top of page

మనుగడ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Manugada' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి

భర్తతో సమస్యలు ఆమెకు.

కానీ సమస్యలకు ఆమె క్రుంగి పోలేదు.

అలాగని భర్తనుండి విడిపోలేదు.

చాకచక్యంతో సమస్యలను ఎలా పరిష్కరించుకుందో ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారి ఈ కథలో తెలుస్తుంది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


రాత్రి పడుకున్నదే కానీ లావణ్యకి చాలా సేపు నిద్ర పట్టలేదు. ఇప్పటివరకు గడిచిన తన జీవిత గమనానికి సంబంధించిన ఆలోచనలు మనసు నిండా ముసురుకున్నాయి.

పెళ్ళైన కొత్తలో శేఖర్ అలవాట్లు, మాట తీరు చూసి ఇతనితో కలిసి బ్రతక గలనా అనుకున్నది తను. తరుచు ఉద్యోగం మానేసి, ఆ అసహనాన్ని అనేక రకాలుగా తన మీద వ్యక్తపరిచేవాడు. కుటుంబ భారమంతా తనమీద పడి డబ్బుకి ఇబ్బంది పడుతున్నప్పుడు...విడిపోయి హాయిగా ఒంటరిగా స్వతంత్రంగా బ్రతకవచ్చు అనుకున్నది. ఇలాంటి పరాన్న జీవిని పోషిస్తూ నాకూ భర్త ఉన్నాడని చెప్పుకోవటం అవసరమా అనిపించింది.

@@@@@

లావణ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి తను డిగ్రీ చదివిన కాలేజ్ లోనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది.

ఆ కాలేజ్ లో కొత్తగా పీజీ సెంటర్ పెట్టారు.

ఓల్డ్ స్టూడెంట్స్ లో మెరిటోరియస్ వాళ్ళకి లెక్చరర్స్ గాజేరే అవకాశం ఇవ్వాలన్న భావనతో, యాజమాన్యం పాత స్టూడెంట్స్ లో ఆసక్తి ఉన్నవారిని అప్లికేషన్స్ పంపించమని ఎనౌన్స్ చేశారు. అలా లావణ్యకి ఎమ్మే అవుతూనే ఉద్యోగం వచ్చింది.

లావణ్య ఇంట్లో పెద్ద పిల్ల. తరువాత తమ్ముడు రఘు, చెల్లి రమ్య.

ఆడపిల్లలు తమ కాళ్ళమీద తాము నిలబడాలనేది తల్లి శ్రీదేవి కోరిక. ఉద్యోగం వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, ఆపత్సమయంలో ధైర్యాన్నిస్తుందని ఆవిడ గట్టి నమ్మకం!

ఉద్యోగంలో చేరిన 4-5 నెలలకి పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. తెలిసిన వారి ద్వారా వచ్చిన శేఖర్ సంబంధం అన్ని విధాలా లావణ్యకి సరిపోతుందని నిశ్చయించి వివాహం జరిపించారు.

"అమ్మా, ఇప్పటి నించి నీ జీవితం లో కొత్త అధ్యాయం మొదలవుతున్నది. మీ అత్తవారి కుటుంబం నీకు కొత్త. వారి అలవాట్లు, నమ్మకాలు ఇప్పటివరకు నువ్వు మనింట్లో చూసిన దానికి భిన్నంగా ఉండచ్చు. వాళ్ళు నీకు కొంతైనా అర్ధమయ్యే వరకు ఏ విషయానికి తొందరపడకు."

"వైవాహిక జీవితం, ఆ మాటకొస్తే మామూలు జీవితం అయినా పూలపానుపు కాదు. సినిమాల్లో చూపించినట్లు, నవలల్లో చదివినట్లు ఆదర్శవంతంగా ఉండదు. ఎటువంటి పరీక్ష ఎదురైనా ఆత్మ విశ్వాసం సడలనివ్వకు. ఆచి తూచి అడుగెయ్యి. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను, నాన్నగారు ఉన్నాము" అని పెళ్ళయ్యి వెళుతున్న లావణ్యకి తల్లి శ్రీదేవి రాబోయే జీవితాన్ని చూచాయగా పరిచయం చేసింది.

@@@@@

పెళ్ళైన అతి తక్కువ సమయంలోనే శేఖర్ మాటలో విరుపు...విసురు, నిర్లక్ష్యపు ధోరణి గమనించిన లావణ్యకి చిరాకు కలిగింది. నూతన వైవాహిక జీవితం ఎవరికైనా కొన్నాళ్ళు మధురానుభూతులతో అలరిస్తుంది. తన జీవితం దానికి మినహాయింపు అని తెలియటానికి ఎక్కువ సమయం పట్టలేదు లావణ్యకి .

ఒక శనివారం రాత్రి మిత్ర బృందాన్ని తీసుకొచ్చి " ఇవ్వాళ్ళ రాత్రి మా మిత్రులందరం మనింట్లో మందు పార్టీ చేసుకుంటున్నాం" అన్నాడు యధాలాపంగా....దానికి నీ అనుమతితో సంబంధం లేదన్నట్లు!

తన పుట్టింట్లో ఇలాంటివి అలవాటులేని లావణ్య ముందు షాక్ తిన్నది. "నాకిలాంటివి ఇంట్లో ఇష్టముండదు" అన్నది.

"ముందుగా ప్లాన్ చేసిన పార్టీ హఠాత్తుగా క్యాన్సిల్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తారు. పెళ్ళాం అంటే భయమని, కొంగు చాటు మొగుడిని అని ఆటపట్టిస్తారు. నన్నో "నస్మరంతి" (అనామకంగా బతికే మొగుడికి ముళ్ళపూడి వెంకట రమణ గారు ఇచ్చిన బిరుదు ఇది) గాడి కింద జమ కడతారు. ఎట్టి పరిస్థితుల్లోను ముందుగా అనుకున్నట్లు మనింట్లో మందు పార్టీ జరిగి తీరాల్సిందే అని విసురుగా మాట్లాడి..అయినా ఎమ్మే చదువుకున్నానని,ఉద్యోగం చేస్తున్నానని పొగరా?" అన్నాడు.

