బొమ్మను గీస్తే

Bommanu Geesthe - Telugu Inspirational Story | Penumaka Vasantha
బొమ్మను గీస్తే - తెలుగు ప్రేరణాత్మక కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 10/09/2026
“బొమ్మను గీస్తే....” ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో పుట్టిన బాలుడి ప్రతిభ ఎలా అతని జీవితాన్ని మార్చిందో చెప్పే హృదయస్పర్శి తెలుగు కథ.
వ్యవసాయం, ఎడ్ల పందేలు, పల్లె వాతావరణం, తల్లిదండ్రుల ప్రేమతో పాటు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ కథ చక్కగా తెలియజేస్తుంది.
బొమ్మను గీస్తే....
"రేయి లేగు, స్కూల్ కు పోదువు గాని..!" అంటూ కొడుకుని లేపాడు మల్లయ్య.
"నాన్నా, నేను స్కూలుకు పోనూ. నీతో పాటు పొలం వస్తాను" అంటూ ఏడుపు మొదలెట్టాడు హనుమంతు.
"ఒరేయి..! మాకే ఎందుకు ఈ యగసాయం చేత్తాన్నామా? అని రోజు తలకాయ పట్టుకుంటా ఉంటే, నువ్వు పొలం పోయి సాగు చేత్తావా? లేగుస్తావా, కర్ర తెచ్చి రెండు తగిలించనా?" అంటూ కర్ర తీసుకుని వచ్చేసరికి లేచి వేపపుల్ల నోట్లో పెట్టుకుని గుడిసె బయట అరుగు మీద కూచున్నాడు హనుమంతు.
సంచి తలకు తగిలించుకుంటూ తండ్రి ఎద్దులను తీసుకుని బయటకు వెళ్తుంటే... అట్లాగే ఆ ఎద్దుల వైపు చూస్తా ఉన్నాడు.
"నాన్నోయి, ఇయాలే కదూ మన ఎడ్ల పందేలు జరిగేది."
"అవునురా..!"
"మా స్కూల్ గ్రౌండ్లోనే గా..?"
"అవునురా, సందేలా నేను స్కూల్ కు వస్తాను. అపుడు నీ సంగతేందో తేలుస్తాను."
"అట్లాగే... తేల్చుకో..!" అంటూ నవ్వుతూ స్కూల్ కెళ్ళాడు మన హనుమంతు.
ఆ రోజు స్కూల్లో ఎడ్ల పందేల పోటీలో హనుమంతు వాళ్ళ ఎడ్లు గెలిచాయి. మల్లయ్యకు యాభై వేల రూపాయలు వచ్చాయి.
ఆ రోజు ఆనందంగా అనిపించింది హనుమంతుకు. మల్లయ్య ఎడ్లకు మేత, పొలానికి ఎరువులు కొన్నాడు. హనుమంతుకు, మిగతా ఇద్దరు పిల్లలకు మంచి బట్టలు కొన్నాడు.
ఆ ఎడ్ల పేరు రామలక్ష్మణులు. వాటిని ఎంత ముద్దుగా చూస్తాడో, అంతే ముద్దుగా పిల్లలను చూస్తాడు మల్లయ్య.
హనుమంతు డ్రాయింగ్ బాగా వేస్తాడని స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ బొమ్మలు ఎలా గీయాలో బాగా నేర్పాడు. హనుమంతు ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు గీసి గుడిసె బయట గోడమీద అతికించేవాడు.
"ఏమయ్యా, వీడు పెద్ద చదువులు చదువుతాడంటే బొమ్మలు గీత్తన్నాడు" అంది హనుమంతు తల్లి శేషమ్మ కోపంగా.
"లేదులే బానే చదువుతాడంటలే..! మొన్న స్కూల్లో పంతుళ్లను అడిగి కనుక్కున్నాలే..!" హనుమంతును మురిపెంగా చూస్తూ అన్నాడు మల్లయ్య.
డ్రైవర్ "సార్, మీ వూరు వచ్చింది..!" అన్న మాటతో గతంలోంచి బయట పడ్డాడు హనుమంతు.
