top of page
Original.png

'విద్యా'లీల

2 days ago
3 min read

'

విద్యావతి పాదపూజ చేస్తుండగా ఆఫీసుకు ఆలస్యమవుతుందని ఆందోళనగా కూర్చున్న శ్రీధర్

VidhyaLeela - Telugu Family Story | M R V Sathyanarayana Murthy

'విద్యా'లీల - తెలుగు కుటుంబ కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 07/09/2026


‘విద్యా'లీల’ ఒక సరదా దాంపత్య కథ. ఆఫీసులో ముఖ్యమైన ఆడిట్ ఉండటంతో త్వరగా బయలుదేరాలనుకున్న శ్రీధర్‌కు, భార్య విద్యావతి చేసే పాదపూజ పెద్ద సమస్యగా మారుతుంది. భర్త ఇబ్బందిని అర్థం చేసుకున్నట్టే కనిపించినా, ఆమె మనసులో మరో ఆలోచన ఉంటుంది. వారం రోజుల తర్వాత ఆఫీసులో జరిగే మార్పులు శ్రీధర్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చివర్లో విద్యావతి చేసిన పని ఏమిటో తెలిసినప్పుడు కథ మరింత హాస్యభరితంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలు, సామాజిక వ్యంగ్యం, చమత్కారమైన ముగింపు ఈ కథకు ప్రత్యేక ఆకర్షణ.



శ్రీధర్ హాలులోకి వచ్చి వంటింటి వైపు తొంగి చూశాడు. భార్య పొయ్యిమీద ఏదో వండుతోంది. హమ్మయ్య అనుకుని గబగబా వరండాలోకి వచ్చి సాక్స్ వేసుకున్నాడు. ఈరోజు ఆఫీసులో ఆడిట్, కంగారు పడుతున్నాడు. గబగబా బూట్లు వేసుకోవడం ప్రారంభించాడు.


ఏదో తుఫాను గాలిలా కదలిక గమనించాడు. పక్కకు తిరిగి చూస్తే భార్య కళ్ళు పెద్దవి చేసి తీవ్రంగా చూస్తోంది.


"ఏమిటి అప్పుడే బయలుదేరారు?" అడిగింది.


"అంటే ఈరోజు ఆఫీసులో ఆడిట్ ఉంది, అందుకని" నెమ్మదిగా అన్నాడు శ్రీధర్.


"అయితే అందుకని నా పూజ లేకుండా బయలుదేరతారా? పని ఉందని సూర్యుడు నాలుగు గంటలకే ఉదయిస్తాడా? లేదు. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. మీ బొంద, మీకు ఏమీ తెలిసి చావదు. మీ కాళ్లు ఇలా తగలెయ్యండి, నేను పాదపూజ చేసుకోవాలి" అని విసురుగా హాల్లోకి వచ్చింది విద్యావతి.



బూట్లు తీసేసి, మాస్టారు వెనకాల వినయంగా వెళ్లే రెండో తరగతి కుర్రాడిలా హాలులోకి వచ్చాడు శ్రీధర్. ఆమె చూపు అర్థం చేసుకొని కుర్చీలో కూర్చున్నాడు.


ఆమె పళ్ళెం తీసుకువచ్చి అతని కాళ్లు అందులో ఉంచి శుభ్రంగా కడిగింది .తర్వాత టవల్తో తుడిచింది. 

పువ్వులతో పూజ చేస్తూ అష్టోత్తరం చదివింది. తర్వాత తను ఇటీవల రాసిన కొత్త భక్తి గీతాన్ని కర్ణపేయంగానే పాడింది. ఇంతలో ఫోన్ మోగింది.


హమ్మయ్య అనుకొని లేవబోయాడు. కుడిచేతితో అతని కాలు గట్టిగా పట్టుకుని, "నా పూజ అవలేదు" అంది గట్టిగా విద్యావతి.


ఎడమచేతితో ఫోన్ తీసి, "హలో" అంది.


ఒక ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడింది. తర్వాత హారతి ఇచ్చి కళ్ళకద్దుకుని, భర్తకు అక్షింతలు ఇచ్చింది.


శ్రీధర్ భార్య నెత్తి మీద అక్షింతలు వేసి బయటకు వచ్చి, బూట్లు వేసుకోవడం ఆలస్యం అవుతుందని జోళ్ళు వేసుకుని వందేభారత్ రైలులా స్పీడుగా ఆఫీసుకు వచ్చాడు. అప్పటికి గంట లేటయ్యింది. బాస్ కౌశికుని చూపులు తట్టుకుని, చిన్నగా నవ్వి సీటులోకి వచ్చి కూర్చున్నాడు.