గొడవపడటానికి ముందే నిర్ణయించుకున్నాడని లావణ్యకి అర్ధమయింది. అప్పుడు ఘర్షణ పడ్డందువల్ల ప్రయోజనం లేదని అర్ధమయ్యాక అప్పటికి ఊరుకుంది.

మరునాడు సెలవే కనుక అమ్మా-నాన్నలని చూసి వచ్చే నెపంతో పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో జరిగిన విషయం, శేఖర్ ప్రవర్తన..తీరు తెన్నులు తల్లిదండ్రులకి 'చెప్పాలా వద్దా' అని మధన పడసాగింది.

"చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగంలో ఉన్న పిల్ల జీవితం నాశనమయిందని అమ్మా నాన్నా దిగులు పడతారేమో! తన భర్త పట్ల వారికి చులకన అభిప్రాయం ఏర్పడుతుందేమో!"

"పైగా తను ఇంటికి పెద్ద కూతురు. తరువాత పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. అమ్మా నాన్నలకి వారి బాధ్యతలింకా ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి చేసుకు బయటికెళ్ళిపోయిన నా సమస్యల గురించే బాధపడుతూ కూర్చుంటే తరువాతి పిల్లల అవసరాలు చూడాలి!"

"తను చదువుకున్నది. సమస్య వచ్చినప్పుడు బేలతనానికి పోకుండా, అమ్మ చెప్పినట్లు తెలివితో పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి అని తమాయించుకుని తల్లిదండ్రులకి చెప్పకూడదని నిర్ణయించుకుంది."

పెళ్ళయి వెళ్ళాక అదే రావటమని వాళ్ళు సంతోషించారు. "అల్లుడుగారు కూడా వస్తే బాగుండేదమ్మా" అన్నారు. "ఆయనకేదో పనుందిట. పాత ఫ్రెండ్స్ అంతా కలుద్దామనుకున్నారు. నన్ను వెళ్ళి రమ్మన్నారు" అన్నది ముఖంలోఏ భావం వ్యక్తపరచకుండా.

శనివారం సాయంత్రం తమ్ముడిని, చెల్లిని సినిమాకి తీసుకెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. మరునాడు మధ్యాహ్న భోజనం అయ్యాక బయలుదేరి తనింటికి వచ్చేసింది.

"అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేమిటి? మా ఫ్రెండ్సంతా ఏమనుకుంటారు?" అన్నాడు.

"మీ లాగా నేనేం అనాలోచితమైన, అమర్యాదకరమైన పనులు చెయ్యను. మర్యాద లేకుండా ఇంటిని బార్ చేసిన మీరు...కొత్తగా పెళ్ళైన తమ ఫ్రెండ్ తన భార్యతో ప్రైవేట్ గా గడపటానికి దొరికే ఒకే ఆదివారం అనే ఇంగితం లేని మీ ఫ్రెండ్స్ .....నా గురించి ఏదో అనుకుంటారని ఆలోచించక్కరలేదనిపించింది" అన్నది. లావణ్య మాటలో పదును, చూపులో నిరసన శేఖర్ ని ఇక ముందుకి మాట్లాడనివ్వలేదు.

పైకి ఎలా మాట్లాడినా, ఎమ్మే చదువుకున్న భార్య అంటే అంతర్లీనంగా భయం శేఖర్ కి. అందుకే సంభాషణ పొడిగించకుండా, గొణుక్కుంటూ బయటికెళ్ళిపోయాడు. ఆ విషయం లావణ్య దృష్టి దాటిపోలేదు.

@ @ @ @

"అమ్మా, నాన్న గారు రేపు ట్రైన్ కి వస్తున్నారు" అన్నాడు శేఖర్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఇతని పోకడలు కట్టడి అవుతాయి అని కొంతా, పెద్దవాళ్ళతో కలిసి ఉండటం పట్ల ఏ వ్యతిరేకత లేకపోవటం వల్ల కొంతా లావణ్య వారి రాకని స్వాగతించింది. ఒక సగటు కోడలిలాగా..అత్తమామల రాకని వ్యతిరేకించని భార్య పట్ల సదభిప్రాయం ఏర్పడింది అతనికి.

అత్త మామలు వచ్చారని లావణ్య సెలవు పెట్టింది. అప్పటికి శేఖర్ తల్లిదండ్రులు వచ్చి రెండు రోజులయింది.

కాలేజికి వెళ్ళాలని, ఆ రోజు ఉదయం హడావుడిగా స్నానం చేసి వంట ప్రయత్నం మొదలుపెట్టిన లావణ్యతో "వంటకి కంగారేముందమ్మా! మేము భోజనం చేసేసరికి ఎంత లేదన్నా పన్నెండు అవుతుంది. వంట నేను చేస్తాలే! ఈ రోజుకి ఉన్నదేదో క్యారేజిలోకి పెట్టుకెళ్ళు. రేపటి నించి నువ్వు కాఫీ-టిఫిన్లు చేసే టప్పుడు పక్కన స్టవ్ మీద మీ వరకు ఒక పదార్ధం, అన్నం వండెయ్. కాఫీ తాగి, మడిగా నేను అందరికీ కలిసొచ్చేట్లు ఏదో ఒక కూర, పప్పు చేసేస్తాను. తినే ముందు వేడిగా మాకు అన్నం వండుకుంటాం!"

"ఒక్కదానివే ఏం హైరాన పడతావు. నేను ఉన్నన్నాళ్ళు అలా చేద్దాం"అన్నది వరలక్ష్మి కోడలితో. మర్మం లేకుండా ఆప్యాయంగా మాట్లాడే అత్త, మామలతో లావణ్యకి స్నేహంకుదిరింది.

