top of page
Original.png

చిరునవ్వుల మోము

5 hours ago
4 min read

తండ్రి పక్కన నిలబడి జానకత్తకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్న వైద్యురాలు ప్రేమ

Chirunavvula Momu - Telugu Family Story | Malla Karunya Kumar

చిరునవ్వుల మోము - తెలుగు కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 10/11/2026


“చిరునవ్వుల మోము” తండ్రి ఆశయం, పల్లెపై మమకారం, కుటుంబ అనుబంధాలు, మానవీయ బాధ్యతలను గుర్తుచేసే హృద్యమైన కథ. తనవాళ్లకు అండగా నిలవాలనే తండ్రి ఆకాంక్షను ఓ వైద్యురాలు చివరకు అర్థం చేసుకునే భావోద్వేగ ప్రయాణమే ఈ కథ.


రెండు ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ, ఉత్సాహపరుస్తూ ఆప్యాయంగా మాట్లాడే నాన్న ఇప్పుడు ఏదో తెలియని అసంతృప్తితో ఉన్నారు. 


నేను వచ్చానని తెలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా ముందు వాలిపోయి, ఎనలేని ప్రేమని గుమ్మరించే జానకత్త... నేను వచ్చి రెండు రోజులైనా కనిపించడం లేదు ఏమిటి? అంతరంగంలో ప్రశ్నలు సంధించుకుంటూ గుమ్మం దగ్గర కూర్చున్నాను. 


ఇంతలో నేను వచ్చానని తెలిసి కొంతమంది ఊరివాళ్లు నా దగ్గరకు వచ్చారు. ఉభయకుశలోపరి వివరాలు తెలుసుకునేసరికి చాలా సమయం ఇట్టే గడిచిపోయింది. 


సరిగ్గా అప్పుడే ఉలిక్కిపడేలా శబ్దం చేయడం మొదలుపెట్టింది పాతకాలపు గడియారం. ఒక్కసారిగా నా చూపు దాని మీదకు పోయింది. 


సరిగ్గా సమయం పన్నెండు గంటలు కావస్తోందని చూపిస్తుంది. భోజనం సమయం అవుతున్నా ఇంటికి చేరుకోని నా కొడుకు వైపుకు నా ఆలోచన మళ్లింది. 


ఇక్కడకు వచ్చి రెండు రోజులే అయినా వాడు చాలామంది స్నేహితులను ప్రోగు చేశాడు. బహుశా వాళ్లతో వెళ్లి ఉంటాడని ఊహించి, "ఈ ఊర్లో పిల్లలు ఎక్కువగా ఎక్కడ ఆడుకుంటూ ఉంటారు?" అని నా దగ్గర ఉన్నవాళ్లను అడిగాను.


"రాజుగారి కల్లం దగ్గర ఆడుకుంటూ ఉంటారమ్మ" అని సమాధానం ఇచ్చారు వాళ్లు. "సరే, నేను అలా వెళ్లి మా అబ్బాయిని తీసుకువస్తాను" అని వాళ్లతో చెప్పి, రాజుగారి కల్లం వైపుకు బయలుదేరాను. 


మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రతి గుమ్మం వైపుకు చూసుకుంటూ ముందుకు సాగుతున్నాను. 


కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఇక తమదే రాజ్యం అంటూ ఇంటి ఆవరణ గడ్డి మొక్కలతో నిండిపోయి ఉంది. స్వచ్ఛమైన ఆ పల్లె గాలి మేనును తాకుతూ ఏదో తీయని అనుభూతిని ఇస్తుంది. 


చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు వచ్చి నా మనస్సును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా ఘల్లుమని శబ్దం వినిపించడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చాను. పక్కకి చూశాను. 


కబడ్డీ ఆడుతూ కేరింతలు కొడుతున్న పిల్లలు కనిపించారు. మాసిన బట్టలతో దర్శనమిచ్చాడు ఆదిత్య. 


ఒక వైద్యురాలుగా ఆదిత్య పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండే నేను, వాడు ఆ విధంగా కనిపించేసరికి నా ఆగ్రహాన్ని నియంత్రించుకోలేకపోయాను. 


పరుగున వెళ్లి, ఆదిత్య రెక్క పట్టుకుని పక్కకు లాగి, "రేయ్! అవకాశం దొరికితే చాలు, ఇలా తయారవుతావు. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు డస్ట్ అలర్జీ ఉంది. 


