భయం
- Srinivasarao Jeedigunta

- 5 hours ago
- 6 min read
#TeluguInspirationalStory, ##తెలుగుప్రేరణాత్మకకథ

“షుగర్ కాదు… భయమే మనల్ని చంపుతుంది!”
శ్రీనివాసరావు జీడిగుంట గారి ‘భయం’ కథ చదివి, మీ భయాన్ని పోగొట్టుకోండి
Bhayam - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao
భయం - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 02/04/2026
శంకరానికి 40 ఏళ్లు. కూర్చొని చేసే ఉద్యోగం, అంటే అవసరమైన వారికి వారి దగ్గర నుంచి నగలు, ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బు ఇచ్చే ఆఫీసు. ప్రజలలో అవసరాలు ఎక్కువ అవ్వడం, అన్నీ ఆన్లైన్ షాపింగ్ లో క్రెడిట్ కార్డ్స్ మీద కొని ఆ అప్పులు తీర్చడానికి శంకరం ఆఫీసుకి వచ్చి చేరుతూ ఉంటారు.
శంకరం భార్య తులసి, భర్తని హెచ్చరిస్తూ ఉండేది. "ఈ వ్యాపారంతో మనం పాపం మూటకట్టుకుంటున్నాం, ఇతరుల బలహీనతని మీరు డబ్బుగా సంపాదించు కుంటున్నారు. ఈ వ్యాపారం మానేసి ఏదైనా న్యాయమైన వ్యాపారం చేయండి" అని చెప్పేది.
"వ్యాపారం అంటేనే అన్యాయం, మళ్ళీ ఇందులో న్యాయం ఎక్కడ ఉంటుంది? ఓపిక ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలి" అన్నాడు శంకరం.
"మీ ఇంటా వంటా లేని ఈ వడ్డీ వ్యాపారం మీకు ఎలా అలవాటు అయ్యింది? మీ నాన్నగారు మిమ్మల్ని చక్కగా చదివించారు, హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా" అంది.
"అందరూ నీలా అనుకుంటే అవసరమైన వాళ్ళకి డబ్బు దొరకక ఆత్మహత్య చేసుకుంటారు, నేను ఒక విధంగా వాళ్ళకి రక్షణ ఇస్తున్నాను" అని వాదించేవాడు.
భర్త తన మాట ఎప్పుడు విన్నాడు అనుకుంటూ నిట్టూర్చింది. "అలా బాధపడకపోతే బీరువాలో తాకట్టుకు తెచ్చిన నగలు ఉన్నాయి కదా, రోజూ ఒకటి పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితుల ఇళ్లకు వెళ్ళొచ్చు కదా" అన్నాడు.
"మా నాన్న పెట్టిన నగలు వేసుకుంటేనే ‘మీకేం? మీ ఆయన తాకట్టు పెట్టుకున్న నగలు అన్నీ మీవే’ అంటున్నారు. ఏమిటో నేను రోజూ పూజించే దేవుడైనా మిమ్మల్ని మారిస్తే బాగుండును" అంది.
"ఎవరైనా భర్త చేసే వ్యాపారం బాగుండాలి అని కోరుకుంటారు, నువ్వు మాత్రం నేను దివాళా తీయాలి అనుకుంటున్నావు. నాకు తెలిసిన ఉద్యోగం ఇదే, మానేస్తే ప్రతీ నెల మీ నాన్న డబ్బు పంపాలి మన పోషణకి" అన్నాడు. నెలలు గడుస్తున్నాయి, బ్యాంకులో లాకర్లు నిండుతున్నాయి.
"అదేమిటి ఇంకా పడుకున్నారు, ఈరోజు మీ వ్యాపారం లేదా?" అంది పూజా పళ్లెం పట్టుకుని పూజ గదిలోకి వెళ్తూ.
"ఏమిటోనే అర్ధరాత్రి గుండెల్లో దడ, అతి నీరసం అనిపించింది. కాళ్ళు లాగేస్తున్నాయి. ఈరోజు బయటకు వెళ్ళాలి అనిపించడం లేదు, డబ్బు అవసరం ఉన్నవాళ్లు వెతుక్కుంటూ వస్తారులే" అంటూ ముసుగు తన్ని పడుకున్నాడు శంకరం.
