సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 3
- Sudha Vishwam Akondi

- May 28
- 4 min read
తెలుగు సామాజిక కథ, సుధావిశ్వం కథలు, భావోద్వేగ తెలుగు కథ

Sensational News- Part 3/3 - Telugu Emotional Story | Sudhavishwam Akondi
సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 3/3 - తెలుగు భావోద్వేగ కథ | సుధావిశ్వం ఆకొండి
Published In manatelugukathalu.com On 28/05/2026
జరిగిన కథ : వృద్ధుడు, తన పిల్లలు తనను చూడడం లేదని, తనకు న్యాయం జరిగేలా చూడమని న్యూస్ కోసం వచ్చిన మిత్రులను అడుగుతాడు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని మిత్రులు చెబుతారు.
ఇక సెన్సేషనల్ న్యూస్ - పార్ట్ 3 చదవండి.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ వృద్ధుడి కూతురు నుంచి ‘నో రెస్పాన్స్’! కొడుకు కూడా అదే పని చేశాడు. రెండు రోజులు అయిపోయింది. తెలిసిన లాయర్‌తో మాట్లాడి కేసు ఫైల్ చేయడానికి ఏర్పాట్లు చేశారు మిత్రులు. కోర్టులో కేసు ఫైల్ చేసి, పిల్లలు ఇద్దరికీ నోటీస్ పంపించారు.
ఆ వృద్ధుడు దండం పెట్టాడు. మంచి పని చేయగలిగామని సంతోషించారు మిత్రులు. ఒక మంచి వీడియోతో తమ ఛానల్ ఆరంభం అయిందని సంతోషించారు.
***
"ఒరేయ్! నీకు ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసిందిరా! ఫోన్ మర్చిపోయి వెళ్ళావు?" అంటూ సెల్ తెచ్చి ఇచ్చింది రఘువీర్ తల్లి.
ఫోన్ రింగ్ ఆగిపోయింది.
"కాల్ బ్యాక్ చెయ్యరా!" అన్నాడు స్నేహితుడు.
కాల్ చేశారు. ‘ఎంగేజ్’ సౌండ్ వచ్చింది. కాసేపు ఆగి చేద్దామని ఊరుకున్నారు. ఇద్దరు మిత్రులు ధర్మవీర్ ఇంట్లో కూర్చుని ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మళ్లీ ఆ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది రఘువీర్ సెల్‌కి. ఫోన్ ఆన్సర్ చేయడానికి బటన్ ప్రెస్ చేశాడు.
"హలో! మీరు చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఒక వీడియో చేసేముందు అన్ని కోణాల నుంచీ విషయాలను ఆలోచించి, సేకరించి ఆ తర్వాత అప్‌లోడ్ చేయాలి. కొత్తగా ఛానెల్ పెట్టినా బిజినెస్ ట్రిక్స్ బాగానే తెలుసే...! ఎవడికి ఏది తోస్తే అది వీడియో చేయడం, పోస్ట్ చేయడం, జనాల పైన వదిలెయ్యడం. ఛా..! ఇదో ఫ్యాషన్ అయ్యింది..." అంటోంది అవతలి కంఠం.
"సారీ...! మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కానీ మేమైతే జెన్యూన్‌గానే ఛానెల్ పెట్టాం! సామాజిక చైతన్యం కలిగించడమే మా లక్ష్యం!" అన్నాడు రఘువీర్.
"అలా అయితే ఆ వృద్ధుడి గురించి వీడియో ఎలా చేశారు? వివరాలు సేకరించారా?"
"ఆయన చెప్పిన విషయాలు, ఆయన నోటి ద్వారా చెప్పినవే వీడియో తీసి, అప్‌లోడ్ చేశాం! అతని పిల్లలకు కాల్ చేస్తే, కూతురు నుంచి జవాబు లేదు. కొడుకేమో తిట్టాడు. దాన్నిబట్టి తెలియడం లేదా వాళ్లు ఎలాంటివారో? అయినా మీరు ఎవరు? ఎందుకు నాకు కాల్ చేశారు?" అన్నాడు విసుగ్గా.
