top of page
Original.png

దయలేని దానం


ధనవంతుడి ఆర్భాటపు దానం, ఆపదలో సురేష్‌కు అండగా నిలిచిన సామాన్యుడి దయను చూపించే దయలేని దానం కథ చిత్రం.

Dayaleni Danam- Telugu Emotional Story | Penumaka Vasantha

దయలేని దానం - తెలుగు భావోద్వేగ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 17/08/2026


డబ్బుతో చేసే ప్రతి సహాయం దానం కాదు… ఆపదలో ఉన్న మనిషి అవసరాన్ని అర్థం చేసుకుని, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయమే నిజమైన దానం. ‘దయలేని దానం’ కథలో లక్ష్మీనారాయణ పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇచ్చే ధనవంతుడిగా కనిపిస్తాడు. కానీ తన దగ్గర పనిచేసే సురేష్ కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు మాత్రం సహాయం చేయడానికి వెనుకాడతాడు. అదే సమయంలో ఆర్థికంగా అతనికంటే చిన్నస్థాయిలో ఉన్న మరో వ్యక్తి సురేష్‌కు అండగా నిలుస్తాడు. దానం విలువ డబ్బులో కాదు… దాని వెనుక ఉన్న దయ, చిత్తశుద్ధిలో ఉందనే మానవీయ సందేశాన్ని ఈ కథ హృదయానికి హత్తుకునేలా చెబుతుంది.


లక్ష్మీనారాయణ కారులో ల్యాప్‌టాప్‌లో ఆ రోజు ఆఫీసులో చేయాల్సిన పనులు చూస్తుంటే… కారు సిగ్నల్స్ దగ్గర ఆగింది.


"ఛా! త్వరగా వెళ్లాలనుకున్న రోజే ఈ ట్రాఫిక్ జామ్. ఇప్పటికే ఆఫీసు మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ హైదరాబాద్‌లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎక్కడి నుంచి వస్తుందో ఈ ట్రాఫిక్ అంటూ…!" విసుక్కున్నాడు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన లక్ష్మీనారాయణ.

ఇంతలో "బాబు! ధర్మం చేయండి…!" అని కారు విండో మీద కొడుతున్న బిచ్చగాడిని చూసి విసుగ్గా ముఖం పెట్టాడు లక్ష్మీనారాయణ.


డ్రైవర్ సురేష్ జేబులో నుండి ఒక ఐదు రూపాయల కాయిన్ తీసి ఆ ముష్టివాడి బొచ్చెలో వేశాడు.


"నీలాంటి వాళ్లు ఉండబట్టే ఇలాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారు. అసలు బిచ్చం వేసి వాళ్లను ప్రోత్సహించినట్లు అవుతుంది" అని క్లాస్ పీకాడు డ్రైవర్‌కు లక్ష్మీనారాయణ.

ఆ రోజు ఈవెనింగ్ అనాథ శరణాలయం ఓపెనింగ్‌కు వెళ్లాడు లక్ష్మీనారాయణ. అక్కడ తనకు జాలి గుణం ఎక్కువని, ఎంతో డబ్బు ఇలాంటి వాటికి స్పాన్సర్ చేస్తానని లక్ష్మీనారాయణ చెప్తుంటే… విని డ్రైవర్ సురేష్ మనసులో నవ్వుకున్నాడు.


'తనకు ఎన్నాళ్ల నుంచో జీతం పెంచమని అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఇక్కడ మటుకు గొప్పలకు పోయి దానాలు! పొద్దున బిచ్చగాడికి రూపాయి వేయడానికి గంట క్లాస్ తీశాడు. ఈ డబ్బున్న వాళ్లకు ఎందుకో దేవుడు దయ అనేది పెట్టడు' అనుకున్నాడు బాధగా సురేష్.


కారులో కూర్చున్న తర్వాత సురేష్, "సార్! మీకు మంచిగా చేశారు సన్మానం వీళ్లు…!" అన్నాడు.


"అంత డబ్బు ఇస్తే చేయరా?" అన్నాడు లక్ష్మీనారాయణ. ఆ గొంతులో వ్యంగ్యం ధ్వనించింది.


"సర్! మా ఆవిడ హాస్పిటల్‌లో ఉంది. కొద్దిగా డబ్బు కావాలి."


"ఏంటి సురేష్! డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? కాసే చెట్లకు రాళ్లు అన్నట్లు అసలే విరాళాలు, వాటితో మాకు తడిసి మోపెడు అవుతుంటే… మళ్లీ ఇప్పుడు నీకు డబ్బు ఎక్కడిది? తర్వాత చూస్తాను."


'మీకు డబ్బులకు కొదవా సార్? ఎందుకు సార్ దయ లేకుండా చేసే దానాలు!' అనుకున్నాడు మనసులో సురేష్.


మరసటి రోజు సురేష్ డ్యూటీకి వెళ్లలేదు. లక్ష్మీనారాయణ కాల్ చేశాడు.

"ఏంటి సురేష్, రాలేదు?"


"నేను హాస్పిటల్‌లో ఉన్నాను సార్."


"చెప్పాను కదా నీకు నిన్న! లీవ్ పెట్టే ముందు చెప్పాలని తెలీదా?"


"మా ఆవిడకు సీరియస్‌గా ఉందంటే హాస్పిటల్‌కి వచ్చాను సార్. చెప్దామనేలోగా మీరే కాల్ చేశారు."


రెండు రోజుల తర్వాత నేను పనికి రావడం లేదని కాల్ చేశాడు సురేష్, లక్ష్మీనారాయణకు.


"అదేంటి? ఎందుకు?"


"నాకు వేరే చోట పని కుదిరింది సార్…!"


"అలా సడన్‌గా మానేస్తే ఎలా కుదురుతుంది?" కోపంగా అన్నాడు లక్ష్మీనారాయణ.


"నాకు డబ్బులు అవసరం. వేరే అతను సాయం చేశాడు. అతను మీ అంత ధనవంతుడు కాదు. కానీ, చిత్తశుద్ధితో నేను అడగగానే డబ్బు ఇచ్చాడు. అతను ఆస్తిలో చిన్న స్థాయి వాడైనా, అతని దయగల నీడలో మాలాంటి వాళ్లం బతుకుతాము సార్. అతనికి డ్రైవర్ అవసరం. నాకు అడగగానే సాయం చేసిన పుణ్యాత్ముడు. మీకు చిటికెలో ఎవరో ఒకరు దొరుకుతారు" అంటూ ఫోన్ కట్ చేశాడు సురేష్.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page