top of page

కాళిదాసు కజ్జికాయలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Kalidasu Kajjikayalu' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి


అతని పేరు కాళిదాసు

కజ్జికాయలు చెయ్యడంలో ఫేమసు

స్వీట్లకంటే తీపి అతని మనసు.

ఈ తియ్యటి కథను ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు.

పెనుగొండలో మిఠాయి బండ్లు చాలా ఉన్నాయి. కామాక్షి గుడిదగ్గర రామారావు బండి,

గోంగూర తూము సెంటర్ దగ్గర చిన్నయ్య బండి, మినర్వా రోడ్ లో గంగరాజు బండి

ప్రజల నోళ్ళు తీపి చేస్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళ అందరి దగ్గర ఒకటే రకం

సరుకులు ఉంటాయి. బెల్లం మిఠాయి ఉండలు, పంచదార కొమ్ములు, బెల్లం గవ్వలు,

గట్టి పకోడీ, మెత్తని పకోడీ, కారప్పూస, కారబ్బూంది , మైసూరుపాకు, మడత కాజా.

అయితే ఇవన్నీ ఒకే సైజులో ఉండవు. ఒకో బండి దగ్గర ఒకోలా ఉంటాయి.

చిన్నయ్య బండి దగ్గర మిఠాయి ఉండ పెద్దది ఉంటె, మడత కాజా బక్క చిక్కిపోయి

ఉంటుంది. గంగరాజు బండి దగ్గర మైసూరు పాకు పెద్దది ఉంటె, మిఠాయి ఉండ

చిన్నదిగా ఉంటుంది. రామారావు బండి దగ్గర అన్నీ స్వీట్లు సమానంగా ఉంటాయి. అంటే అన్నీ పెద్దవిగా ఉంటాయని పరిగెత్తికెళితే బొక్క బోర్లా పడతారు. మడత కాజా,

ములక్కాడలా సన్నంగా ఉంటుంది. మిఠాయి ఉండ నిమ్మకాయలా ఉంటుంది.

మైసూరు పాకు రెండువేళ్ళ వెడల్పుగా కాకుండా, ముదురు బెండకాయలా సన్నగానే

ఉంటుంది.

“ఏమయ్యా రామారావు, అందరూ మిఠాయి ఉండ పెద్దదిగా చేసి అమ్ముతున్నారు.

నువ్వు ఏమిటి మరీ గోలీ కాయల్లా చేసి అమ్ముతున్నావు?”అని అడిగితె తాపీగా నవ్వి “మా

ఆవిడకి మిఠాయి ఉండలు చేయడం రాదు. మా చిన్న అబ్బాయే మిఠాయి ఉండలు చేసి

అప్పుడు స్కూల్ కి వెళ్తాడు”అని చెప్తాడు. ఐదో తరగతి చదివే కిష్టిగాడి చెయ్యి ఎంత

వుంటుందో మనం ఊహించుకోవచ్చు.


నిజంగా రామా రావు వాళ్ళ ఆవిడకి ఉండలు చేయడం రాదా? లేక చిన్న ఉండలు చేసి

ఎక్కువ లాభం పొందాలని చూస్తున్నాడా?అన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నే.అయితే

రామారావు దగ్గర తీపి కారప్పూస మాత్రం స్పెషల్. సన్న కారప్పూస చేసి దాన్ని పంచదార పాకంలో వేసి తీస్తాడు. చిన్న పిల్లలు దాన్ని చాలా ఇష్టంగా తింటారు.


నిరంతరం ఏదో ఒకటి తింటూ స్వీట్ల రుచులు వర్ణించే సూరిబాబు కూడా పెనుగొండ సరుకు [మన్నించాలి. సరుకు అంటే మీరు ఏదో ఊహించుకుని మేఘాలలో తేలిపోవద్దు. సరుకు అంటే తినుబండారాలు, చిరుతిళ్ళు గా మాత్రమే అర్ధం చేసుకోవాలి] తో విసిగిపోయి,

“మనూళ్ళో ఎవరైనా పెద్ద స్వీట్ షాప్ పెడతానంటే,చూడు. నేను పెట్టుబడి పెడతా”

అన్నాడు రాధాకృష్ణతో.

అతని మాటలకి రాధాకృష్ణ నవ్వి ఊరుకున్నాడు. ఎందుకంటే సూరి బాబు సంగతి రాధాకృష్ణ కి బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా సూరిబాబు ‘బకాసురుడి ఆకలి’ ముందు వాడు దివాళా తీయడం ఖాయం అన్నది కన్యకాపరమేశ్వరి గుడి వీధిలోని అందరకూ తెలుసు.

చిరుతిళ్ళ ప్రియులు అందరూ కొత్త రుచులకోసం తహ తహ లాడుతున్న తరుణంలో, గంగాధరం మాస్టారి అల్లుడు పెనుగొండలో రంగప్రవేశం చేసాడు. మాస్టారి అల్లుడు అమలాపురం లో ఒక స్వీట్ షాప్ లో ఉండేవాడు. అతడు అక్కినేని నాగేశ్వర రావు ‘ఫ్యాన్’. దత్తపుత్రుడు సినిమా రిలీజ్ రోజున, యజమానితో చెప్పకుండా ఉదయం ఆటకు వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం చేసి షాప్ కి వెళ్తే యజమాని ‘ఖయ్యి’మని కేకలేసాడు. పౌరుషం వచ్చి పని మానేసాడు. రెండు రోజులు పోయాకా కూతురు ఉత్తరం రాయడంతో గంగాధరం మాస్టారు అమలాపురం వచ్చి విషయం తెలుసుకుని, అల్లుడ్ని , కూతుర్నీ తీసుకుని పెనుగొండ వచ్చేశారు.