"లేవండి, భోజనం టైమ్ అయ్యింది. భోజనం చేసి మళ్ళీ పడుకోండి, మీకు ఏది వచ్చినా భరించలేము" అని పిలిచింది భర్తని తులసి.
బద్ధకంగా లేచి గోడ పట్టుకుని నడుస్తూ వచ్చి బ్రష్ చేసుకుని సోఫాలో కూలబడి "ఇదిగో ఎందుకో చక్కెరపొంగలి తినాలని ఉంది, చేస్తావా?" అన్నాడు శంకరం.
వంటగదిలో నుంచి వచ్చి భర్త నుదుటిన చేయి వేసి చూసి "జ్వరం లేదు, ఎందుకు ఇలా అయిపోయారు? బజార్ లో పానీపూరి లాంటివి తిన్నారా నిన్న?" అంది. "లేదు, నువ్వు నాకు కాఫీ ఇచ్చి చక్కెరపొంగలి చేయి, ఏదైనా తియ్యగా తినాలని ఉంది."
‘ఏమైంది ఈయనకి? స్వీట్ అంటే చిరాకు పడేవాడు ఇప్పుడు స్వీట్ తింటాను అంటున్నాడు’ అనుకుంటూ ఉప్పు, రెండు ఎండుమిరపకాయలు తీసుకుని వచ్చి భర్తకి దిష్టి తీసింది.
అనుకున్నట్టుగానే చక్కెరపొంగలితో అన్నం తిని సాయంత్రానికి హుషారుగా మారిపోయాడు శంకరం. "ఇదిగో ఒకసారి ఆఫీసు దాకా వెళ్లి వస్తాను, పాపం ఉదయం అవసరం వచ్చి ఎంతమంది వచ్చారో ఏమో" అన్నాడు.
"ఉదయం నుంచి ఇబ్బంది పడి ఇప్పుడు బయటకు వెళ్తాను అంటే కుదరదు, వెళ్తే నా మీద ఒట్టే" అంది.
భార్య వంక ఒకసారి చూసి "సరేలే వెళ్ళను, త్వరగా వంట చేస్తే తిని పడుకుంటాను. రేపు మాత్రం నన్ను ఆపకూడదు" అన్నాడు.
మర్నాడు కూడా కాళ్ళు నొప్పి, నీరసం అనడంతో "ఎందుకైనా మంచిది డాక్టర్ గారిని కలిసి రండి" అనడంతో డాక్టర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళాడు శంకరం.
పొరపాటున రైల్వే స్టేషన్ కి రాలేదు కదా అనుకున్నాడు అక్కడ ఉన్న జనాన్ని చూసి.
శంకరం కాళ్ళు నొక్కుకుంటూ ఒక గంట గడిపిన తరువాత డాక్టర్ గారి దగ్గర నుంచి పిలుపు రావడంతో లోపలికి వెళ్ళాడు.
"ఏమిటి ప్రాబ్లమ్?" అని అడిగాడు డాక్టర్ గారు.
"రెండు రోజుల నుంచి ఒకటే నీరసం, కాళ్ళు లాగేస్తున్నాయి, దాహం, ఏదైనా స్వీట్ తినాలని కోరిక" అని చెప్పాడు.
"రెస్ట్ రూమ్ కి ఎక్కువగా వెళ్తున్నారా?" అన్నాడు డాక్టర్.
"మొత్తం రెస్ట్ గానే ఉన్నాను సార్" అన్నాడు.
"సరే, మూడు బ్లడ్ టెస్ట్స్ రాస్తున్నాను. మా దగ్గరే చేస్తారు, మీరు ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్లి కౌంటర్ లో చూపించండి" అన్నాడు.
బయటకు వచ్చి రిసెప్షన్ లో డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. అక్కడ గుమస్తా ఏవో లెక్కలు కట్టి "రెండు వేలు ఇవ్వండి" అన్నాడు.
"రెండు వేల తాకట్టుకి ఏం తెచ్చారు?" అని అడిగాడు శంకరం.
"తాకట్టు ఏమిటండి? బ్లడ్ టెస్ట్ కి పదిహేను వందలు, డాక్టర్ గారికి ఐదు వందలు, మొత్తం రెండు వేలు ఇవ్వండి" అన్నాడు గుమస్తా.