ఆ రోజు ఆఫీస్ నించి ఉగ్రనరసింహం లాగా వచ్చిన శేఖర్ని "ఏం జరిగిందండి" అనడిగింది. "మా ఆఫీస్ లో రమేష్ స్టాక్ వెరిఫికేషన్ లో తను తప్పు చేసి, అది కప్పిపుచ్చుకోవటానికి విఠల్ ని బలి పశువుని చేశాడు" అన్నాడు.

"దానికి మీరెందుకు ఆవేశ పడటం" అన్నది లావణ్య. "ఇవ్వాళ్ళ అతన్ని చేశాడు! రేపు నన్ను ఇరికించడని ఏముంది? అందుకే అందరిముందు అతని బండారం బయట పెట్టాను. దానితో మా మేనేజర్ దగ్గరకెళ్ళి నా పెర్ఫార్మెన్స్ గురించి అవాకులు చెవాకులు వాగాడుట. ఆ టైం లో మా సబ్ స్టాఫ్ అహ్మద్ అక్కడే ఉన్నాడు. వాడొచ్చి నాతో చెప్పాడు. నేను రమేష్ ని నలుగురిలో కడిగేశాను" అన్నాడు.

"మీరు చేసింది తప్పని అనను కానీ, అనవసరపు గొడవల్లో తలదూరిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అన్నది లావణ్య తాపీగా..ముఖంలో ఏ భావం కనపడకుండా!

"అవునురా అబ్బాయ్, కోడలు చెప్పింది కరెక్టే. తప్పు చెయ్యటానికి సిద్ధపడేవాడు, అది కప్పిపుచ్చుకోవటానికి పథక రచన కూడా ముందే చేసుకుంటాడు. ఆ క్రమంలో ఏ స్థాయికైనా దిగజారతారు. మనకి సంబంధం లేని విషయాల్లో తల దూర్చటం అంటే "కొరివితో తలగోక్కోవటమే" అన్నారు చలపతి గారు.

పది రోజుల తరువాత "నన్ను ఏలూరుకి దగ్గరలో ఒక చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు" అన్నాడు ఆఫీస్ నించి వస్తూనే. "రమేష్ విషయంలో మీరు గొడవ పడ్డప్పటి నించీ ఇలాంటిదేదో జరుగుతుందని నేననుకుంటూనే ఉన్నాను. అతనికి పై లెవెల్లో పరిచయాలు బాగా ఉండి ఉంటాయి. అందుకే స్టాక్ లో అలాంటి తప్పులు చెయ్యటానికి సాహసించాడు" అన్నది లావణ్య.

"ఈ మహా పట్నం లో నా వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు. నీ ఉద్యోగం ఎలాగూ ఉంది. ఇల్లు నడుస్తుంది. అందుకే రిజైన్ చేసొచ్చేశాను" అన్నాడు నిర్లక్ష్యంగా.

"చిన్నప్పటి నించీ వాడింతేనమ్మా! చిన్న చిన్న విషయాలకే అవతలివారితో గొడవపడతాడు. దాని పర్యవసానాలు ఆలోచించడు. పెళ్ళయి సంసార బాధ్యత నెత్తిన పడితే వాడికే తెలిసొస్తుందిలే, మారతాడు అనుకున్నాం" అన్నది కోడలితో వరలక్ష్మి, కొడుకు చేసిన తప్పుకి సంజాయిషీ ఇచ్చినట్లు.

నాలుగు నెలలు ఉండి, మళ్ళీ వారు తమ ఊరికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవటంతో లావణ్యకి వెలితిగా అనిపించింది.

ఆరేళ్ళ కాలం గడిచింది. ఈ లోపు శేఖర్ నాలుగైదు ఉద్యోగాలు మారాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినా శేఖర్ దూకుడు తగ్గలేదు..గొడవలు పడటం మానలేదు. ఎప్పుడు ఉద్యోగానికి వెళతాడో, ఎప్పుడు మానేసి వస్తాడో అతనికే తెలియదు. కుటుంబ బాధ్యత ఇప్పుడు పూర్తిగా లావణ్య భుజాల మీద పడింది.

ఉద్యోగం లేక, సరైన వ్యాపకం లేక...అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చిన లావణ్యతో కావలని తగువు వేసుకునేవాడు. మాట్లాడకుండా మౌనంగా తనపని తను చేసుకుంటుంటే, తను ఉద్యోగం చేస్తున్నానని నాకు ఉద్యోగం లేదని, వీడితో మాట్లాడేదేమిటిలే అనే నిర్లక్ష్యం అనేవాడు. నచ్చచెప్పటానికి ప్రయత్నం చేస్తే నీ పాఠాలు కాలేజిలో, నాకు కాదు అని అరిచేవాడు.

@ @ @ @ @

"మధ్యాహ్నం పోస్ట్ లో మీ పిన్ని కొడుకు పెళ్ళి కార్డ్ వచ్చింది. వచ్చే నెల రెండో తారీకు పెళ్ళి" అని సాయంత్రం ఇంటికొచ్చిన లావణ్య చేతిలో పెళ్ళి పత్రిక పెట్టాడు. "ఆడ పెళ్ళి వారిది ఈ ఊరే కాబట్టి పెళ్ళి ఈ ఊళ్ళోనే! పిల్లల్ని తీసుకుని ఇద్దరం వెళ్ళొద్దాం. పైగా ఆ రోజు ఆదివారం! ఇబ్బంది లేదు"అన్నది. "నేను రాను, నువ్వెళ్ళిరా" అన్నాడు.

"అదేమిటి, వాడు నా స్వంత తమ్ముడిలా ఉంటాడు. మన పెళ్ళిలో బోలెడు చాకిరీ చేశాడు. ఆ రోజు నీ పెళ్ళికొచ్చి బాకీ తీరుస్తా అని వాడిని దగ్గరకి తీసుకుని మరీ చెప్పారు..గుర్తు లేదా?" అన్నది లావణ్య.