మాస్టారి అల్లుడు నాలుగు రోజులు ఊరంతా సర్వే చేసాడు. పెనుగొండ లోని అన్నీ స్వీట్ బండ్ల దగ్గర పదార్ధాలు కొని రుచి చూసాడు. ఒక అవగాహనకు వచ్చి మామగారితో “నేను స్వీట్ బండి వేస్తాను” అన్నాడు. గంగాధరం మాష్టారు ఎగిరి గంతువేసినంత పనిచేసారు. వెంటనే పాలకొల్లు వెళ్లి నాలుగు చక్రాల అద్దాల బండిని కొని తెచ్చారు. జోస్యుల వెంకన్న గారితో ముహూర్తం పెట్టించి అల్లుడితో స్వీట్ల వ్యాపారం మొదలు పెట్టించారు. రెండురోజులు స్కూల్ కి సెలవుపెట్టి అల్లుడి బండితో పాటు గంగాధరం మాస్టారు ఊరంతా తిరిగారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసి బండి నిండా తినుబండారాలు పెట్టుకుని బయల్దేరేవాడు దాసు. పూజార్ల వీధి నుండి కాలవగట్టుకు వచ్చి బండి నెమ్మదిగా తోసుకుంటూ వెళ్ళాడు. మల్లిపూడి వారి రైస్ మిల్లు దగ్గర ఆగగానే, కూలీలు వచ్చి స్వీట్ తిని బాగుందని మెచ్చుకుని, పకోడీలు, కారబ్బూంది కట్టించుకుని ఇంటికి పట్టుకువెళ్ళారు. ఒక పావుగంట గడిచాకా, మళ్ళీ బండి తోసుకుంటూ ముందుకు వెళ్ళగానే నిల్లా వారి రెండు ఫౌండ్రీ ల దగ్గర ఆగాడు దాసు. బండి చుట్టూ చేరిన వారికి ‘మా అల్లుడు’ అని పరిచయం చేసారు మాస్టారు.


అక్కడ ఒక గంట పట్టేది వాళ్ళ అందరికీ కావాల్సిన స్వీట్, హాటు కట్టి ఇచ్చేసరికి. ఆ తర్వాత పెద్ద వంతెన దగ్గర ఆగాడు దాసు. బస్సులు ఎక్కే వారు, దిగేవారు తమకి కావాల్సినవి కొనుక్కుని పట్టుకు వెళ్ళేరు దాసు బండి దగ్గర. అక్కడా ఒక గంట ఆగి తర్వాత తాడి వారి రైస్ మిల్లు దగ్గర ఆగాడు. బజారుకి వెళ్ళవలసిన పని లేకుండా,తమ దగ్గరకే స్వీట్ బండి రావడం వర్కర్లకు, గుమాస్తాలకు చాలా ఆనందం కలిగించింది వాళ్లకు కావాల్సినవి కొన్నుక్కున్నారు. అలా నెమ్మదిగా బేరాలు చూసుకుంటూ సాయంకాలం ఐదు గంటలకు మినర్వా టాకీసు దగ్గరకు చేరాడు దాసు. కొత్త స్వీట్ బండి, కొత్త మనిషి అక్కడి వాళ్ళని ఆకర్షించింది. ‘పోనీలే ఒకసారి కొందాం’ అని తినుబండారాలు రుచి చూసి ఆ రోజు నుండి అతని అభిమానులు అయిపోయారు.


ఎందుకంటే ఏ స్వీట్ తిన్నా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది.రుచి కూడా బాగుంది. లావుగా ఉండే కారబ్బూంది కాకుండా సన్నగా కర కర లాడుతున్న బూంది వారికి బాగా నచ్చింది.పైగా మధ్యలో వేరుసెనగ గుళ్ళు పంటికి తగులుతూ చాలా కమ్మగా ఉంది. మొదటి ఆట అయ్యేవరకూ ఉండి, ఆ తర్వాత బండి తోసుకుంటూ ఇంటికి వచ్చాడు దాసు. బండిలో మూడువంతుల సరుకు అమ్ముడైపోయింది.

******

వారం రోజులు గడిచేసరికి పెనుగొండలో’ కొత్త మిఠాయి బండి వచ్చిందంట, అబ్బో ఆ స్వీట్ల రుచే రుచి’ అన్న వార్త “జమున నర్సాపురం సినిమా షూటింగ్ కి వచ్చిందంట” అన్నంత ఘాటుగా ఘుప్పుమంది. చిరుతిండి ప్రియులు దాని గురించి ఆరా తీసారు.