అలవాటు ప్రకారం తాకట్టు పెడితే గానీ డబ్బు ఇవ్వని శంకరం నాలిక కరుచుకుని, " డాక్టర్ గారి బ్లడ్ టెస్ట్ కి ఐదు వందలు నేను ఎందుకు ఇవ్వాలి?" అన్నాడు.
"బ్లడ్ టెస్ట్ కాదండి, డాక్టర్ గారి ఫీజు. త్వరగా ఇవ్వండి, మీ వెనుక చాలా మంది వెయిటింగ్" అన్నాడు గుమస్తా.
రెండు వేలు ఇచ్చి "రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి?" అని అడిగాడు.
"రేపు ఉదయం వస్తాయి, తీసుకుని డాక్టర్ గారిని కలవండి" అన్నాడు గుమస్తా.
"రేపు మళ్ళీ డాక్టర్ ఫీజు ఉంటుందా?" అని అడిగాడు శంకరం.
"రేపు ఉండదు, ఎల్లుండి వస్తే ఉంటుంది" అన్నాడు గుమస్తా.
ఆటో ఎక్కి ఇంటికి చేరుకుని మంచం ఎక్కాడు శంకరం.
ఉదయం అవ్వగానే లేచి, ఈపూట కొద్దిగా నీరసం తగ్గినట్టుంది, అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి రెండు వేలు ఖర్చు అయ్యింది అనుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళాడు. గుమస్తా శంకరంని చూసి నవ్వుతూ "లోపలికి వెళ్ళండి, మీ రిపోర్ట్స్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాయి" అన్నాడు.
"ఆ.. రండి శంకరం గారు, అనుకున్నట్టే అయ్యింది" అన్నాడు డాక్టర్ గారు.
"ఏం అనుకున్నారు సార్?" అన్నాడు శంకరం.
"అదే మీ లక్షణాలు విని మీకు షుగర్ వచ్చిందేమో అనుకున్నాను. ఈ రిపోర్ట్ మీకు షుగర్ వచ్చింది అని రుజువు చేసింది. ఇక మీరు తీపి వస్తువులకు దూరంగా ఉండాలి, అన్నం బదులు మిల్లెట్స్ వాడాలి, రోజూ ఒక గంట స్పీడ్ గా నడవాలి" అన్నాడు.
"సార్ నాకు నడవటానికి టైమ్ దొరకదు, స్వీట్స్ తినను. మిల్లెట్స్ అన్నం లాగా బావుంటుందా?" అని అడిగాడు శంకరం.
"మొదట్లో డోకు వస్తుంది, తరువాత అలవాటు అవుతుంది. ఎంతమంది పిల్లలు?" అన్నాడు డాక్టర్ గారు.
"ఇంకా లేదండి" అన్నాడు శంకరం ముసిముసి నవ్వులు నవ్వుతూ.
"షుగర్ వాళ్ళకి కొద్దిగా కష్టమే పిల్లల విషయంలో. సరే మందులు రాసి ఇస్తాను, ప్రతీ నెలా వచ్చి చూపించుకోండి" అన్నాడు.
ఇంటికి వచ్చిన శంకరం భార్యతో అన్నాడు "అయిపోయింది, నా జీవితం ఇక్కడితో ఆఖరు. ఇక నేను స్వీట్లు తినలేను, నాకు నచ్చిన పనులు చేయలేను. మెల్లమెల్లగా నా అవయవాలు పాడైపోతాయి, నేను అందరి మీద ఆధారపడాల్సి వస్తుంది" అని తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయాడు.
అతను ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం మానేశాడు. తను తినే ప్రతి ముద్దను విషంలా చూడటం మొదలుపెట్టాడు. తనకి మరణ శాసనం రాసినట్లుగా భావిస్తూ ముడుచుకుపోయాడు. ఇంటికి వచ్చిన వారిని, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి "మీకు షుగర్ ఉందా లేదా మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా?" అని అడగటం, వాళ్ళు "ఆ పాడు జబ్బు మాకు లేదు" అనగానే మరీ కృంగిపోవడం చేస్తున్నాడు.
"నువ్వు అన్నావుగా ఈ వడ్డీ వ్యాపారం మీ ఇంటా వంటా లేదు, మీకు ఎలా వచ్చింది అని? అలాగే షుగర్ మా ముత్తాతల నుంచి ఎవరికీ లేదు. బహుశా మా నాన్న నన్ను ఏ మార్వాడీ నుంచి తెచ్చుకుని పెంచుకున్నాడేమో" అన్నాడు భార్యతో.
