చూడండి.
పిల్లలికి రెక్కలు వచ్చాక పక్కనే ఉంచుకోవు. పోయి స్వేచ్ఛగా బతకమంటాయి. మనమూ అలాగే ఉండాలి" అన్నాడు రాఘవ.
"అవి భావోద్వేగాలకు దూరం. మరి మనం?!
మనకి ఏ ఒక్కటి తక్కువైనా జీవితాంతం ఏడుపే మిగులుతుంది.
పులినిచూసి నక్క వాత పెట్టుకోకూడదురా ' అని సుధాకరం ఎంతచెప్పినా
రాఘవ వినిపించుకోలేదు.
"నాన్నా మనకున్న పదెకరాల పొలంలో ఒక ఎకరం అమ్మి ఇద్దరు పిల్లల్నీ చక్కగా చదివించుకుంటాను .రేపు వాళ్లే బోలెడు సంపాదిస్తారు. మనకి ఏలోటూ రాకుండా చూసుకుంటారు. ఏమంటారు నాన్నా" అన్నాడు రాఘవ
సుధాకరం నిట్టూర్చాడు.
స్కూల్ మాస్టర్ గా రిటైరై పదేళ్ళయింది.
ఎందరో విద్యార్థులకి చదువు చెప్పి ప్రయోజకుల్ని చేసిన తృప్తి ఉంది
జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం ఉంది
ఎన్నున్నా విధికి తలవంచితీరాలన్న తత్వం, లోకజ్ఞానం ఉన్న వ్యక్తిగా
"పిల్లల్ని పెంచే విధానం ఇదికాదురా అబ్బాయ్.
వాళ్ళని నీ చేతుల్తో నువ్వే దూరం చేసుకుంటున్నావ్. అర్ధం చేసుకో" అని ఎన్నో రకాలుగా కొడుక్కి నచ్చచెప్పాలని చూసాడు.
రాఘవ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు.
"సరే ! ఒక్క షరతు
మన పెరట్లో బావి తవ్వించు .
నువ్వు దానికి ఒప్పుకుంటే నేను దీనికి ఒప్పుకుంటా" అన్నాడు సుధాకరం
"దానికీ దీనికీ ఏంటి సంబంధం ఏంటి నాన్నా? మీరెప్పుడూ చాలా విచిత్రంగా మాట్లాడతారు." అన్నాడు
ముందు బావి తవ్వించి అప్పుడు పొలం అమ్మకానికి పెట్టమన్నాడు సుధాకరం
"పంచాయితీనీళ్లు పైపుల ద్వారా మనఇంట్లోకే వస్తున్నాయి.మనకి కొట్టుడు పంపు కూడా ఉంది ఇప్పుడు బావెందుకు నాన్నా డబ్బు దండగకాకపోతే" అన్నాడు రాఘవ.
"అసలు నువ్వు నామాట వినడం మానేశావు.
నేనేం చెప్పినా చేయట్లేదు. నీకసలు నేనంటే లెక్కలేదు. నీ భార్యా పిల్లలకి ఇచ్చినంత విలువ కూడా నాకివ్వట్లేదు. నేను బతకడం అనవసరం" అంటూ అలిగి కూర్చున్నాడు.
చిన్నపిల్లాడిలా మంకుపట్టు పట్టుకుకూర్చున్న తండ్రి వంక చూసాడు
బహుశా ఇవే ఆయన ఆఖరిరోజులు కావచ్చు
వృద్ధులు పిల్లలతో సమానమైపోతారుట
ఇప్పుడు బావితవ్వకపోతే ఆయన ఆఖరి కోరిక తీర్చలేకపోయాననే బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది.
కానీ ఇప్పుడు బావి తవ్వడం అంత తెలివితక్కువ పని ఇంకోటి లేదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి నన్నూ వాళ్ళతో తీసుకుపోతారు. అప్పుడు ఇక్కడివన్నీ అమ్ముకుని వాళ్ళతో వెళ్లిపోవలసిందే.
మధ్యలో ఈ బావులు తవ్వుకోడం, పూడికలు తీసుకోడం దేనికి.
చెబితే ఈయన వినరు అని లోలోపల గొణుక్కున్నాడు రాఘవ
గ్రామ సర్పంచితో చర్చించాడు.
సర్పంచి యువకుడు. పట్నంలో చదువుకుని
గ్రామానికి వచ్చాడు.
