top of page
Original.png

ధర్మానికి మూలం దానగుణం

2 hours ago
7 min read

ధర్మానికి మూలం దానగుణం – సక్తుప్రస్థుడు, శిబి చక్రవర్తి, జంషెడ్జీ టాటా దాతృత్వం మరియు మానవతా విలువలను ప్రతిబింబించే చిత్రం

 

Dharmaniki Moolam Dhanagunam - Telugu Moral Article | R C Kumar

ధర్మానికి మూలం దానగుణం - తెలుగు నీతి వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 12/10/2026

“ధర్మానికి మూలం దానగుణం” అనే ఈ స్ఫూర్తిదాయక కథనంలో మహాభారతంలోని ధర్మరాజు, సక్తుప్రస్థుడు, శిబి చక్రవర్తి జీవితాల ద్వారా నిజమైన దాతృత్వం యొక్క విలువను తెలుసుకుందాం.


ధర్మానికి మూలం దానగుణం

ప్రకృతిలో సహజంగానే ఉంటుంది దానగుణం. నదులు తమ నీటిని తాము తాగవు, వృక్షాలు తమ పండ్లను తాము తినవు. అలాగే సజ్జనులు తమ సంపదను ఇతరుల మేలు కోసమే ఉపయోగిస్తారు. మనం కూడా అడపా దడపా అన్నదానాలు, ఇతర దానాలు చేసి గొప్ప పని చేసినట్లు ఫీలవుతూ ఉంటాము.


దానంలో గొప్పతనం అనేది వ్యక్తి ఇచ్చే వస్తువు పరిమాణాన్ని బట్టి కాదు; ఇవ్వడంలో ఉన్న త్యాగ భావన మరియు మంచి మనస్సును బట్టి ఉంటుంది.


తీసుకోవడంలో ఉండే సంతోషం కంటే, ఇతరులకు దానం చేయడంలోనే అనంతమైన మానసిక ఆనందం మరియు తృప్తి లభిస్తాయి. అర్హులైన వారికి — అంటే నిజంగా అవసరమున్న వారికి — చేసే దానమే ఉత్తమమైన దానం.


ధర్మరాజును మించిన దానగుణాలు:


మహాభారతంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, ఉపకథలు ఉంటాయి. ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ముఖ్యమైన అంశాలను మనకు నేర్పిస్తుంది.


ధర్మరాజు దానాలకు సంబంధించిన అలాంటి ఒక కథ ఉంది. ఆయన తన రాజ్యంలో ప్రతిరోజూ 500 మందికి దానం చేసేవాడు. అలా ఒకరోజు దానం చేస్తూ మనస్సులో ఇలా అనుకున్నాడు — "నేను రోజూ 500 మందికి దానం చేస్తున్నాను, నా అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు" అని.


దీన్ని తన దివ్యదృష్టితో కనిపెట్టిన కృష్ణుడు, "బావా! ఈ రోజు నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను" అని వెంటపెట్టుకుని ఒక రాజ్యానికి తీసుకువెళతాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ధర్మరాజుకు దాహం వేసింది. అప్పుడు ఆ రాజ్యంలోని ఒక ఇంటికి వెళ్లారు.


వారికి ఆ ఇంట్లోని గృహిణి ఒక బంగారు చెంబులో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు తాగి ధర్మరాజు ఆ చెంబును తిరిగి ఇస్తుండగా, ఆ గృహిణి అందుకు నిరాకరించి, "మా రాజ్యంలో ఒక వస్తువును ఎవరికైనా ఇస్తే తిరిగి దాన్ని తీసుకోరు. మా రాజ్యంలో అసలు పేదరికమే లేదు" అని చెప్పింది.


అంతటితో తిరిగి ప్రయాణం చేస్తూ ధర్మరాజు, "ఆహా! ఈ రాజ్యంలో పేదరికమే లేదంటే, ఈ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఎవరో చూడాలి" అనుకున్నాడు.


కృష్ణుడు "మనం అక్కడికే వెళ్తున్నాము" అని చెప్పి, ఆ రాజ్యానికి రాజైన బలి చక్రవర్తి వద్దకు ధర్మరాజును తీసుకెళ్లి పరిచయం చేశాడు.