"పెళ్ళిళ్ళల్లో అనేకం అంటాం! అవన్నీ సీరియస్ గా ఎవ్వరూ తీసుకోరు. అయినా అక్కడ నాకెవరూతెలియదు. నీ చేత ఉద్యోగం చేయిస్తూ ఊరికే కూర్చుని తింటున్నానని అందరూ నన్నో వింతజంతువులాగా చూడటం నీకిష్టమా?" అన్నాడు.

దసరా పండుగకి నాలుగు రోజులు ఉండిపోదువుగాని, పిల్లల్ని తీసుకుని రమ్మని వదిన ఫోన్ చెయ్యగానే వచ్చిన ఆడపడుచు సునంద అక్కడే ఉన్నది.

"అన్నయ్యకి ఏ మర్యాదలు అక్కరలేదు వదినా! అవతలి వాళ్ళేమనుకుంటారో అనే ధ్యాసే ఉండదు. వారి ముందు మనకి చిన్నతనంగా ఉంటుందని కూడా పట్టించుకోడు. నిరుడు మామరిది పెళ్ళికి నువ్వొక్కదానివే వచ్చి అన్నయ్య రాలేదని, "మర్యాదలు తెలియని మనుషులు" అని మా అత్తగారు నలుగురితో అంటుంటే నేను తలదించుకోవలసి వచ్చింది" అన్నది సునంద.

ఉద్యోగం చేస్తున్నా ఏ అతిశయము ప్రదర్శించని వదినంటే సునందకి గౌరవం.

ఆ రాత్రే సునంద తిరుగు ప్రయాణం. భోజనం పెట్టి ట్రైన్ టైంకి పంపాలని అప్పటికా సంభాషణ అలా ముగించి, కాఫీ తాగి సాయంత్రం వంట పని చూడటానికి లోపలికెళ్ళింది.

@ @ @ @ @

మధ్యాహ్నం ఒక పీరియడ్ ఖాళీ ఉండటంతో ఏదో పుస్తకం చదువుతూ స్టాఫ్ రూంలో కూర్చునుంది లావణ్య. తలనొప్పిగా ఉన్నదని క్లాస్ టైం పూర్తవకుండానే వచ్చి కుర్చీలో కూలబడింది కొలీగ్ చిన్మయి.

తలెత్తిన లావణ్యకి మొహం పీక్కుపోయి ఉన్న చిన్మయి రూపం, తను అనుభవిస్తున్న బాధ యొక్క లోతు చెప్పకనే చెప్పింది. "ఏమయింది చిన్మయీ? ఇంట్లో ఏమైనా ప్రాబ్లెమా?" అనడిగింది.

"ఏం చెప్పమంటావు లావణ్యా మా వారు జీతమంతా తాగుడు, గుర్రప్పందేలకి తగలేస్తారు. ఒక్క రూపాయి ఇంట్లో ఇవ్వరు. ఈ రోజుల్లో... ఈ ధరల్లో ఒంటి చేత్తో ఇల్లు నడపటమెంత కష్టమో అనుభవిస్తున్నదానివి నీకు తెలియనిది ఏముంది?"

"ఇప్పుడు "పులిమీద పుట్రలాగా" మా మామగారికి లివర్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. వైద్యం చేయించాలా మానాలా? మన మధ్య తరగతి కుటుంబాల్లో' ప్రేమలని, బాధ్యతలని నిర్ణయించేది 'జరుగుబాటే!"

మా బావగారు.."నేను రిటైరయాను. పెన్షన్ మీద బతుకుతున్నవాడిని నాన్న వైద్య భారం మొయ్యలేను! నా శక్తికి తగినంత ఎంతో కొంత ఇస్తాను. చిన్న తమ్ముడు గిరి,నువ్వు చూసుకోండి అని మా వారితో చెప్పి పక్కకి తప్పుకున్నారు."

"మా మరిది గిరి, 'కూతురు పెళ్ళి తలపెట్టుకున్నాను. నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తాను. చిన్నన్నయ్యా నువ్వు చూసుకో. వదిన కూడా ఉద్యోగం చేస్తోందిగా' అని తీర్పు చెప్పి వెళ్ళాడు."

"ఈయన అలవాట్లు తెలిసి కూడా వదిన ఉద్యోగం చేస్తున్నది అని నలుగురి కళ్ళు మా మీదనే..! నా పరిస్థితి 'ముందు నుయ్యి వెనక గొయ్యి" అన్నది చిన్మయి.

ఇంతలో లంచ్ టైం అవటంతో లెక్చరర్లంతా క్యారేజిలు విప్పి ఆ పనిలో పడ్డారు.

క్లాసులైపోయి ఇంటికి బయలుదేరినా లావణ్య మనసు చిన్మయి చెప్పిన దాని చుట్టూనే తిరుగుతున్నది. 'ఇంటి బాధ్యత పంచుకోవలసిన మగవాడు ఇలా బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తుంటే, ఆ భారమంతా ఆడది ఒక్కత్తే భరించటం ఎంత కష్టం?'

'పోనీ అలాంటి మొగుడిని భరించటం ఎందుకు? తను స్వతంత్రంగా బ్రతకటానికి ఆధారం ఉంది అని విడిగా బ్రతుకుదాం అనుకుంటే, అలా బతుకుతున్న అత్తయ్య కూతురు శకుంతల భర్త ఫస్ట్ తారీకు రాగానే దాని ఆఫీస్ కి వెళ్ళి అందరి ముందు గొడవ చేస్తాడు.'

'భర్త అనేవాడు సినిమాల్లో చూపించినట్లు యుగళ గీతాలు పాడుతూ, ప్రతి రెండు నిముషాలకోసారి 'ఐ లవ్ యు డియర్' అని చెప్పక్కరలేదు. 'కష్టపడి ఉద్యోగం చేస్తూ ఇంటిని, పిల్లల బాధ్యతని బాగా నిర్వహిస్తున్నావని' వారిచ్చే ఒక్క మెచ్చుకోలు ఏనుగంత బలాన్నిస్తుంది అని ఈ మగ వాళ్ళెప్పుడు తెలుసుకుంటారో అనుకుంది.'