పక్క సీటు భాస్కర్ చెప్పాడు, ఆడిటర్ ఇంకో అరగంటకు కానీ రాడని. తన అభిమాన నటుడి సినిమాకు మొదటి ఆటకే టికెట్ దొరికినంత ఆనందం కలిగింది శ్రీధర్కి. టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసులోని నీళ్ళు గటగటా తాగి స్థిమితపడ్డాడు.


తర్వాత భార్య గుర్తుకు వచ్చింది. "హు. విద్యా.. నిన్ననుకుని ఏం లాభం? పెళ్లిలో అప్పగింతలప్పుడు మీ నాన్న,

'అల్లుడూ, అమ్మాయితో జాగ్రత్త' అన్న విషయం నేను సరిగ్గా వినకపోవడం నా దురదృష్టం" అని నిట్టూర్చాడు శ్రీధర్. ఇంటర్లో అన్ని సబ్జెక్టులు తప్పిన విద్యార్థిలా దిగులుపడ్డాడు.


అప్పగింతలు తంతులో పెళ్లికొడుకు వళ్ళు దగ్గర పెట్టుకోవాలని, ప్రతి అక్షరం జాగ్రత్తగా వినాలని, పెళ్ళికాని మిత్రులకు చెప్పాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు శ్రీధర్.

......

సాయంత్రం ఇంటికి చేరిన శ్రీధర్, భార్య ఇచ్చిన కాఫీ తాగి, "విద్యా, నీకో విషయం చెబుతాను.. కోపగించుకోవద్దు" అన్నాడు నెమ్మదిగా.


"అలాగే చెప్పండి" అంది విద్యావతి.


"ఆఫీసులో అర్జెంటు పనులు, ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు పాదపూజలు వద్దు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఆడిట్ అయ్యాకా మా బాస్ నన్ను చివాట్లు పెట్టారు అందరి ముందు, ముఖ్యమైన రోజున కూడా ఆలస్యంగా వచ్చానని. అర్థం చేసుకో విద్యా"

అనునయంగా అన్నాడు శ్రీధర్.


ఒక నిమిషం మౌనంగా ఉండి, "మన పక్క వీధిలోనేగా మీ బాస్ ఉండేది?" శాంతంగా అడిగింది విద్యావతి.


'అవును' అన్నట్టు తలూపాడు శ్రీధర్. 


ఆమె చిన్నగా నవ్వి, "మీరేం బాధపడకండి. అంతా నేను చూసుకుంటాను"

అని వంటింట్లోకి వెళ్ళింది.


వారం గడిచింది. శ్రీధర్ వాళ్ళ బాస్ ఆఫీసుకి ఆలస్యంగా రావడం మొదలుపెట్టారు. సిబ్బందిని ఏమీ అనటం లేదు. అందరికీ ఆశ్చర్యం వేసింది.


ఒకరోజు భర్తకు పాదపూజ అయ్యాకా విద్యావతి అడిగింది, "మీ బాస్ ఎలా ఉంటున్నారు?" అని.


"మా బాస్ చాలా మారిపోయారు. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా ఏమీ అనడం లేదు. 'మీ వర్కు జాగ్రత్తగా మీరే పూర్తి చేయండి' అని అంటున్నారు. మాకు చాలా వింతగా ఉంది" అన్నాడు శ్రీధర్.

"ఎవరిలోనైనా మార్పు సహజం నాధా" అంటూ అదో రకంగా నవ్వి వెళ్ళిపోయింది విద్యావతి.


ఆమెకేసి అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్.

విద్యావతి, వాళ్ళ బాస్ శ్రీమతిని కలిసి, భర్తకు పాదపూజ చేయడం వలన కలిగే కీర్తి, సంతోషం, సమాజంలో కలిగే గౌరవం, హుందాతనం వివరించి చెప్పడమే గాక,

తన స్నేహితురాండ్రు భర్తలకు చేస్తున్న పాదపూజల వీడియోలు కూడా చూపించింది. ఆవిడ అవి చూసి బాగా ఇంప్రెస్ అయ్యి, ఆవిడ కూడా భర్తకు పాదపూజ మొదలుపెట్టింది.


ఆ 'గండికోట రహస్యం' శ్రీధర్ కి చెప్పలేదు విద్యావతి.


సమాప్తం.

*******

M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):








M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


సత్యనారాయణ మూర్తి  M R V

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

సత్యనారాయణ మూర్తి  M R V

సత్యనారాయణ మూర్తి  M R V

telugu emotional story,  wife husband story telugu,  old age home story


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page