top of page

కన్న తల్లికైనా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Kanna Thallikaina' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి


పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచడంలో పాత తరం వాళ్ళను మించిన వారు లేరు.

ఏ సమయానికి ఏ ఆహారం పెట్టాలి, ఎలా నిద్రపుచ్చాలి, స్నానం ఎలా చేయించాలి...ఇలా ప్రతి విషయంలో వారి అనుభవం ఈతరం వారికి ఎంతో ఉపయోగ పడుతుందని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


"ఇక్కడే పెట్టాను. ఎవరు తీశారు? అది లేకపోతే కాలు సాగదు. నిద్ర లేచి మంచం దిగాలంటే అది పక్కనే ఉండాలి" అంటూ అసహనంగా వెతుక్కుంటున్నది పార్వతి.


"ఏమిటి" అంటూ వచ్చారు శివయ్య గారు.


"అదేనండి.. మొన్న ఆర్తోపెడిక్ డాక్టర్ ఇచ్చారే ఆయిల్. రాత్రంతా రెస్టులో ఉన్న కాళ్ళు లేచి నడక సాగాలంటే ఆ ఆయిల్ అవసరం. అమ్మాయి పురిటికి వెళితే నాలుగు నెలలు ఉండాలా? అక్కడ ఎవరినడగను? అందుకే కదా నాలుగు సీసాలు తెప్పించాను" అన్నది.


"ఎక్కడికి పోతుంది? జాగ్రత్త కోసం పక్కగా పెట్టి ఉంటావు" అని ఆయన కూడా వెతికే పనిలో పడ్డారు.


కూతురు కళ్యాణికి రెండో పురుడు. "అమ్మా నువ్వు ఇక్కడికే రా! పెద్ద పిల్ల వాళ్ళ నాన్నని వదిలి పెట్టి రాదు. ఏడుపుకి తగులుకుంటే ఊరుకోపెట్టటం కష్టం! నువ్వా... కాళ్ళ నెప్పులతో దాని వెనక పరిగెత్తలేవు. ఇక్కడ వాళ్ళ నాన్న, దాని స్నేహితులు ఉంటే నీ మీద కొంత భారం తగ్గుతుంది" అని తనకేదో ఉపకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్న కూతుర్ని ఆపలేక, తనకి కష్టమైనా భర్తని ఒక్కడినే వదిలేసి బయలుదేరింది పార్వతి.


******


నెలలు నిండాయి కళ్యాణికి.


"పురుడొచ్చాక రెణ్ణెల్ల వరకు ఏమీ తినకూడదు, పస్తెం చెయ్యాలి. పుట్టే వాళ్ళకి జలుబు చేస్తుంది, పొట్ట ఉబ్బరం వస్తుంది. అందుకని నాలిక మీద వాతే!" అని ఇష్టమైనవన్నీ ఓపికగా చేసి పెడుతున్నది పార్వతి. 'పాపం తల్లి మనసు కదా....ఉరుకోలేదాయే!'


"పాలు మిగిలాయి. కస్టర్డ్ చేస్తాను...పౌడర్ ఉందా?" అన్నది.


"స్టోర్ రూం లో కుడి పక్క అలమరలో పై అరలో మధ్య డబ్బాలో ఉందమ్మా" అన్నది కళ్యాణి.


స్టోర్ రూం లోకి వెళ్ళిన పార్వతి అలమర తలుపు తీసి వరసగా పెట్టిన సెరిలాక్ డబ్బాలు చూసి..."కళ్యాణీ ఈ డబ్బాలేమిటే ఇలా వరసగా పేర్చావు. పిల్లలకి వాడే పాల డబ్బాలు, సెరిలాక్ డబ్బాలు ఇలా పెడితే వాళ్ళకి దిష్టి కొడుతుంది. వాళ్ళ పొట్ట బయట పడేసినట్టవుతుంది. ఎప్పటిదప్పుడు పాత సామాను వాళ్ళకి అమ్మేయాలి. అలా అమ్మేటప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువెక్కువ ఒక్క సారిగా ఇవ్వకూడదు అని చెప్పా కదా!"


"ఈ మధ్య పిల్లలు తాగింది, తిన్నది కక్కటం కూడా ఎక్కువయింది. ఇలా నలుగురి దృష్టిలో పడటం వల్లే అంటారు అమ్ముమ్మ, బామ్మ లాంటి పెద్ద వాళ్ళు. 'నరుడి దృష్టికి నల్ల రాయి పగులుతుందనేది' మీ బామ్మ" అన్నది పార్వతి.