గాంధీ ‘ఆ బండి ఎక్కడ బయలుదేరుతుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది, ఆ బండిలో ఏమేం సరుకులు ఉన్నాయి’ అన్న పూర్తి వివరాల్ని సూరిబాబు కి అందించాడు. అంతే. సాయంత్రానికి సూరిబాబు మినర్వా టాకీసు దగ్గర ప్రత్యక్ష్యం అయ్యాడు. దాసు బండి దగ్గర ఉన్న చెక్క స్టూల్ మీద కూర్చున్నాడు. గాంధి… సూరిబాబు గురించి గొప్పగా చెప్పాడు దాసుకి. దాసు చిరునవ్వు నవ్వి ఒక బాదుషా తీసి పేపర్లో పెట్టి ఇచ్చాడు. బాదుషా నోట్లో పెట్టుకోగానే సూరిబాబు ఆశ్చర్య పోయాడు. ‘ఆహా, ఏమి రుచి? రాజమండ్రి అప్సర హోటల్లో తిన్న స్వీట్ లా ఉందే?’అని మరో బాదుషా అడిగి మరీ తిన్నాడు. రెండు స్వీట్లు తిన్నాకా ‘బాగుందోయ్’ అన్నట్టు దాసు వంక చూసాడు. అప్పుడు కొద్దిగా సన్న కారబ్బూంది, రెండు గట్టిపకోడీలు పేపర్లో పెట్టి ఇచ్చాడు దాసు. కరివేపాకు ఘుమ ఘుమలతో,కొద్దిగా వెల్లుల్లి వాసనతో ఉన్న కారబ్బూంది నోట్లో వేసుకుని కర కర లాడిస్తూ తిన్న సూరిబాబు దాసుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

“శానా బాగున్నాయి నీ స్వీట్లు,హాట్లు. ఇన్నాళ్ళకు పెనుగొండలో వారికి ‘పంటి విందు’ చేయడానికి వచ్చావ్. ఇలాగే కానీయ్.టేస్ట్ మార్చకు” అని అరకేజీ స్వీట్, అరకేజీ సన్నకారబ్బూంది పార్సెల్ చేయించి పట్టుకెళ్ళాడు. వెళ్లేముందు గాంధీ, దాసుదగ్గరకు వచ్చి అతని చెవిలో నెమ్మదిగా’అన్నా, మా సూరిబాబే పెద్ద బి.బి.సి. రేపట్నుంచి నీ పేరు పెనుగొండ అంతా ఒకటే మోత అనుకో’ అన్నాడు. దాసు ఒక చిరునవ్వు నవ్వి రెండు స్వీట్లు పొట్లం కట్టి ఇచ్చాడు గాంధీకి. పొట్లాన్ని జేబులో పెట్టుకుని,సూరిబాబుని ఫాలో అయ్యాడు గాంధీ.


మరో వారం గడిచేసరికి జనం సాయంత్రం అయ్యేసరికి మినర్వా టాకీసు దగ్గర ఉండే దాసు మిఠాయి బండి దగ్గరకు, రాత్రివేళ బామ్మ చెప్పే కథలకోసం చేరే చిన్న పిల్లల్లా చేరడం మొదలుపెట్టారు. సినిమా చూస్తూ చిరుతిండి తినే అలవాటు ఉన్నవారు, ఇంటర్వెల్లో చిరుతిండి తినే వారు. ముందుగానే దాసు దగ్గర పొట్లాలు కట్టించుకుని పట్టుకెల్తున్నారు. జనం రద్దీ పెరగడంతో పొట్లాలు కట్టి ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక కుర్రాడిని పెట్టుకున్నాడు దాసు. సాయంత్రం వేళల్లో ఇంటి దగ్గరనుంచి ఎగస్ట్రా సరుకు తెప్పించి కస్టమర్లకు ఇస్తున్నాడు దాసు.


మార్టేరు,జగన్నాధపురం,ఏలేటిపాడు,కాకిలేరు,కంతేరు,కొఠాలపర్రు,దేవ గ్రామాల నుండి సినిమా చూడటానికి వచ్చేవారు దాసు స్వీట్లు రుచి చూసి ఇంటికి కూడా పట్టుకువేళ్ళేవారు. ఈ విధంగా పెనుగొండ చుట్టుపక్కల పది,పదిహేను గ్రామాలలో దాసు స్వీట్లు బాగా ప్రచారం పొందాయి.

******

ఏడాది తిరిగేసరికి దాసు వ్యాపారం పుంజుకుంది. ఇంటిదగ్గర స్వీట్ తయారు చేసే పనివాళ్ళు ఇద్దరు పెరిగారు. అమలాపురంలో తన మిత్రుడైన కృష్ణని పిలిపించి తన దగ్గరే పెట్టుకున్నాడు దాసు.


జహంగీర్ చెయ్యడంలో కృష్ణ చాలా దిట్ట. గంగాధరం మాస్టారు ఇంటికి నాలుగు ఇళ్ళ అవతలే మన సత్తిపండు బాచ్ ఉంది. వెంకన్న గారి దత్తుడు పేర్రాజు, కాపవరపు సుధాకర్, దీక్షితులు గారి మనవడు రామకృష్ణ. వీళ్ళు సెకండ్ షో సినిమాలు చూడటంలో ఆరితేరినవారు. మినర్వా టాకీసు లో వాళ్ళ అభిమాన నటుడు సినిమా వస్తే ఐదు, పది సార్లు కూడా చూస్తారు. అందరూ బెంచీ టికెట్లే. సినిమాకు వెళ్తే మధ్యలో తినడానికి చేగోడీలు,జంతికలు పట్టుకెళ్ళేవారు. అవి ఎల్లవేళలా దొరకవుగా.