'సిటీలలో ఉన్న అపార్టుమెంట్లు ఫ్లోర్ కి అటొకటి ఇటొకటి ఉంటే
ప్లోర్ కి రెండే ఫ్లాట్స్ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు.
అటువంటిది గ్రామంలో బజారుకి రెండే ఇళ్ళు.
ప్రతి యింటివాళ్ళు పెరట్లో బావి తవ్వించుకోవడం పెద్ద విచిత్రం ఏమీ లేదు.
కానీ ఊరి మధ్యలో తవ్విస్తే అందరికీ ఉపయోగం . చందాలు వేసుకుని ఊరి మధ్యలో బావితవ్విద్దాం. ఎటుపోయి ఎటొచ్చినా వేసవికాలానికి అందరికీ పనికొస్తుంది " అన్నాడు సర్పంచ్
ఆ ప్రతిపాదనకు సుధాకరం ససేమిరా ఒప్పుకోలేదు.
" పొలం పత్రాలమీద నా సంతకం కావాలంటే మన పెరట్లోనే బావి తవ్వించాలి" అని తెగేసి చెప్పాడు.
చేసేదిలేక తండ్రి కోరిన ప్రకారం తన పెరట్లోనే గిలక బావి తవ్వించాడు రాఘవ.
రోజూ బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడుకుని స్నానం చేయడం,మొక్కలు నాటడం, నీళ్లు పారుదలకి బోదులు తవ్వడం ఆయన దినచర్యలోఒక భాగం అయిపోయింది.
ఎందుకునాన్నా మీకీవయసులో ఇంత శ్రమ
హాయిగా ఏసీ గదిలో పడుకుని టి వి చూడచ్చుగా అని రాఘవ ఎంతచెప్పినా
వినలేదు.
రాఘవ పిల్లలిద్దర్నీ ఎం ఎస్ చేయడానికి విదేశాలు పంపించాడు.
ఊళ్ళోవాళ్ళoతా రాఘవ కొడుకుల్ని ప్రయోజకుల్ని చేశాడని తెగ మెచ్చుకున్నారు.
తనలాగే తనకొడుకులు కూడా ఉన్న ఊళ్ళోనే కూర్చోకుండా ఉన్నత చదువులు చదవగలిగే తెలివితేటలు
కలిగి ఉన్నందుకు రాఘవ ఎంతగానో పొంగిపోయాడు.
"ఒక్క ఆడపిల్లని కనలేని బడుద్దాయివి. అసలు నువ్వు నాతో మాట్లాడకు. అవతలికిపో.." అంటూ తండ్రి విసుక్కున్నప్పుడల్లా రాఘవ నవ్వుకుంటాడు
పెరట్లో నాటిన మొక్కలు చెట్లయ్యాయి.
పక్షులకు విడిదయ్యాయి.
బావి మాత్రం బావురుమంది.
సుధాకరం తప్ప ఆ బావిలో నీళ్లు తోడేవాళ్ళు లేరు.
కాలం గడుస్తోంది
రాఘవ పిల్లలిద్దరికీ చదువులు పూర్తయ్యి అక్కడే ఉద్యోగాలు వచ్చాయి. రెండు చేతులా సంపాదిస్తున్నారు.
లక్షలకి లక్షలు తండ్రికి పంపుతున్నారు
వాటితో ఇల్లు కొందామని చూసాడు రాఘవ.
మనిల్లే చాలా పెద్దది ఇంతిల్లు ఉంచుకుని ఇంకా ఇల్లు కొనడం దేనికి అంది రాఘవ భార్య.
అవునుకదా! ఎనిమిదొందల గజాల్లో ఇల్లుంచుకుని మళ్లీ ఇల్లు దేనికి
పోనీ పొలాలు కొందామా అన్నాడు
ఇప్పుడే వ్యవసాయం చేయడం మీకు కష్టమైపోతోంది. మనకున్న ఎకరాలు చాలకనా! మళ్లీ పొలం కొనడం దేనికండీ
అంది
ఒకపని చేద్దాం. ఆ డబ్బుతో బంగారం కొందాం. దానికి ట్యాక్సులు కట్టక్కర్లేదు.
ఎంతైనా కొని కుదువపెట్టుకోవచ్చు
అన్నాడు రాఘవ.
' బంగారాన్ని విదేశాలకు తీసుకురకూడదు నాన్నా!
మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు దాన్ని ఏం చేస్తారు. మళ్లీ అమ్ముకుని అకౌంట్ లో మార్పించుకోవడం అదంతా పెద్ద తలనొప్పి.'
