కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Jivitha Paramartham' Written By Lakshminageswara Rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
అతనొక గొప్ప చిత్రకారుడు,శిల్పి.
జమీందారు కోరినట్లు చిత్రం గియ్యడానికి సిద్ధపడ్డాడు.
విజయం సాధిస్తే అంతులేని ధనం.
లేకుంటే వంద కొరడా దెబ్బలు.
ఏం జరిగిందనేది ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు గారి కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో, అత్యంత ధనికుడు, భూస్వామి 'జమీందారు 'ప్రతాప్ రావు బహద్దూర్ గారు'.
తరతరాలు గా సంక్రమించిన వందల ఎకరాల పొలాలు, భవనాలు.. ఈ నాటికి కూడా ఆయన మకుటం లేని మహారాజులా, ఎక్కడికి వెళ్లినా అత్యంత గౌరవింపబడేవారు.
జమీందారు గారు ఒకరోజు అలా షికారుగా తన పొలాలను పరిశీలిస్తూ చుట్టుప్రక్కల గ్రామాలలో పర్యటిస్తూ ఉన్నారు. ఆ గ్రామాల ప్రజలు వంగి నమస్కారాలు చేస్తుంటే తను అభివాదం చేస్తూ సాగిపోయారు.
అలా, ఒక ఊళ్ళో తన తాత ముత్తాతల చిత్రపటాలు, శిలా విగ్రహాలు ఉండడం చూసి ఆనంద భరితులై, "ఆహా, ఎంత గౌరవం, " అనుకొంటూ ఒక నిర్ణయానికి వచ్చారు .
“నాకు కూడా అలా చిత్రపటం, శిల్పం చేయించుకోవాలని ఉంది. దానివల్ల నేను పోయిన తర్వాత కూడా నాకు ఆత్యంత గౌరవం కలుగుతుంది. కనుక అన్ని గ్రామాల్లో చాటింపు వేయించండి. నా చిత్రపటం, శిల్పం చేసినవారికి '20ఎకరాల మాగాణి భూమి, 10 లక్షల డబ్బు, ఒక ఇల్లు’ బహుమతి ఇస్తాను. ‘లేకపోతే 100 కొరడా దెబ్బలు తినాలి’ అని దండోరా వేయించండి" అని ఉత్తర్వులు జారీచేశారు.
ఆ ప్రకటన వినగానే ప్రముఖ చిత్రకారులు, శిల్పులు జమిందార్ గారి భవంతి కి వేంచేసారు. అత్యంత ఆశతో వచ్చిన కళాకారులను ఉద్దేశించి జమీందారు ప్రతాపరావు బహద్దూర్ గారు, “మీరందరు నా ప్రకటన వినే వుంటారు. మీకందరికీ తెలుసు నా అంగవైకల్యం! నాకు ఒక కన్ను, ఒక కాలు లేవు కనుక ఈ అంగ వైకల్యం కనపడకుండా నా చిత్రపటం, శిల్పం చెయ్యాలి. బహుమతి ప్రజాసమక్షంలో ఇస్తాను" అని ప్రకటించారు.
‘అరే, అదెలా సాధ్యం? జమీందారు గారికి మతిపోయింది, ఒక కాలు లేకుండా, ఒక కన్ను లేకుండా చిత్రపటం, శిల్పం ఎలా తయారు అవుతుంది, పోనీ వేస్తే బాగులేకపోతే 100 కొరడా దెబ్బలు పడతాయి, మనవల్ల కాదు అని ఒక్కొక్కరు మెల్లిగా ఏదో కారణం చెప్పి జారుకొంటున్నారు .
కానీ "జక్కన్న"అనే చిత్రకారుడు, శిల్పి ‘ఎలాగూ జీవితంలో అన్ని విధాలా నష్టపోయాను. చివరి అవకాశం ప్రయత్నించాలి, అనుకొని, "జమీందారు గారూ! నేను నా చివరి ప్రయత్నంగా పని మొదలు పెడతాను. నాకు వారం రోజులు సమయం, పని చేయడానికి కావలసిన సరంజామా ఇప్పించండి” అని అనగానే జమీందారుగారు అన్ని వసతులతో ఏర్పాట్లు చేయించారు.
మిగతా వాళ్ళందరూ ‘పాపం! జక్కన్న ప్రాణం వారం రోజుల్లో పోతుంది కొరడా దెబ్బలు తిని’ అని నవ్వుకొంటు వెళ్లిపోయారు.