జాగ్రత్తగా ఉండమని!" గట్టిగా అరిచాను. "ప్రేమా! ఏంటమ్మా అంత ఆవేశం! చిన్న పిల్లాడు కదా... ఆడుకోనివ్వు."


అప్పుడే అక్కడకు చేరుకున్న నాన్న నన్ను నిలువరించారు. నాన్న మాటలు విని నన్ను సముదాయించుకుని, "అది కాదు నాన్నా..." చెప్పే లోపలే, "ప్రేమా! చెప్పాను కదా..." అని కాస్త అసహనంగా నాన్న పలకడంతో మౌనంగా ఉండిపోయాను.


కొంత సమయం ఆగి, ఎప్పటి నుండో నా మస్తిష్కాన్ని తొలిచేస్తున్న విషయాన్ని నాన్న నుండి రాబట్టాలని, "నాన్నా! మీకు ఏమైంది? మీరు ఏదో విషయం గురించి దిగులుతో ఉన్నారు అనిపిస్తుంది?" అని అడిగాను.


"నేనా? నేను దేని గురించి ఆలోచించడం లేదే?" "అది కాదు నాన్నా! మీరు ఇదివరకటిలా ఉండడం లేదు." "ఫోన్లో మాటలే తప్పించి, నన్ను నేరుగా చూసి చాలా రోజులు గడిచాయి కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంటుంది. 


సరే, ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి... ఆదిత్యను ఈ పిల్లలతో కలిసి ఆడనివ్వు... ఈ మధుర జ్ఞాపకాలు వాడికి మళ్లీ దొరుకుతాయో లేదో... ఈ తాతగారి ఊరు గురించి వాడికి తెలియడం అవసరం. 


ఎందుకంటే ఈ పల్లె ఆప్యాయతలు, అనుబంధాలు రానురాను దొరకడం కష్టం కదా... రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఉంటుందో లేక వలసలతో బోసిపోతుందో తెలియదు?" నాన్న మాటలు నన్ను ఆలోచనల్లోకి నెట్టేశాయి.


కొనసాగింపుగా, "ఇప్పటికే చాలామంది నగరాల్లో స్థిరపడ్డారు. సరైన ఉపాధి అవకాశాలు లేక ఉన్న కొందరు వలసలు వెళ్లిపోయారు. ఇదిగో నాలాంటి వయస్సు మళ్లినవాళ్లు, ఊరిపై మమకారం చావక, ఎటూ కదలలేక ఇక్కడే ఉండిపోయాము."


నాన్న స్వరం లో తెలియని బాధ ప్రతిధ్వనిస్తోంది.

ఆ బాధ నుండి నాన్నను మరల్చడానికి ప్రయత్నం చేయడం ప్రారంభించాను, "అవును నాన్నా, నా రాక గురించి తెలిస్తే ఎక్కడున్నా క్షణాల్లో నా ముందు వాలిపోయే జానకత్త కనిపించడం లేదు ఏమిటి?" అని అడిగాను.


"ఏం చెప్పమంటావు తల్లి? జానకి మనవడికి ఏదో చర్మ వ్యాధి సోకింది. పాపం ఆ వ్యాధి ఏమిటన్నది నిర్ధారణ కావడం లేదు. ఆసుపత్రులు తిరగడంతోనే రోజులు సాగిపోతున్నాయి మీ అత్తకు." "అయ్యో! నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు. 


మీ అల్లుడుగారు చర్మ వ్యాధి నిపుణులు అని మీకు కూడా తెలుసు కదా?" "నీతో చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు తీరిక లేక ఉంటావు కదా తల్లి. అందుకే చెప్పలేదు."


మౌనం దాల్చారు నాన్న. నాన్న మాటలు విని మౌనం దాల్చాను. నాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చి ఇంత ప్రయోజకురాలిని చేసిన నాన్నకు నా దగ్గర ఒక మాట చెప్పే అవకాశం లేకుండా చేశాను. 


నేను నాన్నకు ఎంత దూరం అవుతున్నది నాకు అర్థమయ్యింది. నిజానికి నా ఇష్టానికి గౌరవం ఇచ్చిన నాన్న మాటను కాదని నేను ప్రవర్తించాను. 