@@@@@@

కింద పోర్షన్ లో ఉన్న భార్యా భర్త పెద్దగా గొడవపడుతున్నారు. కాలేజి నించి అలిసిపోయి వచ్చిన లావణ్య, విషయం తరువాత నెమ్మదిమీద తెలుసుకోవచ్చని పైన తమ ఫ్లాట్ కి వెళ్ళిపోయింది. లావణ్య వచ్చిన పావు గంటకి పనికొచ్చిన మంగమ్మ...గిన్నెలు తోముతూ...

"ఆయమ్మ పాపం ఎలా భరిస్తోందోనమ్మా..అయిన దానికి కాని దానికి తగూ ఏసుకుంటాడమ్మా. ఆయనేం మగాడు, నెలకి పది వేలిచ్చి ముప్ఫై సార్లు లెక్కలడుగుతాడు. అంత పెద్ద సంసారం గుట్టుగా నడుపుకొస్తోంది ఆయమ్మ."

"ఎనిమిది మందికి మూడు పూట్లా తిండెట్టాలా? రోగాలు..రొప్పులు వస్తే డాక్టర్ ఫీజులు, మందులు మాకులు... ఊరికే వస్తాయా? పాపం సంవత్సరానికోసారి కూడా పిల్లలకి బట్టలు కొనదు మా తల్లి. మామగారు...మళ్ళీ ఆయన తండ్రే.... మందులకి డబ్బడిగితే ! "ఫస్ట్ రాకుండానే డబ్బులు తే తే అంటే అవేమైనా చెట్లకి కాస్తున్నాయా? మీ వాళ్ళకి దోచి పెడితే నేనెక్కడి నించి తేను" అని మద్దేన్నం నించి ఒకటే గోల అమ్మా" అన్నది.

"ఇంటింటికో ఇటుకల పొయ్యి మా ఇంటికో మట్టి పొయ్యి" అన్నట్టు కిందింటి కామాక్షి వాళ్ళది ఇంకొక రకం మధ్యతరగతి ఆర్ధిక సమస్య. దాన్ని సరిగా అర్ధం చేసుకో లేని(తలచని) మగ మహారాజులు" అని నిట్టూర్చింది.

'ఇలాంటివన్నీ చూసే ఈ కాలం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు వద్దంటున్నారు. వాళ్ళ భయం నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి! కానీ మనిషికి మనిషి తోడు కావాలి! ప్రకృతివిరుద్ధంగా ఆలోచించించలేము కదా!'

'అందరు మగవాళ్ళూ మూర్ఖులు శాడిస్టులే అనుకోలేము..పిన్ని కొడుకు ఫణి, అత్తయ్య కొడుకు రవి, తన కొలీగ్ భాస్కర్ లాంటి కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారుగా' అనుకుంటూ నవ్వుకుంది లావణ్య.

@ @ @ @ @

వచ్చే నెలలో ఢిల్లీ లో జరిగే ఒక అంతర్జాతీయ సెమినార్ కి లావణ్య వ్రాసిన పేపర్ సెలెక్ట్ అయింది...ప్రెజెంటేషన్ కిరావలసిందని ఆహ్వానం వచ్చింది. పిల్లలు 8-10 ఏళ్ళవాళ్ళు. వారిని శేఖర్ మీద వారం రోజులు వదిలి వెళ్ళటం కష్టం.

లావణ్య అత్తగారికి ఫోన్ చేసి "అత్తయ్యా నేను వచ్చే నెల వారం రోజులు ఢిల్లీ వెళ్ళాలి. పిల్లల్ని వదిలి వెళ్ళటం ఎలా?" అన్నది. "మేము వచ్చి పిల్లలని కనిపెట్టుకుని ఉంటాం. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరే ప్రయత్నాలు చేసుకో" అని ఆవిడ అనేసరికి లావణ్యకి కొండంత భారం దింపినట్టయింది. పిల్లల గురించిన బెంగ తీరింది.

ఇంటి యజమానిగా శేఖర్ ప్రవర్తన కొంత సంతృప్తికరంగా లేకపోయినా, అతని తల్లి దండ్రి ..కోడలు..పిల్లలతో ఎంతో బాధ్యతగా ఆత్మీయంగా మెలగటం లావణ్యకి పెద్ద ఊరట. అసలు అందుకే అతన్ని భరించగలుగున్నది తను!

అనుకున్న ప్రకారం ఢిల్లీ సెమినార్ కి వెళ్ళిన లావణ్యకి అక్కడ ఒక అనుకోని అద్భుత అవకాశం తలుపు తట్టింది. లావణ్య పేపర్ కి మంచి ప్రశంసలతో పాటు "జే ఎన్ యూ" లో మూడేళ్ళ పిహెచ్ డి కి ఎడ్మిషన్ దొరికింది.

వెనక్కి తిరిగొచ్చిన లావణ్య అత్త మామలిద్దరినీ, భర్తని కూర్చోబెట్టి "మామయ్యగారూ పిహెచ్ డి చెయ్యటానికి నాకో మంచి అవకాశం వచ్చింది. ఇది ఎంతో అపురూపమైనది, వదులుకుంటే జీవితంలో మళ్ళీ అంత మంచి యూనివర్సిటీలో పిహెచ్ డి చేసే అదృష్టం దొరకదు. కానీ పిల్లలనీ ఇంటినీ వదిలి వెళ్ళటం ఎలాగని ఆలోచిస్తున్నాను. మీ సలహా ఏమిటి?" అన్నది.

చదువుకోకపోయినా లోక జ్ఞానం పుష్కలంగా ఉన్న అత్తగారు వరలక్ష్మి....

