top of page
Original.png

సాక్షాత్కారమైనా..!


సాక్షాత్కారమైనా, ఆధ్యాత్మిక కథ, దేవాలయ దర్శనం, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, లక్ష్మీదేవి, నారాయణుడు, తెలుగు కథ, జీవన విలువలు, మనతెలుగుకథలు

ఏకాదశి రోజున దేవాలయ క్యూలో జరిగిన తోపులాట మధ్య దివ్య సందేశాన్ని గ్రహిస్తున్న సుందరం

Sakshatkaramaina - Telugu Emotional Social Story | Malla Karunya Kumar

సాక్షాత్కారమైనా..! - తెలుగు భావోద్వేగ సామాజిక కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 01/08/2026


దేవాలయానికి వెళ్లడం భక్తి. కానీ క్రమశిక్షణ లేకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టి చేసే దర్శనం నిజంగా దైవానుగ్రహాన్ని ఇస్తుందా? "సాక్షాత్కారమైనా..!" కథలో ఒక సాధారణ భక్తుడి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా భక్తి, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, సామాజిక బాధ్యత వంటి విలువలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు. ఆలోచింపజేసే ఆధ్యాత్మిక సామాజిక కథ.


"ముందే చెప్పాను! విన్నారు కాదు!... అసలే ఏకాదశి, ఆ మహావిష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో!" నిట్టూర్చుతూ అంది అలివేలు.


"బామ్మా! ఇంకా ఎంత తొందరగా బయలుదేరమంటావు!. నీలాంటి ఆలోచనే ఆ లైన్లో ఉన్న వారికి వచ్చి ఉంటుంది. అందుకే ఈ కిక్కిరిసిన లైన్. ఆలస్యం చేస్తూ ఇక్కడే వాదనలు చేసుకుంటే ఆ లైన్ కాస్త పెరుగుతుంది!. నేను వెళ్లి దర్శనం టిక్కెట్లు తీసుకువస్తాను. మీరు వెళ్లి లైన్లో నిల్చోండి." అని భార్య సీతకు, బామ్మ అలివేలుకు చెప్పాడు సుందరం.


"సరే" అంటూ ముందుకు కదిలింది అలివేలు, సీతను తీసుకొని. 'నారాయణ నారాయణ' అంటూ ఒక పక్క భక్తులు నారాయణ నామం జపిస్తున్నారు. మరో పక్క వినసొంపైన పాటలు వినిపిస్తూ ఉన్నాయి!. మనసులో నారాయణ జపం చేసుకుంటూ ముందుకు కదులుతుంది అలివేలు. ఇంతలో టిక్కెట్లు తీసుకొని వచ్చి సుందరం వీళ్లతో చేరాడు. రాను రాను లైన్ తాకిడి పెరిగిపోతుంది. వెనక నుండి జనం తోస్తూ ఉన్నారు.


"అబ్బబ్బా! ఏమిటయ్యా అలా మీద పడిపోతున్నావు? కాస్త వెనక్కి ఉండు." వెనకున్న వ్యక్తిని కసురుకున్నాడు సుందరం. 


"అబ్బా, నాది మీలాంటి పరిస్థితే సర్, వెనక నుండి తోస్తున్నారు." అతను కూడా అసహనంతో చెప్పాడు. 


నిట్టూర్చుతూ ముందుకు కదిలాడు సుందరం... లైన్ల ఏర్పాట్లు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నాయి. ఒక మలుపులో ఒక్కరే వెళ్లేట్టుగా ఉన్నాయి... ఇంకో మలుపు దగ్గర ఇద్దరు వెళ్లేట్టుగా ఉన్నాయి. అలా ఖాళీగా ఉన్న లైన్లో నుండి వెనక ఉన్న జనాలు చేరుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. వెనకున్న వాళ్ళు ముందు, ముందున్న వాళ్ళు వెనుక అవుతూ ఉన్నారు. 