ధర్మరాజు గురించి బలి చక్రవర్తికి చెబుతూ, "ఈ ధర్మరాజు తన రాజ్యంలో రోజూ 500 మందికి దానం చేస్తుంటాడు" అనగానే, బలి వెంటనే తన రెండు చెవులూ మూసుకున్నాడు.


ఇది చూసిన ధర్మరాజు ఆశ్చర్యంతో, "నేను చేసిన దానం గురించి చెబితే చెవులు మూసుకున్నాడేంటి?" అని తన మనస్సులో అనుకున్నాడు. ఇంతలో బలి, "ఇంక చాలు ఆపండి! ఇతను తన రాజ్యంలో రోజూ 500 మందికి దానం చేస్తున్నాడంటే, ఆ రాజ్యంలో జనాలు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతున్నది" అన్నాడు.


ధర్మరాజుకు తనను కృష్ణుడు ఎందుకు బలి చక్రవర్తి వద్దకు తీసుకువచ్చాడో అప్పుడు తెలిసింది.


తన వద్ద ఏమీ లేకపోయినా, తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని లేదా వస్తువులను ఇతరుల ఆకలి తీర్చడానికి లేదా సహాయం చేయడానికి పూర్తిగా త్యాగం చేసేవారే అసలైన గొప్ప దాత అని నిరూపించడానికి ధర్మరాజుకు సంబంధించిన మరో కథ ఏమిటంటే — కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన తర్వాత, యుద్ధంలో జరిగిన బంధువధకు పరిహారంగా యాగం చేయాలనుకుంటాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా రాజసూయ యాగం చేస్తాడు.


అందరికీ సంతృప్తి కలిగే విధంగా విశేషంగా దానాలు చేస్తాడు. వచ్చినవారంతా ధర్మరాజు దానగుణాన్ని ఎంతగానో పొగుడుతారు. ఇలా అందరూ ధర్మరాజు దానగుణాన్ని పొగుడుతున్న సమయంలో అక్కడికి ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది.


దాని శరీరం సగభాగం బంగారు వర్ణంతో మెరిసిపోతుంటుంది. ధర్మరాజు దానగుణం గురించి వాళ్ల మాటలు విన్న ఆ ముంగీస ఎగతాళిగా నవ్వుతుంది. అది చూసిన అక్కడ ఉన్న పెద్దలు ఆ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు.


అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకు కారణం చెబుతూ ఇలా అంటుంది: "మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానాలు చేశాడంటూ పొగుడుతున్నారు. కానీ, ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఇది సమానం కాదు" అంటుంది.


అలాంటూ తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలుపెడుతుంది: "ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు 'సక్తుప్రస్థుడు'. భార్య, కొడుకు, కోడలు అతని కుటుంబ సభ్యులు. పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజులపాటు భిక్ష దొరకదు.


ఐదు రోజులపాటు పస్తులున్నాక, ఒకరోజున ఒక శేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది. ఆ శేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికీ సమానంగా పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు దాన్ని తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలేస్తుందంటూ వస్తాడు. సక్తుప్రస్థుడు భక్తిశ్రద్ధలతో అతనిని గౌరవించి, తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు.


అది తిన్నా కూడా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురూ ఒకరొకరుగా తమ భాగాలను అతనికి ఇస్తారు.


అప్పుడు ఆ అతిథి తన కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్పి తన నిజరూపాన్ని చూపిస్తాడు. ఆ అతిథి మరెవరో కాదు... సక్తుప్రస్థుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన 'ధర్మదేవత'.


అతని అతిథి మర్యాదలకు, దానగుణానికి మహదానందాన్ని పొందిన ధర్మదేవత — జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు" అంటూ చెప్పడం ముగించింది ముంగీస.


"ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా? లేక ఆకలితో అలమటించే క్షణంలో కూడా దానగుణాన్ని విడిచిపెట్టని ఆ బ్రాహ్మణుడు గొప్పవాడా?" అని అడుగుతుంది.


"ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొర్లిన నా సగం శరీరభాగం స్వర్ణమయం అయిపోయింది. అప్పటి నుంచి మరో సగ భాగం స్వర్ణమయం అయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను... ఎవరూ కనిపించడంలేదు" అంటుంది ఆ ముంగీస.


శిబి చక్రవర్తి ఔదార్యం:


శిబి చక్రవర్తి గొప్ప దాత, దయాగుణం కల చక్రవర్తి. అతని ఔదార్యాన్ని, దానశీలతను తపస్వులు, ప్రజలందరూ పదే పదే ప్రశంసిస్తూ ఉంటారు.


