కోరిక తీరింది
- Srinivasarao Jeedigunta
- 1 hour ago
- 5 min read
#KorikaTheerindi, #కోరికతీరింది, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Korika Theerindi - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 01/03/2026
కోరిక తీరింది - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“వాళ్లు కొడుకుతో ఉండడానికి సిద్ధమయ్యారు… కానీ అమెరికా నుంచి వచ్చిన వార్త వారి జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేసింది!”
హృదయాన్ని తాకే శ్రీనివాసరావు జీడిగుంట గారి కథను చదవండి.
అది కృష్ణాజిల్లాలోని పల్లెటూరు, ఉత్తరాలు రాసుకునే కాలం.
ఆ ఊరిలోని స్కూల్ హెడ్ మాస్టర్గా మాణిక్యం గారు ఆ పల్లెటూరు పిల్లలకి చదువులో పట్నం పిల్లల స్థాయికి తగ్గకుండా చదువు నేర్పుతున్నారు. పుట్టి పెరిగింది అదే ఊరు. పెళ్లి కూడా అదే ఊరి అమ్మాయిని చేసుకోవడం, ఉద్యోగం కూడా అక్కడే కావడం, ఊరి వాళ్ల సహాయంతో ఏ లోటు లేకుండా జరుగుతోంది. మాణిక్యం గారి భార్య కామేశ్వరి కూడా భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఉండేది.
వాళ్లకి ఒక్కడే కొడుకు శంకరం. కొడుకుని కూడా తన స్కూల్లోనే చదివించి, పై తరగతుల కోసం గుడివాడ కాలేజీలో చేర్పించాడు.
మాస్టర్ గారి కొడుకు కావడంతో శంకరం చదువులో మొదటి ర్యాంక్లో ఉండేవాడు.
ఇంటర్మీడియట్ అవ్వగానే తను పనిచేసే స్కూల్లో కొడుకుని టీచర్గా పెడదాం అనుకున్న మాణిక్యం గారికి, ఆ ఊరి మోతుబరి రెడ్డిగారు, “బాగా చదువుకునే పిల్లాడిని తీసుకుని వచ్చి ఈ స్కూల్లో పెట్టి జీవితం నాశనం చెయ్యకండి, పట్నంలో ఇంజనీరింగ్ చదివించండి. కావలసిన డబ్బు సహాయం నేను చేస్తాను. మన ఊరి నుంచి ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు అంటే మన ఊరికి ఎంతో గౌరవం” అని శంకరంని విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు.
అన్నమాట ప్రకారం చదువుకి అయిన ఖర్చులు భరించాడు రెడ్డిగారు.
చదువు పూర్తి కాగానే బెంగళూరులో పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం రావడంతో శంకరం బెంగళూరు వెళ్లిపోయాడు.
ప్రతీ ఆరు నెలలకు తల్లిదండ్రులని చూడటానికి తన ఊరు వచ్చి తల్లి చేసే వంటల రుచి అనుభవించి వెళ్ళేవాడు. ఈ రాకపోకలలో శంకరంకి రెడ్డిగారి అమ్మాయితో స్నేహం పెరిగి ప్రేమగా మారింది. మాణిక్యం గారికి మొదటి నుంచి కులమత భేదం లేకపోవడంతో, కొడుక్కి తను చెప్పాల్సింది చెప్పినా వినకపోవడంతో “సరే, రెడ్డిగారు ఒప్పుకుంటే అలాగే కానివ్వు” అన్నాడు.
మొదట్లో విషయం తెలిసి రెడ్డిగారు బాధపడినా కూతురు సుఖం కోసం కులాంతర వివాహానికి ఒప్పుకుని పెళ్లి ఘనంగా చేశాడు. డబ్బు ఉన్న రెడ్డిగారు అవ్వడంతో ఊరిలో జనం కూడా లోపల లోపల మాట్లాడుకున్నా, పెళ్ళికి వచ్చి వధూవరులను దీవించి వెళ్ళారు. రెడ్డిగారు అల్లుడికి బెంగళూరులో మంచి ఫ్లాట్ కొని బహుకరించాడు.
