ఆనందోబ్రహ్మ
- Rayala Sreeramachandra Kumar

- 3 days ago
- 3 min read
ఆనందోబ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, వేదాంతం, ఆధ్యాత్మిక వ్యాసం, బ్రహ్మానందం, ఉపనిషత్తులు, కృతజ్ఞత, జీవన విలువలు, తెలుగు ఆధ్యాత్మికం, మనతెలుగుకథలు
Anandobrahma - Telugu Inspirational Article | R C Kumar
ఆనందోబ్రహ్మ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 31/07/2026
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ - ఆనందమే పరబ్రహ్మము అని భృగు మహర్షి పలు పర్యాయాలు తపస్సు చేసి ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. (అన్నము, ప్రాణము, మనసు, విజ్ఞానం, ఇవేవీ కావు, చివరికి ఆనందమే బ్రహ్మము).
సమస్త జీవులు ఆనందం వల్లే జన్మిస్తున్నాయి, జన్మించిన జీవులన్నీ ఆనందం వల్లే జీవిస్తున్నాయి, ఆనందాన్ని కోరుకుంటూనే మనుగడ సాగిస్తున్నాయి, చివరికి అవన్నీ ఆనందంలోనే లీనమవుతున్నాయి.
బాహ్య కారణాల వల్ల వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు కాబట్టి, ఎటువంటి కారణాలు లేని, శాశ్వతమైన ఆనంద స్వరూపమే పరబ్రహ్మము.
నిజజీవితంలో వస్తువుల ద్వారా మమకారాల ద్వారా మనం పొందే ఆనందం ఏదో ఒక కారణం చేతనే కాబట్టి అది క్షణికమైనదిగా లేదా కొద్దికాలం మాత్రమే ఉంటుంది. కారణం లేకుండా ఆనందంగా ఉండడమే శాశ్వత ఆనందం, బ్రహ్మానందం.
ఆనంద స్వరూపమైన బ్రహ్మము నెరిగినవాడు ఆనందంలో ఉండి దాన్ని అనుభవిస్తాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నవాడే తృప్తిగా ఉంటాడు. అలౌకిక ఆనందంతో శాంతి, సంతోషం, జ్ఞానంతో పాటు జీవన్ముక్తి కలిగే అంతిమ లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు. సంతోషం అనేది ప్రతి నిమిషం ప్రేమ, కరుణ, ఆనందంతో గడిపే ఒక ఆధ్యాత్మిక అనుభూతి.
వేదం కూడా మనిషి ఆనంద స్వరూపుడు అంటుంది. అబ్బే అదేం కాదంటుంది నిజజీవితం. ఈతి బాధలను భరించే సంసార సాగరంలో ఆనందం ఎక్కడిది అంటాడు సగటు మానవుడు. మానవ జీవనం ద్వంద్వాలమయం చీకటి వెలుగుల మిశ్రమం అనే విషయంపై అవగాహన ఉన్నా, వాటికి అతీతంగా నిశ్చల హృదయంతో ఉండే ప్రయత్నం చేయడు.
ఎందుకంటే ఇంద్రియాలకు వశమైన మానవుడి మనో బుద్ధులు ఆయా గుణాల సాంగత్యంతో నిశ్చలత్వానికి అడ్డుగా నిలుస్తాయి. తనది కాని శరీరాన్ని సుఖపెడుతూ తాత్కాలిక ఆనందం కోసం (అందమైన దుస్తులు, అలంకరణలు, భోగభాగ్యాలతో) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు మానవుడు. తనదైన ఆత్మలో రమిస్తూ శాశ్వత సుఖాన్ని పొందే ప్రయత్నం మాత్రం చేయడు.
అదెలా సాధ్యం అనే ప్రశ్న ఉదయించవచ్చు. జీవితంలో సహజ సిద్ధంగా జరిగే మార్పులను ఆనందంగా స్వీకరించాలి. సుఖదుఃఖాలు, కష్టసుఖాలు రెండూ ప్రకృతిలోని పగలు, రాత్రుల లాంటివే. చీకటి పడకూడదు అనుకోవడం, కష్టాలే రాకూడదు అనుకోవడం అత్యాశ అవుతుంది.
సూర్యుడు ఉదయించడేమో అనుకుంటే నిరాశ. ఎల్లప్పుడు ఆనందంగానే ఉండాలనుకోవడం దురాశ. జగమే మారినది మధురముగా ఈవేళ అని పులకించి మైమరచిపోయిన కొంతకాలానికే మనసున్న మనిషికి సుఖము లేదంతే అనుకునే కష్టకాలం కూడా దాపరించవచ్చు. జరిగిన నష్టాన్ని లేదా బాధను మార్చలేమని గ్రహించి, నిజాన్ని అంగీకరించాలి.
జీవితంలో పరిస్థితులను మనం నియంత్రించలేము, కానీ వాటికి తగినట్లుగా మన ప్రవర్తనను మార్చుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నడి సముద్రపు నావలో పయనిస్తున్న వేళ హోరుగా వీస్తున్న గాలిని మనం నియంత్రించలేము. కానీ తెరచాపను ఉపయోగించి గాలివీస్తున్న దిశకు అనుకూలంగా తిప్పుకుంటూ సేఫ్ గా ప్రయాణం కొనసాగించవచ్చు.
బాహ్య పరిస్థితులు, మార్పులు లేదా ఇతరుల చర్యలను మనం శాసించలేము కదా, కానీ వాటికి ఎలా స్పందించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మార్గాన్ని అడ్డుకునే అడ్డంకులు వస్తాయి, సవాళ్లు ఎదురవుతాయి. అలాంటప్పుడు వ్యూహాన్ని మార్చుకోవడం లేదా విధానాలను సరిచేసుకోవడం ద్వారా అంతిమ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగవచ్చు.
కష్టకాలంలో మనం స్పందించే తీరు, దృఢ సంకల్పంతో వాటిని అధిగమించే ప్రయత్నాలే మనకు సరైన దారి చూపిస్తాయి. జీవితం పట్ల అది ఒక అందమైన మరియు కాలాతీతమైన దృక్పథం. సంతోషంగా ఉన్నవారు కృతజ్ఞతా భావంతో ఉండడం కాదు. కృతజ్ఞతా భావంతో ఉన్నవారే సంతోషంగా ఉంటారు. పాశ్చాత్య దేశాలలో ప్రతి సంవత్సరం థాంక్స్ గివింగ్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
గడిచిన సంవత్సరంలో జరిగిన మంచి, ఆరోగ్యం, మరియు విజయాలకు మనకు సహాయం చేసిన వారికి, దేవుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు సమర్పించడం కోసం.
"కృతజ్ఞతతో కూడిన హృదయం అద్భుతాలకు అయస్కాంతం"
కృష్ణార్పణం 🙏
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్ |










Comments