"నేనైతే లక్షణంగా వెళ్ళమనే చెబుతాను. మూడేళ్ళ కాలం ఎంతలోకి గడుస్తుంది. నీకు పిహెచ్ డి చేసినన్నాళ్ళూ స్టైపెండ్ ఇస్తారు కదమ్మా! యూనివర్సిటీ క్వార్టర్స్ కూడా ఇస్తారేమో కనుక్కో. క్వార్టర్స్ ఇస్తే నువ్వు క్షేమంగా ఉంటావని మాకు ధైర్యంగా ఉంటుంది."

"ఇక పిల్లలు..మావాడు విషయం అంటావా, మేమొచ్చి ఇక్కడ ఉంటాము. పిల్లల చదువులు, సాయంత్రం బయటికి తీసుకెళ్ళటం మా వాడు, మీ మామయ్యగారు చూస్తారు. పిల్లలకి సెలవులిచ్చినఫ్పుడు పది రోజులు నీదగ్గరకి తీసుకొస్తాము. మధ్య మధ్యలో సునంద దగ్గరకి వెళ్ళొస్తూ ఉంటాం. పిల్లలకి దాని పిల్లలతో కాలక్షేపం అవుతుంది. చూస్తుండగా కాలం ఇట్టే గడిచిపోతుంది. "వడ్ల గింజ లో బియ్యపు గింజ" అన్నంత తేలికగా పరిష్కారం చెప్పేసింది.

మనస్ఫూర్తిగా మాట్లాడిన అత్తగారి సానుకూల స్పందనకి ఆనందపడిన లావణ్య మనసు దూదిపింజ లాగా తేలిక పడింది. భార్య ఉన్నతిలో తన పాత్ర ఏమీ లేని శేఖర్, తల్లిదండ్రుల ముందు తన అసహనాన్ని వ్యక్తపరిచి పలచన కాలేక ఊరుకున్నాడు.

"పిల్లలూ నాకు ఢిల్లీ లో పిహెచ్ డి చెయ్యటానికి మంచి అవకాశం వచ్చింది. మీరు ఇక్కడ నాన్న, నాయనమ్మ వాళ్ళతో ఉండాలి. నేను వెళ్ళనా వద్దా?" అనడిగింది.

"అమ్మా నువ్వు అక్కడే ఉంటావా? మళ్ళీ ఎప్పుడొస్తావు?" అన్నాడు బుజ్జి బెంగగా. "మీకు సెలవులిచ్చినప్పుడు నాన్న, నాయనమ్మ, తాతగారు మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తారు. అప్పుడప్పుడు సునందత్త వాళ్ళింటికి వెళ్ళి శీను వాళ్ళతో ఆడుకోవచ్చు. బెంగ పడకుండా చక్కగా నాయనమ్మ చెప్పిన మాట విని వారిని విసిగించకుండా బాగా చదువుకుంటే సెలవుల్లో ఆగ్రా తీసుకెళ్ళి తాజ్ మహల్ చూపిస్తాను" అన్నది.

"బుజ్జీ.. ఇలా బాగా చదువుకుంటే అమ్మకి ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది" అని శాంతి తమ్ముడిని బుజ్జగించి "సరే అమ్మా ఏము ఏ పేచీ పెట్టకుండా నాయనమ్మా వాళ్ళతో ఉంటాము. నువ్వెళ్ళిరా" అని అమ్మ వైపు తిరిగి తమ అంగీకారం సంతోషంగా తెలియ చేసింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ అమ్మని చుట్టేసుకుని పడుకున్నారు.

మూడేళ్ళ స్టడీ లీవ్ పెట్టి లావణ్య అనుకున్న ప్రకారం జేఎన్ యూ లో పి హెచ్ డి లో చేరింది.

@@@@@@

పని పాట లేకుండా ఖాళీగా ఉంటే తల్లిదండ్రుల నస భరించాల్సి వస్తుందని, వారి నించి తప్పించుకోవటానికి తన ఫ్రెండ్ పనిచేసే కంపెనీ ద్వారా ఇండిపెండెంట్ ఆడిట్ లకి వెళ్ళటం మొదలు పెట్టాడు.

ఫ్లాట్ స్వంతం కాబట్టి అద్దె కట్టక్కరలేదు కానీ నెల వారీ మెయింటినెన్స్, ఇంటి ఖర్చులకి డబ్బు కావాలి. లావణ్యకి ఇప్పుడు ఉద్యోగంలో వచ్చినంత జీతం రాదు. స్టైపెండ్ కనుక శేఖర్ నెల జీతం సంపాదించవలసిన అక్కర ఏర్పడింది.

ఆదివారం నాడు అత్తగారికి ఫోన్ చేసినప్పుడు, శేఖర్ ఆడిట్ లకి వెళ్ళటం గురించి ఆవిడ చెప్పిన కబురు విని లావణ్య సంతోష పడింది. కారణం ఏదైనా, శేఖర్ లో వచ్చిన మార్పు అభిలషణీయమే అనుకుంది.

లావణ్యకి ముందుగా హాస్టల్ లో రూం ఇచ్చారు. రెండో సంవత్సరం వచ్చేసరికి ఒక బెడ్ రూం క్వార్టర్ ఇచ్చారు.

రోజులు చక చకా గడిచిపోతున్నాయి. లావణ్యకి ఇంటిబాధ్యతలు..బాదర బందీలు లేకపోయేసరికి పని నిరాటంకంగా సాగుతున్నది. పిల్లలతో రోజూ ఫోన్ లో మాట్లాడుతున్నది. అత్త మామల ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి తెలుసుకుంటున్నది.

ఊళ్ళోనే ఉన్న లావణ్య తల్లి దండ్రులు తరచు వచ్చి పిల్లలతో గడిపి, వియ్యాలవారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. లావణ్యకి మధ్యలో ఒక సారి లండన్, అమెరికా వెళ్ళి పేపర్స్ ప్రెజెంట్ చేసే అవకాశం కూడా వచ్చింది.