రెండుసార్లు కొడుకు కోడలు దగ్గరికి వెళ్లి పదిరోజులు ఉండి వచ్చారు మాణిక్యం దంపతులు.
“ఏమండీ! అదేదో గ్యాస్ స్టవ్ ట! అందరూ కొనుక్కుంటున్నారు. ఈ పాత కుంపట్ల మీద వంట చేయలేక చస్తున్నాను. కాసేపు ఇటు వచ్చి విసినకర్రతో విసరండీ! మీకు తెలుస్తుంది. జబ్బలు పడిపోతున్నాయి” అంది మాణిక్యం గారి భార్య కామేశ్వరి.
“గ్యాస్ బండ పేలి చచ్చిపోతున్నారుట! అది తెలుసా నీకు? హాయిగా కుంపటిలో బండ వంకాయ కాల్చుకుని పచ్చడి చేసుకుంటే వచ్చే రుచి గ్యాస్ స్టవ్ మీద కాల్చుకుంటే వస్తుందా? చలికాలం హాయిగా మంచం క్రింద పెట్టుకుని పడుకుంటున్నాము. అదే గ్యాస్ స్టవ్ని పెట్టుకోగలవా? ఎందుకొచ్చిన ఈ వింత వస్తువులు చెప్పు! హాయిగా నీకు అలవాటు అయిన కుంపటి వంటే మనకి ఆరోగ్యం” అన్నాడు.
“ఆలా చెప్పే, కుక్కని కూడా కొనకుండా నాచేత అన్నం వార్చి వంట చేయమంటున్నారు” అంది ముక్కుకి అంటిన బొగ్గు మసి తుడుచుకుంటూ కామేశ్వరి.
“కుక్క కాదే! దాని పేరు కుక్కర్ అంటారు. పేరు కూడా అనలేవు. నీకెందుకు కామేశ్వరి కొత్త పోకడలు” అన్నాడు నవ్వుతూ.
“రోజులు ఏళ్లు అయిపోతున్నాయి. ఈ వృద్ధాప్యంతో మీకు నవకాయ పిండివంటలు వేళకి చేసిపెట్టడం నా వల్ల కాదు. అబ్బాయికి ఉత్తరం రాసేయండి. మనం వాడి దగ్గర ఉండటానికి వచ్చేస్తాము అని” అంది.
“నువ్వు నాకంటే చిన్నదానివేగా” అన్నాడు.
“అవుననుకోండి! మీరు కూర్చొని తినటానికి, నేను ఈ బొగ్గుల కుంపటి మీద వండిపెట్టడం ఒకటేనా? ముందు అలా పోస్ట్ ఆఫీస్కి వెళ్లి అబ్బాయికి ఉత్తరం రాసి రండి. మనం వస్తామనకపోవడంతో వాడు కూడా పట్టించుకోకుండా వదిలేశాడు. అక్కడికి వెళ్తే నాకు ఈ కుంపటి, వంటలు లేకుండా హాయిగా ఉంటాను” అంది కామేశ్వరి.
“నీకు హాయిగా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందో కొద్దిగా ఆలోచించి చెప్పు. అప్పుడు కూడా నీ నిర్ణయం మనం పర్మినెంట్గా అబ్బాయి దగ్గరే ఉందాం అనుకుంటే అప్పుడు ఉత్తరం రాస్తాను” అంటూ మొక్కజొన్న పొత్తి తెచ్చి కుంపటి మీద కాల్చుకుంటూ “ఈ సుఖం గ్యాస్ స్టవ్తో ఎక్కడ వస్తుందే?” అన్నాడు.
భార్య పంతంతో మాణిక్యం గారు కొడుకుకి ఉత్తరం రాసి, “ఇక మా చివరి రోజులు మీతో గడుపుదాం అని మా కోరిక. అందుకు నువ్వు నీ భార్య ఆలోచించి చెప్తే మేము పది పదిహేను రోజులలో నీ దగ్గరికి సామానుతో సహా వచ్చేస్తాము’ అన్నాడు.
