కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Ee Award Nadi Kadu' written by M R V Sathyanarayana Murthy
రచన : M R V సత్యనారాయణ మూర్తి
ఉన్నత స్థానాన్ని చేరుకున్న శాస్త్రవేత్త అతను.
కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే స్వభావం అతనిది.
అసలు అలాంటివాళ్లే అంతగా ఎదుగుతారనేది సత్యం.
విజయం సాధించిన సమయంలో, అందుకు సహకరించిన వాళ్ళను స్మరించుకునే గొప్ప వ్యక్తి కథను ప్రముఖ రచయిత ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి గారు ఆకట్టుకునేలా రచించారు.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
“రామ్మూర్తి గారూ, స్టేజి దగ్గర అంతా సిద్ధం చేసారా?” ప్రధాన శాస్త్రవేత్త పాండురంగ
అడిగారు.
“అంతా అరేంజి చేసాను సార్ . ప్రార్ధన పాడటానికి పిల్లల్ని స్టేజి దగ్గరే
కూర్చోబెట్టాను. మంత్రి గారు రాగానే వారికి ఇవ్వడానికి బొకేలు సిద్ధం చేసాను. బొకేలు
ఇచ్చే వాళ్ళ పేర్లు కూడా రాసుకుని, వాళ్ళని కూడా స్టేజి దగ్గరే ఉండమని చెప్పాను.
మైకులు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసాను. మీరు కంగారు పడకండి సార్. అంతా
సవ్యంగా జరుగుతుంది”సహాయ శాస్త్రవేత్ర రామ్మూర్తి వినయంగా చెప్పాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాధవరం వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి రాష్ట్ర
వ్యవసాయ మంత్రి ఆరోజు వస్తున్నారు. అందుకే పాండురంగ హడావిడి పడుతున్నారు. మాధవరం వరి పరిశోధనా కేంద్రానికి జాతీయస్థాయిలో మంచి పేరు ఉంది. మాధవరం శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త వరి వంగడాలనే రాష్ట్రంలోని డెబ్భై శాతం రైతులు పండించి అధికదిగుబడి సాధిస్తున్నారు. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం,ఫిలిప్పీన్సు శాస్త్రవేత్తలు పలు సందర్భాలలో మాధవరం కేంద్రం శాస్త్రవేత్తలను అభినందించడం జరిగింది.
సరిగ్గా పది గంటలకు మంత్రి గారి కాన్వాయ్ కూతవేసుకుంటూ పరిశోధనా కేంద్రం
దగ్గరకు వచ్చింది. ఆ వెనకే మంత్రి గారి కారు, దానిని అనుసరిస్తూ ఎం. ఎల్. ఏ ల, జిల్లా
కలెక్టర్ ఇతర అధికార్ల కార్లు ఆగాయి. డాక్టర్ పాండురంగ ఎదురువెళ్ళి పూలదండ
మంత్రిగారి మెడలో వేసి స్వాగతం పలికారు.
మంగళవాయిద్యాలతో మంత్రిగారిని తీసుకుని పరిశోదనాకేంద్రం భవనంలోకి తీసుకువచ్చి వివిధ విభాగాల్ని మంత్రిగారికి చూపించారు. తర్వాత ఫోటో ఎక్జిబిషన్ హాలు లోకి తీసుకువచ్చారు. ఇంత వరకూ మాధవరం కేంద్రం శాస్త్రవేత్తలు కనిపెట్టిన వరి వంగడాల ఫోటోలను మంత్రిగారికి చూపిస్తూ, ఏ వంగడం ఎకరాకు ఎన్ని బస్తాల ధాన్యం దిగుబడిని ఇస్తుందీ, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారో వివరించారు పాండురంగ. మంత్రిగారు చాలా ఆసక్తిగా విన్నారు ఆయన మాటల్ని. అరగంట సేపు ఫోటో ఎగ్జిబిషన్ హాలులో గడిపారు మంత్రిగారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉండడంతో పాండురంగ స్థిమిత పడ్డారు.