అప్పుడు చలమయ్య కొట్టు దగ్గరనుంచి బఠానీలు లేదా వేయించిన గాంధి సెనగలు కొనుక్కుని పట్టుకెళ్ళి అవి తింటూ, జోకులు వేసుకుంటూ సినిమా చూసేవారు. ఐదు సార్లు చూసాకా, ఆరోసారి సినిమాకి వస్తే ఈ బాచ్ ని ఫ్రీగా పంపేవారు మేనేజర్ మల్లంపల్లి సుబ్రహ్మణ్యం గారు. ఆయన స్వాతంత్రసమర యోధులు. ఆ రోజు వీళ్ళకు ‘పండగే పండగ’ . మిగిలిన డబ్బులతో ఇంటర్వెల్ లో ఎక్కువుగా చిరుతిళ్ళు కొనుక్కుని తినేసేవారు. పోనీ ఆ డబ్బులు దాచుకుని, మర్నాడు పాలస్ లో ఇంకో సినిమా చూద్దామని పేర్రాజు అంటే,మిగతా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఏ రోజు లెక్క ఆ రోజు తెలిపోవాలనే వాడు సుధాకర్.


కృష్ణ వచ్చాకా డేరింగ్ అండ్ డేషింగ్ సినిమాలు ఊపు అందుకున్నట్టు, రెండేళ్లలో దాసు వ్యాపారం కోనసీమ కొబ్బరిచెట్టు చక చకా ఎదిగి నట్టు పై పైకి వెళ్ళిపోయింది. కారణం అతను ప్రవేశపెట్టిన ‘కజ్జికాయ’.సాధారణంగా కజ్జికాయల్ని కొబ్బరి నౌజు పెట్టి చేస్తారు. నోట్లోపెట్టి కొరకగానే కర కర లాడుతూ, కమ్మదనంతో కూడిన తీపిగా ఉంటుంది. కానీ దాసు ఒక కొత్తపద్ధతి అవలంబించాడు. గోధుమపిండితో చపాతీలా చేసి,మధ్యలో కొబ్బరినౌజు పెట్టి,అరచేయి సైజు లో ఉన్న చెక్క పెట్టెలో పెట్టి ,కావాల్సిన షేపు వచ్చాకా తీసి నూనెలో వేయిస్తాడు, కొద్దిసేపటి తర్వాత దానిని తీసి ,చల్లారాకా వేడి వేడి పంచదారపాకంలో ముంచి ఒక పెద్ద చట్రంతో తీసి పళ్ళెంలో వేస్తాడు. దీని వలన కజ్జికాయ చుట్టూ మొత్తం పంచదార పాకం అంటుకుని ఉంటుంది. మొత్తం కజ్జికాయ అంతా చాలా తీపిగా ఉంటుంది. తీపిని ఇష్టపడే వారికి దాసు చేసిన కజ్జికాయ చాలా నచ్చింది. ఒక కజ్జికాయ తిని, కొద్దిగా పకోడీలు గాని సన్న కారబ్బూంది గానీ తింటే మరలా మూడు గంటలవరకూ ఆకలనేదే ఉండదు.

మధ్యాహ్నం మూడు, నాలుగు గంటల నుండిసాయంకాలం ఆరు గంటలవరకూ కజ్జికాయ అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాకాలం మిఠాయి బండి తోసుకుని ఊరంతా తిరగడం ఇబ్బందిగా ఉండడంతో గాంధీబొమ్మల సెంటరులో ఒక షాప్ అద్దెకు తీసుకున్నాడు దాసు. సూరిబాబు దీనికి చాలా సంతోషించాడు.

“మంచిపని చేశావయ్యా దాసూ, ఎప్పుడు స్వీట్ కావాలన్నా, నువ్వు అప్పుడు వంతెన దగ్గర ఉన్నావా? రైస్ మిల్ దగ్గర ఉన్నావా?మినర్వా దగ్గర ఉన్నావా?అని వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు అంటావా చాలా హాయిగా ఉంది. గాంధీబొమ్మల సెంటర్ కి వస్తాం, మాకు కావాల్సినవి తీసుకుని వెళ్తాం” అని కితాబు ఇచ్చాడు. సూరిబాబు తన బంధువులు అందరికీ దాసు స్వీట్ బాగా అలవాటుచేసాడు.


వాళ్ళు పెనుగొండ వచ్చినప్పుడు దాసు స్వీట్లు పెట్టడమే కాదు, అతను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా దాసు కజ్జి కాయలు, సన్న కారబ్బూంది, వేరుసెనగ పకోడీ పట్టుకుని వెళ్ళేవాడు. అలా దాసు పేరు, దాసు స్వీట్లు వాడ వాడలా ప్రచారం అయ్యాయి.