ఈ వార్త ఇంద్రుడి వరకూ వెళ్లాయి. ఆ చక్రవర్తి ఔదార్యం, దానగుణం ఎలాంటిదో పరీక్షిద్దామనుకున్నాడు. యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వచ్చి వాలింది.


అది మనుష్యభాషలో, "మహారాజా! రక్షించు! నన్ను ఒక డేగ తరుముకొస్తోంది. నన్ను చంపి తినాలని చూస్తోంది. దాని బారి నుంచి నన్ను కాపాడు, నాకు ప్రాణభిక్ష పెట్టు" అని దీనంగా వేడుకుంది. శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, "నిన్ను కాపాడే బాధ్యత నాది.


నీకు ఎవరి నుంచీ ప్రమాదం రాదు" అని హామీ ఇచ్చాడు. పావురం మనస్సు కుదుటపడింది. అంతలో అక్కడికి వచ్చిన డేగను చూసి పావురం భయంతో వణికింది.


డేగ కూడా మానవభాషలో, "మహారాజా! ఈ పావురం నా ఆహారం. తప్పించుకుని వచ్చి మీ శరణుజొచ్చింది. దయచేసి దానిని నాకు వదలిపెట్టండి" అంది. పావురమూ, డేగా రెండూ మనుష్యభాషలో మాట్లాడటం రాజుగారికీ, సభలో ఉన్నవారికీ ఆశ్చర్యం వేసింది.


"ఈ పావురానికి నేను అభయమిచ్చాను. ఆడినమాట తప్పను. అయినా నీకు అంత పట్టుదల ఎందుకు? దీన్ని వదలి మరో ఆహారం వెతుక్కో" అన్నాడు శిబి చక్రవర్తి. "రాజా! నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు.


నేను ఆకలితో ఉన్నాను. ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. 'జీవో జీవస్య భోజనం' అనేది ప్రకృతి ధర్మం. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు.


నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను డేగలు తినడం సహజమే. ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను. కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి" అంది. డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు.


శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, "ఓ పక్షి రాజా! చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసినదానిలా ఉన్నావు. శరణన్నవారిని రక్షించడం రాజధర్మం. నీ ఆకలిబాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు. నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను, ఈ పావురాన్ని మాత్రం నీకు వదలిపెట్టను" అన్నాడు.   


"నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా?" అని గట్టిగా అడిగింది డేగ. "నిరభ్యంతరంగా!" "అలాగైతే రాజా! నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు" అంది డేగ. శిబి చక్రవర్తి నవ్వుతూ, "అలాగే! నీకు సంతోషం కలిగించడం కంటే నాకేం కావాలి?" అని అప్పటికప్పుడు ఒక కత్తి, త్రాసు తెప్పించాడు.


సభలోని వారందరూ నిశ్చేష్టులయ్యారు. శిబి చక్రవర్తి పదునైన కత్తిని తీసుకుని తన శరీరం నుంచి కొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కోసి వేశాడు. అప్పటికీ సరిపోలేదు. మరికొంత జోడించాడు.


ప్రయోజనం లేకపోయింది. రక్తం కారుతున్న ఆ దృశ్యాన్ని చూడలేక సభలోని వారంతా కళ్లు మూసుకున్నారు. ముఖంలో బాధను కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. ఫలితం లేకపోయింది.


రాజుగారి శరీరం రక్తం ఓడుతోంది. చివరకు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తానే వెళ్లి పళ్లెంలో కూర్చున్నాడు.   


అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు, అగ్ని. "రాజా! నీ దానగుణం నిరుపమానమైంది. నీవంటి ఉత్తముడు ఇంతవరకూ ఈ భూమిపైన పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది" అని ఆశీర్వదించి ఆయనకు మళ్లీ తేజోరూపాన్ని ప్రసాదించాడు.


జంషెడ్జీ టాటా దాతృత్వ విశేషాలు:


ఇక మన ఆధునిక యుగంలో టాటా గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడైన జంషెడ్జీ టాటా దాతృత్వం ఎలాంటిదో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆయన సాటిలేని దానగుణం ప్రపంచ చరిత్రలోనే అత్యంత విశిష్టమైనది. విరాళాలు ఇవ్వడంతో సరిపెట్టకుండా, సమాజాన్ని మార్చే దీర్ఘకాలిక వ్యవస్థల నిర్మాణమే ధ్యేయంగా ఆయన దాతృత్వం సాగింది.