అనుకున్న ప్రకారం లావణ్య పిహెచ్ డి పూర్తి అయింది. ఆమె వర్క్ కి మంచి గుర్తింపు వచ్చింది. కాన్వొకేషన్ కి కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. అమ్మ ఆ కార్యక్రమం లో పెట్టుకున్న క్యాప్, వేసుకున్న గౌను చూసి పిల్లలు మురిసిపోయారు.

అత్తగారు సంతోషంగా కోడలి బుగ్గలు పుణికి, 'నా దిష్టే తగులుతుంది నీకు' అని దిష్టి తీస్తున్నట్టు తలచుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. లావణ్య తల్లిదండ్రులకి, అత్తమామలకి వంగి పాదాభివందనం చేసింది.

తన పెంపకంలో....కూతురు జీవితాన్ని సరిగా అర్ధం చేసుకుని, వృద్ధిలోకి వస్తున్న తీరు చూసి లావణ్య తల్లి కళ్ళల్లో తృప్తి మెరుపులాగా ఒక్క క్షణం మెరిసింది.

@ @ @ @ @

లావణ్య తిరిగి కాలేజ్ కి వెళ్ళటం మొదలుపెట్టింది. అక్కడ ఆమెకి అభినందన సభ ఏర్పాటు చేశారు.

"స్త్రీ తలచుకుంటే ఏదైనా సాధించగలదు. మిసెస్ లావణ్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నాకూడా అవకాశం వచ్చినప్పుడు వెనకంజ వెయ్యకుండా, కుటుంబ సభ్యుల్ని కూడ గట్టుకుని వారి సహాయ సహకారాలతో పొరుగూరులో ధైర్యంగా తను అనుకున్నది సాధించింది. తన విద్యార్హత పెంచుకుని ఆ అనుభవాన్ని తన విద్యార్ధులకి పంచటానికి సిద్ధంగా ఉన్నది. ఇది మనందరికీ గర్వకారణం" అని ప్రిన్సిపాల్ గారు తన ప్రసంగంలో లావణ్య ధైర్యాన్ని ప్రశంసించారు.

కాలేజ్ యాజమాన్యం తనకి ఏర్పాటు చేసిన అభినందన సభకి కృతజ్ఞత తెలియచేస్తూ "నా ఈ విజయం వెనుక మా అత్తయ్యగారు..మామయ్య గార్ల సహాయం, పిల్లల ప్రేమ...సహకారం విలువ కట్టలేనివి. ఏ చీకు-చింత లేకుండా రాత్రింబవళ్ళు పని మీద శ్రద్ధ పెట్ట గలిగానంటే కుటుంబ సభ్యులందరి తోడ్పాటు కారణమని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను" అని చెప్పింది లావణ్య.

ఇతర కొలీగ్స్ అంతా "మా స్త్రీ జాతికి గర్వ కారణం లావణ్య! తనని చూసి మేము చాలా నేర్చుకున్నాము" అని చెప్పారు.

ఆ రాత్రి డిన్నర్ కి తమ ఇంటికి ఆహ్వానించారు లావణ్య తల్లిదండ్రులు.

@ @ @ @ @

గతానికి సంబంధించిన జ్ఞాపకాల జావళి లో తూగుతున్న లావణ్య కొడుకు కలవరింతలకి ఇహంలోకి వచ్చింది. దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దుపెట్టింది.

కాసిని మంచినీళ్ళు తాగి పడుకున్న లావణ్య మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయింది....

"తన కొలీగ్ చిన్మయి భర్త లాగా శేఖర్ కి గుర్రప్పందేలు లాంటి ఖరీదైన చెడు అలవాట్లు లేవు. పరాయి ఆడపిల్లలతో పరిచయాలు... ఇతర చెడు తిరుగుళ్ళు లేవు. పిల్లలని ప్రేమగా చూసుకుంటాడు. వారిని స్కూల్లో దింపి తీసుకురావటం లాంటి పనులు బాధ్యతగా చేస్తాడు. పిల్లలని దగ్గర కూర్చుని చదివిస్తాడు. అతనికున్న దురుసుతనం, ఉద్యోగం చెయ్యటం లో బాధ్యతా రాహిత్యం అనే చిన్న గీతల పక్కన, చెడు అలవాట్లు లేకపోవటం అనే పెద్ద గీత గీసుకుని అతనితో కలిసి బ్రతకటానికి తను సమాధాన పడింది. ఒక సమస్యకి ఒకటే పరిష్కారం ఎప్పుడూ ఉండదు అని చదువుకునేటప్పుడు తెలుసుకుంది. అదే ఇప్పుడు పాటిస్తున్నది తను"

"ఈ కారణాల వల్ల అతని నించి విడిపోయి ...సమాజంలో పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా బ్రతకాలనే నిర్ణయం తను తీసుకోలేకపోయింది. కారణం...ఎంత స్వతంత్రంగా బ్రతకగలిగినా ఏదో ఒక సందర్భం లో మనిషి తోడు తప్పనిసరి"

"భర్తని దూరంగా పెట్టటం వల్ల, తప్పు అతనిదే అయినా, అతని తరఫు వారికి అకారణంగా తన మీద శతృత్వం ఏర్పడుతుంది. తనలో లోపాలు ఎంచటం మొదలుపెడతారు. తన నడవడి మీద లేని పోని నేరాలు మోపుతారు అని చుట్టు పక్కల అనుభవాలని బట్టి తెలుసుకుంది"

"తన పెళ్ళి చేసి పంపేటప్పుడు...ఎవరి జీవితాలు పూల పాన్పులు కావు, కాస్తో కూస్తో ఒడుదుడుకులు ఉంటాయి అని అమ్మ అన్న మాట ఎప్పుడూ గుర్తు తెచ్చుకుని, తనకి తనే ధైర్యం చెప్పుకునేది..సమాధాన పడేది."