*****

ఆదివారం వస్తే సత్తిపండు బాచ్ దాసు ‘వంటశాల’కు వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. కృష్ణ జహంగీరులు వెయ్యడం చాలా ఆసక్తిగా చూసేవారు. పెద్ద ఊకపొయ్యి మీద రెండు పెద్ద ఇనుప మూకుళ్ళలో నూనె కాగుతూ ఉంటె, ఒక దాంట్లో కృష్ణ జహంగీరులు వేసేవాడు. పెద్ద జేబురుమాలు అంత సైజులో మినపపిండి ఉంచి, నాలుగు పక్కలా మడిచి మూటలా చేసేవాడు.ఆ మూట చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కుతూ బూర్లు మూకుడులో పువ్వు ఆకారం వచ్చేటట్టు వేగంగా తిప్పేవాడు.


మూట కింద ఉన్న కన్నంలోంచి పిండి జాలువారుతూ మూకుడులో కృష్ణ ఎలా తిప్పితే అలా పడేది. అలా వేగంగా పది,పన్నెండు జహంగీరులు మూకుడులో వేయించి, తర్వాత వాటిని పంచదారపాకంలో ముంచేవాడు. ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు కాన్వాస్ మీద ఎంత వేగంగా ఒక చిత్రాన్ని గీస్తాడో, అంత వేగంగా కృష్ణ జహంగీరులు తయారుచెయ్యడం మిత్రబృందానికి ఆశ్చర్యం కలిగించేది.


“కృష్ణా, నువ్వు అసలు డ్రాయింగ్ మాష్టారు అయితే, చాలా మంచి డిజైన్లు గీసేవాడివి” అన్నాడు సత్తిపండు.


“ఊరుకోండి,సత్తిపండు గారూ, నేనేంటి? మాస్టార్ని ఏంటి?ఏదో పొట్ట పోసుకోవడం కోసం అమలాపురంలో ఇది నేర్చుకున్నాను”అన్నాడు కృష్ణ నవ్వుతూ.


అలా మాట్లాడుతూనే కృష్ణ వేగంగా మూకుడులో జహంగీరులు వేస్తున్నాడు. జహంగీరులు వేగేలోపు,రెండో మూకుడులో పకోడీలు వేస్తున్నాడు. కాసేపటికి ఎడమచేత్తో చట్రం తీసుకుని వేగిన జహంగీరుల్ని పంచదారపాకంలో ముంచుతున్నాడు. కుడిచేత్తో ఇంకో చట్రంతో మూకుడులో వేగిన పకోడీల్ని పెద్ద వెదురుబుట్టలో పెడుతున్నాడు. కృష్ణ అలా రెండు చేతులతో పని చేస్తుంటే సత్తిపండుకి ఒక్కసారి అర్జునుడు గుర్తుకు వచ్చాడు.


అర్జునుడు సవ్యసాచి అయితే మరి కృష్ణ కూడా సవ్యసాచే కదా, అని అనుకున్నాడు సత్తిపండు. వేడి వేడి జహంగీరు, వేడి వేడి పకోడీలు తిని దాసు భార్య ఇచ్చిన మంచినీళ్ళు తాగి వెళ్ళేవారు మిత్రబృందం. ఈలోగా పేర్రాజు, సినిమాల్లో రాజబాబు, పద్మనాభం ల హాస్యం మాటల్ని మిమిక్రీ చేసేవాడు. సత్తిపండు బృందం వచ్చినప్పుడల్లా దాసు వంట షెడ్ లో నవ్వులు పువ్వుల్లా విరబూసేవి.

*****

సత్తిపండు ఒక రోజు దాసు వంటషెడ్ కి వచ్చాడు. దాసు దగ్గర పనివాళ్ళు పెరగడం గమనించాడు. దాసు భార్య లక్ష్మి కజ్జికాయల్ని పెద్ద ప్లేటులో వరసగా సర్డుతోంది. కృష్ణ పకోడీలు వేస్తున్నాడు.


“ఏమండీ మాస్టారు ఎక్కడ పనిచేస్తున్నారు?”అడిగాడు కృష్ణ సత్తిపండుని.


“ఇరగవరం లో పనిచేస్తున్నాను. చాలా కాలం అయ్యిందిగా మిమ్మల్ని చూసి.అందుకే వచ్చాను. అవును కృష్ణా, నీకు జీతం ఎంత?”అడిగాడు సత్తిపండు.

“పనిలో కొత్తగా చేరినప్పుడు రోజుకి రెండు వందలు ఇచ్చేవారండి. అయిదేళ్ళ నుంచి రోజుకి మూడు వందలు ఇస్తున్నారండి” మూకుడులో వేగిన పకోడీల్ని వెదురుబుట్టలో వేస్తూ అన్నాడు కృష్ణ.


“లక్ష్మి గారూ, మీ పేరన బ్యాంకులో ఎంత వేసారు దాసు గారు?”అడిగాడు సత్తిపండు.

“ఆ, నా పేరున బ్యాంకు లో డబ్బులు వెయ్యడం కూడానా?ఈ మధ్యనే రెండు కాసులుపెట్టి నెక్లేస్స్ చేయించారు మీ దాసు గారు”అంది నిష్టూరంగా లక్ష్మి.


“ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణతో సమానంగా మీరూ పనిచేస్తున్నారుగా. మరి మీకు కూడా దాసుగారు రోజూ డబ్బులు ఇస్తే ఎంత వుంటుందో తెలుసా?”

సత్తిపండు ప్రశ్నకు తల అడ్డంగా ఊపింది లక్ష్మి.


“రోజుకి మూడువందలు అంటే నెలకు తొమ్మిదివేలు. సంవత్సరానికి ఒక లక్షా ఎనిమిదివేలు. అంటే ఐదు సంవత్సరాలకు, ఐదు లక్షల నలభైవేల రూపాయలు అన్నమాట”అన్నాడు లెక్కగట్టి సత్తిపండు. కజ్జికాయల్ని ప్లేట్ లో సద్డడం మానేసి, కళ్ళు పెద్దవిచేసి అతనికేసే చూస్తూ ఉండిపోయింది.

లక్ష్మి. కజ్జికాయలు బండిలో పెట్టడానికి వచ్చిన దాసు, సత్తిపండు చెప్పిన లెక్కలు విని

కంగారు పడ్డాడు.


“ఒరేయ్ కృష్ణా, సత్తిపండు మాస్టారికి కావలసినది ఇచ్చి పంపరా బాబూ, లేకపోతే

చాలా గొడవలు అయ్యేలా ఉన్నాయి” అన్నాడు దాసు.


“గొడవ ఏమిటి?సత్తిపండు గారు సరిగ్గా చెప్పారు. కృష్ణతో పాటు నేనూ సమానంగానే కష్టపడుతున్నాను. మరి నాకు కూడా నువ్వు డబ్బులు ఇస్తే లక్షలు ఉండును నా దగ్గర. నువ్వే చేసావు ఇదంతా. పట్టుమని పదివేలు కూడా లేవు నా దగ్గర” అంది నిష్టూరంగా లక్ష్మి.


దాసు,’ వెళ్లిపోవయ్యా మహానుభావా’అన్నట్టు సత్తిపండుకేసి సైగ చేస్తున్నాడు. అది లక్ష్మి

చూసింది.


“ఇదిగో చూడు. ఈరోజు నుంచి నాకు కూడా జీతం ఇవ్వాలి.నా డబ్బులు నేను బ్యాంకు లో వేసుకుంటాను.ఆ ఐదు లక్షలు కూడా తొందరలో నా పేరుమీద బ్యాంకు లో వెయ్యాలి”గట్టిగా చెప్పింది లక్ష్మి భర్తకు.


“ఇల్లు కట్టుకుని రెండేళ్ళు అయ్యింది.ఇప్పుడు అంత డబ్బు ఇవ్వడం కష్టం.రోజూ జీతం ఇస్తాన్లె”అన్నాడు దాసు.


“అదేం కుదరదు” ఖరా ఖండిగా అంది లక్ష్మి.


“నెమ్మదిగా అప్పుడో కొంత, అప్పుడో కొంత ఇస్తాన్లె”అని భార్యని బతిమాలాడు దాసు. అతని వాగ్దానానికి శాంతించింది లక్ష్మి. అప్పుడు కజ్జికాయలు ప్లేట్ నిండా సర్ది భర్తకు ఇచ్చింది.


ఆ ప్లేట్ పట్టుకుని బండి దగ్గరకు వెళ్ళాడు దాసు.


“సత్తిపండు గారూ, మంచి విషయం చెప్పి నాకు మేలు చేసారు. ఆయన మాటలు పట్టించుకోకండి ఇదిగో ఇవి తినండి”అని పేపర్ లో ఒక కజ్జికాయ,వేడి వేడి పకోడీలు పెట్టింది లక్ష్మి. ఆమె మంచినీళ్ళు తేవడానికి లోపలకు వెళ్ళగానే కృష్ణ నవ్వుతూ”మా అమ్మగారికి బాగా ఉపదేశం చేసారు”అన్నాడు.

“మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారండి, ఈ మధ్యన ఎవరూ కనిపించడం లేదు”అడిగాడు కృష్ణ.


“సుధాకర్ అగ్రికల్చరల్ బి.ఎస్.సి.చదివి బ్యాంకు లో ఆఫీసర్ గా చేస్తున్నాడు,పేర్రాజు రాజమండ్రి లో లెక్చరర్ గా చేస్తున్నాడు.రామకృష్ణ వాళ్ళ నాన్న గారి ఫ్యాక్టరిలోనే పనిచేస్తున్నాడు. ఇదిగో ఈ దసరా పండగకు అందరం కలవాలి” అన్నాడు కజ్జికాయ తింటూ.లక్ష్మి మంచినీళ్ళు తెచ్చి సత్తిపండుకి ఇచ్చి లోపలకు వెళ్ళింది. కాసేపు కృష్ణతో కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేసాడు సత్తిపండు.

“ఎక్కడికి వెళ్ళావ్? నీకోసం హరనాద్ వచ్చి వెళ్ళాడు”అన్నారు సత్తిపండు

నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు.


“వినాయక స్వీట్ దాసు ఇంటికి వెళ్లాను. దాసు వ్యాపారం చాలా బాగుంది

నాన్నా”అన్నాడు సత్తిపండు.


