మొక్కై వంగనిది...
- Varanasi Sudhakar

- 12 hours ago
- 5 min read
మొక్కై వంగనిది, వారణాసి సుధాకర్, పిల్లల పెంపకం, పేరెంటింగ్, క్రమశిక్షణ, కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతి, అమెరికా జీవితం, తెలుగు కథ, జీవన పాఠాలు

Mokkai Vanganidi - Telugu Inspirational Story | Varanasi Sudhakar
మొక్కై వంగనిది... - తెలుగు ప్రేరణాత్మక కథ | వారణాసి సుధాకర్
Published in manatelugukathalu.com on 30/07/2026
పిల్లలకు ప్రేమ ఎంత అవసరమో, క్రమశిక్షణ కూడా అంతే అవసరం. స్వేచ్ఛ పేరుతో అలవాట్లను వదిలేయాలా? లేక విలువలతో కూడిన జీవితాన్ని నేర్పించాలా? వారణాసి సుధాకర్ రచించిన "మొక్కై వంగనిది..." కథలో, అమెరికాలో నివసిస్తున్న కొడుకు, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అయిన తండ్రి మధ్య జరిగే సంభాషణ ద్వారా పిల్లల పెంపకం, కుటుంబ విలువలు, బాధ్యత, సమయపాలన, ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతను హృదయానికి హత్తుకునేలా వివరించారు.
"నాన్నగారూ, మీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు శ్రీధర్, తన తండ్రి కృష్ణమూర్తి గారితో.
"చెప్పు నాన్నా, నువ్వు వచ్చి, 'కొంచెం మాట్లాడాలి' అన్నావంటే, ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుంది కదా?" అన్నాడు ఆ నాన్నగారు.
"సీరియస్ అంటే, అంత సీరియస్ ఏమీ కాదు, నాకు చెప్పాలనిపించిన విషయం ఒకటి మీకు చెప్తాను..." అని నసుగుతున్నట్టు చెప్పాడు శ్రీధర్.
"తప్పకుండా నాన్నా, మనిద్దరి మధ్యా, ఎప్పుడూ మొహమాటాలు వుండక్కర్లేదు, నేను నీ ఫ్రెండుననుకుని, నిర్మొహమాటంగా, చెప్పదలుచుకున్న విషయం ఏదైనా, ఎప్పుడైనా, నిక్కచ్చిగా చెప్పడమే నాకిష్టం. నేనూ అలాగే వుంటాను...
నీక్కూడా 35 ఏళ్ళు దాటాయి కాబట్టి, నీ బాధ్యతలు ఆఫీసులోనూ, ఇంట్లోనూ సజావుగా నిర్వర్తిస్తూ, మీ పిల్లల భవిష్యత్తుకు కావలసిన అన్ని ప్రణాళికలూ వేసుకుంటూ, మీ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి సంపాదిస్తూ, మమ్మల్ని కూడా బాగా చూసుకుంటున్నారు కాబట్టి, మాకు సంతోషంగా వుంది. మన మధ్య ఎప్పుడూ * ‘కమ్యూనికేషన్ గ్యాప్’.. అదే, సమాచార లోపం వుండకూడదు, చెప్పు..." అన్నాడు ఆ నాన్న.
"మీరు మీ మనవడికి ఏవో పాతకాలపు సూక్తులు, సలహాలు చెప్పారుట...వాడు ఫీలవుతూ నాకు చెప్పాడు. మీరంటే అందరికీ గౌరవం, ప్రేమ వున్నాయి. మీ మనవళ్ళ దృష్టిలో మీ ఇమేజిని అలాగే వుంచుకోండి. తాతగారు, నాయనమ్మ అంటే, వాళ్ళకి ఎప్పుడూ సతాయించేవాళ్ళుగా కనపడకూడదు కదా?
వాళ్ళని వదిలేయండి. మేము కూడా వాళ్ళని, ఇక్కడ అమెరికా పద్ధతి ప్రకారం, పిల్లల్ని ఏమీ అనకుండా, తిట్టకుండా, కొట్టకుండా, స్వేచ్ఛా స్వాతంత్రాలతో పెంచుతున్నాం." అన్నాడు శ్రీధర్, కొంచెం మొహమాటపడుతూనే...
"బాగుంది నాయనా, మీ పిల్లల్ని మీ ఇష్టప్రకారమే పెంచుకునే హక్కు, అధికారం, బాధ్యత మీకున్నాయి. మాకు వాళ్ళమీద 'జ్యూరిస్డిక్షన్' అంటే… తెలుగులో… అధికార పరిధి లేదని మాకు తెలుసు. కాకపోతే కొన్ని అలవాట్లు, పనుల విషయంలో మా మనవళ్ళు దారి తప్పుతుంటే, చూస్తూ ఊరుకోలేం కదా?