ఆ తర్వాత అందరూ నడుచుకుంటూ స్టేజి దగ్గరకు వచ్చారు. డాక్టర్ రామ్మూర్తి మంత్రిగారిని, ఎం. ఎల్. ఏ లను జిల్లా కలెక్టర్ ని వేదికమీదకు ఆహ్వానించారు. స్కూల్ పిల్లలు ముందుగా వందేమాతరం పాడి, తర్వాత రైతు గొప్పదనం గురించి ఒక గేయం పాడారు. మంత్రిగారు పిల్లలు ఇద్దరినీ దగ్గరకు పిలిచి బాగా పాడారని అభినందించి రెండు పూల బొకేలు వారికి ఇచ్చారు. డాక్టర్ పాండురంగ మైకు దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు.
“ఈ పరిశోధనా కేంద్రం అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ రూపొందించిన
వరి వంగడాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతో మంది రైతులు ఈ అధిక
దిగుబడి వంగడాలను పండిస్తూ ఆహారధాన్యాల ఉత్పత్తిలో అగ్ర భాగాన ఉన్నారు. మా సలహాలు,సూచనలు పాటిస్తూ వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న రైతాంగానికి నేను సభా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గౌరవనీయ మంత్రిగారు మొదటిసారిగా మా పరిశోధనా కేంద్రానికి రావడం మా
అదృష్టంగా భావిస్తూ, వారిని మాట్లాడవలసినదిగా కోరుతున్నాను” అని ముగించారు డాక్టర్
పాండురంగ.
మంత్రి గారు మాట్లాడటానికి లేవగానే మీటింగ్ కి హాజరైన రైతులు,ప్రజలు
ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. మంత్రిగారు చిరునవ్వు నవ్వుతూ మైకు దగ్గరకు వచ్చి సభాసదులు అందరికీ కుడిచెయ్యి పైకి ఎత్తి అభినందనలు తెలిపారు. వేదిక మీద ఉన్న ఎం. ఎల్. ఏ లు కూడా చిరునవ్వులు చిందించారు. మంత్రిగారు మాట్లాడటం మొదలుపెట్టారు.
“నా ప్రియమైన ప్రజలకు, మన అందరికీ అన్నంపెట్టే రైతన్నలకు నా నమస్కారములు. ఎప్పటి నుంచో ఈ పరిశోధనాకేంద్రం కి రావాలనుకున్నాను. కానీ పని ఒత్తిడివలన రాలేకపోయాను. ఆ అవకాశం ఇప్పటికి కుదిరింది. డాక్టర్ పాండురంగా రావు గారు ఈ కేంద్రం సాధించిన ప్రగతి గురించి నాకు తెలిపారు. వారికి నా కృతజ్ఞతలు. నిజంగా ఇంత గొప్ప వరి పరిశోధనాకేంద్రం మన రాష్ట్రంలో ఉండడం మన రైతులు, మనమందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడి శాస్త్రవేత్తలు మరెన్నో కొత్త విత్తనాలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని ఈ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పాండురంగారావు గారు చెప్పారు. వారు, వారి తోటి శాస్త్రవేత్తల కృషి ఫలించి మన రైతాంగానికి ఉపయోగపడే కొత్త వరి విత్తనాలు త్వరలోనే విడుదల అవ్వాలని నేను కోరుతున్నాను. ఈ మాధవరం పరిశోధనాకేంద్రం అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. శెలవ్” అని తన సీటులో కూర్చున్నారు మంత్రిగారు.
డాక్టర్ పాండురంగారావు మరల మైకు దగ్గరకు వచ్చి”గత సంవత్సరం మా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయప్రసాద్,ముంపు ప్రాంతాలకు కూడా ఉపయోగపడే వరి వంగడాన్ని కనుగొన్నారు. దాన్ని కొంతమంది ఆదర్శరైతులకు అందించి ప్రయోగాత్మకంగా సాగుబడి చేయించాం. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఆ వంగడాన్ని ముంపుప్రాంతాలలో వరి పండించే రైతులకు అందచేసాం. ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రిగారిని శాస్త్రవేత్త విజయప్రసాద్ గారికి అవార్డు అందజేయవలసినదిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ విజయప్రసాద్ ని వేదిక మీదకు రావాల్సినదిగా ఆహ్వానిస్తున్నాను” అని అన్నారు.
డాక్టర్ విజయప్రసాద్ వేదికమీదకు రాగానే మంత్రిగారు ఆయనకు శాలువా కప్పి
సత్కరించి, అవార్డు అందజేశారు. డాక్టర్ విజయప్రసాద్ అందరికీ వినయంగా
నమస్కరించి మైకు దగ్గరకు వచ్చారు.
“పెద్దలు,గౌరవనీయులు వ్యవసాయ మంత్రిగారికి నా నమస్కారాలు. నా
పరిశోధనలకు ఎంతో సహకరిస్తున్న మా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాండురంగారావు గారికి కృతజ్ఞతలు. మీ అనుమతితో ఒక వ్యక్తిని వేదికమీదకు పిలవాలనుకుంటున్నాను”అని డాక్టర్ పాండురంగారావు కేసి చూసారు విజయప్రసాద్.
ఆయన అంగీకారంగా తల ఊపగానే “రమణమ్మా ,ఒకసారి ఇలా రా”అని పిలిచారు
విజయప్రసాద్.
ట్రే లో మంచినీళ్ళ గ్లాసులు పెట్టుకుని ,వేదిక ముందు కూర్చున్న రైతులకు
మంచినీళ్ళు ఇస్తోంది రమణమ్మ. మైకులో తన పేరు వినపడగానే వెనక్కి తిరిగి చూసింది.
డాక్టర్ విజయప్రసాద్, వేదిక మీదకు రమ్మనమని చేతితో సైగ చేసారు.
‘ఏం పొరపాటు జరిగిందా’ అని ఆందోళనగా నడుచుకుంటూ వేదికపైకి
వచ్చి మంత్రిగారికి, మిగతా పెద్దలు అందరికీ నమస్కరించి నిలబడింది రమణమ్మ.
డాక్టర్ విజయప్రసాద్ తిరిగి మాట్లాడటం ప్రారంభించారు. ”ఈమె పేరు రమణమ్మ. మా
కేంద్రంలో ఫీల్డు అసిస్టెంట్ గా పనిచేస్తోంది. మా కన్నా వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉన్న మనిషి. మేం ప్రయోగాలకోసం పెంచే వరి మొక్కలంటే ఈమెకు చాలా అభిమానం. రోజూ ఉదయాన్నే మా కంటే అరగంట ముందువచ్చి పొలాన్ని చూసివస్తుంది. తర్వాత మాతో మరలా పొలానికి వచ్చి ఎక్కడ మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంది,ఎక్కడ దోమ ఉందీ,ఎక్కడ చీడ పీడా ఉందీ మాకు వివరంగా చెప్తుంది. మేము ప్రయోగాలకు ఎంపిక చేసిన వరి దుబ్బులను చాలా జాగ్రత్తగా ప్రయోగశాలకు తీసుకువస్తుంది. నేను ఈ కేంద్రానికి వచ్చి పది సంవత్సరాలు అయ్యింది. కానీ రమణమ్మ పాతిక సంవత్సరాల నుంచీ ఇక్కడ పనిచేస్తోంది. ఇక్కడ ఇంతకు ముందు పనిచేసిన డాక్టర్ శ్యామసుందర మూర్తి, డాక్టర్ శ్రీరామమూర్తి నాకు రమణమ్మ గురించి చెప్పారు. జీతంకోసం కాకుండా, అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు.
గత ఏడాది ముంపుప్రాంతాలకు ఉపయోగపడే కొత్త వంగడం కనుగొనే
సమయంలో నాకు ‘డెంగూ’ జ్వరం వచ్చింది. నా భార్య మా అమ్మాయి పురిటికోసం అమెరికా వెళ్ళింది. అప్పుడు నా క్వార్టర్ కి వచ్చి రమణమ్మ ఒక సోదరిలా నాకు పరిచర్యలు చేసింది. అంతే కాకుండా నా సహాయకుడు డాక్టర్ కిరణ్ తో కలిసి ప్రయోగశాలలో ఉన్న వరిమొక్కలని ఎంతో భద్రంగా కాపాడింది. నేను కోలుకున్నాకా నాకు ఎంతో సహకరించింది. ఒక శాస్త్రవేత్త ఒక విజయం సాధిస్తే అది కేవలం అతని ఒక్కడి ప్రతిభే కాదు,అతని టీం లోని వారి సహకారం కూడా ఉంటుంది. నేను అనారోగ్యం నుంచి వెంటనే కోలుకోపొతే, ఈ కొత్త వంగడం విడుదలకు మరో ఏడాది సమయం పట్టేది. నన్ను మానవత్వంతో ఆదుకుని, ఆరోగ్యవంతుడిగా చేసిన ఈ తల్లి ఋణం ఎలా తీర్చుకోను?. . . ” అంటూ చటుక్కున వంగి రమణమ్మ పాదాలకు నమస్కరించాడు డాక్టర్
విజయప్రసాద్. అనుకోని సంఘటనకు నివ్వెరపోయిన రమణమ్మ,వెంటనే తేరుకుని
వెనక్కి జరిగి “సార్ ఏంది సార్ ఇది?”అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
లేచినిలబడి, మరలా చెప్పసాగాడు విజయప్రసాద్. ”నా ఈ విజయానికి సగం
కారకురాలు రమణమ్మ అని సభా ముఖంగా చెబుతున్నాను. ఈ అవార్డు నాది కాదు
రమణమ్మదే అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను” అని మంత్రిగారు ఇచ్చిన
అవార్డుని రమణమ్మ చేతిలో పెట్టాడు విజయప్రసాద్. ఈలోగా మంత్రిగారు డాక్టర్
పాండురంగారావు చెవిలో ఒక మాట చెప్పారు.
ఆయన రామ్మూర్తిని పిలిచి’శాలువా తీసుకురండి’అని చెప్పారు. వెంటనే రామ్మూర్తి శాలువా
తెచ్చి పాండురంగారావు కి ఇవ్వడం, ఆయన దానిని మంత్రిగారికి ఇవ్వడం స్పీడ్ గా
జరిగింది.
మంత్రిగారు టేబుల్ మీద ఉన్న మైకు చేతిలోకి తీసుకున్నారు. ”డాక్టర్ విజయప్రసాద్ చెప్పింది చాలా వాస్తవం. మా తాత స్వాతంత్రసమర యోధులు. రెండు సార్లు జైలుకి వెళ్ళారు. మా తాత ఎప్పుడూ చెప్పేవారు ’నేను జైలులో ఉన్నప్పుడు మీ నాన్నని, చిన్నాన్నని భద్రంగా పెంచి పెద్ద చేసిన మీ నాయనమ్మ నా కంటే పెద్ద దేశభక్తురాలురా’ అని. అలాగే ప్రతి విజయం వెనుకా ఎందరి సహకారమో ఉంటుంది. గొప్ప శాస్త్రవేత్త అయినా, రమణమ్మ లాంటి మానవతావాది పాదాలకు నమస్కరించిన విజయ ప్రసాద్ సంస్కారాన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా ఉన్న రమణమ్మ ని అభినందిస్తున్నాను” అని రమణమ్మ ని శాలువా కప్పి సత్కరించి, జేబులోంచి పదివేలు తీసి ఇచ్చారు మంత్రిగారు.
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా మంత్రి గారి పాదాలకు నమస్కరించింది
రమణమ్మ. సభ అంతా చప్పట్లతో మారుమోగింది మానవత్వానికి జరిగిన సత్కారానికి.
శుభం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
Malapaka Rajeswari • 23 hours ago
చాలా బావుంది కధ.మీరు ఇంకా బాగా చదివారు, మానవత్వం నిండిన కధ. మీ ఇద్దరికీ అభినందనలు