"అంటే ఏంటమ్మా?" అన్నది.


"చిన్నప్పుడు అన్నయ్య ఎన్ని పదార్ధాలు వండినా పప్పు కావాలని గొడవ చేసేవాడు. ఈ పూట పప్పు చెయ్యలేదు, ఉన్నదేదో తిను..వెధవ కోరికలు నువ్వూను. ఎంత పప్పు కొన్నా నెలాఖరు వరకు సరిపోవట్లేదు అని నేను కేకలేస్తే...'కన్న తల్లి పిల్లల కడుపెరిగి అన్నం పెట్టాలి. వాళ్ళ తిండి గురించి నలుగురికి వినపడేట్లు మాట్లాడకూడదు. అందుకే కన్నితల్లికైనా కనుమరుగుండాలి ' అని బామ్మ నన్ను కేకలేసేవారు."


"మహా భారతంలో పాండవులు ఏక చక్రపురంలో భిక్షాటన చేసి బ్రతికే రోజుల్లో...తెచ్చిన భిక్ష మొత్తాన్ని కుంతీ దేవి లోపలికి తీసుకెళ్ళి రెండు భాగాలు చేసి..ఒక భాగం మొత్తం భీముడికి పెట్టి, రెండో భాగం, మిగిలిన నలుగురు కొడుకులకి పెట్టి తను తినేదిట. తల్లంటే అలా ఉండాలి" అని చెప్పేవారు.


"ఏ పిల్లకి ఏది ఇష్టమో, ఏ పదార్ధం ఎంత తింటారో తల్లికే తెలుస్తుంది. అలాంటి తల్లి కూడా పిల్లలు అన్నం తినేటప్పుడు చూసీ చూడనట్టు ఉండాలిట. అందులోను పసిపిల్లలయితే నలుగురి ముందు కూర్చుని పాలు పట్టద్దని, తిండి పెట్టద్దని చెప్పేవారు" అన్నది.


"ఆ:( బామ్మది మరీ చాదస్తంలే అమ్మా. తల్లి తను చూడకుండా పిల్లలకి అన్నం ఎలా పెడుతుంది?" అన్నది.


"తల్లి దగ్గర రొమ్ము పాలు తాగే పసి పిల్లలు ఎన్ని పాలు తాగారో లెక్క కట్టటం తల్లికైనా కష్టమే? అయినా కూడా నలుగురు కూర్చున్న చోట కాకుండా పక్క రూం లోకి వెళ్ళి పిల్లకి పాలివ్వు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత సేపు పాలు తాగారో ఇంకొకరి దృష్టికి రాకూడదనీ..."కన్నతల్లికైనా కనుమరుగుండాలనీ" అంటారు.


"తరవాత్తరవాత సిగ్గనీ... తమ అందం తగ్గిపోతుందనీ...బయట తిరగటానికి ఇబ్బందనీ...పిల్లలకి తమ పాలు ఇవ్వటం మానేసి డబ్బా పాలు పొయ్యటం మొదలు పెట్టారు. చదువుకున్నామనీ, మాకే అన్నీ తెలుసుననీ.... పాల సీసాలకి కనీసం గుడ్డ కూడా చుట్టకుండా టీవీ చూస్తూ, నలుగురిలో కూర్చుని కబుర్లు చెబుతూ పాలు పాట్టటం, తిళ్ళు పెట్టటం చేస్తున్నారు. ఇదిగో ఆ డబ్బా పాల అలవాటు వల్లే ఇంటి నిండా పాల డబ్బాలు పోగుపడుతున్నాయి" అన్నది పార్వతి.


********


టీవీలో పాటలు చూపిస్తూ అన్నం తినిపిస్తున్న తల్లిని అందులో నాయికా నాయకుల నృత్య భంగిమలు అనుకరిస్తూ, పాటలో పదాల గురించి ప్రశ్నలతో విసిగిస్తూ...మధ్య మధ్యలో అటూ ఇటూ పరుగెత్తి ముప్పు తిప్పలు పెడుతున్నది బేబీ. నెలలు నిండిన కళ్యాణి, లేచి దాని వెనక పరుగెత్తలేక "రామ్మా బేబీ ఈ ముద్ద నోట్లో పెట్టేసుకెళ్ళు. నా బొజ్జలో ఉన్న తమ్ముడు చూడు ఎలా తంతున్నాడో! నేను లేచి నీతో పాటు పరుగెత్తలేను. చెప్పిన మాట వినకపోతే నేను తమ్ముడి జట్టే ఉంటాను. వాడిని నీతో ఆడుకోనివ్వను" అని విసుక్కుంటూ, బలిమాలుతున్నది.