"ఏమిటి సార్, మీరు వెనక నుండి ఇలా ముందుకు వస్తున్నారు. ముందున్న మా పరిస్థితి ఏమిటి?." అడిగాడు సుందరం తన ముందుకు వచ్చిన వెనక వరుస వ్యక్తిని... 

"నన్నేమి చేయమంటావయ్యా, ఆ లైన్లు అలా ఉన్నాయి." అడ్డదిడ్డంగా సమాధానం ఇస్తూ ముందుకు నడిచాడు ఆ వ్యక్తి.


"ముందే చెప్పాను ఈరోజు వద్దు, తర్వాత ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం అని. కానీ వీళ్ళు వింటేగా." అని అసహనంతో తిట్టుకుంటూ చిరాకు పడుతున్నాడు. 

ఇంతలో చుట్టుపక్కల నుండి అదును చూసి లైన్ దాటి లోపలికి చొరబడుతున్నారు కొందరు మహా భక్తులు... గొడవలు, తిట్టుకోవడాలు, అడ్డుకోవడాలు అన్నీ జరుగుతున్నాయి. 


అన్నీ చూసిన తర్వాత విసుగుతో, "దేవుడా! ఏమిటీ అగ్ని పరీక్ష!." అని దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 


ఇంతలో సుందరం వెనుక ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తికి చోటు కల్పిస్తూ అతన్ని లోపలికి వచ్చేలా చేయడానికి చూస్తున్నాడు. 


అది చూసిన సుందరం కోపం నషాళానికి ఎక్కింది!. "ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని, నువ్వే అడ్డదిడ్డంగా వచ్చావు. ఇప్పుడు ఆ వ్యక్తిని లోపలికి తీసుకురావడానికి చూస్తున్నావు." అని ఆ వ్యక్తితో అన్నాడు సుందరం.


"ఎవడు అడ్డదిడ్డంగా వచ్చాడు. నేనా వచ్చింది." అని కోపంతో ఆ వ్యక్తి సుందరం గొడవకు దిగాడు. అలా గొడవ ఎక్కువైంది. ముందున్న వాళ్ళు, వెనుక ఉన్న వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి, ఇరువైపులా వాళ్లను శాంతింపజేశారు. వెనకున్న వ్యక్తి గొడవ పడినా తన ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేశాడు. రెండో వ్యక్తి ఈ గొడవ సమయంలో లైన్ లోపలికి చేరుకున్నాడు.


సుందరం ఆ వ్యక్తి వైపు చూసి, "ఛా!." అని అనుకుంటూ ముందుకు చూశాడు. మళ్ళీ ముందుకు భారీగా ఖాళీ వచ్చింది. మళ్ళీ జనాలు పరిగెత్తడం మొదలుపెట్టారు. మైకులో హెచ్చరిక జారీ చేస్తున్నారు సిబ్బంది. 


సిబ్బంది కొరత కావడంతో జనాలను కట్టడి చేయడం కూడా ఇబ్బందిగా మారింది. "దేవుడా!, మళ్ళీ మొదలైంది పందెం." అని నిట్టూర్చాడు సుందరం. 


ఇంతలో భక్తులు పరుగులు తీసి, తోసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఇంతలోనే అక్కడ తోపులాట జరిగింది. అప్పటి వరకు నిలబడి ఉన్న సుందరం ఒక్కసారిగా కింద పడ్డాడు, ఎవరో వెనుక నుండి తోయడంతో, తన మీద నుండి దాటుకొని ముందుకు పరుగు తీస్తున్న జనం కనిపిస్తూ ఉన్నారు. 


అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు సుందరంకు.... స్పృహ కోల్పోయాడు. కొంత సమయం తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు సుందరం. మెల్లగా కళ్లు తెరిచి చూశాడు. పక్కనే తన భార్య ఇంకో బెడ్ మీద ఉంది. ఆ పక్కనే ఇంకో బెడ్ మీద బామ్మ ఉంది. 


వాళ్లను చూసి ఒక్కసారి జరిగిందంతా రివైండ్ చేసుకున్నాడు సుందరం. తేరుకొని మళ్ళీ చూశాడు. అక్కడ కొందరు లైన్లో ఉన్నవాళ్లు చికిత్స పొందుతూ కనిపించారు. పక్కనే ఉన్న నర్సును పిలిచి వివరాలు అడిగాడు.


"లైన్లో తోపులాట జరిగింది. తొక్కుకోవడం, కిందపడటం జరిగింది. ఆ దేవుడు కరుణించాడేమో, ఎవరికీ ప్రాణాపాయం లేదు. అందరూ క్షేమంగా ఉన్నారు." అని చెప్పింది నర్సు. 


"అసలు మనుషులు ఎలా తయారయ్యారంటే, చివరికి దేవుడి దగ్గర కూడా క్రమశిక్షణ లేకుండా ఇలా అడ్డదారుల్లో దైవదర్శనం చేసుకోవడానికి ఉబలాటపడి చివరికి ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు." అసహనంతో తనలో అనుకున్నాడు.


"అవును, నువ్వు అన్నది నిజమే.. ఈ జనాలకు బొత్తిగా జ్ఞానం లేదు... అసలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. క్రమశిక్షణ అసలే లేదు. స్వీయ నియంత్రణ అసలే లేదు." అంటూ ఎదురుగా ఓ చిన్నారి నిలబడి ఉంది. 


'ఆశ్చర్యం, నేను మనసులో మాట్లాడుకున్న మాటలు ఆమెకు ఎలా వినపడుతున్నాయి.' అని మళ్ళీ తన మనసులో అనుకున్నాడు.


"నాకు అన్నీ వినపడతాయి. రోజూ చాలామంది మైండ్ వాయిస్ లు చదువుతాను." నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఆ పాప. 


ఆశ్చర్యపోతూ ఆ పాప వైపు చూసి నవ్వుకున్నాడు. "భలే చలాకీగా ఉన్నావు. అసలు ఎవరు నువ్వు?."


"నేనా?... నేను నేనే..." 


"అవునా, అయినా నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు."


"అన్నీ తెలుసు, స్వార్థంతో నిండిపోయి దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడి దర్శనం వేగంగా అవ్వాలని, అడ్డదారులు తొక్కుతూ, పక్కవాళ్లతో గొడవ పడుతూ, తిట్టుకుంటూ. మనశ్శాంతిని కోల్పోతూ, అరిషడ్వర్గాలన్నీ అప్పుడే ఆవహించిన మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు."


"అవును, నిజం మాట్లాడావు. ఇంత చిన్న వయస్సులో ఇంత జ్ఞానం ఎక్కడ సంపాదించావు?. నువ్వు చెప్పింది నిజమే, మానవుడు అన్నీ తెలిసి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు."


"ఒక్క దేవాలయంలోనే కాదు... ఎక్కడ చూసినా మానవుడు మానవుడిలా ప్రవర్తించడం లేదు. వేగంగా వాహనం నడపడం... బాధ్యత లేకుండా నడిపి ఇతరులను కూడా ఇబ్బంది పెట్టడం. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యుగంలో కూడా మానవుడు చేసిన అకృత్యాలు ఉండనే ఉంటాయి."


ఫక్కున నవ్వాడు..."బాగానే చెప్తున్నావు... ఇంతకీ మీ అమ్మానాన్న ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు?."


"ఆ సంగతి అటుంచి నీ సంగతి చెప్పు."


"నా సంగతి ఏం చెప్పమంటావు?. చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి నాది. అదుగో చూడు అక్కడ, మా బామ్మ పాపం స్వామిని చూడాలని ఎంతో ఆశతో వచ్చింది, చివరికి ఇలా అయిపోయింది!. " బామ్మను చూపిస్తూ నిట్టూర్చాడు.


"ఎవరు దీనికి కారణం... మానవుడు కాదా? మనిషే మనిషికి శత్రువులా తయారవుతున్నాడు. ప్రకృతి, దైవం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మానవుడు అది పట్టించు కుంటున్నాడా?" అంది ఆ పాప.


"ఏ ప్రకృతి? ఎప్పుడూ హెచ్చరిక జారీ చేస్తుంది!. అదేం లేదు. అలా హెచ్చరిక ఇస్తే మానవుడు సరిగ్గా నడచుకుంటారు కదా."


"సరే, నువ్వు మంచివాడిలా మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏమిటి?."


"నా సంగతి ఏముంటుంది?."


"నువ్వు కోపంతో ఎన్ని సార్లు నీ ముందున్న వ్యక్తిని నెట్టలేదూ? నువ్వు కూడా విచక్షణ కోల్పోయావు కదా." 


సుందరం మౌనం వహించాడు. 


"ఎన్ని సార్లు మైకులో జాగ్రత్తగా నడవండి. లైన్లో సరిగ్గా ఉండండి. మధ్యలో చొరబడవద్దు.. అని ఎన్ని సార్లు హెచ్చరిక జారీ చేశారు. ప్రకృతి, దైవం వేరే రూపంలో రారు కదా... ఇలా మానవ రూపంలో హెచ్చరిక జారీ చేస్తారు కదా... అది కూడా తెలుసుకోలేకపోతే ఎలా?"


సుందరం నోట మాట రాలేదు. "నిజమే, ఈ విషయాన్నే నేను ఆలోచించలేదు. నేను చేసినది తప్పే... నా తప్పుకు ప్రాయశ్చిత్తం ఉందా?." అని అడిగాడు సుందరం.


"తప్పకుండా, ఈసారి నువ్వు అధికారులకు అక్కడ జరుగుతున్న లోటుపాట్ల గురించి చెప్పాలి... అన్నిటికంటే ముందు నువ్వు స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలి. ఇలా అందరూ పాటిస్తే ఎంత బాగుంటుంది... 


నువ్వు ఒక ఏకాదశి రోజు అక్కడ సేవ చేస్తూ, ఇలాంటి వాటి గురించి చెప్పి అందరికీ జ్ఞానోదయం కలిగించాలి. ఇదే నువ్వు చేయాల్సిన ప్రాయశ్చిత్తం." అంది ఆ పాప. 


"ఏవండీ, ఏమిటి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు." అని పక్కనే ఉన్న భార్య అడిగింది. 


"నాలో నేను మాట్లాడుకోవడం ఏమిటి? ఎదురుగా ఉన్న ఆ పాపతో మాట్లాడుతూ ఉంటే.” ఉలిక్కిపడుతూ అన్నాడు సుందరం.


"ఎక్కడ!. ఏ పాప లేదు?. ఎప్పటి నుండో చూస్తున్నాను మీలో మీరు మాట్లాడుకుంటున్నారు." అని అంది భార్య.


 ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా చూశాడు. కానీ, ఆ పాప కనిపించడం లేదు. "మరి నాకు కనిపించి ఇన్ని మాటలు ఆడిన ఆ పాప ఎవరు?." తనలో అనుకుంటూ ఉన్నాడు. కొంత సమయానికి అర్థమైంది. తనకు హెచ్చరిక జారీ చేసిన ఆ పాప ప్రకృతి అయివుండవచ్చు అని... 


ఈసారి ఎలాగైనా ఆ పాప చెప్పిన ప్రాయశ్చిత్తం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి ఏకాదశి రానే వచ్చింది... సుందరం ప్రాయశ్చిత్తం గురించి మరిచిపోయాడు. ఒకవేళ గుర్తుకు వచ్చినా మరొక ఏకాదశి ఉందిగా అని ధీమాగా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.


"ఏమిటి దేవి, ఆ మానవుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడా లేదా అని నీ సందేహమా?." చిద్విలాసంతో అడిగాడు ఆ జగన్నాథుడు.


"ప్రభు! నా వంతు కృషి నేను చేశాను." సమాధానం ఇచ్చింది ఆ లక్ష్మీమాత.

చిద్విలాసంతో నవ్వుతూ ఉండిపోయాడు ఆ నారాయణుడు, మానవుడి తీరు చూసి...


 ***సమాప్తం****


మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Malla Karunya Kumar

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page