అన్నారు రాఘవ పిల్లలు.
మామిడితోటల అయివేజు, పొలాల పంట డబ్బులతో రెండు తరాలు కూర్చుని తినొచ్చు.
ఇవే అమ్ముకుని పట్టుకుపోలేనపుడు
మీ డబ్బు మేమేం చేసుకుంటాం నాయనా.ఇక డబ్బు పంపకండి' అన్నాడు రాఘవ పిల్లలతో.
వాళ్ళ మాటలకి సుధాకరం పగలబడి నవ్వాడు. ఇదేరా వాస్తవం..ఇంకా ముందుంది ముసళ్ళపండగ అన్నాడు
తండ్రి మాటలు రాఘవకి అర్ధం కాలేదు.
కొద్దికాలానికి సుధాకరం కన్నుమూసాడు.
తల్లిదండ్రుల్ని తమతో అమెరికా రమ్మన్నారు
పిల్లలు.
అన్నీ ఎక్కడొక్కడ వదిలేసి ఎలా వస్తాం ఇప్పుడు కాదులే అన్నాడు రాఘవ
తండ్రి జ్ఞాపకాలకు నిలయమైన బావి దగ్గరే ఎక్కువ సమయం గడపటం మొదలుపెట్టాడు రాఘవ.
బావిలోంచి నీళ్లు తోడి మొక్కలకు పొయ్యడం
పెరట్లో ఏదో ఒక పని చేస్తూ పొద్దుపుచ్చేవాడు.
బజారుకి ఒకటే ఇల్లు కావడం వల్ల ఎవరూ పెద్దగా పలకరించేవాళ్ళు లేరు. ఆ వీధిలోకి రావాల్సిన అవసరం కూడా పెద్దగా ఎవరికీ లేదు.
ఎవరింట్లో వాళ్లే తలుపులేసుకుని వుండే రోజులు.
తండ్రి కాలం చేశాక రాఘవలో ఉత్సాహం కొరవడింది.
మేమిద్దరం ఇక్కడేంచేస్తాం,మీదగ్గరకి వచ్చేస్తాం అన్నాడు రాఘవ
' నాన్నా!అమెరికాలో మంచు వర్షాలు పడుతున్నాయి. మీరీవయసులో అంత చలికి తట్టుకోలేరు. చలి తగ్గాక మా దగ్గరకి వద్దురుగాని' అన్నారు పిల్లలు
ఋతువులెన్ని మారినా పిల్లలు రాలేదు. అక్కడికి తీసికెళ్లలేదు.
తండ్రిపోయాక ఒంటరిభావంతో కుంగిపోయాడు రాఘవ
మండువేసవి కాలం. ఆయేడు ఎన్నడూ లేనంత ఎండలు పేల్చేశాయి.
బోరు బావులన్నీ ఎండిపోయాయి.
ఊరివాళ్ళకి రాఘవ బావే శరణ్యమైంది.
బావిలో నీళ్లు తోడుకొని వెళ్ళేవాళ్ళతో
పెరడంతా సందడిగా మారింది.
తిన్నావా అని అజ కనుక్కునేందుకు
పదిమంది వస్తున్నారు.
ఆడపిల్లలు ఉంటే పుట్టింటి ఆశతో వచ్చిపోతుండేవారు.
ఇక ఎప్పటికీ విదేశాలకు వెళ్లే పనిలేదు.
ఊరివాళ్లే బంధుగణం.
ఊరందరినీ కాపు కాస్తోంది ఆ బావి
రాఘవ మంచి చెడులను చూసుకుంటోంది
ఆ ఊరివాళ్లే.
దూరంగా వెళ్ళిపోయిన పిల్లలతో తను వెళ్లలేడని,వాళ్ళు ఇక్కడికి రాలేరని ముందే ఊహించి
ఇరుగుపొరుగువాళ్ళని బంధువుల్ని చేసిన
నాన్న ముందుచూపును తల్చుకుంటూ
బావికి మొక్కాడు రాఘవ.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
విశాఖపట్నం.
భర్త : గొర్తి శ్రీనివాస్ గారు
ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు
గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ
కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి
తొంగి చూస్తాయి నా రచనలు.
హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.
కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.
సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.
vani gorthy • 3 hours ago
ధన్యవాదాలు మేడం🙏
Sarada K • 4 hours ago
వాణి గారు కథ బాగుంది... చదివిన విధానం బాగుంది 👌