"సరే! మీకు పూర్తి వివరాలు కావాలంటే నేనొక అడ్రస్ చెబుతాను. అక్కడికి రండి!" అని అడ్రస్ చెప్పేసి ఫోన్ పెట్టేసింది అవతలి కంఠం.
"ఎవర్రా ఆ అమ్మాయి?" అని ధర్మవీర్ అనగానే
"తెలియదు. పదా! ఈ అడ్రస్‌కి వెళితే తెలుస్తుంది. బైక్ తియ్యి!"
***
ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు.
కాలింగ్ బెల్ నొక్కగానే ఒక పదేళ్ల పాప డోర్ తీసింది. వెనకే ఆ పాప తల్లి వచ్చింది.
"కూర్చోండి. నేనే మీకు కాల్ చేసింది," అని చెప్పి తనూ కూర్చుంది ఎదురుగా సోఫాలో.
"ఎవరండీ మీరు? మేము మంచి చేస్తుంటే అలా తిడతారు...!" అన్నాడు ధర్మవీర్.
"మీరు వీడియో చేసింది నా కన్న తండ్రినే!" అని ఆగిందామె.
"అదేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మీ నుంచి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇలా ఎందుకు రమ్మన్నారు...?" అన్నాడు ఆశ్చర్యపోతూ.
"మీరు పంపిన లీగల్ నోటీస్ అందింది. అందుకే కాల్ చేశాను. జరిగిన విషయాలు మీతో చెప్పాలని పిలిచాను," అని ఆగి ఓ నిట్టూర్పు విడిచి కొనసాగించింది.
"ఇది కలికాలం అండి! ఏదో ఒక విషయాన్ని ఒకే కోణంలో చూసి విలన్లుగా చిత్రీకరిస్తే ఎలా? చిన్నతనంలో నా తండ్రి అంటే మాకు ఎప్పుడూ గౌరవమే ఉండేది. కానీ మా తండ్రి ఎలాంటివాడో తెలిస్తే మీరు కూడా అసహ్యించుకుంటారు. మా అమ్మ చనిపోవడానికి ఆయనే కారణం!
అతడు తాగుబోతునే కాదు, తిరుగుబోతు కూడా! మా చిన్నప్పుడు తాగొచ్చి మా అమ్మను కొట్టేవాడు. అటెండర్‌గా తనకు వచ్చే జీతం మొత్తం తన తాగుడుకు, ఆడవాళ్లకు పెట్టడానికే సరిపోయేది. మా అమ్మ నాలుగిళ్లల్లో పాచిపని చేస్తూ, మమ్మల్ని పోషించింది. తను పనిచేసే ఇళ్ల యాజమానుల సహాయంతో చదివించింది. మంచి టీచర్స్ లభించడంతో బాగా చదువుకుంటూ మెరిట్ స్కాలర్‌షిప్ తెచ్చుకుని, జాబ్స్ కూడా తెచ్చుకోగలిగాం! తన ప్రవర్తన వల్ల జాబ్ పోవడంతో డబ్బు కోసం అమ్మను చావగొట్టేవాడు. ఒకసారి నాన్న కొట్టిన దెబ్బలకు గోడకు తలకొట్టుకుని అమ్మ ప్రాణం గాల్లో కలిసిపోయింది. అప్పట్నుంచి మా తమ్ముడికి నాన్న అంటే మంట. అందుకే దూరంగా జాబ్ చూసుకుని సెటిల్ అయ్యాడు.
నేను జాలిపడి ఇంట్లో కొన్నాళ్లు పెట్టుకున్నాను. నా భర్త మంచివాడు అవ్వడంతో అంగీకరించాడు. కానీ నాన్న ఏమాత్రం మారలేదు. మనుమడు, మనుమరాలు ముందే తాగడం, ఇంట్లో డబ్బులు కొట్టేయడం, వేరే ఆడవాళ్లను ఇంటికి తేవడం మొదలుపెట్టాడు.
అందుకే బయటికి పంపించి, ఆ ఇల్లు మారాం! ఫోన్ నెంబర్ కూడా మార్చాను.
మా తమ్ముడు రానివ్వడని తమ్ముడికి కాల్ కూడా చెయ్యడు. కానీ నేను కాస్త జాలి చూపిస్తానని నా దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తాడని అలా చేశాను. ఇందులో మా తప్పు ఏముందో చెప్పండి?" అంది ఆమె ఆవేశంగా.
"అతని ముఖం, మాటతీరు చూస్తే అలా లేదే!"
"ఈ ఫోటోలు, వీడియోలు చూడండి. మా నాన్న గురించి తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్పుడు తీసి పెట్టాను!" అంటూ సెల్ ఫోన్ చేతికి ఇచ్చింది.
అవి చూశాక, ఆవిడను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధ అనిపించింది వాళ్లకు.
"సో సారీ మేడం! విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఆ వీడియో పెట్టామని క్షమాపణ చెబుతూ మరో వీడియో పెడతాం! లాయర్‌తో మాట్లాడి కేసు వేయడం ఆపేస్తాను," అని లేవబోయారు. ఇంతలో రఘువీర్ ఫోన్ రింగ్ అయ్యింది.
వృద్ధాశ్రమం నుంచి కాల్. అక్కడ వాళ్లు చెప్పిన విషయం విని, హతాశులయ్యారు మిత్రులు. అక్కడ ఉన్న ఇతర వృద్ధులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అభియోగాలు వస్తున్నాయని, అతన్ని తీసుకు పొమ్మని వాళ్లు అన్నారు. తమ వార్త ఇలా సంచలనం అవుతుందని ఇద్దరు మిత్రులు ఊహించలేకపోయారు. అతన్ని వృద్ధాశ్రమం నుంచి తీసుకుని వచ్చి, ప్రభుత్వ మానసిక కేంద్రంలో చేర్పించారు.
ఆ తర్వాత మొదటి వీడియోకి కొనసాగింపుగా మరో వీడియో పూర్తి వివరాలతో పెట్టారు.
"హలో ఆల్! మేము మంచి వార్తలు, అందరిలో సామాజిక చైతన్యం కలిగే వార్తల కోసం ఈ ఛానల్ పెట్టాం! తల్లిదండ్రులను రోడ్లపాలు చేసే పిల్లలు, వృద్ధాశ్రమంలో పడేసి పారిపోయే పిల్లల గురించి విన్నాం! అలాంటివారే ఎక్కువగా ఉండడంతో అదే నమ్ముతాం!
కానీ నాణానికి మరో కోణం ఉంటుంది. అలా వ్యసనానికి బానిస అయి, భార్య మరణానికి కూడా కారణం అయిన వాడు, మానసిక రుగ్మత ఉన్న తండ్రిని మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి, విఫలం అయి, ఇలా దూరంగా ఉంటున్న పిల్లల స్టోరీ ఇది! మొన్న పెట్టిన వీడియో చూశారు కదా! ఆ తండ్రి పరిస్థితికి అసలు కారణం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాం! కంటిన్యూగా చూడండి" అని తర్వాత తాము తెలుసుకున్న నిజాలు వివరిస్తూ వీడియో పెట్టారు.
ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. వారి ఛానల్‌లో తొలి వార్తనే సంచలనం సృష్టించింది. ఆ వీడియోలు చూసిన జనాలు 'కలికాలం' అనుకుంటూ నిట్టూర్చారు.
================================================================
... సమాప్తం...
================================================================
సుధావిశ్వం ఆకొండి గారి కొన్ని ఇతర రచనలు:
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.












Comments