నా ఇష్టప్రకారంగానే చదువు పూర్తవ్వగానే నేను ప్రేమించిన వివేక్ తో వివాహం, తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ లో ఉద్యోగం... ఇదంతా నా ఇష్టం మీదనే జరిగింది. 


కానీ ఎప్పుడూ నాన్న నాకు చెప్పే మాటకు న్యాయం చేయలేకపోయాను. 


"తల్లీ, నలుగురిలో నా కూతురు డాక్టర్ చదువుతుందని గొప్ప కోసమో, లేదంటే విలాసవంతమైన జీవితం కోసమో నేను నిన్ను ఈ చదువు చదివించడం లేదు... మన గ్రామానికి వైద్యం ఎంత దూరంలో ఉందో నీకు తెలుసు కదా, సరైన వైద్యం లేకే మీ అమ్మ మనకు దూరమయ్యింది. 


ఇంకా ఎందరో సరైన సమయంలో వైద్యం లేక మరణిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని నువ్వు కొంతైనా అరికడతావని నా కోరిక... ఈ ప్రజలకు అండగా నిలబడతావని నా ఆశయం." నాన్న మాటలు ఘంటాపథంగా గుర్తుకు వస్తున్నాయి.


ఇంతలో "బుజ్జమ్మ!" అని పిలుపు వినిపించడంతో నా మనస్సు అప్రయత్నంగానే పులకరించింది. ఆ పిలుపును పసిగట్టింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. జానకత్త నా ఎదురుగా నిలబడి ఉంది. చెంగున వెళ్లి ఆమెను వాటేసుకున్నాను. తను కూడా గాఢంగా హత్తుకుంటూ, "నిన్ను చూసి చాలా రోజులైంది తల్లి. 


నేను ఊర్లో లేను కదా, నీ దగ్గరకు రావడం ఆలస్యం అయ్యింది" అని అంది జానకత్త. "అత్తా! నువ్వు పడుతున్న కష్టం నాకు తెలిసింది. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మా ఆయన పెద్ద డాక్టర్ కదా, అతనికి నీ మనవడిని చూపిద్దాం. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది" భరోసాగా అన్నాను.


ఒక్కసారిగా ఏడ్చేస్తూ, తన కొంగుతో కళ్లను ఒత్తుకుంటూ, "ఎన్ని ఆసుపత్రులు తిరిగానో లెక్క లేదు తల్లి. పైసలు చెల్లుతున్నాయి కానీ పరిష్కారం దొరకడం లేదు. నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు మనసు తేలికపడింది. 


తెలియనిది ఏముంది? రెక్కాడితే కానీ జీవనం సాగని బ్రతుకులు మావి. కూడబెట్టిందంతా వైద్యానికి పాలైతే రేపు ఎలా సాగుతుందో అన్న దిగులు తల్లి" వాపోయింది జానకత్త.


నేను చదువుకున్న సమయంలో ఫీజులకు, మిగతా అవసరాలకి డబ్బులు సర్దలేక నాన్న సతమతమవుతున్న సమయంలో కష్టాన్ని తెలుసుకుని తాను పొదుపుగా దాచుకున్న సొమ్మును నా కోసం ఇచ్చింది జానకత్త. 


రక్తసంబంధం కాకపోయినా సొంతవాళ్లలా చూసుకుంది. అలాంటి అత్త సహాయాన్ని ఎలా మరిచిపోయాను? ఇంతలా బాధపడుతున్న ఆమెకు ఆసరాగా నిలవలేకపోయానన్న పశ్చాత్తాపం నన్ను నిలువునా దహించివేయడం మొదలుపెట్టింది.


"అత్తా! నువ్వేమీ బాధపడకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను." అత్తకు మాట ఇచ్చిన తర్వాత నా మనస్సు కాస్త స్థిమితపడింది. అప్రయత్నంగానే నా కళ్లు నాన్న వైపుకు తిరిగాయి. 


ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా, చిరునవ్వుల మోముతో కనిపించారు నాన్న. నాన్న మనసులో అసంతృప్తికి కారణం ఇప్పుడు పూర్తిగా పోయింది. తనవాళ్లకు నేను అండగా నిలబడాలనేది ఆయన ఆకాంక్ష.


 ***సమాప్తం****









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Malla Karunya Kumar

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page