నేనుకూడా, కొంత కాలంగా, నీతో ఈ విషయాలే మాట్లాడాలనుకుంటున్నాను...
ఎవరి పిల్లలో రోడ్డు మీద అడ్డంగా పరిగెడుతుంటేనే వాళ్ళ క్షేమం కోసం, అడ్డంపడి ఆపుతాం కదా, అలాంటిది… మా మనవల విషయంలో మీరూ పట్టించుకోక, మేమూ చెప్పకపోతే, వాళ్ళు, వాళ్ళకి తోచిన విధంగా పెరుగుతారు, అది మనకు అంగీకారమా?
'అమెరికా పద్ధతిలో పెంచుతున్నాం' అన్నావు కాబట్టి చెబుతున్నాను, మంచి పద్ధతులు ఇండియావైనా, అమెరికావైనా, మీరు 'ఇండో - అమెరికన్లు' కాబట్టి, అక్కడివి - ఇక్కడివి మంచి పద్ధతుల్ని కలిపి,*'ఇండో - అమెరికన్'* పద్ధతుల్ని నేర్పించండి.
మీ పిల్లలకి 12, 13 ఏళ్ళు రాగానే అమెరికా పద్ధతి ప్రకారం, 'గర్ల్ ఫ్రెండు', 'బాయ్ ఫ్రెండు' అని చదువు మానేసి, ఇక్కడి వాళ్ళలాగ తిరిగితే సహించగలరా?
నువ్వు ఈ విషయం ప్రస్తావించావు కాబట్టి కొంచెం వివరంగా చెప్తాను, విను! పూర్తిగా విన్నాక, మీకు ఎలా ఇష్టమైతే అలాగే చేయండి.
నేను మొదటి నుంచి నిక్కచ్చి మనిషినని, క్రమశిక్షణ విషయంలో రాజీ పడనని, నీకు, నీ చెల్లెలికి బాగా తెలుసు.
మేము ఆ రోజుల్లో మా పిల్లల్ని ఎలా పెంచామో, ఇప్పుడు, మీరు కూడా, మీ పిల్లల్ని అలాగే పెంచాలని నేననడం లేదు. కాలానుగుణంగా కొన్ని మార్పులు రావడం సహజం. కానీ పిల్లలకు తెలియక, పెద్దలు చెప్పక, ప్రకృతి విరుద్ధంగా, అనారోగ్యకర పద్ధతులు, ఆహార విహారాలు, క్రమశిక్షణకు విరుద్ధమైన అలవాట్లకు, బానిసలైపోతే, ఎవరికీ మంచి కాదు.
ముఖ్యంగా, ఎదుగుతున్న పిల్లల విషయంలో మనం వాళ్ళకి కొంత స్వేచ్ఛనిస్తూనే, పద్ధతిగా, మంచి అలవాట్లతో పెరిగేటట్టు చూడ్డం తల్లిదండ్రులుగా మీ బాధ్యత, అవసరం కూడా...
లేకపోతే, 'మొక్కై వంగనిది, మ్రానై వంగునా?' అన్నట్టు, ఒక వయసు వచ్చాక, వాళ్ళు మనం చెప్పేది వినకపోగా, వాళ్ళే మనల్ని శాసించే పరిస్థితి రావచ్చు.
నీకు అర్థం అవడానికి కొన్ని సందర్భాలు చెబుతాను విను...నేను చెప్పేది నీకు నచ్చకపోతే వదిలెయ్...నచ్చితేనే పాటించు. కానీ మొదట విను!
ఎనిమిది ఏళ్ళు కూడా నిండని మీ పిల్లలు, రాత్రి ఎన్నింటికి పడుకుంటున్నారో, అర్ధరాత్రి దాకా వాళ్ళ టాబుల్లో ఏం చూస్తున్నారో, మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా?
వాళ్ళు శలవలకి రాత్రుళ్ళు ఎప్పుడో పడుకుని, పొద్దుట, కాదు, మధ్యాహ్నం 11, 12 గంటలకి లేచి, అప్పుడు బ్రేక్ ఫాస్టులు చేస్తున్నారు. మళ్ళీ లంచ్ మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకు చేస్తున్నారు.
రాత్రి డిన్నర్ సంగతి, సరేసరి! శలవు రోజులు వస్తే, వాళ్ళు స్నానాలు కూడా చేయట్లేదు, మీకు తెలుసా?
'బయోలాజికల్ క్లాక్' అని ఒకటి వుంటుంది, తెలుసు కదా? అంటే...మన శరీర ధర్మాలకి ఒక పద్ధతి వుంటుంది. ఆకలి, నిద్ర, కాలకృత్యాలు, అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగకపోతే అవన్నీ గతి తప్పి, పేర్లుకూడా తెలియని రోగాల బారిన పడతాం.
మన పిల్లలకి ఆ గతి పడితే మనం భరించగలమా?
మీ చిన్నతనంలో మేము మిమ్మల్ని ఎలా పెంచామో గుర్తు చేసుకోండి. పొద్దున్న 6 లోపు లేవాల్సిందే, మీ స్కూలు టైముకి మీరే తయారై, అన్నీ సద్దుకుని స్కూలు రిక్షా ఎక్కాల్సిందే…
మళ్ళీ స్కూలు నుంచి వచ్చాక, అమ్మ ఇంట్లో చేసి పెట్టిన ఆరోగ్యకరమైనవి తిని, హాయిగా బయటికెళ్ళి ఆడుకుని వచ్చేవారు.
మళ్ళీ రాత్రి హోంవర్కులు పూర్తిచేసుకుని,
రాత్రి పది లోపు పడుకునేవారు.
'Go to bed early, wake up with joy' అని నీకు ఒక పద్యం వుండేది, గుర్తుందా? వేళకి పడుకుంటే, నిద్ర సరిపోయి, పొద్దుటే ఉత్సాహంగా మెలకువ వస్తుంది. తరవాత నిద్ర రమ్మన్నా రాదు.
మీరు చదువులో, ఆటపాటల్లో ముందుండేవారు. బాగా చదువుకుంటూ ఆరోగ్యంగా పెరిగారు కాబట్టే, ఇప్పుడిలా అమెరికాలో పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ వృద్ధిలోకి వచ్చారు. కానీ మీ పిల్లల విషయంలో మీకు వాళ్ళని ఎలా పెంచాలో తెలియక, అతిగారం చేసేస్తూ, స్వేచ్ఛ అనుకుని వాళ్ళని గాలికి వదిలేస్తే ఎలా తయారవుతారోనని భయంగా వుంది.
ఎదిగే వయసులో వాళ్ళకి ప్రతి వస్తువు విలువా తెలియాలి. వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం ప్రేమ కాదు, వాళ్ళకి చేస్తున్న అన్యాయం! అవసరానికి మించి అన్ని బట్టలు, బూట్లు, పుస్తకాలు, పెన్నులూ, పెన్సిళ్ళూ, సైకిళ్ళూ కొని పడేస్తుంటే, వాటి విలువ తెలియక, వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలియక, ఇల్లంతా...చివరికి బాత్రూంలో కూడా వాళ్ళ పెన్నులు, పెన్సిళ్ళూ దొర్లుతుంటే, దాన్ని క్రమశిక్షణ అందామా?
వాళ్ళు కొత్త సైకిలు కొనమని అడగ్గానే, మీ దగ్గర డబ్బులున్నాయి కదాని, వెంటనే కొనేయకూడదు. 'నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకుంటేనే, సైకిలు కొంటాను' అని చెప్పాలి వాళ్ళకి కూడా ఒకటి సాధించుకున్న తృప్తీ వస్తుంది, దానికోసం కృషి చేయవలసిన అవసరమూ తెలుస్తుంది.
మీ పిల్లల్ని ముద్దు చేయండి, అతిగారం చేయకండి, అప్పుడే వాళ్ళు బాగుపడతారు.
మీ ఇద్దరికీ వాళ్ళు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఎప్పుడు తింటున్నారో చూసే అవకాశం కూడా వుండట్లేదు. మీ ఉద్యోగాలు అలాంటివి! మేం ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాం కాబట్టి, అవన్నీ గమనిస్తున్నాం.
వాళ్ళకి పక్క బట్టలు సరిగా వేసుకోవడం, లేచిన తర్వాత వాటిని సరిగ్గా మడతపెట్టడం ఎప్పుడైనా నేర్పారా? వాళ్ళ బట్టల బీరువాలు ఎలా వుంటున్నాయో ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా?
రోజూ వాళ్ళు వదిలిన బట్టలు, కనీసం, వాషింగు మెషీన్ దగ్గిర పెట్టలేరా? మీరో, మేమో పెట్టాలా?