కొడుకు మాటలకు ఆయన చిన్నగా నవ్వారు. “దాసు అంటే పూర్వం దాసు కాదు.

సాయంత్రం అయితే అతని షాప్ ముందు ఖాళీ ఉండదు. నాలుగైదేళ్ళ నుంచి మషాలా బఠాని చేస్తున్నాడు. ఒక కజ్జికాయ తినడం, తర్వాత మషాలా బఠాని తినడం ఇప్పుడు గాంధీ బొమ్మల సెంటర్ లో పెద్ద ఫాషన్ అయిపోయింది. ఊళ్ళో మిగతా స్వీట్ షాప్ ల వాళ్ళు కూడా కజ్జికాయి,మషాలా బఠాని చేయడం మొదలుపెట్టారు కానీ దాసు చేసిన ‘టేస్ట్’ వాటికి రాలేదు. దాసు కజ్జికాయలు ఎంత పాపులర్ అయ్యాయంటే ‘ఏదైనా పని అవ్వాలంటే, దాసు కజ్జికాయలు ఒక ప్యాకెట్ ఇస్తే చాలు, ఆ పని పూర్తి అవుతుంది’ అన్నంతగా. ఏలూరు కలెక్టర్ ఆఫీస్ లో సూపర్నెంట్ కి,మన రామిరెడ్డి, దాసు కజ్జికాయలు ఒక కేజీ పట్టుకువెళ్లి ఇచ్చాడు. అతని పని సాయంత్రానికి పూర్తి అయ్యింది.

అంతే! ఆ రోజు నుంచి ఆఫీసుల్లో పని అవ్వాలంటే, వారికి ఇచ్చే ‘ఆమ్యామ్యా’ కంటే దాసు కజ్జికాయలె బాగా పనిచేస్తాయన్న నమ్మకం ఏర్పడిపోయింది.దాసు కజ్జికాయలు హైదరాబాద్,చెన్నై,బెంగుళూరు లే కాదు ఇప్పుడు దుబాయ్, అమెరికా కూడా వెళ్తున్నాయి తెలుసా?”అన్నారు ఆయన.


సత్తిపండు ఆయన మాటలకు ఆశ్చర్యపోయాడు. ఎండకు ఎండుతూ, వానకు

తడుస్తూ బండి తోసుకుంటూ వెళ్ళిఎంతో కష్టపడిన దాసు తనకు తెలుసు. కానీ ఇప్పుడు

ఎంత ఎదిగాడు! కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుందని నిరూపించాడు.

“ఒరేయ్, దాసు ఎంత పైకి వచ్చినా తన మూలాన్ని మరచిపోడు. ఎంతో

వినయంగా ఉంటాడు. నేను ఎప్పుడు అతని స్వీట్ షాప్ కి వెళ్ళినా చాలా ఆప్యాయంగా

మాట్లాడతాడు, నీ గురించి అడుగుతాడు.

స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజులలో అతని ఇల్లు పెళ్లి వారిల్లులా చాలా

సందడిగా ఉంటుంది. మన పెనుగొండ లో ఎనిమిది ప్రాధమిక పాటశాలలు, నాలుగు హై స్కూళ్ళు, రెండు కాలేజీలు ఉన్నాయిగా. అందరూ జెండా పండగకు అతని దగ్గరే మిఠాయి కొంటారు. అంతలా ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు. గంగాధర్ మాస్టారు వాళ్ళ అల్లుడ్ని పెనుగొండ తీసుకువచ్చి మంచిపని చేసారు” అన్నారు సుబ్రహ్మణ్యం గారు.


పండగలు అయ్యాకా ఇరగవరం వెళ్తూ రెండు కేజీల కజ్జికాయలు పట్టుకెళ్ళాడు సత్తిపండు తన తోటిఉద్యోగులకు ఇవ్వడానికి.

******

ఒక దశాబ్దం గడిచింది.గంగాధర్ మాస్టారు కాలం చేసారు. దాసు కొడుకులు చేతికి

అంది వచ్చారు.


స్వీట్ షాప్ దగ్గర పెద్దకొడుకు ఉంటున్నాడు. వంటశాలలో పనివాళ్ళని ఆజమాయిషీ

చేస్తూ ఉంటున్నాడు దాసు. అయినా రోజూ ఒక గంట షాప్ దగ్గరకు వెళ్లి వస్తున్నాడు.

కార్తీకమాసం భోజనాలకు, పెళ్లిళ్లకు దాసు దగ్గరే అందరూ స్వీట్లు పురమాయిస్తున్నారు.

దాసు మీద ప్రజలకు ఎంత నమ్మకం ఏర్పడిందంటే పెళ్ళికూతురు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇచ్చే ‘చలిమిడి’ కూడా దాసు దగ్గరే చేయిస్తున్నారు.


"దాసు చేయి మంచిదమ్మా, అతనిచేత చలిమిడి చేయించి అమ్మాయిని

పంపిస్తే అంతా మంచే జరుగుతుంది” అన్న ప్రగాఢవిశ్వాసం ప్రజల్లో బాగా నాటుకుంది.


