top of page
Original.png

మౌన రోగం!

1 hour ago
7 min read

మౌన రోగం కథలో ఆసుపత్రిలో భర్త చేతిని పట్టుకున్న మాధురి, పశ్చాత్తాపంతో చూస్తున్న అనిరుధ్, మహిత

Mouna Rogam - Telugu Family Story | Sripathi Lalitha

మౌన రోగం! - తెలుగు కుటుంబ కథ | శ్రీపతి లలిత 

Published in manatelugukathalu.com on 10/11/2026


భార్యాభర్తల మధ్య సమస్యలకు మౌనం పరిష్కారం కాదు. ‘మౌన రోగం!’ కథ దాంపత్య జీవితంలో మాటల ప్రాధాన్యతను, మౌనహింస వల్ల కలిగే బాధను హృదయాన్ని హత్తుకునేలా చెబుతుంది.


“ఏమైంది, మహితా!” తమ బెడ్‌రూమ్‌లో నుంచి కళ్లనీళ్లు తుడుచుకుంటూ వస్తున్న కోడలిని అడిగింది మాధురి.


“ఏం లేదు, అత్తయ్యా! ఏదో నలక పడింది!” గబగబా బయటికి వెళ్లిపోయింది.

మరికాసేపటికి మ్లానమైన మొహంతో బయటికి వచ్చిన అనిరుధ్‌ని చూశాక, ఏదో అయిందని అర్థమైంది.


సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి రూములోకి వెళ్లిన మహిత వెనకే, టీ తీసుకుని వెళ్లింది మాధురి.


“మహితా! నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావని తెలుస్తోంది. అనిరుధ్‌తో జీవితాంతం కలిసి ఉండాల్సినదానివి.


చిన్న చిన్న తేడాలుంటే మీ రూము లోపల పరిష్కరించుకోవాలి, తెల్లారేసరికి కలిసిపోవాలి. 


పొద్దున్నే మీ ఇద్దరూ కళావిహీనమైన మొహాలతో ఉంటే అందరికీ తెలుస్తుంది.


నాకు సంగతి చెప్తే చేతనైతే పరిష్కరిస్తాను, లేదా సలహా చెప్తాను.”


మహిత కళ్ల నుంచి నీళ్లు ధారగా కారిపోయాయి.


“మా పెళ్లి అయ్యి నాలుగు నెలలు అయింది అత్తయ్యా! నాకు మాత్రం యుగాలు గడిచినట్లు ఉంది. ఎందుకంటే నేను ఏమాత్రం సంతోషంగా లేను.


నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజులు. ఇందులో కనీసం అరవై రోజులు అనిరుధ్ నాతో మాట్లాడలేదు.


ఉన్నట్టుండి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతాడు. ఏం జరిగిందో తెలీదు! ఎందుకు అంటే చెప్పడు. నా వల్ల ఏం తప్పు జరిగిందో తెలిస్తే నేను సర్దుకుంటాను. ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చెక్కిపోతోంది.


ఈ టెన్షన్‌తో ఆఫీసులో కూడా పని సరిగ్గా చెయ్యలేకపోతున్నా! తను మాత్రం ఏమీ జరగనట్లు ఉంటాడు.


ఇలా మౌనంగా హింస పెడితే నేను తట్టుకోలేను. విడాకులు ఇచ్చేయాలా అన్న ఆలోచన ప్రతి రోజూ వస్తోంది!” ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.


అవాక్కయింది మాధురి. ‘హిస్టరీ రిపీట్స్ అంటారు, అంతేనా!’


“తొందరపడకు మహితా! నాకు కొంచెం టైమివ్వు. ప్రస్తుతం నువ్వు కూడా ఆ మౌన మంత్రమే పాటించు. ఈ మౌనరోగానికి మొదట్లోనే వైద్యం చెయ్యాలి, లేదంటే నీ జీవితం కూడా నా బతుకులాగా అవుతుంది.”


ఉన్నట్టుండి చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్న అత్తగారిని ప్రశ్నార్థకంగా చూసింది.

“కూతురు లేని నిన్ను కూతురులానే అనుకున్నాను.


నా ఇన్నేళ్ల బాధ పంచుకోవడానికి ఒక తోడు దొరికింది అనుకున్నాను.


ఈ ఇంట్లో నేను మనసు విప్పి మాట్లాడుకునే మనుషులే లేరు. అనిరుధ్‌తో చెప్పినా అర్థం చేసుకుంటాడో లేదో తెలీదని ఇన్నేళ్లు నా మనసులోని బాధని దిగమింగుకున్నాను.


నేను అనుభవించింది నువ్వూ అనుభవించకూడదు.”

పాతికేళ్ల బాధని పాతిక నిమిషాల్లో పంచుకుంది మాధురి.


“ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు, ఈ దెబ్బతో మన ఇద్దరికీ పరిష్కారం దొరకాలి అత్తయ్యా! ఇన్నిరోజులూ, మీరు మామయ్యగారితో చాలా ముభావంగా ఉండడం అర్థంకాక మిమ్మల్ని తప్పుపట్టాను.


ఇక్కడ ఉండలేక అమ్మ దగ్గరికి వెళ్దామనుకున్నాను, అది బాధతో. ఇప్పుడు ఒక ఆశతో, ధైర్యంతో వెళుతున్నాను.”


గబగబా బట్టలు సర్దుకుని, క్యాబ్ పిలిచి వెళ్లింది మహిత.


“ఇదేంటి? ఆ అమ్మాయి ఇంత సడన్‌గా వెళ్లింది ఎక్కడికి?” మాధురి భర్త రవీంద్ర అడిగాడు.


“పుట్టింటికి!”

“ఎందుకూ?”

“మీ కొడుకుని అడగండి.” రూములోకి వెళ్లింది.


సాయంత్రం అనిరుధ్ ఆఫీస్ నుంచి వచ్చి, “మహిత ఇంకా రాలేదా?” తల్లిని అడిగాడు.

అడ్డంగా తలూపింది.

“నా ఫోన్ తీయడం లేదు, ఎక్కడికి వెళ్లింది!”


‘ఏమో!’ అన్నట్లు చూసింది.


రాత్రంతా అస్థిమితంగా రూములోకి, బయటికి తిరిగాడు.


ఉదయం ఆఫీస్‌కి తయారయ్యి, “అమ్మా! నేను ఫోన్ చేస్తే తీయడం లేదు. నువ్వు మహితకి ఫోన్ చెయ్యి, లేదంటే వాళ్ల అమ్మగారికి చేసి కనుక్కో. నాకు కంగారుగా ఉంది!”


“ఏం దెబ్బలాడుకున్నారా? నువ్వు ఆ అమ్మాయిని ఏమన్నా అన్నావా?”


“నేనా! నేనెందుకు గొడవపడతాను? నచ్చకపోతే జస్ట్ కామ్‌గా ఉంటాను!” అనిరుధ్ చెప్తుంటే రవీంద్ర కూడా లేచి వచ్చాడు.


“ఏంటి! మహిత నీకు ఫోన్ చెయ్యలేదా?” కొడుకుని అడిగాడు.


“లేదు, నాన్నా! నేను చేస్తుంటే తీయడం లేదు.”


“టిఫిన్ రెడీ!” మాధురి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చెప్పింది.


అనిరుధ్ ప్లేట్‌లో పెట్టింది ఏమిటి అని పట్టించుకోకుండా, వేళ్లతో ఇడ్లీని నలుపుతున్నాడు.

“ఇవాళ నువ్వు ఆఫీసుకి సెలవు పెట్టు అనిరుధ్! చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి!”


తల్లి మాటలకి, “సెలవా!” అన్నాడు.


“కుదరకపోతే కనీసం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లు!” భర్త వైపు చూసి, “మీరు కూడా ఉండాలి. ఇది మనిద్దరికీ సంబంధించింది!”


“వాడి పెళ్లాం పుట్టింటికి వెళ్తే నాకేంటి సంబంధం!” కోపంగా అన్నాడు రవీంద్ర.


“మీకు కాదు, మనకి.” హాలులో సోఫా దగ్గరికి నడిచింది.


“పెళ్లి మేము కుదిర్చాం. పెళ్లయ్యి నాలుగు నెలలు అయింది. మహిత గురించి నీకేం తెలుసు? తన ఇష్టాలు, అభిరుచులు… నీ హాబీల గురించి ఆమెకి ఏం చెప్పావు?” కొడుకుని అడిగింది.


సమాధానం లేదు.


“మొన్న పార్టీకి వెళ్లి వచ్చినప్పటి నుంచి నువ్వు మహితతో ఎందుకు మాట్లాడడం లేదు? ఇదే మొదటిసారా! ఈ నాలుగు నెలల్లో, కోపంతో మౌనంగా ఎన్నిసార్లు ఉన్నావు?” మాధురి అడిగితే,

“నేను మాట్లాడడం లేదని మహిత చెప్పిందా!


ఆ పార్టీలో చిన్నప్పటి స్నేహితులట, మగపిల్లలు, ‘ఏయ్! ఓయ్!’ అని పిలవడం, భుజం మీద చెయ్యి వేసి మాట్లాడడం… నాకు నచ్చలేదు. నాకు నచ్చనివి ఉంటే, మౌనంగా ఉంటే, తనకి అర్థమవుతుందని!” మొహమంతా ఎర్రగా చేసుకుని అన్నాడు.


“అక్కడ నీకు ఏది నచ్చలేదో తనకు ఎలా తెలుస్తుంది? తన డ్రెస్ నచ్చలేదా, ఫ్రెండ్స్ నచ్చలేదా, వాళ్ల మాటలు నచ్చలేదా, లేక అక్కడ భోజనం నచ్చలేదా? నచ్చనివి, ఇష్టం లేనివి ఉంటే స్పష్టంగా, మనసు విప్పి చెప్పాలి. 


ఆమెకి దివ్యదృష్టి లేదు కదా! అయినా చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో సన్నిహితంగా ఉంటే తప్పేంటి?”


“నేను చెప్తే గొడవలే కదా! దాని బదులు మౌనంగా ఉంటే నాలుగు రోజుల్లో ఇద్దరం సర్దుకుంటాం!”


“ఎప్పుడూ ఆమే కదా సర్దుకుంటోంది. ఈ మౌన రోగం మీ నాన్న దగ్గర నేర్చుకున్నావా!

నువ్వు వారంలో నాలుగు రోజులు మాట్లాడడం లేదని, మనసు విప్పి ఏమీ చెప్పట్లేదని, మౌనంగా హింస పెడుతున్నావనే కారణాలతో నీకు విడాకులు ఇద్దామని నిశ్చయించుకుంది. లాయర్ నోటీస్ ఇప్పిస్తానని చెప్పి వెళ్లిపోయింది!”


“విడాకులా!” మొహంలో రంగు ఎగిరిపోయింది అనిరుధ్‌కి.


“బావుందే! ఊరికే గొడవలు పడేకన్నా, మౌనం ఉత్తమం అని చెప్పాను. తప్పా! మన ఇద్దరం అలా ఉండబట్టే మనని అందరూ మంచి దంపతులు అనుకుంటారు!” రవీంద్ర కోపంగా అన్నాడు.


“అందరూ అనుకుంటే సరిపోయిందా! మిమ్మల్ని భరిస్తున్న భార్యను నేను అనుకోవాలి. పెళ్లయిన దగ్గర నుంచి మీరు పెడుతున్న మౌనహింస భరించలేక చిత్రహింస పడుతున్నాను.


భార్యాభర్తల మధ్య సమస్యలు, అభిప్రాయ భేదాలు రాకుండా ఉండవు. ఇద్దరూ వేర్వేరు నేపథ్యాలున్న కుటుంబాల నుంచి వస్తారు.


ఆ భేదాలని ఇద్దరూ కూర్చుని పరిష్కరించుకోవాలి. అంతేగాని, ఒకరు మౌనంగా ఉండి అవతల వాళ్లని అయోమయంలో పడేస్తే ఎలా? గట్టిగా అందరూ వినేలా పోట్లాడుకోవడం, లేదా మౌనంగా ఉండడం… ఈ రెంటికీ మధ్యే మార్గం లేదా! మన సంగతే చూడండి.


మీకు పెళ్లయిన కొత్తలో కూరలో ఉప్పు తక్కువైతే కోపం, పప్పులో కారం ఎక్కువైతే కోపం. ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే కోపం, ఫోన్‌లో ఎవరితోనైనా ఎక్కువ సేపు మాట్లాడితే కోపం. మీకు నచ్చని రంగు చీర కడితే కోపం.


ఇలా ఆ కోపానికి ఒక కారణం లేదు. కోపం వస్తే నాలుగు రోజులు మూతి ముడుచుకుని ఉండేవారు. ఏమైందో తెలియక తెగ బతిమిలాడేదాన్ని.


అప్పుడు చెప్పేవారు—‘మొన్న కూరలో ఉప్పు సరిపోలేదు. ఆ రోజు నువ్వు కట్టిన చీర నచ్చలేదు’ అంటూ…


అది వెంటనే చెప్పొచ్చుగా! అప్పుడే చెప్తే గొడవలు అవుతాయి అంటారు. చెప్పే విధానంలో చెప్తే గొడవ ఎందుకు అవుతుంది? చిన్నవాటికి అరుపులు, కేకలు, తిట్లు ఉంటే గొడవలు.


మీతో జీవితం నాకు ప్రతి రోజూ కత్తి మీద సామే. ఎప్పుడు, దేనికి కోపం వస్తుందో తెలియక టెన్షన్.


ఏదో మీరు బాస్, నేను మీ కింద పనిచేసే మనిషిని, మిమ్మల్ని మెప్పించడమే నా ధర్మం, బాధ్యతలాగా బతికాను తప్ప, ఏ రోజూ మీ జీవితభాగస్వామిగా బతకలేదు.


ఆ అసంతృప్తి రోజురోజుకూ ఎక్కువైంది, కానీ తగ్గలేదు. నా వైవాహిక జీవితంలో ఆనందమే లేదు. ఏం మాట్లాడితే మీకు మౌనరోగం వస్తుందో తెలీక మాటలు తగ్గించాను.


ముందు నుంచి గలగలా కబుర్లు చెప్పే నాకు మౌనం అంటే ఎంత హింసో తెలుసా?

అందరూ మీ మౌనహింస గురించి విమర్శిస్తుంటే, నేను ఎంత కుమిలిపోయానో మీకు తెలీదా? తెలీనట్లు ఉండేవారా!


మనం కుటుంబంతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాం. అందరం రకరకాల వంటలు చేసుకుని వెళ్లాం. రైల్లో సరదాగా మాట్లాడుకుంటూ, మీరు పూరీ అడిగితే, నేను సరిగ్గా వినకుండా పులిహోర వేశాను.


అంత చిన్న విషయానికి మీరు అలిగి, ఇంటికి వచ్చేదాకా నాతో మాట్లాడలేదు, నా పక్కన కూర్చోలేదు. అందరికీ మీకు కోపం వచ్చిందని ఎంత స్పష్టంగా తెలిసిందో! మీ వదిన అయితే, ‘రవి అంత సీరియస్ అయ్యాడేమిటి, మాధురీ! అందరి మధ్యా అలా మూతి ముడుచుకుని ఉంటే ఏం బావుంటుంది!’ అన్నారు.


ఆ క్షణమే, మిమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి అనిపించింది.


మా తమ్ముడి గృహప్రవేశానికి వెళ్లినప్పుడు, నేను మా చుట్టాలతో కబుర్లు చెప్తూ, మిమ్మల్ని పట్టించుకోలేదని, నిమిషనిమిషానికి కాఫీలు, టిఫిన్లు అడగలేదని అలిగారు. ఏం, మీరడిగి తినలేరా? ఆ మాత్రం స్వతంత్రంగా ఉండలేరా?


అప్పుడు కూడా అంతే! కోపంతోనే గదిలో ఉండిపోయారు. మీరు అరవలేదు, గొడవ పెట్టుకోలేదు, నిజమే.


కానీ మీకు కోపం వచ్చిందని అందరికీ తెలిసింది. మా తమ్ముడు వచ్చి మిమ్మల్ని ఎంత బతిమిలాడినా బయటికి రాలేదు.


అప్పుడే మీకు విడాకులు ఇద్దామనుకున్నాను. అనిరుధ్ భవిష్యత్తు గురించి ఆలోచించి ఆగాను.


ఆ రోజు నుంచి మీకు కోపం వచ్చి మాట్లాడకపోతే, ఎందుకు అని అడగడం కానీ, బతిమిలాడడం కానీ మానేశాను. నేను కూడా మౌనం పాటిస్తూ వచ్చాను.


ఎక్కడా సరదా మాటలు, నవ్వులు లేని ఈ ఇల్లు ఎంతో శూన్యంగా అనిపిస్తుంది నాకు.

మీరు మాత్రం పట్టనట్టు ఉన్నారు. ఒక్కసారి కూడా ‘ఎందుకు ఇలా ఉన్నావు?’ అని అడగలేదు. అసలు, నేనలా ఉండడం గమనించారో లేదో కూడా తెలియదు.


మానసికంగా ఏమాత్రం దగ్గరతనం లేని మనం మంచి దంపతులు ఎలా అవుతాం?”

అనిరుధ్ వంక తిరిగి,

“నా ఖర్మ కొద్దీ ఏ గుణాలు వచ్చినా రాకపోయినా ఈ మౌనరోగం వచ్చింది. 


మీ నాన్న చెప్పినంత మాత్రాన వినాలా? నీకు బుర్ర లేదా?

ఆ మాత్రం ఆలోచన నీకు లేదా? ఆయనకీ, నీకూ ఒక తరం తేడా ఉందిగా!

పెళ్లాం అంటే ఒక బార్బీ బొమ్మ కాదుగా, చక్కగా తయారయ్యి, ఏ ఇష్టాయిష్టాలు, అనుభూతులూ లేకుండా ఉండడానికి? భార్యాభర్తలు, ఒకరి తర్వాత ఒకరు మౌనం పాటిస్తే, ఏడాదికి 365 రోజులు ఇంట్లో మౌనమే.


ఇంక ఇల్లెందుకు? కాపురమెందుకు?

అందుకే, ఒక దెబ్బకి రెండు పిట్టలు లాగా నేనూ, నా కోడలు, విడాకుల లాయర్ దగ్గరికి వెళ్లి విడాకులు తీసుకుంటాం. తండ్రీ, కొడుకూ ఇద్దరూ ఎంతకాలం కావాలంటే అంతకాలం మౌనం పాటించండి.”


ఎన్నో ఏళ్ల నుంచి కడుపులో దాచుకున్నదంతా బయటికి కక్కేసింది మాధురి.

తెల్లబోయి చూస్తున్న తండ్రీకొడుకులని వదిలేసి, బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్లిపోయింది.


“ఏంటి, నాన్నా! మీ వల్ల అమ్మ ఇంత బాధపడిందా? నా చదువు, ఉద్యోగం హడావిడిలో అసలు గమనించలేదు. మీరు మీ భార్యని మౌనంతో ఇంతగా బాధపెట్టి, నాకూ అదే పాటించమని సలహా చెప్పారా? నేనూ భార్యకి దూరమై బాధపడాలనా!” కోపంగా అడిగిన కొడుకుని చూసి మౌనంగా ఉండిపోయాడు రవీంద్ర.


మహితకి ఫోన్ చేద్దామనేలోగా, ఆమె దగ్గర్నుంచే ఫోన్ వచ్చింది.


“అనిరుధ్! మీ అమ్మగారు నన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. నేను గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ చాలా గాభరాగా, ఒళ్లంతా చెమటలు కారుతూ ఉన్నారు. ఇక్కడ పక్క సందులో ఉన్న ఆసుపత్రికి వచ్చాం. ఆవిడకి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని అడ్మిట్ చేసుకున్నారు!”