అప్పుడే మధ్యాహ్న నిద్ర నించి లేచి వచ్చిన పార్వతి, ఎండిపోయిన కూతురు చెయ్యి..అన్నం పళ్ళెం చూసి, 'ఎప్పటి నించి పెడుతున్నదో? ఈ లోపు ఎవరెవరు వచ్చి వెళ్ళారో? ఒంటికాయ సొంటికొమ్ముల్లాగా పెరుగుతున్న ఈ కాలపు పిల్లలకి అన్నం పెట్టటం ఓ పెద్ద పరీక్ష. టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూపిస్తూపెడితే తినే తిండి ఒంటికేం పడుతుందీ' అని స్వగతంగా అనుకుంటూ .... "బేబీ ఇటు రా నీకో రహస్యం చెబుతాను" అని తన గదిలోకి తీసుకెళ్ళింది. తనో నాలుగు చిత్తు కాయితాలు ముందేసుకుని, బేబీకో రెండు కాయితా లిచ్చి బొమ్మలు గియ్యమన్నది.


"అమ్ముమ్మా ఏం గియ్యనూ" అని బుగ్గ మీద పెన్సిల్ పెట్టుకుని ఆరిందాలాగా అడుగుతూ "ఆ:( నీ బొమ్మ వెయ్యనా" అన్నది. "ఆ:( వెయ్యి" అన్నది. అది ఆ పనిలో ఉండగా నాలుగు ముద్దలు గబ గబా నోట్లో పెట్టి మూతి కడిగేసింది.


"అబ్బో... కాళ్ళ కంటే చేతులు పొడుగ్గా, ప్యాంట్ షర్టు తో భలే ఉందే అమ్ముమ్మ!" అని పార్వతి మెచ్చుకుంటుంటే, నిజంగానే తనో పెద్ద ఆర్టిస్ట్ లాగా పొంగిపోయింది.


"అమ్మా నీ పుణ్యమా అని ఈ పూటకి బేబీ భోజనం ప్రహసనం ముగిసింది" అన్నది కళ్యాణి.


"టీవీలు, కంప్యూటర్లు చూపిస్తూ భోజనం పెట్టటం మంచి అలవాటు కాదు. పిల్లలు తింటూ ఉండగా, ఎవరైనా వస్తే లోపలికెళితే బాగుండదని వాళ్ళ ముందు అట్లాగే పెడతారు. మొన్న రాత్రి వాళ్ళ నాన్న అన్నం పెడుతుంటే, పక్కింటాయన పని మీద వచ్చాడు గుర్తుందా? ఏ కళనున్నదో ఇది బుద్ధిగా కూర్చుని అన్నం తింటుంటే..."అబ్బో మీ పాప భలే బుద్ధిమంతురాలి లాగా తింటున్నదండీ! మా అమ్మాయి అయితే అసలు అన్నమే తినదు" అన్నాడు. వాళ్ళ అమ్మాయి తింటుందో, తినదో మనం చూడొచ్చామా? తప్పొప్పులు ఆలోచించకుండా అట్లా మాట్లాడటం కొంత మందికి అలవాటు. అట్లా నలుగురి దృష్టి పిల్లల తిండి మీద పడకూడదు."


"అసలు నిలబడి మంచి నీళ్ళు తాగటం, అన్నం తినటం ఆరోగ్యరీత్యా తప్పు తెలుసా? మా చిన్నప్పుడు మా నాన్న మంచినీళ్ళ గ్లాసు చేతికిస్తే..గోడవారగా కూర్చుని తాగేవారు. అట్లా ఎందుకు తాగేవారో అప్పుడు నాకు తెలియదు. నిలబడి నీళ్ళు తాగితే కిడ్నీల మీద ఒత్తిడి పడుతుందనీ, మోకళ్ళ నెప్పులకి అది కారణమౌతుందనీ నేనీమధ్య ఒక సైన్స్ వార్తల్లో చదివాను. నిజ నిజాలు తెలియవు కానీ, అప్పట్లో పెద్ద వాళ్ళు చెప్పేదానిలో కొన్ని ఆయుర్వేద రహస్యాలు ఉండేవి. ఇప్పుడు అందరూ అన్నీ వదిలేసి నిలబడి తినటం, ప్రయాణాల్లో తినటం చేస్తున్నారు. అలాగే పిల్లలు ఆడుతూ, పరుగెత్తుతూ తింటున్నారు" అన్నది పార్వతి.