"ఒంటరి జీవితంలో బయటివారి సహాయం అర్ధించి, వారికి తన నిస్సహాయత చూపి లోకువ అవటం కంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండి వారి సహకారం పొందటం ఎప్పుడూ మేలు అనుకున్నది."

"పిల్లలకి తండ్రిని దూరం చెయ్యటం కంటే భర్తలోని బలహీనతలని క్షమించగలిగితే నష్టం తనొక్క దానికే! కుటుంబ సభ్యుల ఆత్మీయత పిల్లలకి దక్కుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు!"

"వ్యక్తి తనకున్న పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి "మనుగడ" సాగించాలి. అందుకు అవకాశాలు తనే వెతుక్కోవాలి. ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు. భగవంతుడు ఒక తలుపు మూస్తే, మరో తలుపు తెరుస్తాడు. ఒక కష్టం ఉంటే అది భరించే ధైర్యం, శక్తి ఇస్తాడు. అది ఉపయోగించుకుని ఎదగాలే కానీ జీవితమంటే భయపడి పారిపోకూడదు."

"ఎవరి జీవితమైనా సజావుగా సాగటానికి కుటుంబ సభ్యులు, సమాజం నించి పూర్తి సహాయ సహకారాలు, రక్షణ అవసరం. ఒంటరి పోరాటం ఎంతటి వారికైనా కష్టం. కుటుంబ వాతావరణం అనుకూలంగా, ఆనందంగా ఉండాలంటే ఎవరైనా తమ భావోద్వేగాలని కొంత అదుపు చేసుకోవాలి..కొంత త్యాగం చెయ్యాలి..అది అనివార్యం అని తను నమ్మింది"

"పెళ్ళికి ముందు ఉన్న చురుకుదనం పోయి నాలో స్తబ్ధత చోటు చేసుకున్నదని, భర్తతో జీవితం అసంతృప్తిగా ఉంటే బలవంతంగా కలిసి బ్రతకక్కరలేదని, విడాకులు తీసుకోమని ఫ్రెండ్స్ అంతా చాలా సార్లు సలహా ఇచ్చారు."

"విడాకులు పుచ్చుకోవటానికి తన ఫ్రెండ్ భర్త లాగా వైవాహిక జీవితానికి శేఖర్ పనికి రాడు అనుకునేటంత పెద్ద సమస్య కాదు. తనది ఆనందకరమైన వైవాహిక జీవితం కాదని దిగులుపడి ఆత్మహత్య చేసుకుని జీవితం ముగించుకోవలసినంత తీవ్ర విషయం కాదు."

"అసమర్ధుడైన భర్తని భరించలేనని విమల భర్తని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. తన చావుకి భార్యే కారణమని ఉత్తరం వ్రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుని విమలని జైలు పాలు చేసి ఇరకాటంలో పెట్టాడు దాని మొగుడు. ఇలా భర్త గురించి చికాకుగా ఉన్నప్పుడు, తన చుట్టు పక్కల జంటలని స్టడీ చేస్తూ నిర్ణయాల్లో తొందరపాటుతనానికి పోకుండా తమాయించుకునేది."

"జీవితంలో తనకంటూ ఏ లక్ష్య సాధన లేకుండా, కేవలం ఆనందకరమైన వైవాహిక జీవితంతో తను సంతృప్తి పడేదా? భర్త పట్ల తను చూపించిన సర్దుబాటు ధోరణి ఇప్పుడు తనకి మంచి కుటుంబ సభ్యులనిచ్చింది. ఒక గొప్ప లక్ష్య సాధనకి వారి సహకారం రూపంలో ఉపయోగపడింది."

"తను లోకం దృష్టిలో అసమర్ధుడైన భర్తని ఓర్పుగా భరించిన ఒక త్యాగమూర్తిలాగా కనపడచ్చు....కానీ, ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత శిఖరాలకి చేరటానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అది సాధించిన విజేతగా తన మనసు భావిస్తున్నది."

"ఎవరికైనా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటే కలిగే విజయం గొప్ప ఆనందాన్ని ఇవ్వదు. జీవితం విసిరిన సవాలుని ఒక అవకాశంగా మలుచుకున్నప్పుడు సాధించిన విజయం...గొప్ప ఆత్మ సంతృప్తినిస్తుంది అని అమ్మ చిన్నప్పుడెప్పుడూ చెప్పేది."

"సమస్య వచ్చినప్పుడు పారిపోవటం కాదు. నిలబడి ఎదిరించి విజేతగా నిలవాలి. అది పది మందికి స్ఫూర్తిదాయకం కావాలి అన్న అమ్మ మాటని ఆచరించి చూపించగలిగాను" అని గతాన్ని నిష్పాక్షికంగా అంతర్మధనం చేసుకుంటూ, జీవితంలో అప్పటివరకు తను వేసిన అడుగుల్లో తప్పు లేదు అని మనస్ఫూర్తిగా అనుకుంది.

కనుకనే తన ఎదుగుదలకి ఇంటిల్లిపాదీ మనస్ఫూర్తిగా ఆనందించారు అనుకోగానే మనసు తేలికపడింది. అప్పటిదాకా వేచి ఉన్న నిద్రా దేవి లావణ్యని తన కౌగిలిలో బంధించింది.

@@@@@

ఇంకో రెండేళ్ళకి లావణ్య సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరింది. తరువాత క్రమేణా తనకున్న అనుభవంతో , మెరిట్ తో యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ కూడా అయింది.

తల్లిదండ్రులు, అత్తమామలు కూడా లావణ్య వృద్ధి, విజయాలు చూసి మనస్ఫూర్తిగా సంతోషించారు. జీవితం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది! భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని బాగు చేసుకుని "మనుగడ" సాగించటమా ....పాడు చేసుకుని చింతించటమా అనేది మన చేతుల్లోనే ఉంది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు



91 views0 comments

コメント


bottom of page