సంక్రాంతి సెలవలకు వచ్చిన సత్తిపండు దాసు కొడుకుని కలిసి “మీ నాన్న షష్ఠి

పూర్తి చేయండి. కొడుకులుగా మీ బాధ్యత ఇది” అని చెప్పాడు.


ఎందుకంటే ఎల్.ఐ.సి. ఏజెంట్ వెంకటేశ్వర రావు చేత దాసు పేరు మీద ఎల్.ఐ.సి. చేయించినప్పుడు అతని పుట్టిన తేది తెలుసుకున్నాడు సత్తిపండు. దాసు కొడుకు ‘సరే’ నన్నాడు. లింగాల వీధి లోని రెడ్డి కళ్యాణ మండపంలోనే షష్ఠి పూర్తి ఫంక్షన్ ఏర్పాటు చేసారు.


సాయంత్రం ఏర్పాటుచేసిన సభలో సత్తిపండు మాట్లాడాడు.”మన పెనుగొండలో

అందరికీ మిత్రుడు వినాయక స్వీట్ దాసు. దాసు పూర్తిపేరు కాళిదాసు. ఒక మహా కవి పేరు తన కొడుకుకి పెట్టిన వారి నాన్న గారిని మనం అందరం అభినందించాలి. ఆ మహాకవి తన మధురమైన కవిత్వంతో సాహితీ ప్రియులు అందర్నీ అలరించారు. మరి ఈ కాళిదాసు కొన్ని వేలమందికి ‘మధురమైన’ తన చేతి వంటకాలతో ఆనందాన్ని కలిగించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం మన దాసుది. దాసు ఆయు

ఆరోగ్యాలతో జీవించాలని కోరుతున్నాను. విజయవాడ నుంచి వచ్చిన శేషగిరి దాసు

గురించి నాలుగు మాటలు మాట్లాడతారు” అని కూర్చున్నాడు.

శేషగిరి వేదిక మీదకు వచ్చి కాళిదాసు, లక్ష్మి పాదాలకు నమస్కరించాడు. అందరూ ఆశ్చర్యంగా అతనికేసి చూసారు.


“అందరికీ నమస్కారం. నేను విజయవాడ ఆంధ్రాబ్యాంకు లో ఆఫీసర్ గా

పనిచేస్తున్నాను. నాకు జన్మ నిచ్చిన తల్లితండ్రులు వెంకటరావు, నాగమణి అయితే

జీవితాన్నిచ్చిన వారు కాళిదాసు గారు వారి శ్రీమతి లక్ష్మి గారు. పదవతరగతి అయ్యాకా కాలేజీ లో చేరే స్తోమతులేక ఒక కిరాణా షాప్ లో పనిచేస్తున్న నన్ను చూసారు దాసు గారు. మర్నాడు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడి నన్ను కాలేజీలో చేరడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు”నువ్వు ఎంత వరకూ చదువుకున్నా నేను నీకు చదువు చెప్పిస్తాను”అని. కానీ ఎవరికీ ఈ విషయం చెప్పవద్దని మా వద్ద వాగ్దానం తీసుకున్నారు. దాసు గారు చేసిన సాయం వలనే నేను పి.జి. చేసి బ్యాంకు లో ఉద్యోగం సంపాదించుకోగలిగాను. నాలాగే మరి కొంత మందికి కూడా దాసు గారు సాయం చేసారని ఈ మధ్యనే తెలిసింది. ఆయన చేసిన ‘గుప్త దానం’ ఎవరికీ చెప్పవద్దన్నారు. కానీ ఆయన చేసిన మహోపకారం చెప్పకపొతే నేను మనిషినే గాను” భావోద్వేగంగా అన్నాడు శేషగిరి.


వెంటనే సభ అంతా చప్పట్లతో మారుమోగింది. తర్వాత ఇద్దరు,ముగ్గురు మాట్లాడారు. చివరగా దాసు మైకు దగ్గరకు వచ్చాడు.


“అందరికీ నా వినయపూర్వక నమస్కారాలు. నాకు జన్మ నిచ్చింది అమలాపురం.కానీ నాకు పరిపూర్ణ జీవితాన్నిచ్చింది ఈ పెనుగొండే. సత్తిపండు గారికి నాకు ఇరవై ఏళ్ళ పరిచయం. నా మీద అభిమానంతో ఆయన నా గురించి ఎక్కువగా చెప్పారు. నేను మామూలు మనిషిని.ఈ ఊరు బతకడానికి వచ్చినవాడిని. మీరు అందరూ నన్ను మీ వాడిగా భావించి నన్ను ఆదరించారు. మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఐదవతరగతి వరకే చదువుకున్నాను. పై చదువులు చదవాలంటే ఎంత ఇబ్బందో నాకు బాగా తెలుసు. అందుకే కొంతమందికి కొద్దిపాటి సాయం చేసాను. అంతే! నన్ను ఎప్పుడూ మీ వాడిగానే చూడండి. నా మీద అభిమానంతో ఇక్కడకు వచ్చిన మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అని తల వంచి రెండు చేతులతో నమస్కరించాడు దాసు.


సభ అనంతరం విందు ఆరగించి అందరూ ఇళ్ళకు వెళ్ళారు.


శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


97 views0 comments
bottom of page