అదే వూరు పచ్చటి పొలాలు. ఇంకా మా ఊరు ఎక్కడో మధ్యలో ఉండటం వల్ల ఇంకా సిటీ ఛాయలు పెద్దగా పాకలేదు.
అదే పంటపొలాలు, అవే ఊరి బయట గుడిసెలు. మధ్యలో చిన్న కాలువలో తామర పువ్వులు, ఇప్పటికీ అదే వాతావరణం. కారు చూడటంతో గుడిసె బయట కూచున్న ఆడంగులు ఎవరిది కారు అని తొంగి చూస్తుంటే... కారు ఆపి వాళ్ళను పలకరించాడు.
"ఓరి నువ్వా..! హనుమంతు? ఎంత పెద్ద వాడవయ్యావు" అని వాళ్ళు పలకరిస్తే... అన్నిటికి ఓపికగా జవాబు చెప్పి తనింటి వైపు కదిలాడు.
బయట వరండాలో కూచుని చుట్ట తాగుతున్న నాన్న దగ్గరికి వెళ్ళాడు.
"ఒరేయి హనుమంతు..! బాగున్నావా నాన్నా..! ఏమేవు, హనుమంతు వచ్చాడు" అని కేకపెట్టాడు మల్లయ్య.
"ఆ, వత్తాన్నా..! అంటూ మంచినీళ్ల చెంబు తీసుకుని వచ్చింది.
"ఏరా నాన్నా బాగుండావా?" అంటూ ప్రేమగా కొడుకును చూస్తూ అంది బాయమ్మ.
"ఆ బాగున్నా.. నాన్నా, ఈ ఫోటోకి చూడు..!" అంటూ చూపించాడు.
"ఏది..?" అంటూ మెళ్ళో ఉన్న కళ్ళజోడును తీసి కళ్ళకు పెట్టుకుని చూశాడు మల్లయ్య.
"నేనేగా ఇది..!" అన్నాడు ఆనందముగా.
"అవును నాన్నా, నువ్వు, మన వూరు, మన రామలక్ష్మణుల ఫోటో రాష్ట్ర స్థాయి చిత్ర పోటీలకు పంపిస్తే... ఫస్ట్ ప్రైజ్ వచ్చింది."
"అవునురా మీ నాన్నే..! ఆ గళ్ళ లుంగీ, చేతుల బనీను ఎప్పటికీ వదలడుగా? మన ఎడ్లు ఎంత బావుండాయి?" అంటూ ఫోటో చూస్తూ మురిసిపోతూ అంది.
"ఏందో చిన్నపుడు నువ్వు గీత్తా ఉంటే... అవి నీకేమి కూడు పెడతాయిలే అన్నాను. కానీ, వీటివల్ల బానే సంపాదిత్తనావు. మాకు కూడు పెడుతున్నావు..!" అంటూ హనుమంతును మెచ్చుకుంది అమ్మ బాయమ్మ.
"అమ్మా..! అపుడు ఎడ్లు మనకు అన్నం పెడితే... ఇపుడు నేను గీసే ఈ బొమ్మలే..! నాకు తిండి పెడుతున్నాయి. వచ్చేనెల అమెరికాలో నేను గీసిన చిత్రాల ఎగ్జిబిషన్ ఉంది. వెళ్తున్నా, నేను వచ్చేదాకా ఈ డబ్బు ఉంచండి..!" అని అమ్మ చేతిలో పెట్టాడు.
"అమ్మా..! ఇది కూడా బొమ్మలు గీస్తే వచ్చింది..!" అంటూ నవ్వాడు.
ఆ డబ్బు జాకెట్లో దోపుకుంటూ "సరేగాని, ఎపుడు తిన్నావో ఏమో, లోనకి రా బువ్వ తిందువు గానీ."
"ఇపుడే... మా డ్రాయింగ్ మాస్టర్ ఇంటికి వెళ్ళి వస్తా..! వచ్చి తింటాను" అంటూ కదిలాడు హనుమంతు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.












Comments