మాటల్లో కొద్దిగా భయం, కంగారు ధ్వనించింది.


“ఆఁ! నేను వస్తున్నా!

నాన్నా! అమ్మకి హార్ట్ ఎటాక్ అట, మహిత ఆసుపత్రిలో చేర్చిందట!”


“అదేంటి! ఇప్పుడేగా బయటికి వెళ్లింది…”

తండ్రిని పట్టించుకోకుండా కంగారుగా వెళ్లిపోయాడు అనిరుధ్.


ఈసీజీ మెషిన్, బీపీ మానిటర్‌కి కనెక్ట్ అయిన ట్యూబులు, చేతికి సెలైన్ ఎక్కుతోంది.

తల్లిని చూడగానే కళ్లనీళ్లు పెట్టుకున్న అనిరుధ్‌ని మహిత భుజం తట్టి ఓదార్చింది.


“డాక్టరుగారితో మాట్లాడాను. మైల్డ్ స్ట్రోక్ అన్నారు. ఏదో టెన్షన్ వల్ల వచ్చి ఉండొచ్చు అన్నారు. మందులతో తగ్గుతుందట. ఇవాళ చూసి రేపు డిశ్చార్జ్ చేస్తారు,” మహిత చెప్పింది.


“నన్ను క్షమించగలవా, మహితా! చదువుకున్న మూర్ఖుడిని, సొంత ఆలోచన లేని వేస్ట్ ఫెలోని! గొడవల కన్నా మౌనం మంచిదనుకున్నాను. దాని వల్ల ఎంత టెన్షన్ పెరుగుతుందో ఇప్పుడే తెలిసింది.


ఇంకనుంచి ఏ విషయమైనా ఇద్దరం కలిసి మాట్లాడుకుని పరిష్కరిద్దాం!”

కళ్లలో నీళ్లు నిండగా, అతని చెయ్యి ప్రేమగా పట్టుకుని తలూపింది మహిత.


అంతలోనే లోపలికి వచ్చాడు రవీంద్ర.


కళ్లు ఉబ్బిపోయి, ఎర్రబడిన మొహంతో ఉన్న అతన్ని చూస్తేనే ఏడ్చాడని అర్థమవుతుంది.

అనిరుధ్ ఏదో అనేలోగా మహిత ఆపింది.


నెమ్మదిగా వెళ్లి, మాధురి చెయ్యి పట్టుకుని నిమిరాడు. అతని కళ్లనీళ్లు ఆమె చేతి మీద పడ్డాయి.


తల పక్కకి తిప్పుకున్న మాధురి కళ్ల నుంచి నీళ్లు కారాయి.


“ఎందుకు మీరందరూ ఆవిడని ఏడిపిస్తున్నారు? ఇక్కడ ఎవరూ ఉండొద్దు. వెళ్లిపోండి!” నర్స్ గొంతు కొంచెం కఠినంగా వినిపించింది.

మహిత, అనిరుధ్ బయటికి నడిచారు.


“ఆవిడ నా భార్య!”


“భార్య మీద అంత ప్రేముంటే బయట వెయిటింగ్ హాల్‌లో కూర్చోండి! ఇక్కడ నుంచి లేవండి!” స్ట్రిక్ట్‌గా చెప్పింది.


మందుల వల్ల మాధురి కళ్లు మూసుకుపోతున్నాయి.

“నేను ఇక్కడే హాలులో ఉంటాను, మధూ!”


భర్త మాటలకి నెమ్మదిగా కళ్లు తెరిచి, చిన్నగా నవ్వి తలూపింది మాధురి.


ఆ నవ్వులో ‘నిన్ను క్షమించాను!’ అన్న భావం కనిపించి, ధైర్యంగా ముందుకు కదిలాడు రవీంద్ర.


                                    సమాప్తం








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y

 

శ్రీపతి లలిత  గారి కొన్ని ఇతర రచనలు:





శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

శ్రీపతి లలిత
శ్రీపతి లలిత

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page