top of page
Original.png

పావని, నాన్న, తమిళ అబ్బాయి

8 hours ago
4 min read

పావని, మురుగన్‌ల ప్రేమ వివాహం మరియు తండ్రి నాగయ్య ఆశీర్వాదం – పెనుమాక వసంత తెలుగు కథ

Pavani Nanna Tamila Abbayi - Telugu Love Story | Penumaka Vasantha

పావని, నాన్న, తమిళ అబ్బాయి - తెలుగు ప్రేమ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 14/09/2026


"అమ్మా! ఎవరు వచ్చారో చూడు!"

అనగానే తల పైకెత్తి చూసింది పావని.


ఎదురుగా మురుగన్. ఆశ్చర్యపోతూ తండ్రి ముఖంలోకి చూసింది పావని. తండ్రి, మురుగన్ ఇద్దరూ నవ్వుతూ తన వైపు చూస్తున్నారు.


"ఏంటమ్మా అట్లా చూస్తావు? మన మురుగన్. ఇప్పుడు చూడు ఎట్లా అయ్యాడో!" అంటూ చూపించాడు.


ఆసక్తిగా చూసింది పావని. మెడలో చైన్, చేతికి బ్రాస్లెట్, నుదుటిన పెద్ద విభూతి రేఖలు, ఒత్తైన మీసాలు.


"నీకు మురుగన్ ఎక్కడ కలిశాడు నాన్నా?" అంటూ ఇంకా విస్తుపోయి అడిగింది.


"అదంతా ఓ కథలే! గానీ మురుగన్‌కు టిఫిన్ పెట్టు" అన్నాడు తండ్రి నాగయ్య.


సిగ్గుపడుతూ "రా మురుగన్!" అంటూ టేబుల్ ముందు కూర్చోబెట్టి, టిఫిన్ పెట్టింది.


"నువ్వు రా, కూర్చో పావని!" అన్నాడు తమిళ యాసలో.


"నేను చెన్నై పోతున్నా అన్నా కదా, ఇదిగో ఈ మురుగన్‌ను కలవడానికే" అంటూ నాగయ్య మురుగన్ ఎదురుసీట్లో కూర్చుంటూ అన్నాడు.


మురుగన్‌ను చూస్తూ పావని పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది.

పావని వాళ్ల ఇల్లు హైవేకి దగ్గరగా ఉండే ఊరిలో ఉంది. పొలాలు పెద్దగా పండటం లేదని తండ్రికి చెప్పి ఒక చిన్న హోటల్ పెట్టింది పావని. వీళ్ల హోటల్ దగ్గర ఆగి లారీల వాళ్లు టిఫిన్ తిని, టీ తాగి వెళ్లేవారు.


నాగయ్యకు భార్య పోయింది. పావని కాకుండా ఇంకో అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. పావని చెప్పినట్లు హోటల్ బాగానే సాగుతోంది. పావని టెన్త్‌తో చదువు ఆపేసి చెల్లిని, తమ్ముడిని చదివిస్తూ ఉంది. నాగయ్య, పావని హోటల్ చూసుకుంటూ ఉండేవారు.

మురుగన్ చెన్నై నుంచి కలకత్తా పోతూ వీళ్ల హోటల్ దగ్గర లారీ ఆపేవాడు. పావని మురుగన్‌కు టిఫిన్, కాఫీ ఇస్తూ ఉండేది. అట్లా చూస్తూ పావని అంటే ఇష్టం ఏర్పడింది మురుగన్‌కు.


ఒకరోజు, "నన్ను కళ్యాణం చేసుకో, పొన్ను!" అని అడిగాడు.


పావనికి ఇష్టం ఉండి, తండ్రిని అడగమని చెప్పింది.

నాగయ్య మురుగన్‌ను తిట్టి పంపాడు.


"మా ప్రాంతం కాదు, మా భాష కాదు. లారీ డ్రైవర్‌కు నా పిల్లని ఇచ్చి చేయను" అని గట్టిగా తిట్టి, హోటల్ ఛాయలకు రావద్దని చెప్పాడు. పావనికి కట్నం ఇచ్చి పక్క ఊరి అతను గిరికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు.


గిరి మొదట్లో హోటల్లో పావనితో పాటు బాగానే ఉన్నాడు. రానురాను గల్లా పెట్టెలో డబ్బులు తీసుకుని తాగడం చేస్తుంటే నాగయ్య తిట్టాడు. తాగితే హోటల్ జోలికి రావద్దన్నాడు.


అయితే, "పావనిని తీసుకుని మా ఊరు పోతాను" అన్నాడు గిరి.


"నువ్వు ఎక్కడైనా పని కుదుర్చుకుని తీసుకెళ్లు నీ పెళ్లాన్ని" అన్నాడు కోపంగా నాగయ్య.


"నేను వెళ్తాను నాన్నా!" అని పావని గిరితో అత్తింటికి వెళ్లింది.


"మీ నాన్న నన్ను తిట్టాడు. నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు తెస్తేనే నువ్వు ఇక్కడ ఉంటావు" అని నానా బాధలు పెడుతుంటే, పుట్టింటికి వచ్చింది పావని.


"నాన్నా, నేను అక్కడికి వెళ్లను. ఆ డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్లే బదులు, ఆ డబ్బుతో ఇక్కడ ఉండి చెల్లెలు, తమ్ముడిని, నిన్ను చూసుకుంటాను" అంది.


హోటల్ నడుపుతూ చెల్లెలికి పెళ్లి చేసింది. తమ్ముడు చదువుకుంటున్నాడు.

గిరి, పావని రాకపోవడంతో వేరే పెళ్లి చేసుకున్నాడు.

నాగయ్య బాధపడ్డాడు.

"మురుగన్‌కు ఇచ్చి నీకు పెళ్లి చేస్తే బాగుండేది. ఆ గిరికి ఇచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోశాను. వాడు ఇంకో పెళ్లి చేసుకుని కులుకుతున్నాడు. నువ్వు ఇట్లా మోడుగా మిగిలిపోయావు. మళ్లీ పెళ్లి చేసుకో!"


"వద్దు నాన్నా! ఇక పెళ్లి మాట తలపెట్టవద్దు. ఈసారి ఎత్తావంటే నేను చస్తాను" అంది పావని.


చూస్తూ ఉండగానే ఏళ్లు గడిచిపోయాయి.

మురుగన్ పక్కన ఉండే క్లీనర్ ముత్తు హోటల్‌కు వస్తే, మురుగన్ ఏం చేస్తున్నాడని అడిగాడు నాగయ్య.

"లారీలు ఇట్లా లోడ్ చేసి పంపిస్తూ చాలా దుడ్డు సంపాదించి, సేలంలో పెద్ద ఇల్లు కట్టాడు మా ఓనర్."


"పెళ్లి చేసుకున్నాడా?"


"లేదు. తమ్ముడు, చెల్లెళ్లకు పెళ్లి చేసి తను అట్లానే ఉన్నాడు."


"నేను నీతో వస్తా! నన్ను మురుగన్ దగ్గరికి తీసుకెళ్లు!" అంటే ముత్తు తీసుకెళ్లాడు.


మురుగన్ నాగయ్యను చూడగానే ఆశ్చర్యపోయాడు. తర్వాత వాళ్ల అమ్మా, అప్పకి పరిచయం చేశాడు. ఇల్లు అదీ చూసి విస్తుపోయాడు నాగయ్య.

ఆ రాత్రి మురుగన్‌ను అడిగాడు నాగయ్య.

"మురుగన్, మా అమ్మాయిని కళ్యాణం చేసుకుంటావా?"


"నాకు సమ్మతమే! తన కోసమే ఇన్నేళ్లు ఆగినా. మీకు ఇష్టమైతే చేసుకుంటాను."


"కానీ మా అమ్మాయికి ఇదివరకు పెళ్లి అయింది."


"నాకు తెలుసును. నేను మీ హోటల్‌కు రాకపోయినా మా లారీ వాళ్లను పంపి మీ సంగతులు తెలుసుకునేవాడిని. పావని మళ్లీ హోటల్ నడుపుతుందని తెలుసు. నాకు అభ్యంతరం లేదు. పావనికి ఇష్టమైతే కళ్యాణం చేసుకుంటాను" అన్నాడు.


మురుగన్ చేతులు కళ్లకు అద్దుకుని, "నన్ను క్షమించు. అప్పుడే మీ పెళ్లి చేస్తే బాగుండేది. అసలు పెళ్లే చేసుకోనని కూర్చుంది పావని. నువ్వు వచ్చి చెప్పు" అన్నాడు నాగయ్య.


సరేనని మురుగన్ నాగయ్యతో వచ్చాడు.

"అమ్మాయి!" అని పిలుస్తుంటే ఈ లోకంలోకి వచ్చింది పావని.


"అమ్మా, మురుగన్‌ను పెళ్లి చేసుకుంటావా?"


"నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్నా!"


"సరే, పావనికి పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడే కాల్ చేయండి. నేను ఎన్నాళ్లయినా ఎదురుచూస్తాను" అని ప్రేమగా పావని వైపు చూస్తూ వెళ్లాడు మురుగన్.


"నాన్నా, పక్క ఊరి గిరి మనకి బాగా తెలిసినవాడని, బాగా చూసుకుంటాడని చేసుకుంటే ఏమైంది? మగాళ్లు అందరూ అంతే నాన్నా! ఎక్కడో మన రాష్ట్రం కానివాడు నన్ను చేసుకుని ఇట్లాగే కొన్నాళ్లకి ఏడిపించడని గ్యారంటీ ఏంటి?"


పావనికి మురుగన్ మీద ఇష్టం ఉన్నా, ఎందుకో తనకు పెళ్లి పడదేమో అనిపించి మౌనంగా ఉంది.

మురుగన్ కాల్ చేశాడు.


"పావని, గిరిలాగా నేను నిన్ను మోసం చేయనని ఆ కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అక్కడ ప్రమాణం చేస్తే, ఇక నిన్ను చూడకపోతే, ఆ వినాయకుడు నా ప్రాణం తీస్తాడు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, రంగు, రుచి ఉండవు. నేను అక్కడికి వచ్చి హోటల్ నడుపుతా. ప్లీజ్ ఒప్పుకో!"


"నాగయ్య ఒకసారి మీ ఇద్దరి ఇష్టాన్ని కాదని పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను బతకను" అని చెప్పడంతో ఇక పావనికి సరేననక తప్పలేదు.


కాణిపాకం వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకున్నారు పావని, మురుగన్‌లు.



పెళ్లైన తర్వాత వచ్చిన వినాయక చవితిని ఎంతో గొప్పగా చేసుకున్నారు. తమ విఘ్నాలు తీర్చిన వినాయకుడిని ఎంతో భక్తిగా వేడుకుంది పావని:

"తండ్రీ! నన్ను, నా కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండండి."



***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page