అవసరం లేనప్పుడు వాళ్ళ గదిలో ఫ్యాన్లు, లైట్లు ఆపాలని మీరు ఎప్పుడైనా వాళ్ళకి చెప్పారా? వాళ్ళు స్కూలుకి వెళ్ళిపోయినా, ఫ్యాన్లు తిరుగుతూనే వుంటాయి, లైట్లు వెలుగుతూనే వుంటాయి, గమనించారా? అసలు వాళ్ళ గదిలోకి వెళ్ళి, ఎలా వుంటోందో ఎప్పుడైనా చూశారా?
ఎవరైనా గెస్టులు ఇంటికి వచ్చినప్పుడే ఇల్లంతా నీటుగా సద్దుకోవడం కాదు, మనకోసం సద్దుకోవాలి.
వాళ్ళు తినేది తక్కువ, పడేసేది ఎక్కువ! అది ఎవరి సొమ్ము? అస్తమానూ జంక్ ఫుడ్లు, ఐస్ క్రీములు, కేకులు, స్వీట్లు తిని బరువు పెరిగిపోతున్నారు. మీకు తెలియట్లేదా?
బొద్దుగా, ముద్దుగా వున్నారనుకుంటున్నారు కానీ, ఎంతసేపూ టీవీలో ఏవో చూడ్డం, వాళ్ళ టాబుల్లో గేమ్స్ ఆడుకోవడం తప్ప, బయటకెళ్ళి శారీరక శ్రమ చేస్తూ ఆటలు ఆడుతున్నారా?
పిల్లలకి బయట ఆటలు, సైకిలు, స్విమ్మింగు లాంటివి లేకపోతే ఆరోగ్యంగా ఎలా పెరుగుతారో ఆలోచించారా? ఇవన్నీ చెబితే మీకు చాదస్తపు మాటలుగా అనిపించొచ్చు కానీ...మీరు పట్టించుకోవాల్సిన అత్యవసర విషయాలు!
ఎంతసేపూ వీకెండ్లు వస్తే, బయటకి వెళ్ళి, తినేసి ఎంజాయ్ చేద్దామనే గాని, పిల్లల విషయం ఆలోచించి, వాళ్ళకి సక్రమమైన అలవాట్లు చేయాలని మీకు తట్టకపోవడం బాధగా వుంది.
పిల్లలు చెడిపోవడానికి, క్రమశిక్షణ నేర్పని పెద్దలే చాలావరకు కారణం అనేది నా అభిప్రాయం.
ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. వాళ్ళ స్కూలు బస్సు వచ్చే సమయానికి వాళ్ళే అన్నీ సద్దుకుని, తయారుగా వుండేటట్టు మనం తర్ఫీదు ఇవ్వాలి.
వాళ్ళు ట్యాబులు చూసుకుంటూ కూర్చుంటే, వాళ్ళ కాళ్ళకి సాక్సు, బూట్లు తొడగడం, చెంచాతో బ్రేక్ ఫాస్ట్ తినిపించడం అవసరమా? వాళ్ళని స్వయంగా అన్నీ నేర్చుకుంటూ ఎదగనివ్వరా?
మీకు భోజనం చేయడానికే టైము వుండట్లేదు, 6, 8 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి చెంచాలతో అన్నీ తినిపించాలా? ఎప్పుడైనా మేము పెడితే చక్కగా కూర్చుని, వాళ్ళే కలుపుకుని తింటున్నారు, గమనించారా?
నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పాను, ఇక మీదట, మీకు తోచిన విధంగా మీరు చేయండి. నడు, చీకటి పడుతోంది, మేము వేళకి తిండి తినాలి, పదింటికల్లా పడుకోవాలి.
మీరూ, మీ పిల్లలూ ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని, అభివృద్ధిలోకి రావాలని, కోరుకునే వాళ్ళం మేమే! God bless you" అని, రిటైర్డ్ హెడ్ మాస్టారు తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించేసరికి, సీరియస్ గా ఆలోచనలో పడ్డాడు శ్రీధర్...
...బహుశా తన పిల్ల మొక్కల్ని ఎలా వంచాలా అని!
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐
***
వారణాసి సుధాకర్ గారి కొన్ని ఇతర రచనలు:
వారణాసి సుధాకర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
అందరికీ నమస్కారం.
నా పేరు వారణాసి సుధాకర్.
పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...
హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.
కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.
LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.
ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.
ఇదీ క్లుప్తంగా నా పరిచయం.
🙏








Comments