“ఏమండీ! అబ్బాయి నుంచి ఏమైనా జవాబు వచ్చిందా?” అని అడిగింది భర్తని కామేశ్వరి.
“ఎందుకే అంత కంగారు? నీ కోడలుతో ఆలోచించి రాస్తాడు అనుకుంటా. మంచి చెడు ఆలోచించుకోవాలిగా! మనం స్థిరంగా ఉంటామన్నాము కదా” అన్నాడు మాణిక్యం.
తరువాత రెండు రోజులలో కొడుకు నుంచి ఉత్తరం వచ్చింది. ‘మీరు రావడానికి మా పర్మిషన్ ఎందుకు నాన్నా? అనవసరం అయిన సామాను ఎవరికైనా ఇచ్చేసి మిగిలిన సామాను గుడివాడ నుంచి లారీకి ఎక్కించండి. మొదటి వారంలో వచ్చేసేయండి. మీ కోడలు కూడా చాలా ఆనంద పడుతోంది ఇక మీరు మాతోనే ఉంటారని’ అని రాశాడు.
“వాడి మనసు నాకు తెలుసండి! మనం ఇదివరకే ఈ ఊరి నుంచి వెళ్లిపోయి ఉండాలిసింది” అంది కామేశ్వరి సంతోషంగా.
ఇంటి యజమానికి “ఇల్లు ఖాళీ చేసి మా అబ్బాయి దగ్గరికి వెళ్లిపోతున్నాము” అని చెప్పి ఇంటి సామాను బాక్సుల్లో సద్ది ట్రాన్స్పోర్ట్ కంపెనీకి పంపటానికి మాట్లాడి వచ్చాడు.
“ఏమండీ! మన వీధి చివర ఉన్న అన్నపూర్ణ గారు, ‘ఎలాగో మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్లిపోతున్నారుగా, బెంగళూరులో ఇంచక్కా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకుంటారు కాబట్టి మీ గుర్తుగా నాకు మీ కుంపట్లు ఇవ్వండి’ అని అడిగింది. ‘సరే తీసుకోండి’ అన్నాను. ‘ఇనుము ఊరికే తీసుకోకూడదు’ అని పది రూపాయలు కూడా ఇచ్చింది” అంది కామేశ్వరి.
“ఇంకా మనం వెళ్ళడానికి రెండు రోజులు టైం ఉందిగా! అప్పుడే కుంపటి ఇచ్చేస్తే మనకి వంట ఎలా?” అన్నాడు.
“ఈ రెండు రోజులు మనకి కరణం గారి ఇంట్లో భోజనం. ఇల్లు కడిగేసి యజమానికి అప్పగించాలి. చివరి వరకు వంట చేసుకుంటూ ఉంటే ఎలాగండీ?” అంది భర్తతో.
ఇంటి ముందుకు లారీ వచ్చి ఆగింది సామాను తీసుకుని వెళ్లడానికి. ఇంతలో పోస్ట్ బంట్రోతు వచ్చి, “సార్! మీకు బెంగళూరు నుంచి మీ అబ్బాయి గారి ఫోన్ వచ్చింది. మీరు త్వరగా రండి పోస్ట్ ఆఫీస్కి. మళ్ళీ మీ అబ్బాయి అయిదు నిమిషాలలో ఫోన్ చేస్తాను అన్నారు” అన్నాడు.
ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడో అనుకుంటూ పోస్ట్ మ్యాన్ సైకిల్ మీద వెనుక కూర్చుని పోస్ట్ ఆఫీసుకి వెళ్ళాడు మాణిక్యం.
“నాన్నా! సామాన్లు ట్రాన్స్పోర్ట్లో బుక్ చేశారా?” అన్నాడు కంగారుగా శంకరం.
