మన మనిషి
- Malla Karunya Kumar

- 3 hours ago
- 6 min read
Telugu family emotional story, mother in law daughter in law story Telugu, emotional Telugu story, family bonding Telugu, Telugu moral story, relationship values Telugu, Suvarna story Telugu

Mana Manishi- Telugu Family Story | Malla Karunya Kumar
మన మనిషి - తెలుగు కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In manatelugukathalu.com On 27/05/2026
సహనం, ప్రేమ, కుటుంబ బాధ్యతలతో ఒక ఇంటిని తనదిగా భావించిన కోడలు సువర్ణ కథే “మన మనిషి”. అపార్థాలు, అహంకారం, డబ్బు ఆశల మధ్య నిజమైన మనసు ఎలా గుర్తింపుని పొందిందో ఈ కథ హృదయాన్ని హత్తుకునేలా చూపిస్తుంది. కుటుంబంలో ప్రేమ, అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేసే భావోద్వేగ కథ
"సువర్ణా!.. సువర్ణా!" అత్త గట్టి కేకతో, ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్న సువర్ణ ఉలిక్కిపడి, కాల్ ఆపు చేసి వేగంగా అత్త దగ్గరకు చేరుకుంది.
"ఏమిటి రావడానికి ఇంత సమయం అయ్యింది?"
"చిన్న ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను అత్తయ్యా!" సమాధానం ఇచ్చింది సువర్ణ.
నిట్టూర్చి, "ఎప్పుడూ ఉండే సంతే కదా! సర్లే, ఈమె మాకు దూరపు చుట్టం, నీకు వరసకు పిన్ని అవుతుంది." ఎదురుగా ఉన్న సీతమ్మను చూపిస్తూ పరిచయం చేసింది శాంతమ్మ.
నవ్వుతూ, "నమస్కారం పిన్ని గారు! బాగున్నారా?" కుశల ప్రశ్నలు వేసింది సువర్ణ.
"బాగున్నాను తల్లి, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు?"
"బోటిక్ నడుపుతుంటాను పిన్ని గారు."
"ఓహో అలాగా! మంచిది తల్లి." నవ్వుతూ అంది సీతమ్మ.
"సీతమ్మా! ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టు ఉన్నావు, చల్లని జ్యూస్ తెప్పిస్తాను." అని అంటూ, "ఇంకా చూస్తూ నిలబడ్డావు ఏమిటి? పోయి జ్యూస్ పట్టుకురా." అని కోడలు మీద పెత్తనం చెలాయించింది శాంతమ్మ.
"అలాగే అత్తయ్య." అని నిదానంగా సమాధానం ఇస్తూ అక్కడ నుండి వంటింటి లోపలికి వెళ్ళింది సువర్ణ.
"వదినా ! చూస్తుంటే కోడల్ని నీ కనుసన్నల్లో పెట్టినట్టు ఉన్నావు." ఆశ్చర్యంగా అంది సీతమ్మ.
"ఏమిటో అంతా నా ప్రారబ్దం!" నిట్టూర్చి, "అసలు ఈ పిల్ల కోడలుగా వద్దు అంటే మా ఆయన వినిపించుకుంటే కదా, స్నేహితుడు అంటూ, స్నేహితుడు కూతురు నా కోడలు కావాలని పట్టుబట్టి మరీ తీసుకువచ్చారు. ఇంకో సంబంధం అయి ఉంటే ఇదుగో ఈ ఇంటి కంటే పెద్ద ఇల్లే కొనేవాళ్ళం. పోనీ బాగానే చదువుకుంది, ఉద్యోగమా అంటే అదీ లేదు. ఇదుగో ఈ బొటిక్ గిటిక్ అని ఇలాంటి పనులు, ఎప్పుడూ అదే ధ్యాస. ముందు మా వాడు కూడా ఈమె మాటలకు తలూపేవాడు కాదు. ఏం మాయ చేసిందో ఇప్పుడు ఆమె తానా అంటే తందానా అంటున్నాడు." తల బాదుకుంటూ తన గోడు వినిపించింది శాంతమ్మ.
"పోనీలే వదినా, ఇంటి దగ్గర పని చేసుకుంటూ నీకు తోడుగా ఉంటుంది కదా, ఇంతకీ మీ రెండో అబ్బాయి ఏం చేస్తున్నాడు?"
"వాడు ఇప్పుడు సాఫ్ట్‌వేర్, మంచి కంపెనీలో ఉద్యోగం, బాగానే జీతం వస్తుంది! త్వరలోనే పెద్ద ఇల్లు కట్టబోతున్నాడు." శాంతమ్మ స్వరంలో గర్వం ప్రతిధ్వనిస్తుంది.
"మంచిది వదినా!" నవ్వుతూ అంది సీతమ్మ. ఇంతలో జ్యూస్ తీసుకువచ్చి సీతమ్మకి ఇచ్చి పక్కనే నిల్చుంది సువర్ణ. సువర్ణ వైపు చూసి, "ఇంకా ఇక్కడే ఉంటే వంట సంగతి ఎవరు చూస్తారు? వెళ్ళి ఆ సంగతి చూడు." గదమాయించింది శాంతమ్మ.
"సరే" అంటూ తల దించుకొని వెళ్ళిపోయింది సువర్ణ.
కొంత సమయం మాట్లాడి, "సరే వదినా! ఇప్పటికే నేను వచ్చి చాలా సమయం అయ్యింది. నేను వెళ్తాను." అని బయలుదేరడానికి సిద్ధమయ్యింది సీతమ్మ.
"సరే, ఈ సారి వచ్చినప్పుడు మా ఇంటిలో నాలుగు రోజులు ఉండాలి మరి." నవ్వుతూ అంది శాంతమ్మ.
"తప్పకుండా." అని చెప్తూ, కొంత సమయం ఆగి, "వదినా, చెప్తున్నాను అని తప్పుగా అనుకోకు. నీ పెద్ద చూస్తుంటే లక్షణమైన పిల్లలా ఉంది. నువ్వు అనవసరంగా ఆమె పట్ల కఠినంగా ఉంటున్నవేమో అని నాకు అనిపిస్తుంది. కాస్త పెద్ద మనస్సు చేసుకొని ఆలోచించు." సుతిమెత్తగా చెప్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
సీతమ్మ వెళ్లిపోయిన తర్వాత, "పోనీలే తెలిసిన మనిషి అని మర్యాద ఇస్తే, నాకే సలహా ఇస్తుందా? ఇంకెప్పుడూ ఈమెను ఇంటికి రానివ్వకూడదు." అని అంటూ మూతి తిప్పుకుంటూ అసహనంతో లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ.
******
మరుసటి రోజు ఏదో ఆలోచిస్తూ హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న చిన్న కొడుకు శ్రీధర్ దగ్గరకు చేరుకొని,
"నాన్న శ్రీ! అప్పుడెప్పుడో స్థలం కొన్నావు కదా, అదేరా.. పెద్ద ఇల్లు కడతాను అని కూడా అన్నావు.. ఎంత వరకు వచ్చింది ఆ పని? ఇంకా ఎన్నాళ్ళు రా ఈ ఇరుకు కొంపలో ఉండాలి?" నిట్టూర్చుతూ అంది.
"పెద్ద ఇల్లు కదా అమ్మ, కాస్త సమయం పడుతుంది." అని నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు.
ఇంతలో ఎవరో ద్వారం దగ్గర నిలబడి శ్రీధర్ ను పిలవడం మొదలు పెట్టారు. కంగారుగా సోఫా నుండి లేచి వెళ్ళి వాళ్ళతో కొంత సమయం మాట్లాడి, తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, "ఎవరు రా వాళ్ళు? ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నీ స్నేహితుల్లా కూడా కనిపించడం లేదు?" అడిగింది శాంతమ్మ.
"కొత్తగా పరిచయం అయ్యారు అమ్మ! ఏదో బిజినెస్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు." అని సమాధానం ఇచ్చాడు శ్రీధర్.
శ్రీధర్ వైపు చూస్తూ, 'ఎప్పుడూ వీడు ఇంతలా టెన్షన్ పడటం చూడలేదు. ఈరోజు ఎందుకు ఇలా ఉన్నాడు? పైగా వాళ్ళు కూడా శ్రీధర్ తో గట్టిగానే మాట్లాడారు.' అని లోలోపల అనుకుంటుండగా, ఇంతలో సువర్ణ శ్రీధర్ దగ్గరకు చేరుకొని, "శ్రీధర్! ఎవరు వాళ్ళు? నీతో అంత గట్టిగా మాట్లాడుతున్నారు? పైగా కోపంగా కూడా కనిపిస్తున్నారు?" ప్రశ్నలు సంధించింది సువర్ణ.
"అది, అది..." తడబడుతూ అన్నాడు శ్రీధర్.
"ఏయ్! నీకు వాడి విషయాలు ఎందుకు? అవి చూసుకోవడానికి నేను ఉన్నాను కదా? చనువు దొరికింది కదా అని ఏ విషయంలో పడితే ఆ విషయంలో తలదూర్చడానికి చూడకు. ముందు ఇక్కడ నుండి వెళ్ళు!" కసురుకుంది శాంతమ్మ.
"అది కాదు అత్తయ్య!."
"చెప్పాను కదా, వెళ్ళు!" గట్టిగా అరిచింది శాంతమ్మ.
శాంతమ్మ కోపంగా అరవడంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది సువర్ణ.
"చూడు శ్రీధర్! నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ఏ తప్పూ చేయవని నేను అనుకుంటున్నాను. ఇక మీదట ఇలాంటివి ఇంటి వరకు రాకూడదు." కాస్త అసహనంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది శాంతమ్మ.
*******
సాయంత్రం ఇంటికి చేరుకున్న అన్న విరాజ్ దగ్గరకు చేరుకున్నాడు శ్రీధర్.
"శ్రీధర్! ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏదైనా సమస్యా ?" అడిగాడు విరాజ్.
"అన్నయ్యా! ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా జాబ్ పోయింది అన్నయ్యా."
తమ్ముడు చెప్పింది విని ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు విరాజ్. "రేయ్! ఏమిటి రా నువ్వు చెప్తున్నది? జాబ్ పోవడం ఏమిటి? నమ్మలేకపోతున్నాను రా." తడబడుతూ అన్నాడు విరాజ్.
"మేనేజర్ తో గొడవ జరిగింది అన్నయ్యా. జాబ్ కి రిజైన్ చేసి వచ్చేసాను. ఇరవై రోజులు అయింది. నీకు తెలుసు కదా నేను ఒక స్థలం కొన్నాను అని, అది ఇన్స్టాల్ మెంట్ మీద కొన్నాను. ఇప్పుడు డబ్బులు అవసరం పడ్డాయి. కాస్త అడ్జస్ట్ చేయి అన్నయ్యా.” దీనంగా ముఖం పెడుతూ అడిగాడు.
"రేయ్ ఏం మాట్లాడుతున్నావు రా? అప్పుడు స్థలంకి డబ్బులు ఉన్నాయి అని చెప్పావు కదరా?"
"నిజమే కానీ అవి బెట్టింగ్ లో పోయాయి అన్నయ్యా!."
కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో, "రేయ్ నీకు బుద్ధుందా?" చేయి పైకెత్తుతూ ఆగి కోపాన్ని అణుచుకుంటూ, "ఎవర్రా ఇవన్నీ నీకు చేయమని చెప్పారు? ఏదైనా చేసే ముందు నాకు చెప్పాలి అని తెలియదా? ఐనా మేనేజర్ తో గొడవ పడాల్సిన అవసరం ఏముంది?" కోపంతో అరిచాడు విరాజ్.
"అన్నయ్యా! ఏదో కోపంలో అలా జరిగిపోయింది. ఇప్పుడు డబ్బు సహాయం చెయ్యి అన్న. లేకపోతే వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. ఇప్పటి వరకు నేను కట్టిన సొమ్ము వృధా అవుతుంది." ప్రాధేయపడుతూ అడిగాడు.
కొంత సమయం ఆలోచించి, "రేయ్ ఏం చేయాలో తెలియని పరిస్థితి రా నాది. ఏదోకటి చేస్తానులే. పో." తమ్ముడ్ని అక్కడ నుండి పంపించేసాడు.
మరుసటి రోజు ఉదయం శ్రీధర్ దగ్గరకు చేరుకొని, ముప్పై వేలు ఇస్తూ, "ఈసారికి మాత్రమే నేను సర్దగలను, ఈ లోపల నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకో. లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకున్న ఖర్చులు కూడా నీకు తెలుసు కదా." అని అంటూ తమ్ముడికి డబ్బులు ఇచ్చాడు. ఆ క్షణానికి రిలాక్స్ అవుతూ ఆ డబ్బుతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
సాయంత్రం సమయంలో ఇంటి బయట ఫోన్లో మాట్లాడుతూ ఉన్న శ్రీధర్ దగ్గరకు చేరుకుంది సువర్ణ. శ్రీధర్ ఆమెను చూసి పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. వెళ్తున్న శ్రీధర్ ను ఆపుతూ, "శ్రీధర్ నీతో కొంచెం మాట్లాడాలి." అని అంది.
"నాతో మాట్లాడడానికి ఏముంటుంది వదినా? ఐనా ఇప్పుడు నాకు పని ఉంది." అని వెళ్ళిపోబోయాడు.
"శ్రీధర్! కాస్త ఆగు... నీ ఉద్యోగం పోయింది అని తెలిసింది. నా ఫ్రెండ్ తో మాట్లాడాను. తన కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి అంట, ఒకసారి నువ్వు వెళ్ళు." అని శ్రీధర్ తో చెప్పింది.
కంగారు పడుతూ సువర్ణ వైపు చూస్తూ, 'ఈ విషయం ఈమెకి ఎలా తెలిసింది? బహుశా అన్నయ్య చెప్పి ఉంటాడు.' అని కాస్త అసహనపడుతూ, "వదినా. నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రికమండేషన్ ఏదో నువ్వే ఉపయోగించుకో, అమ్మ చేత తిట్లు తినకుండా పనికి వస్తుంది. మరొక్కసారి నా విషయాల్లో తలదూర్చాలి అని చూడకు." కోపంతో అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు శ్రీధర్.
దూరం నుండి ఇదంతా చూస్తూ ఉన్న శాంతమ్మ కోపంతో కోడలు దగ్గరకు చేరుకుంది. "ఏంటి మళ్ళీ వాడికి నీతులు చెప్పడానికి చూస్తున్నావా? నీకు ఎన్ని సార్లు చెప్పాలి మా విషయంలో జోక్యం చేసుకోకు అని. ఐనా నువ్వు మనిషివేనా ఇన్ని సార్లు చెప్పించుకుంటున్నావు?" అరిచింది శాంతమ్మ.
తన కుటుంబం గురించి ఆలోచించి నాలుగు మంచి మాటలు చెప్పే చనువు కూడా నాకు లేదా అని అత్త మాటలకి మనస్తాపం చెంది ఎవరికీ చెప్పాపెట్టకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.
సువర్ణ గురించి మాట్లాడుతూ, "ప్రతి విషయంలో ఈమె చనువు ఎక్కువ అయిపోతుంది. పెద్దోడు రానియ్యి ఆమె సంగతి చెప్తాను." అని పెద్ద కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంది.
ఆఫీస్ పని ముగిసిన తర్వాత బడలికతో ఇంటికి చేరుకున్నాడు విరాజ్. కొడుకు రాకతో అప్పటి వరకు లోపల అణిచి పెట్టుకొని ఉన్న విషయాలు చెప్పి కోడలు మీద అక్కసు వెళ్లగక్కింది. శ్రీధర్ కూడా, "అవును అన్నయ్య! వదిన ఈ మధ్య సలహాలు ఇవ్వడం మొదలు పెట్టింది. నువ్వైనా కాస్త వదినకి చెప్పు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని." అని కోపంతో అన్నాడు.
తల్లి మాటలు, తమ్ముడు మాటలు విన్న తర్వాత, "ఏమని చెప్పాలమ్మా? ఈ ఇంటికి ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో నేను ఉంటే తండ్రి స్థలం అమ్మి, వచ్చిన డబ్బులతో ఈ ఇల్లు నీ పేరు మీద రాయించి ఇంత చేసిన తనని మీతో తిట్లు తినమని చెప్పనా? ఇదుగో అడ్డు అదుపు లేకుండా నిర్ణయాలు తీసుకొని ఉద్యోగం పోగొట్టుకొని, ఇన్స్టాల్మెంట్ కట్టలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్న వీడికి డబ్బులు ఇచ్చి సహాయం చేసింది కనుక వీడి చేత కూడా మాటలు పడాలి అని చెప్పనా?" అని అంటూ క్షణం మౌనంగా ఉండి
"ఇప్పటికీ కూడా తాను ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు మీరు. మీ పోరు పడలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. నిజం చెప్పాలి అంటే ఒక దశలో ఉద్యోగం పోగొట్టుకున్న నాకు తోడుగా నిలబడి ఇల్లు మొత్తం నడిపింది. నువ్వు అంటూ ఉంటావు కదా ఆమె నడుపుతున్న బోటిక్ పనికిమాలిన పని అని, ఆ పనే కొన్ని రోజులు మన కడుపు నింపింది.
మీ మాటలు విని మొదట్లో ఆమెను అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ఆమె మంచితనంతో నా మనస్సును గెలుచుకుంది. ఇవన్నీ మీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మీకు ఆమె చేసే మంచి కనపడటం లేదు, ఆమె మీ మీద ఎక్కడ పెత్తనం చేస్తుందన్న భయంతో కళ్ళు మూసుకుపోయాయి. మనందర్నీ తన వాళ్ళుగా అనుకొని బ్రతుకుతుంది. కానీ మీరు ఆమె మన మనిషి కాదని ఆమెను వేరు చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఏం చేస్తారో నాకు తెలియదు, సువర్ణ మళ్ళీ మన ఇంటికి రావాలి." అని చివరి సారిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు.
ఇన్నాళ్లూ తిట్టినా మౌనంగా ఉన్న సువర్ణ కారణంగానే తన కుటుంబం కష్టాలను తట్టుకొని నిలబడింది అని తెలిసి శాంతమ్మలో పశ్చాత్తాప భావన వెంటాడటం మొదలు పెట్టింది. ఆమెలో ఇన్నాళ్ళు ముసిరిన అపార్థపు మబ్బులు మెల్లమెల్లగా తొలగిపోవడం ప్రారంభమయ్యాయి. వెంటనే సువర్ణ దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యింది.
వెళ్తున్న తల్లి వైపు చూసి, "అమ్మా! మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. అందరి ప్రేమను కోరుకొని, అందరి సమస్యను తన సమస్యలా భావించే సువర్ణ లాంటి మనిషిని దూరం చేసుకుంటే మనకంటే దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఇప్పటికీ కూడా నీలో ఆమె పట్ల ద్వేషం ఎప్పటిలానే ఉంటే నువ్వు ఆమె దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు." చెప్పాడు విరాజ్.
కొడుకు మాటలు శూలాల్లా తన మనస్సును గుచ్చుకున్నాయి. "పెద్దోడా! ఇంత చెప్పిన తర్వాత కూడా ఆమె పట్ల నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? డబ్బు ఆశ ఇన్నాళ్ళూ నా కళ్ళు కప్పేసింది. నిజం జీర్ణం అవ్వాలి అంటే కాస్త సమయం పడుతుంది కదా. నువ్వు అన్నట్టుగా మనల్ని ప్రేమించే మన మనిషి కోసం నేను వెళ్తున్నాను." అని కొడుకుతో అంటూ అక్కడ నుండి ముందుకు కదిలింది.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.












Comments