సాధారణంగా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడాన్ని ధర్మం అంటారు, కానీ జంషెడ్జీ టాటా దేశాన్ని పారిశ్రామికంగా, విద్యాపరంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు తన సంపదను ధారపోశారు.


మొక్క నాటేటప్పుడు అది ఇచ్చే పండ్ల కోసమే కాకుండా, రాబోయే తరాలకు నీడను కూడా ఇవ్వాలనే సద్భావనతో జంషెడ్జీ టాటా దాతృత్వం సాగింది. అందుకే ఆయనను కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, ఆధునిక భారతదేశ నిర్మాతగా చరిత్ర స్మరించుకుంటుంది.


జాతి నిర్మాణంలో జంషెడ్జీ టాటా పాత్ర:


ఈ 'శతాబ్దపు ప్రపంచ దాతల జాబితా' ప్రకారం, గత 100 సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు ఇచ్చిన మహా దాతగా జంషెడ్జీ టాటా ప్రథమ స్థానంలో నిలిచారు.


ఆయన సమాజం కోసం ధారపోసిన సంపద విలువ సుమారు 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఆయన దాతృత్వం గురించి చెప్పాలంటే, దేశ నిర్మాణం కోసం ఆయన పోషించిన పాత్ర గురించి ముందుగా ప్రస్తావించాలి.


జంషెడ్జీ టాటా కేవలం పేదరిక నిర్మూలనకే పరిమితం కాకుండా, భారతదేశాన్ని పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.


అందుకోసం ఆయన విద్య, వైద్యం, పరిశోధన రంగాలకు పెద్దపీట వేశారు. బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అనే అత్యుత్తమ శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థను స్థాపించడానికి జంషెడ్జీ టాటా తన సొంత ఆస్తిలో సగానికి పైగా — అంటే రూ. 30 లక్షలు (ఆ కాలంలో అది భారీ మొత్తం) — కేటాయించారు.


టాటా ఎండోమెంట్ నిధి ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం విదేశీ విద్యా స్కాలర్‌షిప్ విధానాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఎందరో మేధావులు తయారై దేశ పురోగతికి తోడ్పడ్డారు.



మానవతావాద వ్యాపారవేత్త:


జంషెడ్జీ టాటా తన దాతృత్వాన్ని మరింత పటిష్టం చేయడానికి టాటా సన్స్ (టాటా గ్రూప్ మాతృ సంస్థ) లోని సుమారు 66% వాటాలను అనేక చారిటబుల్ ట్రస్టుల పేరిట కేటాయించారు.


దీనివల్ల టాటా కంపెనీలు సంపాదించే లాభాల్లో అత్యధిక భాగం నేరుగా ప్రజల సంక్షేమం, ఆసుపత్రుల నిర్మాణం, ఉచిత విద్య వంటి సేవా కార్యక్రమాలకే ఖర్చవుతుంది.


ఈ పద్ధతిని ఆయన 1892లోనే ప్రారంభించడం విశేషం. పారిశ్రామిక విప్లవ కాలంలో పాశ్చాత్య దేశాలలో కూడా లేని విధంగా, తన మిల్లుల్లో పనిచేసే కార్మికులకు వైద్య సదుపాయాలు, పెన్షన్ నిధులు, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.


ముంబై నగరంలో 1896లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ప్రజా ఆరోగ్యం మరియు వ్యాక్సినేషన్ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. నవ్‌సారిలో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని వ్యక్తిగత అవసరాలకు కాకుండా ప్రజల కోసం పబ్లిక్ పార్కుగా మార్చారు.


సంపద అనేది కేవలం కూడబెట్టడానికి కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడానికే అనే ఆదర్శాన్ని జంషెడ్జీ టాటా నిజం చేసి చూపించారు. అందుకే ఆయనను కేవలం 'భారత పారిశ్రామిక పితామహుడిగా' మాత్రమే కాకుండా, 'మానవతావాద వ్యాపారవేత్త' (Philanthropreneur) అని పిలుస్తారు.


కృష్ణార్పణమస్తు! 🙏



***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page