“ఇప్పుడే లారీ వచ్చింది రా. పాపం మీ అమ్మే ఎక్కువ శ్రమ పడుతోంది. రేపు ఈ పాటికి నీ దగ్గర ఉంటాములే” అంటున్న తండ్రితో, “ఆగండి నాన్న! నేను చెప్పేది వినండి. నాకు మా కంపెనీ వాళ్ళు అమెరికా వెళ్ళమని చెప్పారు. పదిరోజులలో ప్రయాణం. నేను వెళ్తే మీ కోడలు, ‘నేను బెంగళూరులో ఎందుకు, నేను మా పుట్టింటికి వెళ్తాను’ అంటోంది. అందుకే మీరు ఇప్పుడే రావద్దు. నేను అమెరికా నుంచి వచ్చిన తరువాత వద్దురు గాని” అన్నాడు.
“బాగానే ఉంది రా వరస! ఇంటి యజమానికి ఇల్లు ఖాళీ చేస్తున్నాము అని చెప్పాము. పాత గిన్నెలు పనివాళ్లకు ఇచ్చేశాము. సరే, నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు?” అన్నాడు నీరసంగా.
“ఒక ఏడాది ఉండాలి నాన్న. ఆ తరువాత ఉందామన్నా ఉండనివ్వరు. ఏడాది ఇట్టే గడిచిపోతుంది. ఎలాగో మీ కోడలు మీదగ్గరికే వస్తుంది కాబట్టి మీరు మా మామగారి ఇంటికి వెళ్లి వస్తూ ఉండండి. చివరి నిమిషంలో మిమ్మల్ని నిరాశ పరచినందుకు క్షమించండి నాన్నా” అన్నాడు.
నీరసంగా ఇంటికి చేరి, లారీ అతనికి అయిదు వందలు ఇచ్చి, “ఇప్పుడు సామాను పంపటం లేదు. నువ్వు వెళ్ళిపో బాబు” అన్నాడు.
“అదేమిటండీ! లారీ అతను సామాను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్నాడు” అంది కంగారుగా కామేశ్వరి.
“ఏమీ లేదు. ముందు నువ్వు లోపలికి పద. మన ప్రయాణం వాయిదా పడింది. అబ్బాయి ఆఫీస్ పనిమీద అమెరికా వెళ్తున్నాడుట. అందుకే ఇప్పుడే రాకండి అన్నాడు. కోడలు, పిల్లలు కూడా మన ఊరికే వస్తున్నారు” అన్నాడు.
“ఏమిటో ఊతం లేని మనిషి! అమెరికా ప్రయాణం ఉన్నవాడు మనని ఎందుకు రమ్మన్నాడు” అంది.
“వాడికి ఈ రోజే తెలిసింది అనుకుంటా” అంటూ గోనె సంచీలు విప్పడం మొదలుపెట్టాడు మాణిక్యం గారు.
“అది సరేనండి! మనం వెళ్లిపోతున్నాము కదా అని కుంపట్లు అన్నపూర్ణ గారికి ఇచ్చేశాము. ఆవిడ చక్కగా వాడేసుకుంటోంది. ఆలా వెళ్లి సంగతి చెప్పి ఒక్క కుంపటి అడిగి తీసుకుని వస్తాను. ఇంతకీ నాకు సుఖపడే రాత లేదు” అంటున్న భార్యతో, “ఉండవే! ఇచ్చిన వస్తువు ఎలా తిరిగి తీసుకుంటావు? ఆవిడ ఆ కుంపటి మీద ఏ నీచు వండిందో ఏమో! ఈ రోజు కూడా ఎలాగో కరణం గారింట్లోనేగా భోజనం! రేపటికి కొత్త గ్యాస్ స్టవ్, సిలిండర్ వస్తుంది. మళ్ళీ ఆ కుంపటి జోలికి వెళ్ళక్కరలేదు” అన్నాడు.
“నిజంగానా! మీరు కొత్త స్టవ్ కొన్నారా? పోనీలెండి! ఈ విధంగా అయినా నా కోరిక తీరింది. రెండు మూడు రోజులు నేను వంట అయిన తరువాత స్టవ్ కట్టేసానా లేదో మాత్రం మీరు చూడాలి, తప్పదు” అంది కామేశ్వరి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