*******

అప్పటినించీ మధ్యాహ్నం బేబీకి అన్నం తనే పెడతానని పళ్ళెం చేతిలోకి తీసుకుని.."బంగారు తల్లీ...పాపం తాతయ్య అక్కడ ఒక్కరే ఉన్నారు కదా..ఆకలేస్తోందిట! ఇప్పుడు నువ్వు తాతయ్య ముద్ద తింటున్నావు" అన్నది. 'అయ్యో అవును అమ్ముమ్మా! పాపం తాతయ్య ఒక్కరే ఉన్నారు. అన్నం ఎవరు వండి పెడతారు? సరే నేను తింటే తాతయ్యకి కడుపు నిండుతుందా?" అంటూ ముద్ద నోట్లో పెట్టేసుకుంది. అలాగే నాన్న ముద్ద, మావయ్య ముద్ద అంటూ ఆ పూట తినిపించింది.


ఇంకో రోజు..." పిల్లి వస్తుందో...ఎలుకొస్తుందో...పిట్ట వస్తుందో..బేబీ వస్తుందో..రావాలి..రావాలి" అంటూ చేతిలో ముద్ద పెట్టుకుని తను కళ్ళు మూసుకుని పార్వతి ఆడుతూ మనవరాలి చేత అన్నం తినిపించింది.


ఇంకోనాడు కధల పుస్తకం చూపిస్తూ బకాసురుడు, భీముడు, కృష్ణుడి కధలు చెబుతూ అన్నం తినిపించింది.


అమ్మ దగ్గర పేచీలు, ఆటలు లేకుండా బుద్ధిగా కూర్చుని అన్నం తింటున్న కూతురిని తృప్తిగా చూస్తున్న కళ్యాణితో.....


"పూర్వం ఇళ్ళల్లో నలుగురైదుగురు పిల్లలుండే వారు. అందరికి బారుగా ఒక వరుసలో పెడితే, ఒకరితో ఒకరు పోటీపడి ఎప్పుడు తినేసి వెళ్ళిపోయేవారో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడు మీరు పెడుతున్న పద్ధతిలో అంతమంది పిల్లలకి అన్నం పెట్టాలంటే, తల్లికి రోజంతా అన్నం పెట్టటమే సరిపోతుంది."


"మారే కాలంతో పాటు మారాలి అని పిల్లలకి అన్నం పెట్టటానికి టీవీలు, ఫోన్లు చూపించటం అలవాటు చేస్తే తినటం మాట దేవుడెరుగు...నలుగురి దృష్టిలో పడతారు..రోజంతా ఆ పనే సరిపోతుంది. వాళ్ళకి తిన్నట్టుండదు, తిన్నది ఒంట పట్టదు" అన్నది పార్వతి.


"నువ్వు చెప్పేదానిలో లాజిక్ అర్ధమయింది. ఈ స్పీడ్ కాలంలో అందరం..... చేస్తున్న పని బానే ఉందని ఒకరిని చూసి ఒకరం అలాగే చేస్తున్నాం. పిల్లలు వేసే ప్రశ్నలకి జవాబులు చెబుతూ కూర్చోలేక, తప్పించుకోవటానికి ఈ పద్ధతి పాటిస్తున్నాం" అన్నది కళ్యాణి.


"ఈ కాలం పిల్లలు ఒకింత చురుకుగా, తెలివిగా ఉంటున్న మాట నిజమే! వారికి పెద్దవాళ్ళం దగ్గర కూర్చుని తిండి పెట్టవలసింది రెండు-మూడేళ్ళే! అప్పుడు ఒంటబట్టే తిండే వాళ్ళకి జీవితమంతా కావలసిన రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఓర్పు లేకపోతే దాని ఫలితం మళ్ళీ మనమేగా అనుభవించవలసింది! నలుగురిలో మాట్లాడుతూ కాకుండా ....ప్రశాంతంగా అన్ని రకాలైన పదార్ధాలతో అన్నం పెట్టాలి" అని ముగించింది పార్వతమ్మగారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు









66 views0 comments

Comments


bottom of page