"మీ చాదస్తం పాడుగాను! చివరికి పుట్టుకను కూడా అనుమానిస్తున్నారు. ఇక లాభం లేదు, మీరు కొన్నాళ్ళు వంతెన రాజుగారి ఆశ్రమంలో చేరండి, బాగుపడతారు" అంది తులసి చిరాకు వచ్చి.
ఒకరోజు శంకరం దగ్గర ఎక్కువగా అప్పు తీసుకునే స్నేహితుడు ప్రసాద్ ఇంటికి వచ్చాడు. ప్రసాద్ చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. శంకరం పరిస్థితి చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు.
ప్రసాద్ నవ్వుతూ ఇలా అన్నాడు: "మిత్రమా, నీకు షుగర్ రావడం నీ జీవితానికి ముగింపు కాదు, ఇది నీ జీవితానికి కొత్త ప్రారంభం. నిజం చెప్పాలంటే, నాకు గత 15 ఏళ్లుగా షుగర్ ఉంది."
శంకరం ఆశ్చర్యపోయాడు. "మరి నువ్వు అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నావు?" అని అడిగాడు.
ప్రసాద్ అతనికి జీవితం మీద భయం పోగొట్టేలా కొన్ని విషయాలు చెప్పాడు.
"చూడు శంకరం గారు, మనం కారు నడిపేటప్పుడు బ్రేకులు ఎలాగో, షుగర్ ఉన్నవారికి ఆహార నియమాలు అలాగ. బ్రేకులు ఉంటేనే కారు క్షేమంగా గమ్యాన్ని చేరుతుంది. అలాగే మన డైట్ మనల్ని కాపాడుతుంది."
"షుగర్ రాకముందు నేను ఏది పడితే అది తినేవాడిని, వ్యాయామం చేసేవాడిని కాదు. కానీ ఇప్పుడు ప్రతిరోజూ నడుస్తున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను. మునుపటి కంటే ఇప్పుడే నేను ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాను."
"జీవితంలో తీపి అంటే కేవలం పంచదార మాత్రమే కాదు. నీ కుటుంబంతో గడిపే సమయం, నువ్వు చేసే ప్రయాణాలు, నీ సాధనలు... ఇవన్నీ తీపి జ్ఞాపకాలే. షుగర్ నీ రక్తాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది, నీ మనసుని కాదు. నడక అలవాటు లేని మనకి నడక అలవాటు అవుతుంది, దానితో జీవితాంతం మంచం మీద పడే అవసరం ఉండదు" అన్నాడు.
ప్రసాద్ మాటలతో శంకరానికి ధైర్యం వచ్చింది. "ఒక్క నిమిషం" అని లోపల నుంచి ప్రసాద్ తాకట్టు పెట్టిన గాజుల జత తీసుకుని వచ్చి ప్రసాద్ కి ఇస్తూ, "ఇక జీవితం లేదనుకుంటున్న నాకు జీవితం మీద ఆశ చూపించావు. షుగర్ అనేది ఒక వ్యాధి మాత్రమే కాదు, అది ఒక జీవనశైలి మార్పు అని గ్రహించాను. మీకు వీలున్నప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వండి చాలు, వడ్డీ అక్కరలేదు" అన్నాడు శంకరం.
అతను మందులు వాడుతూనే, పద్ధతైన ఆహారం, వ్యాయామం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు అతను మునుపటి కంటే ఎక్కువ చురుగ్గా ఉన్నాడు.
భార్య తులసికి చెప్పాడు "ఈరోజు నుంచి బ్యాంకు వడ్డీ కన్నా ఒక పర్సెంట్ ఎక్కువ వడ్డీ మాత్రమే తీసుకుంటాను, అది కూడా మనం బతకడానికి" అన్నాడు.
షుగర్ వ్యాధితో జీవితం అంతం కాదు, అది ఒక హెచ్చరిక మాత్రమే. సరైన అవగాహన, క్రమశిక్షణ ఉంటే షుగర్ ఉన్నవారు కూడా సామాన్యుల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలరు. మీకు తెలిసిన వారు ఇలాంటి ఆందోళనలో ఉన్నారా? ఉంటే ఆహార నియమాలతో పూర్తి జీవితం జీవించవచ్చు అని ధైర్యం చెప్పండి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments