top of page
Original.png

జీవం ఉన్నప్పుడే ప్రేమించు

2 days ago
5 min read

జీవం ఉన్నప్పుడే ప్రేమించు తెలుగు కథలో వృద్ధాశ్రమంలో బాధతో ఉన్న తల్లి, ఆస్తి పత్రాలతో వచ్చిన ఆమె కుమారుడు

Jeevam Unnapude Preminchu - Telugu Family Story | Penumaka Vasantha

జీవం ఉన్నప్పుడే ప్రేమించు - తెలుగు కుటుంబ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 16/10/2026


జీవం ఉన్నప్పుడే ప్రేమించు పెనుమాక వసంత రచించిన హృదయాన్ని కదిలించే తెలుగు కుటుంబ కథ. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ప్రేమ, ఆప్యాయత ఎంత అవసరమో, వారి విలువను వారు బతికున్నప్పుడే గుర్తించాలని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.


ఆశ్రమం దగ్గరకు వెళ్లి అక్కడున్న వాచ్‌మన్‌ను అడిగాడు సార్వభౌమరావు, "మేనేజర్ రూమ్ ఎక్కడ?" అని.


"అదిగో ఆ కనపడుతున్న రూమ్‌లో ఉంటారు, వెళ్లండి," అన్నాడు వాచ్‌మన్.


ఆ రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు దగ్గర ఆగాడు. మేనేజర్ ఎవరితోనో మాట్లాడుతూ గది బయటకు చూసి, "రండి లోపలికి...!" అన్నాడు.


వెళ్లి కూర్చున్నాడు కుర్చీలో. ఆ మాట్లాడుతున్న వ్యక్తి త్వరగా వెళ్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నాడు సార్వభౌమరావు.


అతడు వెళ్లగానే సార్వభౌమరావును చూసి, "చెప్పండి...!" అన్నాడు.


"ఒక ఆరు నెలల క్రితం మీరు నాకు ఫోన్ చేశారు... ఇక్కడ మా ఫాదర్ పోయారని," తన చేతికున్న రోలెక్స్ వాచ్‌ను తిప్పుకుంటూ అన్నాడు.


"అయితే...?" అంటూ చూశాడు మేనేజర్.


"అప్పుడు నేను రాలేకపోతే... మీరే ఎవరినో పెట్టి కర్మకాండలు జరిపించారు."

"ఆ... మీరు సార్వభౌమరావు గారు కదూ!?" అన్నాడు.


"ఆ, గుర్తుపట్టారు! నేనే ఆ సార్వభౌమరావును," అంటూ ఇంకొంచెం ముందుకు జరిగి, "మీకు అప్పుడే డబ్బులన్నీ పే చేశాను," అన్నాడు.


"అవును, ఆ రిసిప్ట్స్ ఉన్నాయి, చూపించమంటారా?" కళ్లజోడులో నుండి చూస్తూ అడిగాడు ఆశ్రమ మేనేజర్.


"నేను అందుకు కాదు వచ్చింది. ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడను పిలుస్తారా? చూసి వెళ్తాను. నాకు టైమ్ లేదు, ఫ్లైట్ రాత్రికి ఉంది, వెళ్లాలి."


"సరే ఉండండి...!" అంటూ బెల్ కొట్టగానే ఒక వ్యక్తి వచ్చాడు.


"ఈయన్ని సీతారావమ్మగారి దగ్గరకు తీసుకువెళ్లు...!" అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి సార్వభౌమరావును సీతారావమ్మ ఉన్న గది దగ్గరకు తీసుకెళ్లాడు.


కాలి అడుగుల చప్పుడుకు భగవద్గీత చదువుతున్న సీతారావమ్మ ఎవరబ్బా అని చూసింది. ఇంకెవరు... సుపుత్రుడు!


"అమ్మా! ఎలా ఉన్నావు?" అంటూ ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.


"ఏదో ఇలా ఉన్నాను," డెబ్బయి ఏళ్ల సీతారావమ్మ లేచి మంచినీళ్లు ఇచ్చింది. ఆమె కళ్లలో కొడుకును చూసిన ఆనందం, ఆశ్చర్యం లేనేలేవు. ఎవరో దూరపు చుట్టాలవాళ్లు వస్తే చూసినట్లు చూసింది.


"అమ్మా! ఇక్కడ నీకు బాగా వసతిగా ఉందా?"


"చాలా బాగుంది, బాగా చూస్తున్నారు."


"అక్క ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్తుందా?"


"ఆ... వస్తుంది అప్పుడప్పుడు."


అమ్మ పొడిపొడిగా చెప్పిన జవాబులు విని సార్వభౌమరావుకు చాలా కోపంగా అనిపించింది. 'వేల మైళ్ల నుండి వస్తే అమ్మకు ఏంటి ఈ నిర్లిప్తత?' అనుకుని... "సరే, బాగానే ఉన్నావు కదా! మరి వెళ్లనా?" అన్నాడు లేస్తూ.


"అసలు నువ్వు ఎందుకు వచ్చినట్లు ఇక్కడకి?" అని అడిగింది.


"అదేంటమ్మా, తల్లిని వచ్చి చూడకూడదా?" అన్నాడు కొంచెం కోపంగా.


"నువ్వు నన్ను తల్లి అనుకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు," అని లేచి, చిన్నగా ఒక అల్మారాలో ఉన్న దస్తావేజులు ఇచ్చింది.


అవి తీసుకుని చూశాడు. "అదేంటి? పది ఎకరాల ఆస్తి కదా మనది?" అన్నాడు.


"అవునురా! ఇక్కడ నన్ను చూస్తున్న ఈ ఆశ్రమానికి ఐదు ఎకరాలు రాశాడు నాన్న."


"నువ్వేమి చేస్తున్నావు ఆయన రాస్తుంటే...?" అన్నాడు కోపంగా.


"నేను మొదట్లో అలాగే అరిచాను. కానీ నువ్వు మీ నాన్న చనిపోతే రాలేదు చూడు... అప్పుడు మీ నాన్న చేసింది సరైనది అనిపించింది. ఈ ఐదు కూడా నీకు వద్దన్నాడు మీ నాన్న.


నేనే కన్న కడుపు కదా అని వద్దని చెప్పి నీకు రాయించాను. అన్నట్లు నేను పోయినా నువ్వు రానవసరం లేదు. ఆఫీసు పనులతో బిజీగా ఉంటావు, వీళ్లు ఫోన్ చేస్తారు. ఏదో ఆ రోజు తలస్నానం చేయి, చాలు," అంది కొంచెం కోపంతో సీతారావమ్మ.


"అసలు మీరు తల్లితండ్రులేనా? అక్కడ నేనెంత బిజీగా ఉన్నాను! డబ్బులు పంపించాను ఆశ్రమం వాళ్లకు. మళ్లీ మీరు వాళ్లకు ఆస్తి రాసివ్వడం మీకు న్యాయంగా ఉందా?" అని కోపంగా అన్నాడు సార్వభౌమరావు.


"అవునురా! ఇదివరకు కొడుకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పిస్తాడని అనుకునేవాళ్లు.


వాళ్లు అలాగే తల్లితండ్రులను చూసి ఆస్తి అనుభవించేవారు. ఇప్పుడు బతికున్నప్పుడే నరకం చూపించేవాళ్లను కొడుకులు అనాలి! ఈ ఐదు కూడా నీకు ఎందుకు ఇస్తున్నామంటే...


నీ పిల్లలు నిన్ను చూడకపోతే నువ్వు ఇవి ఏ వృద్ధాశ్రమానికి ఇస్తే చూస్తారని ఇస్తున్నాను...!"


"నాకేమీ వద్దు, ఇవి ఆశ్రమానికి ఇవ్వు...!" అంటూ లేచి కోపంగా బయటకు నడిచాడు. కొడుకు జవాబు ముందే తెలుసు కాబట్టి ఆ మాటలకు ఏమీ చలించలేదు సీతారావమ్మ.


ఏళ్లు గడిచాయి. సార్వభౌమరావు ఇండియా వచ్చేశాడు. అక్కడ ఉద్యోగాలు పోవడంతో, పిల్లాడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డబ్బులు ఇవ్వకపోతే తండ్రిని తిడుతున్నాడు. ఇప్పుడిప్పుడే తల్లితండ్రి విలువ తెలుస్తోంది.


అమ్మను చూద్దామని ఆశ్రమానికి వెళ్లాడు.

ఆశ్రమ మేనేజర్, "మీ అమ్మగారు చనిపోయి రెండేళ్లు అవుతుంది," అన్నాడు.


"అదేంటి? నాకు ఫోన్ చేయలేదు ఎందుకు?"


"మీ అమ్మగారు వద్దన్నారు. 'పిలిస్తే వాడు రాకపోతే నాకు పైకి పోయినా ఆత్మ శాంతించదు; అందుకే ఇక్కడ నన్ను కనిపెట్టుకుని ఉన్న రాముని నాకు కర్మకాండ చేయమని' చెప్పారు."


"మా అక్కయ్య రాలేదా?"


"లేదండి, ఆవిడ మూడేళ్ల క్రితం పోయారు. ఆవిడ దిగులుతో మీ అమ్మగారు కోలుకోలేకపోయారు. మీ బావగారు వచ్చారు. ఆవిడ కోరిక ప్రకారం ఆవిడను కనిపెట్టుకుని ఉన్న అటెండర్ రాము చేశాడు."


"మా అమ్మ నగలు ఉండాలి?" ఆదుర్దాగా అడిగాడు.


"అవన్నీ రాముకి ముందే ఇచ్చారు మీ అమ్మగారు, వాళ్ల అమ్మాయిల పెళ్లికి పనికివస్తాయని."


"నాకు చెప్పి ఉండాల్సింది, వచ్చేవాడిని," అన్న సార్వభౌమరావు గొంతులో ఇదివరకటి గాంభీర్యం లేదు. ఏదో ఉదాసీనంగా అన్నాడు.


ఇంతలో అక్కడికి రాము వచ్చాడు. "ఇతనే రాము. ఈ ఆశ్రమం పెట్టిన దగ్గరనుండి ఇక్కడ వృద్ధులను కనిపెట్టుకుని ఉంటాడు."


"రాము! ఈయన సార్వభౌమరావు, సీతారావమ్మగారి కొడుకు!"


"నమస్తే అండి...!" అన్నాడు రాము.


"మా అమ్మ పోయేప్పుడు ఏమైనా అందిగా?" అని ఆసక్తిగా అడిగాడు.


"ఆ అమ్మగారు చాలా మంచివారండి. ఒక రెండు రోజులు ఇబ్బంది పడ్డారు అంతే, మూడో రోజు నేను తలుపు తీస్తే చనిపోయి ఉన్నారు. నాకు చెప్తూ ఉండేవారు... 'నీకు ఇద్దరు అమ్మాయిలు అదృష్టం, వాళ్లను బాగా చదివించు' అని మీ గురించి గొప్పగా చెప్పేవారు.


'మా అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తాడు' అని చెప్పేవారు. నాకు అమ్మా నాన్న లేరండి. ఈ ఆశ్రమం పక్కన ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుని అమ్ముకునేవాడిని. ఈ మేనేజర్ సార్ ఇక్కడ ఉండి పెద్దవాళ్లను చూసుకో అంటూ ఈ ఉద్యోగం ఇచ్చారు. మీ నాన్నగారిని కూడా నేనే చూసుకున్నాను. ఇద్దరూ పార్వతీపరమేశ్వరులండి!


మీ అమ్మగారు అనేవారు... 'నువ్వు ఎప్పుడో మాకు రుణపడి ఉంటావు, ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నావు రాము' అని. నిజంగా మీ అమ్మగారు చెప్పినట్లు మా అమ్మాయిలు బాగా చదువుతున్నారండి. వాళ్లకు భగవద్గీత శ్లోకాలు నేర్పించారు మీ అమ్మగారు!" అంటూ గర్వంగా సార్వభౌమరావును చూస్తూ అన్నాడు రాము.


ఆ మాటలకు సార్వభౌమరావు ముఖం పాలిపోయింది. "బాగా చదివించు. ఇంకా నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయి."


మేనేజర్, "మీ అమ్మగారు మీకు ఇవ్వమని చెప్పారు," అంటూ ఒక చిన్న సూట్‌కేస్ ఇచ్చాడు. అది తీసుకుని ఇంటికి వచ్చాడు.


దానిలో పొలం దస్తావేజులతో పాటు ఒక చిన్న ఉత్తరం ఉంది:


"సర్వా...! నువ్వు ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను నిష్ఠూరంగా మాట్లాడానని నీకు కోపం వచ్చి ఉంటుంది. ఇక నా ముఖం చూడవని తెలుసు. నీకోసం చూసి చూసి కళ్లు కాయలు కాసాయి. కానీ నువ్వు రాగానే రెండు ప్రేమ మాటలు మాట్లాడతావని ఆశించాను. నువ్వు అవేమీ మాట్లాడకుండా ఆస్తి గురించి మాట్లాడావు.


ఎందుకురా పిల్లలకు తల్లితండ్రులు పెద్దయ్యాక పరాయివారు అవుతారు? మీకు అర్థం కాని విషయం ఉంది... మీరు ఎప్పుడైతే తల్లితండ్రులను చూడరో, అప్పుడే మీరు మాకు, ఈ సమాజానికి పరాయివారే! నీకు 'సార్వభౌమరావు' అని పేరు పెట్టడం వెనుక... నువ్వు రాజ్యాలు ఏలకపోయినా తల్లితండ్రులను ఏలుకుంటావు, అందరిలో గొప్పగా ఉంటావనుకుని పెట్టాను. నువ్వు బాగానే చదువు చదివి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేశావు, బాగానే ఉంది; కానీ తల్లితండ్రుల మనసును జయించలేకపోయావు.


నేను అందరినీ ప్రశ్నించేది ఒక్కటే... మిమ్మల్ని ఈ భూమికి పరిచయం చేసిన మమ్మల్ని మట్టిలో కలిపే చిన్న బాధ్యతను మీరు మరిచిపోతే ఎలా? ఇందులో నా తప్పు కూడా ఉంది. మీ నాన్న 'వాడు అమెరికా వద్దు, వెళ్తే తిరిగి రాడు' అంటే నేను ఆయన్ని బతిమాలి పంపించాను. మీకు ఎన్ని సంపదలున్నా ఏమి లాభం... మా చివరి దశలో మీరు ఇక్కడ లేనప్పుడు? నిన్ను మటుకు నీ పిల్లలు కనిపెట్టుకుని ఉండాలని రోజు నేను దేవుడికి చేసే పూజ ఫలించాలని ఆశిస్తూ, నా మనవళ్లకు ఈ రెండు గొలుసులు నా బహుమతిగా ఇవ్వు...!"


సార్వభౌమరావు కంటి నుండి మొదటిసారి నీటిచుక్క రాలింది. వెంటనే ఆ దస్తావేజు తీసుకుని వెళ్లి ఆశ్రమానికి ఇచ్చాడు.


"మా అమ్మానాన్నలను మీరే చూశారు, న్యాయంగా ఈ ఆస్తి మీకే చెందాలి. ఇంకా నా తరఫున మా అమ్మానాన్నల పేరిట ఈ డబ్బుతో ఆశ్రమాన్ని వృద్ధి చేయండి," అంటూ డబ్బు ఇచ్చాడు సార్వభౌమరావు.


"వీళ్లు బతికి ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రేమతో చూడరు కానీ చచ్చాక వాళ్ల పేరు మీద దానాలు బాగా చేస్తారు," అన్న మేనేజర్ మాటలు వెనుక వినిపిస్తుంటే, ముందుకు కదిలాడు సార్వభౌమరావు.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page