'జక్కన్న' రెండు రోజులు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తన పని ఏకాగ్రతతో మొదలుపెట్టాడు, ఎంతో రహస్యంగా.
ఇక చివరి రోజు జక్కన్న, 'జమీందారుగారూ! రేపు నా చిత్రకళ, శిల్పకళా ప్రజా సమక్షంలో మీకు చూపిస్తాను, అన్ని ఏర్పాట్లు చెయ్యండి. మీకు నచ్చనట్లయితే అందరి ముందు 100 కొరడా దెబ్బలు తింటాను' అని అనగానే ఊరంతా దండోరా వేయించారు జమీందారుగారు.
సరిగ్గా 10 గంటలకు కిక్కిరిసిన ప్రజా సమక్షంలో జమిందార్ "ప్రతాప్ రావు బహద్దూర్ గారు" ఎంతో ఉత్సాహంతో వేంచేసారు.
'జక్కన్న' కూడా అదే ఉత్సాహంతో విజయమో, వీరస్వర్గమో అనుకొంటూ జమీందారుగారికి నమస్కరిస్తూ అందంగా అలంకరించబడిన స్టేజి మీద ఎత్హుగా పెట్టబడిన పెద్ద చిత్రపటం, శిల్పం దగ్గరకు తీసుకువచ్చాడు.
ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న సమయంలో జమీందారుగారు మొదటి ఎర్రటి పట్టు శాలువా కప్పి ఉన్న తాడుని లాగారు. చిత్రపటాన్ని చూస్తూ ఎంతో ఆశ్చర్యంగా ఆనందంతో జక్కన్నవైపు చూసారు.
ఇంకా శిల్పం ఉన్న పట్టు శాలువాని కూడా తీసి సంభ్రమాశ్చర్యాలతో, "జక్కన్నా! నువ్వు సాధించావు. నా చిత్రపటం, శిల్పం చాలా అందంగా చేసావు. ఇలాంటివి అన్ని ఊళ్లలో పెట్టించండి. నేను పోయిన తర్వాత కూడా తరతరాలు గుర్తుండిపోయేలా చేసావు" అన్నాడు. ప్రజలందరి కరతాళధ్వనులతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది.
ఇంతకీ అంత నచ్చిన అంశం ఏమిటంటే , జక్కన్న జమీందారు గారి అంగవైకల్యం కనపడనీయకుండా చిత్రం గీయడమే. జమీందారుగారు వేటకు వెళ్ళినప్పుడు తెల్లటి గుర్రం మీద కూర్చొని ఒక కుడి కాలు మాత్రమే కనపడేట్టు, లేని ఎడమకాలు రెండో ప్రక్క ఉన్నట్లు చిత్రించాడు.
ఒక చేత్తో విల్లు ఎక్కుపెట్టి పులిని వేటాడుతున్నట్లు, గురి కోసం లేని ఒక కన్ను మూసి ఉన్నట్లు.. మరో కంటితో గురి చూస్తున్నట్లు గీసిన చిత్రపటం గాని శిల్పంగాని ఎక్కడా జమీందారిగారి అంగవైకల్యం కనపడనీయకుండా ఆకర్షణీయంగా చిత్రపటం గీశాడు. అలాగే ఎంతో నైపుణ్యం తో శిల్పం చెక్కి, అందరిని ఆశ్చర్య చకితులను చేసాడు 'జక్కన్న'.
జమీందారుగారు ప్రజలందరి సమక్షంలో, "జక్కన్నా! నీ ప్రతిభకు, నీ కృషికి నేను 20 ఎకరాల మాగాణి భూమి, 10 లక్షల రొక్కం, ఒక భవనాన్ని నీకు ఇస్తున్నాను. అన్ని ప్రధాన నగరాలలో ఇలాగే తయారు చేసి పెట్టించు" అని జక్కన్నను మెచ్చుకున్నాడు.
హర్షద్వానాల మధ్య ఎంతో ఆనందంగా జక్కన్న నమస్కారాలు చేస్తూ తన కృతజ్ఞతలు చాటుకున్నాడు.
ఇందులో ఉన్న జీవిత పరమార్థం ఏమిటంటే "పరులలో ఉన్న తప్పులను, లోపాలను ఎత్తి చూపకుండా, అవమానించకుండా వారి జీవితాల్లో ఆనందం నింపడమే!"
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comentarios